• facebook
  • whatsapp
  • telegram

వ్యాస బోధన

సృజనాత్మకతను పెంపొందించే విస్తృత రచన!

ఏదైనా విషయాన్ని లేదా అంశాన్ని       వివరంగా, విస్తరించి రాస్తే అదే వ్యాసం. తెలుగు సాహిత్యంలో వ్యాసానికి ప్రముఖ స్థానం ఉంది.  రచయిత జ్ఞానానికి,     సృజనకు, ఆలోచనా శక్తికి వ్యాసరచన అద్దం పడుతుంది. రచనా పాటవం, భాషా జ్ఞానాన్ని పెంపొందించే ఈ సాహితీ    ప్రక్రియను ప్రాథమిక, ఉన్నతస్థాయి  విద్యార్థులకు తప్పకుండా అలవాటు చేయాలి. అందుకోసం అనుసరించాల్సిన పద్ధతులపై కాబోయే ఉపాధ్యాయులకు అవగాహన ఉండాలి. వ్యాసం లక్షణాలు, ఉపయోగాలు, ఉద్దేశాలతోపాటు తెలుగు సాహిత్యంలో వ్యాసానికి ఉన్న చరిత్ర, పరిచయం చేసిన రచయితలు, వారి కృషి గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.

ఆంగ్ల సాహిత్య ప్రభావంతో తెలుగులో వెలసిన ప్రక్రియ ‘వ్యాసం’. ఏదైనా ఒక అంశం గురించి విరివిగా రాయడమే వ్యాసమని శబ్దరత్నాకరం నిర్వచించింది. ఆంధ్ర వాచస్పత్యం ప్రకారం వ్యాసం అంటే చారిత్రకాంశం. ప్రాచీన సాహిత్యంలో తొలి వ్యాసం ( మాన్‌టైన్ ) ఫ్రెంచ్‌ భాషలో వెలువడింది. ప్రపంచ సాహిత్యంలో రెండోదిగా భావించే ‘మై సెల్ఫ్‌’ అనే వ్యాసాన్ని బేకన్‌ రచించారు. బేకన్‌ వ్యాసాలను కిళాంబి రామానుజాచార్యులు తెలుగులోకి అనువదించారు. తెలుగులో వ్యాస ప్రక్రియకు మార్గదర్శకుడు సామినేని ముద్దు నరసింహనాయుడు. వ్యాసాన్ని పరవస్తు వెంకట రంగాచార్యులు సంగ్రహాలుగా పిలవగా, కందుకూరి వీరేశలింగం ‘ఉపన్యాసాలు’ అన్నారు. గురజాడ అప్పారావు 1910లో వ్యాసచంద్రిక రాశారు. ఇందులో వ్యాసం అనే పదం ఉపయోగించారు.  ‘‘కవికి గీటురాయి గద్యం అయితే, గద్యానికి గీటురాయి వ్యాసం’’ అని ఆచార్య రామచంద్ర శుక్లా పేర్కొన్నారు.


వ్యాసం లక్షణాలు

 అతిదీర్ఘంగా ఉండకూడదు.

 స్వల్పకాలంలో చదివేలా ఉండాలి.

 రచనను అర్థవంతమైన పేరాలుగా విభజించాలి.

 మొదటి పేరా అంశాన్ని పరిచయం చేసేదిగా, చివరి పేరా ముగింపుగా ఉండాలి.

 కఠిన సమాస పదాలు, వర్ణనలు ఉండకూడదు.

రచయిత తన సైద్ధాంతిక బలాలను పాఠకులపై ప్రయోగించకూడదు.

రచయిత ఆత్మీయతను ఇముడ్చుకున్నదై ఉండాలి.

వ్యాసరచన ఉద్దేశాలు

సృజనాత్మక శక్తిని పెంపొందించడం.

విషయజ్ఞానాన్ని పెంపొందించడం.

రచనను పరిచ్ఛేదాలుగా విభజించడం.

విమర్శనాత్మక ధోరణిలో రాయడం.

భావానుక్రమపద్ధతి పాటించగలగడం.

సొంత శైలిలో స్వతంత్రంగా రాయడం, నేర్పించడం.

వ్యాసబోధన పద్ధతులు

అనుకరణ పద్ధతి

ఉపాధ్యాయుడు మొదట వ్యాసంపై కొన్ని వాక్యాలు  విద్యార్థులతో రాయించి దాన్ని పోలిన మరో అంశంపై మొదటిదాన్ని అనుసరిస్తూ రాయమని ప్రోత్సహించడం. ప్రప్రథమంగా విద్యార్థుల్లో రచనా పాటవాన్ని పెంపొందించడానికి ఈ పద్ధతి వాడొచ్చు. ఈ అనుకరణం ద్వారానే భాషను నేర్చుకుంటారు. ఉదా: బీ ఆవు అంశంపై మొదట పది వాక్యాలు రాయించి, దాన్ని అనుకరిస్తూ ‘గేదె’ అనే అంశంపై వ్యాసం రాయమని కోరవచ్చు.

అనుకరిస్తూ వ్యాసం రాస్తున్నప్పుడు ఆయా వాక్యాల్లో చిన్న మార్పులు చేసి రాయమని విద్యార్థులను కోరాలి. ఈ పద్ధతి ప్రాథమిక, ప్రాథమికోన్నత     తరగతులకు అనుకూలం.

అభివర్ణన పద్ధతి

ఏదైనా ఒక చిత్రాన్ని లేదా దృశ్యాన్ని విద్యార్థులకు చూపించి దాని గురించి రాయమని కోరడం అభివర్ణన పద్ధతి. విద్యార్థులకు తెలిసిన, వారికి అర్థమయ్యే అంశాలపై చిత్రాలు ప్రదర్శించి, అందులో ఎవరికి తోచిన విధంగా వారు ఊహించి క్రమబద్ధంగా రాయించడానికి ఈ పద్ధతి చక్కగా ఉపకరిస్తుంది.

 గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గ్రామాల్లోని పంట పొలాలు, మేఘావృతమైన ఆకాశం, మేత మేస్తున్న పశువులు, ఆకాశంలో విహరిస్తున్న పక్షులు మొదలైన అంశాలకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించి వాటిని ఊహిస్తూ రాయమని కోరాలి. పట్ణణ ప్రాంత విద్యార్థులకు రోడ్డుపై మోటార్లు, కార్లు, సైకిళ్లు వెళ్తున్న దృశ్యాలు, గాలిపటాలు ఎగురవేస్తున్న బాలలు, పార్కుల్లో ఆటలాడుకుంటున్న బాలబాలికలు లాంటి అంశాల చిత్రాలను చూపిస్తూ, వాటికి విద్యార్థుల ఊహాశక్తి జోడిస్తూ క్రమబద్ధంగా రాయమని కోరాలి.

చర్చా పద్ధతి

వ్యాస రచనాంశాన్ని మొదట ప్రస్తావించి, విద్యార్థులతో ఆ విషయంపై ప్రశ్నోత్తరాల రూపంలో కూలంకషంగా   చర్చించాలి. అందులోని ప్రధానాంశాలను నల్లబల్లపై ముఖ్యమైన పదాల రూపంలో రాసి, ఆ పదాల ఆధారంగా వ్యాసం రాయాలని విద్యార్థులను కోరాలి. ఈ పద్ధతి ఉన్నత తరగతులకు ఉపకరిస్తుంది.

ప్రయత్న పద్ధతి

విద్యార్థులతో వారికి అభిరుచి ఉన్న అంశాన్ని ఎంపిక  చేసుకోమని చెప్పి, అలాంటి అంశంపై వ్యాసాన్ని రాయమని కోరాలి. వ్యాసాన్ని రాస్తున్నప్పుడు ఏవైనా సూచనలు ఇస్తూ వ్యాసాన్ని పూర్తిగా రాయించాలి. ఉన్నత తరగతి విద్యార్థులకు ఈ పద్ధతి ఉపయోగకరం.

ప్రకల్పనా పద్ధతి

పాఠశాలలో విద్యార్థులు నిర్వహించిన ప్రకల్పన ఆధారంగా విషయాన్ని వర్గీకరించి, వివరించి క్రమబద్ధంగా రాయమని కోరడం. ఇది ఉన్నత దశ విద్యార్థులకు ఉపకరిస్తుంది.

ప్రశంసా పద్ధతి

ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్య విషయ రచయిత, కవి, పాఠ్యాంశంలోని పాత్రలను దృష్టిలో ఉంచుకుని వాటిని ప్రశంసిస్తూ వ్యాసం రాయమని విద్యార్థులను కోరడం ఈ పద్ధతికి చెందిన విధం. ఇది కూడా ఉన్నత స్థాయి   విద్యార్థులతో రాయించడానికి ఉపయోగించే పద్ధతి.

ఆలోచనాత్మక పద్ధతి

విద్యార్థులు తమ స్వీయ అభిప్రాయాలను ఇతరుల   అభిప్రాయాలతో సమన్వయిస్తూ రాయడం. ఏదైనా అంశాన్ని విమర్శనాత్మకంగా ఆలోచించి రాయగలగడం ఈ పద్ధతి ప్రత్యేకత.

అభ్యాస ప్రశ్నలు

1. వ్యాస రచనను ఏ తరగతిలో ప్రారంభించాలి?

1) 3వ   2) 4వ   3) 5వ    4) 8వ

2. ‘ఆవు’ అనే అంశంపై వ్యాసం రాయించాక, ‘గేదె’ అనే అంశంపై వ్యాసం రాయించడంలో ఇమిడి ఉన్న పద్ధతి?

1) అభివర్ణన పద్ధతి      2) ప్రశ్నోత్తర పద్ధతి 

3) ప్రయత్న పద్ధతి      4) అనుకరణ పద్ధతి


3. సామినేని ముద్దు నరసింహనాయుడు రాసిన ‘హితసూచని’ గ్రంథం ప్రచురితమైన సంవత్సరం?

1) 1654  2) 1853   3) 1874  4) 1896


4. పరవస్తు వెంకట రంగాచార్యులు వ్యాసాల పేరు... 

1) ప్రమేయాలు      2) ఉపన్యాసాలు 

3) సంగ్రహాలు       4) ప్రసంగాలు


5. ‘కత్తి గొప్పా - కలం గొప్పా’ అనేది ఏ కోవకు చెందిన వ్యాసం?

1) విమర్శనాత్మక వ్యాసం     2) సంవాదాత్మక వ్యాసం 

3) వర్ణనాత్మక వ్యాసం          4) కథానాత్మక వ్యాసం

6. 9, 10 తరగతుల్లో వ్యాసరచన బోధించడానికి ఏ పద్ధతి అనుసరణీయం?

1) ప్రశ్నోత్తర పద్ధతి     2) అనుకరణ పద్ధతి 

3) చర్చా పద్ధతి          4) ప్రయత్న పద్ధతి 


7. విద్యార్థుల ఊహాశక్తులను క్రమబద్ధం చేయడానికి దోహదపడే పద్ధతి?

1) అభివర్ణన పద్ధతి     2) అనుకరణ పద్ధతి 

3) ప్రశ్నోత్తర పద్ధతి     4) చర్చా పద్ధతి


8. 6, 7, 8 తరగతుల్లో వ్యాసబోధనా పద్ధతి-    

1) ప్రశ్నోత్తర          2) అనుకరణ 

3) చర్చా               4) ఆలోచనాత్మక


9. ‘ఏ విషయానైన్నా తీసుకుని దానిలోని అంశాలను విభజించి, వివరించి చెప్పడమే వ్యాసం.’ అని  నిర్వచించింది?

1) శబ్దరత్నాకరం              2)ఆంధ్ర శబ్ద రత్నాకరం 

3) విద్యార్థి కల్పతరువు     4) విజ్ఞాన సర్పస్వం

10. సామినేని ముద్దు నరసింహ నాయుడిని తొలి  వ్యవహారిక భాషావాదిగా పేర్కొన్నది?

1) గిడుగు రామ్మూర్తి             2) శ్రీశ్రీ  

3) పింగళి లక్ష్మీకాంతం       4) కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి

11. వ్యాసాన్ని ఉపన్యాసం అన్నది ఎవరు?

1)కందుకూరి వీరేశలింగం    

2) గిడుగు రామ్మూర్తి

3) సామినేని ముద్దు నరసింహ నాయుడు 

4) పరవస్తు వెంకట రంగాచార్యులు

12. బేకన్‌ వ్యాసాలను తెలుగులోకి ‘బేకను వ్యాసములు’ పేరుతో అనువదించింది ఎవరు?

1) కొలకలూరి ఇనాక్‌                     2) పింగళి లక్ష్మీకాంతం 

3) కిళాంబి రామానుజాచార్యులు   4) శ్రీశ్రీ

13. వ్యాసబోధన ఉద్దేశం?

1) భాషాజ్ఞానం        2) సృజనాత్మకత  

3) రసానుభూతి      4) వాచిక చర్య

14. విద్యార్థుల్లో విశ్లేషణా శక్తిని, సద్విమర్శను   పెంపొందించేందుకు దోహదపడే పద్ధతి?

1) అభివర్ణన      2) ప్రయత్న  

3) సన్నివేశ       4) ఆలోచనాత్మక

15. ‘అభ్యుదయ యుగకర్త శ్రీశ్రీ’ అనేది ఏ కోవకు చెందిన వ్యాసం?

1) రాజకీయ        2) సాహిత్య  

3) వర్ణనాత్మక      4) విమర్శనాత్మక

16. తెలుగులో వ్యాస ప్రక్రియకు మార్గదర్శకుడు?

1) చిలకమర్తి లక్ష్మీనరసింహం 

2) పానుగంటి లక్ష్మీ నరసింహారావు 

3) సామినేని ముద్దు నరసింహం 

4) కందుకూరి వీరేశలింగం

17. వ్యాసం అనే పదాన్ని మొదటి వాడినవారు?

1) గురజాడ అప్పారావు     2) గిడుగు రామ్మూర్తి 

3) శ్రీశ్రీ                             4) సామినేని ముద్దు నరసింహం

18. వ్యాసం అంటే?

1) విషయం      2) రసానుభూతి 

3) విభాగం        4) అంతర్భాగం

19. ‘నేనే ముఖ్యమంత్రినైతే’ఏ కోవకు చెందిన వ్యాసం?

1)ఊహాత్మక వ్యాసం     2) సాహిత్య వ్యాసం 

3) వైజ్ఞానిక వ్యాసం      4) ధార్మిక వ్యాసం

20. ‘రుద్రమదేవి పరాక్రమం’ ఏ కోవకు చెందిన వ్యాసం?

1) రాజకీయ వ్యాసం        2) చారిత్రక వ్యాసం 

3) వర్ణనాత్మక వ్యాసం     4) ధార్మిక వ్యాసం

21. ప్రపంచంలో మొదటిసారిగా 1571లో వచన    రచనకు న్చి((్వ అని పేరు పెట్టినవారు?

1) మాంటేన్‌ - ఫ్రెంచ్‌       

2) జార్జ్‌వెంకర్‌ - జర్మనీ

3) వేదవ్యాసుడు-సంస్కృతం

4) మైఖేల్‌ బ్రెయిల్‌-ఫ్రెంచ్‌

22. కిందివాటిలో వ్యాస రచయితలు వాడిన పదాల్లో సరికాని దాన్ని గుర్తించండి.

1) స్వామినేని ముద్దు నరసింహం - ప్రమేయాలు

2) కందుకూరి వీరేశలింగం - వచనాలు

3) పరవస్తు వెంకట రంగాచార్యులు - సంగ్రహాలు

4) గురజాడ అప్పారావు - వ్యాసం

23. కిందివాటిలో సరికానిది?

1) తొలి వ్యాస రచయిత - గురజాడ అప్పారావు

2) తొలి వ్యాస రచయిత్రి - పోతం జానకమ్మ

3) తొలి సాహిత్య విమర్శ వ్యాస రచయిత - కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి

4) తెలుగు వ్యాసపరిణామం రచన - కొలకలూరి ఇనాక్‌

24. విద్యార్థులే స్వయంగా ఒక అంశాన్ని ఎంపిక  చేసుకుని, సమాచారాన్ని సేకరించే వ్యాసాలు ఏ పద్ధతికి చెందినవి?

1) అభివర్ణన పద్ధతి        2) సన్నివేశ పద్ధతి   

3) ప్రయత్న పద్ధతి        4) ఆలోచనాత్మక పద్ధతి

25. కిందివాటిలో సరికానిది?

1) కత్తి గొప్పదా? కలం గొప్పదా?-సంవాదాత్మక వ్యాసం

2) నేనే డాక్టరును అయితే - భావనాత్మక వ్యాసం

3) పంట పొలాలు, సంత - వర్ణనాత్మక వ్యాసం

4) నాకు నచ్చిన కవి - ప్రశంసాత్మక వ్యాసం


26. కింది వ్యాస లక్షణాల్లో సరికానిది?

1) ప్రారంభం, కొనసాగింపు, ముగింపు ఉండటం

2) ఉప శీర్షికలు, విరామ చిహ్నాలు పాటించడం

3) వర్ణనలు అధికంగా ఉండటం

4) వ్యాసానికి శీర్షిక ఉండటం


సమాధానాలు: 11; 24; 32; 43; 52; 64; 71; 83; 94; 101; 111; 123; 132; 144; 152; 163; 171; 183; 191; 202; 211; 222; 231; 243; 252; 263.


 

రచయిత: సూరె శ్రీనివాసులు


 


 

Posted Date : 24-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌