• facebook
  • whatsapp
  • telegram

తృతీయ భూస్వరూపాలు

ద్వీపం: అన్నివైపులా నీరు ఆవరించి ఉన్న భూభాగాన్ని ద్వీపం అంటారు.
ఉదా: శ్రీలంక, జపాన్, గ్రీన్‌లాండ్, గ్రేట్ బ్రిటన్.
 

ద్వీపకల్పం: మూడు వైపులా నీటితో, ఒక వైపు భూభాగంతో ఉన్న భూస్వరూపాన్ని ద్వీపకల్పం అంటారు.
ఉదా: సౌది అరేబియా, భారతదేశం, కేప్‌యార్క్.

 

భూసంధి: రెండు భూభాగాలను కలుపుతూ రెండు జల భాగాలను వేరుచేసే సన్నని భూభాగాన్ని భూ సంధి అంటారు.
ఉదా: పనామా, సూయజ్ భూసంధులు.

 

జలసంధి: రెండు విశాల సముద్ర ప్రాంతాలను కలుపుతూ, రెండు విశాల భూభాగాలను వేరుచేసే సన్నని సముద్ర జల భాగాన్ని జలసంధి అంటారు.
ఉదా: పాక్ జలసంధి, బేరింగ్ జలసంధి.

 

అగ్రం: భూభాగం చివరి కొన సముద్రంలోకి చొచ్చుకుపోతే ఆ కొనను అగ్రం అంటారు.
ఉదా: ఆఫ్రికా ఖండం దక్షిణ చివరి కొన గుడ్‌హోప్ అగ్రం.
     భారతదేశం చిట్టచివరి కొన కన్యాకుమారి అగ్రం.

 

ఎడారి: అత్యల్ప వర్షపాతం, అత్యధిక ఉష్ణోగ్రతలున్న ప్రాంతాన్ని ఎడారి అంటారు.
ఉదా: ఆఫ్రికాలోని సహారా ఎడారి
     భారత్‌లోని థార్ ఎడారి

 

తీరం: సముద్రానికి ఆనుకుని ఉండే భూభాగాన్ని తీరం అంటారు.
ఉదా: దక్షిణ భారతదేశంలోని పశ్చిమ, తూర్పు తీర మైదానం.

 

నది: పర్వతాలు, పీఠభూములు, మైదానాల ద్వారా సహజంగా ప్రవహించే జీవ లేదా అశాశ్వత జల ప్రవాహాన్ని నది అంటారు.
ఉదా: నైలునది, అమెజాన్, గోదావరి, కృష్ణ, గంగా

 

లోయ: సన్నని లోతైన భూతలాన్ని లోయ అంటారు.
ఉదా: కృష్ణానది లోయ

 

పగులు లోయ: భూ అంతర్భాగంలోని బలాల వల్ల భూపటలంపై ఉన్న రెండు సమాంతర భ్రంశాల మధ్య ఉన్న భూభాగం కిందకు జారడం వల్ల పగులు లోయలు ఏర్పడతాయి.
ఉదా: భారత్‌లో నర్మదా, తపతి నదులు ప్రవహించే లోయలు పగులు లోయలు.

 

అగాధ ధరి: నదీ ప్రవాహం కోతకు గురికావడం వల్ల నిట్రమైన పార్శ్వాలతో ఏర్పడే లోతైన లోయను అగాధధరి అంటారు.
ఉదా: అమెరికాలోని కొలరాడో అగాధ ధరి ప్రపంచ ప్రసిద్ధిగాంచింది.

 

జలపాతం: నదీ ప్రవాహ జలం ఎత్తయిన ప్రాంతం నుంచి అగాధ ధరి కిందకు పడే ప్రదేశాన్ని జలపాతం అంటారు.
ఉదా: ఆఫ్రికాలోని విక్టోరియా జలపాతం.
     ఉత్తర అమెరికాలోని నయగారా జలపాతం.
     భారతదేశంలోని జోగ్ జలపాతం.

 

డెల్టా: నదీముఖ ద్వారం వద్ద రెండు లేదా అంతకంటే ఎక్కువ పాయలతో సముద్రాన్ని కలుస్తుంది. ఆ పాయల మధ్య ఉండే ప్రాంతంలో సారవంతమైన ఒండ్రు నిక్షేపాలు ఉంటాయి. దాన్నే డెల్టా అంటారు.
ఉదా: కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా.

 

సరస్సు: భూభాగం లోపల పరివేష్టితమై ఉన్న జల భాగాన్ని సరస్సు అంటారు.
ఉదా: కొల్లేరు, బైకాల్, సుపీరియర్.

 

కాలువ: రవాణా లేదా నీటిపారుదల మార్గం కోసం కృత్రిమంగా తవ్విన జల మార్గాన్ని కాలువ అంటారు.
ఉదా: సూయజ్ కాలువ, పనామా కాలువ, ఇందిరా గాంధీ కాలువ.

 

అఖాతం: సముద్రపు అలల ద్వారా క్రమక్షయం చెందే అర్ధచంద్రాకార భూస్వరూపాన్ని అఖాతం అంటారు.
ఉదా: బంగాళాఖాతం.

 

సింధు శాఖ: ఒక ప్రధాన భూ భాగంలోకి చొచ్చుకు వచ్చిన సముద్ర భాగాన్ని సింధు శాఖ అంటారు.
ఉదా: ఎడెన్ సింధు శాఖ.

బిట్లు

1. అన్ని వైపులా నీటితో ఆవరించి ఉన్న భూభాగం
జ‌: ద్వీపం
 

2. రెండు విశాల భూభాగాలను వేరుచేసే సన్నని సముద్ర భాగం
జ‌: జలసంధి

 

3. ఆఫ్రికాలోని జలపాతం
జ‌: విక్టోరియా

 

4. భారతదేశంలో ఉన్న ఎడారి
జ‌: థార్

 

Posted Date : 14-09-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు