• facebook
  • whatsapp
  • telegram

వర్గీకరణ శాస్త్రం

జీవ సమూహాల శాస్త్రీయ విభజన!
 


భూమి మీద అసంఖ్యాక రకాల జీవులు ఉన్నాయి. వాటి గురించి అర్థం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. అందుకే లక్షణాల ఆధారంగా శాస్త్రవేత్తలు అన్ని జీవులను నిర్వచించి, నామకరణం చేసి ఒక క్రమ పద్ధతిలో అమర్చారు. వివిధ జాతులు, వాటి మధ్య సంబంధాలను కచ్చితంగా గుర్తుంచుకోవడానికి వీలుగా చేసిన విభజనను వివరించేదే వర్గీకరణ శాస్త్రం. ఇది జీవశాస్త్ర పరిణామం, పరిశోధన, పరిరక్షణ చర్యలపై అవగాహన పెంచుకోవడానికి సాయపడుతుంది. బయాలజీలో అతిముఖ్యమైన ఈ అంశానికి ఉన్న చారిత్రక నేపథ్యం, ప్రయోజనం గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. ప్రధాన జాతులు, జీవుల్లో శరీర నిర్మాణం, పోషణ, జాతిని వృద్ధి చేసుకునే విధానాలను అధ్యయనం చేయాలి. 


జీవుల లక్షణాల ఆధారంగా వాటిని సమూహాలుగా విభజించడాన్ని వర్గీకరణ (Taxonomy) అంటారు. దీన్ని ప్రతిపాదించినవారు ఎ.పి.డీకండోల్‌ (1813). క్రీస్తుపూర్వం అరిస్టాటిల్‌ జీవులను రెండు ప్రధాన రాజ్యాలుగా వర్గీకరించారు. ఈయనను ‘పురాతన వర్గీకరణ శాస్త్ర పితామహుడు’ అంటారు. భారతదేశంలో వర్గీకరణను ప్రారంభించిన వ్యక్తి పరాశరుడు. ఆయనను ‘భారతదేశ వర్గీకరణ పితామహుడు’ గా వ్యవహరిస్తారు. పరాశరుడి గ్రంథాలు 

1) వృక్షాయుర్వేదం     2) కృషిపరాశరం.

వర్గీకరణలో క్రీస్తు పూర్వం నుంచి నేటి వరకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అనేక మార్పులు జరిగాయి. క్రీ.పూ.4000 ఏళ్ల నాటికే ఈజిప్ట్‌ దేశస్థులు, ఆస్సీరియన్లు పైరు మొక్కలు, వృక్షాల గురించి సమాచారాన్ని చిత్రాల రూపంలో భద్రపరిచారు. దీన్ని హీరోగ్లిఫిక్స్‌ అంటారు. క్రీ.పూ.2500 ఏళ్ల నాటికే చైనీయులు మొక్కల సాగు గురించి తెలుసుకున్నారు. క్రీ.పూ.1300లో పరాశరుడు రచించిన ‘కృషిపరాశరం’ అనే అత్యంత ప్రాచీన గ్రంథంలో వ్యవసాయం, కలుపు మొక్కల సమాచారం ఉంది. జంతు శాస్త్ర పితామహుడైన అరిస్టాటిల్‌ ‘హిస్టోరియా ఎనిమేలియా’ అనే గ్రంథంలో మొక్కల వర్గీకరణను ప్రస్తావించాడు. వృక్షశాస్త్ర పితగా భావించే థియో ఫ్రాస్టస్‌ ‘హిస్టోరియా ప్లాంటారమ్‌’ అనే గ్రంథంలో సుమారు 500 మొక్కల గురించి పేర్కొన్నారు. హిందూ ప్రాచీన గ్రంథమైన అధర్వణ వేదంలో అంగీరస, అధర్వణ అనే రుషులు ఈ వర్గీకరణ గురించి ప్రస్తావించారు.

శాస్త్రీయ వర్గీకరణ

 * అరిస్టాటిల్‌ క్రీ.పూ.340లో జీవులను వృక్షరాజ్యం, జంతు రాజ్యం అనే రెండు ప్రధాన రాజ్యాలుగా వర్గీకరించారు.

* లిన్నేయస్‌ 1735లో ప్లాంటే, ఎనిమేలియా అనే రెండు రాజ్యాలుగా వర్గీకరించారు. 

* ఎర్నెస్ట్‌ హెకెల్‌ 1866లో ప్రొటాషిస్టా, ప్లాంటే, ఎనిమేలియా అనే మూడు రాజ్యాలుగా వర్గీకరించారు.                  

* కోప్‌లాండ్‌ 1938లో మొనీరా, ప్రొటిస్టా, ప్లాంటే, ఎనిమేలియా అనే నాలుగు రాజ్యాలుగా వర్గీకరించారు.   

* థామస్‌ విట్టేకర్‌ 1969లో మొనీరా, ప్రొటిస్టా, ఫంగీ, ప్లాంటే, ఎనిమేలియా అనే అయిదు రాజ్యాలుగా వర్గీకరించారు. 

* కార్ల్‌వోజ్‌ 20వ శతాబ్దంలో బ్యాక్టీరియా, ఆర్కిబ్యాక్టీరియా, ప్రొటిస్టా, ఫంగీ, ప్లాంటే, ఎనిమేలియా అనే ఆరు రాజ్యాలుగా వర్గీకరించారు.

* చాటన్‌ 1925లో కేంద్రకపూర్వ జీవులు, నిజకేంద్రక జీవులు అనే రెండు సామ్రాజ్యాలుగా వర్గీకరించారు. 

* ఊజ్‌ఎట్‌ఆల్‌ 1990లో బ్యాక్టీరియా, అరాకియా, యూకారియా అనే మూడు రంగాలుగా వర్గీకరించారు.

* కెవాలియర్‌ స్మిత్‌ 1998లో బ్యాక్టీరియా, ప్రొటోజోవా, క్రొమిస్టా, ప్లాంటే, ఫంగీ, ఎనిమేలియా అనే ఆరు రంగాలుగా వర్గీకరించారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న ఏకైక వర్గీకరణ విట్టేకర్‌ వర్గీకరణ


మొనీరా: ఈ రకం జీవులు నేలపైన, నీటిలో నివసిస్తాయి. ప్రధానంగా నీటిలో ఉంటాయి. ఇవి దాదాపు స్వయంపోషకాలు. సయనోబ్యాక్టీరియాలో పరపోషణను గమనించవచ్చు. ఏకకణ, కేంద్రకపూర్వ జీవులుగా శరీర నిర్మాణం ఉంటుంది. వీటి చలనాంగాలు కశాభాలు, శైలికలు. ద్విదావిచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. 

ఉదా: బ్యాక్టీరియాలు, స్పైరిల్లా, అనబీనా

ప్రొటిస్టా: ఈ జీవులు నీటిలో నివసిస్తాయి. డయాటమ్స్‌లో స్వయంపోషణ ఉంటే, అమీబా, యూగ్లీనాల్లో పరపోషణ ఉంటుంది. ఇవి చాలావరకు ఏకకణ జీవులు. కొన్ని బహుకణ జీవులు, నిజకేంద్రక జీవులు ఉంటాయి. ద్విదావిచ్ఛిత్తి, బహుదా విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది.

ఉదా: అమీబా, యూగ్లీనా, పారమీషియం, డయాటమ్స్‌.

శిలీంధ్రాలు: ఇవి ఏకకణ, బహుకణ జీవులు. తేమ ఉండే నేలలో నివసిస్తూ పూతికాహార భక్షకులుగా ఉంటాయి. వేళ్ల లాంటి నిర్మాణాలతో ఉండి, నివసించే ప్రదేశం నుంచే ఆహార సేకరణ చేస్తాయి. ముక్కలవడం ద్వారా శాఖీయోత్పత్తి, అలాగే సిద్ధబీజాల ద్వారా అలైంగికోత్పత్తి జరుగుతుంది.

ఉదా: రైజోపస్, మ్యూకార్, పెన్సిలియా నొటేటం 

వృక్షరాజ్యం: ఇవి బహుకణ జీవులు, నిజకేంద్రక జీవులు. కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేసుకునే స్వయంపోషకాలు. అభివృద్ధి చెందిన మొక్కల్లో శాఖీయోత్పత్తి, లైంగికోత్పత్తి జరుగుతుంది. ఫెర్న్‌ లాంటి నిమ్నజాతి మొక్కల్లో అలైంగికోత్పత్తి కనిపిస్తుంది.

జంతు రాజ్యం: నిమ్నస్థాయి జీవులైన ప్రొటోజోవా నుంచి అభివృద్ధి చెందిన క్షీరదాల వరకు అన్ని జీవులు జంతురాజ్యంలోనే ఉన్నాయి. దాదాపుగా అన్నీ పరపోషక జీవులే. జంతువుల్లో జరిగే పోషణ పలు రకాలుగా ఉంటుంది. జాంతవ భక్షణ (ఘనరూపంలో ఉండే ఆహారాన్ని తీసుకుని మింగడం), పరపోషణ (ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడటం), సహజీవనం (ఆహారం కోసం ఒక జీవిపై మరో జీవి నివసించడం. 

ఉదా: లైకెన్లు, రైజోబియం, బ్యాక్టీరియా)

* జంతురాజ్యంలో ప్రత్యుత్పత్తి ప్రక్రియ ముక్కలవడం (బద్దెపురుగు), పునరుత్పత్తి (ప్లనేరియా), అలైంగికోత్పత్తి (ద్విదావిచ్ఛిత్తి - అమీబా, బ్యాక్టీరియా), కోరకీభవనం (ఈస్ట్‌), పార్థనోజెనిసిస్‌ (రోటిఫెరస్‌ జీవులు- ఉదా: తేనెటీగలు, చీమలు, కందిరీగలు) వంటి పద్ధతుల్లో జరుగుతుంది. ఈ విభాగంలోని అభివృద్ధి చెందిన జీవులన్నీ లైంగికోత్పత్తి ద్వారా తమ జాతిని వృద్ధి చేసుకుంటాయి.


మాదిరి ప్రశ్నలు

1. టాక్సానమీ అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారు?  

1) జీన్‌ లామార్క్‌    2) ఏపీ డీకండోల్‌    3) అరిస్టాటిల్‌    4) కెవాలియర్‌ స్మిత్‌ 

2. కిందివాటిలో సహజీవనానికి ఉదాహరణ?  

1) లైకెన్స్‌    2) రైజోబియం    3) రోటిఫెరస్‌    4) 1, 2 

3. ‘ముక్కలవడం’ ద్వారా కొత్త జీవిగా ఎదిగేవి?

1) బద్దెపురుగు    2) ఈస్ట్‌     3) ప్లనేరియా     4) పైవన్నీ


4. ఆరు రంగాల వర్గీకరణ పిత?

1) లిన్నేయస్‌    2) ఊజ్‌ఎట్‌ఆల్‌    3) కెవాలియర్‌ స్మిత్‌    4) కోప్‌లాండ్‌ 

5. ‘స్పైరిల్లా’.. విట్టేకర్‌ వర్గీకరణలో దేనికి చెందుతుంది?

1) మొనీరా 2) ప్రొటిస్టా 3) ప్లాంటే 4) ఎనిమేలియా 

6. ప్రొటిస్టాను పరిచయం చేసింది ఎవరు?

1) లిన్నేయస్‌    2) ఎర్నెస్ట్‌ హెకెల్‌   3) థామస్‌ విట్టేకర్‌    4) కార్ల్‌వోజ్‌ 

7. జీవులను రెండు సామ్రాజ్యాలుగా వర్గీకరించినవారు?

1) చాటన్‌    2) థామస్‌ విట్టేకర్‌    3) కోప్‌లాండ్‌    4) లిన్నేయస్‌ 

8. కిందివారిలో పురాతన వర్గీకరణ శాస్త్రవేత్త? 

1) పరాశరుడు   2) అరిస్టాటిల్‌   3) థియోఫ్రాస్టస్‌    4) శుశ్రుతుడు 

9. వృక్షాయుర్వేదం గ్రంథకర్త? 

1) అరిస్టాటిల్‌ 2) పరాశరుడు 3) థియోఫ్రాస్టస్‌ 4) శుశ్రుతుడు 

10. కిందివాటిలో శిలీంధ్రం కానిది?

1) రైజోపస్‌ 2) మ్యూకార్‌ 3) రైజోఫోరా 4) న్యూరోస్పోరా
 


సమాధానాలు: 1-2, 2-4, 3-1, 4-3, 5-1, 6-2, 7-1, 8-2, 9-2, 10-3. 

రచయిత: వట్టిగౌనళ్ల పద్మనాభం


 

Posted Date : 21-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌