• facebook
  • whatsapp
  • telegram

సవన్నా ప్రాంతం లేదా ఉష్ణమండల పచ్చికబయళ్ల ప్రాంతం

సంవత్సరంలో కొంత కాలం వర్షం కురవడం, మిగిలిన కాలం పొడిగా ఉండటం ఈ ప్రకృతి సిద్ధ మండల విశిష్ట లక్షణం అని చెప్పవచ్చు.

* ఈ ప్రకృతి సిద్ధ మండలంలో ఆఫ్రికా ఖండంలోని 'జాంబెజీ' నదిపై ఉన్న 'విక్టోరియా' జలపాతం ప్రపంచ ప్రసిద్ధి చెందిన అద్భుతమైన ప్రకృతి దృశ్యం.

* ఉత్తర అమెరికా ఖండంలోని నయాగరా జలపాతం ప్రపంచంలో వెడల్పైన జలపాతాల్లో ఒకటి.


ఉనికి
ఉష్ణమండల భూమధ్యరేఖ మండలానికి ధృవం వైపు ఉన్న సరిహద్దులో 5º - 20º ల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది.


దక్షిణ అమెరికా
* దక్షిణ అమెరికా ఖండంలో బ్రెజిల్, బొలీవియా, పేరాగ్వే, అర్జెంటినా దేశాల్లోని చాలా ప్రాంతాల్లో ఈ ప్రకృతి సిద్ధ మండలాలు విస్తరించి ఉన్నాయి. వీటిని 'కాంపాలు' అంటారు.
* ఉత్తర ప్రాంతాల్లో ఉన్న వెనిజులాలోని అధిక భాగంలో, కొలంబియా దేశాల్లో ఈ ప్రకృతి సిద్ధ మండలాన్ని 'లానోలు' అంటారు.
* ఈక్విడార్ దేశంలోని తీర ప్రాంతాల్లో ఉన్న కొంత భాగంలో గడ్డి భూములు విస్తరించి ఉన్నాయి.

 

మధ్య అమెరికా: (పశ్చిమ ఇండీస్‌దీవులతో కలిపి)

     మధ్య అమెరికాలోని దక్షిణ, పశ్చిమ తీరాల్లో ఉన్న ప్రాంతాలు, క్యూబా, జమైకా దీవులు, ఇతర పశ్చిమ ఇండీస్ దీవుల పశ్చిమ ప్రాంతాలు ఈ ప్రకృతి సిద్ధ మండలాల్లో విస్తరించి ఉన్నాయి.


ఆఫ్రికా
  ఆఫ్రికా ఖండంలోని భూమధ్యరేఖకు ఇరువైపులా ప్రకృతి సిద్ధ మండల భూములు అర్ధచంద్రాకారపు మేఖలుగా విస్తరించి ఉన్నాయి.
* ఈ మండలంలో సెనెగాల్, గినియా, మాలే, రిపబ్లిక్, మధ్య ఆఫ్రికా రిపబ్లిక్, నైజర్, ఛాడ్, సూడాన్, ఘనా, బెనిన్, టోగో, ఐవరీ కోస్ట్, నైజీరియా, అంగోలా, జైరో, జాంబియా, జింబాబ్వే, టాంజానియా, మొజాంబిక్, కెన్యా, ఇథియోపియా తదితర దేశాలు పూర్తిగా ఆ దేశాల్లోని విశాలమైన ప్రాంతాలతో పాటు మడగాస్కర్ ద్వీపం, పశ్చిమ తీరప్రాంతాలు ఉన్నాయి.


శీతోష్ణస్థితి
* వాతావరణ ఆర్ద్రత తక్కువగా ఉంటుంది.
* ఈ మండల సరిహద్దులో ఉన్న ఉష్ణమండల ఎడారుల నుంచి వేడిగా, పొడిగా ఉండే దుమ్ముధూళితో నిండిన బలమైన గాలులు వీస్తాయి.
* సంవత్సరం పొడవునా ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి.
* పొడిగా ఉండే కాలంలో 32o - 37o సెం.గ్రే, వర్షపాతం సంభవించే కాలంలో 27º సెం.గ్రే వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయి.
ఈ మండలంలో పొగమంచు ఏర్పడదు.
* మండలానికి ఇరువైపులా ఉన్న భూమధ్య రేఖ మండలం, ఉష్ణమండల ఎడారుల సరిహద్దుల మధ్య వర్షపాతం వరుసగా 150 - 25 సెం.మీ. వరకు క్రమంగా మారుతూ ఉంటుంది.
* ఇక్కడ వర్షపాతం సంవహన వర్షపాతానికి చెందింది.
* ఈ తీరాల్లో ఉన్న పర్వత ప్రాంతాల్లో పర్వతీయ వర్షపాతం కూడా సంభవిస్తుంది.
* హవాయీ ద్వీపాల్లోని కౌవాయి ద్వీపంలో ఉన్న వయలేలి పర్వత శిఖరం ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతం.
* ఇక్కడ సంవత్సర వర్షపాతం 1234.4 సెం.మీ. ఉంటుంది.

సహజ వృక్ష సంపద

* ఈ మండల సహజ వృక్షసంపద భూమధ్యరేఖ మండలం వైపున దట్టమైన అరణ్యాలుగా మొదలైంది.
* ఎడారులు, సరిహద్దుల వైపు వెళ్లేకొద్దీ క్రమేపీ ఎత్తు తక్కువగా ఉండే పలుచని అరణ్యాలు ఉంటాయి.

* పలుచని పొదలు ఆ తర్వాత కురుచైన గడ్డిగా, క్రమేపీ ఎత్తు తగ్గుతూ ఎడారి సరిహద్దులకు వెళ్లేకొద్దీ అంతరించిపోతాయి.

* రుతువులను బట్టి మార్పు చెందే ఈ గడ్డి వర్షరుతువులో ఆకుపచ్చగా, శుష్క రుతువుల్లో గోధుమ వర్ణంలోకి మారుతుంది.


స్థానిక జంతు సంపద
* ఈ మండలంలో అత్యధిక సంఖ్యలో ఉన్న ఎన్నో రకాల కీటకాలతో పాటు అనేక రకాల గడ్డి తిని పెరిగే జంతువులు, ఆ జంతువులను ఆహారంగా గ్రహించే క్రూరమృగాలు కూడా ఉంటాయి.

* శాఖాహార జంతువులు ప్రధానమైనవి.

* దుప్పులు, జిరాఫీలు, ఆఫ్రికా అడవి దున్నలు, ఆఫ్రికా ఏనుగులు, ఖడ్గమృగాలు ఉంటాయి.

* సింహాలు, చిరుతపులులు, హైనాలు, నక్కలు తదితర ప్రధాన క్రూరమృగాలు.

* కోతులు, తొండలు, పాములు, నీటి గుర్రాలు, మొసళ్లు, అసంఖ్యాకంగా, అనేక రకాల పక్షులు కూడా ఉంటాయి.

* ఈ జంతువులు శుష్క రుతువుల్లో వర్షాధార ప్రాంతాలకు వలసపోయి వర్షాలతో పాటు ఈ మండలానికి వస్తాయి.


ప్రజలు
* ప్రకృతిసిద్ధ మండలాల్లో ఇప్పటికీ విశాలమైన ప్రాంతాల్లో మానవ ఆవాసాలు ఏర్పడలేదు.

* ప్రధానంగా క్యూబా, జమైకా దేశాలు పశ్చిమ ఇండీస్ దీవులు అధిక జనసాంద్రత కలిగి ఉన్నాయి.

* ఈ ప్రకృతిసిద్ధ మండలానికి సంబంధించినంత వరకూ అధిక జనసాంద్రత విషయంలో నైజీరియా, సూడాన్ దేశాలను కూడా పేర్కొనవచ్చు.


ఆర్థిక ప్రగతి

పశుచారణ: విశాలమైన ఈ పచ్చిక బయళ్లలో ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలో నివసించే అటవీ జాతులవారు తమ జీవనాధారం కోసం ప్రధానంగా పాలు, పాల ఉత్పత్తులను పొందుతున్నారు.
* ఈ మండలంలో ప్రత్యేకత ఏమిటంటే, మాంసం కోసం ఎవరూ పశువులను వధించరు.
* ఇక్కడ తమ అధీనంలో ఉన్న పశువుల సంఖ్యను బట్టి ప్రజల సాంఘిక ఔన్నత్యాన్ని నిర్ణయిస్తారు.

* పెళ్లి సమయంలో కన్యాశుల్కంగా పశువులను ఇస్తారు.

* వాణిజ్య సరళిలో పశుపోషణ ఆఫ్రికా ఖండంలో కంటే దక్షిణ అమెరికా ఖండంలో ఎక్కువగా అభివృద్ధి చెందింది.

వ్యవసాయం - విస్తాపన (లేదా) పోడు వ్యవసాయం:
* అటవీ ప్రాంతంలో పోడు వ్యవసాయం ఎక్కువగా ఉంది.
* ఈ విధానంలో అభివృద్ధి పరిచిన పనిముట్లను ఉపయోగించి కొద్ది మొత్తాల్లో చిరుధాన్యాలు, మొక్కజొన్న, గోధుమ, చిలగడదుంపలు, చిక్కుడు, గుమ్మడి తదితర పంటలను పండిస్తారు.

* ఒకే భూమిలో వేరుశనగ, పత్తిని పండిస్తారు. ఈ ప్రకృతి సిద్ధ మండలంలో వాణిజ్య వ్యవసాయం కూడా అమల్లో ఉంది.

* 'పంచదార గిన్నె'గా ప్రసిద్ధి చెందిన క్యూబా ప్రపంచంలో చక్కెరను అధికంగా ఎగుమతి చేసే దేశం.

* 'క్యూబా' హవానాలుగా పిలిచే అతి శ్రేష్ఠమైన చుట్టలకు కూడా ఈ దేశం ప్రసిద్ధి చెందింది.

* హవాయీ ద్వీపాలు ప్రపంచంలో అత్యధికంగా అనాస పండ్లను ఉత్పత్తి చేస్తున్నాయి.

* ఈ ప్రకృతిసిద్ధ మండలంలో దక్షిణ అమెరికా ఖండంలో పెరిగే 'క్విబ్రోషో' వృక్షం నుంచి టానిన్‌ను తయారు చేస్తారు.


ఖనిజ సంపద:
* పెట్రోలియాన్ని ఉత్పత్తి చేసే ప్రముఖ దేశాల్లో వెనిజులా ఒకటి.
* జమైకా పెద్ద మొత్తాల్లో బాక్సైట్‌ను ఉత్పత్తి చేస్తుంది.
* ప్రపంచంలో రాగి, యురేనియం, కోబాల్ట్‌లను ఉత్పత్తి చేసే ప్రధాన దేశాల్లో జైర్ ఒకటి.
* నైజీరియాలో తగరం, నేలబొగ్గు లభిస్తున్నాయి.


పరిశ్రమలు:

* ఈ ప్రకృతిసిద్ధ మండలంలో ప్రధానంగా పంచదార, రమ్ము, చుట్టలు, అనాసపండును, పశుమాంసాన్ని డబ్బాల్లో నింపడం, టానిన్‌ను తయారు చేయడం, తదితర వ్యవసాయాధార పరిశ్రమలను నెలకొల్పారు.


నగరాలు:

* ఈ ప్రకృతిసిద్ధ మండలంలో హవానా, పోర్ట్ ఆఫ్ ప్రిన్స్, కింగ్‌స్టన్, పనామా సిటీ, బ్రెజీలీయా, లాగో, ఆక్రా, హనోలులు తదితర నగరాలు ఉన్నాయి.

శ్రీప్రజ్ఞ కాంపిటీటివ్ స్టడీసర్కిల్, తిరుపతి


 

Posted Date : 14-09-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు