• facebook
  • whatsapp
  • telegram

భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు

         భారతదేశ ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పరిషత్ రూపొందించింది. ప్రపంచంలోని అనేక రాజ్యాంగాల్లోని విశిష్ట అంశాలను గ్రహించి, వాటిని భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించారు. 1950, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన రాజ్యాంగానికి కాలానుగుణంగా సవరణలు చేశారు.
 

లిఖిత రాజ్యాంగం

         భారత రాజ్యాంగాన్ని లిఖితపూర్వకంగా, క్రమ పద్ధతిలో ఒక గ్రంథంగా రూపొందించారు. కాబట్టి భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం. దీన్ని భారత రాజ్యాంగ పరిషత్ 1946, డిసెంబరు 9 నుంచి 1949, నవంబరు 26 వరకు అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో రూపొందించింది. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హా, శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ బాధ్యతలు నిర్వర్తించారు. హెచ్.సి.ముఖర్జీ, వి.టి. కృష్ణమాచారి ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు.
 

అతిపెద్ద రాజ్యాంగం

        ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగాలన్నింటిలోకి భారత రాజ్యాంగమే అతి పెద్దది, సుదీర్ఘమైంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి 395 నిబంధనలు లేదా అధికరణలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లు ఉన్నాయి. రాజ్యాంగ సవరణల కారణంగా వీటి సంఖ్య పెరుగుతూ ఉంది. ఐవర్ జెన్నింగ్స్ అభిప్రాయంలో ''భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద వివరణాత్మక రాజ్యాంగం''.
 

భారత రాజ్యాంగ ఆధారాలు

    భారత రాజ్యాంగ రచనకు అనేక రాజ్యాంగాలు, ఇతర చట్టాలు, రాజ్యాంగ పరిషత్ సభ్యుల ఆలోచనలు ఆధారాలు అయ్యాయి. అయితే అందులో 2/3వ వంతుకు పైగా కొద్దిపాటి మార్పులతో, యథాతథంగా భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి గ్రహించారు. దీంతో పాటు అనేక ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి కొన్ని అంశాలను స్వీకరించారు.
అమెరికా రాజ్యాంగం: అమెరికా రాజ్యాంగం నుంచి లిఖిత రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థ, రాజ్యాంగ ఆధిక్యత, ప్రాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్షాధికారం, రాష్ట్రపతి ఎన్నిక, మహాభియోగ తీర్మానం ద్వారా తొలగింపు, దృఢ రాజ్యాంగ లక్షణం, ఉపరాష్ట్రపతి పదవి, ఉపరాష్ట్రపతి రాజ్యసభకు పదవిరీత్యా అధ్యక్షత వహించడం మొదలైనవి గ్రహించారు.
బ్రిటిష్ రాజ్యాంగం : బ్రిటిష్ రాజ్యాంగం నుంచి పార్లమెంటరీ ప్రభుత్వం, సమ న్యాయపాలన, మంత్రివర్గ నిర్మాణం, శాసన నిర్మాణం, శాసన కార్యనిర్వాహక శాఖల మధ్య సంబంధాలు, నామమాత్ర కార్యనిర్వాహక వర్గం, స్పీకర్ వ్యవస్థ, ఏక పౌరసత్వం, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యుల ప్రత్యేక హక్కులు మొదలైనవి గ్రహించారు.
ఆస్ట్రేలియా రాజ్యాంగం: ఉమ్మడి జాబితా, పార్లమెంట్‌లోని ఉభయ సభల సంయుక్త సమావేశం, వర్తక వాణిజ్యం, అంతర్ రాష్ట్ర రవాణా.
కెనడా రాజ్యాంగం: 'యూనియన్ ఆఫ్ స్టేట్స్', బలమైన కేంద్రంతో కూడిన సమాఖ్య వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వానికి అవశిష్టాధికారాలు ఉండటం మొదలైనవి.
ఐర్లాండ్ రాజ్యాంగం: ఆదేశ సూత్రాలు, రాజ్యసభకు సభ్యులను నామినేట్ చేయడం, నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం.
సోవియట్ రష్యా రాజ్యాంగం: ప్రాథమిక విధులు, ఆదేశ సూత్రాల్లోని సామ్యవాద నియమాలు.
దక్షిణాఫ్రికా రాజ్యాంగం: రాజ్యాంగ సవరణ పద్ధతి, రాజ్యసభ సభ్యుల ఎన్నిక.
జపాన్ రాజ్యాంగం: జీవించే హక్కు, చట్టం నిర్ధారించిన పద్ధతి.
ఫ్రెంచ్ రాజ్యాంగం: రిపబ్లిక్, తాత్కాలిక సభాధ్యక్షుల నియామకం.
జర్మనీ రాజ్యాంగం: అత్యవసర పరిస్థితి నిబంధనలు.

 

ఏకకేంద్ర లక్షణాలు ఉన్న సమాఖ్య వ్యవస్థ

భారత రాజకీయ వ్యవస్థను స్వభావంలో ఏక కేంద్ర ప్రభుత్వంగా, స్వరూపంలో సమాఖ్య వ్యవస్థగా ఏర్పాటు చేశారు. అందుకే దీన్ని కె.సి.వేర్ 'అర్ధ సమాఖ్య'గా వర్ణించారు. బలమైన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేసే అధికారం, రాష్ట్రాల సరిహద్దులను, పేర్లను మార్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉండటం, ఏకీకృత న్యాయ వ్యవస్థ, ఏక పౌరసత్వం, అధృడ రాజ్యాంగం, ఒకే రాజ్యాంగం, రాష్ట్ర శాసన సభలకు ఎన్నికలను భారత ఎన్నికల సంఘం నిర్వహించడం, రాష్ట్రాల గవర్నర్లను కేంద్రం నియమించడం, తొలగించడం, అఖిల భారత సర్వీసులు, రాజ్యసభలో రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం లేకపోవడం, రాష్ట్రపతికి అత్యవసర అధికారాలు, రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంట్‌కు అధికారం ఉండటం మొదలైన ఏకకేంద్ర లక్షణాలను పొందుపరచడం ద్వారా రాజ్యాంగ నిర్మాతలు దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికారాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. అదే విధంగా సమాఖ్య లక్షణాలైన కేంద్రం రాష్ట్రాల మధ్య అధికార విభజన, రెండు స్థాయుల్లో ప్రభుత్వాలు, లిఖిత రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం, రాజ్యాంగ ఆధిక్యత, న్యాయ సమీక్షాధికారం, స్వతంత్ర న్యాయశాఖ ద్విసభా విధానం లాంటి వాటిని రాజ్యాంగంలో చేర్చారు.
 

దృఢ, అదృఢ రాజ్యాంగం

    భారత రాజ్యాంగాన్ని మూడు పద్ధతుల్లో సవరిస్తారు.
1. అదృఢ రాజ్యాంగ పద్ధతిలో సాధారణ మెజారిటీతో సవరించడం: రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, సరిహద్దులు, పేర్లను మార్చడం, పౌరసత్వం మొదలైన అంశాలను పార్లమెంట్‌లో సాధారణ మెజారిటీతో, సాధారణ చట్టాన్ని సవరించినట్లుగా పార్లమెంట్ సవరించగలదు.
* రాజ్యాంగంలోని XX వ భాగంలోని 368వ నిబంధన రెండు పద్ధతులను సూచించింది. ఇది దృఢ రాజ్యాంగ లక్షణాన్ని పోలి ఉంటుంది.
2. పార్లమెంట్‌కు మెజారిటీ సభ్యులు హాజరై, 2/3వ వంతు సభ్యుల ఆమోదంతో సవరించడం. ఉదాహరణకు ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు మొదలైనవి.
3. పార్లమెంట్‌కు మెజారిటీ సభ్యులు హాజరై వారిలో 2/3వ వంతు సభ్యుల ఆమోదంతోపాటు సగం రాష్ట్ర శాసనసభల ఆమోదంతో సవరించడం. ఉదాహరణకు రాష్ట్రపతి ఎన్నిక, కేంద్ర ప్రభుత్వ అధికారాలు, రాష్ట్రాల అధికారాలు, సుప్రీంకోర్ట్, హైకోర్ట్ అధికారాలు, కేంద్రరాష్ట్రాల మధ్య శాసన సంబంధాలు, రాజ్యసభలో రాష్ట్రాల ప్రాతినిధ్యం, రాజ్యాంగ సవరణ విధానం మొదలైనవి.

 

ప్రవేశిక లేదా పీఠిక

భారత రాజ్యాంగ మూలతత్వం, సారాంశాన్ని ప్రవేశిక ద్వారా తెలుసుకోవచ్చు. భారత ప్రజలు సార్వభౌములు. భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం. ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, వివిధ రకాల స్వేచ్ఛ, సమానత్వం, ప్రజల మధ్య సౌభ్రాతృత్వం కల్పించడమే లక్ష్యంగా రాజ్యం పనిచేస్తుందని అర్థమవుతుంది. 42వ రాజ్యాంగ సవరణ చట్టం (1976) ద్వారా ప్రవేశికకు 'లౌకిక, సామ్యవాద, సమగ్రత' అనే మూడు పదాలను చేర్చారు. మథోల్కర్ అభిప్రాయంలో ప్రవేశిక 'రాజ్యాంగ ప్రధాన లక్షణాల సారం'. జస్టిస్ హిదయతుల్లా అభిప్రాయంలో ప్రవేశిక 'రాజ్యాంగానికి ఆత్మ లాంటిది'.
 

పార్లమెంటరీ ప్రభుత్వం

   భారత రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కార్యనిర్వాహక వర్గం మనుగడ పార్లమెంట్ విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. కార్యనిర్వాహక వర్గంపై పార్లమెంట్/ శాసనసభకు నియంత్రణ ఉంటుంది. మంత్రిమండలికి సమష్టి బాధ్యత ఉంటుంది.
 

సార్వజనీన వయోజన ఓటుహక్కు

     భారత రాజ్యాంగంలోని XVవ భాగంలో ఉన్న 326వ నిబంధన ప్రకారం 18 సంవత్సరాలు నిండిన భారత పౌరులందరికీ ఎలాంటి వివక్ష లేకుండా ఓటుహక్కు లభిస్తుంది. (61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు హక్కు పొందడానికి కనీస వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు).
 

ఏక పౌరసత్వం

రాజ్యాంగంలోని రెండో భాగంలో 5 నుంచి 11 వరకు ఉన్న నిబంధనలు పౌరసత్వం గురించి వివరిస్తాయి. 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లోని భారతీయులందరికీ ఒకే పౌరసత్వం (భారతీయ పౌరసత్వం), ఒకే రకమైన హక్కులు ఉంటాయి. దేశ సమైక్యత, సమగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఏక పౌరసత్వం కల్పించారు.
 

ప్రజాస్వామ్య సామ్యవాదం

ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతంగా సామ్యవాదాన్ని సాధించాలనేది రాజ్యాంగ నిర్మాతల ఆశయం. సామ్యవాదం అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు చేర్చారు. ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించాలనేదే ప్రభుత్వ ఆశయం.
 

ద్విసభా విధానం

పార్లమెంట్‌లో లోక్‌సభ, రాజ్యసభ అనే రెండు సభలు ఉన్నాయి. దిగువ సభ ప్రత్యక్షంగా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. చాలా రాష్ట్రాల్లో ఏక సభా విధానం అమల్లో ఉండగా ఆంధ్రప్రదేశ్, బిహార్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్‌ల్లో (7 రాష్ట్రాలు) ద్విసభా విధానం అమల్లో ఉంది.
 

ఆదేశ సూత్రాలు

       శ్రేయో రాజ్యం లేదా సంక్షేమ రాజ్య స్థాపన భారత రాజ్య ఆశయం. ఈ ఆశయ సాధనకు రాజ్యాంగంలోని Iవ భాగంలో 36 నుంచి 51 వరకు ఉన్న నిబంధనల్లో వీటిని పొందుపరచారు. ఇవి కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు శాసన నిర్మాణం, వాటి అమల్లో మార్గదర్శకంగా ఉంటాయి. అయితే ఇవి న్యాయార్హమైనవి కావు. వీటిని ప్రభుత్వాలు అమలు చేయకపోతే న్యాయస్థానాల ద్వారా పొందలేం.
 

ప్రాథమిక విధులు

       ఇవి దేశం, సమాజం, పర్యావరణం పట్ల వ్యక్తి నిర్వర్తించాల్సిన విధులను సూచిస్తాయి. స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు రాజ్యాంగంలోని IV - A భాగంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం (1976) ద్వారా 10 ప్రాథమిక విధులను చేర్చారు. ఆ తర్వాత 86వ రాజ్యాంగ సవరణ చట్టం (2002) ద్వారా 11వ ప్రాథమిక విధిని చేర్చారు. కాబట్టి ప్రస్తుతం 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. జనవరి 3న ప్రాథమిక విధుల దినోత్సవం జరుపుకుంటారు. అయితే ఇవి న్యాయార్హమైనవి కావు.
 

ఏకీకృత, స్వతంత్ర న్యాయ వ్యవస్థ

      భారతదేశంలో దేశమంతటికీ ఒకే రకమైన న్యాయ చట్టాలు అమల్లో ఉన్నాయి. సుప్రీంకోర్ట్‌కు ఆధిపత్యం కల్పించారు. అత్యున్నత స్థాయిలో సుప్రీంకోర్ట్‌కు, రాష్ట్ర స్థాయిలో హైకోర్ట్‌కు ఆధిపత్యం ఉంటుంది. జిల్లా స్థాయి నుంచి దిగువ కోర్టులు న్యాయ నిర్వహణ చేస్తాయి. అయితే అన్ని కోర్టులూ సుప్రీంకోర్ట్ ఆదేశాలను శిరసావహించాలి. అదేవిధంగా శాసన, కార్యనిర్వాహక శాఖలు విధి నిర్వహణలో జోక్యం చేసుకోకుండా, న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా, నిష్పాక్షికంగా వ్యవహరించడానికి కావాల్సిన నిబంధనలను రాజ్యాంగంలో పొందుపరిచారు. సుప్రీంకోర్ట్, హైకోర్ట్‌లకు న్యాయ సమీక్షాధికారం ఉంటుంది. పైన తెలిపిన అనేక లక్షణాలతో పాటు లౌకిక రాజ్యం, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, అల్ప సంఖ్యాక వర్గాల వారికి ప్రత్యేక రక్షణలు, స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా లాంటి అనేక విశిష్ట లక్షణాలు భారత రాజ్యాంగంలో ఉన్నాయి.
 

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌