• facebook
  • whatsapp
  • telegram

సుస్థిరాభివృద్ధి

పర్యావరణ వనరుల సరఫరా విధి

ఆర్థిక వ్యవస్థలోని పలు రంగాలు వివిధ స్థాయుల్లో సహజ వనరుల మీద ఆధారపడి ఉన్నాయి. ఆ వనరులను అందించడంలో పర్యావరణ సామర్థ్యాన్ని ‘పర్యావరణ వనరుల సరఫరా విధి’ అంటారు.

* వనరులను వినియోగిస్తూ ఉండటం లేదా అవి కాలుష్యానికి గురికావటంతో పర్యావరణ వనరుల సరఫరా విధి సామర్థ్యం తగ్గుతూ ఉంటుంది. 

* పర్యావరణం నిర్వహించే మరో విధి వివిధ కార్యక్రమాల ద్వారా భూమి లేదా వాతావరణంలోకి విడుదలయ్యే వ్యర్థాలను శుద్ధి చేసి ప్రమాద రహితంగా మార్చడం.

* ఉత్పత్తి, వినియోగాల్లో నిరుపయోగమైన ఉత్పత్తులు ఉదాహరణకు ఇంజిన్ల నుంచి విడుదలయ్యే పొగ, శుభ్రం చేయడానికి వినియోగించిన నీళ్లు, పారేసిన పనికిరాని అట్టపెట్టెలు, వస్తువులు లాంటి వాటిని పర్యావరణం శుభ్రం చేస్తుంది.

*పర్యావరణం కాలుష్యాన్ని గ్రహించి ప్రమాద రహితంగా మార్చే శక్తిని ఎన్విరాన్‌మెంట్‌ సింక్‌ ఫంక్షన్‌ లేదా శుద్ధి చేసే విధి అంటారు.


పర్యావరణం విధులు:

1. పర్యావరణ వనరుల సరఫరా

2. శుద్ధి చేయటం

* గత యాభై ఏళ్ల అభివృద్ధిలో పర్యావరణం రెండు విధులను పరిమితికి మించి ఉపయోగించారు. దీని కారణంగా భవిష్యత్తు తరాల్లో ఆర్థిక ఉత్పత్తి, వినియోగాలకు మద్దతు ఇవ్వగల సామర్థ్యాన్ని పర్యావరణం కోల్పోయింది.


హరిత విప్లవం - పర్యావరణంపై ప్రభావం

* వ్యవసాయరంగంలో అనేక మార్పులకు కారణమైన విప్లవం - హరిత విప్లవం.

* ఈ విప్లవాన్ని మొదట ప్రవేశపెట్టిన పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌ల్లో నీటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి.

* ఎక్కువ మోతాదులో బోరు బావులు తవ్వటంతో భూగర్భ జలమట్టం వేగంగా పడిపోయింది.

* పంజాబ్‌లోని 9 జిల్లాలు, హరియాణాలోని 10 జిల్లాలు భూగర్భ జల సమస్యను ఎదుర్కొంటున్నాయి.

* భారత్‌లోని 59% జిల్లాల్లో చేతిపంపుల్లోని నీళ్లు తాగడానికి పనికిరావు.

* ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో మితిమీరిన రసాయన ఎరువుల వినియోగంతో పర్యావరణంతో పాటు పక్షులు, జంతువులు కూడా అనారోగ్యంతో మరణిస్తున్నాయి.


నిశ్శబ్ద వసంతం 

దోమల నియంత్రణ కోసం DDT ని పిచికారీ చేయటంతో మనుషులు, పక్షులపై పడే ప్రభావం గురించి ‘రాచెల్‌ కార్సన్‌’ అనే మహిళ 1962లో ‘సైలెంట్‌ స్ప్రింగ్‌’ అనే పుస్తకం రాశారు. DDT అంటే Dichloro Diphenyl Trichloroethane.


ఎండోసల్ఫాన్‌ వాడకం - నిషేధం

* కేరళ ఉత్తర ప్రాంతంలోని కాసర్‌గోడ్‌ జిల్లాలో ఎండోసల్ఫాన్‌ రసాయనిక పురుగుమందు వాడకాన్ని న్యాయస్థానం నిషేధించింది.

* 1976లో జీడిమామిడి తోటలను పురుగు నుంచి రక్షించడానికి కేరళ ప్రభుత్వం హెలికాప్టర్లలో 15,000 ఎకరాల్లో మందును పిచికారీ చేయించింది.

* 25 ఏళ్లపాటు ఈ కార్యక్రమం కొనసాగింది. దీంతో గాలి, నీరు, వాతావరణం  కలుషితమయ్యాయి.

* ఎండోసల్ఫాన్‌ వాడటంతో వ్యవసాయ కూలీలకు అవయవాలు దెబ్బతినడంతో పాటు క్యాన్సర్‌ లాంటి వ్యాధులు సోకాయి. దీంతో ఈ రసాయనాన్ని న్యాయస్థానం నిషేధించింది.

*దీని వినియోగంతో రాజ్యాంగంలోని 21వ అధికరణానికి (జీవించే హక్కుకు) భంగం కలిగిందని న్యాయస్థానం పేర్కొంది.


రాబందుల మరణానికి కారణం

* పశువుల చికిత్సలో డైక్లోఫినాక్‌ మందును వాడుతున్నారు. పశువుల మరణానంతరమూ ఈ రసాయనం వాటి శరీరంలో ఉండిపోతుంది.

* ఈ చనిపోయిన పశువుల మాంసాన్ని రాబందులు తిన్నప్పుడు వాటి మూత్రపిండాల పనితీరు సన్నగిల్లి వారం, పది రోజుల్లో మరణిస్తాయి.

* చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాల నుంచి కొల్లేరు సరస్సులోకి రోజూ 13 -15 టన్నుల పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు చేరి సరస్సును కలుషితం చేస్తున్నాయి.

* సెల్‌ టవర్లు విడుదల చేసే రేడియేషన్‌తో తేనెటీగల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో తేనె దిగుబడి మాత్రమే కాక పరపరాగ సంపర్కం తగ్గి, పంటల దిగుబడి తగ్గిపోతోంది.


సమానత - సుస్థిరాభివృద్ధి

భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు పేదరికం కారణంగా తమ ఆర్థికాభివృద్ధి కోసం వనరులను వినియోగించుకుంటాయి. దేశాభివృద్ధి తరువాత వనరులను పునరుద్ధరించడం లేదా పర్యావరణాన్ని శుద్ధి చేయాలని భావిస్తాయి.

* రహదారుల నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు, గనుల తవ్వకం, వ్యవసాయ భూముల కోసం అడవుల విస్తీర్ణాన్ని తగ్గించారు.

* ఎక్కువ మోతాదులో నీటి వినియోగం, వాహనాల నుంచి ఏర్పడే కార్బన్‌ డైఆక్సైడ్, పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాల కారణంగా పర్యావరణం క్షీణించింది.


పర్యావరణ రక్షణ - చర్యలు

1) 1991లో రాజ్యాంగంలోని జీవించే హక్కుతో జీవితాన్ని పూర్తిగా ఆనందించడానికి కాలుష్యరహిత నీరు, గాలిని పొందే హక్కు అందరికీ ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

2) ప్రజారవాణా వాహనాలు అన్నీ డీజిల్‌ నుంచి CNG కి మారాలని 1998లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

* CNG - Compresed Natural Gas

* CNG వాడకంతో దిల్లీ కాలుష్యం బాగా తగ్గింది.

* కాలుష్యాన్ని అరికట్టడానికి అనువైన చట్టాలను, విధానాలను రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది.

3) వాతావరణంలో మార్పులాంటి అంశాలను ఉమ్మడిగా పరిష్కరించడానికి పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.

IPCC: Inter - Governmental Panel on Climate Change.

* ఇది 1988లో ప్రారంభమైంది. దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది.

* మానవుల కారణంగా భూమి వేడెక్కడం, వాతావరణ మార్పు వేగాన్ని తగ్గించడానికి IPCC ప్రయత్నిస్తుంది.

* సేంద్రియ వ్యవసాయం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చు.

* ఈ వ్యవసాయం ముఖ్య లక్షణం స్థానిక వనరులను వినియోగించడం, రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగం ఆపేయడం. 

2015 నాటికే సేంద్రియ వ్యవసాయానికి మారాలని నిర్ణయించుకున్న మొదటి రాష్ట్రం సిక్కిం.

* 100% సేంద్రియ రాష్ట్రంగా మారే పంథాని ఉత్తరాఖండ్‌ అనుసరిస్తోంది. 

*  పర్యావరణ కాలుష్యంతో పక్షులు, జంతువులు, అటవీ క్షీణత వల్ల ఆటవిక జాతులు, వారి ఆచారాలు కనుమరుగు అవుతున్నాయి.

* 2013లో ప్రచురించిన ‘వాళ్లు అంతరించిపోయే ముందు’ (బిఫోర్‌ దే పాస్‌) అనే బొమ్మల పుస్తకంలో అంతరించిపోయే ప్రమాదమున్న సంచార జాతులను గుర్తించారు. పుస్తక రచయిత జిమ్మీ నిల్సన్‌. ఈయన గుర్తించిన కొన్ని ఆటవిక తెగలు.

1. కెన్యాలోని ముస్సాయి యోధులు

2. దక్షిణ అమెరికాలోని గౌచో తెగ

3. కజకిస్థాన్‌కు చెందిన ముర్తా తెగ

4. టిబెట్‌లోని కియంగ్‌ గిరిజనులు

పర్యావరణ ఉద్యమాలు

పర్యావరణాన్ని సహజ పెట్టుబడి అని కూడా అంటారు. దీని రక్షణ కోసం చేసిన ఉద్యమాల్లో చిప్కో, నర్మదా బచావో, గ్రీన్‌పీస్, సైలెంట్‌ వ్యాలీ ఉద్యమాలు ముఖ్యమైనవి.


చిప్కో ఉద్యమం: ఈ ఉద్యమాన్ని 1973లో సుందర్‌లాల్‌ బహుగుణ ప్రారంభించారు.

*చిప్కో అంటే హత్తుకోవడం అని అర్థం.

* పారిశ్రామికవేత్తల నుంచి అడవులను కాపాడటానికి ‘రేనీ’ గ్రామ మహిళలు ఇందులో ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉద్యమం ఉత్తరాఖండ్‌ గఢ్‌వాల్‌ కొండల్లో ప్రారంభమైంది.


ఉద్యమ నినాదం: Food, Fodder, Fuel, Fiber, Fertilizer

నర్మదా బచావో ఆందోళన్‌: నర్మదా నదిపై నిర్మించాలనుకున్న ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం.

* ఈ ఆందోళనను చేపట్టింది మేధా పాట్కర్‌.


ఉద్యమ ధోరణులు: 

* మూలవాసీ ప్రజల ఉద్యమం. నయా - ఉదారవాద విధానాలకు వ్యతిరేకమైంది.

పట్టణీకరణకు ఆనకట్టలు, పరిశ్రమలు, గనుల కోసం భూములు తీసుకున్న నేపథ్యంలో తమ భూములు కాపాడుకోవడానికి రైతులు చేపట్టిన ఉద్యమం.


డిమాండ్లు: ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న వారికే కాకుండా, అక్కడ నివసిస్తున్న వారందరికీ న్యాయపరమైన నష్టపరిహారం చెల్లించాలి.

* ఆనకట్ట వల్ల ముంపునకు గురైన అడవులకు బదులుగా అటవీ పెంపకాన్ని చేపట్టాలి.

* భూమిని కోల్పోయిన వారికి మరోచోట యోగ్యమైన భూములివ్వాలి. సరైన పునరావాసం కల్పించాలి.


ఫలితాలు: ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన డబ్బును ప్రపంచ బ్యాంకు నుంచి అప్పుగా సమకూర్చుకోవాలనుకున్నారు. అయితే ఆ ఉద్యమాలు, నిరాహార దీక్షల తరువాత ప్రపంచబ్యాంకు నిధులు సమకూర్చకూడదని నిర్ణయించుకుంది.

అభివృద్ధి కార్యకలాపాలతో నిర్వాసితులైన ప్రజలకు తగినంత, గౌరవప్రదమైన నష్టపరిహారం చెల్లించే దిశగా ప్రభుత్వం ఆలోచించేలా చేసింది.


గ్రీన్‌పీస్‌ ఉద్యమం: అలస్కా దగ్గర సముద్ర గర్భంలో అమెరికా 1971లో చేపట్టిన అణుపరీక్షలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం మొదలైంది.

* అణుపరీక్షలకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయడానికి స్వచ్ఛంద కార్యకర్తలు గ్రీన్‌పీస్‌ అనే పేరున్న చిన్న పడవలో ప్రయోగ ప్రదేశానికి చేరుకున్నారు.

* సుస్థిరాభివృద్ధి భావనను వెలుగులోకి తెచ్చిన ఉద్యమం గ్రీన్‌పీస్‌ ఉద్యమం.

* ప్రస్తుతం ఇది 40 దేశాల్లో విస్తరించి ఉంది. దీని ప్రధాన కార్యాలయం ఆమ్‌స్టర్‌డాం.


సైలెంట్‌ వ్యాలీ ఉద్యమం [1973-83] 

కేరళ పశ్చిమ కనుమల్లోని నిశ్శబ్దలోయ (సైలెంట్‌ వ్యాలీ ఉద్యమం) మీదుగా ప్రవహిస్తున్న రెండు నదులపై ఆనకట్టలు నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో ఆ లోయలో ఉన్న అరుదైన జంతువులు, మొక్కలు అంతరించిపోతాయని విద్యావంతులు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు.

* ఈ లోయలో ఉన్న అరుదైన కోతిజాతి పేరు లయన్‌టెయిల్డ్‌ మకాక్‌ (సింహపు తోక కోతి)

* ఈ అడవిలో కీచురాళ్లు లేవు అందుకే అడవి నిశ్శబ్దంగా ఉంటుంది.

* ఈ ఉద్యమం కోసం రాష్ట్రంలోని ప్రజలందరినీ సమీకరించిన సంస్థ K.S.S.P.

* K.S.S.P  కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్‌. ఇది ప్రజల్లో విజ్ఞాన శాస్త్ర ప్రచారానికి, విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది.

ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ఆ ప్రాంతంలో చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఈ సంస్థ కోర్టుకు వెళ్లింది. దీంతో హైకోర్టు చెట్ల నరికివేతను ఆపేసింది. తీవ్రమైన నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం ఆనకట్టల నిర్మాణాన్ని విరమించుకుంది. 

సైలెంట్‌ వ్యాలీని జాతీయ పార్కుగా ప్రకటించిన భారత ప్రధాని రాజీవ్‌ గాంధీ.

Posted Date : 15-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌