• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో బ్రిటిష్ రెవెన్యూ విధానం

         భారతదేశంలో బ్రిటిష్ పాలనకు ఈస్టిండియా కంపెనీ పునాదులు వేసింది. వ్యాపారంలో తనకు పోటీలేకుండా ఉండేందుకు భారతదేశంపై రాజకీయ ఆధిపత్యం సాధించాలనుకుంది.దీనికోసం ఆదాయ వనరులను సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకత పెరిగింది.ఇలా ఆదాయ వనరులు పెంపొందించుకోవడంలో భూమిశిస్తు ప్రధాన భూమిక వహించేది.అందువల్ల భూమిశిస్తు వసూలు విషయంలో పలు పద్ధతులు ప్రవేశపెట్టింది.రెవిన్యూ అంటే రాబడి. బ్రిటిషర్ల కాలంలో ప్రధాన రెవెన్యూ భూమిశిస్తు.బ్రిటిష్‌వారు నూతన రెవెన్యూ విధానాలు తీసుకురావడానికి పలు కారణాలు ఉన్నాయి.

1764 బక్సార్ యుద్ధానంతర పరిణామాలు
బక్సార్ యుద్ధంలో బ్రిటిష్‌వారు విజయం సాధించడంతో 1765 అలహాబాద్ సంధి జరిగింది. దీని ప్రకారం బెంగాల్, బీహార్,ఒరిస్సాల్లో భూమిశిస్తు వసూలు చేసుకునే హక్కు (రెవెన్యూ వసూలు చేసుకునే హక్కు)ను బ్రిటిష్‌వారు పొందారు.ఇలా తాము పొందిన రెవెన్యూ వసూలు అధికారాన్ని వినియోగించుకోవడానికి ఈస్టిండియా కంపెనీ ఒక నూతన రెవెన్యూ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది.

ఇతర ప్రాంతాల ఆక్రమణ:
* బెంగాల్‌నే కాకుండా ఇతర ప్రాంతాల ఆక్రమణకు, యుద్ధాలు చేసేందుకు, పరిపాలనను సుస్థిరం చేసుకోవడానికి అదనపు ఆదాయ వనరులు అవసరమయ్యాయి.
* ఉద్యోగులకు అత్యధిక వేతనాలు చెల్లించడానికి, భారతదేశంలో మారుమూల ప్రాంతాల్లోకి కూడా బ్రిటిష్ పరిపాలన చొచ్చుకొని పోయేందుకు, పరిపాలనా పరమైన ఖర్చులకు వనరుల ఆవశ్యకత పెరిగింది.
*  వ్యవసాయ రంగంలో తమకు విధేయులుగా ఉండే ఒక భాగస్వామ్య వర్గాన్ని భారతీయ సమాజంలో సృష్టించాలనేది బ్రిటిష్‌వారి ప్రయత్నం.


వేలంపాట పద్ధతి
      ప్రతి సంవత్సరం రెవెన్యూ వసూలు కోసం (భూమిశిస్తు) 1773లో వారన్ హేస్టింగ్స్ వేలంపాట పద్ధతిని ప్రారంభించారు. అయితే దీన్లోని లోపాల వల్ల ఈ పద్ధతి విజయవంతం కాలేదు.
లోపాలు:జమీందార్లు ఒకరికొకరు పోటీపడి అధిక మొత్తంలో వేలంపాట పాడేవారు.కానీ అంత మొత్తాన్ని వసూలు చేయలేక జమీందార్లు బకాయిలు పడేవారు.ఏ సంవత్సరంలో ఎంత శిస్తు చెల్లించాలో రైతుకు తెలిసేది కాదు.ఈ అనిశ్చితి వల్ల వ్యవసాయాభివృద్ధిపై రైతులు దృష్టి పెట్టేవారు కాదు.
       పై కారణాల వల్ల నిర్దిష్టమైన భూమిశిస్తు వసూలు విధానం కోసం 1783లో సర్‌జాన్ షోర్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు.బ్రిటిష్‌వారి ప్రయోజనాలు కాపాడటమే ప్రధాన ఉద్దేశంగా రెవెన్యూ విధానాన్ని రూపొందించాలని చెప్పారు. దీనికి అనుగుణంగా జమీందారీ విధానం లేదా శాశ్వత భూమిశిస్తు విధానాన్ని సర్ జాన్‌షోర్ రూపొందించారు. దీనిని 1793లో కారన్ వాలీస్ బెంగాల్, బీహార్‌లలో ప్రవేశపెట్టారు.


శాశ్వత భూమిశిస్తు విధానం
లక్షణాలు: ఈ విధానంలో భూమిశిస్తును జమీందార్లు వసూలు చేస్తారు. వీరే భూమికి యజమానులు. ఈ యాజమాన్య హక్కులు వంశపారంపర్యంగా జమీందార్లకు సంక్రమిస్తాయి. జమీందార్లే భూమికి సొంతదారులుగా మారటంతో దీనిని జమీందారీ విధానం అన్నారు. ఈ విధానం అమలుకాక ముందు జమీందార్లు కేవలం భూమిశిస్తు వసూలు ఏజెంట్లుగా ఉండేవారు.
భూమిశిస్తు వసూలు అధికారాన్ని వేలంపాట ద్వారానే నిర్ణయిస్తారు. వేలంపాటలో అత్యధిక మొత్తానికి పాడిన జమీందారులకు శిస్తు వసూలు చేసుకొనే అధికారాన్ని ఇవ్వడం జరుగుతుంది.
వేలంపాట ద్వారా భూమిశిస్తు వసూలు హక్కును పొందిన జమీందారు తను రైతులనుంచి వసూలు చేసుకున్న మొత్తం భూమిశిస్తులో కంపెనీకి 10/11వ వంతు చెల్లించాలి. ఇలా కంపెనీకి జమీందార్లు చెల్లించాల్సిన మొత్తాన్ని 'పేష్‌కష్' అంటారు. అయితే ఈ 'పేష్‌కష్' వేలం పాటలో అంగీకరించిన మొత్తంకంటే తక్కువగా ఉండరాదు. మిగిలిన 1/11 వంతు జమీందారుకు చెందుతుంది.
ఈ పద్ధతిలో రైతు వద్దనుంచి ఇష్టమొచ్చిన మొత్తంలో జమీందారు భూమిశిస్తును వసూలు చేసుకోవచ్చు.
జమీందార్లు కంపెనీకి చెల్లించాల్సిన మొత్తం 10 సంవత్సరాల వరకు శాశ్వతంగా ఉంటుంది. దీనిని మార్చరు. ఇలా 10 సంవత్సరాల వరకు స్థిరంగా ఉండటంతో దీనిని శాశ్వత శిస్తు విధానం అని అన్నారు. జమీందార్లు భూమిశిస్తును నిర్ణయించిన తేదీలోగా చెల్లించకపోతే జమీందారీ హక్కును కోల్పోతారు.
జమీందారీ విధానం ప్రవేశపెట్టిన ప్రాంతాలు: బెంగాల్, బీహార్, ఒరిస్సా, వారణాసి, కావేరి డెల్టా ప్రాంతం మొదలైనవి.


శాశ్వత భూమిశిస్తు విధానం
ఫలితాలు: కంపెనీకి - జమీందారు ఎంత మొత్తం చెల్లించాలో చెప్పిందేకానీ, జమీందారు రైతునుంచి ఎంత వసూలు చేయాలో చెప్పలేదు. దీంతో జమీందారులు రైతులవద్ద నుంచి అధిక మొత్తంలో భూమిశిస్తును డిమాండ్ చేయడం వల్ల రైతులు తీవ్ర దోపిడీకి గురి అయ్యారు. శాశ్వత భూమిశిస్తు విధాన రూపకర్త 'సర్ జాన్ షోర్' ఈ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కష్టపడి పండించిన పంటలో 40% మాత్రమే రైతులకు మిగిలేది. మిగతా 60%లో 45% ప్రభుత్వం మింగగా, 15% జమీందార్లు తినేవారని చెప్పాడు.
      ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా రైతులను జమీందార్లు శిస్తు వసూలు కోసం డిమాండ్ చేయటంతో రైతులు మరింత ఒత్తిడి, నిరాశ నిస్పృహలకు లోనై కంపెనీ పాలనపై వ్యతిరేకత పెంచుకున్నారు.
* భూ యాజమాన్య హక్కులు జమీందార్లకు వెళ్లడంవల్ల రైతులు కౌలుదార్లు, కూలీలుగా మార్పు చెందారు.
నిర్ణీత తేదీలోగా జమీందార్లు, ప్రభుత్వానికి పేష్‌కష్ చెల్లించకపోతే, జమీందారీ హక్కులను కోల్పోవలసి వచ్చేది. అందువల్ల వారి భూములను అమ్మి అయినా జమీందార్లకు భూమిశిస్తు చెల్లించేవారు.
* కంపెనీకి విధేయులైన జమీందారీ వర్గం ఆవిర్భవించింది. వీరే 1857 సిపాయిల తిరుగుబాటులో, స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్‌వారికి అనుకూల పాత్రను పోషించారు.

 

రైత్వారీ విధానం
       రెవెన్యూ విధానాల్లో మరొకటి రైత్వారీ విధానం. భూమిని దున్నే రైతులకే భూమిమీద యాజమాన్యపు హక్కు కల్పించి,మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతునుంచి ప్రభుత్వమే భూమిశిస్తును వసూలు చేసే విధానాన్నే రైత్వారీ విధానం అంటారు.
రైత్వారీ విధానం ప్రవేశపెట్టడానికి కారణాలు:జమీందారీ విధానం విఫలం అవడం ఒక కారణం.జమీందారీ విధానంలో రైతులు, జమీందార్లు, చివరకు కంపెనీ ప్రభుత్వం కూడా దారుణంగా విఫలమైంది. అధిక శిస్తులు, ప్రత్యేక వైపరీత్యాల సమయంలో కూడా శిస్తుల వసూళ్లతో రైతులు;సకాలంలో శిస్తు మొత్తం చెల్లించలేక జమీందార్లు ఇబ్బందులు పడ్డారు. శాశ్వతంగా శిస్తు నిర్ణయించడం వల్ల క్రమేణా వ్యవసాయాభివృద్ధి వల్ల పెరిగిన అదనపు ఆదాయాన్ని కంపెనీ కోల్పోవడం వల్ల జమీందారి విధానం విఫలమైంది.
జమీందారీ విధానం అన్ని చోట్ల వీలుకాకపోవటం: 1803 నాటికి కంపెనీ ప్రభుత్వం మద్రాస్, బాంబేలకు కూడా విస్తరించింది.ఇక్కడ బలమైన భూస్వామ్య వర్గం లేదు.అత్యధిక రైతులు చిన్నచిన్న భూకమతాలు కల్గిన సన్నకారు రైతులు.జమీందారి విధానం ఇక్కడ ప్రవేశపెట్టడానికి వీలుకాని పరిస్థితులుఉండటంతో రైత్వారీ విధానం శ్రేయస్కరమని కంపెనీ ప్రభుత్వం భావించింది.
       జమీందారి విధానం విఫలం అవటం వల్ల వ్యవసాయరంగం దెబ్బతిని బ్రిటీష్ యంత్రాంగంలోని అధికారుల మధ్య విభజన పరిస్థితులేర్పడ్డాయి.థామస్ మన్రో మొదలైన వారు రైతుల ప్రయోజనాలు కాపాడలేని ఏ విధానం మనుగడ సాగించలేదని చెప్పగా,జేమ్స్‌మిల్ మొదలైనవారు రైతు ప్రయోజనాల కంటే బ్రిటీష్ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. దీనివల్ల విభేదాలు రాగా చివరికి కంపెనీ ప్రభుత్వం రైత్వారీ విధానం వైపు అడుగులు వేసింది. పై కారణాల వల్ల రైత్వారీ విధానమే శ్రేయస్కరమని కంపెనీ ప్రభుత్వం భావించింది.మధ్యవర్తులు లేకుండా ప్రభుత్వంతో రైతుకు ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పర్చగల రైత్వారీ విధానాన్ని 1803లో థామస్ మన్రో,కల్నల్ రీడ్‌లతో మద్రాస్ రాష్ట్రంలోని 'బారామహల్' జిల్లాలో మొదటగా ప్రవేశపెట్టింది.
ప్రవేశపెట్టిన ప్రాంతాలు: మద్రాస్, బాంబే, తూర్పు బెంగాల్, అస్సాం, కూర్గ్ మొదలైనవి.
రైత్వారీ విధాన లక్షణాలు: భూమికి హక్కుదారుడు రైతు. ఇలా హక్కుదారునిగా రైతు పొందే పత్రం పట్టా. రైతు భూమిని తాకట్టు పెట్టుకోవచ్చు. అమ్ముకోవచ్చు, బదిలీ చేయవచ్చు. 'పట్టా'ను పొందిన రైతు క్రమం తప్పకుండా భూమి శిస్తును చెల్లించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొంటారు.దీనినే కబూలియత్ అంటారు. రైతులు, నేరుగా ఈ విధానంలో భూమిశిస్తు చెల్లిస్తారు.భూమిశిస్తు వసూలు కోసం కంపెనీ ప్రభుత్వం తరపున అధికారులు ఉంటారు. అంటే ఈ విధానంలో మధ్యవర్తులు ఉండరు. 
         రైతులు కట్టాల్సిన భూమిశిస్తును అవసరమైతే ప్రభుత్వం ఎప్పటికప్పుడు సవరించవచ్చు.
రైత్వారీ విధానం -ఫలితాలు: రైతు ప్రయోజనాలు కాపాడటానికి ఉద్దేశించిన విధానమే అయినా భారతదేశ వ్యవసాయరంగ చరిత్రలో అధిక మొత్తంలో భూమిశిస్తును ఈ విధానంలోనే వసూలు చేశారు.మొత్తం పండిన పంటలో 55%భూమిశిస్తుకింద వసూలు అయ్యింది.సకాలంలో శిస్తు చెల్లించని రైతు భూమిపై హక్కు కోల్పోయాడు.ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా భూమిశిస్తు విషయంలో మినహాయింపులు ఇవ్వకపోవటంతో రైతులు భూమిశిస్తు కట్టేందుకు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చుకోవడం,భూములు అమ్మడంలాంటివి చేశారు.ఈ విధంగా రైత్వారీ విధానంలో ప్రభుత్వమే అతిపెద్ద జమీందారులుగా మారడంతో రైతుల పరిస్థితి మరీ దిగజారి గ్రామీణ పేదరికం పెరిగింది.
రెండు పద్ధతులూ అభివృద్ధి నిరోధకాలే
''బ్రిటిష్‌వారు భారతదేశంలో ప్రవేశపెట్టిన జమీందారీ విధానం ఐర్లాండ్ భూస్వామ్య వ్యవస్థకు ప్రతీక. రైత్వారీ పద్ధతి ఫ్రాన్స్‌లోని స్వతంత్ర వ్యవసాయదారుని వ్యవస్థకు నమూనా.రెండు పద్ధతులు కూడా అభివృద్ధి నిరోధకాలే-అవి రైతుకు ఉద్దేశించినవి కావు.కేవలం శిస్తు వసూలు చేసేందుకు ప్రభుత్వానికి మాత్రమే సహాయపడ్డాయి.'' - కారల్ మార్క్స్

మహల్వారీ విధానం

        బ్రిటిష్‌వారు ప్రవేశపెట్టిన రెవెన్యూ విధానాలలో మరొకటి మహల్వారీ విధానం. ఇది జమీందారీ విధానానికి సవరణలాంటిది.జమీందారి విధానంలో భూమిశిస్తు మొత్తాన్ని వెనువెంటనే పెంచే అవకాశం లేకపోవడంతో,కంపెనీ నష్టపోయే మిగులు ఆదాయాన్ని రాబట్టేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు.
గ్రామం లేదా గ్రామాల సముదాయానికి మహల్ అని పేరు. ఇలా గ్రామం లేదా కొన్ని గ్రామాల సమూహానికి భూమిశిస్తు నిర్ణయించడంవల్ల ఈ విధానాన్ని మహల్వారి విధానం అన్నారు.1822లో మహల్వారీ విధానాన్ని కల్నల్ బర్డ్ ప్రవేశపెట్టారు.
ప్రవేశపెట్టిన ప్రాంతాలు: గుజరాత్, ఆగ్రా, గంగానదీ లోయ, పంజాబ్, మధ్య భారతదేశం మొదలైనవి.
విధాన లక్షణాలు: రైతులనుంచి భూమిశిస్తు వసూలు చేసి, ప్రభుత్వానికి అందజేసే బాధ్యత గ్రామపెద్దలపై ఉంటుంది.
     రైతులందరూ సమష్టిగా భూమిశిస్తును చెల్లించాలి. ప్రభుత్వం, గ్రామం లేదా మహల్స్ కట్టాల్సిన భూమిశిస్తును ఎప్పటికప్పుడు మార్పులు చేయవచ్చు.
విధానం-ఫలితాలు:ఈ విధానంలో భూమిశిస్తును సమష్టిగా రైతులందరూ చెల్లించాలి.అందువల్ల బలమైన వ్యవసాయదారీ వర్గం తమ భూమిశిస్తు భారాన్ని తాము చెల్లించకుండా సన్నకారు,చిన్నకారు రైతులపై రుద్దారు.ఫలితంగా ఈ విధానం ఉన్నతవర్గాలవారికి లబ్ది చేకూర్చింది.ప్రభుత్వం అధికమొత్తంలో భూమిశిస్తు కోరడంవల్ల రైతులు ఈ విధానంలో కూడా దెబ్బతిన్నారు.


రెవెన్యూ విధానాలు - భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
       బ్రిటిష్ వారు అనుసరించిన రెవెన్యూ విధానాలు భారతీయ ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావాన్ని చూపాయి. భూమి, భారతదేశ చరిత్రలో మొదటిసారిగా అమ్మదగిన, కుదువబెట్టదగిన వస్తువుగా మారింది. ఈ విధానాలకు ముందు ఎప్పుడూ భూమిని అనుభవించేదానికి మాత్రమే హక్కు ఉండేదికానీ,క్రయవిక్రయాలు చేసే హక్కు లేదు.భూమి స్వేచ్ఛగా మార్కెట్‌లో అమ్మదగిన, కొనదగిన వస్తువుగా మారడంవల్ల సంప్రదాయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం దెబ్బతింది.
నూతన రెవెన్యూ విధానానికి ముందు భూస్వామి వ్యవసాయాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ గ్రామీణ వ్యవస్థలోనే ఉండేవాడు.కానీ నూతన రెవెన్యూ విధానం వల్ల తన ఆధీనంలోని భూమిని వేరొకరికి ధారాదత్తం చేసి పట్టణాలలో నివాసం ఏర్పర్చుకోవడం ప్రారంభమైంది.ఈ విధంగా పట్టణాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడిపే భూస్వామ్య వర్గం ఆవిర్భవించింది.
    అవసరాలకు అప్పులిచ్చి అధిక మొత్తంలో వడ్డీలను వసూలు చేసే వ్యాపారవర్గం ఆవిర్భవించింది. ఇష్టానుసారం రైతుల నుంచి వడ్డీరేట్లు వసూలు చేసినప్పటికీ కంపెనీ ప్రభుత్వం వడ్డీ వ్యాపారులను నియంత్రించలేదు. పైగా కంపెనీ- ప్రభుత్వ, పోలీస్, న్యాయవ్యవస్థలు కూడా వడ్డీ వ్యాపారులనే బలపరిచాయి. ఈవిధంగా పరిమితులులేని, అంతులేని దోపిడీకి పాల్పడే నూతన వ్యాపారవర్గం ఏర్పడింది.
       వ్యవసాయరంగ స్వరూప స్వభావాల్లో మార్పు వచ్చింది. ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటల ప్రాధాన్యం పెరిగింది.దీనికి కారణం భూమి శిస్తు చెల్లించేందుకు అవసరమైన ఆదాయం ఆహార పంటల దిగుబడి ద్వారా రాకపోవటంతో రైతులు వాణిజ్య పంటలవైపు ఆకర్షితులయ్యారు. 
      వ్యవసాయం వ్యాపారపరం కావటంతో, ఆహారపంటల కొరత ఏర్పడి, భయంకరమైన కరవు కాటకాలను ప్రజలు చవిచూశారు.రైతులు అధికంగా భూమిశిస్తును చెల్లించడం కోసం భూములు అమ్ముకోవడం,తాకట్టు పెట్టడంతో రైతులు కూలీ స్థాయికి మారిపోయారు.దీంతో దినసరి వేతనాలకు పనిచేసే వ్యవసాయ కూలీల సంఖ్య పెరిగింది.పేదరికాన్ని అనుభవించలేని వ్యవసాయ కూలీలు జీవనోపాధి కోసం అధికసంఖ్యలో పట్టణాలకు వలస వెళ్ళడం జరిగింది.
  పైవిధంగా బ్రిటీష్‌వారి రెవెన్యూ విధానాలు భారతీయ సామాజిక ఆర్థిక మార్పులకు కారణమై, స్వయం సమృద్థ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేశాయి. గ్రామీణ పేదరికాన్ని పెంచాయి.

Posted Date : 12-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌