• facebook
  • whatsapp
  • telegram

ఛందస్సు

 వేదాంగాల్లో ఛందస్సు ఒకటి. పద్య కవిత్వానికి ప్రాణం ఛందస్సు. పద్య లక్షణాలను ఇది తెలియజేస్తుంది. నాలుగు పాదాల పద్యం గణాల మీద ఆధారపడి ఉంటుంది. అక్షరాల లఘు, గురువులతో గణాలు ఏర్పడతాయి. గురువును ' U ' తోనూ, లఘువును ' l ' తోనూ సూచిస్తారు.
 

గురు, లఘువులు
* దీర్ఘం ఉన్నవి.
* సంయుక్త, ద్విత్వాక్షరాలకు ముందున్నవి.
* సున్నా, విసర్గ లతో కూడినవి.
* పొల్లు హల్లులతో ఉన్నవి (లన్) గురువులు.
* మిగిలిన వాటిని లఘువులు అంటారు.
               గురు, లఘువులతో గణాలు ఏర్పడతాయి.
* రామ - U l - 'గల'.
* రమా - l U - లగ (వ).
* రామా - U U - గగ - అనేవి రెండక్షరాల గణాలు. మూడక్షరాల గణాలే పద్యాలకు ముఖ్యం. అవి ...
* భగణం - U l l - రాముడు
* జగణం - l U l - విశాల
* సగణం - l l U - సుమతీ
* యగణం - l U U - రమేశా
* రగణం - U l U - వీక్షణా
* తగణం - U U l - శ్రీరామ
* మగణం - U U U  - శ్రీరామా
* నగణం - l l l - కమల
* నల ( l l l l ), నగ ( l l l U ) లాంటి నాలుగక్షరాల గణాలు కూడా ఉన్నాయి.

యతి, ప్రాస
పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని 'యతి' అంటారు.
* యతికి విరతి, వళి, విరామం, విశ్రామ అనే పేర్లున్నాయి.
* మొదటి అక్షరానికి సరిపడే - నియమిత స్థానంలో ఉన్న అక్షరాన్ని 'యతిస్థానం' అంటారు.
* పద్యపాదంలో రెండో అక్షరాన్ని 'ప్రాస' అని అంటారు.
* నాలుగు పాదాల్లోను రెండో అక్షరంలోని హల్లు సమానంగా ఉంటే ప్రాసనియమం ఉందని అంటారు.
* వృత్త పద్యాలకు ప్రాస నియమం ఉంటుంది.
* యతిస్థానంలో ఉన్న అక్షరం తర్వాతి అక్షరానికి ప్రాస అక్షరంతో కలిపి వేయడాన్ని 'ప్రాసయతి' అంటారు.

  
* సూర్య గణాలు - గల (U l) న (l l l)
* ఇంద్రగణాలు - నల ( l l l l ), నగ ( l l l U ), సల ( l l U l ), భ ( U l l ), ర (U l U), త (U U l).

 

వాక్యం
అర్థవంతమైన పదాల సముదాయమే వాక్యం.
*  ప్రౌఢ వ్యాకరణం రాసిన బహుజనపల్లి సీతారామాచార్యులు 'యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి ఉన్న పద సముదాయం వాక్యం' అన్నారు.
* చిన్నయసూరి బాలవ్యాకరణంలో లేని 'వాక్యపరిచ్చేదం' ప్రౌఢవ్యాకరణంలో ఉంది.
* 'తెలుగు వాక్యం' అనే పుస్తకాన్ని రాసిన చేకూరి రామారావు తెలుగు వాక్య నిర్మాణ విశేషాలను బాగా వివరించారు.
* సామాన్యంగా సంపూర్ణ వాక్యం, అసంపూర్ణ వాక్యం అని వాక్యం రెండు రకాలు.
* సమాపక క్రియ (సంపూర్ణ భావం) ఉన్నది సంపూర్ణ వాక్యం.
ఉదా: రాముడు భోజనం చేశాడు.
* అసమాపకక్రియ ఉన్నది అసంపూర్ణ వాక్యం.
ఉదా: రాముడు భోజనం చేసి...
* వాక్యం సామాన్యంగా కర్త, కర్మ, క్రియ అనే వరుస క్రమంలో ఉంటుంది.
* ఒక్కొక్కసారి (ముఖ్యంగా కవిత్వంలో) ఈ వరుస పాటించరు.

 

వాక్యనిర్మాణం - భేదాలు
వాక్యంలో చాలా భేదాలున్నాయి. భావాన్ని బట్టి, నిర్మాణాన్ని బట్టి ఈ భేదాలు ఏర్పడ్డాయి.
 నిశ్చయార్థక వాక్యం: శ్రీరాముడు కోసల దేశపు రాజు.
 ప్రశ్నార్థక వాక్యం: నువ్వు పుస్తకం కొన్నావా?
 ఆశ్చర్యార్థక వాక్యం: ఆ శిల్పం ఎంత బాగుందో!
 సందేహార్థక వాక్యం: ఆమె ఎందుకు నవ్వుతోందో!
 విధ్యర్థక వాక్యం: మీరు మా ఇంటికి రావాలి.
 ప్రత్యక్షానుకృతి వాక్యం: 'నేను రాను' అని అతడన్నాడు.
 పరోక్షానుకృతి వాక్యం: తను రానని అతడన్నాడు.
 క్రియారహిత వాక్యం: ఆమె వైద్యురాలు.
 సామాన్య వాక్యం: నాకు ఆకలిగా ఉంది.
 సంశ్లిష్ట వాక్యం: అతడు అన్నం తిని బడికి వెళ్లాడు.
 సంయుక్త వాక్యం: అతడు ధనవంతుడు, కానీ డబ్బు ఖర్చు చేయడు.
 హేత్వర్థక వాక్యం: అతడికి జ్వరం వచ్చి పరీక్షలు రాయలేదు.
 కర్తరి వాక్యం: రాముడు రాక్షసులను సంహరించాడు.
 కర్మణి వాక్యం: రాక్షసులు రామునిచే సంహరింపబడిరి.
 శత్రర్థక వాక్యం: అతడు కాఫీ తాగుతూ చదువుతున్నాడు.
 చేదర్థకవాక్యం: కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతటదే వస్తుంది.
 నామ్నీకరణ వాక్యం: 'స్వానుభవం వల్ల ఈ జీవితసత్యం నేర్చుకున్నాను' - దీనికి నామ్నీకరణ వాక్యం ఇలా ఉంటుంది...'ఇది స్వానుభవం వల్ల నేర్చుకున్న జీవిత సత్యం'.

 

 అలంకారాలు
అలంకారాలు శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు అని రెండు రకాలు.
* శబ్దానికి ప్రాధాన్యం ఉన్న శ్రవణానంద కారకాలు శబ్దాలంకారాలు.
* అర్థానికి (భావానికి) ప్రాధాన్యం ఉన్నవి అర్థాలంకారాలు.

 

శబ్దాలంకారాలు
కొన్ని ముఖ్యమైన శబ్దాలంకారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వృత్త్యనుప్రాస: ఒకే హల్లు అనేక సార్లు రావడం, వచ్చిన హల్లు మళ్లీమళ్లీ రావడం.
ఉదా: అడుగులు తడబడ బుడుతడు నడిచెను.
అంత్యానుప్రాస: పాదాల చివరకానీ, పదాల చివరకానీ వచ్చిన అక్షరమే మళ్లీ మళ్లీ రావడం.
ఉదా: భాగవతమున భక్తి
        భారతమున యుక్తి
        రామకథయే రక్తి

 

లాటానుప్రాస: అర్థభేదం, శబ్దభేదం లేకుండా తాత్పర్య భేదంతో ఒకే పదం వెంట వెంటనే రావడం.
ఉదా: కమలాక్షునర్చించు కరములు కరములు.

 

అర్థాలంకారాలు
ఉపమాలంకారం:
 పోలిక ఉన్నది. ఉపమాన, ఉపమేయాలకు రమణీయమైన పోలికను వర్ణించడం.
ఉదా: ఆమె ముఖము చంద్రబింబమువలె మనోహరంగా ఉంది.

 

ఉత్ప్రేక్షాలంకారం: ఊహ ప్రధానమైంది. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం.
ఉదా: ఈ చీకటి చక్రవాకములయొక్క విరహాగ్ని ధూమంగా తలచుచున్నాను.

 

రూపకాలంకారం: ఉపమేయ, ఉపమానాలకు తద్రూప్యవర్ణన ఉన్నది. భేదమున్నా లేనట్లు వర్ణించడం.
ఉదా: సంసారసాగరమును ఈదుట మిక్కిలి కష్టం.

 

అతిశయోక్తి అలంకారం: సహజస్థితిని మించి అతిగా గొప్పగా చెప్పడం.
ఉదా: ఆ పురమునందలి మేడలు ఆకాశమును తాకుచున్నవి.

 

శ్లేషాలంకారం: అనేకార్థములను ఇచ్చే పదాలను ప్రయోగించడం.
ఉదా: ఆ రాజు కువలయానందకరుడు.

 

అర్థాంతరన్యాస అలంకారం: సామాన్యమైన విషయాన్ని విశేషంతో లేదా విశేషమైన విషయాన్ని సామాన్యంతో సమర్థించడం.
ఉదా: హనుమంతుడు సముద్రమును దాటెను.
         మహాత్ములకు సాధ్యముకానిది లేదు కదా!

 

ప్రకృతి - వికృతులు
సంస్కృతం, ప్రాకృతాల నుంచి కొద్ది మార్పులతో తెలుగులోకి వచ్చిన వాటిని తత్సమాలు అంటారు. ఇవి ప్రకృతులు.
* సంస్కృత, ప్రాకృతాల నుంచి మార్పులు చెంది ఏర్పడిన వాటిని తద్భవాలు అంటారు. స్థూలంగా వీటిని వికృతులు అని చెప్పవచ్చు.

Posted Date : 01-09-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సెకండరీ గ్రేడ్ టీచర్స్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు