• facebook
  • whatsapp
  • telegram

సాంఘిక అధ్యయనాల బోధన ఆశయాలు, లక్ష్యాలు, విలువలు

పాఠశాలలో సాంఘిక అధ్యయనాల బోధన ముఖ్య ఆశయం తమ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దడం. అలాగే ప్రజాస్వామ్య సమాజంలో వారు ఉత్తమ పౌరులుగా మనగలగడానికి కావాల్సిన శిక్షణ ఇవ్వడం. ఇందులో భాగంగా విద్యార్థుల్లో సహనం, మానవతావాదం, క్రియాత్మక దృక్పథం లాంటి భావాలను పెంపొందిస్తారు. 
   సాంఘిక అధ్యయనాల బోధనా ఉద్దేశాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:
1) సాధారణ ఆశయాలు
2) లక్ష్యాలు. 
అభ్యసనం ద్వారా విద్యార్థుల ప్రవర్తనా నియమావళిలో అభిలషణీయ మార్పు వస్తుంది. బోధన, అభ్యసన ఫలితాలను తెలిపేవి ఈ మార్పులే. విద్యార్థుల్లోని ప్రవర్తనా భేదాలే నిర్దిష్ట లక్ష్యాలు లేదా స్పష్టీకరణలు.
ఆశయాలు, లక్ష్యాలు: ఇవి రెండూ పర్యాయ పదాలు. అయితే ఆశయం అనే పదాన్ని సాధారణ అర్థంలో ఉపయోగిస్తున్నారు. ఆశయం స్వభావం, భావం, పరిధి విశాలమైనవి. 
ఒక పని చేపట్టబోయే ముందు తీసుకునే నిర్ణయమే ఆశయం. ప్రతి పనికి ఒక ఉద్దేశం లేదా ఆశయం ఉంటుంది. ఉద్దేశించిన ఆశయం గమ్యం చేరడానికి ఉపకరిస్తుంది. 
'ఉద్దేశం అనేది మన కళ్ల ముందు ఎప్పుడూ కనిపిస్తూ, మనకి దిశానిర్దేశం చేస్తూ, మనం చేసే ప్రతి పనిని ఎల్లప్పుడూ ప్రభావిత పరుస్తూ మనల్ని సరైన మార్గంలో నడుపుతుంది'.   - జాన్ డ్యూయి

'సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు నావికుడు గమ్యం (సముద్రతీరం) చేరినా, చేరకపోయినా ఆకాశంలోని నక్షత్రం (ఆశయం) అనేది తప్పనిసరి. అయితే నావికుడు నక్షత్రాన్ని ఎప్పటికీ చేరకపోయినా, అతడికి తన గమ్యం (లక్ష్యం) చేరడానికి నక్షత్రం ఉపయోగపడుతుంది' - ఇ.బి. వెస్లీ
 

ఆశయం - స్వభావం
* ఆశయం అనేది మార్గదర్శక సూత్రం
* ఆశయాలు సాధారణమైనవి, దీర్ఘకాలిక గమ్యం/ సాధితాలు
* ఆశయాలకు శాశ్వత విలువలు ఉంటాయి.
¤* ఆశయాలకు విశాలమైన పరిధి, దృక్పథం ఉంటాయి.
¤* ఇవి సమాజ అవసరాల నుంచి ఉత్పన్నమవుతాయి.
* ఆశయాలు విషయాన్ని బట్టి మారవు. అవి విద్యావిధానం మొత్తానికి సంబంధించినవి.
* ఆశయాలు సాధించవచ్చు, సాధించలేకపోవచ్చు.
* ఆశయాల నుంచే లక్ష్యాలు జన్మిస్తాయి.
* ఆశయాలు/ ఉద్దేశాలు ఉపాధ్యాయుడికి ఎక్కువ ఉపయుక్తం కావు.
* ఆశయం ఒక విశ్వాసానికి సంబంధించిన చర్య. ఉదా: సంఘీభావం, త్యాగం, శ్రమైక జీవనం, సమానత్వం.

లక్ష్యం 
  'విద్యా విధానం విద్యా లక్ష్యాల వైపు పయనిస్తున్నప్పుడు ఆ మార్గంలో ఆచరణ ద్వారా చేరుకోగలిగే/ సాధించగలిగే స్థాయిని సూచించే బిందువును లక్ష్యం' అంటారు.
లక్ష్యం అనేది బోధన అభ్యసన గమ్యాన్ని సూచిస్తుంది.
లక్ష్యాలు ఒక ప్రత్యేక అంశానికి సంబంధించినవి. ఇవి ఉద్దేశాల్లో ఒక భాగం. 
'లక్ష్యాలు సాధారణంగాను, భావాత్మకంగాను, అమూర్తాలుగాను, చాలా వరకు అప్రాప్యాలుగా ఉంటాయి'   - వెస్‌లీ ఖీ రాన్‌స్కీ 
'లక్ష్యం లేకుండా పాఠ్యాంశాన్ని బోధించడం దిక్సూచి లేని నావ నడపటంతో సమానం. నావ గమ్యం చేరాలంటే దిక్సూచి ఎంత ముఖ్యమో, పాఠ్యాంశాన్ని బోధించడానికి లక్ష్యం అంతే ముఖ్యం'. కాబట్టి ఉపాధ్యాయుడు లక్ష్యాత్మక బోధన చేయాలి. అది విద్యార్థుల వికాసానికి దోహదపడాలి. అందువల్ల ప్రతి పాఠ్యాంశానికి బోధనా లక్ష్యాలు ఉంటాయని తెలుసుకుని, అది బోధించడానికి ముందే ఉపాధ్యాయుడు ఆ లక్ష్యాలను నిర్ధరించుకోవాలి.


లక్ష్యాలు - స్వభావం - లక్షణాలు
* లక్ష్యాలు ఆశయం యొక్క మార్గదర్శకత్వంలో చేరుకోగలిగే గమ్యస్థానాన్ని సూచిస్తాయి.
* ప్రతి పాఠ్యాంశానికి స్పష్టమైన లక్ష్యం నిర్వచితమై ఉంటుంది. అది ఎప్పటికప్పుడు సాధించేలా ఉంటుంది.
* విద్యార్థుల ప్రవర్తనలో తీసుకురావాల్సిన మార్పుగా లక్ష్యాన్ని చెబుతారు.
* అభ్యసన ఫలితాల్లో లక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తాయి.

* ఆశయాలను సాధించడానికి లక్ష్యాలు దోహదపడతాయి.
* లక్ష్యాలు విషయాన్ని బట్టి మారుతూ ఉంటాయి.
* లక్ష్యాలను తప్పనిసరిగా సాధించవచ్చు.
* లక్ష్యాలు స్వల్పకాలిక సాధితాలు
* ఉపాధ్యాయుడు పాఠ్య విషయాన్ని, బోధనా పద్ధతిని ఎన్నుకోవడంలో లక్ష్యాలు కీలకపాత్ర వహిస్తాయి.
¤* లక్ష్యాలు ఉపాధ్యాయుడికి బోధనా కార్యక్రమంలో చాలా ఉపయుక్తంగా ఉంటాయి.

 

సాంఘిక అధ్యయన బోధనా ఉద్దేశాలు
'సాంఘిక అధ్యయనాలు మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రం'    - జాన్‌లీ మైఖీలీన్
'విద్య అనేది మానవుడి శారీరక, మానసిక అభివృద్ధికి దోహదం చేయాలి అని గ్రీకు తత్త్వవేత్త ప్లాటో 'ది రిపబ్లిక్‌'గ్రంథంలో పేర్కొన్నాడు.
కింద పేర్కొన్న ఆశయాలను సాంఘిక అధ్యయనాల ద్వారా విద్యార్థులతో సాధింపజేయాలి.
* పరిసరాల పరిచయం.
* సామాజిక సామర్థ్యం పెంపొందించడం.
* సాంఘిక, ఆర్థిక సంస్థల పట్ల అభిరుచి (సమాజం - బ్యాంకుల పట్ల)
* సాంస్కృతిక వారసత్వ అభినందన.
* సామాజిక అర్హత 

* ప్రజాస్వామ్య పౌరసత్వాన్ని పెంపొందించడం.
* మానవ సంబంధాల పట్ల సరైన దృక్పథాన్ని కలిగించడం.

* సంపూర్ణ మూర్తిమత్వ లక్షణాలు పెంపొందించడం.
* నాది అనే భావన కలిగించడం.
* విరామకాలాన్ని సద్వినియోగం చేసుకోవడం.
* అంతర్జాతీయ అవగాహనను పెంపొందించడం.
* సామాజిక మార్పులకు అనుగుణమైన వైఖరి.
* ఆధ్యాత్మిక, ఆర్థిక, రాజకీయ విలువలపై అవగాహన.
* జాతీయ సమైక్యతను పెంపొందించడం.
* నాయకత్వ లక్షణాలు పెంపొందించడం.

 

సాంఘిక అధ్యయనాల బోధనా విలువలు
  నేటి సమాజంలో విలువల ప్రాధాన్యం క్రమేపీ తగ్గిపోతోంది. సమాజంలో కేవలం జ్ఞానం ద్వారా విలువలు పెంపొందవు. శాస్త్రసాంకేతిక, సమాచార రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు సంభవించినా విలువల అభివృద్ధిలో వెనకబడిపోతున్నాం. అందుకే పిల్లల్లో విలువలు పెంపొందించడంలో విద్యావ్యవస్థ ప్రముఖ పాత్ర వహించాలి. విలువ అనేది ఆలోచన. విలువ మనిషి ప్రవర్తనలో వచ్చే మార్పు. ఏ గుణం అయితే ఒక వ్యక్తికి లేదా వస్తువుకి ప్రాధాన్యం, గౌరవం, ఉపయోగం కలిగిస్తుందో అలాంటి గుణాన్ని విలువ అంటారు.
ఉదా: మల్లెపూలు - సువాసన (గుణం); బంగారం - మారకపు విలువ, సౌందర్యం (అందంగా కనిపిస్తుంది).

విలువలు - నిర్వచనాలు
* 'ఒక వస్తువు, సన్నివేశం, భావం, కృత్యం, యోగ్యత, మంచితనం గురించిన దృఢమైన నమ్మకమే విలువ'  - బాండ్
¤* 'ఈ సమాజంలోని ఎక్కువమంది ఆచరించే ఆదర్శాలు, నమ్మకాలు, నియమాలే విలువలు'  - కానే
* 'దేనినైతే ప్రేమగా చూస్తామో, దేనినైతే పొందాలనుకుంటామో, దేనినైతే అభిమానిస్తామో, పొగుడుతామో, ఊహిస్తామో, అభినందిస్తామో దానినే విలువ అంటారు'.   - జాన్ డ్యూయి
* 'ఓటమి ఎరుగని వ్యక్తి కంటే విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తే మిన్న'   - ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
* 'విద్యా లక్ష్యాలే విద్యావిలువలు'  - కన్నింగ్ హామ్
* 'వ్యక్తి లక్ష్యాలే అతడి విద్యావిలువలు'    - జె.ఎస్. బ్రుబేచర్

 

విలువలు - లక్షణాలు
యోగ్యతను నిర్ధరించడానికి వినియోగించే ప్రమాణాలే విలువలు.
ఇవి
•  అమూర్తమైనవి
•  అంతర్లీనమైనవి
•  సాపేక్షమైనవి
•  ఆపాదించబడేవి
•  సమ్యత ఉన్నవి


  సాంఘిక అధ్యయనాలు నిర్దేశించిన ఆశయాల ప్రకారం బోధించడం ద్వారా విద్యార్థుల్లో వివిధ రకాల విలువలు అభివృద్ధి చెందుతాయి. అవి:
* బౌద్ధిక విలువలు
* సాంస్కృతిక విలువలు

* వృత్తి విలువలు
* ఉపయోగిత విలువలు
* నైతిక విలువలు
* సృజనాత్మక విలువలు
* సౌందర్యాత్మక విలువలు
* క్రమశిక్షణ విలువలు
* విరామ సమయం సద్వినియోగం చేసుకునే విలువలు
* శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి
* సామాజిక జ్ఞానం
* అనుభవ పూర్వక జ్ఞానం
* సమస్యా పరిష్కారంలో సమర్థత
* సహకార భావనలో శిక్షణ
* సమాజ పరిణామానికి అనుగుణంగా సర్దుకుపోయే సరళ స్వభావం... మొదలైన వాటితోపాటు కింది విలువలూ విద్యార్థుల్లోపెంపొందుతాయి.
* నిజాయతి
* త్యాగనిరతి

* ఉన్నదాంతో తృప్తిచెందడం
* శ్రమగౌరవం
* మర్యాద
* సహనగుణం
* సహాయపడటం
* సృజనశీలత
* క్షమాగుణం లాంటివి.

 

మాధ్యమిక విద్యాస్థాయిలో సాంఘిక అధ్యయనాల బోధన ఆశయాలు: మాధ్యమిక విద్యాస్థాయిలో/ పాఠశాల స్థాయిలో సాంఘిక అధ్యయనాలు అంటే 1. భూగోళశాస్త్రం 2. చరిత్ర 3. పౌరవిజ్ఞానం 4. అర్థశాస్త్రాన్ని వేర్వేరుగా ప్రవేశపెట్టి సమైక్యపద్ధతిలో బోధిస్తారు. అయితే వీటి బోధనా సమయంలో వాటికున్న ప్రత్యేక ఆశయాలను పరిగణనలోకి తీసుకోవాలని సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు గుర్తుంచుకోవాలి.
 

I. భూగోళశాస్త్ర బోధన ఆశయాలు
ఎ) చిన్న అంశాలు:
వివిధ భౌతిక, సాంఘిక, ఆర్థిక అంశాలు, శీతోష్ణస్థితి పరిస్థితులు మానవ జీవనంపై చూపే ప్రభావం.
ఉదా: వివిధ ప్రకృతిసిద్ధ మండలాల్లో ఆయా శీతోష్ణస్థితి పరిస్థితులు మనిషిపై చూపే ఆర్థిక, సాంఘిక జీవన ప్రభావాలు.

 

బి) మానవ జీవనం: ప్రజల జీవన విధానం ఆ ప్రాంత భూగోళిక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ఉదా: టండ్రా ప్రాంతంలో ఎస్కిమోల ప్రధాన వృత్తి చేపలు పట్టడం; వారు ధ్రువపు జింక చర్మాలను వస్త్రాలుగా ఉపయోగిస్తారు.

 

సి) పరస్పర ఆధారం: భౌగోళికంగా భిన్నత్వం ఉన్న ప్రాంతాలు పరస్పర ఆధార సూత్రంపై అభివృద్ధి సాధిస్తాయి.
ఉదా: పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జపాన్ ఆహార ఉత్పత్తుల కోసం భారతదేశంలాంటి దేశాలపై ఆధారపడటం, భారత్ లాంటి వర్థమాన దేశాలు జపాన్ నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవడం మొదలైనవి.

 

డి) సాధారణీకరణాలు: భౌగోళిక అంశాల అవగాహన ద్వారా విద్యార్థులు ప్రపంచ దేశాల ప్రజల జీవన విధానాన్ని, సమస్యలను అర్థం చేసుకుని సాధారణీకరణం చేస్తారు.
 

II. చరిత్ర బోధించడంలో ఆశయాలు
1) మార్పు:
ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు మానవ పరిణామం, సామాజిక అభివృద్ధి దశల గురించి అవగాహన చేసుకుంటారు.
ఉదా: * నీగ్రిటో, ప్రొటో ఆస్ట్రలాయిడ్, మంగోలాయిడ్, మెడిటేరియన్, నార్టిక్ జాతులు.
  * పూర్వ శిలాయుగపు పనిముట్ల నుంచి ప్రస్తుత ఆయుధాలు

 

2) ఐక్యత: నాగరికతా నిర్మాణంలో మానవజాతి ఐక్యతకు ఉన్న ప్రాముఖ్యాన్ని గ్రహించడం.
ఉదా: సింధు ప్రజల వస్త్రాల మూట 'ఉమ్మా' అనే ప్రదేశంలో దొరకడం.

 

3) వారసత్వం: మనదేశ సాంస్కృతిక వారసత్వ అభివృద్ధి, వివిధ సంస్కృతుల తోడ్పాటు పట్ల అభినందన.
ఉదా: గౌతమబుద్ధుడు గాంధార శిల్ప కళలో మొదటిసారిగా విగ్రహరూపంలో కనిపించడం.

 

4) చరిత్ర: మానవజాతి అభివృద్ధిపై వివిధ సంస్కృతుల ప్రభావాన్ని అవగాహన చేసుకోవడం.

III. పౌరనీతిశాస్త్ర బోధన ఆశయాలు
1) పౌరసత్వం:
సామాజిక కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొనే సమర్థులైన పౌరులను తయారుచేయడం.
ఉదా: ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడం.
* ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమాజం పట్ల సరైన దృక్పథంతో వ్యవహరించడం.
* దేశ రక్షణ, శాంతి భద్రతల విషయంలో తనవంతు కర్తవ్యాన్ని నిర్వహించడం.

 

2) అవగాహన: వివిధ సాంఘిక, రాజకీయ వ్యవస్థల స్వరూపం, వాటి విధులు, పనితీరు గురించి విశ్లేషిస్తారు.
ఉదా: గ్రామపంచాయితీ నిర్మాణం, విధులు;
* సమాజం - దాని అభివృద్ధి వికాసం, వ్యవస్థాపన తీరుతెన్నులు
* యూపీఎస్‌సీ, ఏపీపీఎస్‌సీ, నిఘా సంస్థల గురించి తెలుసుకోవడం

 

3) ఐక్యరాజ్యసమితి: ప్రపంచ శాంతిని కాపాడటంలో ఐక్యరాజ్య సమితి పాత్రను అభినందించడం.
ఉదా: * అణ్వస్త్ర నిరోధక ఒప్పదాలపై ప్రపంచదేశాలను ఒప్పించడం, మానవాళికి జరగబోయే ఉపద్రవాలను నివారించడం.
     * ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థల వితరణ.

 

IV. అర్థశాస్త్ర బోధన ఆశయాలు
1) ఆర్థిక సమస్యలు: 
నిజజీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలను సమర్థంగా పరిష్కరించుకునే నైపుణ్యం పెంపొందించడం.
ఉదా: పేదరికం, ఆహార భద్రత, కనీస అవసరాలు పొందడం.
2) వనరుల సద్వినియోగం: పరిమిత వనరులతో గరిష్ఠ ప్రయోజనం పొందే ఆలోచన చేయడం.
3) ఆర్థిక విధానాల అవగాహన: ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం లాంటి సందర్భాల్లో ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా వ్యవహరించి తగునైపుణ్యం పొందడం.
ఉదా: పొదుపు, వడ్డీరేట్లు, కొనుగోలు శక్తి కలిగి ఉండటం.


 

Posted Date : 13-09-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు