• facebook
  • whatsapp
  • telegram

ఆయనరేఖా ఎడారులు లేదా ఉష్ణమండల ఎడారులు

     వ్యవసాయం చేయడానికి, నివాసం ఉండటానికి వీల్లేని భూ ఉపరితలంపై ఉన్న విశాలమైన ప్రాంతాలను ఎడారులు అంటారు.
* నీరు లభించకపోవడం అనేది ఈ ప్రాంతాల ప్రత్యేక లక్షణంగా చెప్పవచ్చు.

ఉనికి
* ఖండాల పశ్చిమ తీరంలో 15 - 30º ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఈ ప్రకృతిసిద్ధ ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి.
* అంటార్కిటికా మినహా మిగిలిన అన్ని ఖండాల్లో ఈ ప్రాంతాలు ఉన్నాయి.


ప్రాంతాల విస్తరణ

సహారా ఎడారి
* అమెరికా సంయుక్త రాష్టాలకు రెట్టింపు పరిమాణం ఉన్న సహారా ఎడారి ఒక విశాలమైన మేఖలగా ఆఫ్రికా ఖండపు తూర్పు తీరం వరకు విస్తరించి ఉంది.
* ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణమండల ఎడారి.
* ఈ ఎడారి పశ్చిమ సహారా, మారిటానియా, మాలి, నైజర్, సూడాన్, మొరాకో, ట్యునీషియా, అల్జీరియా, లిబియా, ఈజిప్టు, ఇథియోపియా, ఎరిట్రియా, సోమాలియా దేశాల మొత్తం లేదా విశాల ప్రాంతంలో విస్తరించి ఉంది.

 

అరేబియా ఎడారి
* పరిమాణంలో సహారా ఎడారిలో సుమారు సగం ఉండే ఈ ఎడారి మొత్తం అరేబియా ద్వీపకల్పాన్ని ఆవరించి ఉంది.
* సౌదీ అరేబియా ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, సిరియా, కువైట్, సంయుక్త అరబ్ ఎమిరేట్ల దేశాల మొత్తం లేదా ఆ దేశాల విశాల ప్రాంతాల్లో విస్తరించి ఉంది.

 

థార్ ఎడారి
* ఈ ఎడారి పాకిస్థాన్‌లోని సింధు నది మధ్య, దిగువలోయ పరిసర ప్రాంతాల్లోనూ, భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో విస్తరించి ఉంది.

 

ఆస్ట్రేలియా ఎడారి
* ఇది దక్షిణార్ధ గోళంలోని అతిపెద్ద ఉష్ణమండల ఎడారి.
* ఆస్ట్రేలియా మొత్తం విస్తీర్ణంలో 40 శాతం ప్రాంతాన్ని ఆక్రమిస్తున్న ఈ ఎడారి ఆ దేశపు పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో విస్తరించింది.

 

కలహారి ఎడారి
* ఈ ఎడారి ఆఫ్రికా ఖండపు నైరుతి ప్రాంతంలో నమీబియా, బోట్స్‌వానా దేశాలు, అంగోలా, దక్షిణాఫ్రికా దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉంది.

అటకామా ఎడారి
* ఈ ఎడారి ఆండీస్ పర్వతాలకు పశ్చిమంగా 4º - 31º దక్షిణ అక్షాంశాల మధ్య చిలీ దేశపు ఉత్తర తీర ప్రాంతం, పెరూ దేశపు మొత్తం తీర ప్రాంతాల్లో విస్తరించి ఉంది.

 

సోనారన్ ఎడారి
* ఈ ఎడారి మెక్సికోలోని వాయవ్య ప్రాంతం, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని కాలిఫోర్నియా, అరిజోనా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉంది.

 

శీతోష్ణస్థితి
* ఎడారిలో శీతోష్ణస్థితులు తీవ్రంగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో నిర్దిష్ట రుతువులు ఏర్పడవు.
* ఆకాశం నిర్మలంగా ఉంటుంది. వేగంగా వీచే గాలుల మూలంగా ఇసుక తుపానులు ఏర్పడతాయి.
* సాపేక్ష ఆర్ద్రత (గాలిలోని తేమ శాతం) చాలా తక్కువగా ఉంటుంది.
* ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ ప్రకృతి మండలంలోనే నమోదవుతాయి.
* భూ ఉపరితలంపై ఇంతవరకు నమోదైన అత్యధిక పగటి ఉష్ణోగ్రత 58º. ఇది సహారా ఎడారిలో లిబియాలోని 'అజీజియా' వద్ద 1922, సెప్టెంబరు 13న నమోదైంది.
* సోన్‌రన్ ఎడారిలోని 'డెత్‌వ్యాలీ' లేదా 'మృతలోయ'లో 1913, జులై 10వ తేదీన నమోదైన 56.7º ఉష్ణోగ్రత ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది.
* ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత వ్యత్యాసం అధికంగా ఉంటుంది.
* ఈ మండలంలో రేయింబవళ్లు ఉష్ణోగ్రత వ్యత్యాసం అధికంగా ఉంటుంది.
* ఇది 14o నుంచి 39వరకు మారుతూ ఉంటుంది.
* దిక్ చక్రంపై సూర్య గమనం ఆధారంగా ఈ మండలంలో సంవత్సరాన్ని అధిక/ అల్ప అనే రెండు ఉష్ణోగ్రత రుతువులుగా విభజించవచ్చు.
* అధిక ఉష్ణోగ్రత రుతువులో 47నుంచి 56o వరకు, అల్ప ఉష్ణోగ్రత రుతువులో 33o నుంచి 44o వరకు మారుతూ ఉంటాయి.
* ప్రపంచంలో అతి తక్కువ వర్షపాతం సంభవించే ప్రాంతాలు ఎడారులు. వీటిలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపు చినుకు కూడా పడదు.
* ఇక్కడ వర్షం ఉపరితలాన్ని చేరే లోపే ఆవిరైపోతుంది.
* సంవత్సర సగటు వర్షపాతం 25 సెం.మీ. కంటే తక్కువ. ఎప్పుడైనా వర్షం కురిస్తే చాలా కొద్దిసేపు మాత్రమే కుంభవృష్టిగా కురుస్తుంది.

 

ప్రత్యేక స్థలాకృతి
* వర్షం కురిసే సమయంలో ఆ తర్వాత కొంతసేపు వరకు తాత్కాలికంగా ప్రవాహాలు ఏర్పడతాయి.
* ఇవి లోతైన లోయల ద్వారా ప్రవహిస్తాయి.

* సరస్సులను 'ప్లాయాలు' అని పిలుస్తారు.
* ఇసుక పొరతో కప్పి ఉండే ఎడారి ఉపరితలాన్ని ఇసుక ఎడారి అనీ, ఇసుక పొర లేని ఎడారులను రాతి ఎడారులు అని అంటారు.
* ఇసుక ఎడారుల్లో అనేక అర్ధ చంద్రాకార ఇసుక దిబ్బలు ఉంటాయి. ఇవి గాలి వీచే దిశకు గాలితోనే రవాణా అవుతాయి.
* ఉష్ణమండల ఎడారుల ద్వారా ప్రవహించే నదులను 'ఎక్సోటిక్' నదులు అంటారు.
* ఆఫ్రికా ఖండంలో ప్రవహించే నైలు నది, ఆసియా ఖండంలో ప్రవహించే సింధు నది, ఆస్ట్రేలియాలో ప్రవహించే డార్లింగ్ నది మొదలైన వాటిని వీటికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

 

సహజ వృక్ష సంపద
* ఎడారి వృక్ష సంపద ఆ ప్రాంతాల దుర్భర శీతోష్ణస్థితులకు తగిన విధంగా ఉంటుంది.

* ఈ మొక్కలు మైనపు పూత పూసినట్లు కనిపించే మందపాటి బెరడును కలిగి ఉంటాయి.
* ఈ మండలంలో కొన్ని మొక్కలకు ఆకులు ఉండవు. ఉన్నప్పటికీ చాలా చిన్నవిగా ఉంటాయి.
* ఈ మార్పు బాష్పోత్సేకాన్ని అవరోధించేందుకు ఉపకరిస్తుంది.
* ఈ మొక్కలు ఆకుపచ్చగా ఉండే వేళ్లలోనూ నీటిని చాలా కాలం నిల్వ చేసుకుంటాయి.
* వీటికి రక్షణ కోసం కాండాలపై అనేక ముళ్లు ఉంటాయి.

 

స్థానిక జంతుజాలం
* ఇక్కడ చాలా పరిమితిగా ఉండే జంతుసంపద అక్కడి పర్యావరణానికి తగిన విధంగా ఉంటుంది.
* ఎడారి గుంటనక్క, ఒంటె మొదలైనవి ఇక్కడ ఉండే ప్రధాన జంతువులు.
* పక్షులు, కీటకాల విస్తరణ 'ఒయాసిస్' ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది.
* ఎడారిలో ఒంటెను 'ఎడారి ఓడ' అంటారు.
* ఒంటెలు ఎడారివాసులకు మాంసం, చర్మాలతో పాటు ఆపద సమయాల్లో ప్రాణాలను కాపాడుకోవడానికి, తాగునీటిని కూడా అందజేస్తున్నాయి.

 

ప్రజలు
¤ ఎడారుల్లో విశాలమైన ప్రాంతాలు చాలావరకు ఖాళీగా, అత్యల్ప జనసాంద్రత కలిగి ఉంటాయి.
¤ అక్కడక్కడ స్థానికంగా నీరు లభించే 'ఒయాసిస్' ప్రాంతాల్లోనూ, ఎడారి నదులకు ఇరువైపులా జనసాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది.

* నీరు తగినంత లభించే ప్రాంతంలో వీరు స్థిర నివాసాలు ఏర్పరచుకుని వ్యవసాయం ప్రధాన వృత్తిగా చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
* నీరు సమృద్ధిగా లేని ప్రాంతాల్లో ప్రజలు దిమ్మరులుగా జీవిస్తున్నారు.
* కొద్ది మంది మాత్రం ఖనిజోద్గ్రహణం సంబంధిత కార్యకలాపాల్లో జీవిస్తున్నారు.

 

ఆటవిక జాతులు
* కలహారి ఎడారిలో నివసించే 'బుష్‌మెన్‌లు' నేటికీ అతి ప్రాచీన ఆటవిక జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు.
* కందమూలాదుల సేకరణ వీరి ప్రధాన వృత్తి.
* కొన్ని రకాల ఎడారి మొక్కల వేళ్లు, తొండలు, పాములు, కప్పలు, క్రిములు, చీమలు, గుడ్లు వీరి ప్రధాన ఆహారాలు.

 

ఆర్థిక ప్రగతి

పశుగణం: పశ్చిమ ఆసియా, ఆఫ్రికా ఎడారుల్లోని ప్రజలు అనేక దశాబ్దాలుగా పశుపోషణ చేస్తున్నారు.
* వీరు గొర్రెలు, మేకలు, ఒంటెలు, గుర్రాలను పెంచుతారు.
* ఈ జంతువుల నుంచి వారికి పాలు, జున్ను, మాంసం, ఉన్ని, చర్మం లభిస్తాయి.
* ఒయాసిస్సుల్లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ప్రజలకు వీటిని సరఫరా చేసి, బదులుగా వీరి నుంచి ఆహారధాన్యాలు, ఖర్జూరం లాంటి వ్యవసాయ ఉత్పత్తులు పొందుతారు.

 

వ్యవసాయం
* అన్ని ఒయాసిస్‌ల వద్ద ఖర్జూరం చెట్లు పెరుగుతాయి.
* వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం.
* గోధుమ, జొన్నలు ఇక్కడి ప్రధాన పంటలు.
* పంట భూములకు సాగునీరు సరఫరా చేయడంతో పత్తి, చెరకు, నారింజ మొదలైన వాణిజ్య పంటలను సాగు చేస్తారు.
* వరి, కూరగాయలు మొదలైన వాటిని ఇతర పంటలుగా చెప్పవచ్చు.

 

ఖనిజ సంపద
* ముడి చమురు ఈ ప్రకృతిసిద్ధ మండలంలో లభించే అతి ప్రధాన ఖనిజం.
* అరేబియా, కువైట్, ఇరాన్, ఇరాక్, సంయుక్త అరబ్ఎమిరేట్ దేశాలు. ఈ ప్రాంతంలో పెట్రోలియం ఉత్పత్తి చేసే ప్రధాన దేశాలు.
* కాలిఫోర్నియాలో కూడా పెట్రోలియం లభిస్తుంది.
* చిలీ ప్రపంచంలో 'నైట్రేట్' లను అత్యధికంగా ఉత్పత్తి చేస్తోంది.
* పెరూ దేశపు సముద్ర తీరానికి సమీపంలో ఉన్న అనేక ద్వీపాల్లో పెద్ద మొత్తాల్లో పక్షుల రెట్టలను సేకరించి దాన్ని సహజమైన ఎరువుగా ఉపయోగిస్తున్నారు. దీన్ని 'గయానో' అంటారు.

 

పరిశ్రమలు
* ఈ ప్రాంతాల్లో వ్యవసాయాధార పరిశ్రమలు ప్రధానమైనవి.
* పశ్చిమాసియా ప్రాంతంలో మాత్రం చమురుశుద్ధి పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది.
* ఈజిప్టులో నూలు, వస్త్రపరిశ్రమ, పంచదార, సిమెంట్ పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి.
* కాలిఫోర్నియాలోని శాన్‌డియాగో వద్ద విమాన నిర్మాణ పరిశ్రమ ఉంది.

 

నగరాలు
* కైరో ఈ మండలంలోని అతి పెద్ద నగరం.

* అరిజోనా రాష్ట్రంలోని 'ఫేవిక్స్' ఈ మండలంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. పెరూలోని అతి పెద్ద నగరం లెమా.
* అలెగ్జాండ్రియా, సైట్, సూయాజ్, కలావ్, కరాచీ లాంటి నగరాలన్నీ రేవు పట్టణాలే.
* ఇరాన్‌లోని 'అబదాన్' నగరంలో ప్రపంచంలో అతిపెద్ద చమురు శుద్ధి పరిశ్రమ అభివృద్ధి చెందింది.
* మక్కా నగరం ప్రపంచంలోని ఇస్లాం మతస్థుల అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం.

 

Posted Date : 14-09-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు