• facebook
  • whatsapp
  • telegram

 ఐరోపా

ఉనికి - విస్తీర్ణం:
* ఖండాలన్నింటిలో రెండో చిన్న ఖండం యూరప్.

* ఇది 1,01,80,000 చ.కి.మీ.లు విస్తరించి ఉంది.
* ప్రపంచ భూ విస్తీర్ణంలో ఇది 6.8 శాతం.
* ఈ ఖండపు జనాభా 731 మిలియన్లు. ప్రపంచ జనాభాలో ఇది 11 శాతం.
* యూరప్ 35- 72o ఉత్తర అక్షాంశ రేఖల మధ్య, 10o పశ్చిమ రేఖాంశం నుంచి 60o తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉంది.
* 0oల గ్రీనిచ్ రేఖాంశం ఈ ఖండంలోని లండన్ నగరం మీదుగా వెళ్తోంది.
* మధ్యధరా సముద్రం యూరప్‌ను ఆఫ్రికా నుంచి వేరు చేస్తుండగా, యూరల్ పర్వతాలు ఆసియా నుంచి ఈ ఖండాన్ని వేరు చేస్తున్నాయి.
* ఈ ఖండంలో సుమారు 50 దేశాలు ఉన్నాయి.
* విస్తీర్ణంలో రష్యా పెద్ద దేశం, వాటికన్ సిటీ చిన్నది.

 

సరిహద్దులు:
* ఉత్తరాన - ఆర్కిటిక్ మహాసముద్రం
* దక్షిణాన - మధ్యధరా సముద్రం
* తూర్పున - యూరల్ పర్వతాలు
* పశ్చిమాన - అట్లాంటిక్ మహాసముద్రం

 

ముఖ్యదేశాలు:
* యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, రష్యా, డెన్మార్క్, నార్వే, స్వీడన్, స్విట్జర్లాండ్ యూరప్‌లోని ప్రముఖ దేశాలు.

 

ఎత్తైన ప్రాంతం:
* ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్, కాకసస్ పర్వతాల్లో బ్లాంక్ శిఖరం (4,807 మీ.) ఎత్తైనది.

 

ముఖ్య నదులు:
* వోల్గా, డాన్యూబ్, రైన్, సెయిన్, గరోన్, పో.
* యూరప్‌లో పొడవైన నది వోల్గా.
* దాని తర్వాత స్థానంలో ఉన్న డాన్యూబ్ నది 2,960 కి.మీ. ఇది ఏడుదేశాల్లో ప్రవహిస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది.
* నైపర్, నీస్టర్, డాస్ నదులు - రష్యా; రైన్, ఎల్బ్, ఓడర్ - జర్మనీ; విస్టులా - పోలెండ్; సెయిన్, లోయిల్, గరోన్, రోన్ - ఫ్రాన్స్; థేమ్స్ - ఇంగ్లండ్; పో నది ఇటలీలో ఉన్నాయి.

దీవులు: గ్రేట్‌బిటన్, ఐర్లాండ్.
 

సహజ వనరులు:
* యూరప్‌లో దాదాపు అన్ని ఖనిజాలు లభిస్తున్నాయి. ప్రపంచంలో ఉత్పత్తయ్యే మొత్తం ఇనుప ఖనిజంలో 1/4వ వంతు ఈ ఖండంలోనిదే.
* ప్రపంచంలోని మొత్తం ముడిచమురు నిక్షేపాల్లో 16 శాతం రష్యాలో ఉన్నాయి.

 

ప్రత్యేకతలు:
* ఇటలీలోని వెసువియస్, సిసిలీలోని ఎట్నా అగ్నిపర్వతాలు.
* ఇస్తాంబుల్, ఏథెన్స్, రోమ్ ప్రాచీన నగరాలు.
* సూర్యరశ్మి, ప్రకృతి దృశ్యాలు, సముద్ర కలయిక, మధ్యధరా ప్రకృతిసిద్ధ మండలం.

 

భౌతిక స్వరూపం (భూస్వరూపాలు - నదులు):
* యూరప్‌ను స్థూలంగా మూడు రకాలుగా విభజించవచ్చు.
అవి: 1. ఉత్తర ఉన్నత, బాల్టిక్ షీల్డ్ ప్రాంతం
     2. మధ్య మైదాన ప్రాంతం
     3. దక్షిణ పర్వతాలు

* ఉత్తర ఉన్నత ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 1000 - 2000 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
* ఈ ఖండంలో పురాతన పర్వతాలు, పీఠభూములు ఉన్నాయి. ఇవి కెలడోనియా శిలతో ఏర్పడ్డాయి. అందుకే వీటిని కెలడోనియా పర్వతాలు అంటారు.
* ఇవి నార్వే, స్వీడన్, గ్రేట్‌బ్రిటన్ దేశాల్లో సముద్ర తీరానికి సమీపంలో ఉన్నాయి.
* తీర ప్రాంతాల్లో హిమానీ నదాల కోత వల్ల ఏర్పడిన పయోల్ట్‌లు అనే పొడవైన, ఇరుకైన, లోత్తైన లోయలు ఉన్నాయి.
* బాల్టిక్ సముద్రం చుట్టూ వ్యాపించి ఉన్న ప్రాంతమే బాల్టిక్ షీల్డ్ ప్రాంతం.
* ఇక్కడి శిలలు కెలడోనియా శిలల కంటే పురాతనమైనవి.
* యూరప్‌లో పశ్చిమాన ఉన్న మైదాన ప్రాంతాలను పశ్చిమ యూరప్ మైదానం, తూర్పున ఉన్న వాటిని 'రష్యా ప్లాట్ ఫాం' అని అంటారు.
* ఈ ఖండం పశ్చిమాన సన్నగా, తూర్పున వెడల్పుగా, స్వల్ప వాలుతో ఎగుడు, దిగుడుగా ఉంటుంది.
* అక్కడక్కడ ఈ మైదానాన్ని చిన్న కొండలు విభజిస్తున్నాయి.
* పోలెండ్, జర్మనీ, రష్యా దేశాల్లోని మైదానాల్లో ఉత్తర ప్రాంతం మంచుతో కప్పి ఉండటం వల్ల ఇవి వ్యవసాయానికి అంత అనుకూలంగా లేవు.
* జూరా, మాసివ్, వాస్‌జెస్ పర్వతాలు ఫ్రాన్స్‌లో, బ్లాక్ ఫారెస్ట్, యూరల్ పర్వతాలు జర్మనీలో, ఆల్పైన్ ముడత పర్వతాలు దక్షిణ యూరప్‌లో ఉన్నాయి.

* స్పెయిన్‌లో పైరనీస్, ఇటలీలో సియెరా నెవడా, ఆపనైస్ బాల్కన్ ద్వీపకల్పంలో దినారిక్ ఆల్ప్స్, రష్యాలో కాకసస్ పర్వతాలు ఉన్నాయి.
* పైరనీస్ పర్వతాలు ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల మధ్య సహజ సరిహద్దులుగా ఏర్పడ్డాయి.
* స్కాండినేవియా ద్వీపకల్పం చుట్టూ ఏర్పడినవే స్కాండినేవియా పర్వతాలు.
* యూరప్‌లోని ఆల్ప్స్ పర్వతాలు చాలా నదులకు ఆధారం.
* నదులను ఒకదాంతో ఒకటి కాలువల ద్వారా అనుసంధానించడం వల్ల ఇవి జలరవాణాకు అనుకూలంగా ఉన్నాయి.

 

శీతోష్ణస్థితి:
* ఒక ప్రదేశం శీతోష్ణస్థితి అంటే అక్కడ ఉండే వర్షపాతం, ఉష్ణోగ్రత, ఆర్ద్రత, అనార్ద్రతలను బట్టి సరాసరిగా చెప్పవచ్చు.
* యూరప్ ఖండం ఉత్తర సమశీతోష్ణ మండలంలో ఉంది.
* దక్షిణ యూరప్, మధ్యధరా సముద్రతీర ప్రాంత శీతోష్ణస్థితిలో ప్రత్యేకతలు ఉన్నాయి.
* అట్లాంటిక్ మహాసముద్ర అగాధ ప్రవాహాలు యూరప్ శీతోష్ణస్థితిపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. ఇవి అధిక ఉష్ణోగ్రతకు కారణమవుతున్నాయి.
* ఇవి యూరప్ తీర ప్రాంతాలకు వేడి సముద్ర ప్రవాహాలను తీసుకెళ్తూ, పశ్చిమ పవనాలను వేడెక్కిస్తూ అట్లాంటిక్ మహాసముద్రం నుంచి యూరప్ అంతటా వీచేందుకు కారణమవుతున్నాయి.

* మధ్యధరా సముద్ర ప్రభావ ప్రాంతాల్లో జనవరి నెలలో చలి ఎక్కువగా ఉండి వేసవికాలం పొడిగాలులు వీస్తాయి.
ఈ ప్రాంతంలో శీతకాలంలో వర్షం సంభవిస్తుంది. సుమారు 80 - 130 సెం.మీ. వర్షపాతం ఉంటుంది. వేసవిలో వర్షం ఉండదు.

* జనవరిలో సగటు ఉష్ణోగ్రత 8ºo - 12ºo సెంటిగ్రేడు, జులైలో 22ºo - 24ºo సెంటిగ్రేడు ఉంటుంది.
* అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడే తుపానుల వల్ల పశ్చిమ యూరప్‌లో అధిక వర్షపాతం నమోదవుతుంది.
* పోర్చుగల్ నుంచి నార్వే వరకు సముద్ర ప్రభావ శీతోష్ణస్థితి ఉంటుంది.
* ఈ ప్రాంత వార్షిక వర్షపాతం 120 - 150 సెం.మీ. ఉన్నప్పటికీ అధిక ఉష్ణోగ్రతల వల్ల మార్పులకు లోనవుతుంది.
* యూరప్ తూర్పు భాగంలో ఖండాతర్గత శీతోష్ణస్థితి ఉంది.
* ఇక్కడ సంవత్సర కాలంలో 60 - 100 సెం.మీ. వర్షపాతం నమోదవుతుంది.
* జనవరిలో 5ºo - 10ºo సెం.గ్రే., జులైలో 15ºo - 18ºo సెం.గ్రే. ఉష్ణోగ్రతలు ఉంటాయి.
* ఉన్నత అక్షాంశాల్లోని ఆల్ప్స్, పైరనీస్, కాకసస్ పర్వతాల్లో పర్వతీయ వర్షపాతం ఉంటుంది.

సహజ వృక్షజాతులు - వన్యజీవులు

సహజ వృక్షజాలం:
* యూరప్ ఖండంలో ఒకప్పుడు 80 - 90 శాతం భూభాగం అడవులతో కప్పి ఉండేది. ప్రస్తుతం చెట్ల నరికివేత వల్ల అడవులు అంతరించి పోతున్నాయి.
* మధ్యధరా సముద్రం నుంచి ఆర్కిటిక్ మహాసముద్రం వరకు సహజ వృక్షజాలం వ్యాపించి ఉంది.
* ఇప్పటికీ 1/4వ వంతు భూభాగంలో సహజ వృక్షసంపద ఉంది.
* అతిపెద్ద శృంగాకార అరణ్య మేఖలైన 'టైగా'లు స్కాండినేవియా మెట్ట ప్రాంతాల నుంచి స్వీడన్, ఫిన్‌లాండ్, రష్యా మీదుగా తూర్పున పసిఫిక్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్నాయి.
* స్ఫూస్, లార్డ్, ఫర్, బిర్చ్ లాంటి వృక్ష జాతులు ఇక్కడ పెరుగుతాయి.
* స్టెప్పీలు ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతం నుంచి కాస్పియన్ సముద్రం మధ్య ప్రాంతంలో, స్పెయిన్ స్పానిష్ మెసెటాల్లో ఉన్నాయి.
* మధ్యధరా శీతోష్ణస్థితిలోని అడవులు యూరప్‌లోని పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, మొనాకో, ఇటలీ, క్రోయెషియా, యుగోస్లేవియా, అల్బేనియా, గ్రీస్, ఉక్రెయిన్ వరకు ఉన్నాయి. వీటిలో ఆలివ్ వృక్షాలు పెరుగుతాయి.

* కార్క్, ఓక్ వృక్షాలు పశ్చిమ మధ్యధరా ప్రాంతంలో ఉన్నాయి.
* ఫిన్‌లాండ్‌లో అత్యధికంగా 77 శాతం భూవిస్తీర్ణంలో సహజ వృక్షాలు ఉండగా, ఐస్‌లాండ్‌లో కేవలం ఒక శాతం మాత్రమే అటవీ ప్రాంతం ఉంది.

 

వన్యజీవులు:
 యూరప్‌లో తోడేళ్లు, ఎలుగుబంట్లు ప్రధానంగా కన్పించే జంతువులు.

 గుంటనక్క, అడవి పిల్లి, నక్కలు, తోడేళ్లు, శివంగి లాంటి క్రూర మృగాలు కుందేళ్లు, జింకల లాంటి ఇతర జంతువులు ఉన్నాయి.
 ధృవ ప్రాంతాల్లో ధృవపు ఎలుగుబంట్లు, ధృవపు జింకలు, ధృవపు నక్కలు, లెమ్మింగ్‌లు ఉన్నాయి.
 గుంటనక్కలు, మింగ్ మృగాలను ఆర్కిటిక్ ప్రాంతాల్లోని ఫర్ క్షేత్రాల్లో పెంచుతున్నారు.
 యురేషియాలో ధృవపు జింకలను రవాణాకు ఉపయోగిస్తున్నారు.

ధృవ ప్రాంతాలు:
* ఉత్తర, దక్షిణ ధృవాల చుట్టూ ఉండే ప్రాంతాలు అతిశీతలంగా ఉంటాయి.  అందుకే ఇక్కడ శీతకాలంలో సూర్యుడు కనిపించడు. వసంతకాలంలో ఉదయిస్తాడు.

* ధృవాల దగ్గర 6 నెలలు చీకటి, 6 నెలలు పగలు ఉంటుంది.
* అమెరికా, యూరప్, ఆసియా భూభాగాల చుట్టూ ఆవరించి ఉన్న ఆర్కిటిక్ మహాసముద్ర ప్రాంతాల పరిస్థితి ఇది.
* ఇక్కడ వాల్‌రన్, సీల్ జంతువులు, ధృవపు ఎలుగుబంట్లు ఉంటాయి.
* సదరన్ (అంటార్కిటికా) మహాసముద్రానికి అన్ని వైపుల ఆవరించి ఉన్న భూభాగమే అంటార్కిటికా ఖండం. ఇక్కడ లైకెన్, మాస్ కనిపిస్తాయి.
* ఇక్కడ సముద్రంలో సీల్, పెంగ్విన్‌లు ఉంటాయి. పెంగ్విన్‌లు సాధారణ పక్షులు. ఇవి ఎగరవు.
ఉదా: ఎంపరర్ పెంగ్విన్.
* ఎంపరర్ పెంగ్విన్ శీతకాలంలో విపరీతమైన చల్లదనంలో అతిఘనీభవించిన సముద్రం మీదనే గుడ్లు పెడుతుంది.

 

జనాభా విస్తరణ - ప్రధాన నగరాలు

* ప్రపంచం మొత్తం జనాభాలో 1/5వ వంతు యూరప్‌లో ఉంది.
* జనసాంద్రత సగటున చ.కి.మీ.కి 101. ఈ ఖండం పశ్చిమ ప్రాంతంలో - 162, దక్షిణ ప్రాంతంలో - 114, తూర్పు ప్రాంతంలో - 105, ఉత్తర ప్రాంతంలో - 14 మంది నివసిస్తున్నారు.

 

అత్యల్ప జనసాంద్రత:
* ఐస్‌లాండ్, ఉత్తర యూరప్‌లోని స్కాండినేవియా, ఉత్తర రష్యాలోని టండ్రా ప్రాంతాల్లో చ.కి.మీ.కి 10 కంటే తక్కువ మంది నివసిస్తారు. వేట, మత్స్య గ్రహణం ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తులు.

 

అల్పజనసాంద్రత:
* టైగా, ఎత్తైన ప్రాంతాలు, కాస్పియన్ సముద్రతీర ప్రాంతం, ఆగ్నేయ యూరప్‌లోని శుష్క ప్రాంతాల్లో జనసాంద్రత చ.కి.మీ.కి 10 నుంచి 50 ఉంటుంది.
* అనుకూలంగా లేని శీతోష్ణస్థితి, నిటారుగా ఉండే ప్రాంతాలు, నిస్సారమైన లోతు తక్కువ మృత్తికలు, జలాభావం లాంటి అనేక కారణాల వల్ల ఇక్కడ జనసాంద్రత తక్కువగా ఉంటుంది.
* ఉన్ని జంతువుల వేట, పశువులను మేపడం ఇక్కడి వారి ముఖ్యవృత్తులు.

 

అధిక జనసాంద్రత:
* ఇటలీ, ఫ్రాన్స్ నుంచి మాస్కో వరకు మధ్య మైదానాల్లో, నదీలోయ ప్రాంతాల్లో చ.కి.మీ.కి 50 నుంచి 100 మంది జనాభా నివసిస్తున్నారు. వ్యవసాయం, పశుపోషణ ఇక్కడి ముఖ్య వృత్తులు.

 

అత్యధిక జనసాంద్రత:
* బొగ్గు క్షేత్రాల వెంబడి జర్మనీ నుంచి జెకోస్లావకియా, పోలెండ్ మీదుగా ఉక్రెయిన్ వరకు, ఉత్తర ఇటలీలో లాంబార్డి మైదానంలోని రోమ్, జెనీవా, లిస్టెయిన్, వియన్నా, బెల్‌గ్రేడ్ లాంటి పెద్ద నగరాలు చ.కి.మీ.కి అత్యధికంగా 100 కంటే ఎక్కువ జనసాంద్రతను కలిగి ఉన్నాయి.
* దీనికి కారణం బొగ్గుక్షేత్రాలు, పారిశ్రామిక ప్రాంతాలు, ప్రధాన ఓడరేవు ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించడమే.
* ఇంగ్లండ్‌లో అత్యధిక ప్రాంతం, నెదర్లాండ్స్, రైన్ నదీ డెల్టా నుంచి స్విట్జర్లాండ్‌లోని బాసెల్ వరకు ఉన్న పారిశ్రామిక ప్రాంతం అత్యధిక జనసాంద్రతను కలిగి ఉంది.

 

పర్యటక ప్రాంతం:
యూరప్ ఖండంలో ఈ కింది దేశాలు ప్రపంచంలో వివిధ అన్వర్థ నామాలతో విరాజిల్లుతున్న గొప్ప పర్యటక ప్రాంతాలు
      

యూరప్ దేశాలు                 వాటి రాజధాని నగరాలు
ఆస్ట్రియా                     -      వియన్నా
బెల్జియం                    -       బ్రస్సెల్స్
బల్గేరియా                   -       సోఫియా
జెక్                         -       ప్రేగ్
డెన్మార్క్                    -      కోపెన్‌హెగన్
జర్మనీ                      -      బెర్లిన్
ఫిన్‌లాండ్                   -      హెల్సింకి
ఫ్రాన్స్                       -      పారిస్
గ్రీసు                        -      ఏథెన్స్
హంగరీ                     -      బుడాపెస్ట్
ఐర్లాండ్                     -      డబ్లిన్
ఇటలీ                       -       రోమ్
నెదర్లాండ్స్                   -      ది హేగ్
నార్వే                        -      అస్లో
పోలాండ్                    -      వార్సా
పోర్చుగల్                   -      లిస్బెయిన్
స్పెయిన్                     -      మాడ్రిడ్
స్వీడన్ స్టాక్                  -      హోమ్
స్విట్జర్లాండ్                   -       బెర్న్
యునైటెడ్ కింగ్‌డమ్           -       లండన్
యుగోస్లేవియా                -      బెల్‌గ్రేడ్

* ఫ్రాన్స్, ఇటలీ దేశాల సన్నని తీరమైదానాలు, పూర్వపు యుగోస్లేవియాకు చెందిన డాల్మిషియా తీరం, క్రిమియాలను యూరప్ ఖండ క్రీడా ప్రాంగణాలు అంటారు.
* ఫ్రాన్స్ తీరంలోని చిన్న దేశం మొనాకో 'కాసినో'లకు ప్రసిద్ధి చెందింది.
* శీతకాలంలో వెచ్చని శీతోష్ణస్థితి, మనోహరమైన సముద్రతీరాలు, అభివృద్ధి చెందిన మౌలిక సౌకర్యాలు, సొగసైన దృశ్యాలు యాత్రికులను ఆకర్షిస్తూ విదేశీ ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నాయి.
* మధ్యధరా ప్రకృతి సిద్ధ మండలంలో ఇస్తాంబుల్, ఏథెన్స్, రోమ్‌లాంటి ప్రాచీన నగరాలు ఉన్నాయి.
* ఇస్తాంబుల్, ఏథెన్స్, నేపుల్స్, రోమ్, జెనీవాలు, ప్లావెన్స్ తీర ప్రాంతపు ముఖ్య విహారయాత్ర స్థలాలు.

 

వ్యవసాయం
* యూరప్‌లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన వ్యవసాయం, పశుపోషణ ముఖ్యమైన ఆర్థిక కార్యక్రమంగా చెప్పవచ్చు.
* ఇక్కడి భూభాగంలో 30 శాతం వ్యవసాయానికి యోగ్యమైన జలవనరులు, మృత్తికలను కలిగి ఉంది.
* ఇక్కడ ఎక్కువగా మిశ్రమ వ్యవసాయాన్ని చేస్తారు. ఇది ఇంగ్లండ్, ఇతర యూరప్ దేశాల్లో పురాతన కాలం నుంచి అమల్లో ఉంది.
* దక్షిణ, పశ్చిమ యూరప్‌లోని ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, యుగోస్లేవియా, పోలెండ్, యునైటెడ్ కింగ్‌డం, హంగరీ దేశాలు గోధుమను విస్తృతంగా పండిస్తున్నాయి.
* మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతం గోధుమ పంటకు అనుకూలమైంది.

* రష్యా, రుమేనియా, యుగోస్లేవియా, హంగరీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాల్లో, ఈశాన్య పశ్చిమ నల్లసముద్రం, కాస్పియన్ సముద్ర తూర్పు తీర ప్రాంతాల్లో మొక్కజొన్నను అధికంగా పండిస్తున్నారు.
* రై ధాన్యం ప్రధానంగా శీతల శీతోష్ణ ప్రాంత పంట. దీన్ని రొట్టెలు, మద్యం తయారీలో ఉపయోగిస్తారు.
* ప్రపంచం మొత్తంలో 91 శాతం 'రై' ఇక్కడే ఉత్పత్తి అవుతోంది.
* పోలెండ్, రష్యా, ఉక్రెయిన్, కజికిస్థాన్, జర్మనీలు ఈ పంటలను అధికంగా పండిస్తున్నాయి.
* యూరప్ దేశాల్లో ప్రధానంగా పండించే పంట బార్లీ. మొత్తం బార్లీ ఉత్పత్తిలో సుమారు 42 శాతం ఇక్కడే పండిస్తున్నారు.
* రష్యా, యూకే, ఫ్రాన్స్, డెన్మార్క్, జర్మనీ, పోలెండ్, స్పెయిన్ దేశాలు బార్లీని అధికంగా పండిస్తున్నాయి.
* మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతం ఆలివ్ నూనె ఉత్పత్తికి అనుకూలమైంది. దీన్ని ఆహార పదార్థాల్లో, సబ్బుల తయారీలో, నూలు, వస్త్ర పరిశ్రమల్లో వినియోగిస్తారు.
* ఆలివ్ నూనెను స్పెయిన్, ఇటలీ, గ్రీస్, ఫ్రాన్స్, పోర్చుగల్ దేశాలు ప్రధానంగా ఉత్పత్తి చేస్తున్నాయి.
* బల్గేరియా, గ్రీసు, ఇటలీ, పోలెండ్ దేశాలు పొగాకును ప్రధానంగా పండిస్తున్నాయి.
* ఉన్నత అక్షాంశాల్లో పండించే పంట ఓట్స్. దీనికి శీతల వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వీటిని యూరప్‌లోని రష్యా, పోలెండ్, ఫ్రాన్స్, స్వీడన్, జర్మనీ, యూకేలలో ప్రధానంగా పండిస్తున్నారు.
* మధ్యధరా శీతోష్ణస్థితి పండ్ల తోటలకు అనుకూలం. ఈ ప్రాంతాల్లో ఆపిల్, పియర్, పీచెస్, ద్రాక్ష, నారింజ, ప్లేమ్ తోటలను సాగు చేస్తున్నారు.

* యూరప్ ప్రజల ముఖ్య వృత్తి పశుపోషణ. వీరు పాలు, మాంసం, గుడ్లు, ఉన్ని జంతువులు, కోళ్లను పెంచుతారు.
* స్పెయిన్‌లో మేలిరకం ఉన్నిని ఇచ్చే గొర్రెలను పెంచుతారు.
* డెన్మార్క్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ దేశాల్లో వెన్న, జున్నును వాణిజ్యపరంగా తయారుచేస్తారు.
* పశ్చిమ, దక్షిణ యూరప్‌లోని పర్వత, కొండ ప్రాంతాలు, పచ్చిక బయళ్లలో ఉన్ని, మాంసం కోసం గొర్రెలను పెంచుతారు.
* అట్లాంటిక్ మహాసముద్ర తీర ప్రాంతాలు చేపలు పట్టడానికి అనుకూలం.
* చేపలు పట్టడం బ్రిటన్, నార్వే, ఐస్‌లాండ్ దేశాల ప్రజల ముఖ్య కార్యకలాపం.

 

ఖనిజాలు - పరిశ్రమలు
* ఒక దేశ ఆర్థికాభివృద్ధి ఆ దేశంలో ఖనిజాల లభ్యతపై ఆధారపడి ఉంటుంది.

* పరిశ్రమలకు ఇనుప ఖనిజం ముఖ్యమైన ముడిపదార్థం. ప్రపంచం మొత్తం ఉత్పత్తిలో 1/4వ వంతు యూరప్‌లోనే ఉత్పత్తి అవుతుంది.
* ఇది ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, స్లోవాకియా, డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్, గ్రీస్, స్పెయిన్, స్వీడన్ దేశాల్లో లభిస్తుంది.
* రాగి ఖనిజం ఆస్ట్రియా, స్లోవాకియా, జర్మనీ, గ్రీస్, పోలెండ్, పోర్చుగల్, రొమేనియా, స్పెయిన్, స్వీడన్ దేశాల్లో ప్రధానంగా దొరుకుతుంది.

* గ్రేట్‌బ్రిటన్, జర్మనీలోని రూర్ లోయ, ఫ్రాన్స్ - బెల్జియంల సరిహద్దు, పోలెండ్‌లోని నైవెలియా, రష్యాలోని యూరల్, ఉక్రెయిన్ ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి.
* పోలెండ్, ఇటలీ, స్వీడన్, స్పెయిన్ దేశాల్లో జింకు ఖనిజం ఎక్కువగా లభ్యమవుతుంది.
* ఉప్పును రసాయన పరిశ్రమల ముడిపదార్థంగా, మత్స్య, మాంసాలను నిల్వ చేయడంలో వినియోగిస్తారు.
* యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్‌లోని లొరైన్, జర్మనీ, పోలెండ్, స్పెయిన్, ఇటలీ, రష్యాల్లో ఉప్పు సేద్యం చేస్తున్నారు.
* పెట్రోలియం శక్తిదాయక వనరు. ప్రపంచంలోని ముడిచమురు నిక్షేపాల్లో 16శాతం రష్యాలో ఉన్నాయి.
* డెన్మార్క్, ఫ్రాన్స్, గ్రీస్, హంగరీ, ఇటలీ, నెదర్లాండ్స్, పోలెండ్, రొమేనియా, యూకే, యుగోస్లేవియా దేశాల్లో చమురు, సహజవాయువు నిక్షేపాలు ఉన్నాయి.
* బ్రిటన్, నెదర్లాండ్స్ దేశాల్లో చమురును సముద్ర గర్భం నుంచి గొట్టాల ద్వారా వెలికి తీస్తున్నారు.
* అల్యూమినియం తయారీలో ఉపయోగపడే బాక్సైట్ రష్యా, యుగోస్లేవియా, ఫ్రాన్స్, గ్రీస్, హంగరీ, రొమేనియా దేశాల్లో లభ్యమవుతుంది.
* ప్రపంచంలో పాదరసాన్ని ఉత్పత్తి చేసే ప్రధాన దేశం ఇటలీ.

* విగ్రహాల తయారీలో ఉపయోగించే కరారా పాలరాయి ఉత్పత్తిలో ఇటలీ ప్రపంచ ప్రసిద్ధిగాంచింది.
* పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో విస్తృతంగా ఉపయోగించే గంధకం ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, రష్యా దేశాల్లో అధికంగా లభ్యమవుతుంది.
* జర్మనీలోని రూర్‌లోయ పారిశ్రామిక ప్రాంతాల్లో అత్యంత ముఖ్యమైంది. ఇక్కడ 12కు పైగా పారిశ్రామిక నగరాలు ఉన్నాయి.
* పరిశ్రమల్లో ఉపయోగించే ముడిపదార్థమైన ఇనుప ఖనిజాన్ని ఫ్రాన్స్‌లోని లొరైన్ క్షేత్రం నుంచి రవాణా చేస్తారు.
* స్వీడన్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌లలో ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రిక్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి.
* ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్, స్వీడన్, ఇటలీ దేశాల్లో ఆటోమొబైల్ పరిశ్రమలు ప్రధానంగా విస్తరించి ఉన్నాయి.
* విమాన, రసాయన పరిశ్రమలు యూరప్‌లోని ఇతర ముఖ్య పరిశ్రమలు.
* ఉత్తర యూరప్ దేశాల్లో బీరు, విస్కి, రమ్ లాంటి మత్తు పానీయాల తయారీ కేంద్రాలు ఉన్నాయి.
* ఫ్రాన్స్‌లోని బర్గండీ, షాంపెన్ ప్రాంతాలు ద్రాక్ష సారాయి తయారీకి ప్రధాన కేంద్రాలు.
* మధ్యధరా శీతోష్ణస్థితి ఉన్న అన్ని దేశాల్లో పండ్లని శుభ్రపరిచి నిల్వ చేసే పరిశ్రమలు ఉన్నాయి.
* వస్త్ర, పంచదార పరిశ్రమలు యూరప్‌లోని చాలా దేశాల్లో విస్తరించి ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు - వాణిజ్యం

రోడ్డు రవాణా:
* పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందడం వల్ల యూరోపియన్ దేశాల్లో రోడ్డు మార్గాలు అధికంగా ఉన్నాయి.

* రోడ్డు మార్గాల అభివృద్ధిలో యూరప్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది.
* 2 మిలియన్ కి.మీ. పొడవైన రోడ్డు మార్గాలతో ఫ్రాన్స్ ప్రథమ స్థానంలో ఉంది.
* ప్రపంచంలో అత్యధిక రోడ్డు సాంద్రత నెదర్లాండ్స్‌లో ఉంది.
* బ్రిటన్‌లో లండన్ నుంచి లిడ్స్, డోవర్, సౌత్‌వెల్ వరకు ఉన్న రోడ్లు ముఖ్యమైనవి.

 

రైల్వేలు:
* ఉత్తర సముద్రం చుట్టూ ఉన్న పశ్చిమ యూరప్ దేశాల్లో రైలు మార్గాలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి.
* యూరప్‌లోని తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్యకలాపాలు అధికంగా ఉన్నందువల్ల ఆ ప్రాంతాల్లో రైలు మార్గాలు అంతగా వృద్ధి చెందలేదు.

* ఫ్రాన్స్‌లోని పారిస్ నగరం ప్రముఖ రైల్వే కేంద్రంగా ప్రఖ్యాతి గాంచింది.
* ప్రపంచంలోని పొడవైన రైలు మార్గం 'ట్రాన్స్' సైబీరియాలో ఉంది. దీని పొడవు 10,000 కి.మీ. కంటే ఎక్కువ.

 

వాయు రవాణా:
* వాయువ్య యూరప్ నుంచి ప్రపంచంలోని చాలా ప్రాంతాలకు విమాన మార్గం ఉంది. లండన్, పారిస్, ఫ్రాంక్‌ఫర్ట్, రోమ్ నగరాల్లో ముఖ్యమైన విమానాశ్రయాలు ఉన్నాయి.
యూరప్ - ఆఫ్రికాల మధ్య వాయుమార్గాలు: లండన్/పారిస్/రోమ్ దార్ ఎస్ సలామ్, లాగోస్, ఆక్రా, జోహెనెస్‌బర్గ్, నైజీరియాలకు నేరుగా వాయు రవాణా ఉంది.
* జపాన్, రష్యాలకు యూరప్ నుంచి వాయు రవాణా నేరుగా ఉంది.
* మాస్కో - బీజింగ్, దిల్లీ, కాబుల్, లండన్, పారిస్, వార్సా, ప్రేగ్, బుడాపెస్ట్, సోఫియా, వియన్నా, స్టాక్‌హోమ్, బెర్లిన్, బుఖారెస్ట్ వరకు వాయురవాణా సౌకర్యం ఉంది.

 

జల రవాణా:
* దేశీయ, అంతర్జాతీయ జలరవాణా యూరప్‌లో బాగా అభివృద్ధి చెందింది.

* జర్మనీలోని రైన్ నది, ఫ్రాన్స్‌లోని సీన్‌రోన్, మధ్య యూరప్‌లోని డాన్యూబ్ నదులు స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, యుగోస్లేవియా, హంగరీ, బల్గేరియా, రొమేనియా దేశాల్లో ప్రవహిస్తూ ఆయా దేశాల మధ్య జలరవాణాకు ఉపయోగపడుతున్నాయి.
* యూరప్ తీరాన ఉన్న గ్లాస్గో, లివర్ ఫూల్, మాంచెస్టర్, సౌతాంప్టన్, లండన్, హాంబర్గ్, రోటర్‌డాం, ఆమ్‌స్టర్‌డాం, ఓస్లా, ఆబ్షర్, లిట్టెన్ రేవులు ముఖ్యమైనవి.

 

అంతర్జాతీయ వ్యాపారం:
* వివిధ దేశాల మధ్య వర్తకాన్ని అంతర్జాతీయ వ్యాపారం అంటారు.
* యూరప్ ఆహార పదార్థాలను, ముడిసరకులను దిగుమతి చేసుకొని పారిశ్రామిక ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది.
* ప్రపంచ వాణిజ్యంలో 35 శాతం పశ్చిమ యూరప్‌లోనే జరుగుతుంది.
* తూర్పు యూరప్ దేశాలు సంయుక్తంగా ఏర్పడి స్వయం సమృద్ధిని కోరుకోవడం వల్ల వాటి అంతర్జాతీయ వాణిజ్య పరిమాణం అతి స్వల్పంగా ఉంది.

 

యూరప్ దిగుమతి చేసుకుంటున్న ముడిసరకులు:
* యూరప్ గోధుమ, ధాన్యం, మాంసం, పాల ఉత్పత్తులు పారిశ్రామిక ముడిపదార్థాలు, రబ్బరు, ఉన్ని, పత్తి, జనుము, లోహఖనిజాలు, ఫాస్ఫేట్లు, ఎరువులు, అరటి, నారింజ, ఎండుపండ్లు, కోకో, కాఫీ, తేయాకును ఉత్తర, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా నుంచి దిగుమతి చేసుకుంటుంది.

 

యూరప్ ఎగుమతి చేస్తున్న ముడి సరకులు:
* పెట్రోలియం, పాల ఉత్పత్తులు, ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ పరికరాలు, వస్త్రాలు, యంత్రాలు, దారం, కర్రగుజ్జు, కాగితం, న్యూస్‌ప్రింట్, గడియారాలు, ద్రాక్ష, ఆలివ్‌నూనె, సారాయి, ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికాకు ఎగుమతి అవుతుంది.

 

కీలకమైన పదాలు - వివరణ
నిహారిక:
అతివేగంగా ప్రయాణిస్తూ వేడి వాయువులతో కూడిన పెద్ద వాయుమండలం.

సౌరకుటుంబం: సూర్యుడు, సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు, ఉపగ్రహాలు, లఘుశకలాలను కలిపి సౌరకుటుంబం అంటారు.

వాతావరణం: భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలిపొర.

హిమనీనదం: మంచుతో కప్పి ఉన్న ప్రాంతం లేదా ప్రదేశం.
విరూపకాలక చర్యలు: అకస్మాత్తుగా ఏర్పడ్డ చర్యల వల్ల భూమి ఉపరితలంలో జరిగే మార్పులు.
ద్వీపం, ద్వీపకల్పం: అన్ని వైపులా నీరు ఆవరించి ఉన్న భూభాగం ద్వీపం. మూడువైపులా నీరు, ఒకవైపు భూమి ఉన్న భూభాగం ద్వీపకల్పం.

ఎడారి: అత్యల్ప వర్షపాతం, అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతం.

డెల్టా: నది ముఖద్వారం వద్ద రెండు లేదా ఎక్కువ పాయలతో సముద్రంలో కలుస్తుంది. వీటి మధ్య ఉన్న సారవంతమైన ఒండ్రు ప్రాంతాన్ని డెల్టా అంటారు.

జలసంధి: రెండు భూభాగాలను వేరు చేస్తూ, రెండు జల భాగాలను కలిపే సన్నని జలభాగం.

చీకటి ఖండం: ఆఫ్రికా ఖండం ఉత్తరభాగం వెడల్పుగా ఉంటుంది. దీన్ని చాలా వరకు సహారా ఎడారి ఆక్రమించి ఉంటుంది.

* ఈ ఎడారిని దాటడం కష్టం కాబట్టి యూరప్ అన్వేషకులకు ఆఫ్రికాలోని ఎడారికి దక్షిణంగా ఉన్న ప్రాంతం గురించి తెలియదు. కాబట్టి 19వ శతాబ్దం వరకు ఆఫ్రికాను చీకటి ఖండంగానే పరిగణించారు.

నైలునది వరప్రసాదం: నైలునదితో ఈజిప్టు సస్యశ్యామలం అవడంతో దీన్ని 'నైలునది వరప్రసాదం' అంటారు.

సంవహన వర్షపాతం: నిరంతరం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే ఉష్ణమండల ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం.

ఎడారి భూములు: నీరు లభించని, అధిక ఉష్ణోగ్రతలు కలిగి వ్యవసాయానికి ఉపయోగపడని, ప్రజలు ఎక్కువగా నివసించని ప్రాంతాలు.

ఎడారి ఓడ: ఎడారిలో రవాణాకు ఉపయోగపడే ఒంటెను ఎడారి ఓడ అంటారు.

లవంగాల దీవి: లవంగాలు ఎక్కువగా సేద్యం చేసే జాంజిల్ దీవిని లవంగాల దీవి అంటారు.

గడ్డిభూములు: భూమధ్యరేఖ మండలం ఇరువైపులా గడ్డి మాత్రమే పెరిగే విశాలమైన ప్రాంతాలు.

పోడు వ్యవసాయం: అడవులను నరికి, నేలను చదును చేసి గిరిజనులు చేసే వ్యవసాయం. వీరు ఒకచోట నేలసారం తగ్గగానే వేరే ప్రాంతానికి వెళ్లి అక్కడ మళ్లీ ఇదే పద్ధతి కొనసాగిస్తారు.

ఒయాసిస్‌లు: ఎడారిలో నీరు లభించే ప్రాంతాలు.

సాంకేతిక పరిజ్ఞానం: ఆధునిక యంత్ర పరికరాలు, నూతన శాస్త్రజ్ఞాన పద్ధతులను ఉపయోగించడం.

శీతోష్ణస్థితి: ఒక విశాల ప్రాంతానికి సంబంధించి దీర్ఘకాలానికి చెందిన సగటు వాతావరణస్థితి.

టండ్రాలు: ఆర్కిటిక్ వలయం నుంచి ఉత్తర ధృవ ప్రాంతం వరకు జనావాసాలు లేని శీతల ఎడారులు.

శుష్క ప్రాంతం: వర్షపాతం అల్పంగా ఉండే ప్రాంతం.

హరివాణం: విశాలమైన లోతట్టు ప్రాంతం.

మిశ్రమ వ్యవసాయం: వ్యవసాయంతో పాటు పాలు, మాంసం ఇచ్చే జంతువులను, గుడ్లు పెట్టే పక్షులను పెంచడం.

వ్యవసాయాధార పరిశ్రమలు: వ్యవసాయ ఉత్పత్తులను ముడిపదార్థంగా ఉపయోగించుకొని ఉత్పత్తిని కొనసాగించే పరిశ్రమలు.

లాకులు: పడవ ప్రయాణానికి అనుకూలంగా కాలువలు, నదుల్లో జల ప్రవాహ వేగాన్ని తగ్గించడానికి నీటిలోతు పెంచడానికి నిర్మించి, అమర్చేగేట్లు.

ఎక్స్‌ప్రెస్ వే: దూర ప్రదేశాలకు వేగంగా ప్రయాణించడానికి నిర్మించిన వెడల్పైన రోడ్లు.

ఘంటు: నీటిపై తేలియాడే వంతెన.

నగరీకరణ: నగరాల్లో, పట్టణాల్లో జనాభా పెరిగి అభివృద్ధి చెందడం.

రుతుపవనారణ్యాలు: దక్షిణ, ఆగ్నేయ, తూర్పు ఆసియాలోని రుతుపవన మండలంలో 100 - 200 సెం.మీ. వర్షపాతం ఉన్న కొండప్రాంతాలు, పీఠభూమి ఉపరితలంలోని పొడవైన వృక్షాలు, పొదలు ఉన్న అడవులు.

జనసాంద్రత: ఒక చదరపు కిలోమీటరు భూవిస్తీర్ణంలో నివసించే జనాభా.

విస్తృత వ్యవసాయం: వ్యవసాయ క్షేత్ర పరిమితి ఎక్కువగా ఉండి, యంత్రాలు ఎక్కువగా ఉపయోగిస్తూ చేసే వ్యవసాయం.

వాణిజ్య పంటలు: ధన సముపార్జనే ధ్యేయంగా పండించే పంటలు.

అంతర్జాతీయ వ్యాపారం: ప్రపంచ దేశాల మధ్య జరిగే వ్యాపారం.

ఇంధన ఖనిజాలు: వాహనాలు, పరిశ్రమల్లో ఇంధనంగా ఉపయోగించే ఖనిజాలు.

భూకంపం: భూమి పొరల్లో సర్దుబాటు ఫలితంగా వచ్చే ప్రకంపనల వల్ల భూకంపం ఏర్పడుతుంది. దీన్ని గుర్తించే పరికరం సిస్మోగ్రాఫ్.

లావా: భూమి అట్టడుగు పొరల్లో ఉన్న అధిక ఉష్ణోగ్రతకు శిలలు ద్రవంగా మారి భూమి పైకి ప్రవహించే పదార్థాన్ని లావా అంటారు.

వికోషీకరణం: గాలి, నీరు, ఉష్ణం ద్వారా పర్వతాలు తమ ఆకృతిని కోల్పోతాయి. దీన్నే వికోషీకరణం అంటారు.

వర్షచ్ఛాయ ప్రాంతం: నీటి ఆవిరితో నిండిన గాలులకు పర్వతాలు అడ్డురావడం వల్ల అవి ద్రవీభవించి వర్షిస్తాయి. దీంతో అవి బరువు కోల్పోయి పర్వతాలను దాటి వెనుక వైపుకు చేరుకుంటాయి. కానీ వర్షించలేవు. అలాంటి ప్రాంతాన్ని వర్షచ్ఛాయ ప్రాంతం అంటారు.

సాంద్ర వ్యవసాయం: చిన్న కమతాల్లో చేసే వ్యవసాయాన్ని సాంద్ర వ్యవసాయం అంటారు.

శుష్క ఖండాతర్గత ప్రాంతం: వర్షాలు కురవని ఖండ మధ్య ప్రాంతం.

వృష్టభూమి: ఎత్తైన భూమి.

Posted Date : 13-09-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు