• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - రవాణా మార్గాలు

        రవాణా, ప్రసార సాధనాలను దేశానికి 'జీవనాడులుగా' (Lifelines) పేర్కొంటారు. రవాణా వ్యవస్థ దేశ సాంస్కృతిక సమైక్యతను, సాంఘికాభివృద్ధిని, సార్వభౌమత్వాన్ని కాపాడుతుంది. వివిధ ప్రాంతాల ప్రజల మధ్య పరస్పర సహకారాన్ని; దేశీయ, విదేశీ వాణిజ్యాన్ని పెంపొందిస్తుంది. పరిశ్రమలకు ఖనిజాలను తరలించడం, వివిధ ఉత్పత్తులను వాణిజ్య కేంద్రాలకు సమర్థంగా పంపిణీ చేయడంలో రవాణా వ్యవస్థదే కీలక పాత్ర. రవాణా సాధనాలు గ్రామాలు, ప్రాంతాలు, దేశాలు, జాతుల మధ్య దూరాన్ని తగ్గిస్తాయి. యుద్ధాలు, క్షామం, తుపాన్లు లాంటి జాతీయ విపత్తులు ఏర్పడినప్పుడు ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి.
      భారదేశంలో నాలుగు రకాల రవాణా సాధనాలున్నాయి. అవి: 1) రైలు మార్గాలు 2) రోడ్డు మార్గాలు 3) వాయు మార్గాలు 4) జల మార్గాలు.

 

రైలు మార్గాలు

        భారతదేశంలో 1853లో లార్డ్ డల్హౌసి పాలనా కాలంలో బొంబాయి, థానే మధ్య మొదటి రైలుమార్గాన్ని వేశారు. దీని పొడవు 34 కి.మీ. భారతీయ రైల్వేలది ప్రపంచంలోనే ప్రముఖ స్థానం, ఆసియా ఖండంలో మొదటి స్థానం. 1950-51 నాటికి 54,845 కి.మీ., 1992-93 నాటికి 62,462 కి.మీ. పొడవైన రైలు మార్గాలను వేయించారు. భారత్ రైలు మార్గాల నిర్మాణంలో ప్రపంచంలోనే ప్రముఖ స్థానాన్ని పొందడానికి కారణాలు:
1) సమతల స్థలాకృతి 2) అధిక జనసాంద్రత 3) వాణిజ్య కేంద్రాలు అధికంగా ఉండటం 4) వ్యవసాయ, ఖనిజ పారిశ్రామిక ఉత్పత్తి కేంద్రాల సంఖ్య అధికంగా ఉండటం.
        మనదేశంలో రైలు మార్గాలు ప్రధానంగా మూడు గేజుల్లో ఉన్నాయి. అవి:
1) బ్రాడ్‌గేజ్ (36,824 కి.మీ.) పట్టాల మధ్య వెడల్పు 1.69 మీ.
2) మీటర్‌గేజ్ (20,653 కి.మీ.) పట్టాల మధ్య వెడల్పు 1 మీ.
3) నేరోగేజ్ (3985 కి.మీ.) పట్టాల మధ్య వెడల్పు 0.77 మీ.
      దేశంలోని మొత్తం రైలు మార్గాల్లో అత్యధిక శాతం ఉత్తరప్రదేశ్‌లో (8917 కి.మీ.) విస్తరించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 5086 కి.మీ. పొడవున విస్తరించి ఉన్నాయి. భారత్‌లో సగటున ప్రతి 100 చ.కి.మీ.కు 19 కి.మీ. రైలు మార్గాలున్నాయి. 
      రైల్వేల నిర్వహణలో ప్రధానంగా రెండు సవాళ్లున్నాయి. అవి:
విద్యుదీకరణ: భారతదేశంలో బొగ్గు నిక్షేపాలు పరిమితంగా ఉండటం, పెట్రోలియం ధరలు అధికంగా ఉండటం వల్ల ఆవిరి, డీజిల్ ఇంజిన్ల స్థానంలో విద్యుత్ ఇంజిన్లను ప్రవేశపెట్టారు. అయితే విద్యుత్ ఇంజిన్ల తయారీకి కావాల్సినన్ని నిధులు లేకపోవడం, దేశంలో అనేక ప్రాంతాల్లో విద్యుత్ కొరత ఉండటంతో విద్యుదీకరణ చురుకుగా జరగడం లేదు.
గేజ్ మార్పిడి: నేరోగేజ్, మీటర్‌గేజ్ రైలు మార్గాలను బ్రాడ్‌గేజ్ మార్గాలుగా మార్చడాన్ని 'గేజ్ మార్పిడి' అంటారు. వివిధ రకాల గేజ్‌ల నిర్వహణ వల్ల ప్రయాణికులు, సరుకు రవాణాలో ఇబ్బందులేర్పడతాయి. అయితే గేజ్ మార్పిడికి నిధులు భారీగా అవసరమవుతాయి. దీనికి పట్టే సమయం కూడా ఎక్కువే.
నిర్వహణ, పాలనా సౌలభ్యం కోసం రైల్వేలను 16 మండలాలుగా విభజించారు. ప్రతి రైల్వే మండలానికి ఒక ప్రధాన కార్యాలయం ఏర్పాటుచేసి, జనరల్ మేనేజర్‌ను నియమించారు.

రోడ్లు

రైల్వేలతో పోలిస్తే రోడ్డు రవాణా చాలా మెరుగైంది. రోడ్డు రవాణా వల్ల ప్రయోజనాలు: 
* రైల్వేల కంటే వీటి నిర్వహణ సులభంగా ఉంటుంది.
* వీటి నిర్మాణానికి కావాల్సిన పెట్టుబడి, వ్యవస్థాపన ఖర్చు తక్కువ.
* తక్కువ దూరాలకు ప్రయాణాలు, సరుకుల రవాణా విషయంలో వేగంగానూ, అనుకూలంగానూ ఉంటుంది. ఇళ్లు, పొలాల మధ్య వ్యవసాయ పనిముట్లు, ఉత్పత్తులను తరలించడానికి ఎంతో అనుకూలమైంది.
* ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో రోడ్డు రవాణానే ఉపయుక్తమైంది.
* రైతులు పండించే ఉత్పత్తుల్లో త్వరగా చెడిపోయే సరుకులను వెంటనే మార్కెట్లకు తరలించడానికి రోడ్డు మార్గాలు ఉపయుక్తమైనవి.
* రైలు మార్గాల్లా కాకుండా రోడ్లను ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పోటాపోటీగా నిర్వహించవచ్చు.
      భారతదేశంలో ప్రతి 100 చ.కి.మీ. విస్తీర్ణానికి 60.8 కి.మీ. పొడవున రోడ్డు మార్గాలున్నాయి. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో (2,16,733 కి.మీ.) ఉన్నాయి. రోడ్డుమార్గాల సాంద్రత కేరళలో అతి ఎక్కువ; జమ్ముకాశ్మీర్‌లో అత్యల్పం. ప్రపంచంలోనే అతి ఎత్తయిన ప్రాంతంలో నిర్మించిన పొడవైన (4270 కి.మీ.) రోడ్డు మార్గం భారతదేశంలోని మనాలి (హిమాచల్ ప్రదేశ్) నుంచి లేహ్ (జమ్ము కాశ్మీర్) వరకూ ఉంది.
మన దేశంలోని రోడ్డుమార్గాలను 5 రకాలుగా విభజించవచ్చు. అవి: 1) జాతీయ రహదార్లు 2) రాష్ట్ర రహదార్లు 3) జిల్లా రహదార్లు 4) గ్రామ రహదార్లు 5) సరిహద్దు రహదార్లు.
జాతీయ రహదారులు: రాష్ట్ర రాజధానులు, జాతీయ ప్రాధాన్యమున్న ప్రధాన ఓడరేవులు, పట్టణాలు, నగరాలను కలిపేవాటిని 'జాతీయ రహదారులు' అంటారు. ఇవి కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇవి దేశంలోని మొత్తం రోడ్డుమార్గాల్లో 2% కంటే తక్కువగా ఉన్నా, మొత్తం రోడ్డు రవాణాలో 40% రవాణాకు తోడ్పడుతున్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో 30 జాతీయ రహదారులు ఉన్నాయి. వీటిలో వారణాసి నుంచి కన్యాకుమారి వరకు 2325 కి.మీ. పొడవైన 7వ నెంబరు జాతీయ రహదారి పెద్దది.

దేశంలో ప్రధాన జాతీయ రహదార్లు

NH-1: ఢిల్లీ  అమృత్‌సర్ (షేర్షా కాలంలో నిర్మించారు)
NH-2: ఢిల్లీ  కోల్‌కతా
NH-3: ఆగ్రా  ముంబయి
NH-4: చెన్నై ముంబయి
NH-5: కోల్‌కతా  చెన్నై (ఇది ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద జాతీయ రహదారి)
NH-6: ముంబయి  కోల్‌కతా
NH-7: వారణాసి   కన్యాకుమారి (భారత్‌లో అతిపెద్ద జాతీయ రహదారి)
NH-8: ముంబయి  ఢిల్లీ
NH-9:ముంబయి  విజయవాడ

క్రమపద్ధతి లేకుండా ఉన్న జాతీయ రహదార్ల నెంబర్లను హేతుబద్ధీకరించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. మన రాష్ట్ర పరిధిలో మారిన జాతీయ రహదార్ల నెంబర్ల జాబితాను ఇటీవలే పంపించారు.
 

              పాత నెంబరు                 కొత్త నెంబరు
NH-4     NH-40          చెన్నై నుంచి బెంగళూరు
NH-5      NH-16         చెన్నై నుంచి కోల్‌కతా
NH-07    NH-44        నాగ్‌పూర్ నుంచి బెంగళూరు
NH-09    NH-65         పుణె నుంచి విజయవాడ

రాష్ట్ర రహదార్లు: రాష్ట్రంలోని ప్రతి పట్టణాన్ని రాష్ట్ర రాజధాని నగరంతో కలిపేవాటిని 'రాష్ట్ర రహదార్లు' అంటారు. దేశంలో మొత్తం రోడ్డుమార్గాల పొడవులో ఇవి 6.2% ఉన్నాయి. వీటిని రాష్ట్రప్రభుత్వమే నిర్వహిస్తుంది.
 

జిల్లా రహదార్లు: జిల్లాలో ప్రధాన పట్టణాలను ఒకదానితో ఒకటి కలిపే రహదార్లను 'జిల్లా రహదార్లు' అంటారు. ఇవి జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఉన్నాయి.
 

గ్రామ రహదార్లు: వివిధ గ్రామాలను కలుపుతూ, సమీపంలోని జిల్లా రహదార్లతో అనుసంధానించే వాటిని 'గ్రామ పంచాయితీ రహదార్లు' అంటారు. ఇవి కంకర, మట్టి రోడ్లు. ఇవి పంచాయితీల ఆధ్వర్యంలో ఉంటాయి.
 

వాయు రవాణా

         భారతదేశంలో వాయు రవాణా రెండు సంస్థల ద్వారా కొనసాగుతోంది. అవి: 1) ఎయిర్ ఇండియా, 2) ఇండియన్ ఎయిర్ లైన్స్. 1932లో టాటా ఎయిర్‌లైన్స్‌గా ప్రారంభమైన ఎయిర్ ఇండియా (విదేశాలకు విమానాలను నడుపుతుంది)తో 1953లో ప్రారంభమైన ఇండియన్ ఎయిర్‌లైన్స్ (స్వదేశంలో విమానాలు నడిపేది)ను విలీనం చేసి 'నేషనల్ ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (NACIL) గా నామకరణం చేశారు.
        భారతదేశ పౌర విమానయాన సంస్థకు 15 అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. అవి:


జల మార్గాలు

      ఇవి రెండు రకాలు. దేశీయ అంతస్థలీయ జల మార్గాలు, మహాసముద్ర జల మార్గాలు:
దేశీయ అంతస్థలీయ జల మార్గాలు: జలరవాణా చౌకైంది, కాలుష్యరహితమైంది. ఇవి దేశంలోని నదులు, వాటి ఉపనదులు, కాల్వలు, సరస్సుల మీదుగా ఉంటాయి. ప్రధానంగా ఉత్తరాన గంగా, బ్రహ్మపుత్ర నదులు, వాటి ఉపనదులు; దక్షిణాన తూర్పు తీరంలో మహానది, గోదావరి, కృష్ణా నదుల దిగువ భాగాల్లో; పశ్చిమ తీరంలో నర్మదా, తపతి నదులు; ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య బకింగ్‌హాం కాల్వల్లో ఈ జల రవాణా ఉంది.
మహాసముద్ర జల మార్గాలు: ఇది మహాసముద్రాల ద్వారా జరుగుతుంది. మనదేశంలోని 12 ప్రధాన ఓడరేవులు, 139 చిన్న ఓడరేవుల ద్వారా ఎగుమతి, దిగుమతులు జరుగుతున్నాయి.

 

భారతదేశంలోని ప్రధాన ఓడరేవులు

ముంబాయి ఓడరేవు: 
 

మహారాష్ట్రలోని కొంకణ్ తీరంలో ఉంది.
* ఇది దేశంలో అతి పెద్ద ఓడరేవు.
* దేశ వ్యాపారంలో 25% దీని ద్వారానే జరుగుతోంది.
* దీనికి దేశంలోనే అతిపెద్ద సొంత రైలు మార్గ వ్యవస్థ, అతిపెద్ద చమురు టెర్మినల్ ఉన్నాయి.

 

చెన్నై ఓడరేవు:
 

* తూర్పు తీరంలోని తమిళనాడులో, కోరమండల్ తీరంలో ఉంది.
* భారతదేశ మొత్తం వ్యాపారంలో 15.1% ఈ రేవు ద్వారా జరుగుతోంది.
* ఇది కృతిమ ఓడరేవు.
* దేశంలో రెండో అతిపెద్ద ఓడరేవు. దక్షిణ భారతదేశంలో అతిపెద్దది.

 

విశాఖపట్నం ఓడరేవు:
 

* భారతదేశంలో మూడో అతిపెద్ద ఓడరేవు.
* ఇది విశాఖలోని 'డాల్ఫిన్‌నోస్' కొండల కారణంగా ఏర్పడిన అతిసుందర సహజ నౌకాశ్రయం.
* భారతదేశ మొత్తం వ్యాపారంలో 12.5% ఈ రేవు ద్వారా జరుగుతోంది.
* దేశంలోనే మొదటిదైన హిందుస్థాన్ నౌకా నిర్మాణ కేంద్రం ఇక్కడే ఉంది.
* చమురు శుద్ధి కర్మాగారం, పెద్ద ఇనుము, ఉక్కు కర్మాగారంతోపాటు అనేక పరిశ్రమలను నెలకొల్పారు.

 

కోల్‌కతా ఓడరేవు:
 

* తూర్పుతీరంలో బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ నది ఎడమ ఒడ్డున ఉంది.
* భారతదేశంలోనే ఏకైక నదీ తీర ఓడరేవు.
* ఈ రేవు ద్వారా 11.3% వ్యాపారం జరుగుతోంది.
* పూడిక, వేసవి కాలంలో నీటి కొరత కారణంగా ఇది అనుకున్నంత అభివృద్ధి చెందలేదు.

 

కొచ్చిన్ ఓడరేవు:
 

* పశ్చిమ తీరంలోని మలబారు తీరంలో కేరళ రాష్ట్రం ఉంది.
* దీన్ని 'క్వీన్ ఆఫ్ అరేబియన్ సముద్రం' అంటారు.
* అతి సుందరమైన సహజ నౌకాశ్రయం
* ఈ రేవు పట్టణం ద్వారా 5.7% వ్యాపారం జరుగుతోంది.
ఏడాది పొడవునా ఎలాంటి అవరోధాలు ఏర్పడని ఏకైక నౌకాశ్రయం.

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌