• facebook
  • whatsapp
  • telegram

జైనమతం

క్రీ.పూ. 6 వ శతాబ్దం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే మతపరమైన ఉద్యమాల అవతరణకు దోహదం చేసింది. చైనాలో కన్‌ఫ్యూజియనిజం, టావోయిజాలు, పర్షియాలో జొరాస్ట్రియనిజం అనే మతాలు ఏర్పడ్డాయి. ఈ శతాబ్దంలోనే గంగానదీ పరివాహ ప్రాంతంలో ఎంతోమంది మతాచార్యులు ఆవిర్భవించారు. వైదిక మతాన్ని వ్యతిరేకించే వారి సంఖ్య కూడా క్రమక్రమంగా పెరిగింది. ఈ కాలంలో వచ్చిన మతాల్లో జైనమతం ఒకటి. ఈ మతం ఏర్పడిన విధానం, అందులోని విశేషాల గురించి పరిశీలిద్దాం.

క్రీ.పూ. 6వ శతాబ్దంలోనే భారతదేశంలో 62 మత శాఖలు ఉన్నట్లు చరిత్రకారుల అంచనా. వీటిలో చాలావరకు ఈశాన్య భారతదేశంలో నివసించే ప్రజల మత సంప్రదాయాలు, క్రతువుల మీద ఆధారపడినవే. ఈ కాలంనాటి మత గురువుల్లో మొదటివాడు పురాణ కశ్శపుడు. ఇతడు మంచి నడవడిక మనిషి కర్మల మీద ఎలాంటి ప్రభావం చూపదని బోధించాడు. అజీవక శాఖకు నాయకుడైన గోసాల మస్కరిపుత్ర కూడా పురాణ కశ్శపుడి వాదనతో అంగీకరించి, నియతి వాదాన్ని బోధించాడు. మరో గురువు అజిత కేశ కాంబలిన్ 'ఉచ్ఛేద వాదం' అనే భౌతికవాద సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. ఈ సిద్ధాంతం నుంచే లోకాయత, చార్వాక అనే మత శాఖలు ఏర్పడ్డాయి.
 

‣ మరో మతాధికారైన పకుధ కాత్యాయన భూమి, నీరు, వెలుతురు ఎలాగైతే సమూలంగా నాశనం చేయడానికి వీల్లేని అంశాలో, అదే విధంగా జీవితం, ఆనందం, విషాదం కూడా నాశనం చేయలేని అంశాలని అభిప్రాయపడ్డాడు. అతడి భావాల నుంచే వైశేషిక వాదం పుట్టిందని చరిత్రకారుల భావన. కానీ ఉత్తర భారతదేశంలో ఆవిర్భవించిన మతశాఖల్లో కేవలం బౌద్ధ, జైన మతాలు మాత్రమే స్వతంత్ర మతాలుగా పేరుపొందాయి. దీంతో ఈ శతాబ్దం భారతదేశ చరిత్రలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.

జైనమతం - ఆవిర్భావం 

జైనమత స్థాపకుడు రుషభనాథుడు. రుగ్వేదంలో రుషభనాథుడు (మొదటి తీర్థంకరుడు), అరిష్టనేమి (22 వ తీర్థంకరుడు)ల ప్రస్తావన ఉంది. రుషభనాథుడి గురించి విష్ణుపురాణం, భాగవత పురాణాల్లో పేర్కొన్నారు. వీటిలో రుషభనాథుడిని విష్ణుదేవుడి అవతారంగా వివరించారు. జైనమతంలో 24 మంది తీర్థంకరులు (ప్రవక్తలు లేదా గురువులు) ఉన్నట్లు జైనులు విశ్వసిస్తారు. అయితే మొదటి 22 మంది తీర్థంకరులకు చెందిన చారిత్రక ఆధారాలు ఏమీ లేవు. చివరి ఇద్దరు మాత్రమే చారిత్రక పురుషులు. తీర్థంకరులందరూ క్షత్రియ వంశానికి చెందినవారే కావడం విశేషం. ఇరవైమూడో తీర్థంకరుడైన పార్శ్వనాథుడు మహావీరుడి కంటే 250 సంవత్సరాల ముందు జీవించాడు. ఇతడు బెనారస్ రాజైన అశ్వసేనుడి కుమారుడు. పార్శ్వనాథుడి కాలం నాటికే జైనమతం వ్యవస్థీకృతమైనట్లు తెలుస్తోంది. వర్థమానుడి తల్లిదండ్రులు పార్శ్వనాథుడి అనుచరులుగా ఉండేవారు. చివరి తీర్థంకరుడు వర్థమానుడు.

మహావీరుడి జీవితం, బోధనలు:

వర్థమానుడు వైశాలి నగరానికి దగ్గరలో ఉన్న కుంద గ్రామం (ప్రస్తుత బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా)లో క్రీ.పూ. 540 లో జన్మించాడు. ఇతడి తండ్రి సిద్ధార్థుడు. ఇతడు జ్ఞత్రిక తెగకు అధిపతి, తల్లి త్రిశల. ఈమె వైశాలి పాలకుడైన అచ్చవి రాజు చేతకుని సోదరి. మగధ రాజైన బింబిసారుడు చేతకుడి కుమార్తె అయిన చెల్లనను వివాహం చేసుకోవడం వల్ల మహావీరుడికి మగధను పాలించిన హర్యంక వంశంతో చుట్టరికం ఏర్పడింది. మహావీరుడి భార్య యశోద. వీరి కుమార్తె అనొజ్ఞ (ప్రియదర్శన), అల్లుడు జమాలి. ఇతడే మహావీరుడి మొదటి శిష్యుడు.
‣ వర్థమానుడు తన తల్లిదండ్రులు మరణించిన తర్వాత సత్యాన్వేషణ కోసం ఇంటిని వదిలిపెట్టాడు. అప్పుడు అతడి వయసు 30 ఏళ్లు. మొదటి రెండు సంవత్సరాలు పార్శ్వనాథుని మతశాఖలో సభ్యుడిగా ఉన్నాడు. తర్వాత దాన్ని వదలి మరో 10 ఏళ్లపాటు అజీవక మతస్థాపకుడైన గోసాల మస్కరిపుత్రతో గడిపాడు. 42 ఏళ్ల వయసులో తూర్పు భారతదేశంలోని జృంభిక గ్రామంలో సాల వృక్షం కింద కైవల్యం (సంపూర్ణ జ్ఞానం) పొందాడు. అప్పటి నుంచి జినుడు, జితేంద్రియుడు (జయించినవాడు), మహావీరుడని ప్రసిద్ధి చెందాడు. ఇతడి అనుచరులను జైనులు అంటారు. ఇతడు క్రీ.పూ. 468 లో తన 72 వ ఏట రాజగృహం దగ్గర ఉన్న పావపురిలో మరణించాడు.
‣ మహావీరుడి మరణం తర్వాత చంద్రగుప్త మౌర్యుడి పాలనాకాలంలో తీవ్రమైన కరవు సంభవించింది. దాంతో జైన సన్యాసులు గంగాలోయ నుంచి దక్కనుకు వలస వెళ్లారు. ఈ వలస జైనమతంలో చీలికకు దారితీసింది. మహావీరుడు చెప్పినట్లు దిగంబరత్వాన్ని పాటించాలని భద్రబాహు పేర్కొన్నాడు. ఉత్తర భారతదేశంలో ఉన్న జైనులకు నాయకుడైన స్థూలభద్ర తన అనుచరులను తెల్లబట్టలు ధరించాలని కోరాడు. ఇది జైనమతం దిగంబరులు, శ్వేతాంబరులుగా చీలిపోవడానికి కారణమైంది.

పంచ మహావ్రతాలు:

జైనమతంలో అయిదు ముఖ్య సూత్రాలున్నాయి. వీటినే పంచ మహావ్రతాలు అంటారు. అవి.
1) అహింస,
2) సత్యం,
3) అస్తేయం (దొంగిలించకూడదు),
4) అపరిగ్రహ (ఆస్తి కలిగి ఉండకూడదు),
5) బ్రహ్మచర్యం.

అంతకుముందున్న నాలుగు సూత్రాలకు మహావీరుడు బ్రహ్మచర్యం అనే అయిదో సూత్రాన్ని చేర్చాడు. ఈ అయిదు సూత్రాలను సన్యాసులు కఠినంగా ఆచరిస్తే మహావ్రతులని, సామాన్య అనుచరులు ఆచరిస్తే అనువ్రతులని పిలుస్తారు. జైనమతంలో నిర్వాణం సాధించడానికి సమ్యక్ విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ ప్రవర్తన అనే త్రిరత్నాలను పాటించాలి.
మహావీరుని బోధనలు: మహావీరుడు వేదాల ఆధిపత్యాన్ని ఖండించాడు. జంతు బలులకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇతడు ప్రతి చిన్న వస్తువుకు ఆత్మ ఉంటుందని చెప్పాడు. అందుకే జైనులు అహింసను కచ్చితంగా పాటిస్తారు. జైనమతం దేవుడి ఉనికిని ఖండించలేదు కానీ, విశ్వం పుట్టుక, కొనసాగడానికి దేవుడే కారణం అనే వాదాన్ని తిరస్కరించింది. దేవుడికి జైనమతంలో తీర్థంకరుల కంటే తక్కువ స్థానాన్ని కల్పించారు. వీరికి వర్ణవ్యవస్థపై విశ్వాసంలేదు. అందుకే వారు విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పాటించారు. మహావీరుడు మోక్షసాధనకు పవిత్రమైన, నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని బోధించాడు. అలాగే కఠోర తపస్సు అవసరాన్ని నొక్కి చెప్పాడు.

‣ మొదటి జైనమత కౌన్సిల్ పాటలీపుత్రంలో క్రీ.పూ. 3 వ శతాబ్దంలో ప్రారంభమైంది. దీనికి అధ్యక్షుడు స్థూలభద్రుడు. ఈ కౌన్సిల్‌లో జైన గ్రంథాలైన 12 అంగాలను క్రోడీకరించారు. అయితే ఈ గ్రంథాలను శ్వేతాంబరులు మాత్రమే అంగీకరించారు. రెండో జైన కౌన్సిల్ సౌరాష్ట్రలోని వల్లభిలో క్రీ.శ. 5 వ శతాబ్దంలో జరిగింది. దీనికి దేవర్ది క్సమశ్రమణ అధ్యక్షత వహించాడు. ఇందులో 12 అంగాలు, 12 ఉపాంగాలను క్రోడీకరించారు.
జైనమత వ్యాప్తి, అభివృద్ధి: మహావీరుడు, జైన సన్యాసులు సంస్కృతానికి బదులు సామాన్య ప్రజలు మాట్లాడే భాషను వాడటం, సులభమైన నైతిక నియమావళి, జైన సన్యాసుల కార్యకలాపాలు, రాజుల ఆదరణ మొదలైనవి జైనమత వ్యాప్తికి తోడ్పడ్డాయి. మహావీరుడి అనుచరులు దేశమంతటా విస్తరించారు. అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేసినప్పుడు జైన సన్యానులు సింధు నది ఒడ్డున ఉన్నట్లు తెలుస్తోంది.

‣ జైన సంప్రదాయం ప్రకారం అజాతశత్రువు తర్వాత మగధను పాలించిన ఉదయనుడు జైనమతాభిమాని. నంద వంశరాజులు కూడా జైనమతాన్ని పోషించారు. క్రీ.పూ. 1 వ శతాబ్దంలో ఉజ్జయిని గొప్ప జైనమత కేంద్రంగా ఉండేది. క్రీ.పూ. 4 వ శతాబ్దం చివరినాటికి భద్రబాహు ఆధ్వర్యంలో కొంతమంది జైన సన్యాసులు దక్కనుకు వలస వెళ్లారు. దీంతో మైసూరులోని శ్రావణ బెళగొల కేంద్రంగా జైనమతం దక్షిణ భారతదేశమంతటా వ్యాప్తి చెందింది.

రాజుల ఆదరణ 
చంద్రగుప్త మౌర్య జైనమతాన్ని పోషించిన వారిలో ప్రముఖుడు. భద్రబాహు దక్కనుకు వలస వెళ్లినప్పుడు, చంద్రగుప్తుడు అతడితోపాటు దక్షిణానికి వెళ్లాడు. ఇతడు ఒక కొండపై ఉన్న గుహను చంద్రగుప్తుడికి అంకితం చేయడంతోపాటు ఆ కొండకు చంద్రగిరి అని నామకరణం చేశాడు.
‣ క్రీ.పూ. 2 వ శతాబ్దంలో కళింగను పాలించిన ఖారవేలుడు జైన మతాన్ని స్వీకరించాడు. ఇతడు జైనుల విగ్రహాలను ఏర్పాటుచేసి జైనమత వ్యాప్తికి కృషి చేశాడు.
‣ కుషాణుల కాలంలో మధురలో, హర్షవర్థనుడి కాలంలో తూర్పు భారతదేశంలో జైనమతం ప్రధాన మతంగా ఉండేది. క్రీ.శ. ప్రారంభంలో ఉత్తర భారతదేశంలోని మధుర, దక్షిణ భారత దేశంలోని శ్రావణ బెళగొల ప్రధాన జైనమత కేంద్రాలుగా ఉండేవి. ఇక్కడ లభించిన శాసనాలు, విగ్రహాలు, ఇతర కట్టడాలే ఇందుకు నిదర్శనం.
‣ క్రీ.శ. 5 వ శతాబ్దంలో దక్షిణ భారతదేశానికి చెందిన గంగ, కదంబ, చాళుక్య, రాష్ట్రకూట రాజవంశాలు జైనమతాన్ని పోషించాయి.
‣ మాన్యఖేటను కేంద్రంగా చేసుకుని తమ పరిపాలనను సాగించిన రాష్ట్రకూటులు జైనమతంపై ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించారు. వారు జైన కళలు, సాహిత్యం అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందించారు. రాష్ట్రకూట రాజైన అమోఘవర్షుడి కాలంలో జినసేనుడు, గుణభద్రుడు మహాపురాణం అనే గ్రంథాన్ని రచించారు. అమోఘవర్షుడు రత్నమాలిక అనే జైన గ్రంథాన్ని రచించాడు.
‣ క్రీ.శ. 1110 నాటికి గుజరాత్‌లో జైనమతం వ్యాప్తి చెందింది. అన్హిల్‌వారా (Anhilwara) పాలకుడు, జయసింహగా ప్రసిద్ధిచెందిన చాళుక్యరాజు సిద్ధరాజు, కుమారపాల జైనమతాన్ని ఆదరించారు. వారు జైనమతాన్ని స్వీకరించి, జైనుల సాహిత్యాన్ని, దేవాలయాల నిర్మాణ కార్యకలాపాలను ప్రోత్సహించారు. కుమారపాలుడి ఆస్థానంలోని జైనపండితుడు హేమచంద్రుడు రచించిన త్రిషష్టి సలక పురుష చరిత అనే గ్రంథం ప్రసిద్ధిచెందింది.

 

జైనమత పతనం: భారతదేశంలో జైనమతం పతనం కావడానికి ప్రధాన కారణం అహింసకు మితిమీరిన ప్రాధాన్యం ఇవ్వడమేనని చరిత్రకారుల అభిప్రాయం. అనారోగ్యం పాలైనప్పుడు మందులు వాడితే సూక్ష్మక్రిములు చనిపోతాయి కాబట్టి ఎవరూ మందులు వాడకూడదని జైనులు పేర్కొన్నారు. చెట్లు, కూరగాయల్లో కూడా ప్రాణం ఉంటుంది కాబట్టి వాటికి ఎలాంటి హాని చేయకూడదని నమ్మారు. ఇలాంటి పద్ధతులు సామాన్య ప్రజలకు అంతగా నచ్చలేదు. మొదట్లో జైనమతానికి రాజులనుంచి ఆదరణ లభించినా, తర్వాతికాలంలో ఈ మతానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు.

జైన మతం

                  క్రీ.పూ.6వ శతాబ్దంలో భారతదేశంలో జైన, బౌద్ధ మతాలు ఆవిర్భవించాయి. నాటి దేశ ఆర్థిక, సామాజిక, మత, రాజకీయ రంగాల్లో ఉన్న పరిస్థితులే నూతన మతాల ఆవిర్భవానికి దోహదం చేశాయి. ప్రపంచంలో అనేక మంది నూతన మతాలను స్థాపించి కొత్త సిద్ధాంతాలను అందించారు. చైనాలో కన్ఫ్యూషియస్, లౌత్సలు; పర్షియా (ఇరాన్‌)లో జొరాస్టర్‌ లాంటి తత్త్వవేత్తలు నూతన మత సిద్ధాంతాలను ప్రచారం చేశారు.

నూతన మతాల ఆవిర్భవానికి కారణాలు  ప్రధానంగా అన్ని రంగాల్లోనూ రాజుల కంటే బ్రాహ్మణులకే ఆధిక్యత ఉండటం వల్ల వజ్జి, మల్ల గణ రాజ్యాల్లో యువరాజులుగా ఉన్న వర్ధమాన మహావీరుడు జైనమతాన్ని, గౌతమ బుద్ధుడు బౌద్ధమతాన్ని స్థాపించారు. ఈ కాలంలో అజీవకులు, చార్వాకులు అనే నూతన మతాలు వచ్చినప్పటికీ ప్రజలు మహావీరుడు, గౌతమబుద్ధుడి వ్యక్తిత్వం వల్ల జైన, బౌద్ధ మతాలనే ఆదరించారు.         భారతదేశంలో క్రీ.పూ.6వ శతాబ్దంలో ఉన్న ఆధ్యాత్మిక అశాంతి, బ్రాహ్మణ ఆధిక్యత, యజ్ఞ యాగాల నిర్వహణ లాంటి మత కారణాలతోపాటు షోడశ మహాజనపథాలు ఆవిర్భవించడం; రాచరిక, గణ రాజ్యాల పాలనలోని వ్యత్యాసాలు నూతన మతాల ఏర్పాటుకు దోహదం చేశాయి. నగరాలు, పట్టణాలు ఆవిర్భవించడం; చేతివృత్తుల వారు వివిధ శ్రేణులుగా ఏర్పడటం, వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెందడం, నాణేలు చలామణిలోకి రావడం, వ్యవసాయ రంగంలో ఇనుము వాడకం ద్వారా అధిక వృద్ధిని సాధించడం వంటి ఆర్థిక పరిణామాలు కూడా ఈ నూతన మతాల పుట్టుకకు కారణమయ్యాయి. ముఖ్యంగా నాటి సమాజంలో వర్ణ వ్యవస్థ/కుల వ్యవస్థ విస్తరించడం, వివిధ నూతన వర్గాల ఆవిర్భావం లాంటి సామాజిక పరిణామాలు కూడా దోహదపడ్డాయి. వైదిక మతాచారాలకు (అధిక వ్యయంతో కూడుకున్న యజ్ఞ యాగాది క్రతువుల నిర్వహణ, బ్రాహ్మణ ఆధిక్యత, జంతుబలి లాంటి మతాచారాలు), నూతనంగా విజృంభిస్తున్న సాంఘిక వర్గాల ఆలోచనా విధానానికి మధ్య ఉండే తేడా వల్ల ఘర్షణలు మొదలై జైన, బౌద్ధ మతాలు ఆవిర్భవించాయి.

        జైనమత స్థాపన విషయంలో చరిత్రకారులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. చారిత్రకంగా జైనమత స్థాపకులు రుషభనాథుడు, పార్శ్వనాథుడని; వాస్తవంగా స్థాపించింది మాత్రం వర్ధమాన మహావీరుడని అనేకమంది చరిత్రకారులు సిద్ధాంతీకరించారు.

శాఖలు

      జైనమతంలో క్రమంగా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా జైనమతం దిగంబరులు, శ్వేతాంబరులు అనే రెండు శాఖలుగా చీలిపోయింది. వస్త్రాలు ధరించని వారిని దిగంబరులు అంటారు. వీరికి నాయకుడు భద్రబాహుడు. తెల్లని వస్త్రాలు ధరించే జైనులను శ్వేతాంబరులు అంటారు. వీరికి నాయకుడు స్థూలబాహుడు/స్థూలభద్రుడు. ప్రవర్తనా నియమావళికి సంబంధించి ఇరువర్గాల మధ్య తలెత్తిన భిన్నాభిప్రాయాలు చీలికకు కారణమయ్యాయి.

పంచవ్రతాలు

జైనమత సిద్ధాంతాలను పంచవ్రతాలు అంటారు.
1. అసత్యం: అబద్ధం ఆడకూడదు/సత్యమునే పలకాలి
2. అహింస: జీవహింస చేయరాదు/అహింసను పాటించాలి.
3. అస్తేయ: దొంగతనం చేయకూడదు. 
4. అపరిగ్రాహ:  ఆస్తిని కలిగి ఉండరాదు.
5. బ్రహ్మచర్యం: ప్రతి వ్యక్తి బ్రహ్మచర్యాన్ని పాటించాలి.

       జైనమత గ్రంథాలను అంగాలు అంటారు. ఇవి మొత్తం 12 కాబట్టి ద్వాదశాంగాలు అని కూడా పిలుస్తారు. ప్రతి జైనుడు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలను త్రిరత్నాలు అంటారు. అవి సరైన విశ్వాసం, సరైన జ్ఞానం, సరైన నడవడిక. అంటే తీర్థంకరుల బోధనల పట్ల విశ్వాసాన్ని, వాటిని అర్థం చేసుకునే జ్ఞానాన్ని, అవి పాటించడం ద్వారా ప్రతి జైనుడు మోక్షాన్ని పొందుతాడని జైనుల నమ్మకం. త్రిరత్నాలను జైన, బౌద్ధ మతాలు రెండింటిలోనూ ప్రస్తావించారు. బౌద్ధమతంలో బుద్ధుడు, ధర్మం, సంఘం అనే వాటిని త్రిరత్నాలుగా పేర్కొన్నారు.

తీర్థంకరులు

         జైనమత గురువులను తీర్థంకరులు అంటారు. తీర్థంకరుడు అంటే ‘జీవన స్రవంతిని దాటడానికి వారధి’ లాంటివాడని అర్థం. జైనమత సాహిత్యం, సంప్రదాయంలో మొత్తం 24 మంది తీర్థంకరులు ఉన్నారు. ఇందులో మొదటి తీర్థంకరుడు రుషభనాథుడు, 21వ తీర్థంకరుడు నేమినాథుడు, 22వ తీర్థంకరుడు అరిష్టనేమి, 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు.

తీర్థంకరులు గుర్తు
రుషభనాథుడు ఎద్దు
నేమినాథుడు నీలి గులాబి
 అరిష్టనేమి శంఖం
 పార్శ్వనాథుడు పాము
 వర్ధమాన మహావీరుడు సింహం

     జినుడు (వర్ధమానుడు) పేరు మీదుగా జైనమతం అనే పేరు వచ్చింది కాబట్టి జైన మత స్థాపకుడు వర్ధమన మహావీరుడు అని చెబుతారు. కానీ జైనమత తొలి తీర్థంకరుడు రుషభనాథుడు అని కొంతమంది చరిత్రకారులు పేర్కొంటారు. జైనమత సిద్ధాంతాలను పంచవ్రతాలు అంటారు. 
        దీనిలో మొదటి నాలుగు వ్రతాలైన అహింస, అస్థేయ, అసత్య, అపరిగ్రాహలను 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు తెలియజేశాడు కాబట్టి అతడే జైనమతాన్ని స్థాపించాడని మరికొంతమంది చరిత్రకారులు పేర్కొన్నారు. అయిదో వ్రతం బ్రహ్మచర్యాన్ని వర్ధమాన మహావీరుడు తెలియజేశాడు.

పరిషత్తులు

     జైనమత అభివృద్ధికి రెండు ముఖ్యమైన సమావేశాలు (పరిషత్తులు) నిర్వహించారు. మొదటి జైన పరిషత్తు పాటలీపుత్రంలో స్థూలభద్రుడి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలోనే జైనమత గ్రంథంగా ఉన్న 14 పర్వాల స్థానంలో 12 అంగాలను ప్రవేశపెట్టారు.

    రెండో జైన పరిషత్తును వల్లభిలో క్షమశ్రవణుడు/దేవార్థి క్షమపణ నిర్వహించాడు. ఈ సమావేశంలో 12 ఉపాంగాలను సంకలనం చేశారు.

వర్ధమాన మహావీరుడు

జైనమత స్థాపకుడు వర్ధమాన మహావీరుడు. ఈయన క్రీ.పూ.540లో ప్రస్తుత బిహార్‌లోని కుంద గ్రామంలో జన్మించాడు. తండ్రి సిద్ధార్థుడు, తల్లి త్రిశాల. భార్య యశోద, కుమార్తె ప్రియదర్శిని/అనోజ్ఞ. ఇతడు వైశాలి రాజ్యానికి చెందిన (వజ్జి గణ రాజ్యం) జ్ఞాత్రిక క్షత్రియ వంశస్థుడు. వర్ధమానుడు తన 30వ ఏట ఇల్లు విడిచి 12 ఏళ్లపాటు రిజుపాలిక నదీతీరంలోని జృంభిక అనే గ్రామంలో సాలవృక్షం కింద తపస్సు చేసి 42వ ఏట ‘జినుడు’ అయ్యాడు. జినుడు అంటే కోర్కెలను/ఇంద్రియాలను జయించినవాడని అర్థం. వర్ధమానుడు మహావీరుడు, కేవలి, నిర్గంగ్రథుడు లాంటి బిరుదులను పొందాడు. తన అనుచరులను జైనమతంగా ఏర్పరిచి, మత సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ క్రీ.పూ.468లో బిహార్‌లోని పావాపురి ప్రాంతంలో నిర్యాణం చెందాడు.

బోధనలు

      పంచవ్రతాల్లో చివరిదైన బ్రహ్మచర్యాన్ని ప్రతిపాదించింది వర్ధమానుడే. ఇతడు ద్వైత సిద్ధాంతాన్ని లేదా సాద్వాదాన్ని విశ్వసించాడు. దీని ప్రకారం సృష్టిలో ఆత్మ, పదార్థం అనే రెండు అంశాలు ఉంటాయని తెలిపాడు. పదార్థం నశించిపోతుంది కానీ కోరికల వల్ల ఆత్మ అనేది జన్మ, పునర్జన్మ చట్రంలో ఇరుక్కుపోయి స్వేచ్ఛను కోల్పోతుందని పేర్కొన్నాడు. ఈ చక్రబంధనం నుంచి విముక్తి పొందడం ఎలా అనే దానికి సమాధానం కనుక్కోవడానికే అతడు పరివ్రాజకుడయ్యాడు. సత్యాన్ని అన్వేషిస్తూ ఇల్లు వదిలి వెళ్లడాన్ని పరివ్రాజకుడు అంటారు. వర్ధమానుడు 30వ ఏట, గౌతమ బుద్ధుడు 29వ ఏట పరివ్రాజకులయ్యారు. వేదాలు ప్రామాణికంకాదని, యజ్ఞ యాగాల వల్ల మోక్షం రాదని, జీవహింస చేయరాదని ప్రచారం చేశాడు. ముఖ్యంగా వర్ధమానుడు ప్రచారం చేసిన సిద్ధాంతాన్ని సల్లేఖన వ్రతం అంటారు. అంటే వ్యక్తి అన్న పానాదులు మాని శరీరం శుష్కించేవరకు కఠోరమైన తపస్సు చేస్తే మోక్షం వస్తుందని బోధించాడు.

     మహావీరుడికి గణధారులు (పీఠాధిపతులు) అనే 11 మంది సన్నిహితులైన శిష్యులు/ధర్మదూతలు ఉండేవారు. వారిలో ఆర్య సుధర్ముడు వర్ధమానుడి అనంతరం జైనమతానికి ప్రధాన గురువు (థేరా) కాగా ఈయన తర్వాత జంబు మతగురువు అయ్యాడు. ముఖ్యంగా ధననందుడి పాలనాకాలంలో వర్ధమానుడి తర్వాత సంభూత విజయ గొప్ప జైన మతాచార్యుడిగా పేరొందాడు. ఒక వ్యక్తి కేవలం జ్ఞానాన్ని పొందడానికి 14 ఆధ్యాత్మిక దశలు (పూర్వాలు) దాటాలని పేర్కొన్నారు. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో ఆరో మతగురువు (థేరా)గా పేరొందిన వ్యక్తి భద్రబాహుడు. ఇతడు కల్పసూత్రాలు అనే గ్రంథాన్ని రాశాడు.

వాస్తుకళాభివృద్ధి

  జైనమతం భారతదేశ మత, సాహిత్య, వాస్తుకళా రంగాల్లో ఎన్నో మార్పులకు కారణమైంది. ముఖ్యంగా చంద్రగుప్త మౌర్యుడు, ఖారవేలుడు; కదంబులు, గాంగులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు లాంటి రాజవంశాలు జైనమతాన్ని అవలంబించి అనేక జైన దేవాలయాలను నిర్మించారు. కవులను పోషించి జైన సాహిత్యాభివృద్ధికి  కృషిచేశారు. కర్ణాటకలోని శ్రావణబెల్గోళ (గోమఠేశ్వర మఠం), ఒడిశాలోని ఉదయగిరి గుహాలయాలు, రాజస్థాన్‌లోని మౌంట్‌ అబూ పర్వతంపై ఉన్న దిల్వారా జైన దేవాలయాలు, మహారాష్ట్రలోని ఎల్లోరా గుహాలయాలు జైనమతం వల్ల అభివృద్ధి చెందాయి.

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌