• facebook
  • whatsapp
  • telegram

 భూమధ్యరేఖ మండలం

* అత్యధిక సాంవత్సరిక వర్షపాతం సంభవించే భూమధ్యరేఖా మండలాన్ని ఉష్ణమండల వర్షప్రాంతాలు అని కూడా అంటారు.
* ఈ ప్రకృతిసిద్ధ మండలాల్లో ఉన్న ప్రపంచంలో కెల్లా దట్టమైన అరణ్యాల్లో వివిధ తెగలకు చెందిన ఆదిమవాసులు నివసిస్తున్నారు.

 

ఉనికి
* ఈ ప్రకృతిసిద్ధ మండలాలు భూమధ్యరేఖకు ఇరువైపులా స్థానిక హెచ్చుతగ్గులతో సుమారు 10º ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉండటం వల్ల ఈ మండలాన్ని భూమధ్యరేఖా మండలం అంటారు.

 

దక్షిణ అమెరికా అమెజాన్ నదీ పరివాహకం
* బ్రెజిల్‌లోని అధిక భాగం, బొలీవియా, పెరూ, ఈక్వెడార్ ఈ ప్రాంతంలోకి వస్తాయి.

 

శీతోష్ణస్థితి
* భూమధ్యరేఖా ప్రాంతంలో భూగోళం చుట్టూ ఒక అల్పపీడన మేఖల ఏర్పడింది. ఈ ప్రాంతాన్ని 'డోల్‌డ్రమ్‌లు' లేదా 'భూమధ్యరేఖ ప్రశాంత మండలం' అని పిలుస్తారు.

* ఈ ప్రకృతిసిద్ధ మండలాల్లో రాత్రి, పగలు చాలావరకు ఒకే కాలపరిమితితో ఉంటాయి.
* సూర్యరశ్మి, వాతావరణ ఆర్ద్రతలు ఎక్కువగా ఉంటాయి.
* వర్షం దాదాపుగా రోజూ కురుస్తుంది.
* ఈ మండలంలో నిర్దిష్టమైన రుతువులు ఉండవు.
* విషవత్తులు సంభవించే మార్చి, సెప్టెంబరు నెలలో వర్షపాతం కొంచెం పెరుగుతుంది.
* ఈ మండలంలో ఉష్ణోగ్రత 21o నుంచి 32o వరకు ఉంటుంది.
* రేయింబవళ్లు ఉష్ణోగ్రత వ్యత్యాసం 8o వరకూ ఉంటుంది. అందువల్ల 'రాత్రి'ని ఈ మండలం చలికాలంగా చమత్కరిస్తారు.

* సంవత్సరం మొత్తం మీద చాలావరకు రోజూ సాయంత్రం సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన సంవహన వర్షపాతం సంభవిస్తుంది.
* జావా ద్వీపంలో 'బోగోర్' వద్ద సంవత్సరంలో 322 రోజులు ఉరుముల శబ్దం వినబడుతుంది.
* సాంవత్సరిక వర్షపాతం 150 సెం.మీ. నుంచి 300 సెం.మీ. వరకు ఉంటుంది.
* తీర ప్రాంతాలు, పర్వతాల్లో ఇంతకంటే ఎక్కువగా పర్వతీయ వర్షపాతం సంభవిస్తుంది. ఉదాహరణకు 1016 సెం.మీ. సాంవత్సరిక వర్షపాతం సంభవించే ఆఫ్రికా ఖండంలోని కామెరూన్ పర్వత శిఖరం ప్రపంచంలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రదేశాల్లో నాలుగో స్థానంలో ఉంది.

సహజ వృక్ష సంపద
* ఈ ప్రకృతిసిద్ధ మండలం ప్రపంచం మొత్తం మీద చెట్లు పెరగడానికి అత్యంత అనుకూలం. ఈ మండలంలో 'సెల్వాలు' అని పిలిచే ప్రపంచంలో కెల్లా అత్యంత దట్టమైన అడవులు ఉన్నాయి.
* ఇవి సుమారు 40 - 50 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. ఎలాంటి కొమ్మలు లేకుండా పెరిగే ఈ ఎత్తయిన చెట్లకు అకస్మాత్తుగా కొమ్మలు, రెమ్మలు ఏర్పడతాయి. ఇవి సూర్యకిరణాలు భూమిపై ప్రసరించడానికి వీల్లేని దట్టమైన పందిరిగా ఒకదానితో ఒకటి అల్లుకుపోతాయి.
* ఈ పందిరి కింద తీగ జాతికి చెందిన చెట్ల తీగలు వివిధ వృక్షాల కాండాల మధ్య ఊయలలు కట్టిన విధంగా అల్లుకుని ఉంటాయి. వీటిని 'లయనాలు' అంటారు.
* భూమధ్యరేఖా మండలం అరణ్యాల్లో ప్రధానంగా మహాగని, రోజ్ఉడ్, సిడార్, ఎబొనీ లాంటి గట్టి కలపనిచ్చే చెట్లు పెరుగుతాయి.
* వెస్టిండీస్ దీవుల్లో పెరిగే జాఫోట్ వృక్షాల స్రావమైన 'చికిల్' అనే పదార్థాన్ని ఉపయోగించి చూయింగ్ గమ్ తయారు చేస్తారు.
* ఇతర రకపు అడవులు, తేమ ప్రాంత జలారణ్యాలు, అసంఖ్యాకమైన కొబ్బరి తోటలు కూడా ఉన్నాయి.

 

స్థానిక జంతు సంపద
* ప్రపంచంలోని భూమధ్యరేఖా ప్రకృతిసిద్ధ మండల ప్రాంతాలన్నింటిలోనూ అసంఖ్యాకంగా ఉండే అనేక రకాల కీటకాలను ఈ సహజ మండల లక్షణంగా పేర్కొనవచ్చు.
* ఇక్కడి జంతుసంపదలో చెట్లపై నివసించే తొండలు, కోతులు, గబ్బిలాలు, పక్షులు, ఉడతలు మొదలైనవి ముఖ్యమైనవి.
* ఈ ప్రాంత జలాల్లో చేపలు, తాబేళ్లు, మొసళ్లు మొదలైనవి పుష్కలంగా ఉంటాయి.
* పెంజేరు ఈ మండల ప్రధాన విష సర్పం. లయనాలపై ప్రపంచంలో కెల్లా పొడవైన అనకొండ సర్పాలుంటాయి.
* చీమలను తినే పొడవాటి నాలుక ఉండే జంతువులు కూడా ఈ మండలంలో ఉంటాయి.
* వీటికి అదనంగా గొరిల్లాలు, నీటి గుర్రం, ఒకాపిస్ లాంటివి కూడా ఉంటాయి.

 

ప్రజలు
* ఇది ప్రపంచంలో ప్రజలు తక్కువగా నివసించే ప్రాంతాల్లో ఒకటి.
* అమెజాన్, కాంగో నదీ హరివాణాల్లోని చాలా ప్రాంతాల్లో జనసాంద్రత చదరపు కిలోమీటరుకు ఐదు కంటే తక్కువ.
* అయితే ఇండోనేషియాలోని జావా ద్వీపం ప్రపంచంలోనే అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో ఒకటి.
* ఈ ప్రకృతిసిద్ధ మండలంలో అనేక తెగలకు చెందిన ఆదివాసులు నివసిస్తున్నారు.

* వీరిలో ప్రధానంగా అమెజాన్ నదీ హరివాణంలోని రెడ్ ఇండియన్లు, కాంగో నదీ పరివాహకంలోని పిగ్మీలు, మలేషియా దేశపు అరణ్యాల్లోని సమాంగ్, సకామీలు; బోర్నియా ద్వీపంలోని హెడ్‌హంటర్స్, సుమత్రా ద్వీపంలోని కాబూలను పేర్కొనవచ్చు.
* ఈ ఆదిమవాసులు తమ జీవనోపాధి కోసం నేటికీ ఆటవిక జీవన విధానాలైన వేట, మత్స్యగ్రహణం, కందమూలాదుల సేకరణ, పోడు వ్యవసాయం మొదలైన వృత్తులనే అనుసరిస్తున్నారు.
* ఈ ప్రకృతిసిద్ధ మండలాల్లో హేవల్ జాతీయులు నివసిస్తున్న కొన్ని ప్రాంతాల్లో మాత్రం 'తోటల పెంపక వ్యవసాయం' అభివృద్ధి చెందింది.

 

ఆర్థిక ప్రగతి

వ్యవసాయం: ఈ మండలం తోటల పెంపక వ్యవసాయానికి ప్రసిద్ధి చెందింది.
* ఆ రకపు పంటల్లో పేర్కొనదగినది రబ్బరు. ప్రపంచ సహజ రబ్బరు ఉత్పత్తిలో 90% కంటే ఎక్కువగా ఈ ప్రాంతం అందిస్తోంది.
* కొబ్బరి కాయలు, అరటిపండ్లు, ఆయిల్‌పామ్ మొదలైనవి.
* వరి జావా దేశపు ప్రధాన పంట.

ఖనిజ సంపద
    ఈ ప్రకృతిసిద్ధ మండలంలోని చాలా భాగం మానవ సంచారానికి సాధ్యం కాని దట్టమైన అరణ్యాలతో ఉంటుంది. అందువల్ల ఈ ప్రాంతంలో దొరికే ఖనిజ సంపదను అంచనా వేయడానికి సాధ్యం కాలేదు.
* ప్రపంచంలో 'గంధకం' ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం మెక్సికో.
* ప్రపంచంలో 'తగరం' అధికంగా ఉత్పత్తి చేసే దేశం మలేషియా.
* బ్రూనై సుల్తాను ప్రపంచంలోని అత్యంత ధనికుల్లో ఒకరు కావడానికి ఆ దేశపు ప్రధాన వనరు అయిన పెట్రోలియం కారణం.

 

నగరాలు
* భూమధ్యరేఖా మండలంలోని చాలా ప్రాంతాలు నేటికీ మానవ ఆవాసాలకు అనువుగా లేవు.
* సింగపూర్, రియోడిజనీరో, జార్జ్ టౌన్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, మనాస్, లియోపోల్డ్ విల్లీ, జకార్తా, బాండుంగ్ తీర ప్రాంత నగరాలు అంతర్జాతీయ వాణిజ్య మార్గాలుగా అభివృద్ధి చెందాయి.

Posted Date : 14-09-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు