• facebook
  • whatsapp
  • telegram

మధ్యధరా ప్రకృతిసిద్ధ మండలం

* ఈ మండలంలోని ప్రాంతాల్లో చలికాలం వర్షపాతం మితంగా ఉంటుంది. వేసవికాలం వాతావరణం పొడిగా ఉంటుంది. అందుకే మధ్యధరా ప్రకృతి సిద్ధ మండల ప్రాంతాలను 'శుష్క వేసవి ఉప ఆయన రేఖా ప్రాంతాలు' అని కూడా అంటారు.

* ఆహ్లాదకరమైన శీతోష్ణస్థితికి, విహారయాత్ర కేంద్రాలకు, అభివృద్ధి చెందిన వ్యవసాయ రంగానికి, ఘనమైన చరిత్ర, సంస్కృతి, నాగరికతలకు ఈ ప్రాంతాలు పేరుపొందాయి.
 

ఉనికి
* మధ్యధరా ప్రకృతిసిద్ధ మండలాలు ఖండాల పశ్చిమ తీరంలో 30o నుంచి 40o ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి.
మధ్యధరా సముద్రతీర ప్రాంతాలు

* మధ్యధరా ప్రకృతి సిద్ధ ప్రాంతాలు ప్రధానంగా: యూరప్‌లో పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, మొనాకో, ఇటలీ, క్రోయేషియా, బోస్నియా - హెర్జిగోవినా (యుగోస్లేవియా), ఆల్బేనియా, గ్రీస్, క్రిమియా (ఉక్రెయిన్), ఆసియా ఖండంలోని టర్కీ, సిరియా, లెబనాన్‌లో విస్తరించి ఉన్నాయి.
* ఇజ్రాయెల్, ఆఫ్రికాలోని ట్యునీషియా, ఆల్జీరియా, మొరాకో దేశాల తీరప్రాంతాలు.
* మధ్యధరా సముద్రంలోని కోర్సికా, సాల్డేనియా, క్రిట్, సిసిలీ, సైప్రస్ ద్వీపాల్లో విస్తరించి ఉన్నాయి.

 

ఇతర ప్రాంతాలు
* ఉత్తర అమెరికాలోని కాలిఫోర్నియాలో కొంత ప్రాంతం, దక్షిణ అమెరికాలోని చిలీలో కొంత ప్రాంతం, ఆఫ్రికా దక్షిణాగ్రం, ఆస్ట్రేలియాలోని రెండు విభిన్న ప్రాంతాలను కూడా మధ్యధరా ప్రకృతి సిద్ధమండల ప్రాంతంగా పేర్కొనవచ్చు.

 

శీతోష్ణస్థితి
* ఈ ప్రకృతి సిద్ధ మండలంలో చలికాలం వర్షపాతం సంభవిస్తుంది.
* వేసవికాలం పొడిగా ఉంటుంది.
* సూర్యరశ్మి పుష్కలంగా ఉంటుంది.
* పగలు వెచ్చగా, రాత్రిపూట చల్లగా ఉంటుంది.
* వేసవిలో ఉష్ణోగ్రత 20o - 26o సెల్సియస్, చలికాలంలో 5o - 15o సెల్సియస్ వరకు ఉంటుంది.
* ఈ ప్రకృతి సిద్ధమండలంలో వర్షపాతం ఒక క్రమ పద్ధతిలో సంభవించదు.
* భూమధ్యరేఖ వైపు ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో 25 సెం.మీ. నుంచి ధృవం వైపు ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో 76 సెం.మీ.ల వరకు వర్షపాతం నమోదవుతుంది.

* వేసవికాలం ఈ మండల సరిహద్దుల్లోని ఉష్ణమండల ఎడారుల నుంచి పొడి, వేడితో కూడిన 'సిరోకో', 'శాంటా అన్నా' లాంటి వడగాలుల వల్ల అసౌకర్యం కలుగుతుంది.
* చలికాలంలో 'భోరా', 'మిస్ట్రల్' అనే కటిక చలిగాలుల వల్ల పంటనష్టం అధికంగా ఉంటుంది.

 

సహజ వృక్ష సంపద
* మధ్యధరా ప్రకృతిసిద్ధ మండలంలోని మధ్యధరా తీర ప్రాంతాల్లో ప్రజలు అనేక శతాబ్దాలుగా నివసిస్తున్నారు.

* ఆ ప్రాంతాల్లోని అడవులన్నింటినీ దాదాపుగా పంట భూములుగా మార్చారు.
* ఈ మండలంలోని అడవులు విశాలపత్ర సతత హరితారణ్యాలు.
* ఇక్కడి అడవుల్లో ప్రధానంగా ఆలివ్, మిల్లిల్, పోలీ, కార్క్ఓక్ వృక్షాలు పెరుగుతాయి.
* అధిక వర్షపాతం సంభవించే పర్వతసానువులతో శృంగాకారపు అడవులు ఉన్నాయి.
* ఆస్ట్రేలియా నైరుతి భాగంలో యూకలిప్టస్ అరణ్యాలు ఉన్నాయి.

ప్రజలు
* మధ్యధరా ప్రకృతి సిద్ధ మండలం ప్రపంచ భూవిస్తీర్ణంలో ఒక శాతం విస్తరించి ఉంది. ప్రపంచ జనాభాలో నాలుగు శాతం మంది ప్రజలు ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
* ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో యూరప్ ఒకటి.

 

ఆర్థిక ప్రగతి

వ్యవసాయం
* ఆలివ్, నారింజ, ద్రాక్షల సమ్మేళనం మధ్యధరా ప్రకృతి సిద్ధమండల వ్యవసాయరంగ విశిష్ట లక్షణం.
* గోధుమ, బార్లీ, చిక్కుడు గింజలు, కూరగాయలు అనేక రకాల పండ్లను ఇక్కడ పండిస్తారు.
* ఈ ప్రాంతాల్లోని ప్రజలు ప్రపంచంలో అత్యాధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తారు.

* చిలీలోని అతి విశాలమైన వ్యవసాయ క్షేత్రాలను 'హసియోండా' అంటారు. ఇక్కడ మాంసం కోసం పశువులను ఎక్కువగా పెంచుతారు. గోధుమ, ద్రాక్ష పంటలను కూడా పండిస్తారు.
* ఈ దేశం నుంచి ద్రాక్షసారాయి (wine)ని పెద్దమొత్తాల్లో ఎగుమతి చేస్తారు.
* ఆఫ్రికాలోని కేప్‌టౌన్ ప్రాంతం పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందింది.
* ఆస్ట్రేలియా ప్రాంతం గోధుమ పంట, గొర్రెల పెంపకానికి ప్రసిద్ధి చెందింది.

మత్స్యగ్రహణం
* ఈ ప్రకృతి సిద్ధ మండలాలన్ని సముద్రతీర ప్రాంతాన్ని కలిగి ఉంటాయి.
* తీర ప్రాంతాల్లో మత్స్యగ్రహణం ప్రాచీన ఆచారంగా కొనసాగుతోంది.
* అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని కాలిఫోర్నియా మత్స్యగ్రహణంలో ప్రధానమైన రాష్ట్రం.
* ఇక్కడ సార్డిన్, ట్యూనా చేపలు పెద్ద మొత్తాల్లో లభిస్తాయి.

 

అటవీ సంపద
* 'కార్క్ ఓక్' యూరప్‌లోని మధ్యధరా ప్రకృతి సిద్ధ మండల ప్రాంతాల్లో లభించే ప్రధాన అటవీ ఉత్పత్తి.
* ఆస్ట్రేలియాలోని నైరుతి ప్రాంతం నుంచి యూకలిప్టస్, జారా, కర్రీ వృక్షాల కలప ఎగుమతి చేస్తున్నారు.

 

ఖనిజ సంపద
* ఫ్రాన్స్‌లో బాక్సైట్ లభిస్తుంది.

* ప్రపంచంలో పాదరసాన్ని ఉత్పత్తి చేసే దేశాల్లో ఇటలీ ప్రధానమైంది.
* అల్జీరియాలో ఇనుప ఖనిజం; టర్కీలో క్రోమియం, నేలబొగ్గు, మాలిబ్డినం, సీసం; స్పెయిన్‌లో యశదం, రాగి ఖనిజాలు లభిస్తున్నాయి.
* విగ్రహాల తయారీకి ప్రసిద్ధి చెందిన 'కరారా' పాలరాయి ఇటలీలో లభ్యమవుతుంది.
* కాలిఫోర్నియా నుంచి పెట్రోలియం; చిలీ నుంచి రాగి, నైట్రేట్‌లు ఎగుమతి అవుతున్నాయి.

* ప్రపంచంలో అతి దట్టమైన పెట్రోలియం 'సిగ్నల్ - హిల్' కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది.
* ప్రపంచంలోని అతిపెద్ద సీసం క్షేత్రాల్లో ఒకటైన 'బోకెన్ - హిల్' ఆస్ట్రేలియాలో ఉంది.

 

పరిశ్రమలు 
* ఇనుప ఖనిజం, నేలబొగ్గు లభించని కారణంగా ఈ ప్రకృతి సిద్ధ మండల ప్రాంతాల్లో భారీ పరిశ్రమలు అభివృద్ధి చెందలేదు.
* వ్యవసాయ రంగం నుంచి పరిశ్రమలకు కావాల్సిన ముడిసరకు లభిస్తుంది.
* ఇక్కడి పరిశ్రమల్లో ఆలివ్ నూనె, ద్రాక్ష సారాయి తయారు చేస్తారు. పండ్లను శుభ్రపరిచి డబ్బాల్లో నింపుతారు.
* పుష్పాల నుంచి లభించే నూనెలను సుగంధ పరిమళ ద్రవ్యాల పరిశ్రమలో ఉపయోగిస్తారు. వీటిని ఫ్రాన్స్‌లోని 'గ్రాసే'లో తయారు చేస్తున్నారు.
* సార్డిన్, చేపలను డబ్బాలో నిలువ చేయడం మధ్యధరా సముద్ర తీర ప్రాంతాల్లో అభివృద్ధి చెందింది. కాలిఫోర్నియాలోని మాంటెరాను ప్రపంచపు సార్డిన్ రాజధానిగా పిలుస్తారు.
* కాలిఫోర్నియాలో మనోహరమైన, ప్రకృతి దృశ్యాలు, ఆహ్లాదకరమైన శీతోష్ణస్థితుల కారణంగా హలీవుడ్ సినిమా నిర్మాణ పరిశ్రమ కేంద్రీకృతమైంది.

విహార యాత్ర పరిశ్రమ
* సూర్యరశ్మి, ప్రకృతి దృశ్యాలు, సముద్రాల కలయిక మధ్యధరా ప్రకృతి సిద్ధ మండల విశిష్ట లక్షణం.

* ఫ్రాన్స్, ఇటలీ దేశాల సన్నని తీర మైదానాలు పూర్వపు యుగోస్లేవియాకు చెందిన డాల్మేషియా తీరం, క్రిమియాలను యూరప్ ఖండ క్రీడా ప్రాంగణం అని పిలుస్తారు.
* శీతకాలంలో వెచ్చని శీతోష్ణస్థితి, మనోహరమైన సముద్ర తీరాలు, అభివృద్ధి చెందిన మౌలిక సౌకర్యాలు, సొగసైన ప్రకృతి దృశ్యాల ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
* దక్షిణ ఫ్రాన్స్ తీరంలోని చిన్న దేశం మొనాకో అక్కడి 'కాసినో'లకు ప్రసిద్ధి చెందింది.

 

నగరాలు
* ఇస్తాంబుల్, ఏథెన్స్, నేపుల్స్, రోమ్, ఫోలెన్స్, జినోవా, మాంటెకార్లో, బార్సిలోనా, వాలెన్షియా, కాసాబ్లాంకా, అల్జీర్స్, ట్యూనిష్, బీరూట్‌లు మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్న తీర ప్రాంతాల్లోని ప్రముఖ నగరాలు.
* టెల్ - అరీట్ హైపా, నవీన బీరూట్ లాంటి ప్రాచీన నగరాలు ఉన్నాయి.
* శాంటియాగో, కేప్‌టౌన్, అడిలైడ్, పెర్త్, లాస్ఏంజిల్స్, శాన్‌ఫ్రాన్సిస్కో, ఓక్‌లాండ్, సాక్రామెంటో నగరాలు మధ్యధరా సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాలు.

 

Posted Date : 13-09-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు