• facebook
  • whatsapp
  • telegram

పాలనపై కార్యనిర్వాహక, న్యాయశాఖల నియంత్రణ

కార్యనిర్వాహకశాఖ

ఉద్యోగ వ్యవస్థపై రాజకీయ కార్యనిర్వాహకులకు (మంత్రి) ఉండే నియంత్రణను కార్యనిర్వాహకశాఖ నియంత్రణ అంటారు. తన మంత్రిత్వ శాఖలో పని చేసే ఉద్యోగుల పనితీరుపై మంత్రికి నియంత్రణ ఉంటుంది. పాలనా వ్యవస్థ ఏం చేయాలో, చేయకూడదో అనే అంశాన్ని వీరు ముందుగానే నిర్దేశిస్తారు.


పద్ధతులు


సివిల్‌ సర్వీస్‌ కోడ్‌: ఉద్యోగుల ప్రవర్తనా నియమావళిని రూపొందించి, దానికి అనుగుణంగా వ్యవహరించేలా నిర్దేశిస్తారు. దీని ప్రకారం ఉద్యోగుల అధికారిక ప్రవర్తనపై మాత్రమే కాక వ్యక్తిగత ప్రవర్తనపై కూడా నియంత్రణ ఉంటుంది.

విధాన రూపకల్పన: ప్రజల సంక్షేమానికి అవసరమైన పాలనా విధానాలను మంత్రిమండలి ్బద్చ్జిi-’్మ్శ రూపొందిస్తుంది. వీటిని ప్రభుత్వ ఉద్యోగులు అమలు చేస్తారు. ప్రతి మంత్రిత్వ శాఖ పాలనా విధానాలను ఏ విధంగా అమలు చేయాలో వివరిస్తూ తన పరిధిలోని ఉద్యోగులకు మార్గదర్శకాలను జారీ చేస్తుంది.

బడ్జెట్‌: ప్రభుత్వ విధానాలను అమలు చేయడానికి ఉద్యోగులకు ఆర్థిక వనరులు ్బన్యీ-్ట(్శ అవసరం. వీటిని కార్యనిర్వాహక శాఖ బడ్జెట్‌ ద్వారా కేటాయిస్తుంది. ఇది ‘బడ్జెట్‌’ అంచనాలను ఆమోదిస్తుంది, అధికారులు నిధులు ఖర్చు చేస్తున్నప్పుడు అనుసరించాల్సిన నియమాలను నిర్దేశిస్తుంది. దీని ద్వారా ఆర్థికశాఖ పాలనను నియంత్రిస్తుంది.

స్టాఫ్‌ ఏజెన్సీ: స్టాఫ్‌ ఏజెన్సీ అనేది కార్యనిర్వాహకులకు సలహా ఇచ్చే పాలనా విభాగం. వీటిలో ముఖ్యమైనవి ప్రధానమంత్రి కార్యాలయం ్బశిలీవ్శీ, కేబినెట్‌ సెక్రటేరియట్, నీతి ఆయోగ్‌ మొదలైనవి. స్టాఫ్‌ ఏజెన్సీలు ఇచ్చే సలహాల ఆధారంగా మంత్రులు పాలనపై నియంత్రణ కలిగి ఉంటారు.

శాసన దత్తత: విధాన రూపకల్పనకు సంబంధించిన నియమ నిబంధనలను రూపొందించి, వాటికి అవసరమైన నియమాలను తయారు చేయాలని ఉద్యోగులను మంత్రి నిర్దేశిస్తారు.

ఉద్యోగ ప్రక్రియ: ఉద్యోగుల నియామకం, పోస్టింగ్, పదోన్నతులు, వేతనాలు, క్రమశిక్షణా చర్యలు, బదిలీలు మొదలైన ప్రక్రియల ఆధారంగా మంత్రి పాలనపై నియంత్రణ కలిగి ఉంటారు.

* పాలనపై కార్యనిర్వాహక శాఖ నియంత్రణ సమర్థవంతంగా ఉండాలంటే మంత్రులు నైతిక విలువలు కలిగి ఉండాలి. అవినీతి, అక్రమాలకు పాల్పడకూడదు. మంత్రులకు పాలనా నియమాలపై అవగాహన ఉండాలి. అధికారం చేపట్టిన ప్రతి మంత్రికి పాలనా వ్యవహారాలపై శిక్షణ ఇవ్వాలి.


న్యాయశాఖ

సమన్యాయ పాలన అనేది ప్రజాస్వామ్యంలో కీలక అంశం. దీని ప్రకారం పాలనలో వ్యక్తుల హక్కులకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. పాలనా వ్యవస్థపై న్యాయస్థానాలు జరిపే నియంత్రణను న్యాయశాఖ నియంత్రణ అంటారు. పాలనను నియంత్రించడం ద్వారా న్యాయశాఖ ప్రజల హక్కులను, స్వేచ్ఛను కాపాడుతుంది.న్యాయశాఖ కింది చర్యల ద్వారా పాలనపై నియంత్రణ కలిగి ఉంటుంది.


రిట్స్‌ (Writs) జారీ చేయడం


రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 ద్వారా సుప్రీంకోర్టు, ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులు రిట్స్‌ను జారీ చేస్తాయి. వీటిని పాలనపై న్యాయశాఖ నియంత్రణకు ఆధారాలుగా పరిగణిస్తారు. వీటిలో ముఖ్యమైనవి:

1. హెబియస్‌ కార్పస్‌ (Habes carpus): ఈ రిట్‌ను ఉదారమైన రిట్‌గా, వ్యక్తి స్వేచ్ఛల పరిరక్షణ సాధనంగా పేర్కొంటారు. దీని ప్రకారం, ఒక వ్యక్తిని అరెస్టు చేయాలంటే దానికి గల కారణాన్ని తెలపాలి. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని మొత్తం శరీరంతో సహా 24 గంటల్లోగా న్యాయస్థానం ముందు హాజరు పరచాలని ఈ రిట్‌ నిర్దేశిస్తుంది. దీని ద్వారా ఒక వ్యక్తి అరెస్టు లేదా నిర్బంధం చట్టబద్ధమైందా? కాదా? అని న్యాయస్థానం నిర్ణయిస్తుంది.

2. మాండమస్‌ (Mandamus): ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి తన విధిని సక్రమంగా నిర్వహించకపోతే ‘నీవు నీ విధిని సక్రమంగా నిర్వహించు’ అని న్యాయస్థానం నిర్దేశిస్తుంది. దీని ద్వారా పాలనలో అలసత్వం, అతిక్రమణను కోర్టు నియంత్రిస్తుంది. ఒక ప్రభుత్వ అధికారిని తనకు ఉన్న చట్టబద్ధ విధులను నిర్వర్తించమని ఈ రిట్‌ ద్వారా మార్గనిర్దేశం చేస్తారు.


3. ప్రొహిబిషన్‌(prohibition): ఏదైనా దిగువ స్థాయి న్యాయస్థానం తన పరిధిలో లేని కేసును విచారిస్తుంటే, తక్షణమే ఆ విచారణను నిలిపివేయాలని ఉన్నతస్థాయి న్యాయస్థానం ఆదేశిస్తుంది.


4. సెర్షియోరరి (certiorary): దిగువస్థాయి న్యాయస్థానం నిలిపివేసిన విచారణను పక్క న్యాయస్థానానికి లేదా ఎక్కువ స్థాయి న్యాయస్థానానికి బదిలీ చేయాలని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆదేశం.


5. కోవారెంటో (Quo Warranto) : చట్టబద్ధంగా ఎలాంటి అర్హత లేని వ్యక్తి ప్రభుత్వ పదవిని చేపట్టి, నిర్వహిస్తుంటే ‘‘నువ్వు ఏ అధికారంతో ఆ పదవిని నిర్వహిస్తున్నావు?’’ అని సంబంధిత వ్యక్తిని న్యాయస్థానం ప్రశ్నిస్తుంది. ఆ పదవి నుంచి వైదొలగాలని ఆదేశాలు జారీ చేస్తుంది. ప్రజా పదవుల దుర్వినియోగాన్ని నియంత్రించడం దీని ఉద్దేశం.


న్యాయ సమీక్ష (Judical Review)


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే శాసనాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే అవి చెల్లుబాటు కావని న్యాయస్థానం తీర్పు ఇస్తుంది. దీన్ని ‘న్యాయ సమీక్ష’ అంటారు. పాలన సక్రమంగా కొనసాగేందుకు న్యాయసమీక్ష ద్వారా మార్గనిర్దేశం చేస్తారు. పౌరుల హక్కుల పరిరక్షణకు, చట్టబద్ధమైన పరిపాలనకు న్యాయసమీక్ష తోడ్పడుతుంది.


సుప్రీంకోర్టు తీర్పులు


ఇనాందార్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కేసు: ‘‘మైనార్టీ, మైనార్టీయేతర నాన్‌-ఎయిడెడ్‌ ప్రైవేట్‌ కళాశాలల్లో ప్రభుత్వం రిజర్వేషన్‌ విధానాన్ని వర్తింపజేయడానికి వీల్లేదు’’ అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.


ఎం.నాగరాజు Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు: ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ ‘‘సమానత్వపు హక్కు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. చట్టం ముందు అందరూ సమానులే’’ అని పేర్కొంది.


వినోద్‌ దువా Vs  స్టేట్‌ ఆఫ్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ కేసు: ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ ‘‘కాలం చెల్లిన చట్టాల అమలును నిలిపివేయాలి. రాజద్రోహం కేసు అంటే - ఐపీసీలోని సెక్షన్‌ 124(తి) ఆధారంగా నమోదైన కేసులన్నింటి విచారణను తక్షణం నిలిపి వేయాలి. ఈ సెక్షన్‌ కింద అరెస్ట్‌ అయ్యి, జైళ్లలో ఉన్నవారు వెంటనే బెయిల్‌ పిటిషన్స్‌ సమర్పించుకోవచ్చు’’ అని పేర్కొంది.


సెల్వి Vs స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక: ‘‘నేర విచారణ సందర్భంగా పోలీసు అధికారులు వ్యక్తి అనుమతి లేకుండా నార్కో అనాలసిస్‌ టెస్ట్, లై డిటెక్టర్‌ లాంటి వాటిని వినియోగించకూడదు’’ అని ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.


ప్రకాష్‌ కదమ్‌ Vs  రామ్‌ ప్రసాద్‌ గుప్తా కేసు: ‘‘పోలీసులు తమ అధికార దుర్వినియోగంతో బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడితే, అది నిజమని తేలితే, సదరు అధికారులకు ఉరిశిక్ష విధించాలి.’’ అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.


సతీష్‌చంద్ర Vs ఎం.పి.శర్మ కేసు: ‘‘ఒక వ్యక్తిపై ఒత్తిడి తెచ్చి, తనపై తానే వ్యతిరేక సాక్ష్యం ఇవ్వాలని అధికారులు ప్రయత్నించడం రాజ్యాంగ విరుద్ధం’’ అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.


శోభారం Vs  స్టేట్‌ ఆఫ్‌ మధ్యప్రదేశ్‌ కేసు: ‘‘అరెస్ట్‌ అయిన వ్యక్తి తన గురించి తాను వాదించుకునే అవకాశం కల్పించడం ప్రాథమిక హక్కు. దాన్ని నిరాకరించే అధికారం ప్రభుత్వ అధికారులకు లేదు’’ అని సుప్రీంకోర్టు ఈ కేసు సందర్భంగా తీర్పు ఇచ్చింది.


ప్రజాప్రయోజన వ్యాజ్యం (Public Intrest Litigation-PIL)

* ఎవరైనా వ్యక్తులు అన్యాయానికి గురై, న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆర్థిక స్థోమత, పరిజ్ఞానం లేకపోతే వారి తరపున మరొకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. వారికి న్యాయం చేయాలనే ప్రయత్నాన్నే ప్రజాప్రయోజన వ్యాజ్యం అంటారు. ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయొచ్చు. 


* ప్రజల ప్రయోజనార్థం మానవ సమూహానికి చెందిన ఏ వ్యక్తి అయినా సరే ఇతరుల హక్కులు, సంక్షేమం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సమన్యాయపాలన అందించేందుకు, ప్రాథమిక హక్కులు సమర్థవంతంగా అమలయ్యేలా చూడటానికి, న్యాయస్థానం ఆదేశాలు ఉల్లంఘనకు గురికాకుండా ఉండేందుకు ప్రజాప్రయోజన వ్యాజ్యం తోడ్పడుతుంది. ప్రజాప్రయోజన వ్యాజ్యం అనే భావన మొదటిసారి అమెరికాలో ప్రారంభమైంది. ఇది మన దేశంలో 1980 దశకంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పి.ఎన్‌.భగవతి, జస్టిస్‌ వి.ఆర్‌.కృష్ణయ్యర్‌ దీన్ని విస్తృతం చేశారు.

* చట్టం సక్రమంగా అమలయ్యేలా, అందరికీ సమన్యాయం దక్కేలా, రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరేలా చేసేదే ప్రజాప్రయోజన వ్యాజ్యం.

న్యాయవ్యవస్థ- క్రియాశీలత


ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంపొందించడం, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించేలా చేయడం, రాజ్యాంగ నియమాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలనను సాగించడంలో న్యాయవ్యవస్థ క్రియాశీల పాత్ర పోషిస్తుంది.


ప్రభుత్వంపై దావా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే విధానాల వల్ల ఎవరైనా వ్యక్తి నష్టపోతున్నట్లు భావిస్తే, ప్రభుత్వంపై న్యాయస్థానంలో దావా వేయొచ్చు. ప్రభుత్వం పౌరులతో కుదుర్చుకున్న ఒప్పందాల ఉల్లంఘన జరిగినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దావా వేయొచ్చు.

* ప్రభుత్వ ఉద్యోగులు అనుసరించిన విధానాల వల్ల ఇబ్బందులకు గురైనవారు న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చు. పాలనా నియమాల ఉల్లంఘన జరిగిందనే కారణంతో ఉద్యోగులపై న్యాయస్థానంలో దావా వేయొచ్చు.


 

Posted Date : 21-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌