• facebook
  • whatsapp
  • telegram

విద్యాహక్కు చట్టం - 2009

విద్యాహక్కు చట్టం
స్వాతంత్య్రానికి ముందు మొదటిసారిగా 1882లో హంటర్‌ కమిషన్‌ ఉచిత విద్య ప్రాధాన్యం గురించి ప్రస్తావించింది. తర్వాత గోపాలకృష్ణ గోఖలే 1911లో దీని ప్రాముఖ్యాన్ని గుర్తించి, నాటి బ్రిటిష్‌ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా ఫలితం లభించలేదు. కాలక్రమంలో హర్టాగ్, సార్జంట్‌ కమిటీలు దీని గురించి ప్రస్తావించాయి. స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగంలోని 45వ ఆర్టికల్‌ 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత విద్యను అందించాలని పేర్కొంది.
* 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలనే ఉద్దేశంతో మన దేశంలో ‘విద్యాహక్కు చట్టం - 2009'ని ఏర్పాటు చేశారు. అయితే ఈ చట్టం జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రంలో తప్ప మిగిలిన దేశమంతటా 2010, ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది.

చట్టం ఏర్పడిన క్రమం
* 2009 జులై 20 - రాజ్యసభ ఆమోదం
* 2009 ఆగస్టు 4 - లోక్‌సభ ఆమోదం
* 2009 ఆగస్టు 26 - రాష్ట్రపతి ఆమోదం
* 2009 ఆగస్టు 27 కేంద్ర ప్రభుత్వ గెజిట్‌ విడుదల
చట్టం అమల్లోకి వచ్చిన తేదీ: 2010, ఏప్రిల్‌ 1.
* విద్యాహక్కు చట్టంలో 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, ఒక అనుబంధ షెడ్యూల్‌ ఉన్నాయి.

ముఖ్యాంశాలు:
* బడి వయసు పిల్లలందరినీ బడిలో తమ వయసుకు తగిన తరగతిలో ఉండేలా చూడాలి.
* ఆవాస ప్రాంతానికి ఒక కిలోమీటర్‌ పరిధిలో ప్రాథమిక పాఠశాల, 3 కి.మీ. పరిధిలో ఒక ప్రాథమికోన్నత పాఠశాల ఉండాలి.
* విద్యకు అయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి.
* పిల్లల నుంచి క్యాపిటేషన్‌ ఫీజు వసూలు చేయకూడదు.
* జనన ధ్రువీకరణ పత్రం లేదనే కారణంతో ప్రవేశాన్ని నిరాకరించకూడదు.
* ఏ విద్యార్థిని కూడా ఒక విద్యా సంవత్సరంలో ఏ తరగతిలోనూ ఒక సంవత్సరం కంటే ఎక్కువగా నిలిపి ఉంచకూడదు.
* ప్రాథమిక తరగతులకు ఎంపిక పరీక్ష నిర్వహించకూడదు.
* ఏ విద్యార్థిని కూడా శారీరకంగా, మానసికంగా హింసించకూడదు.
* ప్రభుత్వ గుర్తింపు లేకుండా బడి నిర్వహించకూడదు.
* SMSలను (పాఠశాల యాజమాన్య కమిటీ) ప్రతి పాఠశాలలోనూ ఏర్పాటు చేయాలి. వీటితో పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారు చేయాలి.
* నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE) ని ప్రతి విద్యార్థికీ ఏర్పాటు చేయాలి.
* ఎలిమెంటరీ విద్య పూర్తయ్యేవరకు ఎలాంటి బోర్డు పరీక్షలు నిర్వహించకూడదు.
* బాలల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక కమిషన్‌ని ఏర్పాటు చేయాలి.
* విద్యా విధాన ఆధునిక ధోరణుల్లో మార్పులు, సలహాలకు జాతీయ స్థాయిలో ‘జాతీయ సలహా సంఘం’, రాష్ట్ర స్థాయిలో ‘రాష్ట్ర సలహా మండలి’ని ఏర్పాటుచేయాలి.
* రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనుకూలంగా చట్టంలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు.

 

SMC ల గురించి సంక్షిప్త సమాచారం
పిల్లల తల్లిదండ్రులతో SMCని ఏర్పాటు చేయాలి. ఇందులో 50% మహిళలు ఉండాలి. వీరిలో ఒకరిని SMC ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకోగా, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు SMC కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ రెండు సంవత్సరాలు పనిచేస్తుంది. నెలకు ఒకసారి సమావేశం నిర్వహించాలి.
విధులు:
* పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారీ.
* బడి బయట ఉన్న బడిఈడు పిల్లలను బడిలో చేర్పించడం.
* పాఠశాలకు విడుదలయ్యే నిధులపై సామాజిక బాధ్యతగా ఉండటం.
* పిల్లల ప్రగతి పరిశీలన, మధ్యాహ్న భోజన పనితీరు పరిశీలన.

 

చట్టం అతిక్రమిస్తే విధించే జరిమానాలు
i) సెక్షన్‌ 18 ప్రకారం ప్రభుత్వ నిర్ణీత గడువు తర్వాత కూడా గుర్తింపులేని పాఠశాలను నడిపితే ఒక లక్ష జరిమానా విధిస్తారు.
* ఒకవేళ జరిమానా తర్వాత కూడా గుర్తింపు లేకుండా మళ్లీ పాఠశాలను నిర్వహిస్తే రోజుకు 10 వేలు జరిమానా విధిస్తారు.
ii) సెక్షన్‌ 13 ప్రకారం ప్రాథమిక స్థాయిలో ఏ పాఠశాలలోను ఎంపిక పరీక్ష (Entrance Test) నిర్వహించకూడదు. ఒకవేళ అలా నిర్వహిస్తే తొలిసారి తప్పుకు రూ.25,000, పునరావృతం అయితే రూ.50,000 జరిమానా విధిస్తారు.
iii) ఏ పాఠశాలలోనూ బోధనా రుసుం కాకుండా ఇతర రూపాల్లో ఎలాంటి ఫీజు (క్యాపిటేషన్‌ ఫీజు) వసూలు చేయరాదు. అలా వసూలుచేస్తే దానికి 10 రెట్లు జరిమానా విధిస్తారు.

* ప్రతి ప్రైవేటు పాఠశాల ప్రతి విద్యాసంవత్సరంలో 1వ తరగతి ప్రవేశాల్లో 25% సీట్లు బలహీన వర్గాలవారికి కేటాయించాలి. ఇందులో
ఎ. వికలాంగులు, అనాథలు, హెచ్‌ఐవీ బాధితులు, వీధి బాలలు       -     5%
బి. ఎస్సీ బాలలకు                                               -    10%
సి. ఎస్టీ బాలలకు                                                -     4%
డి. వెనుకబడిన బలహీన వర్గాలు                                -      6%
మొత్తం                                                            -    25%

  

సమాచార హక్కు చట్టం
అధికార యంత్రాంగం అదుపులో ఉన్న సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడం, పారదర్శకత, జవాబుదారీతనం లాంటి ఉద్దేశంతో సమాచార హక్కు చట్టాన్ని 2005, అక్టోబరు 12 నుంచి అమల్లోకి తెచ్చారు. దీన్ని మన రాష్ట్రం అక్టోబరు 13 నుంచి అమలు చేస్తోంది. సమాచార హక్కు చట్టం జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రానికి వర్తించదు.
* మొదట ఈ చట్టం ‘హమారా పైసా - హమారా హిసాబ్‌’ అనే నినాదంతో రాజస్థాన్‌లో ప్రారంభమైంది.

ముఖ్యాంశాలు: 
* ఈ చట్టంలో 6 యూనిట్లు, 31 సెక్షన్లు, 2 షెడ్యూళ్లు ఉన్నాయి. పౌరులందరికీ సమాచార హక్కు ఉంది.
* పౌరులు అడిగిన సమాచారం ఇవ్వడానికి గడువు 30 రోజులు. అయితే జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, జీవన్మరణ సమస్యకు సంబంధించిన సమాచారం అయితే 48 గంటల్లోగా (2 రోజులు) ఇవ్వాలి.
* అడిగిన సమాచారం దేశ భద్రత, దేశ - రాష్ట్ర వ్యాపార పరమైన రహస్యాలు, వాణిజ్య ఒప్పందాలకు చెందిందైతే ఇవ్వాల్సిన అవసరం లేదని సెక్షన్‌ 8 తెలియజేస్తుంది.
* సెక్షన్‌ 24 ప్రకారం గూఢచార, భద్రత సంస్థలకు మినహాయింపులు ఉన్నాయి. 
* ఈ చట్టం ప్రకారం అడిగిన సమాచారాన్ని అధికారులు ఇవ్వకపోతే దానికి తగిన కారణం లేకపోతే రోజుకు రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.25 వేల వరకు జరిమానా విధించే అధికారం కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషనర్లకు ఉంటుంది.

Posted Date : 27-08-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు