• facebook
  • whatsapp
  • telegram

తెలుగు భాషా బోధన , ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్ప‌ష్టీక‌ర‌ణ‌లు

  భాషలన్నింటిలో మాతృభాషకు ప్రత్యేకస్థానం ఉంది.  మాతృభాష మానసిక  ఆనందాన్ని, భాషా మాధుర్యాన్ని అందిస్తుంది. 
 సృష్టిలోని సౌందర్యాన్ని ప్రధానంగా 2 రకాలుగా చెప్పవచ్చు
1) బాహ్యసౌందర్యం
2) అంతఃసౌందర్యం
* చెట్టు పచ్చగా కళకళలాడుతూ అందంగా క‌నిపిస్తే అది బాహ్యసౌందర్యం. ఆ చెట్టు మనిషికి ఉండటానికి నీడ,  తినడానికి పండ్లను ఇస్తూ  ఉపయోగకరంగా ఉంటే  అది అంతఃసౌందర్యం.
* భాషలోని శబ్దాలంకారాలను, లయను, ఉపరితల భావాన్ని బాహ్య సౌందర్యంగా; ఆలోచిస్తే అర్థ‌మ‌య్యే భావాలను అంతఃసౌందర్యంగా చెప్పవచ్చు.
* మాతృభాష మానసిక వికాసానికి బాగా తోడ్పడుతుంది.
* మాతృభాషా బోధన విద్యార్థుల సర్వాంగీణ వికాసానికి దోహదం చేస్తుంది.

 

తెలుగు (మాతృ) భాషాబోధన ఉద్దేశాలు
* భావవ్యక్తీకరణం, భావగ్రహణ శక్తులు అభివృద్ధి చెందుతాయి.
* ఆలోచనా శక్తులు పెంపొందుతాయి.

* భాష ద్వారా సమాజం సంస్కృతి, సంప్రదాయాలు పరిచయమవుతాయి.
* లోక‌జ్ఞానం తెలుస్తుంది.
* సృజనాత్మక శక్తులు, ఆనందానుభూతి, రసానుభూతి పెంపొందుతాయి.
* భాషాభిరుచి, కళాభిరుచులు అల‌వ‌డ‌తాయి.
* సముచిత మనో వైఖరులు రూపొందుతాయి. 
* సహృదయత్వంతో ఉంటారు.
* ప్రపంచ శాంతికి తోడ్ప‌డుతుంది. 
* జాతీయతా దృక్పథం పెంపొందుతుంది. 
* సంపూర్ణ మూర్తిమత్వ వికాసం జరుగుతుంది.

 

లక్ష్యాలు - స్పష్టీకరణలు
* ఒక పని పూర్తయిన తర్వాత ఆశిస్తున్న ఫలితాలనే విద్యాపరిభాషలో లక్ష్యాలు అంటారు. 
* ఈ లక్ష్యాలను బోధనకు అన్వయిస్తే బోధన లక్ష్యాలు, మాతృభాషకు అన్వయిస్తే మాతృభాషా బోధనా లక్ష్యాలు అవుతాయి.

* లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక, శారీర‌క‌ చర్యలను స్పష్టీకరణలు అంటారు.
* బోధనా లక్ష్యాలను సూక్ష్మాతి సూక్ష్మ ప్రవర్తనల రూపంలో వివరించేవి స్పష్టీకరణలు.
* బోధనా లక్ష్యాలను మొదటిసారిగా బెంజిమన్‌ బ్లూమ్‌ అనే అమెరికన్‌ విద్యావేత్త విశ్లేషించే, వర్గీకరించే ప్రయత్నం చేశారు.
* బెంజిమన్‌ బ్లూమ్‌ ప్రతిపాదించిన బోధనా లక్ష్యాల ఆధారంగా 1972-73లో బోధన లక్ష్యాలను రూపొందించారు.
* విద్యారంగంలో గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు అనే పదాలను పర్యాయపదాలుగా ఉపయోగిస్తున్నారు.

 

గమ్యాలు (Goals):

* ఆశయాల విశదీకరణలే గమ్యాలు. 
* ఇవి విద్యా ప్రణాళికల రూపకల్పనకు సహాయపడతాయి.
* సుదీర్ఘకాలంలో మొత్తం విద్యా ప్రణాళిక అధ్యయనం ద్వారా విద్యార్థుల ప్రవర్తనలో క‌నిపించాల్సిన మార్పులే  గమ్యాలు.

* జి.కె.సూద్‌ ప్రకారం గమ్యాలు దీర్ఘకాలికమైనవి.
* ఒకరకంగా అంతిమ ప్రయోజనం కోసం ఉద్దేశించినవి.

 

ఉద్దేశాలు (Aims)
* ఇవి విషయ ప్రణాళికల రూపకల్పనకు, పాఠ్యాంశాల ఎంపికకు దోహదపడి, ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులు చూపాల్సిన స్థూలమైన ప్రవర్తనా మార్పులను తెలుపుతాయి.
* ఇవి సంవత్సరాంతానికి విషయ ప్రణాళికల ద్వారా సాధించాల్సిన ప్రవర్తనా మార్పుల మొత్తాలు.
* ఉద్దేశాలు నియమితమైనవి. ఇవి విద్యకు మార్గదర్శకాలు.

 

 ఉద్దేశాలు రెండు రకాలు 
 
   1) సామాన్య ఉద్దేశాలు 
     2) ప్రత్యేక ఉద్దేశాలు
సామాన్య ఉద్దేశాలు: బోధన విషయాలకు సంబంధించిన స్థూల ప్రయోజనాలు. ఇవి విషయ ప్రణాళికలోని అన్ని విషయాలకు వర్తిస్తాయి.
ప్రత్యేక ఉద్దేశాలు: ఒక్కో బోధనాంశం ద్వారా సాధించాల్సిన పరిమిత ప్రయోజనాలు. ఇవి కేవలం ఒకే విషయానికి పరిమితం.

 

లక్ష్యాలు (Objectives) 
* గమ్యాల నుంచి ఉద్దేశాలు, ఉద్దేశాల నుంచి లక్ష్యాలు ఆవిర్భవిస్తాయి.
* ఇవి విషయ ప్రణాళిక భాగాలైన ఆయా విషయాల్లోని పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులకు అందించాల్సిన ప్రయోజనాలను సూచిస్తాయి.
* లక్ష్యాలు ఉద్దేశాల కంటే నిర్దిష్టమైనవి.
* ఉద్దేశాలు విద్యకు మార్గదర్శకాలు. కానీ చేరుకోగల అంతిమ దృక్పథం లక్ష్యమే!

 

లక్ష్యాలు రెండు రకాలు
     1) సంవృత లక్ష్యం
     2) వివృత లక్ష్యం

 

సంవృత లక్ష్యం
¤ ఇవి ఏ విధంగానూ వ్యాఖ్యానానికి గురికానివి.
* ఇవి ఒకే వ్యాఖ్యకు చెందిన‌వి.
* విద్యార్థులు ‘రామాలయం’ అనే పదంలోని సంధిని సవర్ణదీర్ఘ సంధి అని గుర్తించడం సంవృత లక్ష్యం.

 

వివృత లక్ష్యం
* ఇవి వ్యాఖ్యానానికి లోబడి ఉంటాయి.
* వివృత లక్ష్యం పలు వ్యాఖ్యలకు చెందింది.
* విద్యార్థులు సవర్ణదీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం వివృత లక్ష్యం.

లక్ష్యాలు - లక్షణాలు
* విద్యా విషయకంగా ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటాయి.
* విద్యార్థులు సాధించగలిగేవిగా ఉంటాయి.
* పరిశీలించదగినవిగా, కొలవదగినవిగా ఉంటాయి.
* నిర్ణయించిన కాలపరిమితిలో సాధించడానికి వీలుగా ఉంటాయి.
* ఇవి విద్యార్థి ప్రవర్తన ద్వారా వివరించగలిగేవి. 
* మూల్యాంకనం చేయడానికి వీలుగా ఉంటాయి.
* లక్ష్యాలకు స్పష్టీకరణలు ఉంటాయి.

 

స్పష్టీకరణలు (specifications)
* బోధనా లక్ష్యాల సూక్ష్మరూపాలు స్పష్టీకరణలు. 
* విద్యార్థుల్లో వెంటనే ఆశించే ప్రవర్తనా మార్పులనే స్పష్టీకరణలు అంటారు. 
* ఒక పాఠ్యాంశాన్ని పిల్లలకు బోధిస్తే దాని ద్వారా వారి నుంచి మనం నిర్దిష్టంగా ఏం కోరుకుంటామో వాటినే స్పష్టీకరణలు అంటారు.
* స్పష్టీకరణలనే సామర్థ్యాలు అని కూడా పిలుస్తారు.

 

లక్ష్యాల వర్గీకరణ
* బ్లూమ్స్‌ బోధనాభ్యసన లక్ష్యాలు మూడు రంగాల్లో వ్యక్తమవుతాయని ప్రతిపాదించాడు.
* ఒక్కో రంగంలో ఉండే అనేక అంశాలే లక్ష్యాలు - స్పష్టీకరణలు.


 
 

జ్ఞానాత్మక రంగం
* బోధనాభ్యసన ప్రక్రియలో జ్ఞానరంగానికి విశిష్ట స్థానం ఉంది.
* ఇది ఆలోచించడం, తెలుసుకోవడం, సమస్యలను పరిష్కరించుకోవడం లాంటి ప్రక్రియలకు సంబంధించింది.
* జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనేవి బ్లూమ్స్‌ ప్రతిపాదించిన జ్ఞానరంగంలోని అంశాలు.
 భాషాపరంగా జ్ఞానం మూడు రకాలు 
 
    1) విషయ జ్ఞానం
      2) భాషా జ్ఞానం
      3) సాహిత్య జ్ఞానం
విషయజ్ఞానం: విషయ జ్ఞానంలో పాఠ్యాంశ విషయం, పాఠ్యాంశ పూర్వకథ, పాఠ్యాంశ పరకథ, పాఠ్యాంశ సందర్భం, పాఠ్య రచయిత, పాఠ్య నేపథ్యం మొదలైన అంశాలుంటాయి.
భాషాజ్ఞానం: ఇందులో పదాలు, సంధులు, సమాసాలు, వ్యుత్పత్త్యర్థాలు, నానార్థాలు, పర్యాయపదాలు, ప్రకృతి - వికృతులు, జాతీయాలు, లింగ వచన, కాలసంబంధ వాచకాలు మొదలైన భాషాసంబంధ అంశాలు ఉంటాయి.

 

సాహిత్యజ్ఞానం:
* ఇందులో ఛందస్సు, రసం, అలంకారం, రీతి, శైలి, పాఠ్య స్వరూపం (గద్యం, పద్యం, నాటకం), ప్రక్రియ మొదలైన అంశాలు భాగాలు.
* విషయజ్ఞానం, భాషాజ్ఞానం, సాహిత్య జ్ఞానం ఈ అంశాలన్నీ కలిస్తే జ్ఞానం.

 

జ్ఞానం - స్పష్టీకరణలు:
     1) గుర్తించడం
     2) జ్ఞప్తికి తెచ్చుకోవడం

 

అవగాహన
* దీన్నే అవబోధం అని కూడా అంటారు
* జ్ఞప్తికి తెచ్చుకున్న, గుర్తించిన అంశాలను అర్థం చేసుకోవడాన్ని అవగాహన అంటారు. 

 

విద్యార్థులు అవగాహన చేసుకున్నారు అని చెప్పడాన్ని కింది స్పష్టీకరణలు విశదం చేస్తాయి
అవగాహన - స్పష్టీకరణలు

* పోలికలు, భేదాలు చెప్పడం
* గంభీర భావాలను వివేచించడం

* నేర్చుకున్న విషయానికి సొంతంగా ఉదాహరణలు ఇవ్వడం, వాటిని సంచిత క్రమంలో వర్గీకరించడం
* పదప్రయోగం చేయడం
* సారాంశం/తాత్పర్యం చెప్పడం
* సందర్భం చెప్పడం - సందర్భసహిత వ్యాఖ్య చేయగలగడం
* జరగబోయే కథను ముందే ఊహించడం
* వివరించడం, విశ్లేషించడం, సంక్షేపించడం, వివేచించడం
* అంశాల మధ్య సంబంధాలను స్థాపించడం
* కార్యకారణ సంబంధాన్ని గ్రహించడం

 

ఆనందానుభూతి లేదా రసానుభూతి
* చదువుతున్నప్పుడు, చెబుతున్నప్పుడు, వింటున్నప్పుడు, పాడుతున్నప్పుడు ఉదాత్తమైన పద్యాలు, గేయాలు, వచన కవితలు లాంటి ప్రక్రియల్లోని లయను ఆనందించడం.
* అర్థ భేదాలను గ్రహించడం.

* విషయంలోని విశేష భావాలు, రచనలోని సొగసులు, ఆనందం కలిగించే సన్నివేశాలు, మనసులో భావించుకుని ఆనందించడం.
* పాఠ్యాంశాల్లోని రసవంతమైన ఘట్టాలను తెలుసుకోవడం.
* రచయిత ప్రతిభను, వస్తువు గొప్పతనాన్ని, శిల్ప ప్రాధాన్యాన్ని హృదయపూర్వకంగా ప్రశంసించడం.
* శైలి భేదాలను గ్రహించడం.
* తన్మయత్వం పొందడం.

 

నైపుణ్యాలు
i) పఠన నైపుణ్యం:

* స్పష్టంగా వివిధ ధ్వనులను చదవడం
* నిర్దుష్టంగా చదవడం
* విషయదోషాలు దొర్లకుండా చదవడం
* సముచిత వేగంతో ధారాళంగా చదవడం
* భావానుగుణమైన వాచికాభినయంతో విరామచిహ్నాలు, స్వరభేదం పాటిస్తూ చదవడం
* ప్రక్రియానుగుణంగా చదవడం

* అర్థవంతంగా చదవడం
* అవసరమున్న చోట పదవిభాగం చేస్తూ చదవడం
* తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని గ్రహించడానికి మౌనంగా చదవడం

 

ii) లిఖితరూప వ్యక్తీకరణ (నెపుణ్యం)
* స్పష్టంగా, దోషరహితంగా రాయడం
* విరామ చిహ్నాలను పాటిస్తూ రాయడం
* సందర్భోచితంగా రాయడం
* వివిధ శైలుల్లో, వేగంగా, అందంగా రాయడం
* ర‌చ‌న‌ను పేరాలుగా విభ‌జించి రాయడం

 

iii) వాగ్రూప వ్యక్తీకరణ (నైపుణ్యం)
* స్పష్టంగా, నిర్దుష్టంగా మాట్లాడటం
* ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడటం
* విషయ దోషాలు దొర్లకుండా మాట్లాడటం

* సముచిత వేగంతో ధారా‌ళంగా మాట్లాడటం
* భావానుగుణంగా, సభాకంపం లేకుండా,  అర్థవంతంగా మాట్లాడటం
సృజనాత్మక శక్తి: ఈ లక్ష్యం స్వతంత్ర రచనా శక్తికి సంబంధించింది.

 

స్పష్టీకరణలు:
* నేర్చుకున్న పాఠానికి కొత్త శీర్షికను నిర్ణయించడం
* అసంపూర్ణ రచనలు పూరించడం
* కథలు, కవితలు, నాటకాలు, నాటికలు, నవలలు లాంటి వివిధ ప్రక్రియల్ని సొంతంగా రచించడం
* తెలిసిన పాఠ్యాంశాన్ని వీలైనన్ని ఇతర ప్రక్రియల్లోకి మార్చి రాయగలగడం
* నేర్చుకున్న కథలు, సామెతల ఆధారంగా  కొత్త కథలు రాయడం
* రచనలో నుడికారపు సొంపును ప్రదర్శించడం
* వ్యవహారంలోని సహజమైన పలుకుబడులు, సామెతలు, అలంకారాలు, దృష్టాంతాలు లాంటి వాటిని గ్రహించి, భావానుగుణమైన భాషను ప్రయోగించి స్వీయరచనాశైలి ఏర్పరచుకోవడం.

భాషాభిరుచి: ఈ లక్ష్యం భాషాధ్యయనంలో విద్యార్థులకు గల అభిరుచులను పెంపొందిస్తుంది.
 

స్పష్టీకరణలు:
* పాఠ్యాంశానికి సంబంధించిన మూలగ్రంథాలను చదవడం.
* బహుగ్రంథ పఠనం చేయడం.
* కవులు, రచయితలు, పండితులతో సమావేశం కావడం.
* సారస్వత సమావేశాలు నిర్వహించడం, పాల్గొనడం.
* పద్యాలు, గేయాలు, ఉత్తమ గద్య భాగాలను ధారణ చేయడం.
* నిర్మాణాత్మక, విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుకోవడం.

 

సముచిత మనోవైఖరులు:
       విద్యాబోధన లక్ష్యం విద్యార్థుల్లో ధనాత్మకమైన ప్రవర్తనా మార్పులను ఆశిస్తుంది. వారి అభిప్రాయాలు, దృక్పథాల్లో సకారాత్మకతను పెంపొందించే దశలో సముచిత మనోవైఖరులు అనే లక్ష్యం తోడ్పడుతుంది.
* ఆర్ద్ర‌త‌ గుణంతో కూడిన ఆలోచనలు పెంపొందించుకోవడం.
* నేర్చుకున్న విషయానికి అనుగుణమైన సత్ప్రవర్తనను అల‌వ‌ర‌చుకోవ‌డం.
* కవులు, రచయితలు, కళాకారులను గౌరవించడం.

* మాతృ భాషా సాహిత్యాలతోపాటు ఇతర భాషా సాహిత్యాలను కూడా ఆదరించడం.
* విమర్శను సహృదయతతో స్వీకరించడం.
* మూఢాచారాలు పాటించకుండా హేతుబద్దంగా జీవించడం.
* సహకార దృక్పథం, సామాజిక చైతన్యంతో కూడిన మానవతా వైఖరితో నడుచుకోవడం.

 

సంస్కృతి సంప్రదాయాలు:
     ఆయా భాషా వ్యవహర్తల సంస్కృతి, సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకొని పాఠ్యాంశాలను బోధించాల్సి ఉంటుంది. పాఠ్యాంశాల్లోని సంస్కృతి సంప్రదాయ భావనల్లో కాలానుగుణ మార్పులను దృష్టిలో ఉంచుకోవాలి.

 

స్పష్టీకరణలు:
* వివిధ రచనల్లోని ఆచార వ్యవహారాలను తెలుసుకోవడం.
* రచనల్లోని కాల భేద ప్రభావాలను అవగతం చేసుకోవడం.
* పురాణాలు, ఇతిహాసాల్లోని విశేషాలను గ్రహించడం.
* భారతీయ, తెలుగు సంస్కృతిని వివరించడం.
* రచనల్లోని నీతిని గ్రహించడం.

 

భాషాంతరీకరణ సామర్థ్యం: ఈ సామర్థ్యాన్ని అనువాద సామర్థ్యం లేదా అనువదించే శక్తి అని  అంటారు.  దీన్ని  పాఠశాలల్లో రెండు భాషలు ప్రారంభమైన నాటి నుంచి ఉపాధ్యాయులు పాటించాలి. 
 

స్పష్టీకరణలు:
¤ ఉభయ భాషల్లోని వాక్యనిర్మాణ పద్ధతులను గ్రహించడం.
¤ ఉభయ భాషల్లోని లోకోక్తులు, జాతీయాలు, పారిభాషిక పదాలను అవసరానుగుణంగా ఎంపికచేయడం.
¤ ఉభయ భాషా రచయితల ఆత్మీయతను అనుసరించడం.
¤ ఆయా భాషల సంస్కృతిని దృష్టిలో ఉంచుకోవడం.


 

Posted Date : 02-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెకండరీ గ్రేడ్ టీచర్స్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌