• facebook
  • whatsapp
  • telegram

కాక‌తీయులు

11 - 15 శతాబ్దాల మధ్య ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, మత పరిస్థితులు

కాకతీయుల తొలి ప్రస్తావన తూర్పు చాళుక్య రాజు దానార్ణవుడి మాగల్లు శాసనం (క్రీ.శ. 950)లో ఉంది. ఇది గుండియ - ఎరియ - కాకర్త్య గుండనల గురించి వివరిస్తుంది. గణపతి దేవుడి చెల్లెలు మైలాంబ బయ్యారం చెరువు శాసనం వెన్న భూపతి వంశీయులే కాకతీయులని పేర్కొంటుంది. కాకతీయులు మొదట రాష్ట్రకూటుల వద్ద, తర్వాత కల్యాణి చాళుక్యుల వద్ద సేనానులుగా పనిచేశారు. రాష్ట్రకూటులది గరుడకేతనం. రాష్ట్రకూట అనేది ఉద్యోగనామం. కాకతీయులు కల్యాణి చాళుక్యుల వరాహ లాంఛనాన్ని స్వీకరించారు. కాకతి అనే దేవతను పూజించడం వల్ల కాకతీయులు అయ్యారు. కాకతి అంటే కూష్మాండం/ గుమ్మడి అనే అర్థం కూడా ఉంది. 22వ తీర్థంకరుడైన నేమినాథుడి శాసనాధికారిణి పేరు కూష్మాండిణి. కాకతీయులు మొదట జైనులు కాబట్టి కూష్మాండి దేవతను కూడా పూజించారు. ఆంధ్రరాజులగా కీర్తి నొందారు.


         కాకతి వంశ ప్రతిష్ఠకు పునాది వేసింది మొదటి బేతరాజు. ఇతడికి కాకతి పురాధినాథ అనే బిరుదు ఉంది. మొదటి ప్రోలరాజుకు కాకతి వల్లభ అనే బిరుదుంది. సిద్ధేశ్వర చరిత్ర గ్రంథంలో కాకతీయ మూలపురుషుడు మాధవవర్మ అని ఉంది. కాకతీయుల కాలంలో చేబ్రోలును మహాసేనం అని, అనుమకొండను రుద్రేశ్వరం అని పిలిచేవారు. అనుమకొండ రాజు పద్మసేనుడు సిద్ధేశ్వరుడిని గుమ్మడిపూలతో పూజించడం వల్ల సంతానం కలిగింది. కాబట్టి వారి సంతానాన్ని గుమ్మడితీగ సంతానం అని పిలిచేవారు. కాకతీయులను ఆంధ్రదేశాధీశ్వరులు, మహామండలేశ్వరులు, స్వయంభూ దేవతారాధకులు అని పిలుస్తారు. రట్టడి (గ్రామపెద్ద) పదవితో వీరి రాజకీయ ప్రస్థానం మొదలైంది.

మొదటి బేతరాజు (క్రీ.శ. 992 - 1052):
 కాకతీపురాధినాథ బిరుదాకింతుడు. ఇతడు వేయించిన శనిగరం శాసనం ద్వారా సెబ్బిమండలం (కరీంనగర్)లో కొంత భాగం ఇతడి పాలనలో ఉన్నట్లు తెలుస్తోంది. బేతేశ్వరాలయాన్ని నిర్మించాడు. మొదటి బేతరాజు మంత్రి నారణయ్య శనిగరంలోని యుద్ధమల్ల జైనాలయాన్ని పునర్ నిర్మించాడు.

 

మొదటి ప్రోలరాజు (క్రీ.శ. 1052 - 1076):
ఇతడు అరికేసరి/ అరిగజకేసరి బిరుదు పొందాడు. ఓరుగల్లు సమీపంలో కేసరి తటాకాన్ని తవ్వించాడు. చాళుక్య మొదటి సోమేశ్వరుడికి కొప్పం యుద్ధంలో సహకరించి అతడి నుంచి అనుమకొండ ప్రాంతాన్ని పొందాడు.

 

రెండో బేతరాజు (1076 - 1108):
త్రిభువనమల్ల, విక్రమచక్ర రెండో బేతరాజు బిరుదులు. మంత్రి వైజదండాధిపుడు. రెండో బేతరాజు మరణానంతరం పెద్ద కుమారుడు దుర్గరాజు పాలనకు వచ్చాడు. మొదటి బేతరాజు నిర్మించిన బేతెశ్వరాలయానికి దుర్గరాజు రామేశ్వర పండితుడి పేరుమీద దానధర్మాలు చేసినట్లు ఖాజీపేట దర్గాశాసనం తెలుపుతోంది. దుర్గరాజు పాలనా కాలం 1108 - 1116 (గురువు - ధ్రువేశ్వరుడు)

 

రెండో ప్రోలరాజు (క్రీ.శ. 1116 - 1157):
మొదటి కాకతీయుల్లో సుప్రసిద్ధుడు రెండో ప్రోలరాజు. రుద్రదేవుడి అనుమకొండ శాసనం ఇతడి విజయాలను తెలుపుతోంది. ఇతడు ఓరుగల్లు పట్టణ నిర్మాణం ప్రారంభించాడు. అందులో స్వయంభూ దేవాలయాన్ని నిర్మించాడు.

      మహామండలేశ్వర బిరుదుతో పాలించాడు. శ్రీశైలంలో విజయస్తంభాన్ని నాటాడు. అనుమకొండలో పద్మాక్షి, సిద్ధేశ్వర, కేశవ ఆలయాలను నిర్మించాడు. ఓరుగల్లును క్రీడాభిరామం గ్రంథం ఆంధ్రనగరి అని పేర్కొంది. దీన్ని ఏకశిలానగరం అని కూడా అంటారు. మైలమ అనుమకొండలో కడలాలయ జైన బసదిని నిర్మించింది. రెండో ప్రోలరాజు కాలం నుంచే వరాహం అధికార చిహ్నమైంది.
 

రుద్రదేవుడు/ మొదటి ప్రతాపరుద్రుడు (1157 - 1195):

స్వతంత్ర కాకతీయ రాజ్యస్థాపకుడు. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసాడు. వేయిస్తంభాల గుడిని నిర్మించాడు. కాలచూరి బిజ్జలుడు ఇతడి చేతిలో ఓడినట్లు బిజ్జలుని లక్ష్మీశ్వర శాసనం తెలుపుతోంది. 1176 - 82 సంవత్సరాల మధ్య జరిగిన పలనాటి యుద్ధంలో కాకతిరుద్రుడు నలగాముడి పక్షాన పోరాడాడు. త్రిపురాంతకం శాసనాన్ని 1185లో వేయించాడు. 1186లో ద్రాక్షారామ శాసనం వేయించాడు. యాదవరాజు జైత్రపాలుడి చేతిలో మరణించాడు. ఇతడి కాలంలోనే శైవ - జైన సంఘర్షణలు ప్రారంభమయ్యాయి. జైనాచార్యుడైన ఉపమన్యముని సహాయంతో మహాదేవుడు రుద్రుడిపై తిరుగుబాటు చేశాడు. మల్లిఖార్జున పండితారాధ్యుడు రుద్రుడి సమకాలికుడు. రుద్రుడు అనుమకొండలో రుద్రేశ్వరాలయాన్ని నిర్మించాడు. రుద్రుడి మంత్రి గంగాధరుడు బుద్ధదేవుడి ఆలయం నిర్మించాడు. రుద్రదేవుడు సంస్కృత భాషలో నీతిసారం అనే గ్రంథాన్ని రచించాడు. రుద్రదేవుడికి విద్యాభూషణం అనే బిరుదు ఉంది. అనుమకొండ శాసనాన్ని రచించిన కవి అచితేంద్రుడు. తోలు బొమ్మలాట అభివృద్ధి గురించి పేర్కొన్న గ్రంథం - ప్రతాపరుద్రీయం.

మహదేవుడు (1195 - 1199):
         శైవ మతాభిమాని. ఇతడి గురువు ధృవేశ్వర పండితుడు. ప్రతాపరుద్రుడి ఖండవల్లి శాసనం ప్రకారం రుద్రదేవుడే మహాదేవుడికి రాజ్యం అప్పగించాడు. మహదేవుడి భార్య భయ్యాంబిక, కుమారుడు గణపతి దేవుడు, కుమార్తెలు - మైలాంబ, కుందమాంబ. ఇతడు కూడా యాదవరాజు జైతుగి చేతిలో మరణించాడు. అతి తక్కువ కాలం పాలించిన పాలకుడు ఇతడే.

 

గణపతిదేవుడు (1199 - 1262):
         అతి ఎక్కువ కాలం పాలించిన వ్యక్తి. తెలుగు భాష మాట్లాడే వారందరినీ ఏకం చేసి పాలించిన కాకతీయ రాజు. జైతుగి కుమారుడు సింఘనకు తెలుగు రాయస్థాపనాచార్య అనే బిరుదు ఉంది. గణపతి దేవుడి గురువు విశ్వేశ్వర శంభు. రేచర్ల రుద్రుడికి కాకతీయ రాజ్యస్థాపనాచార్య, కాకతీయరాజ్య భారధేరేయ అనే బిరుదులు ఉన్నాయి. 1199 నాటి గణపతి దేవుడి మంథెన శాసనంలో అతడి బిరుదు సకలదేశ ప్రతిష్ఠాపనాచార్య. గణపతి సేనాని ముత్యాల చెండరాయడు వెలనాడు, దివిసీమ ప్రాంతాలపై దాడిచేసి విజయం సాధించాడు. చందోలు పాలకుడు పృథీశ్వరుడిని, దివిసీమ అయ్యవంశానికి చెందిన ఫిన్నచోడుడిని ఓడించాడు. ఫిన్న చోడుడి కుమార్తెలు నారమ, పేరమలను గణపతి వివాహం చేసుకున్నాడు. వారి సోదరుడు జాయపను తన గజసాహిణిగా నియమించుకున్నాడు. తిక్కన నిర్వచనోత్తర రామాయణం ప్రకారం ఛోడతిక్కన పృథీశ్వరుడి శిరస్సుతో ఆటలాడినట్లు తెలుస్తోంది. గణపతి దేవుడికి పృథ్వీశ్వర శిరఃకందుక క్రీడా వినోద అనే బిరుదు కూడా ఉంది. అతడు 1254లో రాజధానిని హనుమకొండ నుంచి వరంగల్లుకు మార్చాడు. కుమార్తెలు రుద్రమదేవిని నిడదవోలు - వీరభద్రుడికి, గణపాంబను కోట పాలకుడు బేతరాజుకు ఇచ్చి వివాహాలు చేశాడు.

       సోదరి మేళాంబికను నతవాడి పాలకుడు పృథ్వీరాజుకిచ్చి వివాహం చేశాడు. మనుమసిద్ధి ఆస్థానంలోని తిక్కన రాయభారం వల్ల మోటుపల్లి రేవును పొందాడు. మోటుపల్లికి - దేశీయ కొండాపురం అనే పేరుంది. బమ్మెర పోతన (ఒంటిమిట్ట - కడప) ఇతడి కాలం వాడే. కానీ గణపతి 1262లో జటావర్మ సుందర పాండ్యుడి చేతిలో ముత్తుకూరు యుద్ధంలో ఓడిపోయాడు. జాయప దక్షిణ దండయాత్రలను చేబ్రోలు శాసనం తెలియజేస్తుంది. గణపేశ్వర శాసనం కూడా జాయప విజయాలను తెలుపుతోంది. గణపతి దేవుడికి చోడకటక చూరకార బిరుదు కూడా ఉంది. తిక్కన నిర్వచనోత్తర రామాయణం ఛోడ తిక్కన కురువులూరు యుద్ధం గురించి వివరిస్తుంది. గణపతి నెల్లూరు ఛోడతిక్కన కుమారుడైన మనుమసిద్ధి (వీరగండ గోపాలుడు)కి సాయంచేశాడు. ఈ విషయాన్ని న్యాయనిపల్లి శాసనం తెలుపుతోంది. గణపతి గురువు విశ్వేశ్వర శంభు (శివదేవుడు) గోళకీమఠాలు ఏర్పాటు చేశాడు. రామప్ప దేవాలయాన్ని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. శిల్పి రామప్ప గణపతి దేవుడు అభయశాసనం, మోటుపల్లి శాసనాలు వేయించాడు. నాటి మోటుపల్లి పాలకుడు సిద్ధయ దేవుడు. గణపతి దేవుడు వరంగల్లులో స్వయంభూదేవాలయాన్ని నిర్మించాడు. మోటుపల్లి, అభయ శాసనాలు వేయించాడు. తిక్కన గణపతి దేవుడి సమకాలీనుడు.


 

రుద్రమదేవి (1262 - 1289):
         ఆంధ్రదేశాన్ని పాలించిన తొలి మహిళ. శాసనాల్లో రుద్రదేవ మహారాజు, రాయగజకేసరి లాంటి బిరుదులతో ఈమెను ప్రస్తావించారు. కాయస్థ అంబదేవుని దుర్గి శాసనం రుద్రమను కఠోధృతి/ పట్లోధృతిగా వర్ణిస్తుంది. రుద్రమ సేనాని రేచర్ల ప్రసాదిత్యుడికి రాయపితామహాక, కాకతీయ రాజ్యస్థాపనాచార్య బిరుదులు ఉన్నాయి.

        ఓరుగల్లు కోట లోపల మెట్లు కట్టించింది. కులశేఖర పాండ్యుడిని ఓడించింది. కానీ, కాయస్థ అంబదేవుడు ఈమెను యుద్ధభూమిలోనే వధించినట్లు చందుపట్ల శాసనం (నల్గొండ జిల్లా) ద్వారా తెలుస్తోంది. త్రిపురాంతకం శాసనం కూడా అంబదేవుని విజయాలను వర్ణిస్తోంది. అంబదేవుడు కొప్పెరుంజింగని వధించి కాడవరాయి విధ్వంసక బిరుదు పొందాడు. యాదవరాజులపై రుద్రమ విజయాన్ని బీదర్ శాసనం తెలుపుతుంది. హేమాద్రి తన వ్రతఖండం గ్రంథంలో రుద్రమదేవిని ఆంధ్రమహారాణి అని పేర్కొన్నాడు. బీదర్‌కోట శిలాశాసనంలో రాయగజకేసరి బిరుదును ప్రస్తావించడమైంది. రుద్రమ మల్కాపురం శాసనం (నల్గొండ) ప్రసూతి వైద్యకేంద్రాల గురించి వివరిస్తుంది. విశ్వేశ్వర శివాచార్యులకు మందడం అనే గ్రామాన్ని దానం చేసింది.
 

రెండో ప్రతాపరుద్రుడు (క్రీ.శ. 1289 - 1323):
         చివరి కాకతీయ రాజు. ఇతడు రుద్రమ కుమార్తె ముమ్మిడమ్మ కుమారుడు. రాజ్యాన్ని 77 నాయంకరాలుగా విభజించాడు. తురుష్కులు కాకతీయ రాజ్యంపై 8 సార్లు దండెత్తినట్లు విలస తామ్రశాసనం, కలువ చెరువు శాసనాలు పేర్కొంటున్నాయి. కానీ ముస్లిం రచనలు మాత్రం 5 దండయాత్రలనే తెలుపుతున్నాయి. 1303లో కాకతీయ, ఖిల్జీ సైన్యాలు కరీంనగర్‌లోని ఉప్పరపల్లి వద్ద తలపడ్డాయి. రేచర్ల వెన్నసేనాని, పోలుగంటి మల్లి మాలిక్ ఫక్రుద్దీన్ జునాను ఓడించారు. 1309లో మాలిక్ కపూర్ దండయాత్రను అమీర్ ఖుస్రూ పేర్కొన్నాడు. తర్వాత ముబారక్ ఖిల్జీ ఖుస్రూఖాన్‌ను పంపాడు. ఘియాసుద్దీన్ తుగ్లక్ ఉలూగ్/ జునాఖాన్/ మహ్మద్ బిన్ తుగ్లక్‌ను పంపాడు. ప్రతాపరుద్ర చరిత్ర ప్రకారం 'బొబ్బారెడ్డి' అనే సేనాని కాకతీయ సైన్యం నుంచి వైదొలగి ద్రోహం చేసినట్లు తెలుస్తోంది. 1323లో ప్రతాపరుద్రుడిని ఖాదర్‌ఖాన్ దిల్లీకి తీసుకుపోతుండగా నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

          ఆంధ్రనగరి లేదా ఓరుగల్లును సుల్తాన్‌పూర్‌గా పేరు మార్చారు. గంగాదేవి మధురా విజయం, ప్రోలయ నాయకుడి విలస తామ్ర శాసనం ప్రతాపరుద్రుడి ఆత్మహత్య గురించి పేర్కొన్నాయి. వరంగల్‌లో బుర్హనుద్దీన్‌ను పాలకుడిగా నియమించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గన్నమనాయుడు తుగ్లక్‌ల ఆస్థానంలో ఉప ప్రధాని (మాలిక్ మక్బూల్)గా పనిచేశాడు. ఇతడు తెలంగాణ బ్రాహ్మణుడు. అనితల్లి కలువచేరు శాసనం కూడా ముస్లిం దండయాత్రలను వివరిస్తోంది. ప్రతాపరుద్రుడి ప్రధాని ముప్పిడినాయకుడు.
 

కాకతీయుల పాలన:
         బద్దెన - నీతిశాస్త్ర ముక్తావళి, శివదేవయ్య - పురుషార్థసారం, మొదటి ప్రతాపరుద్రుడు నీతిసారం, మడికిసింగన - సకలనీతి సమ్మతం లాంటి గ్రంథాలు కాకతీయుల పాలనా విశేషాలను వివరిస్తాయి. రాచరికం సప్తాంగ సమన్వితం. మహాప్రధాన, ప్రధాన, ప్రెగ్గడ, అమాత్య, మంత్రి అనే ఉద్యోగుల పేర్లు శాసనాల్లో కనిపిస్తున్నాయి. 18 మంది తీర్థుల గురించి సకలనీతి సమ్మతం పేర్కొంటోంది. రాజు - మంత్రులు, తీర్థులతో తరచూ సంప్రదిస్తూ ఉండాలని పురుషార్థసారం పేర్కొంది. రాజోద్యోగులను 72 నియోగాలుగా విభజించారు. బహత్తర నియోగాధిపతి 72 నియోగాలపై పర్యవేక్షకుడిగా ఉండేవాడు. కాకతీయులు మహామండలేశ్వర  బిరుదు ధరించారు.
           రాజ్యాన్ని నాడులు - స్థలాలు - గ్రామాలుగా విభజించారు. నాడులకు సీమ, పాడి, భూమి అనే పర్యాయ పదాలున్నాయి. గ్రామంలో 12 మంది ఆయగాండ్రు ఉండేవారు. కరణం, రెడ్డి (పెదకాపు), తలారి మాత్రమే ప్రభుత్వ ప్రతినిధులు. మిగిలిన 9 మంది తమ వృత్తుల ద్వారా విధులు నిర్వహించేవారు. న్యాయ విషయాల్లో ప్రాడ్వివాక్కులు రాజుకు సలహాలిచ్చేవారు.

          గ్రామాల్లో తగాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక ఉద్యోగులను నియమించేవారని దుగ్గిరాల శాసనం పేర్కొంది. సమయసభలు అనే న్యాయ సభలు ఉండేవి. ప్రత్యేక నేరాల విచారణకు నిపుణులతో ధర్మాసనాలు ఏర్పాటు చేసినట్లు క్రీడాభిరామం పేర్కొంది. ఆయగాండ్రు రైతుల నుంచి పంటలో కొంత భాగం 'మేర' వసూలు చేసేవారు. రాచపొలాన్ని కౌలు (కోరు)కు తీసుకున్న రైతులను అర్థశీరి అనేవారు. పెనుంబాకం మానదండం, కేసరిపాటిగడలు ఉపయోగించి పొలాన్ని సర్వే చేయించేవారు. రాచపొలం, నీరుపొలం, వెలిపొలం, తోటపొలం అని భూములను వర్గీకరించేవారు. సన్నిగండ్ల శాసనం కొలగాండ్రు, కరణాలను ప్రస్తావించింది. గొర్రెల మందలపై అడ్డవట్ల పన్ను విధించేవారు. కోటగణపాంబ వేయించిన మొగలుట్ల శాసనం వృత్తి పన్నుల గురించి వివరిస్తోంది. వడ్రంగులను తక్షక అనేవారు. రేవు పట్టణాలను కర పట్టణాలు అనేవారు. పన్నులు వసూలు చేసే స్థలాలను ఘట్టాలు అని పిలిచేవారు.
           సైనిక వ్యవస్థలో దుర్గాలకు అధిక ప్రాముఖ్యం ఉందని పురుషార్థసారం, నీతిసారం తెలుపుతున్నాయి. రథాలు వాడుకలో లేవు. చతురంగ బలాలన్నీ మహారాజ పట్టసాహిణి పర్యవేక్షణలో ఉండేవి. ప్రతాపరుద్ర చరిత్ర ప్రకారం కాకతీయ సైన్యంలో వెలమల ప్రాబల్యం అధికంగా ఉండేది. రాజు అంగరక్షకదళం (వెంకి) గురించి సకలనీతి సమ్మతం తెలుపుతోంది. ప్రతాపరుద్రుడి కాలంలో నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టారు. 75 మంది నాయంకరులు ఉన్నట్లు బద్దెన నీతిశాస్త్ర ముక్తావళి తెలుపుతోంది. రాజుతోపాటు స్వచ్ఛందంగా మరణించే సైనిక బృందాలు లెంకలు.

ఆర్థిక పరిస్థితులు:
        వ్యవసాయం ప్రధాన వృత్తి. మొదటి ప్రోలరాజు కేసరి సరస్సును, రేచర్ల రుద్రుడు పాకాల చెరువును తవ్వించారు. ఓరుగల్లు ప్రాంతంలో సువాసనలు వెదజల్లే బియ్యం పండించేవారు. కందిపప్పు వాడకంలో లేదు. పాల్కురికి సోమనాథుడు 'పండితారాధ్య చరిత్ర'లో 20కి పైగా వస్త్ర రకాలను పేర్కొన్నాడు. మచిలీపట్నం వస్త్రాల గొప్పతనం గురించి మార్కోపోలో తెలియజేశాడు. ఓరుగల్లులో రత్నకంబళ్లు, మఖమల్ వస్త్రాలు నేసేవారు. నిర్మల్ కత్తులు డమాస్కస్‌కు ఎగుమతి అయ్యేవి. త్రిపురాంతకంలో పంచలోహ స్తంభాన్ని బ్రహ్మనాయుడు ఎత్తించినట్లు పల్నాటి వీరచరిత్ర పేర్కొంటోంది.
          ఆదిలాబాద్ జిల్లా కూనసముద్రం కత్తులకు ప్రసిద్ధి. మోటుపల్లి (ప్రకాశం), కృష్ణపట్నం (నెల్లూరు), హంసలదీవి (గుంటూరు), మైసోలియా లాంటి రేవు పట్టణాల ద్వారా విదేశీ వాణిజ్యం జరిగేది. విదేశీ వర్తకాన్ని ప్రోత్సహించాలని నీతిసారం గ్రంథం పేర్కొంది. గోల్కొండ ప్రాంత వజ్రపు గనుల గురించి మార్కోపోలో పేర్కొన్నాడు. వర్తకులు నకరం - స్వదేశీ - పరదేశీ - నానాదేశీ పెక్కుండ్రు అనే శ్రేణులుగా ఏర్పడేవారు. త్రిపురాంతకంలో అయ్యావళి అయినూరరు (500) అనే కన్నడదేశ వర్తక శ్రేణి ఉంది. యనమదల శాసనం వర్తక శ్రేణుల గురించి పేర్కొంది. నాటి నాణేలన్నింటిలో పెద్దది గద్యాణం. ఇది బంగారు నాణెం. దీన్ని నిష్క లేదా మాడ అని కూడా పిలిచేవారు. రూక అనేది వెండి నాణెం. ఒక మాడకు పది రూకలు అని బాపట్ల శాసనం పేర్కొంది. రూకలో విభాగాలైన అడ్డుగ, పాదిక, వీస, చిన్నం అనే నాణేలు ఉండేవి.

మత, సాంఘిక పరిస్థితులు:
       కాకతీయులు మొదట జైన మతాన్ని అనుసరించారు. హనుమకొండలో అనేకమంది జైనులు ఆశ్రయం పొందారు. ప్రోలరాజు మంత్రి బేతన భార్య మైలమ హనుమకొండపై జైనాలయ బసది (కడలాలయ బసది) నిర్మించింది. రెండో ప్రోలరాజు హనుమకొండ శాసనం జినేంద్ర ప్రార్థనతో ప్రారంభమవుతుంది. కానీ రెండో బేతరాజు, దుర్గరాజులు రామేశ్వర పండితుడి (శ్రీశైల మఠాధిపతి)ని గురువుగా భావించారు. నాడు ఆలంపురం గొప్ప కాళాముఖ శైవ క్షేత్రం. పండితారాధ్యుడు పానగల్లురాజును శపించినట్లు తెలుస్తోంది. బ్రహ్మయ అనే శైవుడు గోవూరు(కోవూరు-నెల్లూరు)లోని జైనబసదులను నేలమట్టం చేశాడు. పొట్ల చెరువు, తిరువూరుల్లో బసదులను కూల్చి జైనులను హింసించారు. సిద్ధేశ్వర చరిత్ర ప్రకారం గణపతిదేవుడు హనుమకొండలోని జైనులను క్రూరంగా హింసించాడు. గణపతి గురువు విశ్వేశ్వరశివుడు 36 జైన గ్రామాలను నాశనం చేశాడు. దాహళ దేశంలో సద్భావశంభు గోళకీమఠాన్ని స్థాపించగా ఆంధ్రలో విశ్వేశ్వర శివదేవుడు ప్రధానాచార్యుడయ్యాడు. ఆంధ్రలోని ప్రసిద్ధ గోళకీ మఠ కేంద్రం మందడం. వైష్ణవం కూడా ఆదరణకు నోచుకుంది. శ్రీకూర్మం, శ్రీకాకుళం, తిరుపతి, మంగళగిరి, సింహాచలం నాటి ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలు. రామానుజాచార్యులు శైవ క్షేత్రాలను వైష్ణవ క్షేత్రాలుగా మార్చినట్లు శ్రీపతి భాష్యం తెలుపుతోంది. రుద్రదేవుడి మంత్రి గంగాధరుడు విష్ణు భక్తుడు. తిక్కన ప్రభావం వల్ల గణపతిదేవుడు వైదిక మతాభిమాని అయ్యాడు. విశ్వేశ్వర శివుడు మందడంలో వేద పాఠశాల నెలకొల్పాడు. ప్రతాపరుద్రుడి కాలానికి బ్రాహ్మణాధిక్యం పెరిగినట్లు పిడుపర్తి సోముడి బసవపురాణం తెలుపుతోంది. మైలారదేవుని ఆరాధనలో తలలు కత్తిరించుకునేవారు. ఆలయ ఉద్యోగ బృందంలో స్థానాపతులు ప్రధానాధికారులు. నాడు ఆలయ ఉద్యోగి బృంద పర్యవేక్షణకు బహత్తర నియోగాధిపతి ఉండేవాడు.

       నాటి కుల సంఘాలను సమయములు అనేవారు. బ్రాహ్మణ సమయానికి మహాజనులు అనీ, వైశ్య సంఘానికి నకరము అనే ప్రత్యేక పేర్లు ఉన్నాయి. సానుల వృత్తి సంఘాలను సానిమున్నూరు అనేవారు. రుద్రదేవుడి కాలం నుంచే కాకతీయులు వైదిక మతాభిమానులు అయ్యారు. వీరి కాలంలోనే వెలమ, రెడ్డి కులాల మధ్య అధికారం కోసం పోటీ ప్రారంభమైంది. సమయాచారాలకు విరుద్ధంగా ప్రవర్తించినవారికి సమయ దండన విధించేవారు. బాపట్ల శాసనం సమయ సేనాపతి అనే ఉద్యోగిని పేర్కొంటోంది.
  అరిగాపులు అంటే పన్ను కట్టాల్సిన రైతులు. కొలగాండ్రు అంటే పన్ను వసూలు చేసేవారు. పట్టప హుండీ - ధన రూపంలో విధించే పన్ను, పట్టు కొలచు - ధాన్య రూపంలో విధించే పన్ను.

 

పన్నులు:
          దర్శనం - రాజు దర్శనం కోసం చెల్లించే పన్ను. అప్పణం - రాజు అకారణంగా వేసేది. ఉపకృతి - యువరాజు ఖర్చుల కోసం చెల్లించే పన్ను. అడ్డు సుంకం - యాదవ వర్గాలపై పన్ను. కాకతీయుల కాలంలో పన్ను 1/6 వ వంతు. రాజన్నశాలి అనేది ఒక వరి వంగడం. ఇటీవల తవ్వకాల్లో బయల్పడిన ద్రెక్మ నాణెం గ్రీకు నాణేలను పోలి ఉంది. కాకతీయ రాజులు యుద్ధానికి వెళ్లే ముందు మొగిలిచర్లలో ఉన్న ఏకవీరాదేవిని ఆరాధించేవారు. ప్రధాన వినోదం తోలుబొమ్మలాట. మాడ అనే బంగారు నాణేన్ని కాకతీయులు ప్రవేశపెట్టారు.

భాష - సాహిత్యాలు:
        కాకతీయుల అధికార భాష సంస్కృతం. విద్యామంటపాలను ఏర్పాటు చేశారు. మందడం వేద పాఠశాలను విశ్వేశ్వర శివుడు నిర్మించాడు. పాకాల శాసన రచయిత కవి చక్రవర్తి గణపతిదేవుడి ఆస్థాన కవి. రుద్రదేవుడు నీతిసారంను రచించాడు. ప్రతాపరుద్రుడి ఆస్థానంలోని అగస్త్యుడు నలకీర్తి కౌముది, బాలభారత మహాకావ్యం, కృష్ణచరిత మొదలైన గ్రంథాలు రాశాడు. గంగాదేవి మధురా విజయంలో అగస్త్యుడిని తన గురువుగా కీర్తించింది. మరో కవి శాకల్య మల్లుభట్టు ఉత్తర రాఘవకావ్య, నిరోష్ట్య రామాయణం లాంటి కావ్యాలు రాశాడు. విద్దనాచార్యులు ప్రమేయచర్చామృతం గ్రంథాన్ని రాశాడు. గంగయభట్టు శ్రీహర్షుడి ఖండన ఖండ ఖాద్య గ్రంథానికి వ్యాఖ్యానం రాశాడు. ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రాశాడు.
గమనిక: విద్యానాథుడు, అగస్త్యుడు ఒక్కరే అని కొందరి భావన. కాళిదాసు కావ్యాలకు వ్యాఖ్యాత అయిన మల్లినాథుడే విద్యానాథుడని కొందరి భావన.
         జైన కవి అధర్వణుడు విరాట పర్వతాన్ని అనువదించినట్లు తెలుస్తోంది. అప్పయార్యుడు జైనేంద్ర కళ్యాణాభ్యుదయం కావ్యాన్ని రాశాడు. మల్లికార్జున పండితుడు శివతత్వసారం రచించాడు. యధాహక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకం రచించాడు. శివదేవయ్య శివదేవధీమణి మకుటంతో శతకాన్ని రచించాడు. పాల్కురికి సోమనాథుడు (పాలకుర్తి) పండితారాధ్య చరిత్ర, బసవపురాణం గ్రంథాలను రాశాడు. అనుభవసారం అనే పద్య కావ్యాన్ని, వృషాధిప శతకాన్ని కూడా రచించాడు. సంస్కృతంలో రుద్రభాష్యం రచించాడు. హుళక్కి భాస్కరుడు భాస్కర రామాయణం రచించాడు. తిక్కన శిష్యువైన మారన మార్కండేయ పురాణాన్ని తెనిగించి నాగయగన్న మంత్రికి అంకితం చేశాడు.

         మూలఘటిక కేతన దశకుమార చరిత్రను తెనిగించాడు. అభినవ దండిగా పేరొందిన కేతన రచనయే తెలుగులో మొదటి కథాకావ్యంగా ప్రసిద్ధి. మంచన కేయూర బాహుచరిత్రను రాసి గుండనమంత్రికి అంకితమిచ్చాడు. కాకతీయ యుగంలోనే శివకవులు శతక ప్రక్రియను ప్రారంభించారు. తిక్కన సోమయాజి కృష్ణ శతకాన్ని, బద్దెన నీతి శతకాన్ని (సుమతీ శతకం) రచించారు. యాజ్ఞవల్క్యుడి ధర్మశాస్త్రాన్ని కేతన విజ్ఞానేశ్వరీయం పేరుతో అనువదించాడు. ఆంధ్ర భాషా భూషణం గ్రంథం ద్వారా తెలుగు భాషా శాస్త్రానికి పునాదులు వేశాడు. తిక్కన కవి వాగ్బంధం అనే ఛంధో గ్రంథాన్ని రాశాడని ప్రతీతి. బద్దెన నీతిశాస్త్ర ముక్తావళి ప్రముఖ రాజనీతి గ్రంథం. క్షేమేంద్రుడు ముద్రామాత్యం, శివదేవయ్య పురుషార్థసారం, ఆంధ్రభోజుడు (అప్పనమంత్రి) నీతి భూషణం గ్రంథాలను రచించారు. భోజకవి (భోజుడు) చారుచర్య అనే వైద్య గ్రంథాన్ని రచించాడు. కేతన కాదంబరి, రావిపాటి త్రిపురాంతకుడు మదన విజయం నాటి ప్రధాన శృంగార కావ్యాలు. త్రిపురాంతకుడు (తిప్పన్న) ప్రేమాభిరామం పేరుతో సంస్కృతంలో వీధి నాటకం రచించాడు.
          తిప్పన్న అంబికా శతకం కూడా రాశాడు. వినుకొండ వల్లభామాత్యుడి క్రీడాభిరామం ఓరుగల్లు మత, సాంఘిక జీవితాన్ని; ద్వారసముద్రంలోని నటుల గురించి వివరిస్తుంది. మల్కాపురం శాసనం మందడంలోని విశ్వేశ్వర దేవస్థానంలోని ఆటగత్తెలు (10), పాటగత్తెల (12) గురించి పేర్కొంటుంది. జాయపసేనాని నృత్యరత్నావళి చిందు, కోలాటం లాంటి అనేక జానపద నృత్యాలను పేర్కొంది. గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం రచించాడు.

వాస్తు నిర్మాణాలు:

దేశ రక్షణలో దుర్గాలకు ప్రాముఖ్యం ఉంది. మూడు రక్షణ శ్రేణులతో (పుట్టకోట, మట్టికోట, అగడ్త రాతికోట) ఓరుగల్లు దుర్గాన్ని నిర్మించారు. ప్రతాపరుద్ర చరిత్ర ప్రకారం రాతికోటలో 77 బురుజులు ఉండేవి. రుద్రమదేవి కాలంలో రాతికోట లోపలి భాగంలో మెట్లను నిర్మించారు. ప్రోలరాజు కాలంలో హనుమకొండలో సిద్ధేశ్వర, పద్మాక్షి ఆలయాలు; ఓరుగల్లులో స్వయంభూ, కేశవ ఆలయాలను నిర్మించారు. 1162లో కాకతి రుద్రుడు హనుమకొండలో వేయిస్తంభాల గుడి (త్రికూటాలయం)ని నిర్మించాడు. రుద్రేశ్వర, వాసుదేవ, సూర్యదేవులే త్రికూటాధిపతులు. గణపతి దేవుడి కాలంలో ఓరుగల్లు, పాలంపేట, పిల్లలమర్రి, కొండపర్తి, నాగులపాడు మొదలైన ప్రాంతాల్లో ఆలయాలను నిర్మించారు. పాలంపేట రామప్ప దేవాలయాన్ని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ప్రతాపరుద్ర చరిత్ర ప్రకారం ఓరుగల్లులో 1500 మంది చిత్రకారుల గృహాలు ఉన్నాయి.  రెండో ప్రతాపరుద్రుడి ఆస్థాన నర్తకి మాచల్దేవి చిత్రశాలను నిర్మించినట్లు క్రీడాభిరామం గ్రంథం తెలుపుతోంది. మాచర్లలో చెన్నకేశవస్వామి ఆలయాన్ని నిర్మించారు. స్వయంభూ దేవుడి విగ్రహం దిల్లీ మ్యూజియంలో ఉంది. హనుమకొండలో నంది విగ్రహం ప్రసిద్ధి చెందింది. ఓరుగల్లు గురించి అమీర్ ఖుస్రూ తన రచనల్లో పేర్కొన్నాడు.

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌