• facebook
  • whatsapp
  • telegram

గాంధీయుగం - శాసనోల్లంఘన ఉద్యమం

యావత్ భారతావనిని ఒక్కతాటిపైకి తీసుకురావడం, సంగ్రామంలో మహిళలను, యువకులను భాగస్వాములుగా చేయడం, శాసనోల్లంఘన ఉద్యమాలను చేపట్టడం... ఇలా స్వాతంత్య్రోద్యమ ప్రతీ దశలోనూ గాంధీజీ వెన్నెముకగా నిలిచారు. అందుకే స్వాతంత్య్ర పోరాటానికి గాంధీ నాయకత్వం వహించిన కాలం 'గాంధీయుగం'గా సుస్థిరమైపోయింది. గాంధీజీ పోరాట పద్ధతిలో కీలకమైన శాసనోల్లంఘనోద్యమం, దాని ఫలితాలు, ప్రభావాల గురించి తెలుసుకుందాం...
 

శాసనోల్లంఘన ఉద్యమం (1930 - 34)
        జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన 1929లో లాహోర్‌లో జరిగిన సమావేశంలో పూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించారు. 1929 డిసెంబరు 31న అర్ధరాత్రి రావి నది ఒడ్డున ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాల మధ్య కొత్తగా ఆమోదించిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
 * 1930 జనవరి 26న అన్నిచోట్లా మొదటి స్వాతంత్య్ర దినంగా పాటించాలని నిర్ణయించారు.
 *  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించేందుకు అనుమతి నిచ్చింది.
 *  గాంధీజీ తన 11 డిమాండ్లను 1930 జనవరి 31లోగా ఆమోదించాలని బ్రిటిష్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు.
   ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించాలని గాంధీజీని కోరింది. 1930 మార్చి 2న గాంధీజీ తన కార్యాచరణ ప్రణాళికను వైస్రాయి ఇర్విన్‌కు తెలియజేశారు. మార్చి 12న గాంధీజీ సబర్మతీ ఆశ్రమం నుంచి 78 మంది సభ్యులతో అరేబియా తీరంలోని దండి యాత్రకు శ్రీకారం చుట్టారు. సుమారు 240 మైళ్లు నడిచి 1930 ఏప్రిల్ 6న దండి తీరంలో పిడికెడు ఉప్పును తీసుకోవడం ద్వారా ఉప్పు చట్టాన్ని అతిక్రమించారు. దీని ద్వారా బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలకు, బ్రిటిష్ పాలనకు భారత ప్రజలు వ్యతిరేకమని చాటిచెప్పారు. దండియాత్ర, దాని పురోగతి, ప్రజలపై దాని ప్రభావం గురించి పత్రికల్లో పెద్దఎత్తున వార్తలు ప్రచురితమయ్యాయి. గాంధీజీ పిలుపు మేరకు గుజరాత్‌లో 300 మంది గ్రామాధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు.
 

 గాంధీజీ 11 డిమాండ్‌లు
1. భూమి శిస్తు 50 శాతం తగ్గించాలి.
2. ఉప్పుపై పన్ను నిషేధించాలి.
3. తీరప్రాంత షిప్పింగును భారతీయులకు కేటాయించాలి.
4. రూపాయి - స్టెర్లింగ్ మారకం నిష్పత్తి తగ్గించాలి.
5. స్వదేశంలోని దుస్తుల పరిశ్రమను రక్షించాలి.
6. సైనిక ఖర్చులో 50 శాతం తగ్గించాలి.
7. పౌర పరిపాలన ఖర్చులో 50 శాతం తగ్గించాలి.
8. మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలి.
9. రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలి.
10. కేంద్ర ఇంటెలిజెన్స్ శాఖలో మార్పులు చేయాలి.
11. ఆయుధాల చట్టంలో మార్పు తీసుకురావడం ద్వారా స్వీయ రక్షణకు పౌరులు ఆయుధాలు కలిగి ఉండటానికి అనుమతించాలి.
 

ఉద్యమ వ్యాప్తి
* తమిళనాడు: సి. రాజగోపాలాచారి (తిరుచిరాపల్లి నుంచి వేదారణ్యం వరకు పాదయాత్ర చేశారు.)
* మలబార్: కె. కేలప్పన్ (కాలికట్ నుంచి పొయన్నూర్ వరకు పాదయాత్ర చేశారు.)
* పెషావర్: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (ఖుదై ఖిద్మత్‌గార్స్ దళం ఏర్పాటు చేశారు. ఈయన బిరుదులు -
బాద్షాఖాన్, సరిహద్దు గాంధీ.)

ప్రజల భాగస్వామ్యం
* ఈ ఉద్యమంలో కీలకపాత్ర పోషించాలని గాంధీజీ స్త్రీలను ప్రత్యేకంగా కోరారు.
* స్త్రీలతో పాటు యువకులు, విద్యార్థులు విదేశీ దుస్తులు, మద్యపాన బహిష్కరణలో ప్రధాన పాత్ర పోషించారు.
సహాయనిరాకరణ ఉద్యమంతో పోలిస్తే ఈ ఉద్యమంలో ముస్లింలు తక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.
* సెంట్రల్ ప్రావిన్స్, మహారాష్ట్ర, కర్ణాటకలలో షెడ్యూల్డ్ తరగతుల ప్రజలు క్రియాశీలకంగా వ్యవహరించారు.
బొంబాయి, కలకత్తా, మద్రాసు, షోలాపూర్‌లలో కార్మికులు పాల్గొన్నారు.
* ఉత్తర ప్రదేశ్, బీహార్, గుజరాత్‌లలో రైతులు భాగస్వాములయ్యారు.
* బీహార్, ఢిల్లీ, లక్నోలలో ముస్లిం నేత పనివారు పాల్గొన్నారు.
* ఢాకాలో ముస్లిం నాయకులు, బలహీన వర్గాల వారు ఉద్యమంలో పాలుపంచుకున్నారు.
 

ఉద్యమంలో వివిధ దశలు...
* మొదటి దశ (1930 మార్చి- సెప్టెంబరు): పట్టణాల్లో బూర్జువా వర్గం, గ్రామాల్లో రైతులు కీలక పాత్ర వహించారు.
* రెండో దశ (1930 అక్టోబరు - 1931 మార్చి): వ్యాపారస్తులు, పారిశ్రామిక వేత్తల భాగస్వామ్యం తగ్గింది. వీరు ప్రభుత్వం, కాంగ్రెస్ మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నించారు. వీరి కృషి ఫలితంగా 1931 మార్చిలో గాంధీ - ఇర్విన్ ఒడంబడిక జరిగింది.
* మూడో దశ (1932 జనవరి - 1934 ఏప్రిల్): ఈ దశలో ప్రభుత్వం అణచివేత విధానాన్ని అనుసరించింది. ఉద్యమం అంతమైంది.
 

రౌండ్ టేబుల్ సమావేశాలు
* మొదటి రౌండ్ టేబుల్ సమావేశం లండన్‌లో 1930 నవంబరు 12 నుంచి 1931 జనవరి 19 వరకు జరిగింది. ఈ సమావేశానికి మూడు బ్రిటిష్ రాజకీయ పక్షాలకు చెందిన 16 మంది ప్రతినిధులు, స్వదేశీ సంస్థానాల నుంచి 16 మంది, బ్రిటిష్ ఇండియా నుంచి 57 మంది ప్రతినిధులు హాజరయ్యారు. శాసనోల్లంఘన ఉద్యమం కొనసాగుతుండటంతో కాంగ్రెస్ ఈ సమావేశంలో పాల్గొనలేదు.
 

ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు
          ముస్లిం లీగ్‌కు చెందిన మహమ్మద్ అలి, మహమ్మద్ షఫి, జిన్నా, ఆగాఖాన్, హిందూ మహాసభకు చెందిన మూంజీ, జయకర్, ఇండియన్ లిబరల్ ఫెడరేషన్‌కు చెందిన తేజ్‌బహదూర్ సప్రూ, సి.వై. చింతామణి, శ్రీనివాస శాస్త్రి, అణగారిన కులాలకు ప్రాతినిధ్యం వహించిన డాక్టర్ అంబేద్కర్.
* కాంగ్రెస్ ప్రతినిధులు లేకుండా భారతదేశ రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించిన చర్చ జరపడం వృథా అని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది.
 

గాంధీ - ఇర్విన్ ఒప్పందం (1931 మార్చి 5)
ముఖ్యాంశాలు
* శాసనోల్లంఘన ఉద్యమం నిలిపివేశారు.
* కాంగ్రెస్ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి అంగీకరించింది.
* ఉద్యమం సందర్భంగా అరెస్ట్ చేసిన రాజకీయ ఖైదీలను విడుదల చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది.
* సముద్రతీరం నుంచి నిర్ణీత దూరంలో నివసించే ప్రజలు పన్నులు చెల్లించకుండా ఉప్పు తయారు చేసుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది.
      అయితే కాంగ్రెస్‌లోని యువనాయకులు ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, ఇతర నాయకులు ఉద్యమం ఆపివేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు.
 

రెండో రౌండ్ టేబుల్ సమావేశం
       ఈ సమావేశం 1931 సెప్టెంబరు 7 నుంచి డిసెంబరు వరకు జరిగింది. కాంగ్రెస్ ప్రతినిధిగా గాంధీజీ ఒక్కరే హాజరయ్యారు. ముస్లింలతోపాటు షెడ్యూల్డ్ కులాలు, భారతీయ క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు, ఐరోపా వారు కూడా ప్రత్యేక నియోజక వర్గాలను డిమాండు చేశారు. బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్‌సే మెక్‌డొనాల్డ్ రెండు ముస్లిం మెజారిటీ రాష్ట్రాలను (వాయువ్య సరిహద్దు రాష్ట్రం, సింధ్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు.
 

కమ్యూనల్ అవార్డు (1932)
        1932 ఆగస్టు 16న మెక్‌డొనాల్డ్ రాష్ట్ర చట్టసభల్లో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం గురించి బ్రిటిష్ పార్లమెంటులో ఒక ప్రకటన చేశాడు. దీన్నే కమ్యూనల్ అవార్డు లేదా మెక్‌డొనాల్డ్ అవార్డు అంటారు. దీని ద్వారా ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, ఆంగ్లో-ఇండియన్లు, ఐరోపా వారికి వేర్వేరు నియోజక వర్గాలు కేటాయించారు. షెడ్యూలు కులాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయిస్తూ మిగిలిన సాధారణ నియోజకర వర్గాల్లో ఓటు వేసే అధికారాన్ని కల్పించారు. అయితే షెడ్యూల్డ్ కులాల వారికి ప్రత్యేక నియోజక వర్గాల కేటాయింపును గాంధీజీ తీవ్రంగా వ్యతిరేకించి, 1932 సెప్టెంబరు 20న ఎరవాడ జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. మదన్ మోహన్ మాలవీయ కృషితో గాంధీజీ, అంబేద్కర్ మధ్య 1932 సెప్టెంబరు 25న పూణెలో ఒప్పందం కుదిరింది. దీనిప్రకారం హిందువులందరికీ సాధారణ నియోజక వర్గాలు కొనసాగుతాయి. కమ్యూనల్ అవార్డులో పేర్కొన్న విధంగా షెడ్యూల్డ్ కులాలకు 71 సీట్లకు బదులు 148 సీట్లు కేటాయించారు.
 

మూడో రౌండ్ టేబుల్ సమావేశం
         ఈ సమావేశం 1932 నవంబరు 17 నుంచి డిసెంబరు 24 వరకు జరిగింది. కాంగ్రెస్ హాజరు కాలేదు. దీనిలో 46 మంది ప్రతినిధులు మాత్రమే పాల్గొన్నారు.
         మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో చర్చల ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దీని ఆధారంగా 1935 భారత ప్రభుత్వ చట్టం రూపొందింది.

Posted Date : 14-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌