• facebook
  • whatsapp
  • telegram

మొగ‌ల్ సామ్రాజ్యం

భారతదేశ చరిత్రలో మొగల్ సామ్రాజ్యానికి విశిష్ట స్థానం ఉంది. 300 సంవత్సరాల ఢిల్లీ సుల్తానుల పాలనను అంతమొందించడమే కాకుండా భారత ఉపఖండంలో నూతన శకం ఆరంభానికి మొగలులు నాంది పలికారు. సువిశాల సామ్రాజ్యం, పటిష్టమైన సైన్యం, ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక ప్రగతిని సాధించడం ద్వారా వీరు భారతీయ సంస్కృతి ఔన్నత్యానికి దోహదపడ్డారు. ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్నప్పటికీ కడపటి మొగలుల అధికార దాహం, విలాస జీవనం, అసమర్థ పాలనతో సామ్రాజ్యం పతనమైంది.

ఔరంగజేబు మరణించే నాటికి(క్రీ.శ.1707) మొగల్ సామ్రాజ్య విస్తీర్ణం ఉచ్ఛ స్థితికి చేరుకుంది. 21 రాష్ట్రాలు ఉండేవి. ఔరంగజేబు మరణానంతరం మొగల్ సామ్రాజ్య పతనం ప్రారంభమైంది. అక్బర్ నుంచి ఔరంగజేబు వరకు నలుగురు గొప్ప మొగలులు 151 సంవత్సరాలు పరిపాలించారు. అయితే మొదటి బహదూర్‌షా నుంచి రెండో షా ఆలం వరకు 11 మంది కడపటి మొగలులు 100 సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు. అంటే కడపటి మొగలులు ఒక్కొక్కరూ సగటున 10 సంవత్సరాల కంటే ఎక్కువ పరిపాలించలేకపోయారు. వ్యక్తిత్వం, సామ్రాజ్య విస్తీర్ణం తదితర అంశాల్లో ముందుతరం మొగలులకు, కడపటి మొగలులకు పోలికే లేదు.

మొదటి బహదూర్‌షా (1707- 1712)
ఔరంగజేబు మరణానంతరం అతడి ముగ్గురు కుమారుల మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. చివరికి కాబూల్ గవర్నర్‌గా ఉన్న మువజ్జం వారసత్వ యుద్ధంలో నెగ్గి బహదూర్ షా పేరుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతడు సిక్కుల గురువు గోవింద్‌సింగ్‌ను మొగలుల సర్వీసులోకి తీసుకోవడం ద్వారా సిక్కులు, మొగలులకు మధ్య ఉన్న వైరానికి తెరదించాడు. అయితే తర్వాతి సిక్కు గురువు బందా బహదూర్ మొగలులపై తిరుగుబాటు చేశాడు. బహదూర్‌షా స్వయంగా యుద్ధం చేసినప్పటికీ సిక్కులను అణిచివేయలేక పోయాడు. అదే సమయంలో మొగలుల చెరలో ఉన్న శంభాజీ కొడుకు సాహును చెర నుంచి విడిపించాడు. ఔరంగజేబు విధించిన జిజియా పన్నును రద్దు చేశాడు. మేవార్, మార్వార్ రాజ్యాల స్వాతంత్య్రాన్ని గుర్తించాడు. బుందేలు నాయకుడు ఛత్రసాల్, జాట్‌ల నాయకుడు చూరమాన్‌లను మొగల్ పరిధిలోకి తీసుకోవడం ద్వారా వారితో వైరం తొలగిపోయింది. క్రీ.శ. 1712లో బహదూర్‌షా మరణాంతరం అతడి ముగ్గురు కుమారుల మధ్య వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. వారు తండ్రి శవానికి దహన క్రియలు చేయడం కూడా మరచి వారసత్వ యుద్ధంలో మునిగిపోయారు. చివరికి పెద్ద కుమారుడు జహందర్‌షా వారసత్వ యుద్ధంలో గెలిచాడు. 10 వారాల తర్వాత బహదూర్‌షాకు వారు అంత్యక్రియలు నిర్వహించారు.

జహందర్‌షా (1712 - 1713)
వారసత్వ యుద్ధంలో జుల్ఫికర్‌ఖాన్ మద్దతుతో జహందర్‌షా విజయం సాధించాడు. ఇతడి కాలంలో జహందర్‌షా భార్య లాల్‌కున్వర్ పారిపాలనా విషయాల్లో ఆధిపత్యం చెలాయించింది. ఆమె రక్త సంబంధీకులు రాజ్యాన్ని భ్రష్టు పట్టించారు. మొగలుల పరువు, ప్రతిష్ఠలు దిగజారాయి. ఇతడి కాలంలో తురానీలు, ఇరానీలు, హిందుస్థానీలు అనే మూడు వర్గాలు ఉండేవి. తురానీలు సున్నీ శాఖకు చెందిన వారు కాగా, ఇరానీలు షియా శాఖకు చెందినవారు.

ఫరూక్‌సియార్ (1713 - 1719)
ఇతడు జహందర్ షా సోదరుడి కుమారుడు. సయ్యద్ సోదరుల సహకారంతో సింహాసనాన్ని అధిష్టించాడు. దీనికి ప్రతిఫలంగా చక్రవర్తి సయ్యద్ అబ్దుల్లాఖాన్‌ను వజీర్‌గా, అతడి తమ్ముడు హుస్సేన్ అలీఖాన్‌ను సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించాడు. ఫరూక్ సియార్ ఉత్తర్వుల మేరకు జుల్ఫికర్ ఖాన్‌ను వధించారు. సయ్యద్ సోదరులు తమ స్థానంలో వేరేవారిని చక్రవర్తి నియమించకుండా ఉండటం కోసం బంధీలుగా ఉన్న రాకుమారులందరి కళ్లు తీయించారు. తర్వాత చక్రవర్తి, సయ్యద్ సోదరుల మధ్య తగాదా ప్రారంభమైంది. చివరికి ఫరూక్‌సియార్‌ను సయ్యద్ సోదరులు చంపేసి, రఫీ ఉద్దరజత్‌ను చక్రవర్తిగా నియమించారు. అయితే అతడు నాలుగు నెలల్లోనే మరణించాడు. తర్వాత అతడి అన్న రఫీ ఉద్దౌలాను రెండో షాజహాన్ పేరుతో సింహాసనంపై కూర్చోబెట్టారు.

మహమ్మద్‌షా (1719 - 1748)
రెండో షాజహాన్ 1719 సెప్టెంబరులో మరణించాడు. అతడి స్థానంలో రౌషాన్ అక్తర్‌ను మహమ్మద్ షా అనే బిరుదుతో సయ్యద్ సోదరులు సింహాసనంపై కూర్చోబెట్టారు. నిజాం ఉల్ ముల్క్, ఇతిమద్ ఉద్దౌలా, సాదత్‌ఖాన్, మహమ్మద్‌షా తల్లి కూటమిగా ఏర్పడి సయ్యద్ సోదరులను చంపడానికి కుట్ర పన్నారు. 1720లో సయ్యద్ హుస్సేన్ అలీఖాన్, అతడి కుమారుడిని దక్కనులో చంపించారు. నెల తర్వాత అతడి సోదరుడు అబ్దుల్లా ఖాన్‌ను బంధించి విష ప్రయోగంతో హతమార్చారు. సయ్యద్ సోదరుల మరణం తర్వాత మొగల్ సామ్రాజ్య పతనం మరింత వేగవంతమైంది. మహమ్మద్‌షా వయసు సింహాసనాన్ని అధిష్టించేనాటికి 18 సంవత్సరాలు మాత్రమే. ఇతడు నిరంతరం రాజప్రసాదం నాలుగు గోడల మధ్య అంతఃపుర స్త్రీల సాంగత్యంలో గడిపాడు. విలాసాలకు బానిస కావడంతో 'రంగీలాగా పేరుగాంచాడు. ఇతడు మహమ్మద్ అమీన్‌ఖాన్‌ను వజీర్‌గా నియమించాడు. 1721లో అమీన్‌ఖాన్ మరణం తర్వాత నిజాం ఉల్‌ముల్క్‌ను ఆ స్థానంలో నియమించాడు. ఇతడు సంస్కరణల ద్వారా మొగల్ సామ్రాజ్యాన్ని పూర్వ స్థితికి తీసుకురావాలని ప్రయత్నించాడు. అయితే చక్రవర్తి ఇతడికి పరోక్షంగా ఇబ్బందులు కల్పించాడు. దీంతో విసిగిపోయిన నిజాం ఉల్‌ముల్క్ వజీర్ పదవిని వదలిపెట్టి స్వతంత్ర హైదరాబాద్ రాజ్యాన్ని 1724లో స్థాపించాడు. ముర్షీద్ కులీఖాన్ బెంగాల్‌లో, సాదత్‌ఖాన్ అవధ్‌లో స్వతంత్ర రాజ్యాలు స్థాపించారు. మాల్వా, గుజరాత్‌లు మొగల్ సామ్రాజ్యం నుంచి విడిపోయాయి.

నాదిర్షా దండయాత్ర (1738 - 1739)
ఇరాన్ నెపోలియన్‌గా పేరు పొందిన నాదిర్షా భారతదేశంపై 1738-39లో దండయాత్ర చేశాడు. 1738లో కాబూల్, జలాలాబాద్, పెషావర్‌లను ఆక్రమించాడు. 1739లో లాహోర్ ఇతడి ఆధీనమైంది. నిజాం ఉల్‌ముల్క్, కమీరుద్దీన్, ఖాన్-ఇ-దౌరాన్, సాదత్‌ఖాన్‌లు నాదిర్షాను అడ్డుకున్నారు. ఫిబ్రవరి 1739లో కర్నాల్ వద్ద మొగల్ సైన్యం ఓడిపోయింది. ఈ యుద్ధంలో ఖాన్-ఇ-దౌరాన్ మరణించాడు. సాదత్‌ఖాన్ సలహాతో నాదిర్షా 1739, మార్చి 20న ఢిల్లీపై దండెత్తాడు. రెండు రోజుల తర్వాత నాదిర్షా మరణించాడనే వదంతులు వచ్చాయి. మొగల్ సైనికులు 700 మంది నాదిర్షా సైనికులను చంపారు. దీంతో నాదిర్షా ఆదేశం మేరకు 20,000 మంది భారతీయులను చంపారు. నాదిర్షా ఢిల్లీలో 47 రోజులపాటు ఉండి ప్రతి ఇంటినీ దోచుకున్నాడు. ప్రసిద్ధిగాంచిన నెమలి సింహాసనం, కోహినూర్ వజ్రం నాదిర్షా వశమయ్యాయి.

అహమ్మద్ షా అబ్దాలీ తొలి దండయాత్రలు
1747లో నాదిర్షా మరణానంతరం అతడి సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. అతడి ముఖ్య సైన్యాధ్యక్షుల్లో అబ్దాలీ తెగకు చెందిన అహ్మద్ అఫ్గనిస్థాన్‌కు పాలకుడిగా ప్రకటించుకున్నాడు. కాబూల్, కాందహార్‌లను ఆక్రమించి పెషావర్ చేరుకున్నాడు. తర్వాత సింధు నదిని దాటి లాహోర్, సర్‌హింద్‌లను 1748లో ఆక్రమించాడు. ఇతడి రెండో దండయాత్ర సమయంలో మహమ్మద్‌షా మరణించాడు.

అహమ్మద్ షా (1748 - 1754)
మహమ్మద్ షా తర్వాత అతడి కుమారుడు అహమ్మద్ షా చక్రవర్తి అయ్యాడు. ఇతడు మహమ్మద్ షా, ఒక నర్తకికి జన్మించాడు. అహమ్మద్‌షా మద్యపానం, స్త్రీలకు బానిసై పరిపాలననంతా తన తల్లి ఉద్ధంబాయికి అప్పగించాడు. ఈ కాలంలో అవధ్ నవాబు సఫ్దర్‌జంగ్ మొగల్ సామ్రాజ్యానికి వజీరుగా వ్యవహరించేవాడు. అహమ్మద్‌షా తల్లి ఇతడిని 1753లో ఆ పదవి నుంచి తొలగించి ఇతిజం ఉద్దౌలాను వజీర్‌గా నియమించింది. ఇతడు అహమ్మద్ షాను పదవీచ్యుతుడిని చేశాడు. తర్వాత అహ్మద్‌షాను, అతడి తల్లిని బంధించాడు. అహమ్మద్ షా కాలంలో అహమ్మద్ షా అబ్దాలీ 1749, 1752లో భారతదేశంపై రెండు సార్లు దండెత్తాడు. ఢిల్లీ పతనం కాకుండా ఉండటం కోసం మొగల్ సుల్తాన్ అహ్మద్‌షా పంజాబ్, ముల్తాన్‌లను అహ్మద్‌షా అబ్దాలీకి అప్పగించాడు. ఇతడి కాలంలో మొగలుల కోశాగారం ఖాళీ అయ్యింది.

రెండో అలంఘీర్ (1754 - 1759)
అహమ్మద్ షా పదవీచ్యుతుడైన తర్వాత జహందర్ షా మనవడైన అజీజుద్దీన్ రెండో ఆలంఘీర్ బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతడి కాలంలో మొగలుల సైనిక, ఆర్థిక వ్యవస్థలు బాగా దిగజారిపోయాయి. సైనికులకు సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో వారి తిరుగుబాట్లు సర్వసాధారణమయ్యాయి. ఈ సమయంలో అహమ్మద్‌షా అబ్దాలీ భారతదేశంపై 1755లో నాలుగోసారి దండెత్తాడు. ఆలంఘీర్‌ను తన వజీర్ 1759 నవంబరులో హత్య చేశాడు.

రెండో షా ఆలం (1759 - 1806)
ఇతడు రెండో ఆలంఘీర్ కుమారుడు. ఇతడి అసలు పేరు అలీగౌహర్. రెండో షా ఆలం 1759లో సింహాసనాన్ని అధిష్ఠించినా, తన వజీరుకు భయపడి రాజధానిలో నివసించ లేదు. ఇదే సమయంలో అహమ్మద్ షా అబ్దాలీ భారతదేశంపై అయిదోసారి దండెత్తాడు. చివరికి ఇది మూడో పానిపట్ యుద్ధానికి (1761, జనవరి 15) దారితీసింది. ఈ యుద్ధంలో అబ్దాలీ మరాఠాలతో పాటు మొగలులను కూడా ఓడించాడు. రెండో షా ఆలం బెంగాల్ నవాబు మీర్ ఖాసిం, అవధ్ నవాబు షుజా ఉద్దౌలాతో కలసి 1764లో 'బక్సార్ యుద్ధంలో బ్రిటిషర్లతో పోరాడి ఓడిపోయాడు. అయితే 1772లో మరాఠాలు రెండో షా ఆలంను ఢిల్లీ సుల్తానుగా ప్రకటించుకున్నారు. అనంతరం నజీబుద్దౌలా 1788లో షాఆలం కళ్లు తీయించాడు. 1803లో బ్రిటిషర్లు ఢిల్లీని ఆక్రమించుకున్నారు. తర్వాత షాఆలం, అతడి వారసులు రెండో అక్బర్, రెండో బహదూర్‌షాలు బ్రిటిషర్ల పెన్షనర్లుగా జీవించారు. షాఆలం 1806లో మరణించాడు.

రెండో అక్బర్ (1806 - 1837)
ఇతడు సంఘ సంస్కర్త అయిన రామమోహన్‌రాయ్‌కి 'రాజా అనే బిరుదునిచ్చాడు. రామమోహన్‌రాయ్ బ్రిటిషర్లు మొగలు చక్రవర్తికి ఇచ్చే పెన్షన్‌ను పెంచే విధంగా వారితో మాట్లాడటానికి ఇంగ్లండ్ వెళ్లాడు.

రెండో బహదూర్ షా (1837 - 1857)


ఇతడు కడపటి మొగల్ చక్రవర్తుల్లో చివరివాడు. 1857 సిపాయిల తిరుగుబాటులో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడి ఓడిపోయాడు. దీంతో అదే ఏడాది మొగలు చక్రవర్తి పదవిని బ్రిటిషర్లు నిషేధించి బహదూర్ షాను బంధించి, రంగూన్‌కు పంపారు. అతడు అక్కడే 1862లో మరణించాడు.

మొగలు సామ్రాజ్య పతనానికి కారణాలు


* ఔరంగజేబు కాలం నాటికి మొగల్ సామ్రాజ్యం నియంత్రించ లేనంతగా విస్తరించింది. ఈ సామ్రాజ్య విస్తరణ కోసం ఎక్కువ డబ్బులు వెచ్చించి యుద్ధాలు చేయడంతో ఖజానా ఖాళీ అయ్యింది.
* ఇతడు పరమత ద్వేషం పాటించడంతో అసంఖ్యాకులైన హిందువులతో వైరాన్ని పెంచుకున్నాడు. దీంతో జాట్లు, సిక్కులు, రాజపుత్రులు, మరాఠాలు తిరుగుబాట్లు చేశారు.
* ఇతడి దక్కను విధానం మొగలు సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణమైంది.
* ఔరంగజేబు తర్వాత సింహాసనాన్ని అదిష్ఠించిన పాలకులంతా బలహీనులు కావడంతో సమస్యలను పరిష్కరించడానికి బదులు మరింత జటిలం చేశారు.
* నాదిర్షా, అహమ్మద్ షా అబ్దాలి దండయాత్రలు మొగల్ సామ్రాజ్య పతనాన్ని వేగవంతం చేశాయి.
* వ్యవసాయం, వ్యాపారం కుంటుపడటంతో రైతుల పరిస్థితి దిగజారి వారంతా తిరుగుబాటు చేశారు.
* మొగల్ సైన్యం బలహీన పడటానికి మరో ప్రధాన కారణం మున్సబ్‌దారీ విధానం సక్రమంగా అమలు కాకపోవడం. ఈ విధానంలో అనేక లోపాలుండటంతో సైన్యంలో క్రమశిక్షణ కొరవడింది. సైనికులకు సక్రమంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి రావడంతో వారు కూడా తిరుగుబాటు చేశారు.
* బ్రిటిషర్ల అధికారం పుంజుకోవడంతో మొగల్ సామ్రాజ్యం పతనమైంది. వీరు సుమారు 100 ఏళ్ల పాటు మొగలులతో పోరాడారు. చివరకు 1857లో సిపాయిల తిరుగుబాటులో మొగలులను పూర్తిగా ఓడించి చక్రవర్తి పదవిని నిషేధించారు.

      అక్బర్ చేపట్టిన ఉదారవాద విధానాలు అతడి వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. 1562లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం యుద్ధం జరిగే సమయంలో యుద్ధంలో పాల్గొనని హిందువులు, యుద్ధంలో పాల్గొన్న వారి కుటుంబ సభ్యులను ఖైదీలు, బానిసలుగా చేయకూడదని, అలాగే ఇస్లాం మతంలోకి మార్చకూడదని అక్బర్ పేర్కొన్నాడు.
     అక్బర్ 1563లో యాత్రికుల మీద విధించే పన్నును, 1564లో జిజియా పన్నును నిషేధించాడు. అనువాద శాఖను ప్రారంభించి సంస్కృతం, ఇతర భాషల్లోని గ్రంథాలను పర్షియన్ భాషలోకి అనువదించేలా చర్యలు చేపట్టాడు. రాజ్యంలోని ఉద్యోగాలకు హిందూ, ముస్లింలు సమానంగా పోటీపడొచ్చని పేర్కొన్నాడు. హిందువుల మనోభావాలకు ప్రాధాన్యం ఇచ్చాడు. గొడ్డు మాంసం వాడకాన్ని నిషేధించాడు. అలాగే 1583లో కొన్ని ప్రత్యేక రోజుల్లో జంతువులను చంపడాన్ని నిషేధించాడు. హిందువుల ఆదరాభిమానాలు పొందడానికి వారి పండుగల్లో పాల్గొన్నాడు. సాంఘిక సంస్కరణల్లో భాగంగా బాల్య వివాహాలను, సతీ సహగమనాన్ని నియంత్రించడమే కాకుండా వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించాడు. అక్బర్ తన రాజపుత్ర భార్యలు హిందూ మతాన్ని అవలంబించడాన్ని సమర్థించాడు.

మత విధానం
       అక్బర్ 1562 నుంచి 18 సంవత్సరాల పాటు ప్రతి ఏడాది అజ్‌మేర్ (అజ్మీర్)లోని షేక్ మెయినుద్దీన్ చిష్టి దర్గాను సందర్శించాడు. అతని రాజపుత్ర భార్యలు, హిందూ అధికారులైన తోడర్‌మల్, బీర్బల్, మాన్‌సింగ్, ఫైజి, అబుల్ ఫజల్ లాంటి పండితులు; 16వ శతాబ్దం నాటి భక్తి ఉద్యమం... అక్బర్ తన మత భావాలను మార్చుకోవడానికి దోహదపడ్డాయి. అక్బర్‌కి వేదాంతం, ఆధ్యాత్మిక విషయాలపై ఉన్న అభిమానం 1575లో ఫతేపూర్ సిక్రీలో ఇబాదత్ ఖానా ప్రారంభించడానికి దోహదం చేసింది. ఇక్కడ ప్రతి గురువారం సాయంత్రం మతపరమైన చర్చ జరిగేది. ఇందులో మొదట్లో ముస్లింలు మాత్రమే పాల్గొనేవారు. 1578లో అన్ని మతాల వారు పాల్గొనడానికి అవకాశం కల్పించారు. 1579లో అక్బర్ ముస్లిం ప్రజలను ప్రభావితం చేసే అన్ని మతపరమైన విషయాలను తన చేతుల్లోకి తీసుకోవాలని భావించాడు. ఇది షేక్ ముబారక్ ఒక ప్రకటన లేదా మజహర్ రూపొందించడానికి దారితీసింది. ఈ ప్రకటనపై అయిదుగురు ఉలేమాలు సంతకాలు చేశారు. దీనిద్వారా మతపరమైన విషయాల్లో ఉలేమాల బదులు చక్రవర్తి అధికారం స్థిరపడిపోయింది. అక్బర్ వివిధ మత ప్రవక్తలతో చర్చించిన తర్వాత 1582లో దీన్-ఇ-ఇలాహిని స్థాపించాడు. దీని ప్రధాన ఉద్దేశం సుల్-ఇ-కుల్ లేదా సార్వత్రిక సామరస్య భావనను పెంపొందించడం.

పరిపాలనాపరమైన విధానాలు
       సామ్రాజ్య మనుగడకు బలమైన రాజకీయ వ్యవస్థ, సమర్థవంతమైన పరిపాలనా విధానం అవసరమని అక్బర్ భావించాడు. పరిపాలనా రంగంలో నిరంతరం అనేక ప్రయోగాలు చేశాడు. అక్బర్ తన సామ్రాజ్యంలో పర్షియన్ భాషను అధికార భాషగా ప్రకటించాడు. సామ్రాజ్యం మొత్తంలో ఒకే పరిపాలన విధానం, నాణేలు, ఒకే రకమైన తూనికలు, కొలతలు అమలయ్యేలా చర్యలు చేపట్టాడు. అక్బరు తన రెవెన్యూ మంత్రి తోడర్‌మల్ పర్యవేక్షణలో 1582లో రెవెన్యూ విధానంలో సమూలమైన మార్పులు చేశాడు.
* అక్బర్ తోడర్‌మల్ బందోబస్తు లేదా జబ్తి అనే రెవెన్యూ విధానాన్ని ప్రవేశపెట్టాడు. అంతకు ముందు 1575 - 76లో తన సామ్రాజ్యాన్ని 12 సుబాలుగా విభజించాడు. దక్కన్ ఆక్రమణ తర్వాత ఈ సుబాల సంఖ్య 15 కు చేరింది. ప్రతి సుబాను సర్కార్‌లుగా, ప్రతి సర్కారును పరగణా లేదా మహల్‌గా విభజించాడు.
సుబాలన్నింటిలో ఒకేవిధమైన పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టాడు. 1573 - 74లో గుజరాత్ ఆక్రమణ తర్వాత అధికారులను వేర్వేరు హోదాలు లేదా మున్సబ్‌లుగా వర్గీకరించాడు. ఇది మున్సబ్‌దారీ విధానం రూపొందడానికి దారితీసింది. అక్బర్ ప్రవేశపెట్టిన పరిపాలనా విధానం చిన్న మార్పులతో మొగలు సామ్రాజ్యం పతనమయ్యే వరకు కొనసాగడం అక్బర్ గొప్పదనానికి నిదర్శనం.
* 1602లో అక్బర్ పెద్ద కుమారుడు సలీం తిరుగుబాటు చేశాడు. దీంతో అక్బర్ తన చివరి రోజులను ఇబ్బందికరంగా గడపాల్సి వచ్చింది. మొగల్ ఆస్థానంలో ఒక వర్గం సలీం చక్రవర్తి కావాలని భావించగా, మరో వర్గం సలీం కుమారుడు ఖుస్రూ చక్రవర్తి కావాలని కోరుకున్నారు. అక్బర్ కూడా ఖుస్రూని చక్రవర్తిగా చేయడానికే సుముఖత చూపాడు. 1605లో తన మరణానికి కొద్ది రోజుల ముందు అక్బర్ స్వయంగా సలీంను చక్రవర్తిగా ప్రకటించాడు. దీంతో సలీం 'జహంగీర్' బిరుదుతో సింహాసనం అధిష్టించాడు.

జహంగీర్ (1605-27)
       జహంగీర్ చక్రవర్తి కాగానే ప్రజా సంక్షేమం కోసం, ఉత్తమ పరిపాలన అందించడానికి 12 శాసనాలు ప్రకటించాడు. ఈ శాసనాల ద్వారా అక్బర్ ఉదారవాద విధానాలను కొనసాగించాలని జహంగీర్ భావించినా ఆచరణలో మాత్రం విఫలమయ్యాడు. 1606లో జహంగీర్ కుమారుడు ఖుస్రూ లాహోర్‌లో తిరుగుబాటు చేశాడు. ఇది జహంగీర్‌కు పెద్ద ఎదురుదెబ్బ. తానే స్వయంగా ఈ తిరుగుబాటును అణిచివేశాడు. ఖుస్రూను బంధించి కళ్లు పీకించాడు. సిక్కుల అయిదో గురువైన అర్జున్‌సింగ్ తరన్ తరన్ అనే ప్రదేశంలో ఖుస్రూకు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా పూర్తి మద్దతు తెలిపాడు. దీంతో జహంగీర్ అతడిపై అపరాధ రుసుం విధించాడు. దీన్ని చెల్లించడానికి నిరాకరించిన అర్జున్‌సింగ్‌కి జహంగీర్ మరణ శిక్ష విధించాడు. ఇది సిక్కులకు, మొగలులకు మధ్య వైరానికి దారితీసింది. తర్వాత 1622లో సోదరుడు ఖుర్రం చేతిలో ఖుస్రూ హత్యకు గురయ్యాడు.

మేవాడ్‌పై దండయాత్రలు
       జహంగీర్ మేవాడ్ రాజైన రాణా ప్రతాప్‌సింగ్ కుమారుడు రాణా అమర్‌సింగ్‌పై మొదటి సైనిక దండయాత్ర చేశాడు. మేవాడ్‌పై 1606, 1608, 1609 లలో జరిపిన దండయాత్రలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. 1613 - 14లో ఖుర్రం ఆధ్వర్యంలో మేవాడ్‌పై జరిపిన దండయాత్ర ఫలించింది. 1615లో అమర్‌సింగ్ మొగలులతో సంధికి అంగీకరించాడు. దీంతో సుదీర్ఘకాలంగా మొగలులకు, మేవాడ్ రాజ్యానికి మధ్య జరిగిన పోరాటం ముగిసింది.
* నర్మదా నదికి దక్షిణంగా ఉన్న భూభాగాలను ఆక్రమించాలనే అక్బర్ ఆశయాన్ని కొనసాగించాలని జహంగీర్ భావించాడు. మొదటగా అహ్మద్‌నగర్ రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించాలనుకున్నాడు. అయితే జహంగీర్ చక్రవర్తి అయ్యేనాటికి నిజాం షాహి రాజ్య ప్రధానమంత్రి మాలిక్ అంబర్ కృషి వల్ల అహ్మద్‌నగర్ పరిస్థితి బాగా మెరుగుపడింది.
* 1608 నుంచి జహంగీర్ అహ్మద్‌నగర్‌పై అనేకసార్లు దండెత్తి, లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా మొగలులు కొంత భూభాగాన్ని కూడా ఆక్రమించలేకపోయారు. పర్షియా కాందహార్‌ను ఆక్రమించడం జహంగీర్ వైఫల్యాల్లో అతి పెద్దదిగా పేర్కొనవచ్చు. పర్షియాకు చెందిన షా అబ్బాస్ మొగలులతో పైకి స్నేహం నటిస్తూ, 1622లో కాందహార్‌ను ఆక్రమించాడు. మొగలులు కాందహార్‌ను కోల్పోవడంతో మధ్య ఆసియాలో వారి ప్రతిష్ట బాగా దెబ్బతింది. ఇదే సమయంలో నూర్జహాన్‌కు, షాజహాన్‌కు మధ్య విభేదాలు ఏర్పడటంతో కాందహార్‌ను తిరిగి ఆక్రమించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు.

నూర్జహాన్ ప్రభావం..
      పర్షియాకు చెందిన మీర్జా గియాస్ బేగ్ కుమార్తె మెహరున్నీసాను జహంగీర్ వివాహమాడటం సమకాలీన సంఘటనలపై తీవ్ర ప్రభావం చూపింది. మెహరున్నీసా మొదటి భర్త షేర్ ఆఫ్గన్ మరణించిన నాలుగేళ్ల అనంతరం జహంగీర్ మెహరున్నీసాను 1611లో వివాహం చేసుకున్నాడు. ఆమెకు మొదట నూర్‌మహల్ (రాజ ప్రాసాదానికి వెలుగు) అనే బిరుదు, తర్వాత నూర్జహాన్ (ప్రపంచానికి వెలుగు) అనే బిరుదు ఇచ్చాడు. 1613లో ఆమెకు 'పాదుషా బేగం' హోదా కల్పించాడు. ఆమె పేరుతో నాణేలు కూడా ముద్రించారు.
* నూర్జహాన్ ప్రభావంతో ఆమె తండ్రికి 'ఇతిమద్ ఉద్దౌలా', సోదరుడికి 'అసఫ్‌ఖాన్' అనే బిరుదులు లభించాయి. జహంగీర్‌తో ఆమె వివాహమైన ఏడాదికే అసఫ్‌ఖాన్ కుమారై ముంతాజ్ మహల్‌గా పేరుగాంచిన అర్జుమండ్ బాను బేగంను జహంగీర్ కుమారుల్లో సమర్థుడైన ఖుర్రంకు ఇచ్చి వివాహం జరిపించారు. దీంతో నూర్జహాన్, ఇతిమద్ ఉద్దౌలా, అసఫ్‌ఖాన్, ఖుర్రంల మధ్య బంధం బలపడింది. ఈ నలుగురితో కూడిన నూర్జహాన్ బృందం పదేళ్లపాటు రాజ్యాన్ని పాలించింది. 1620లో నూర్జహాన్, షేర్ ఆఫ్గన్‌లకు జన్మించిన లాడ్లీ బేగంను జహంగీర్ చిన్న కుమారుడైన షహర్యార్‌కు ఇచ్చి పెళ్లి చేయడంతో ఈ నలుగురి మధ్య సఖ్యత దెబ్బతింది. నూర్జహాన్ తన అల్లుడు షహర్యార్‌ను సింహాసనానికి వారసుడిగా చేయాలని భావించగా, అసఫ్‌ఖాన్ తన అల్లుడు ఖుర్రంను బలపరిచాడు. దీంతో పరిపాలన వ్యవస్థ దెబ్బతింది. కాందహార్‌ను తిరిగి ఆక్రమించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఖుర్రం ఖుస్రూను వధించడం, మహబత్‌ఖాన్ తిరుగుబాటు మొదలైన సంఘటనలన్నీ దీని పర్యవసానంగా జరిగినవే.

* ఇంగ్లండ్ రాజు మొదటి జేమ్స్ ఆస్థానం నుంచి వచ్చిన కెప్టెన్ హాకిన్స్, సర్ థామస్ రో అనే రాయబారులు జహంగీర్ కాలంలో జరిగిన సంఘటనలను చక్కగా వర్ణించారు. వీరిద్దరు జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించి ఆంగ్లేయులు భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి అతడి అనుమతి పొందడానికి ప్రయత్నించారు. థామస్ రో కృషి ఫలితంగా సూరత్, ఆగ్రా, అహ్మదాబాద్, బ్రోచ్‌లలో ఆంగ్లేయులు తమ వర్తక స్థావరాలను నెలకొల్పారు.

మొగలుల సాహితీసేవ

    మొగలుల కాలంలో ఆస్థాన చరిత్రలతోపాటు అనువాదానికి కూడా ప్రాధాన్యం లభించింది. అక్బర్‌ మక్తబ్‌ ఖానా పేరుతో అనువాద విభాగాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కాలంలో హిందీ సాహిత్యం కూడా వికసించింది. తులసీదాస్‌ రచించిన రామ్‌ చరిత్‌ మానస్‌ ఉత్తర భారతదేశంలో ఆరాధనీయ గ్రంథమైంది. షాజహాన్‌ పెద్ద కుమారుడు దారాషికో హిందూ మహ్మదీయ మతాల సారాన్ని  మజ్‌ మాఉల్‌బహ్రెయిన్‌ పేరుతో గ్రంథస్థం చేయడం విశేషం.

ఫుతూహత్‌-ఎ-ఆలంగీరి: దీన్ని రాసింది ఈసర్‌ దాస్‌ నాగర్‌. ఇతడు ఔరంగజేబ్‌ ప్రతినిధిగా జోధ్‌పూర్‌లో పనిచేశాడు. ఔరంగజేబ్‌ మొదటి 34 ఏళ్ల పాలనా కాలపు విశేషాలు ఉన్న ఈ పుస్తకం ఆ కాలపు మొగల్, రాజపుత్రుల సంబంధాల గురించి ప్రధానంగా సాగింది.

నుష్కా-ఎ-దిల్‌కుషా: ఇది కూడా ఔరంగజేబ్‌ చరిత్రను తెలిపే రచనే. భీమ్‌సేన్‌ దీని రచయిత. ఇతడు మొగల్‌ మన్సబ్‌దారు దల్‌పత్‌ రావ్‌ బుందేలా దగ్గర పేష్కారుగా పనిచేశాడు. క్రీ.శ.1700 నుంచి ఔరంగజేబ్‌ సేనలు మహారాష్ట్రలో చేసిన పోరాటాల కథనం ఇందులో ప్రధానం. సమకాలీన అధికారుల అవినీతి, మొగల్‌ సేనల దాడుల వల్ల మరాఠా రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను ‘నుష్కాఎదిల్‌ కుషా’లో వెల్లడించాడు. అయితే ఇది కూడా సత్యాన్ని పాక్షికంగానే తెలుపుతుంది. 

మాసీర్‌-ఎ-ఆలంగీరి: ఔరంగజేబ్‌ 40 ఏళ్ల పాలనను సంక్షిప్తంగా అందించే ఈ పుస్తకాన్ని రాసింది మహమ్మద్‌ సాకి ముస్తాయిద్‌ ఖాన్‌. ఔరంగజేబ్‌ దండయాత్రలు, అధికారుల నియామకం, బదిలీల గురించిన వివరాలు ఇందులో ఉన్నాయి. దీన్ని సర్‌ జదునాథ్‌ సర్కార్‌ ‘‘మొగలుల రాజపత్రం’’గా పేర్కొన్నారు. ఔరంగజేబ్‌ గురించి వివరించే మరో గ్రంథం సుజన్‌ రావ్‌ ఖత్రీ రాసిన ‘ఖులాసత్‌ఉత్‌తవారిఖ్‌’.


అనువాదాలు

రజ్మ్‌ నామా: అంటే యుద్ధాల పుస్తకం అని అర్థం. ఇది మహాభారతానికి పర్షియా అనువాదం (తర్జుమాఎమహాభారత్‌). అనువాద బృందానికి అబ్దుల్‌ ఖాదర్‌ బదాయూనీ పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టాడు. అనువాదం పూర్తయ్యాక అక్బర్‌ దీనికి చిత్రాలు కూడా గీయించాడు.

* రామాయణాన్ని అబ్దుల్‌ ఖాదర్‌ బదాయూని, అధర్వణ వేదాన్ని హాజీ ఇబ్రహీం సర్హిందీ, లీలావతిని (గణితశాస్త్ర పుస్తకం) పైజీ, తుజుక్‌ఎబాబరీని అబ్దుల్‌ రహీం ఖాన్‌ఎఖానన్‌ పర్షియా భాషలోకి అనువదించారు. ఇవే కాకుండా రాజాస్థానంలో గజళ్లు, ఖసీదాలు తదితర కవితా ప్రక్రియలు వికసించాయి.
అక్బర్‌ కాలంలో హిందీ సాహిత్యం కూడా ఆదరణ పొందింది. అబ్దుల్‌ రహీం ఖాన్‌ఎఖానన్‌ దోహాలనే ద్విపదలను రచించాడు. నరహరి అనే పండితుడికి అక్బర్‌ ‘మహాపాత్ర్‌’ అనే బిరుదునిచ్చాడు. ప్రసిద్ధ హిందీ కవులకు ‘కవిరాయ్‌’ అనే బిరుదును ఇచ్చి గౌరవించేవారు. 
* బీర్బల్‌కు (అసలు పేరు మహేశ్‌ దాస్‌) అక్బర్‌ కవి ప్రియ అనే బిరుదు ఇచ్చాడు. రస్‌ఖాన్‌ ‘ప్రేమ్‌ వార్తికా’ అనే హిందీ కావ్యం రచించాడు. ఇది కృష్ణభక్తికి సంబంధించింది. తులసీదాస్‌ విరచిత ‘రామ్‌ చరిత్‌ మానస్‌’ ఉత్తర భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందింది. దీన్ని ‘‘వంద మిలియన్ల హిందూస్థాన్‌ ప్రజల పాలిటి బైబిల్‌’’ అని జార్జి గ్రియర్సన్‌ ప్రశంసించాడు.


అమీర్‌ ఖుస్రూ 

కవి, చరిత్రకారుడు, సంగీత విద్వాంసుడైన అమీర్‌ ఖుస్రూ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని పటియాలిలో క్రీ.శ.1252లో జన్మించాడు. బాల్బన్‌ మొదలు ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌ వరకు వివిధ ఢిల్లీ సుల్తానుల ఆస్థానంలో ఉన్నాడు. పర్షియన్, హిందీ, ఉర్దూ భాషల్లో ఖుస్రూ రచనలు సాగాయి. ఈయన ఢిల్లీలోని ప్రసిద్ధ చిష్తీ సాధువు నిజాముద్దీన్‌ ఔలియా శిష్యుడు. అమీర్‌ ఖుస్రూ బిరుదు ‘‘తూతీఎహింద్‌’’  (భారతదేశపు చిలుక). అమీర్‌ ఖుస్రూ రచనా శైలిని ‘సబాక్‌ ఎ హింద్‌’ అంటారు.

* అమీర్‌ఖుస్రూ మొదటి చరిత్ర రచన కిరాన్‌ఉస్‌సాదిన్‌. ఇది మామెలుక్‌ సుల్తాన్‌ కైకుబాద్‌ కాలపు రచన. ఇక ఖజైన్‌ఉల్‌ఫుతూహ్‌లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ గుజరాత్, చిత్తోడ్‌గఢ్, మాల్వా, దక్కన్, వరంగల్‌ దండయాత్రలు, భారతదేశం మీదికి జరిగిన మంగోల్‌ దాడుల గురించి వివరించాడు. అల్లావుద్దీన్‌ ఖిల్జీ రణథంబోర్‌ను ముట్టడించినప్పుడు, అక్కడి రాజపుత్ర స్త్రీల  ‘‘జౌహార్‌’’(మూకుమ్మడిగా చితి పేర్చుకుని మరణించడం) గురించి తెలిపాడు. ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌ చరిత్రను వివరిస్తూ ‘‘తుగ్లక్‌ నామా’’ రచించాడు. అమీర్‌ ఖుస్రూ ఇతర రచనలు నూహ్‌ సిపార్, మిఫ్తా ఉల్‌ ఫుతూహ్, దేవలరాణి ఖిజిర్‌ఖానీ. 

సంగీతం విషయానికి వస్తే, అమీర్‌ ఖుస్రూ ఖవ్వాలీ ప్రక్రియను అభివృద్ధి చేశాడు. సితార్, తబలాను ఈయనే మొదటగా తయారు చేశాడని అంటారు. క్రీ.శ.1325లో మరణించిన అమీర్‌ ఖుస్రూను నిజాముద్దీన్‌ ఔలియా దర్గా ప్రాంగణంలోనే ఖననం చేశారు.

పద్మావత్‌: మాలిక్‌ మహమ్మద్‌ జాయసీ ప్రసిద్ధ రచన. జాయసీ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలోని జాయస్‌లో జన్మించాడు. మాలిక్‌ మహమ్మద్‌ జాయసీ షేర్షా కాలపు కవి. అవధీ మాండలికంలో (హిందీ) ఉన్న ఈ రచన ప్రధానంగా సూఫీ ప్రేమతత్వానికి చెందింది. ఇందులో సుప్రసిద్ధ పద్మావతి (పద్మిని) కథ ఉంది. పద్మావతి చిత్తోడ్‌ రాణా రతన్‌ సింగ్‌ భార్య. ఈమె అందం గురించి తెలుసుకున్న అప్పటి ఢిల్లీ సుల్తాన్‌ అల్లావుద్దీన్‌ ఖిల్జీ చిత్తోడ్‌ను ముట్టడించాడని చెబుతారు. అయితే చరిత్రకారులు దీన్ని వ్యతిరేకించారు. చిత్తోడ్‌ గుజరాత్‌ వెళ్లే మార్గం మీద ఉండటంతో ఖిల్జీ దండయాత్ర చేశాడనేది చరిత్రకారుల వాదన.


దారాషికో: మొగల్‌ చక్రవర్తి షాజహాన్‌ పెద్ద కొడుకు. సూఫీ మార్మికవాది. ఇతడు హిందూ, ఇస్లాం మతాలను క్షుణ్నంగా అధ్యయనం చేశాడు. రెండు మతాల సారాన్ని క్రోడీకరిస్తూ ‘‘మజ్‌ మాఉల్‌బహ్రెయిన్‌’’ (రెండు సముద్రాల సంగమం) పేరుతో పుస్తకాన్ని రాశాడు. ఇంకా కొన్ని ఉపనిషత్తులను పర్షియా భాషలోకి అనువదించి, వాటిని ‘‘సిర్‌ఎఅక్బర్‌’’ పేరుతో సంకలనం చేశాడు. మొగల్‌ సింహాసనం కోసం జరిగిన వారసత్వ పోరులో క్రీ.శ.1659లో ఔరంగజేబ్‌ చేతిలో దారాషికో మరణించాడు.

మొగల్‌ యుగ విశేషాలు

భారతదేశాన్ని క్రీ.శ. 1526 నుంచి క్రీ.శ. 1858 వరకు మొగలులు పాలించారు. బాబర్‌ నుంచి ఔరంగజేబ్‌ వరకూ మొగల్‌ పాలన గొప్పగా సాగిందని చరిత్రకారులు కొనియాడారు. మొగల్‌ పాలనను ప్రారంభించింది సూర్‌ వంశానికి చెందిన షేర్షా. అతడు ప్రవేశపెట్టిన పాలనా,   రెవెన్యూ, ఆర్థిక సంస్కరణలనే అక్బర్‌ కొద్ది మార్పులతో కొనసాగించాడు. అందుకే షేర్షాను అక్బర్‌కు మార్గదర్శకుడిగా పేర్కొంటారు. 


పరిపాలనా సంస్కరణలు

కేంద్రపాలన: మొగల్‌ చక్రవర్తులు కేంద్ర, రాష్ట్ర, స్థానిక పాలనా విధానాల్లో అనేక మార్పులు ప్రవేశపెట్టి, సమర్థవంతమైన పాలనను అందించారు. కేంద్రపాలనలో చక్రవర్తే అత్యున్నతాధికారి. పౌరపాలన మొత్తం అతడి చుట్టే కేంద్రీకృతమై ఉండేది. మంత్రిమండలి, ఉద్యోగ బృంద సహాయంతో చక్రవర్తి పాలనను కొనసాగించేవాడు. షేర్షా పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని సర్కారులు - పరగణాలు - గ్రామాలుగా విభజిస్తే, కొద్దిమార్పులతో అక్బర్‌ తన సామ్రాజ్యాన్ని సుబాలు - సర్కారులు - పరగణాలు - గ్రామాలు అనే భాగాలుగా ఏర్పాటు చేశాడు. కేంద్రమంత్రి మండలిలో వకీల్‌ (ప్రధానమంత్రి), వజీర్‌ (ఆర్థికమంత్రి), మీర్‌భక్షీ (యుద్ధమంత్రి), మీర్‌-ఇ-సదర్‌ (దానధర్మాల మంత్రి), ప్రధాన ఖాజీ (న్యాయశాఖామంత్రి) పరిపాలనలో చక్రవర్తికి సహాయపడేవారు.  
 

రాష్ట్ర పాలన: షేర్షా సర్కారులు అనే రాష్ట్రాలను ఏర్పాటు చేయగా, అక్బర్‌ ‘సుబాలు’ అనే ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేశాడు. సుబా అధిపతి సుబేదార్‌. వీరి పాలన కూడా కేంద్ర పాలనను పోలి ఉండేది. సుబేదార్‌కు రాష్ట్ర పాలనలో తోడ్పడేందుకు ఫొతేదార్, పౌజ్‌దార్‌ లాంటి అధికారులు ఉండేవారు. అమీన్‌ను రాష్ట్ర రెవెన్యూ అధికారిగా, నేటి కలెక్టర్‌తో పోల్చవచ్చు. ఫొతేదార్‌ రాష్ట్ర కోశాధికారి. రాష్ట్రంలో సైనిక వ్యవహారాలు చూడటానికి ‘భక్షీ’ అనే అధికారిని నియమించారు. రాష్ట్ర గవర్నర్‌లను సిఫా-సలార్‌ అనేవారు. తర్వాతి కాలంలో సిఫా-సలార్‌ పదవి సుబేదార్‌ లేదా నజీమ్‌గా మారింది. వీరితో పాటు కాజీ, సాదర్, ముతాసిబ్‌ లాంటి ఇతర అధికారులు కూడా రాష్ట్ర పాలనలో సాయపడేవారు.

స్థానిక పాలన
మొగలుల స్థానిక పాలనలో సర్కారులు - పరగణాలు - గ్రామాలతోపాటు మహల్స్, ఠాణాలు, పట్టణాలు, ఓడరేవులు లాంటి ఇతర పాలనా విభాగాలు కూడా ఉండేవి. సర్కారు అధిపతిని పౌజ్‌దార్‌ అని, పరగణా అధిపతిని షిక్‌దార్‌ అని పిలిచేవారు. గ్రామపాలనలో పట్వారీ, చౌకీదార్, ముఖద్దమ్‌ లాంటి ఉద్యోగులు ఉండేవారు. ఇలా మొగలులు తమ కాలంలో కేంద్రం నుంచి గ్రామం వరకు సమర్థవంతమైన పాలన అందించారు.

రెవెన్యూ పాలన
మొగలుల కాలం నాటి రెవెన్యూ విధానాల్లో కొన్ని నేటికీ కొనసాగుతున్నాయి. భూములను సర్వే చేయించడం, విభజించడం, శిస్తు నిర్ణయించడం లాంటి రెవెన్యూ విధానాలను అనుసరించారు. కేంద్రంలో వజీర్, సుబాలలో (రాష్ట్రాలు) దివాన్‌లు, అమీన్‌లు, సర్కారులు; పరగణాల్లో కనుంగోలు రెవెన్యూ విధులను నిర్వహించేవారు. షేర్షా భూములను కొలిపించి ఉత్తమ - మధ్యమ - అధమ అనే మూడు రకాలుగా విభజించాడు. అక్బర్‌ కాలంలో భూములను పోలజ్, పరౌటీ, చాచర్, బంజర్‌ అనే నాలుగు రకాలుగా విభజించారు. 
పండిన పంటలో 1/3 వంతు భూమి శిస్తుగా వసూలుచేసేవారు. అక్బర్‌ కాలంలో బందోబస్తు రెవెన్యూ విధానం (రైత్వారీ పద్ధతి) ప్రవేశపెట్టారు. నాటి భూమి శిస్తు విధానాన్ని జబ్తి (జాబితా) పద్ధతిగా పేర్కొంటారు. ఈ పద్ధతిలో ప్రతి 10 సంవత్సరాల సగటు పంటను లెక్కించి భూమి శిస్తు విధిస్తారు. అందుకే దీన్ని దహ్‌సాలా పద్ధతి అని కూడా పిలిచేవారు. రైతులు భూమి శిస్తును ధన, ధాన్య రూపంలో చెల్లించడానికి అనుమతించారు.

న్యాయపాలన 
మొగలుల కాలంలో చక్రవర్తే రాజ్యంలో అత్యున్నత న్యాయాధికారి. ఫర్మానాలు జారీ చేయడం, మరణ శిక్షలు విధించడం లాంటి విశేషాధికారాలు కూడా ఉండేవి. చక్రవర్తికి న్యాయపాలనలో సహాయపడటానికి ‘ఖాజీ’లు అనే న్యాయశాఖామంత్రులు, ఇతర ఉద్యోగులు ఉండేవారు. మహ్మదీయ మతానికి చెందిన వారైనా మొగలులు ఇతర మతాల విశ్వాసాలు, మత గ్రంథాల ప్రకారం తీర్పులు చెప్పేవారు. ముఖ్యంగా ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించడానికి అక్బర్‌ తన కాలంలో ఘరోకా-ఇ-దర్శన్‌ అనే విధానాన్ని ప్రవేశపెట్టాడు. జహంగీర్‌ ఆగ్రా కోటలో న్యాయగంటను ఏర్పాటు చేశాడు. సుబాలు, సర్కారులు, పరగణాల్లో కూడా ప్రత్యేక న్యాయాధికారులను నియమించి మొగలులు ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించారు.

సైనిక పాలన
మొగలుల కాలం నాటి సైనిక పద్ధతిని మున్సబ్‌దారీ పద్ధతిగా పేర్కొంటారు. ఈ విధానాన్ని అక్బర్‌ కాలంలో ప్రవేశపెట్టారు. సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లో మున్సబ్‌దారులను నియమించారు. వాళ్లు సైన్యాన్ని పోషించి, యుద్ధ సమయంలో చక్రవర్తికి సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు. మున్సబ్‌దారులకు వంశపారంపర్య హక్కులు లేవు. తరచూ బదిలీ అయ్యేవారు. మున్సబ్‌దార్‌ అంటే ఒక శ్రేణికి అధికారి అని అర్థం. 
అబుల్‌ ఫజల్‌ రచనల ప్రకారం నాటి మున్సబ్‌దారుల్లో సుమారు 33 తరగతులు ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం 10 గుర్రాల నుంచి అధికంగా 10 వేల గుర్రాలను పోషించే 33 తరగతుల మున్సబ్‌దారులుండేవారని అబుల్‌ ఫజల్‌ రాశాడు. నాటి మున్సబ్‌దారీ విధానంలో జాత్‌ (హోదా), సవారీ (అదనపు అలవెన్స్‌) అనే రెండు ముఖ్య విధానాలు అమల్లో ఉండేవి. జహంగీర్‌ కాలంలో, అనంతరం షాజహాన్‌ కాలంలో మున్సబ్‌దారీ విధానంలో కొన్ని మార్పులు చేశారు. అనంతర కాలంలో మున్సబ్‌దారుల స్థానంలో జాగీర్దారులను నియమించారు. మరికొన్నిచోట్ల మున్సబ్‌దారులకే జాగీరులను కేటాయించారు.  అయితే మున్సబ్‌దారులందరూ జాగీర్దారులు కాదు. 


సామాజిక వ్యవస్థ  
మొగలుల కాలంనాటి సామాజిక వ్యవస్థ భూస్వామ్య లక్షణాలను కలిగి ఉండేదని ఆర్‌.సి. మజుందార్, రాయ్‌చౌదరి లాంటి చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. నాటి సమాజంలో ప్రభు, మధ్యతరగతి, సామాన్య అనే మూడు ప్రధాన వర్గాలు ఉండేవి. ప్రభు వర్గంలో చక్రవర్తి, అంతఃపుర ఉద్యోగ బృందం; మధ్యతరగతి వర్గంలో జమీందారులు, జాగీర్దారులు, వృత్తి నిపుణులు ఉండేవారు. రైతులు, కూలీలు, కౌలు రైతులు, సేద్య బానిసలు లాంటి పేదవారు సామాన్య వర్గంలో ఉండేవారు. నాటి సామాజిక వ్యవస్థలో రైతులు, కూలీలు తీవ్రమైన దోపిడీకి గురయ్యేవారు. సమాజంలో బహుభార్యత్వం, వ్యభిచారం, సతీసహగమనం, పరదా పద్ధతి లాంటి సాంఘిక దురాచారాలు అధికంగా ఉండేవి. స్త్రీ విద్య అందుబాటులో లేదు.


సాంస్కృతిక వికాసం
మొగలులు తమ కాలంలో వాస్తు, కళ, విద్యా సారస్వతాల అభివృద్ధి కోసం విశేషంగా కృషిచేశారు. ముస్లిం పాలకులైనా మొగలుల్లో ఔరంగజేబ్‌ మినహా అంతా పరమత సహనం పాటించారు. లౌకిక రాజ్యంగా ఉన్న భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడానికి ఔరంగజేబ్‌ చేసిన ప్రయత్నాల వల్లే మొగల్‌ సామ్రాజ్య పతనం ప్రారంభమైంది. మొగలులు దేశవ్యాప్తంగా మదర్సాలు, పాఠశాలలను స్థాపించారు. కానీ స్త్రీ విద్యాభివృద్ధి గురించి పట్టించుకోలేదు. చక్రవర్తులు తమ ఆస్థానంలో అనేకమంది కవి పండితులను పోషించారు. రాజభాష అయిన పారశీకంతోపాటు, హిందీ, సంస్కృతం, మరాఠీ లాంటి ప్రాంతీయ భాషల్లో కూడా చక్కటి సాహిత్య సృష్టి జరిగింది. ఢిల్లీ సుల్తానుల కాలంలో ప్రారంభమైన ఇండో-ఇస్లామిక్‌ మిశ్రమ సంస్కృతి మొగలుల కాలంలో అత్యున్నత స్థాయికి చేరింది. సంగీతం, శిల్పం, చిత్రలేఖనం, వాస్తు రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగింది. బాబర్‌ నుంచి షాజహాన్‌ వరకు వాస్తురంగంలో ఎక్కువ శ్రద్ధ చూపించారు.ఉద్యానవనాలు, మసీదులు, కోటలు, దర్గాలు, రాజప్రసాదాలు లాంటి నిర్మాణాల్లో పర్షియన్‌ - భారతీయ వాస్తు విధానాలను అనుసరించారు. బాబర్‌తో ప్రారంభమైన ఉద్యానవనాల నిర్మాణం జహంగీర్, షాజహాన్‌ల కాలంలో ఉన్నత దశకు చేరింది. షాలిమార్‌ గార్డెన్స్, మొగల్‌ గార్డెన్స్‌ ప్రఖ్యాతి గాంచాయి. అక్బర్‌ కాలంలో ఫతేపూర్‌ సిక్రీలో నిర్మించిన కట్టడాలు, షాజహాన్‌ కాలంలో నిర్మించిన ఎర్రకోట, తాజ్‌మహల్‌ నిర్మాణాలు మొగలుల వాస్తు కళాపోషణకు దర్పణాలు. అలహాబాద్‌లో అక్బర్‌ పూర్తిగా హిందూ పద్ధతిలో నిర్మించిన 40 స్తంభాల భవనం చాలా ప్రసిద్ధిచెందింది. సంగీతంలో ప్రఖ్యాతి గాంచిన తాన్‌సేన్, బైజుబావరా, బాజ్‌బహదూర్, రూపవతి లాంటి వారిని మొగలులు ఆదరించారు. చిత్రలేఖనంలో చక్రవర్తులు సైతం ప్రావీణ్యం పొందారు. జహంగీర్‌ సూక్ష్మ చిత్రలేఖనంలో నిష్ణాతుడు. హుమయూన్‌ తన ఆస్థానంలో పర్షియన్‌ చిత్రకారులను పోషించాడు. అక్బర్‌ కాలంలో ఖ్వాజా అబ్దుల్‌ సమద్‌ నాయకత్వంలో ప్రత్యేక చిత్రలేఖన విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈవిధంగా మొగలుల కాలంలో సాహిత్యం, వాస్తు కళలు వర్ధిల్లాయి.

ఆర్థిక వ్యవస్థ
మొగలుల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో కొన్ని నూతన మార్పులు సంభవించాయి. పాలకులు వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమల రంగాల అభివృద్ధికి కృషి చేశారు. ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమి శిస్తు. అందుకే, అటు ప్రజలు, ఇటు ప్రభుత్వ ఆర్థిక స్థితులను మెరుగుపరచడానికి మొగల్‌ చక్రవర్తులు వ్యవసాయరంగ అభివృద్ధిపై ఎక్కువ శ్రద్ధవహించారు. రాజ్యంలో భూమి మొత్తం చక్రవర్తిదే అయినప్పటికీ వాస్తవ రూపంలో దాన్ని అనేకమంది అధీనంలో ఉంచారు. భూములకు సంబంధించి ఖుద్‌కాస్త్‌లు, పాహీలు, ముజారియమ్‌లు లాంటి అనేక రకాల పేర్లు వాడుకలో ఉండేవి. రాజ్యానికి లేదా చక్రవర్తికి చెందిన సొంత భూములను ఖలీఫా భూములని, రైతులకు చెందిన భూములను ఖుద్‌కాస్త్‌ భూములని పిలిచేవారు. పాహీలు, ముజారియమ్‌లను కౌలు రైతుల భూములుగా పరిగణించేవారు. జమీందారుల అధీనంలో కూడా కొన్ని భూములు ఉండేవి. నాటి జమీందారుల్లో  స్వయం ప్రతిపత్తి ఉన్న జమీందారులు, మధ్యంతరస్థాయి జమీందారులు, ప్రాథమికస్థాయి జమీందారులు అనే మూడు ప్రధాన వర్గాలు ఉండేవి. ఈ విధంగా మొగలుల కాలంలో వ్యవసాయ రంగంలో కొన్ని మౌలిక మార్పులు ప్రవేశపెట్టారు. రైతాంగ అభివృద్ధికి, నీటిపారుదల సౌకర్యాల కల్పనకు, శిస్తు విధింపునకు పాలకులు కృషి చేశారు. అయితే, నాటి రైతులు జమీందారుల దౌర్జన్యానికి గురయ్యేవారు. అధిక పన్నులతో సామాన్యులు బాధపడేవారు.
                     నాటి వర్తక, వాణిజ్యాలను జాతీయ, అంతర్జాతీయ వర్తకాలుగా వర్గీకరించవచ్చు. దేశంలో జరిగే జాతీయ వర్తకంతోపాటు, పశ్చిమ ఆగ్నేయాసియా దేశాలతో జరిగే విదేశీ వర్తకం కూడా బాగా అభివృద్ధి చెందింది. భారతీయ నూలు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు పాశ్చాత్య దేశాలను ఆకర్షించాయి. లాహోర్, ముల్తాన్‌ గొప్ప రవాణా కేంద్రాలుగా రూపొందాయి. 
విశాలమైన తీరప్రాంతం సముద్ర వ్యాపారానికి తోడ్పడింది. పట్టు, నూలు వస్త్రాలు, ఆయుధాలు, వజ్రాలు, చక్కెర లాంటివి ఎక్కువగా విదేశాలకు ఎగుమతయ్యేవి. బంగారం, కర్పూరం, విలాస వస్తువులను దిగుమతి చేసుకునేవారు. భారతదేశంలో పట్టణ కేంద్రాలు అధికంగా వృద్ధి చెందటం కూడా పట్టణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కారణమైంది. చిన్నచిన్న పట్టణాలు, సరాయిలు, కాస్బాలు కూడా స్థానిక మార్కెట్లుగా మార్పు చెందడం, రవాణా సౌకర్యాలు మెరుగుపడటం, పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు లాంటి కారణాల వల్ల వర్తక, వాణిజ్యాలు అభివృద్ధి చెందాయి.
                     నాడు గ్రామీణ చేతివృత్తులతోపాటు కుటీర పరిశ్రమలు, నూలు, పట్టు, వజ్రాలు, ఉన్ని లాంటి భారీ పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. గ్రామీణ ప్రాంతాల్లో హస్తకళాకారుడి కుటుంబం ఉత్పత్తికి ప్రథమస్థానంగా ఉండేది. వడ్రంగం, నేత, అద్దకం, కమ్మరం లాంటి గ్రామీణ చేతివృత్తులవారు అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసి, వివిధ వర్గాల అవసరాలు తీర్చేవారు. పత్తి, నూనె గింజలు, నీలిమందు లాంటి ఉత్పత్తులు గ్రామీణ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడ్డాయి. కుమ్మరం, తోలు ఉత్పత్తులు పెరిగాయి. పాదరక్షలు, తోలు సంచుల తయారీ లాంటి కుటీర పరిశ్రమలు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేశాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు భిన్నమైన భారీ పట్టణ పరిశ్రమలు కూడా వృద్ధి చెందాయి. బెంగాల్, గుజరాత్‌ ప్రాంతాల్లో జౌళి పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. బెంగాల్, కోరమాండల్‌ ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే లాంగ్‌క్లాత్, మస్లిన్‌ వస్త్రాలకు ఆసియా మార్కెట్లలో అధిక గిరాకీ ఉండేది. ఇత్తడి, రాగి, వజ్రాల పరిశ్రమలు వృద్ధి చెందాయి. మొగలుల కాలంలో పంజాబ్, ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రాంతాలు చక్కెర పరిశ్రమలకు, ఢిల్లీ రాగి పరిశ్రమకు, బెనారస్‌ ఇత్తడి పరిశ్రమకు; ఢాకా, అహ్మదాబాద్, జాన్‌పూర్‌ ప్రాంతాలు వస్త్ర పరిశ్రమలకు ప్రసిద్ధికెక్కాయి. బెర్నియార్‌ అనే ఫ్రెంచి యాత్రికుడు ‘పత్తి పంటలో భారతదేశం ప్రపంచానికే నిధి’ అని పేర్కొన్నాడు.

భాస్కర్ వేడియం

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌