• facebook
  • whatsapp
  • telegram

భారతీయ విద్యా చరిత్ర, వివిధ కమిటీలు - కమిషన్లు

విద్య - నిర్వచనం: 'విద్య' అనే పదం 'విద్' అనే మూలపదం నుంచి ఆవిర్భవించింది. విద్య అంటే తెలుసుకోవడం అని అర్థం.
*  Education అనే ఆంగ్ల పదం Educare, Educer అనే లాటిన్ పదాల నుంచి ఉద్భవించింది.


తత్వవేత్తలు, విద్యావేత్తలు, మనోవైజ్ఞానిక వేత్తలు ఇచ్చిన నిర్వచనాలు
* మనిషిని స్వార్థరహితుడిగా, స్వావలంబన సాధించేలా తయారుచేసేది విద్య - రుగ్వేదం 

*  ముక్తి లేదా మోక్ష సాధనకు తోడ్పడేదే విద్య - ఉపనిషత్తులు
*  ఆత్మ సాక్షాత్కారమే విద్య - భగవద్గీత
*  అజ్ఞానాన్ని తరిమివేసే సత్యాన్వేషణే విద్య - సోక్రటీస్
*  ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసును సృష్టించడమే విద్య - అరిస్టాటిల్
*  మానవుడి బుద్ధి దేని ద్వారా వికసిస్తుందో, మనశ్శాంతి పెంపొందుతుందో, శీలం ఏర్పడుతుందో, మానవుడు స్వశక్తితో నిల్చుంటాడో అదే విద్య - స్వామి వివేకానంద
*  మానవుడు పుట్టినప్పటి నుంచి మనిషిగా తయారయ్యే వరకు ఇంద్రియాలు, మేధస్సు, హృదయం ఒకదానికొకటి ప్రదర్శించే అభిరుచులను సుస్థిరపరచేదే విద్య - రూసో

* మనిషిలోని అత్యుత్తమమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేసేదే విద్య - మహాత్మా గాంధీ
* గతం మన పునాది, వర్తమానం మన ముడి పదార్థం, భవిష్యత్తు మన లక్ష్యం. ఏ విద్యావిధానంలోనైనా భూత, వర్తమాన, భవిష్యత్తులకు సముచిత స్థానం ఉండాలి. -  స్వామి అరవిందుడు


విద్యా ధ్యేయాలు
* విద్య వ్యక్తి పరిపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధికి తోడ్పడాలి.
* విద్య వ్యక్తిలో సృజనాత్మక శక్తిని, వృత్తి నైపుణ్యాలను పెంపొందించే విధంగా ఉండాలి.
* విద్య వ్యక్తి స్వావలంబనకు, స్వయంసమృద్ధికి, సామాజిక అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలి.
* మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అన్ని కాలాల్లో అందరికీ ఉపయోగపడేలా లక్ష్యాలను నిర్దేశించుకుంటూ వ్యక్తిగత, సామాజిక సంపూర్ణ అభివృద్ధిని కాంక్షించే ధ్యేయంగా విద్య ఉండాలి.
* సంస్కృతి, వారసత్వాలను తర్వాతి తరాలకు అందించే ప్రక్రియగా విద్య కొనసాగాలి.
* విద్యార్థిని విజయపథంలో నడిపే విధంగా విద్య ఉండాలి.
* విద్యార్థిలో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, భౌతిక విలువలను పెంపొందించే విధంగా విద్య కొనసాగాలి.


విద్య - రకాలు
విద్యార్జన ప్రధానంగా మూడు పద్ధతుల్లో జరుగుతుంది.
అవి: 1) నియత విద్య
       2) అనియత విద్య
       3) యాదృచ్ఛిక విద్య


నియత విద్య: విద్యార్థి ప్రవర్తనను సంస్కరించి, సత్ప్రవర్తనను అలవరచడానికి పాఠశాల, కళాశాలల్లో నియమ నిబంధనలతో క్రమబద్ధంగా, ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసిన విద్యను నియత విద్య అంటారు.
* ఈ నియత విద్యలో వయోపరిమితిని అనుసరించి బోధనా కార్యక్రమం జరుగుతుంది.
* ఇది కృత్రిమమైన ప్రక్రియ.
* ఇందులో వనరులు పరిమితం.


అనియత విద్య: పాఠశాల, కళాశాలల్లో చదువుకునే అవకాశం లేనివారికి, మధ్యలోనే చదువు మానేసినవారికి ప్రత్యేక అభ్యసన అనుభవాల ద్వారా ఏర్పాటు చేసిన బహుముఖ విద్యా విధానాన్ని అనియత విద్య అంటారు.
* ఈ విధానంలో లక్ష్యాలు, ప్రణాళికలు ఉంటాయి. కానీ నియమ నిబంధనలు సరళంగా ఉంటాయి.
* కరెస్పాండెంట్ కోర్సులు, పోస్టల్ కోచింగ్, ఉపగ్రహ కార్యక్రమాలు, వేసవి విద్యా కోర్సులు, సార్వత్రిక విశ్వవిద్యాలయాలు లాంటి వాటిని వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు.


యాదృచ్ఛిక విద్య: విద్యార్థి తనకు తెలియకుండానే కుటుంబం, సంఘంలో జీవిస్తూ ఆర్జించే విద్య ఇది. అనుభవాల ద్వారా తన ప్రవర్తనను సరిదిద్దుకోవడాన్ని యాదృచ్ఛిక విద్య అంటారు.
* ఈ విద్యకు ఎలాంటి సమయపాలన, నియమ నిబంధనలు ఉండవు.
* కుటుంబంలోని సభ్యులు, సమాజంలోని వ్యక్తుల ద్వారా అనేక విషయాలను తెలుసుకుంటారు. తన ప్రవర్తనలోని లోపాలను సరిదిద్దుకుని, ఆత్మపరిశీలన ద్వారా ఒక మంచి సామాజిక వ్యక్తిగా తయారు కావడానికి ఈ విద్య ఉపయోగపడుతుంది.
* కుటుంబం, దేవాలయం, చర్చి, మసీదు, గ్రంథాలయం, ఆటస్థలం, మత సంబంధ కార్యక్రమాలను దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు.


విద్య - ప్రక్రియలు
* మనసులో నిగూఢంగా దాగి ఉన్న అంతర్గత శక్తులను బహిర్గతం చేసే ప్రక్రియే విద్య.
* విద్యను ఒక ప్రక్రియగా నిర్వచిస్తే అది మానవుడిలో ఉన్న సామర్థ్యాలను బయటకు వెలికితీసి అభివృద్ధి చేయాలి.
* విద్య అనేది ఒక లక్ష్యంతో ఫలితాన్ని ఆశించి చేసే ప్రక్రియ.
* విద్య స్థిరమైంది కాదు. గతిశీలమైంది. చైతన్యపూరితమైంది.
* అనుభవాల సారమే విద్య.
విద్యా ప్రక్రియలోని కేంద్ర బిందువుల ఆధారంగా ఈ విద్యా ప్రక్రియను 3 రకాలుగా పేర్కొనవచ్చు. అవి:
    1. ఏకధృవ విధాన ప్రక్రియ
    2. ద్విధృవ విధాన ప్రక్రియ
    3. త్రిధృవ విధాన ప్రక్రియ


ఏకధృవ విధాన ప్రక్రియ (Unipolar process)
* ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుడు కీలకం, కేంద్ర బిందువు.
* ఈ ప్రక్రియ పురాతనమైంది.
* ఈ ప్రక్రియలో విద్యార్థి స్తబ్ధుగా, నిష్క్రియాత్మకంగా ఉంటాడు.
* ఇందులో బోధనే ముఖ్యం. విద్యార్థుల అవగాహన, ప్రతిస్పందనలతో సంబంధం లేదు.
* ఈ ప్రక్రియలో విద్యార్థి ప్రగతిని కనుక్కోవడం కష్టసాధ్యం. ఈ విధానంలో విద్యార్థి కొన్నిసార్లు ప్రతిస్పందించవచ్చు కానీ అవగాహన చేసుకోవచ్చు లేదా చేసుకోకపోవచ్చు.


ద్విధృవ ప్రక్రియ (Bipolar process)

* ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుడు బోధిస్తే విద్యార్థి వింటాడు.

* దీనిలో ఉపాధ్యాయుడు ఒక ధృవం కాగా విద్యార్థి మరో ధృవం.
* ధృవాలు పరస్పరం ఆకర్షించుకుంటాయి.
* ఉపాధ్యాయుడు, విద్యార్థి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.
* అభ్యసన సఫలీకృతం అవుతుంది.
* ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరూ క్రియాత్మకంగా ఉండి బోధనాభ్యసన కృత్యాలు నిర్వహిస్తారు.
* విద్యార్థి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ప్రశ్నలు వేస్తే ఉపాధ్యాయుడు సమాధానాలు ఇస్తాడు.
* ఈ ప్రక్రియలో విద్యార్థులు, ఉపాధ్యాయుడు పరస్పర ప్రతిచర్యల ద్వారా బోధనాభ్యసన కృత్యాలు నిర్వహించడం వల్ల విద్యార్థులు ఆశించిన లక్ష్యాలను సాధిస్తారు.
* ఇదొక ప్రయోగాత్మక ప్రక్రియ. ఇందులో ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరి పరస్పర కృషి ద్వారా విద్యా గమ్యాలను సాధించవచ్చు.
* ఈ ప్రక్రియను రూపొందించినవారు జాన్ ఆడమ్స్.

 

త్రిధృవ విధాన ప్రక్రియ (Tripolar process)
* త్రిధృవ విధాన ప్రక్రియను ప్రతిపాదించిన విద్యావేత్త జాన్ డ్యూయీ.
              

* ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుడు, విద్యార్థి, సమాజాన్ని మూడు ధృవాలుగా చేర్చారు.
* ఈ ప్రక్రియలో సమాజ అవసరాలను తీర్చి, సమాజం కోరుకునే విధంగా పౌరులను తయారుచేయడమే విద్యా లక్ష్యంగా ఉంటుంది.
* ఉపాధ్యాయుడు సమాజ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థికి బోధనాభ్యసన కృత్యాలను నిర్వహిస్తాడు. అతడిని ఉత్తమమైన పౌరుడిగా తీర్చిదిద్దుతాడు.
* పరిసరాల అవగాహన, సర్దుబాటు చాలా ముఖ్యమైంది. పరిసరాలు అనుకూలంగా లేకుంటే విద్య సరిగా సాగదు.
* ఈ ప్రక్రియ మంచి విద్యా ఫలితాలను అందించగలదు.


విద్యాభివృద్ధి కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన అధికరణలు
అధికరణ 21 ఎ:
6 - 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించడం. ఏ వ్యక్తికీ విద్యా సంబంధిత హక్కు, స్వేచ్ఛను హరించకుండా ఉండటం.
అధికరణ 23: పిల్లలతో బలవంతంగా వెట్టిచాకిరీ చేయించడం, సంబంధిత పనుల్లో నియమించడం నిషేధం. పిల్లలతో ఎలాంటి పని చేయించకుండా విద్యను అభ్యసించే విధంగా చూడటం.
అధికరణ 41: పని, విద్యను పొందే హక్కు ద్వారా ప్రజలు కొన్ని సందర్భాల్లో సహాయం పొందే అంశాలను పొందుపరచడం.
అధికరణ 45: 14 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ కుల, మత, లింగ, జాతి వివక్ష లేకుండా సార్వత్రిక ప్రాథమిక విద్యా హక్కు ద్వారా ఉచిత నిర్బంధ విద్యను అందించడం.
అధికరణ 51 (ఎ): 6 - 14 సంవత్సరాల్లోపు పిల్లలను బడికి పంపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది.
అధికరణ 350 (ఎ): మాతృభాషలోనే విద్యా బోధన చేయాలి.

 

విద్యా చరిత్ర
భారతీయ విద్యా విధాన చరిత్రను 4 భాగాలుగా విభజించవచ్చు.
 1. ప్రాచీన కాలంలో విద్యా విధానం (చరిత్ర ప్రారంభం నుంచి క్రీ.శ.12వ శతాబ్దం వరకు)
 2. మధ్యయుగంలో విద్యా విధానం (క్రీ.శ.12వ శతాబ్దం నుంచి క్రీ.శ.16వ శతాబ్దం వరకు).
 3. ఆధునిక యుగంలో విద్యా విధానం (క్రీ.శ.17వ శతాబ్దం నుంచి క్రీ.శ.19వ శతాబ్దం వరకు).
 4. స్వాతంత్య్రం అనంతరం విద్యా విధానం

 

1. ప్రాచీన కాలంలో విద్యా విధానం
చరిత్ర ప్రారంభం నుంచి క్రీ.శ.12వ శతాబ్దం వరకు విద్యా పరిణామ క్రమాన్ని ప్రాచీన కాలంలోని విద్యా విధానంగా భావించవచ్చు.
* ఈ కాలంలో భారతదేశంలో విలసిల్లిన వ్యవస్థీకృత విద్యను మూడు రకాలుగా విభజించవచ్చు.
   A. వేద విద్య
   B. బౌద్ధ విద్య
   C. జైన విద్య

 

A. వేద విద్య
* ప్రపంచ చరిత్రలో విద్యా దానం చేసిన మొదటి దేశం భారతదేశం. మను శ్లోకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.
* భారతదేశంలోని బ్రాహ్మణోత్తములు సత్ప్రవర్తన కలిగి, విజ్ఞాన సముపార్జన చేసి విద్యా దానాన్ని మానవత్వంతో చేశారు.
* చాంద్యోగ ఉపనిషత్తు నారద మహాముని గురించి వివరిస్తూ నారదుడికి 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, 4 వేదాలు, రెండు ఇతిహాసాలను పఠించినట్లు పేర్కొంది.
* వేదకాలంలో వేద విద్యా కరికులమ్‌లో అధ్యయనం చేసిన వేదాల వరుస క్రమం
1) రుగ్వేదం      2) సామవేదం       3) యజుర్వేదం        4) అధర్వణ వేదం

 

రుగ్వేదం: భారతదేశంలో మొదట రాసిన గ్రంథం.  ఆర్యుల సామాజిక, రాజకీయ పరిస్థితుల గురించి వివరించింది.
సామవేదం: దీన్ని సంగీతశాస్త్రంపై రాశారు.
యజుర్వేదం: యజ్ఞయాగాలు, క్రతువుల గురించి వివరించింది. మత విషయాలకు సంబంధించింది.
అధర్వణ వేదం: ఆయుర్వేదం గురించి వివరించింది.

వేద విద్య లక్ష్యాలు
* సంపూర్ణ మూర్తిమత్వం సాధించే లక్ష్యంతో విద్యా ప్రక్రియ కొనసాగేది.
* విద్య అంతిమ లక్ష్యం ముక్తి లేదా మోక్షాన్ని పొందడం.
* మనిషి తన శరీరం, ఆత్మపై ఏకాగ్రతతో పట్టు సాధించడం.
* ఆలోచనా శక్తిని, ప్రజ్ఞను పెంపొందించడంతోపాటు గృహస్థాశ్రమం, వానప్రస్థానంలోని నియమాలు బ్రహ్మచర్యంలో ప్రయోగాత్మకంగా పరీక్షించడం. సంక్షిప్తంగా చెప్పాలంటే విద్య లక్ష్యం శీలం, సత్ప్రవర్తన.

 

పాఠ్యాంశాలు
1. వేద పుస్తకాలు (రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం) వీరి పాఠ్యపుస్తకాలు.
2. భాష, వ్యాకరణం, జ్యోతిష్యం, ఛందస్సు లాంటి సమాజానికి పనికొచ్చే విద్యను అందించేవారు.

 

వేద విద్య ఉద్దేశం
* వేద కాలంలో విద్యార్జన ఉద్దేశం జనన మరణ రహస్యాల అన్వేషణ.
ఇది రెండు రకాలుగా జరుగుతుంది.
1. అపర విద్య: ఇది ఐహికమైంది. భూలోకంలోని శరీరానికి సంబంధించింది. అంటే సమాజంలోని వ్యక్తి ఒక ఉత్తమ వ్యక్తిగా సంఘజీవనం గడపడానికి ఉపయోగపడేది.
2. పరావిద్య: ఆయుష్మీకమైంది. అంటే ముక్తి, మోక్షం పొందడానికి ఉపయోగపడేది. పరలోకంలోని ఆత్మకు సంబంధించింది.


వేద విద్య ఆశయం: వేద కాలంలో విద్య ముఖ్య ఆశయం చిత్తవృత్తి నిరోధం అంటే బుద్ధిని క్రమబద్ధంగా అభివృద్ధి చేసుకోవడం.
* వేద విద్యలో హిందూ మత సిద్ధాంతాలను బోధించేవారు.
* వేద కాలపు విద్యా విధానంలో భోజపత్రాలను రాత సాధనాలుగా ఉపయోగించారు.


వేద విద్యలోని బోధనాంశాలు
  1. చాతుర్వర్ణ వ్యవస్థ
  2. చతుర్విధ పురుషార్థాలు
  3. చతురాశ్రమ ధర్మాలు
  4. కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలు

 

చాతుర్వర్ణ వ్యవస్థ: కుల వృత్తుల గురించి వివరించింది.
* రుగ్వేదం 10వ భాగం పురుష సూక్తం దీన్ని తెలుపుతుంది.
* నాడు కులాలను అనుసరించి వారి జీవన విధానానికి ఉపయోగపడే విధంగా విద్యా బోధన జరిగేది.
* బ్రాహ్మణులకు యజ్ఞయాగాది క్రియలు, కర్మ జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం బోధించేవారు.
* క్షత్రియులకు రాజనీతి, శస్త్రాస్త్ర ప్రయోగం, ధర్మ రక్షణ, దేశ రక్షణతో పాటు ధర్మ శాస్త్రాలను బోధించారు.
* వైశ్యులకు వాణిజ్యం, గణితం, భూగోళం, వ్యవసాయం బోధించారు.
* శూద్రులకు విద్యను నిరాకరించారు.

చతుర్విధ పురుషార్థాలు: విద్య వ్యక్తి ఆశ్రమ ధర్మాలను నిర్వర్తించడానికి, చతుర్విధ పురుషార్థాలు సాధించడానికి దోహదపడే విధంగా ఉండాలని భావించారు.
* ప్రతి వ్యక్తి తన జీవిత కాలాన్ని నాలుగు ప్రధాన ఆశ్రమాల్లో గడుపుతాడు. అవి:
  ఎ) బ్రహ్మచర్యం
  బి) గృహస్థాశ్రమం
  సి) వానప్రస్థం
  డి) సన్యాసం
 ఈ నాలుగు ప్రధాన ఆశ్రమాల్లో నాలుగు పురుషార్థాలు సాధించాలని ఉద్ఘాటించారు.
పురుషార్థాలు: 1) ధర్మం - అంటే సత్ప్రవర్తన
                     2) అర్థం - సంపద
                     3) కామం - సంతోష వాంఛ
                     4) మోక్షం - జీవితం నుంచి విముక్తి
* హిందూ మతం ప్రకారం కర్మలు అనేకం. కర్మానుసారం పునర్జన్మ ప్రాప్తిస్తుంది.
* పుణ్యం చేసిన హిందువు స్వర్గానికి చేరుతాడు.
* పుణ్యం చేసిన బౌద్ధులు తుషి లోకానికి చేరుతారు.
* పుణ్యం చేసిన క్రైస్తవులు హెలెన్‌కు చేరుతారు.
* పుణ్యం చేసిన గ్రీకులు ఈలిజియన్ ఫీల్డ్‌కు చేరుతారు.

 

వేద విద్యా విధానం
* విద్య అనేది స్వచ్ఛందం.
* బ్రాహ్మణులు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా విద్యాదానం చేసేవారు.
* బోధన సంస్కృత భాషలో జరిగేది.
* తొలి వేద కాలంలో ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ విద్యా దానం చేశారు.
* మలి వేద కాలం నాటికి వర్ణ వ్యవస్థ బలపడి విద్యా ప్రవేశంపై నిషేధాజ్ఞలు వచ్చి చేరాయి.
* గురుకులాల్లో బ్రాహ్మణులు విద్యా దానం చేసేవారు. ఇది వేద విద్యా లక్షణం.
* 5 ఏళ్ల వయసులో 'ఓం నమఃశివాయ' అనే మంత్రంతో విద్యా విధానాన్ని ప్రారంభించేవారు.
* అప్పటి నుంచి ప్రతి రోజూ 'ఓం నమఃశివాయ' అనే శాంతి పాఠాన్ని ఆలపిస్తూ ప్రతి బాలుడు దినచర్యను ప్రారంభించాలి.

 

శిశు విద్య ప్రారంభం

ఉపనయనం:  ఉపనయనం అనే ఉత్సవంతో విద్యార్థి దశ ప్రారంభమవుతుంది.
* ఉపనయనం సమయంలో గురువు విద్యార్థి చెవిలో గాయత్రి మంత్రాన్ని బోధిస్తాడు.
* ఉపనయనం అనంతరం విద్యార్థిని అంతేవాసి, అవతలవాసి లేదా గురువులవాసిగా పిలుస్తారు.
* ఉపనయనం అనంతరం విద్యార్థి గురు ఆశ్రమంలో నివసిస్తూ, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ భిక్షాటన చేసి తీరాలి.
* గురువులకు సపర్యలు చేయాలి. గురువును సంతృప్తిపరచాలి. సత్ప్రవర్తన కలిగి గురువును తన సేవలతో సంతృప్తిపరిచిన విద్యార్థికి గురువు వాచక పద్ధతిలో జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు.
* వేదకాలంలో సమస్త జ్ఞాన కేంద్రం గురువు.
* వాచకం అంటే ప్రశ్నోత్తరాలు, చర్చ, సంభాషణ.
* వేద విద్యా పద్ధతి అయిన వాచక పద్ధతిలో 3 దశలుంటాయి.
అవి:  1) శ్రవణం        2) మననం        3) నిధిధ్యాసనం


1. శ్రవణం: గురువు చెప్పినదాన్ని విని దాన్ని అనుకరించడం. గురువు మౌఖికంగా బోధించిన విషయాన్ని శిష్యులు వల్లె వేస్తారు. దీన్నే 'సంత చెప్పడం' అంటారు.
2. మననం: గురువు బోధించిన విషయాలపై గోష్ఠిని నిర్వహించడం. ఇక్కడ శిష్యులు విన్న పాఠ్యాంశాన్ని ఏకాంతంగా నెమరవేస్తూ వచ్చిన సందేశాలను చర్చా పద్ధతి ద్వారా నివృత్తి చేసుకోవడం. ఈ క్రమంలో బోధన అర్థవంతంగా సాగుతుంది.
3. నిధి ధ్యాసనం: విద్యార్థి తాను నేర్చుకున్న విషయాలను తన జీవితానుభవాలతో, ఇతర శాస్త్ర అధ్యయనాలతో, స్వయంప్రతిభతో జ్ఞానం సముపార్జించుకుని ధ్యానంలో నిమగ్నమవడానికి ప్రయత్నిస్తాడు. అత్యున్నత స్థానం లేదా మోక్షం పొందడాన్ని నిధి ధ్యాసనం అంటారు.
* పూర్వం గురు ఆశ్రమాలుగా ప్రారంభమై విశ్వవిద్యాలయ స్థాయికి చేరి అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచినవి వారణాసి, తక్షశిల.
* ప్రశ్నించడం, సందేహాలను తీర్చుకోవడం అనే పద్ధతుల ద్వారా విద్యాభ్యాసం జరిగింది.
* విద్య పూర్తయిన తర్వాత ఆశ్రమాన్ని విడిచి వెళ్లేటప్పుడు విద్యార్థికి గురువు ఎల్లవేళలా సత్యాన్ని పలుకు, నీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించు అని హితబోధ చేసేవారు.
* వేద కాలంలో నియత పాఠశాల లేదా నియత విద్యా ప్రణాళిక లేవు. శిష్యుడు గురువు వద్దనే ఉంటూ ఆచరణాత్మక విద్యను గడించేవాడు.
* ఆచరణాత్మక విద్య అంటే Practical Education. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు విద్యను నేర్పేవారు. దీన్ని 'భెల్ సిస్టమ్‌'గా పేర్కొంటారు. 'భెల్' అనే ఇంగ్లండ్ విద్యావేత్త చెన్నైలో సార్వజనీన విద్యావ్యాప్తి, తక్కువ ఖర్చుతో సాధించగలమని భావించి ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడం వల్ల దీన్ని భెల్ సిస్టమ్‌గా పేర్కొన్నారు

 

ఉపనయనం వయసు
  1. బ్రాహ్మణులకు - 8 సంవత్సరాలు
  2. క్షత్రియులకు - 10 సంవత్సరాలు
  3. వైశ్యులకు - 12 సంవత్సరాలు
  4. శూద్రులు ఉపనయనానికి అనర్హులు.

 

శిశు విద్య ముగింపు
సమవర్తనోత్సవం:
18 ఏళ్లు వచ్చిన తర్వాత 'సమవర్తనోత్సవం' అనే ఉత్సవాన్ని నిర్వహించిన తర్వాత విద్యార్థి దశ ముగుస్తుంది.

 

వేదకాలంలో విద్యా సంస్థలు
ఈ కాలంలో గురుకులం, పరిషత్, సమ్మేళన అనే మూడు రకాల విద్యాసంస్థలు ఉండేవి.
1. గురుకులం: ఉపనయనం అనంతరం విద్యార్థి గురువులు/ రుషుల ఆశ్రమాల్లో నివసించాలి. భిక్షాటన చేయాలి.
* గురువును సంతృప్తిపరచాలి. గురువు అనుగ్రహం పొందిన విద్యార్థికి గురువు జ్ఞానోపదేశం చేస్తారు.
2. పరిషత్: ఇవి ఉన్నత విద్యాలయాలు.
* గురుకుల అభ్యసనం అనంతరం చర్చలు, సంభాషణల ద్వారా విద్యార్థులు పరిషత్‌లో ఉన్నత విద్యను అభ్యసించేవారు. ఇక్కడికి పండితులను ఆహ్వానించేవారు.
3. సమ్మేళన: ఇది రాజాస్థానంలోని చర్చాగోష్ఠి.
* రాజు గొప్ప తత్త్వవేత్తలను, పండితులను ఆహ్వానించి గోష్ఠులు ఏర్పాటు చేసి గౌరవించేవారు.
* వేదకాలంలోని బోధనా భాష: సంస్కృతం
* వేద కాలంలో గురువు హోదా: గురుబ్రహ్మ (గురువు దైవసమానులు)
* వేదకాలంలో గురుశిష్యుల సంబంధం: ప్రత్యక్ష సంబంధం, అవినాభావ సంబంధం.
* వేదకాలంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు: వారణాసి, తక్షశిల.

 

వేదకాలంలో స్త్రీ విద్య
* తొలి వేద కాలంలో స్త్రీలకు ఉపనయన సంస్కార అర్హత ఉండేది. మలివేద కాలం నాటికి దీన్ని నిషేధించారు.
* వీరు ఆశ్రమానికి అనర్హులు. కానీ వివాహానికి ముందు తండ్రి, వివాహం అనంతరం భర్త విద్యాదానం చేసేవారు.
* వేద కాలంలో విద్యను అభ్యసించిన స్త్రీలు గార్గి, మైత్రేయ.
వేద విద్యలో లోపాలు
1. వర్ణ వివక్ష
2. లింగ భేదాలు
3. గురువు హోదా ఒక వర్గం వారికే సొంతం (బ్రాహ్మణులకు మాత్రమే)

 

వేదకాలం అనంతరం విద్యా విధానం:
 కేవలం సంఘంలోని మూడు వర్గాలకు మాత్రమే విద్య పరిమితమైంది. శూద్రులకు విద్యా హక్కు ఉండేది కాదు.
 ఉపనిషత్తుల్లో 2 మార్గాలు సూచించారు.
1. ద్రియాస జీవిత మార్గం: కర్మధర్మాల ద్వారా సాధించడం.
2. శ్రేయాస జీవిత మార్గం: మంచితనం, ఏకాగ్రత ద్వారా సాధించడం.
* ఈ కాలంలో సత్యం, వాస్తవం అనేవి మననం, నిధిధ్యాసన నుంచి మాత్రమే సాధ్యపడతాయని నమ్మేవారు.

 

బౌద్ధ విద్యాభ్యాసం
 బ్రాహ్మణత్వంలోని లోపాల కారణంగా బౌద్ధ మతం 6వ శతాబ్దంలోనే భారతదేశంలో విస్తరించింది. అప్పటివరకూ గురువు కేంద్రంగా సాగిన విద్య బౌద్ధ సన్యాసుల చేతిలోకి వెళ్లింది. ఈ కాలంలో వర్ణశ్రమ ధర్మాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి విద్య అందుబాటులోకి వచ్చింది.
* గురుకులం నుంచి ఆశ్రమ పాఠశాల స్థాయి వరకు విద్యా వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత బౌద్ధ విద్యావిధానాలదే.
* విశ్వవిద్యాలయాలు స్థాపించి ప్రపంచ విద్యార్థులను ఒకేచోట చదువు కోసం సమావేశపరచిన ఘనత బౌద్ధ విద్యా విధానానికి దక్కుతుంది.
* బౌద్ధ విద్యా విధానం వృత్తి విద్య, పారిశ్రామిక విద్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించింది.
* మెడిసిన్, సర్జరీ అనేవి బౌద్ధ విద్యా విధానంలో మనకు కనిపిస్తాయి.
* వైద్య విద్యలో తక్షశిల అత్యంత గౌరవపాత్రమైన విద్యాపీఠంగా రూపొందింది.
* ఇందులో విద్యనభ్యసించడానికి కావాల్సిన వయసు 8 సంవత్సరాలుగా ఉండేది.


బౌద్ధ విద్యా విధానం లక్షణాలు
 
  1) విముక్తి
    2) జీవికకు సిద్ధం చేయడం
    3) నైతిక అభివృద్ధి
1. విముక్తి: అవిద్య, కోర్కెలు, దుఃఖం నుంచి విముక్తి చేయడం.
2. జీవికకు సిద్ధం చేయడం: సమాజ అవసరాలను గుర్తించి, విద్యార్థులను వారి జీవితానికి సన్నద్ధం చేయడం.
3. నైతిక అభివృద్ధి: విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం.

 

విద్యా ప్రవేశం: విద్యా ప్రవేశం సార్వజనీనమైంది.
* అన్ని వర్గాల వారు విద్యను అభ్యసించడానికి అర్హులు.
 బౌద్ధ విద్యా విధానంలో విద్యా దశలు 3. అవి:
     1. పబ్బజ (ప్రాథమిక విద్య)
     2. ఉపసంపద (ఉన్నత విద్య)
     3. ఉప సదస్సు (స్నాతకోత్సవం)

 

1. పబ్బజ: ప్రాథమిక విద్య 'పబ్బజ' అనే ఉత్సవంతో ప్రారంభమవుతుంది.
* 'పబ్బజ' అనేది పాళీ భాషా పదం. దీని అర్థం ముందుకెళ్లడం.
* 8 సంవత్సరాల వయసులో అన్ని వర్గాలవారు ఈ బౌద్ధ విద్యాలయ ప్రవేశ ఉత్సవానికి అర్హులు.
ప్రాథమిక విద్యాభ్యాస కాల వ్యవధి: 12 సంవత్సరాలు (అంటే 8 నుంచి 20 సంవత్సరాల వయసు వరకు)
* 'పబ్బజ' ఉత్సవం అనంతరం విద్యార్థిని 'సమనేరులు' అని పిలిచేవారు.

 

2. ఉప సంపద: ఇది ఉన్నత విద్యా దశ.
* ఈ ఉత్సవం అనంతరం విద్యార్థి సన్యాసిగా మారుతాడు.
* ఈ దశ 10 సంవత్సరాలు.
* ఈ దశలో అత్యున్నత విద్యను అభ్యసించిన విద్యార్థి బౌద్ధంలో ఉపాధ్యాయుడు అవుతాడు.

 

3. ఉప సదస్సు: బౌద్ధమతంలో స్నాతకోత్సవాన్ని ఉపసదస్సు అంటారు.


బౌద్ధ విద్యాలయాలు
* ఆరామాలు, విహారాలు, మఠాల్లో విద్యా బోధన జరిపేవారు.
* విద్యకు వ్యవస్థాగత రూపం ఇచ్చిన ఘనత బౌద్ధానికి చెందుతుంది.
* నాగార్జున, నలంద, తక్షశిల, విక్రమశిల లాంటి విశ్వవిద్యాలయాలను బౌద్ధం మనకు అందించింది.
* నలంద విశ్వవిద్యాలయంలో చదువుతోపాటు భోజనం, ఆవాసం, దుస్తులు, వైద్యం ఉచితంగా అందించేవారు.
* ఆయుర్వేదం, ధనుర్వేదం, న్యాయ విద్యలకు - తక్షశిల
* తత్వశాస్త్రానికి, సంగీత శాస్త్రానికి - ఉజ్జయిని, కాశీ.
* ఎన్నాయరమ్, ధర్, మలకాపురమ్, తిరుముక్కడాల విద్యా కేంద్రాలుగా మారాయి.
* ఈ కాలంలో వైద్య రంగంలో విశేష కృషి జరిగింది.

 

బోధనా భాష
* మాతృభాష (ప్రజల భాష) అయిన పాళీ లేదా ప్రాకృతం.
* భారతదేశంలో తొలిసారిగా మాతృభాషలో విద్యాబోధన చేసినవారు బౌద్ధులు.

 

బౌద్ధ విద్యా ప్రణాళిక
* బౌద్ధులు నైతిక, లౌకిక విద్యను బోధించేవారు.
* నైతిక అంశాలు బుద్ధుడి అష్టాంగ మార్గాన్ని తెలియజేస్తాయి.
* భౌతిక లేదా లౌకిక అంశాలు ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను ప్రతిబింబిస్తాయి.

 

బోధనా విధానం
1. వాచిక పద్ధతి: ప్రశ్నోత్తరం, చర్చ, సంభాషణ.
2. రాత పద్ధతి
3. ఆచరణాత్మక పద్ధతి (Practical Method).
 బౌద్ధ ఉపాధ్యాయులు మానిటోరియల్ పద్ధతి ద్వారా రూపొందేవారు. బౌద్ధ కాలంలో ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాలు
1) తక్షశిల        2) నలంద         3) విక్రమశిల        4) నాగార్జున

 

బౌద్ధ విద్యలో లోపాలు
1. మత విద్యకు ప్రాధాన్యం
2. సైనిక విద్య లోపించడం
3. విద్యాలయాలు ప్రజాస్వామ్య పద్ధతులను అనుసరించడంలో అవి స్త్రీ, పురుషుల క్రీడా నిలయాలయ్యాయి.


జైన విద్యా విధానం
* జైనులు ప్రజల భాషయైన ప్రాకృతంలో లౌకిక విద్యను బోధించారు.

 

జైనమత విద్య ప్రధాన తత్వం
   1) సత్ప్రవర్తన
   2) ఆధ్యాత్మిక చింతన
   3) కఠిన క్రమశిక్షణ
* జైన విద్య ప్రధాన ఆశయం త్రిరత్నాలను అనుసరించడం.
* జైన మత సూత్రాలు త్రి రత్నాలు
    1. సమ్యక్ దర్శనం - సరైన విశ్వాసం
    2. సమ్యక్ జ్ఞానం - సరైన జ్ఞానం
    3. సమ్యక్ ప్రవర్తన - సరైన క్రియ
* సమ్యక్ ప్రవర్తనకు పంచ వ్రతాలు అనుసరించాలి.

 

పంచ వ్రతాలు
1) సత్యం      2) అహింస     3) అస్థేయ      4) అపరిగ్రహ     5) బ్రహ్మచర్యం

 

బోధనా విధానం
 1) వల్లెవేయడం     2) అనుకరణ         3) వైయక్తిక అభ్యసనం
* జైన విద్య అంతిమ ధ్యేయం నిర్యాణం.

Posted Date : 30-08-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు