• facebook
  • whatsapp
  • telegram

అభివృద్ధి - నిరాశ్రయత

      అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో వ్యవసాయ, పారిశ్రామిక, నీటిపారుదల, విద్యుత్, గనులు లాంటి రంగాలు కీలకమైనవి. ఈ రంగాలను ఆధారంగా చేసుకుని నూతన పరిశ్రమలు నిర్మించాలి. అవస్థాపన సౌకర్యాలు కల్పించాలి. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దఎత్తున భూములు అవసరం. వాటిని సేకరించాలంటే ఆ ప్రాంత భూ యజమానులు, స్థానికులు, వృత్తి కార్మికులు, కళాకారులు, కార్మికులు, ప్రజలు నిరాశ్రయులవుతారు. ఇలా వారు దేశాభివృద్ధి కోసం తమ జీవనం, వృత్తులు, ఆస్తులు, సంస్కృతి సంప్రదాయాలను వదులుకోవాల్సి వస్తుంది.
       భారీ నీటి ప్రాజెక్టులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పరిశ్రమలు, తీరప్రాంత కారిడార్లు, మైనింగ్ కార్యకలాపాలకు మౌలిక సదుపాయాలు, వాటి నిర్మాణాలకు సంబంధించి కొన్ని వేల ప్రజలు తమ భూములు - నివాసాలు కోల్పోవడంతో నిరాశ్రయత (Displacement) ఏర్పడుతుంది.
* అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణం వల్ల అనేక సమస్యలు ఉంటాయి. ప్రధానంగా....
1) పర్యావరణానికి హాని జరుగుతుంది
2) అడవుల హననం
3) జీవ వైవిధ్యం నశిస్తుంది
4) వన్యమృగ సంపద తరిగిపోతుంది
5) తెగలు తమ సంస్కృతి, సంప్రదాయాలు కోల్పోవాల్సి వస్తుంది.
6) ప్రజలు భూములు, జీవనోపాధి కోల్పోతారు.
7) వ్యవసాయ ఉత్పాదకత తగ్గుతుంది
8) ఆహార భద్రత కొరత
9) ప్రజా ఆందోళనలు, సామాజిక అశాంతి పెరుగుతాయి.

 

పునరావాస అంశాలు (Rehabilitation Aspects)

నిర్వాసితులు/ నిరాశ్రయులు
       ప్రాజెక్టులు, నీటిపారుదల ప్రాజెక్టులు, సెజ్‌లు, మైనింగ్, పారిశ్రామిక, ఆర్థిక, తీరప్రాంత కారిడార్లు, నౌకాశ్రయాలు, మౌలిక సదుపాయాలు లాంటి నిర్మాణాల వల్ల ఇళ్లు, భూములు, జీవనోపాధి కోల్పోయిన ప్రజలను నిర్వాసితులు అంటారు.

 

పునరావాసం
       నిర్వాసితులు/ నిరాశ్రయులను దీర్ఘకాల ప్రాతిపదికన వేరే ప్రాంతాలకు తరలించి వారు జీవనోపాధి కోల్పోకుండా కావాల్సిన మౌలిక, జీవన/ ప్రాథమిక సౌకర్యాలు కల్పించడాన్ని పునరావాసం అంటారు.

 

ప్రాజెక్టుల నిర్మాణంలో సమస్యలు... 

* ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి పునరావాసం, పరిహారం విషయంలో అనేక సందర్భాల్లో ఉద్యమాలు, నిరసనలు తీవ్రస్థాయిలో జరిగాయి. ప్రధానంగా కింది ప్రాజెక్టుల విషయంలో ఉద్యమాలు జరిగాయి.
* ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు
* తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టు
* గుజరాత్‌లో నర్మదా నదిపై సర్దార్ సరోవర్ ప్రాజెక్టు విషయంలో గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రజలకోసం చాత్రా యువ సంఘర్షణ్ వాహిని, సెంటర్ ఫర్ సోషల్ స్టడీస్ (సూరత్) లాంటి సంస్థలు ఆందోళనలు చేశాయి.
* నర్మదా బచావో పేరుతో మేధాపాట్కర్ ఉద్యమం చేపట్టారు.
తెహ్రి డ్యామ్ - ఉత్తర్ ప్రదేశ్: దీన్ని భాగీరథి నదిపై నిర్మించాలని భావించారు. ఇది పూర్తయితే 107 గ్రామాల్లో 9,563 కుటుంబాలకు చెందినవారు నిర్వాసితులవుతారని అంచనా. సుందర్‌లాల్ బహుగుణ 1996లో 72 రోజులు, తర్వాత 56 రోజులు సత్యాగ్రహం చేశారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వీరేంద్ర దత్, సక్లాని, తెహ్రి బంద్ విరోధి సంఘర్షణ సమితి అధ్యక్షుడు విద్యాసాగర్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు.
శ్రీకాకుళం - కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం: దీన్ని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్మిస్తోంది. అయితే స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
* గంగవరం (విశాఖ) పోర్టులో పెట్రోనెట్‌కు చెందిన LNG ప్రాజెక్టు నిర్మాణంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
* విశాఖ - ఫార్మాసిటీ, పశ్చిమ బంగలో టాటా నానో ప్రాజెక్టు
* మహారాష్ట్ర - ఇచ్చంపల్లి ప్రాజెక్టు
* కింది ప్రాజెక్టుల్లో గనుల తవ్వకంపై సమస్యలు ఉన్నాయి.
ఎ) ఝార్ఖండ్‌లోని రాంచి, హజరీబాగ్
బి) మధ్యప్రదేశ్‌లోని జయంత్ ప్రాజెక్టు
సి) ఉత్తర్ ప్రదేశ్‌లోని సింగ్రౌలి ప్రాజెక్టు, బీనా ప్రాజెక్టు
డి) చత్తీస్‌గఢ్ - వేదాంత ప్రాజెక్టు
ఇ) గుజరాత్ - సాయాజి ఐరన్ పరిశ్రమ
ఎఫ్) తమిళనాడు - నైవేలి లిగ్నైట్ ప్రాజెక్టు

 

స్వచ్ఛంద సంస్థల పాత్ర 

* గుజరాత్‌లో ఉబై డ్యామ్ నిర్వాసితుల తరపున ఉబైన నిర్మాణ సమితి పోరాడుతోంది.
* చోటా నాగపూర్‌లో కోయిల్ కరోజన సంఘటన,
* సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం చాత్ర యువ సంఘర్షణ వాహిని, ద పక్టన్ రిసెర్చ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్, డెవలప్‌మెంట్ గ్రూప్ సొసైటీలు,
సూరత్‌లో ఆర్చ్ వాహిని ఆఫ్ మంగోలి, రాజ్‌పిప్లా సోషల్ సర్వీసెస్ లాంటి సంస్థలు ఆయా ప్రాజెక్టుల నిర్వాసితుల హక్కులు, పునరావాస కల్పన, కనీస అవసరాల కోసం ఉద్యమాలు చేపట్టాయి.

 

గిరిజన పంచశీల్ - పునరావాస కల్పన చర్యలు 

* ప్రాజెక్టుల నిర్మాణం వల్ల నిరాశ్రయులైన ఆదివాసులు, గిరిజనులకు పునరావాసం కల్పించడానికి, గిరిజన అభివృద్ధి సంస్థ జవహర్‌లాల్ నెహ్రూ కాలంలో ఆమోదించిన 5 సూత్రాలను ట్రైబల్ పంచశీల్ అంటారు. అవి:
1) ఆదివాసుల జీవన విధానంపై ఎలాంటి ఆంక్షలు విధించరాదు.
2) ఆదివాసీ సహజ సంస్కృతి సంప్రదాయాలను ప్రోత్సహించాలి.
3) ఆదివాసీ నివాస ప్రాంతాలకు దగ్గర్లోనే పునరావాసం కల్పించాలి.
4) పునరావాసం వారి దగ్గరలో లేకుంటే సారవంతమైన వ్యవసాయ భూముల వద్ద పునరావాసం కల్పించాలి.
5) ఆదివాసీ పునరావాస కేంద్రాల్లో పాఠశాలలు, తాగు, సాగునీరు, ఆరోగ్య కేంద్రాలు, సారవంతమైన భూమి లాంటి సదుపాయాలు కల్పించేలా కృషి చేయాలి.
సరైన పునరావాసం లభించాలంటే.........
* ప్రాజెక్ట్ నిర్మాణ ప్రయోజనాల్లో నిర్వాసితులకు భాగస్వామ్యం కల్పించాలి.
* పునరావాస కేంద్రాలు వారి పాత జీవన విధానానికి దగ్గరగా ఉండాలి.
* భూమిని కోల్పోయిన వారికి భూమిని అందించాలి.
* పని భద్రత కల్పించాలి.
* యువకుల కోసం ఉపాధి నైపుణ్య, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
* ప్రభుత్వ ఉద్యోగాలు, ఆయా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలి.
* ఆవాస కల్పనలో నిర్వాసితులు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలి.

 

భూసేకరణ విధానం 

     ఏదైనా ప్రజా అవసరం నిమిత్తం భూమిని సేకరించాలని ప్రభుత్వం భావించినప్పుడు ప్రాథమిక పరిశీలన కోసం ఒక ప్రకటన (Notification) ఇస్తుంది.
* ఆ ప్రకటనపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ప్రకటన తేదీ నుంచి 30 రోజుల్లోపు కలెక్టర్‌కు తమ అభ్యంతరాలు తెలుపుకోవచ్చు.
* క్షేత్రస్థాయిలో సేకరించాల్సిన భూములను పరిశీలించే సందర్భంలో భూమికి ఏదైనా నష్టం జరిగితే, సరైన పరిహారం చెల్లిస్తారు.
* ప్రాథమిక పరిశీలన తర్వాత కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు.
* ఆ నివేదిక ప్రకారం భూమి సరైందే అని ప్రభుత్వం భావిస్తే దాని మేరకు ఒక డిక్లరేషన్ వెలువడుతుంది. వెంటనే దానికి అనుగుణంగా భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభమవుతుంది.
* ఈ క్రమంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకునే భూముల యజమానులు/ హక్కుదారులు కలెక్టర్‌కు తమ హక్కుల సాక్ష్యాధారాలు అందజేయాలి.
* భూ విస్తీర్ణం, కొలతలకు సంబంధించి ఉన్న అభ్యంతరాలను కలెక్టరుకు తెలపవచ్చు.
* సదరు అభ్యంతరాలు, యాజమాన్య హక్కులు, భూమి మార్కెట్ విలువపై కలెక్టర్ విచారణ జరుపుతారు.

 

అవార్డు జారీ, పరిహారం చెల్లింపు

* విచారణ అనంతరం భూమిని స్వాధీనం చేసుకునే అంశాలతో పాటు ఒక అవార్డును ప్రభుత్వం లేదా కలెక్టర్ జారీ చేయాల్సి ఉంటుంది.
* స్వాధీనం చేసుకునే భూమికి చెల్లించే పరిహారం గురించి ఆ అవార్డ్ ప్రకటనలో స్పష్టంగా తెలియజేయాలి.
* నష్టపరిహార మొత్తం ఎవరికి చెల్లించాలో ఆ అవార్డులో పేర్కొనాలి. దానికి అనుకూలంగా పరిహారం చెల్లిస్తారు.
* సదరు నష్టపరిహారం తీసుకోవడానికి భూ యజమాని నిరాకరించినా, ఆ భూ యజమాని అందుబాటులో లేకపోయినా లేదా నష్టపరిహార మొత్తం చాలామందికి పంపిణీ చేయాల్సి ఉన్నా, పంపిణీలో ఇబ్బందులు ఎదురైనా ఆ మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

 

నష్టపరిహారం - న్యాయస్థానం అధికారాలు 

        భూసేకరణ ప్రజా అవసరాల కోసమేనా, కాదా అనే అంశం మినహా భూ సేకరణను ప్రశ్నించే, నిలువరించే హక్కు, అధికారం ఎవరికి లేదు.
* ఒక వ్యక్తి తనకు ఉన్న కొద్ది భూమిని పూర్తిగా కోల్పోయినా అతను భూసేకరణ అడ్డుకోలేడు. అతడు చేయవలసిందల్లా సాధ్యమైనంత ఎక్కువ నష్టపరిహారం పొందడం మాత్రమే.
* ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చాలా తక్కువ మొత్తమని, అది మార్కెట్ విలువకు సరిపోలేదని, అందువల్ల పరిహారం పెంచాల్సిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.
ఆ సందర్భంలో న్యాయస్థానం ఆ అంశాల ఆధారంగా పరిహారం పెంచాల్సిందిగా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయవచ్చు.
చట్టం అమలు - ప్రభావం: భూసేకరణ చట్టం 1894 ప్రభుత్వానికి తిరుగులేని అధికారాలను కల్పించింది.
* ఈ చట్టం అమలు వల్ల ఇప్పటిదాకా ప్రభుత్వ భూసేకరణ నిరాటంకంగా కొనసాగుతోంది.
* ప్రభుత్వాలకు ఈ అధికారాలు లేకుంటే భారీ ప్రాజెక్టులు, విస్తరణ, అభివృద్ధి నిర్మాణాలు, ప్రభుత్వ పథకాల అమలు సాధ్యం కాకపోయి ఉండేది.
విమర్శ: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (SEZs) పేరుతో వేలాది ఎకరాల వ్యవసాయ సాగు భూమిని అనేక ప్రయివేట్ కంపెనీలకు, తమ సంబంధీకులకు ప్రభుత్వాలు అప్పగిస్తున్నాయనేది ప్రధాన విమర్శ.
వ్యవసాయ భూములను సేకరించడం వల్ల ఆహార భద్రతకు సమస్యగా మారుతోంది.
* భూసేకరణ వల్ల వేలాది ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు. అటవీ భూమి సేకరణ వల్ల విలువైన అటవీ సంపద, పశుపక్ష్యాదులు, వనమూలికలు, అరుదైన పశుసంపద కోల్పోతున్నాం.

 

ప్రభుత్వ భూసేకరణ చట్టాలు 

        నూతన ప్రాజెక్టులు, సెజ్‌లు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, భారీ పరిశ్రమలు, తీరప్రాంత కారిడార్లు నిర్మాణానికి, మౌలిక సదుపాయాలు కల్పనకు వేలాది ఎకరాల భూమి అవసరం. అలాంటి సందర్భంలో ప్రభుత్వం చట్టం ద్వారా భూమిని స్వాధీనం చేసుకుంటుంది. భారతదేశంలో బ్రిటిష్ కాలంనాటి 1894 చట్టంతోపాటు సవరించిన మరికొన్ని అంశాలు ఉన్నాయి.
1) భూసేకరణ చట్టం 1894 (బ్రిటిష్ కాలం)
2) భూసేకరణ పునఃస్థాపన, పునరావాస చట్టం - 2013 (UPA)
3) భూసేకరణ ఆర్డినెన్స్ - 2014 (NDA)

 

భూస్వాధీనతా/ భూసేకరణ చట్టం - 1894
        ప్రజల వద్ద ఉన్న భూమిని, స్థలాలను, కొన్ని సందర్భాల్లో అవసరమైతే భవనాలను కూడా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకునే విధానాన్ని భూసేకరణ అంటారు.
* భూసేకరణ అనేది ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణం, నీటిపారుదల, విద్యుత్ పరిశ్రమల ఏర్పాటు, విస్తరణ వంటి సందర్భాల్లో ప్రభుత్వం అవసరమైన భూములను సేకరించే విధానం.
* భూసేకరణ వల్ల వేలమంది నిరాశ్రయులవుతారు. వారికి పునరావాసం, నష్టపరిహారం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
* ప్రభుత్వాలు భూములు సమీకరించే పద్ధతి బ్రిటిష్ పాలనాకాలంలో ప్రారంభమైంది. దానికోసం చేసిన చట్టమే భూసేకరణ చట్టం. దీన్ని 1894లో రూపొందించారు.

 

కొన్ని అంశాలు 

* ఈ చట్టం అత్యంత పురాతనమైంది
* బ్రిటిష్ వలస పాలనలో 1894లో దీన్ని రూపొందించారు.
* కేంద్ర, రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా ఈ చట్టాన్నే అమలు చేస్తున్నాయి.
* ఈ చట్టం 'భూసేకరణ అనేది ప్రభుత్వ ఏకస్వామ్య అధికారం'గా పేర్కొంటుంది.
* ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకునేందుకు సరైన నిబంధనలు ఈ చట్టంలోనే ఉన్నాయి.
* ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రజోపయోగాలు, ప్రజల అవసరాల కోసమే భూసేకరణ జరగాలి.

 

ప్రజోపయోగం అంటే 

        భూసేకరణ చట్టం ప్రకారం భూమిని సేకరించాలంటే అది తప్పనిసరిగా ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిందై ఉండాలి. ప్రజా అవసరాల నిమిత్తం మాత్రమే భూసేకరణ జరగాలి.
* గ్రామాలు, పట్టణాల్లో క్రమబద్ధమైన అభివృద్ధి కోసం భూమిని స్వాధీనం చేసుకోవడం.
* గ్రామీణ భూముల విస్తీర్ణం, వాటి క్రమబద్ధమైన అభివృద్ధి కోసం
* ప్రభుత్వ సంస్థలు లేదా ప్రభుత్వ నియంత్రణలోని కార్పొరేషన్‌ల అభివృద్ధి, విస్తరణ, స్థాపనల అవసరాల కోసం భూమిని సేకరించడం.
ప్రభుత్వం చేపట్టే వివిధ విధానాల అమలు కోసం లేదా వివిధ పథకాల అమల్లో భాగంగా ప్రభుత్వం తన నిధులతో భూములను సేకరించడం.
* ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయిన వారికి గృహ అవసరాలకు కేటాయించే భూమి కోసం స్వాధీనం చేసుకోవడం.
* పేదవారికి, భూమిలేని వారికి గృహ/ నివాస స్థలాల కేటాయింపు కోసం భూమిని స్వాధీనం చేసుకోవడం.
ప్రభుత్వం ప్రారంభించిన ఏదైనా విద్యా, గృహ నిర్మాణ, ఆరోగ్య సంబంధ పథకం లేదా మురికివాడల నిర్మూలన పథకం కోసం భూమిని సేకరించడం.
* ఏదైనా ప్రభుత్వ కార్యాలయ భవన నిర్మాణం కోసం భూమి సేకరించడం.
ప్రభుత్వం, ప్రభుత్వ అనుమతితో ఏదైనా స్థానిక సంస్థ ప్రారంభించిన ఏదైనా అభివృద్ధి పథకం కోసం భూమి సేకరించడం.

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌