• facebook
  • whatsapp
  • telegram

రాజ్యాంగంలో ఏక కేంద్ర లక్షణాలు - పరిశీలన

    స్వభావాన్ని బట్టి జాతీయ, ప్రాంతీయ ప్రభుత్వాలను ఏకకేంద్ర ప్రభుత్వం, సమాఖ్య ప్రభుత్వంగా రాజనీతిజ్ఞులు పేర్కొన్నారు. ఏకకేంద్ర ప్రభుత్వంలో అధికారాలన్నీ జాతీయ ప్రభుత్వానికే ఉంటాయి. ఒకవేళ ప్రాంతీయ ప్రభుత్వాలు ఉన్న పక్షంలో వాటికి అధికారాన్ని కేంద్రమే ఇస్తుంది. సమాఖ్య ప్రభుత్వంలో రాజ్యాంగమే జాతీయ, ప్రాంతీయ ప్రభుత్వాల మధ్య అధికారాన్ని విభజిస్తుంది. రెండు ప్రభుత్వాలు స్వతంత్రంగా తమతమ పరిధుల్లో పనిచేస్తాయి.
భారత సమాఖ్య స్వభావం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కె.సి.వేర్ భారత సమాఖ్యను
 'అర్ధ సమాఖ్య' అన్నారు. పాల్ ఆపిల్ బి 'తీవ్రమైన సమాఖ్య'గా అభిప్రాయపడ్డారు.
మోరిస్ జోన్స్ 'బేరసారాల సమాఖ్య' అని పేర్కొన్నారు. గ్రాన్‌విల్ ఆస్టిన్ 'సహకార సమాఖ్య' గా తెలిపారు.
అలెగ్జాండ్రో విక్జ్ 'సుయిజెనరీస్' (వినూత్న స్వభావం ఉన్నది) అని నిర్వచించారు.
ఐవర్ జెన్నింగ్స్ 'బలమైన కేంద్రీకృత ధోరణులు ఉన్న సమాఖ్య' అని చెప్పారు. భారత రాజ్యాంగంలో సమాఖ్య మూలసూత్రాన్ని ఉపేక్షించారని కె. సంతానం అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల స్వేచ్ఛను మరిచి, ఏకకేంద్ర రాజ్యాన్ని ఏర్పరిచారని సి.రాజగోపాలాచారి విశ్లేషించారు. ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో భారత రాజ్యాంగంలో ఏక కేంద్ర లక్షణాలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

 

ఏక కేంద్ర లక్షణాలు


యూనియన్ అనే పదబంధాన్ని ఉపయోగించడం
భారత రాజ్యాంగంలోని మొదటి ప్రకరణలో 'యూనియన్' అనే పదం (Union of States) వాడారు. 'సమాఖ్య' పదం వాడలేదు. ఈ పదం వాడకపోవడానికి రెండు కారణాలు చెప్పుకోవచ్చు.  అవి..
1) దేశ విభజన ఫలితంగా ఏర్పడిన మత వైషమ్యాల కారణంగా రాజ్యాంగ నిర్మాతలు 'యూనియన్' పదప్రయోగమే సముచితమని భావించారు. ఫలితంగా దేశంలో ఒకే విధమైన మానసిక ప్రయోజనం చేకూరుతుందని వారు విశ్వసించారు.
2) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సమాఖ్య పదం ఎందుకు ఉపయోగించలేదో శాస్త్రీయ వివరణ ఇచ్చారు. ఇతర సమాఖ్యల్లా వేర్వేరు రాష్ట్రాలు స్వచ్ఛందంగా ఏకీకృతం కావడం వల్ల భారత సమాఖ్య ఏర్పడలేదు. ఈ రాష్ట్రాలు స్వతంత్ర రాజ్యాలుగా ఉండేవి కాదు. అన్ని రాష్ట్రాలూ ఆంగ్లేయుల ఆధీనంలోని భారతదేశంలో భాగంగా ఉండేవి. ఇవి భారత ప్రభుత్వ చట్టం - 1935 ప్రకారం ఏర్పడిన భారత సమాఖ్యలో అంతర భాగాలుగా ఉన్నాయి. ఈ వాస్తవాలను స్పష్టం చేయడానికి 'సమాఖ్య' కాకుండా 'యూనియన్' పదాన్ని రాజ్యాంగంలో ఉపయోగించినట్లు అంబేడ్కర్ స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం రూపొందించే నాటికే ఈ రాష్ట్రాలన్నీ భారతదేశ భూభాగంలో అంతర భాగాలై ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వాధికారం ఎక్కువై రాష్ట్రాల అధికారం తగ్గడానికి దీన్ని ప్రధాన కారణంగా గుర్తించవచ్చు.

 

బలమైన కేంద్రం
      రాజ్యాంగంలో అధికార విభజన కేంద్రానికే మొగ్గుచూపుతుంది. రాష్ట్ర జాబితా కంటే కేంద్ర జాబితాలోనే ఎక్కువ అంశాలు ఉన్నాయి. అలాగే ముఖ్యమైన అంశాలన్నింటికీ కేంద్ర జాబితాలోనే చోటు దక్కింది. ఉమ్మడి జాబితాలోని అంశాలపైనా కేంద్రానిదే పైచేయి. చివరగా అవశిష్ట అధికారాలు కూడా కేంద్రానికే చెందుతాయి. అమెరికాలో అవశిష్ట అధికారాలను రాష్ట్రాలకు ఇచ్చారు. ఈ అధికార విభజన సమాఖ్య దృష్ట్యా అసమానమైంది.

 

రాష్ట్రాలు అవిచ్ఛిన్నమైనవి కావు
    ఇతర సమాఖ్యల్లా కాకుండా, భారతదేశంలోని రాష్ట్రాలకు ప్రాదేశిక సమగ్రత హక్కు లేదు. రాష్ట్రాల భూభాగం, సరిహద్దులను పార్లమెంటు ఏకపక్ష చర్యతో మార్చగలదు. ఇలా మార్చడానికి సాధారణ మెజారిటీ సరిపోతుంది. ప్రకరణ 3 ప్రకారం ప్రత్యేక మెజారిటీ అవసరం లేదు. కాబట్టి భారత సమాఖ్యను 'విచ్ఛిన్నం కాగల రాష్ట్రాలతో కూడిన అవిచ్ఛిన్న యూనియన్' (an indestructible union of destructible states) గా పేర్కొనవచ్చు. అదే అమెరికా సమాఖ్యనైతే 'అవిచ్ఛిన్న రాష్ట్రాలతో కూడిన అవిచ్ఛిన్న యూనియన్' (an indestructible union of indestructible states) అని వర్ణించవచ్చు.

 

ఏక రాజ్యాంగం
      సాధారణంగా సమాఖ్యలో కేంద్రంతోపాటు రాష్ట్రాలకు కూడా తమ రాజ్యాంగాలను రూపొందించుకునే హక్కు ఉంటుంది. కానీ భారతదేశంలో రాష్ట్రాలకు ఈ హక్కు ఇవ్వలేదు. అయితే జమ్మూ- కశ్మీర్ రాష్ట్రానికి మాత్రం ప్రత్యేక రాజ్యాంగం (ప్రకరణం 370) ఉంది.

 

రాజ్యాంగ అదృఢత్వం
    ఇతర సమాఖ్యల్లా కాకుండా, భారత రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ పద్ధతి (ప్రకరణ 368) తక్కువ దృఢత్వాన్ని కలిగి ఉంది. సాధారణ మెజారిటీ లేదా ప్రత్యేక మెజారిటీతో పార్లమెంటు ఏకపక్ష చర్యతో రాజ్యాంగంలోని పలు అంశాలను సవరించగలుగుతుంది. పైగా ఈ సవరణలను ప్రారంభించేది కేంద్రమే. కానీ అమెరికాలో రాష్ట్రాలు కూడా సవరణలను ప్రతిపాదించవచ్చు.

 

రాజ్యసభలో రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం లేదు
    భారత రాజ్యసభలో రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించారు. అమెరికాలోని ఎగువసభలో రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్య సూత్రం ఉంది. దీంతో ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరేసి చొప్పున అమెరికన్ సెనేట్‌లో 100 మంది సభ్యులు ఉంటారు. ఈ సూత్రం చిన్న రాజ్యాల ప్రయోజనాలను కాపాడుతుంది. విచిత్రమైన విషయం ఏమిటంటే భారత రాష్ట్రపతి కళలు, సాహిత్యం, విద్య, సాంఘిక సేవా రంగాలకు సంబంధించి 12 మందిని రాజ్యసభకు నియమించవచ్చు
(ప్రకరణ 80 (3)). ఇది కూడా సమాఖ్య సూత్రాలకు విరుద్ధమే.

 

ఏక పౌరసత్వం
     ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ ఉన్నప్పటికీ, కెనడా మాదిరి భారత రాజ్యాంగం ఏక పౌరసత్వ విధానాన్ని
(ప్రకరణ 5 నుంచి 11) రూపొందించింది. భారతీయ పౌరసత్వం మాత్రమే పౌరులకు ఉంటుంది. ప్రత్యేకంగా రాష్ట్ర పౌరసత్వాలు ఉండవు. దేశంలో ఏ రాష్ట్రంలో జన్మించినా, నివసిస్తున్నా వారికి దేశమంతా సమాన హక్కులు, ఒకే పౌరసత్వం ఉంటాయి. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి సమాఖ్య రాజ్యాల్లో పౌరులకు ద్వంద్వ పౌరసత్వం అంటే జాతీయ, రాష్ట్ర పౌరసత్వాలు ఉంటాయి.

 

అత్యవసర పరిస్థితికి సంబంధించిన అంశాలు
     భారత రాజ్యాంగం జాతీయ (ప్రకరణ 352), రాష్ట్ర (ప్రకరణ 356), ఆర్థిక (ప్రకరణ 360) అత్యవసర పరిస్థితులను పేర్కొంది. ఈ అత్యవసర పరిస్థితుల కాలంలో కేంద్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు సంక్రమిస్తాయి. రాష్ట్రాలు కేంద్ర ఆధిపత్యం కిందకు వస్తాయి. ఇతర సమాఖ్యల్లో ఇలాంటి విధానం లేదు.

 

అఖిల భారత సర్వీసులు
    అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా పబ్లిక్ సర్వీసులను కలిగి ఉన్నాయి. భారత్‌లో కూడా కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో ప్రత్యేక పబ్లిక్ సర్వీసులు ఉన్నాయి. వీటితోపాటు రాజ్యసభకు అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే అధికారాన్ని ఇచ్చారు (ఆర్టికల్ 312). ఇవి కేంద్రం, రాష్ట్రాలకు కూడా చెందిన సర్వీసులు. ఈ సర్వీసుల్లోని వ్యక్తుల నియామకానికి సంబంధించిన భర్తీ, శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఉంటాయి. నియంత్రణ కూడా కేంద్రానికే ఉంటుంది. గమనించదగ్గ విషయమేమిటంటే రాష్ట్రాలు తమ సొంత సివిల్ సర్వీసులను ఏర్పాటు చేసుకుని వాటి నిబంధనలను తయారుచేసుకోవచ్చని 309 ప్రకరణ పేర్కొంది. కానీ 312 వ ప్రకరణ ఈ అధికారాన్ని హరించివేస్తుంది.

 

రాష్ట్రాలపై కేంద్ర ఆర్థిక నియంత్రణ
   వివిధ పన్నులు కేంద్రం, రాష్ట్రాలకు ఏ విధంగా చెందాలో భారత రాజ్యాంగంలో వివరించారు. ఎక్కువ ఆదాయం లభించే అంశాలను కేంద్ర జాబితాలో చేర్చారు. ఆర్థిక సంఘం (ప్రకరణ 280) రాష్ట్రాలకు గ్రాంట్లను మంజూరు చేస్తుంది. అయితే ఆర్థిక సంఘాన్ని నియమించేది కేంద్రమే. కేంద్రం నుంచి రాష్ట్రాలకు డబ్బు కేటాయించే మరో వ్యవస్థ ప్రణాళికా సంఘం (ప్రస్తుతం దీన్ని రద్దుచేసి,నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేశారు) ఇది కూడా కేంద్ర నియంత్రణలో ఉంటుంది. రాజ్యాంగంలో ఏక కేంద్రతత్వం ఏర్పాటు కావడానికి - ఆర్థిక రంగంలో కేంద్ర ఆధిపత్యం, కేంద్ర గ్రాంట్లపై రాష్ట్రాలు అధికంగా ఆధారపడటం కారణమని కె. సంతానం పేర్కొన్నారు.

 

సమగ్ర న్యాయశాఖ
    భారతదేశంలో కేంద్ర - రాష్ట్ర చట్టాలను ఏకీకృత న్యాయ వ్యవస్థ వ్యాఖ్యానిస్తుంది. సుప్రీంకోర్టు అగ్రభాగంగా, దాని కింద హైకోర్టులతో ఒక సమగ్ర న్యాయవ్యవస్థను భారత రాజ్యాంగం ఏర్పరచింది. అయితే అమెరికాలో ద్వంద్వ న్యాయవ్యవస్థ ఉంది. ఫెడరల్ చట్టాలను ఫెడరల్ న్యాయస్థానం, రాష్ట్ర చట్టాలను రాష్ట్ర న్యాయస్థానాలు వ్యాఖ్యానిస్తాయి.

 

సమగ్ర ఎన్నికల యంత్రాంగం
     భారతదేశంలో ఎన్నికల కమిషన్ (ఆర్టికల్ 324) కేంద్ర శాసనసభ (పార్లమెంట్), రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు నిర్వహిస్తుంది. ఈ వ్యవస్థను రాష్ట్రపతి పర్యవేక్షిస్తారు. రాష్ట్రాలకు ఎలాంటి పాత్ర లేదు. సభ్యులను తొలగించే విషయంలో కూడా ఇదే పరిస్థితి. అయితే అమెరికాలో ఫెడరల్, రాష్ట్ర స్థాయిలో ఎన్నికలను నిర్వహించడానికి ప్రత్యేక యంత్రాంగాలు ఉంటాయి.

 

గవర్నర్ నియామకం
     రాష్ట్రానికి అధినేత గవర్నర్. రాష్ట్రపతి నియమించడం వల్ల గవర్నర్ కేంద్ర ప్రతినిధిగా పనిచేస్తారు. గవర్నర్‌ని తొలగించే అధికారం కూడా రాష్ట్రపతికే ఉంది. కేంద్రం గవర్నర్ ద్వారా రాష్ట్రాలను నియంత్రిస్తుంది. మామిడిపూడి వెంకట రంగయ్య, శివయ్య అభిప్రాయంలో 'గవర్నర్ తాను కేంద్రం ప్రతినిధిగా నిర్వహించే పాత్ర ఫలితంగా సమాఖ్య సమతౌల్యాన్ని సాధారణ పరిస్థితుల్లో కేంద్రానికి అనుకూలంగా, అత్యవసర పరిస్థితుల కాలంలో దాన్ని తలకిందులుగాను చేసే అవకాశం కలిగి ఉంటారు'.

 

సమగ్ర ఆడిట్ యంత్రాంగం
   కేంద్ర ప్రభుత్వ లెక్కలు/ ఖాతాలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాల లెక్కలు/ ఖాతాలను భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (ప్రకరణ 148) ఆడిట్ చేస్తారు. ఈ వ్యక్తిని నియమించడం, తొలగించే అధికారం రాష్ట్రపతి చేతుల్లోనే ఉంటుంది. ఈ విషయంలో రాష్ట్రాలను సంప్రదించాల్సిన అవసరం లేదు. అమెరికన్ కంప్ట్రోలర్ జనరల్‌కి రాష్ట్రాల లెక్కలను పర్యవేక్షించే అధికారం లేదు.

 

రాష్ట్ర బిల్లులపై వీటో
   రాష్ట్ర శాసనసభ ఆమోదించిన కొన్ని నిర్దిష్టమైన బిల్లులను రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించవచ్చు (ప్రకరణ 201). రాష్ట్రపతి ఆ బిల్లులను మొదటిసారే కాకుండా రెండోసారి కూడా నిలుపుదల చేయవచ్చు. అంటే రాష్ట్ర బిల్లులపై రాష్ట్రపతికి సస్పెన్షన్ వీటోయే కాకుండా అబ్సల్యూట్ వీటో కూడా ఉంటుంది. కానీ అమెరికా, ఆస్ట్రేలియాల్లోని రాష్ట్రాలకు వాటి పరిధుల్లో స్వయం ప్రతిపత్తి కారణంగా ఇలాంటి ప్రత్యేకమైన అంశం లేదు.
గమనిక: సస్పెన్షన్ వీటో అంటే శాసనసభ సాధారణ మెజారిటీతో తిరిగి పంపిన బిల్లును ఆమోదించడం అబ్సల్యూట్ వీటో అంటే శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా ఉండటం.

 

రాష్ట్ర జాబితాపై పార్లమెంటు అధికారం
    జాతీయ ప్రయోజనం దృష్ట్యా పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశంపై చట్టం చేయవచ్చని, రాజ్యసభ ఒక ప్రత్యేక తీర్మానం ద్వారా ఆమోదిస్తే, పార్లమెంటు సంబంధిత అంశంపై చట్టం చేసే అధికారాన్ని పొందుతుంది (ఆర్టికల్ 249). ఎలాంటి రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే పార్లమెంటు తన శాసనపరమైన సామర్థ్యాన్ని పెంచుకోగలుగుతుంది. ఎలాంటి అత్యవసర పరిస్థితి లేని కాలంలో కూడా పార్లమెంటు ఈ అధికారాన్ని నిర్వహించగలుగుతుంది.

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌