• facebook
  • whatsapp
  • telegram

వ్యాకరణం - సంధులు

పూర్వ, పర స్వరాలకు పరస్వరం ఏకాదేశమవడాన్ని 'సంధి' అంటారు. స్వరం అంటే అచ్చు. ఏకాదేశమంటే రెండింటి స్థానంలో ఒకటి రావడం. 
*  'అ - ఇ - ఋ' లకు సవర్ణాచ్చులు పరమైతే వరసగా వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. దీన్నే 'సవర్ణదీర్ఘ సంధి' అంటారు.
ఉదా: రామ + ఆలయం = రామాలయం;        పరమ + అర్థం = పరమార్థం;  
       కవి + ఇంద్ర = కవీంద్ర;                     భాను + ఉదయం = భానూదయం
         మాతృ + ఋణం = మాతౄణం 

 

*  అకారానికి 'ఇ-ఉ-ఋ' లు పరమైతే వరసగా ఏ, ఓ, అర్‌లు ఏకాదేశమవుతాయి. ఏ, ఓ, అర్ లను 'గుణాలు' అంటారు. కాబట్టి ఇది 'గుణ సంధి'
ఉదా: ధర్మ + ఇంద్ర = ధర్మేంద్ర;                 పర + ఉపకారం = పరోపకారం
      మహా + ఋషి = మహర్షి;                 సప్త + ఋషులు = సప్తర్షులు 

 

* అకారానికి ఏ, ఐలు గానీ, ఓ, ఔలు గానీ పరమైతే వరసగా ఐకారం, ఔకారం ఏకాదేశమవుతాయి. ఐ, ఔలను 'వృద్ధులు' అంటారు. కాబట్టి ఇది 'వృద్ధిసంధి'.

ఉదా:  ప్రథమ + ఏక = ప్రథమైక;                 దివ్య + ఐశ్వర్యం = దివ్యైశ్వర్యం
      గృహ + ఓషధి = గృహౌషధి;              దివ్య + ఔషధం = దివ్యౌషధం 

 

* 'ఇ - ఉ - ఋ'లకు అసవర్ణాచ్చులు (సమానంకానివి) పరమైతే వరసగా 'య - వ - ర' లు ఆదేశంగా వస్తాయి. యవరలను 'యణ్ణులు' అంటారు. కాబట్టి ఇది 'యణాదేశసంధి'.
ఉదా:  అతి + ఉన్నతం = అత్యున్నతం;           అభి + ఉదయం = అభ్యుదయం
       గురు + ఆజ్ఞ = గుర్వాజ్ఞ;                       పితృ + అంశం = పిత్రంశం 

 

* 'కచటతప' లకు న, మ, లు పరమైతే ఆయా వర్గాలకు చెందిన అనునాసికాలు ఆదేశంగా (ఒక్కోసారి వికల్పంగా) వస్తాయి. నాసిక సహాయంతో పలికేవి అనునాసికాలు. కాబట్టి దీన్ని 'అనునాసిక సంధి' అంటారు.
'ఞ, ఙ, ణ, న, మ' లు వర్గ పంచమాక్షరాలు. ఇవి అనునాసికాలు.
ఉదా: వాక్ + మయం = వాఙ్మయం;               జగత్ + నాటకం = జగన్నాటకం
         రాట్ + మణి = రాణ్మణి;                   చిత్ + మయం = చిన్మయం
         వాక్ + నియమం = వ్నాయమం;          అప్ + మయం = అమ్మయం
         వాక్ + మహిమ = వాఙ్మహిమ

 

మరికొన్ని సంధులు
దిక్ + అంతం = దిగంతం - జశ్త్వ సంధి;   జగత్ + హితం = జగద్ధితం - జశ్త్వ సంధి
సత్ + చిత్   = సచ్చిత్ - శ్చుత్వ సంధి;   తత్ + చక్రం = తచ్చక్రం - శ్చుత్వ సంధి
శిరః + రత్నం = శిరోరత్నం - విసర్గ సంధి;   అంతః + ఆత్మ = అంతరాత్మ - విసర్గ సంధి
చతుః + ఆన = చతురాన - విసర్గ సంధి;    తపః + శాంతి = తపశ్శాంతి - విసర్గ సంధి
మనః + తాపం = మనస్తాపం - విసర్గసంధి; 
* ఉత్తునకు అచ్చుపరమైతే సంధి వస్తుంది. ఉత్తు అంటే హ్రస్వమైన ఉకారం.  దీన్ని 'ఉకార సంధి' లేదా 'ఉత్వ సంధి' అంటారు.
ఉదా: ఇట్లు + అనియె = ఇట్లనియె
          రాముడు + అతడు = రాముడతడు
          మనసు + ఐన = మనసైన

 

*  అత్తునకు సంధి బహుళంగా వస్తుంది. అత్తు అంటే హ్రస్వమైన అకారం. బహుళం అంటే సంధి జరగడం, సంధి జరగకపోవడం, విభాషగా జరగడం, వేరొకవిధంగా జరగడం. దీన్నే 'అకార సంధి' లేదా 'అత్వ సంధి' అంటారు.
ఉదా: మేన + అల్లుడు = మేనల్లుడు, మేనయల్లుడు 
         పుట్టిన + ఇల్లు = పుట్టినిల్లు, పుట్టిల్లు
   రెండో రూపం యడాగమసంధి. అకారసంధి రాకపోవడం వల్ల ఏర్పడింది.
  అమ్మ + ఇచ్చెను = అమ్మయిచ్చెను. అకారసంధి జరగకపోవడం వల్ల యడాగమం వచ్చింది.
* ఇదేవిధంగా వెల + ఆలు = వెలాలు కావాలి. కానీ, వెలయాలు అవుతుంది.
* ప్రథమ మీది పరుషాలకు గసడదవలు వస్తాయి.
* ద్వంద్వసమాసంలో కూడా ఇది జరుగుతుంది. దీన్ని గసడదవా దేశసంధి అంటారు. పరుషాలు అంటే కచటతపలు.
ఉదా: సంగరము + చేయు = సంగరము సేయు;   వాడు + చెప్పె = వాడుసెప్పె
నదులు + త్రావవు = నదులు ద్రావవు;  ఆపదల్ + పోడము = ఆపదవ్వొడము 

 

* కర్మధారయాల్లో ఉత్తునకు అచ్చుపరమైతే టుగాగమం వస్తుంది. పేర్వాది శబ్దాలకు విభాషగా వస్తుంది. ఇది 'టుగాగమ సంధి'. కర్మధారయ అంటే విశేషణ విశేష్యాలు ఉండేది.
ఉదా:  నిగ్గు + అద్దం = నిగ్గుటద్దం 
          వేల్పు + ఆవు = వేల్పుటావు
          చిగురు + ఆకు = చిగురుటాకు = చిగురాకు (సంధిరాకపోతే) 

 

* పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే 'రు' ఆగమంగా వస్తుంది. కర్మధారయంలో తత్సమ శబ్దాలకు అకారం ఉకారంగా మారి 'రు' వస్తుంది. దీన్ని 'రుగాగమ సంధి' అంటారు. ఇక్కడ 'ఆలు' అంటే స్త్రీ అని అర్థం.
ఉదా: పేద + ఆలు = పేదరాలు;                          బీద + ఆలు = బీదరాలు 
         గుణవంత + ఆలు = గుణవంతురాలు;         ధీమంత + ఆలు = ధీమంతురాలు
       ఆగమం అంటే మిత్రుడిలా అదనంగా చేరడం. వర్ణాధిక్యం. 

 

* ద్రుత ప్రకృతికం మీది పరుషాలకు సరళాలు వస్తాయి. ఆదేశ సరళాలకు ముందున్న ద్రుతానికి బిందు, సంశ్లేషలు విభాషగా వస్తాయి. ద్రుతం అంటే నకారం. అక్కరలేనప్పుడు లోపించేది. ద్రుత ప్రకృతికం అంటే ద్రుతం చివర ఉండే పదాలు.
  సరళాలు అంటే గజడదబలు. సంశ్లేష అంటే కూడిక. విభాష అంటే సంధి జరగడం లేదా జరగకపోవడం. బిందు అంటే సున్న లేదా అరసున్న.
ఉదా:  పూచెను + కలువలు = పూచెను + గలువలు 
                          = పూచెఁగలువలు 
                          = పూచెంగలువలు 
                          = పూచెన్గలువలు.
దయన్ + చూచి = దయఁజూచి;       సంతోషమునన్ + పోయి = సంతోషమునంబోయి. 

 

* కర్మధారయంలో మువర్ణకానికి పు, oపులు ఆదేశంగా రావడాన్ని 'పుంప్వాదేశ సంధి' అంటారు. ఆదేశం అంటే ఒక వర్ణం స్థానంలో మరో వర్ణం శత్రువులా వచ్చేది.
ఉదా:  సరసము + వచనం = సరసపువచనం లేదా సరసంపువచనం
          పూర్వము + జన్మ   = పూర్వపుజన్మ 
           నీచము + దాస్యం  = నీచంపుదాస్యం
      తమలము + ఆకు = తమలపాకు

 

* అచ్చునకు ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి వస్తుంది. ఆమ్రేడితం అంటే ద్విరుక్తం యొక్క పరరూపం. ఆమ్రేడితం పరమైతే కడాదుల తొలి అచ్చు మీది వర్ణాలకు అదంతంబైన ద్విరుక్తటకారం వస్తుంది. అదంతం అంటే అకారం అంతంలో ఉండేది. ఇది 'ఆమ్రేడిత సంధి'.
ఉదా:   ఔర + ఔర   = ఔరౌర                   
          ఏమి + ఏమి = ఏమేమి
           కడ + కడ   = కట్టకడ                   
          ఎదురు + ఎదురు = ఎట్టఎదురు
         తుద + తుద    = తుట్టతుద          
          నాడు + నాడు     = నానాడు 
           చెర + చెర      = చెచ్చెర.

 

*  ప్రాతాదుల తొలి అచ్చు తర్వాత ఉన్న వర్ణాలకు లోపం వస్తుంది. ఆ తర్వాత నుగాగమం, ద్విత్వాలు వస్తాయి. ఇది 'ప్రాతాదిసంధి'.
ఉదా: ప్రాత + ఇల్లు = ప్రాయిల్లు
         లేత + దూడ = లేదూడ 
         మీదు + కడ = మీఁగడ 
         కెంపు + తామర = కెందామర 
          నెఱ + చెలి = నెచ్చెలి
         క్రొత్త + తావి = క్రొత్తావి 
         క్రొత్త + చాయ = క్రొంజాయ
         నెఱ + మది = నెమ్మది 
         నిండు + వెఱ = నివ్వెఱ
         క్రొత్త + నన = క్రొన్నన

 

* కుఱు, చిఱు, కడు, నడు, నిడు శబ్దాల్లోని ఱ - డ లకు అచ్చుపరమైతే ద్విరుక్తటకారం వస్తుంది. దీన్ని ద్విరుక్తటకార సంధి అంటారు.
రెండుసార్లు వచ్చేది, హల్లు కింద అదే హల్లు వచ్చేది ద్విరుక్తం.
ఉదా: కుఱు + ఉసురు = కుట్టుసురు
          చిఱు + అడవి = చిట్టడవి 
          కడు + ఎదురు = కట్టెదురు 
          నడు + ఇల్లు = నట్టిల్లు 
          నిడు + ఊర్పు = నిట్టూర్పు 

 

* ఆ, ఈ, ఏ సర్వనామాలను త్రికాలు అంటారు. త్రికం తర్వాత అసంయుక్త హల్లు ఉంటే ద్విత్వం బహుళంగా వస్తుంది. ద్విరుక్తమైన హల్లు పరమైతే ఆచ్ఛికమైన దీర్ఘానికి హ్రస్వం వస్తుంది. దీన్ని 'త్రికసంధి' అంటారు. యడాగమం కూడా వస్తే యడాగమ త్రికసంధి అంటారు.
ఉదా: ఆ + బాలుడు = అబ్బాలుడు 
         ఈ + కన్య = ఇక్కన్య 
         ఏ + చోటు = ఎచ్చోటు 
         ఏ + విధం = ఎవ్విధం 
         ఆ + తన్వి = అత్తన్వి      
         ఆ + అశ్వం = అయ్యశ్వం 
    

* నీ, నా, తన శబ్దాలకు ఉత్తర పదం పరమైతే 'దు' ఆగమంగా వస్తుంది. ఇది దుగాగమ సంధి. 
         నీ + కరుణ = నీదు కరుణ 
         నా + తనయ = నాదు తనయ 
         తన + రూపు = తనదు రూపు.

Posted Date : 28-08-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సెకండరీ గ్రేడ్ టీచర్స్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు