• facebook
  • whatsapp
  • telegram

సాంఘికశాస్త్రం, స్వభావం - పరిధి

సమాజంలో మారుతున్న సామాజిక పరిసరాలకు అనుగుణంగా ఎలా మసలుకోవాలో బాలబాలికలకు తెలియజేయడం, విద్యార్థులు తమ భవిష్యత్తు జీవనాన్ని ఉపయోగకరంగా సాగించడానికి అవసరమైన విలువలు, వైఖరులు, అభిరుచులు, నైపుణ్యాలు, మానవ సంబంధాలను పెంపొందించడమే సాంఘికశాస్త్ర ముఖ్య ఉద్దేశం.
సమాజం గురించి, అందులో ఉన్న వ్యక్తుల గురించి, ఆ వ్యక్తులు చేసే కార్యకలాపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సాంఘికశాస్త్రం లేదా సాంఘిక అధ్యయనం అని అంటారు. పాఠశాల స్థాయిలో సాంఘికశాస్త్రం అంటే భూగోళశాస్త్రం, చరిత్ర, పౌరనీతి, అర్థశాస్త్రాల గురించి సమైక్యంగా / కలిపి బోధించడమే.

 

విద్యా ప్రణాళికలో ప్రవేశం
* 1916వ సంవత్సరంలో సాంఘికశాస్త్ర విద్యాప్రణాళిక మొట్టమొదటిసారిగా అమెరికాలో అమల్లోకి వచ్చింది.
* అమెరికాలో వ్యవహారిక సత్తావాదం ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఆ దేశం పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్రాన్ని సమైక్య పద్ధతిలో ప్రవేశపెట్టింది.
* మానవుడు జీవించడానికి అవసరమైన అనుభవాలను సాంఘికశాస్త్రం అందిస్తుంది.
* విద్యార్థుల్లో సరైన మానవ సంబంధాలను పెంపొందించడమే సాంఘిక శాస్త్ర ముఖ్య ఉద్దేశం. అందువల్ల దీన్ని 'మానవ అధ్యయన శాస్త్రం' అని కూడా పిలుస్తారు.
1916లో సాంఘికశాస్త్రాన్ని పాఠశాల స్థాయిలో ప్రవేశపెట్టడానికి ఉన్న ప్రధాన కారణం 1914లో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం. ఈ మారణహోమం భవిష్యత్తు తరాల్లో పునరావృతం కాకూడదని, ప్రపంచ దేశాల్లో ఉన్న బాలబాలికల్లో పాఠశాలస్థాయి నుంచే అంతర్జాతీయ అవగాహన, విశ్వమానవ సౌభ్రాతృత్వం, మానవ సంబంధాలను పెంపొందించాలనే ఉద్దేశంతో వివిధ సామాజికశాస్త్ర విభాగాల నుంచి ఎంపిక చేసిన పాఠ్య విషయాలతో 'సాంఘికశాస్త్రం' అనే సరికొత్త పాఠ్యాంశాన్ని రూపొందించారు. 1916లో అమెరికాలోని పాఠశాలల్లో సమైక్య పద్ధతిలో సాంఘికశాస్త్ర బోధన ప్రారంభించారు.

 

సాంఘిక శాస్త్రం - భారతదేశ విద్యా ప్రణాళిక
1937లో గాంధీజీ వార్ధాలో ప్రతిపాదించిన బేసిక్ విద్యావిధానంలో 'సాంఘిక' అనే పదాన్ని ఉపయోగించారు. 1937లోనే సాంఘిక శాస్త్రం గురించి ప్రస్తావన వచ్చినప్పటికీ, భారతదేశ విద్యా ప్రణాళికలో 1952 విద్యాసంవత్సరం నుంచి మాత్రమే దీన్ని అమలు చేశారు.
1952-53లో ఏర్పాటు చేసిన డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ కమిషన్ / సెకండరీ విద్యా కమిషన్ సిఫార్సును అనుసరించి 1952లో భారతదేశ విద్యా ప్రణాళికలో సాంఘికశాస్త్రాన్ని ప్రవేశపెట్టారు.
* 'భారతీయ విద్యలో సాంఘిక అధ్యయనం తులనాత్మకమైన ఒక నూతన పదం' అని మొదలియార్ పేర్కొన్నాడు.

 

మనదేశంలో సాంఘిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టడానికి కారణాలు:
* పరిసరాలతో పరిచయాన్ని పెంచడం.
* సమాజం, సమస్యల గురించి తెలుసుకుని సమాజ అభ్యున్నతికి కృషి చేయడం కోసం.
* శాస్త్ర-సాంకేతిక రంగాల వల్ల కలిగే దుష్ఫలితాలను నివారించి సరైన మానవ సంబంధాలు నెలకొల్పడం.
ఉదా: 1) వ్యవసాయంలో క్రిమిసంహారక మందులు విరివిగా వాడటంతో జీవవైవిధ్యం దెబ్బతినడం.
2) ప్లాస్టిక్ విరివిగా వాడటం వల్ల పర్యావరణానికి విఘాతం కలగడం.
3) లౌడ్ స్పీకర్, సెల్‌ఫోన్‌లు అతిగా వినియోగించడం వల్ల తోటివారికి కలిగే అసౌకర్యం. (ధ్వని కాలుష్యం) మొదలైనవి.

 

 
 

సామాజికశాస్త్రాలు 
    సామాజిక శాస్త్రాలు మానవ సమాజం పుట్టుపూర్వోత్తరాలు, నిర్మాణం, అభివృద్ధికి సంబంధించిన విషయాలను, అధ్యయనం చేస్తాయి.
* మానవుడి పుట్టుక నుంచి కుటుంబ సభ్యులు, ఇతరులతో ఏ విధంగా సహజీవనం సాగించాడనే అంశాన్ని సామాజికశాస్త్రాలు తెలియజేస్తాయి. సామాజికశాస్త్రాల ప్రధాన ఉద్దేశం - నూతన జ్ఞాన అన్వేషణ.
సామాజిక శాస్త్రాలు సమాజం, సమాజంలో ఉన్న వ్యక్తులు, వ్యక్తులు చేసే కార్యకలాపాల గురించి, వ్యక్తుల మధ్య, వ్యక్తికి సమాజానికి మధ్య ఉన్న పరస్పర సంబంధాలను అధ్యయనం చేస్తాయి.

 

సామాజికశాస్త్రం - సాంఘికశాస్త్రం
* మానవుడి సామాజిక, సాంస్కృతిక విషయాలను చర్చించేదే సామాజికశాస్త్రం / సామాజిక అధ్యయనం.
* సహజీవనం, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే విజ్ఞానం, నైపుణ్యం కలిగించేది సాంఘిక అధ్యయనం. - ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా
సామాజిక శాస్త్రాలు, సాంఘిక శాస్త్రం రెండూ సమాజం గురించి అధ్యయనం చేస్తాయి. అయితే ఈ రెండు వేర్వేరు విషయాలు / అంశాలు. వీటి మధ్య స్పష్టమైన తేడాలు ఉన్నాయి.
గమనిక: సాంఘికశాస్త్రం అనేది సామాజికశాస్త్రం కాదు. అయితే సామాజిక శాస్త్రాల్లోని వివిధ అంశాల సమన్వయంతో ఇది ఏర్పడింది. ఏవిధంగా అయితే నీరు, పంచదార, టీ పొడి కలిపి తేనీరుగా తయారవుతుందో అదేవిధంగా వివిధ అంశాల సమన్వయంతో సాంఘికశాస్త్రం కూడా ఒక నూతన శాస్త్రంగా రూపొందింది.
* వివిధ సామాజిక శాస్త్రాలు అంటే... భూగోళశాస్త్రం, చరిత్ర, రాజనీతి / ప్రభుత్వ పాలనాశాస్త్రం, అర్థశాస్త్రం, సమాజశాస్త్రం, శరీరధర్మశాస్త్రం, మనోవైజ్ఞానికశాస్త్రం, తత్త్వశాస్త్రం, జనాభాశాస్త్రం.

సాంఘికశాస్త్రం - నిర్వచనాలు

 * బోధించడం కోసం ఎంపిక చేసిన వివిధ సామాజిక శాస్త్రాలే సాంఘికశాస్త్రం.  - వెస్లీ
* చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం సాంఘిక అధ్యయనం. - జేమ్స్ హేమ్మింగ్స్
* ఒక నిర్ణీత స్థలంలో, నిర్ణీత కాలంలో మానవుడి జీవితమే సాంఘిక అధ్యయనం. - విక్టోరియా విద్యాబోర్డు
* మానవుడి గురించి, ఆ మానవుడికి గల భౌతిక, సాంఘిక పరిసరాలతో ఏర్పడిన అంతఃచర్యల గురించి అధ్యయనం చేసేదే సాంఘికశాస్త్రం.   -జాన్‌లీమైఖీలిన్    
 * విద్యార్థులను బాధ్యతగల పౌరులుగా తయారు చేయడానికి, వారు నివసించే ప్రపంచం, దాని ఆవిర్భావం గురించి అవగాహన కలగజేయడమే సాంఘిక అధ్యయన ప్రధాన ఉద్దేశం.  - జె.ఎం. ఫారెస్టర్
భూగోళం, చరిత్ర, పౌరనీతి, అర్థశాస్త్రాలను కలిపి బోధించడమే సాంఘికశాస్త్రం. - సెకండరీ విద్యా కమిషన్
* సాంఘిక అధ్యయనం అంటే 1) ఒక అధ్యయన క్షేత్రం, 2) విద్యా ప్రణాళికలో ఒక భాగం, 3) సబ్జెక్టుల సమాఖ్యయే.  - వెస్లీ & ఆడమ్స్
* నాది, మనది, మనందరిది అనే భావనను పెంపొందించేది సాంఘిక విజ్ఞానం. - కొఠారీ కమిషన్
* విద్యార్థులకు కీలక అంశాలైన 1) భారత దేశ స్వాతంత్రోద్యమ చరిత్ర 2) భారతీయ సంస్కృతి, విలువలు 3) రాజ్యాంగంలోని హక్కులు 4) జాతీయతా భావం 5) పరిసరాల పరిరక్షణ 6) ప్రజాస్వామ్యం, సామ్యవాదం, సమానత్వం 7) సాంఘిక పరిధుల తొలగింపు 8) చిన్న కుటుంబ భావన 9) స్త్రీ-పురుషుల సమానత్వం
10) శాస్త్రీయ దృక్పథం మొదలైన అంశాలను విద్యార్థుల్లో పెంపొందించడానికి సహాయపడేదే సాంఘిక శాస్త్రం. - 1986 జాతీయ విద్యావిధానం.

Posted Date : 29-08-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సెకండరీ గ్రేడ్ టీచర్స్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు