• facebook
  • whatsapp
  • telegram

పుష్యభూతి వంశం

గుప్తుల పాలన అనంతరం పుష్యభూతి వంశస్థుల పాలన ప్రారంభమైంది. ఈ వంశానికి చెందిన తొలి చక్రవర్తి ప్రభాకర వర్ధనుడు. ఈయన కుమారుడు హర్షవర్ధనుడు ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన చివరి హిందూ చక్రవర్తి. హర్షవర్ధనుడు క్రీ.శ.606 నుంచి 647 మధ్య భారతదేశాన్ని పాలించాడు. విస్తృత సామ్రాజ్య స్థాపన చేసి, గొప్ప పరిపాలనను అందించడమే కాకుండా విద్యా సారస్వతాలు, వాస్తు, కళారంగాల అభివృద్ధికి కృషి చేశాడు. భారతదేశాన్ని సందర్శించిన హుయాన్‌త్సాంగ్‌ తన రచనల్లో హర్షుడి పరిపాలనా విశేషాలను వివరించాడు. 
        పుష్యభూతి వంశానికి మొదటి చక్రవర్తి అయిన ప్రభాకర వర్ధనుడు స్థానేశ్వరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ప్రభాకర వర్ధనుడు, యశోమతీ దేవి సంతానం రాజ్యవర్ధనుడు, హర్షవర్ధనుడు, రాజ్యశ్రీ. ఈయన తన కుమార్తె రాజ్యశ్రీని కనోజ్‌ పాలకుడు గ్రహవర్మకు ఇచ్చి వివాహం జరిపించాడు. హూణుల దండయాత్రల అనంతరం గుప్త సామ్రాజ్య శిథిలాలపై పుష్యభూతి వంశపాలనను ప్రారంభించిన ప్రభాకర వర్ధనుడు వారి దండయాత్రల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. అతడి భార్య యశోమతీ దేవి సతీసహగమనం చేసింది. ప్రభాకర వర్ధనుడి మరణానంతరం అతడి పెద్దకుమారుడు రాజ్యవర్ధనుడు చక్రవర్తి అయ్యాడు. ప్రభాకర వర్ధనుడు గొప్పరాజని, పరమ భట్టారక, మహారాజాధి రాజు లాంటి బిరుదులతో పరిపాలించాడని ‘మధుబన్‌’ శిలశాసనంలో పేర్కొన్నారు. ఆర్‌.కె.ముఖర్జీ అనే చరిత్రకారుడు ప్రభాకర వర్ధనుడి అధికారం ఉత్తర భారతదేశమంతటా విస్తరించిందని తెలిపాడు. హర్షుడి ఆస్థాన కవి బాణుడు తన హర్షచరిత్ర గ్రంథంలో ‘ప్రభాకర వర్ధనుడు హూణుల హరిణాలకు (జింకలక్శు సింహం లాంటివాడు’ అని పేర్కొన్నాడు. 
        రాజ్యవర్ధనుడు తండ్రి మరణానంతరం పాలకుడైనప్పటికీ అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా మౌఖరీ వంశీయుడు గ్రహవర్మను మాళ్వా రాజు దేవగుప్తుడు చంపి కనోజ్‌ను ఆక్రమించి రాజ్యశ్రీని బందీ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న రాజ్యవర్ధనుడు మాళ్వాపై దండెత్తాడు. ఆ సమయంలో దేవగుప్తుడు తన స్నేహితుడు గౌడ శశాంకుడితో కలిసి రాజ్యవర్ధనుడిని నిహతుని చేశాడు. ఈ విషయం తెలిసిన రాజ్యశ్రీ వింధ్య పర్వతాలకు వెళ్లిపోయింది. ఇలాంటి విషమ పరిస్థితుల్లో హర్షవర్ధనుడు స్థానేశ్వర పాలనను చేపట్టాడు. రాజ్యవర్ధనుడు, గ్రహవర్మలను చంపినవారి రాజ్యంపై దాడి చేశాడు. ఆనాటి కామరూప (అస్సాం) పాలకుడైన భాస్కర వర్మ సహాయంతో హర్షుడు దేవగుప్తుడు, గౌడ శశాంకుడిని ఓడించాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న తన సోదరి రాజ్యశ్రీని రక్షించి ఆమెను కనోజ్‌ పాలకురాలిని చేశాడు. కానీ కనోజ్‌ ప్రజలు హర్షుడిని తమ రాజ్య బాధ్యతలు స్వీకరించమని కోరారు. దీంతో హర్షుడు క్రీ.శ.606లో శీలాదిత్య బిరుదుతో స్థానేశ్వరం, కనోజ్‌లను కలిపి పాలించాడు.


పరిపాలనా విశేషాలు 
హర్షుడు తన సామ్రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం భుక్తులు - విషయాలు - పదక గ్రామాలుగా విభజించాడు. రాజ్యంలో అత్యున్నత అధికారం చక్రవర్తిదే. పాలనలో చక్రవర్తికి సహాయపడటానికి మంత్రి పరిషత్తు ఉండేది. భుక్తి అధిపతిని ఉపరిక/గోస్త్రీ/భోగపతి అనేవారు. విషయాలకు విషయపతి/కుమారామాత్య అనే పాలకులు ఉండేవారు. గ్రామాలకు అధిపతి గ్రామికుడు. పుష్యభూతి వంశ చక్రవర్తులు పరమభట్టారక, పరం దేవత, మహారాజాధి రాజు లాంటి బిరుదులతో పరిపాలించారు. నాటి మంత్రి పరిషత్తులో భండి (ప్రధానమంత్రి ), మహాసంధి విగ్రహాధికృత (యుద్ధ మంత్రి ), మహాబలాధికృత (సర్వ సైన్యాధ్యక్షుడు), బలాధికృత (సేనాపతి), బృహదాశ్వవర (అశ్వక దళాధిపతి), కాటుక (గజ దళాధిపతి), రాజస్థానీయ (విదేశీ వ్యవహారాల కార్యదర్శి), ఉపరిక (రాజ్య ప్రతినిధి) లాంటివారు ఉండేవారు. 
     హర్షుడి కాలానికి చెందిన రెవెన్యూ, న్యాయ, సైనిక పాలనాపరమైన విషయాలను నాటి శాసనాలు, రచనలు, హుయాన్‌త్సాంగ్‌ రచనలు విపులంగా వివరిస్తున్నాయి. హర్షుడి కాలంలో రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమిశిస్తు నుంచి లభించేది. నాడు పండిన పంటలో 16 వ వంతు శిస్తుగా వసూలు చేసేవారు. దాన్ని  ‘ఉద్రంగ’ అనేవారు. భారతదేశంలో మొదటిసారి హర్షుడి కాలంలోనే జలచక్రాలు (నీటి యంత్రాల్శు వాడుకలోకి వచ్చాయి. వాటిని తులా యంత్రాలు అనేవారు. పన్ను వసూలు కోసం ఆయుక్త, భోజక, ధ్రువాధికరణ, గౌల్మిక లాంటి అధికారులను నియమించేవారు. గ్రామస్థాయిలో పన్ను వసూలు చేయడానికి అక్షపటలిక, కరణిక లాంటి ఉద్యోగులను నియమించారు. వస్తువు బరువు ఆధారంగా ‘తుల్యమేయ’ అనే అమ్మకం పన్నును వసూలు చేసేవారు. హర్షుడి కాలంలో భూమిశిస్తుతో పాటు 18 రకాల ఇతర పన్నులు వసూలు చేసేవారు. మగధ అప్పట్లో వరి పంటకు ఎంతో ప్రసిద్ధి చెందింది. వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలను సమానంగా అభివృద్ధి చేసి ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతకు కృషి చేశాడు. కానీ ఆధునిక చరిత్రకారులు మాత్రం హర్షుడి కాలంలో హస్తకళలు, చేతిపరిశ్రమలు ఆదరణకు నోచుకోలేదన్నారు. రహదారులు సరిగ్గా లేవని, తాను రెండుసార్లు దోపిడీకి గురయ్యానని హుయాన్‌త్సాంగ్‌ తన రచనల్లో పేర్కొన్నాడు.

     రాజ్యంలో చక్రవర్తే అత్యున్నత న్యాయాధికారి. శిక్షలు కఠినంగా ఉండేవి. రాజు పుట్టినరోజు సందర్భంగా నేరస్తులను విడుదల చేసేవారు. హర్షుడి సైన్యంలో అరవై వేల గజదళం, లక్ష ఆశ్విక దళం ఉండేదని; నాటి సామాజిక, మతపరమైన విషయాల గురించి కూడా హుయాన్‌త్సాంగ్‌ తన రచనల్లో పేర్కొన్నాడు. అప్పటి సమాజంలో నాలుగు వర్ణాలు ఉండేవని, వర్ణాశ్రమ ధర్మాలను పాటించేవారని తెలిపాడు. అనేక మిశ్రమ జాతులు, ఉపకులాలు ఉన్నాయని, వరకట్నం లాంటి సాంఘిక దురాచారాలు నాడు సర్వసాధారణమని బాణుడు పేర్కొన్నాడు. కసాయివారు, మత్స్యకారులు, పారిశుద్ధ్య కార్మికులను అగ్రకులాల నుంచి వేరుచేసి అంటరానివారిగా భావించేవారు. స్త్రీ స్థానం అథమ స్థాయిలో ఉండేది. 

     హర్షుడి కాలంలో మతరంగంలో అనేక మార్పులు సంభవించాయి. హిందూమతంతో పాటు జైన, బౌద్ధ మతాల్లో కూడా అనేక శాఖలు, ఉప శాఖలు ఏర్పడ్డాయి. నాడు శైవమతం ప్రధాన తాత్విక మతంగా అభివృద్ధి చెందింది. వేదకాలం నాటి కర్మకాండలకు ఆదరణ పెరిగింది. హర్షుడు హిందూ మతాభిమాని అయినప్పటికీ పరమతసహనాన్ని అనుసరించాడు. ముఖ్యంగా హుయాన్‌త్సాంగ్‌ అధ్యక్షతన కనోజ్‌లో సర్వమత సమావేశాన్ని ఏర్పాటుచేశాడు. దాన్నే కనోజ్‌ పరిషత్‌ అంటారు. హర్షుడి కాలం నాటి మహోన్నత సంఘటన ప్రయాగ పరిషత్‌/మహామోక్ష పరిషత్‌. హుయాన్‌త్సాంగ్‌  మహామోక్ష పరిషత్‌ గురించి విపులంగా రాశాడు. హర్షుడు అయిదేళ్లకోసారి తన సంపదనంతా ప్రయాగ వద్ద పేదలకు దానం చేసి కట్టుబట్టలతో రాజ్యానికి తిరిగివచ్చేవాడని పేర్కొన్నాడు. దీన్నే సర్వస్వదాన కార్యక్రమంగా పేర్కొంటారు. తన పాలనాకాలంలో మహామోక్ష పరిషత్‌ను 6 సార్లు నిర్వహించాడని, 6వ పరిషత్‌కు హుయాన్‌త్సాంగ్, భాస్కర వర్మ హాజరయ్యారని పేర్కొన్నారు.


సాంస్కృతిక అంశాలు  
హర్షుడి కాలంలో విద్యా సారస్వతాలు, వాస్తు కళారంగాలు అభివృద్ధి చెందాయి. హర్షుడు గొప్ప సాహిత్య, కళా పోషకుడు; స్వయంగా పండితుడు. సంస్కృతంలో నాగానందం, రత్నావళి, ప్రియదర్శి లాంటి గ్రంథాలను రచించాడు. హర్షుడి ఆస్థాన కవి బాణుడు హర్షచరిత్ర, కాదంబరి లాంటి గ్రంథాలను రచించాడు. సూర్య శతకాన్ని రాసిన మయూరుడు, సుభాషిత శతకాన్ని రచించిన భర్తృహరి హర్షుడి ఆస్థానంలోనే ఉండేవారు. విద్యాభివృద్ధి కోసం 100 గ్రామాలను నలందా విశ్వవిద్యాలయానికి దానం చేశాడని, దీనిలో 1500 మంది అధ్యాపకులు ఉండేవారని, శీలభద్రుడు నాటి విశ్వవిద్యాలయ ఛాన్సలర్‌ అని హుయాన్‌త్సాంగ్‌ తన సీ-యూ-కీ గ్రంథంలో రాశాడు. హర్షుడి పరిపాలనా కాలంలోనే మౌఖరీ వంశీయులు వల్లభి విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేశారు. హుయాన్‌త్సాంగ్‌ కూడా నలందా విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించాడు. ఆర్‌.సి.మజుందార్‌ ప్రకారం హర్షుడు యుద్ధం, శాంతి కళల్లో సమాన ప్రతిభ కలిగి ఉన్నాడు. కలాన్ని, కత్తిని సమానంగా వాడగల నిపుణుడు.


హర్షుడి విజయాలు 
మధుబన్, బాన్స్‌కేరా, సోనేఫట్‌ శాసనాలు; హుయాన్‌త్సాంగ్‌ రచన సీ-యూ-కీ, బాణుడి హర్షచరిత్ర గ్రంథాల్లో హర్షవర్ధనుడి విజయాలు, పరిపాలనా విశేషాలను ప్రస్తావించారు. హర్షుడు మొదట దేవగుప్తుడిని ఓడించి కనోజ్‌ను నూతన రాజధానిగా చేశాడు. వల్లభి రాజు రెండో ధ్రువసేనుడిని ఓడించి సామంత రాజుగా చేసుకున్నాడు. నౌశాచి తామ్ర శాసనంలో హర్షుడి వల్లభి విజయం గురించి ప్రస్తావించారు. హర్షుడు గౌడ రాజులతో వైవాహిక సంబంధాలను నెలకొల్పాడు. ఈయన పల్లవరాజు మొదటి మహేందవర్మను ఓడించాడని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. కానీ దీనికి కచ్చితమైన సాక్ష్యాధారాలు లేవు. కళింగ రాజ్యాన్ని హర్షుడు జయించాడని చెప్పవచ్చు. కారణం నేటికీ అక్కడ హర్ష శకాన్ని పాటిస్తున్నారు. మాళ్వా, లత, ఝార్జర ప్రాంతాలపై ఆధిపత్యం కోసం నాటి దక్షిణ భారతదేశ రాజు, పశ్చిమ చాళుక్య వంశస్థుడు రెండో పులకేశి, హర్షుడి మధ్య ఘర్షణ తలెత్తింది. ఇన్ని విజయాలు సాధించిన హర్షుడు రెండో పులకేశి చేతిలో ఓటమిపాలయ్యాడు. నర్మదా నది యుద్ధంలో సకలోత్తరాపధేశ్వరుడైన హర్షుడిని ఓడించి రెండో పులకేశి పరమేశ్వర బిరుదును పొందాడని ఐహోల్‌ శాసనం తెలుపుతుంది. హర్షుడి విజయాల వల్ల కశ్మీర్‌ మినహా మిగిలిన ఉత్తర భారతదేశమంతా అతడి సామ్రాజ్యం విస్తరించింది.


హుయాన్‌త్సాంగ్‌  
హర్షుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన ప్రముఖ చైనా యాత్రికుడు. ఇతడికి యాత్రికుల్లో రాజు (ప్రిన్స్‌ ఆఫ్‌ పిలిగ్రిమ్స్శ్‌ అనే బిరుదు ఉండేది. క్రీ.శ.630లో భారతదేశానికి వచ్చి సుమారు 15 ఏళ్లు ఉన్నాడు. ఇక్కడ తాను చూసిన, విన్న విషయాలను సీ-యూ-కీ (పశ్చిమ ప్రపంచ ప్రతుల్శు గ్రంథంలో రాశాడు. ఇది హర్షుడి కాలం నాటి చరిత్రకు ప్రధాన ఆధార గ్రంథం. 

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌