• facebook
  • whatsapp
  • telegram

గాంధీ యుగం

భారతదేశ చరిత్రలో క్రీ.శ. 1919-47 మధ్య కాలాన్ని గాంధీయుగంగా పిలుస్తారు. ఈ కాలంలో గాంధీజీ భారత రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టి తనదైన ముద్ర వేశారు. గాంధీజీ 1934లో కాంగ్రెస్‌ను వీడినా, మరణించే వరకు కాంగ్రెస్ పార్టీకి స్ఫూర్తిగా నిలిచారు. మళ్లీ 1940లో కొంతకాలం కాంగ్రెస్‌కు నాయకత్వం వహించినా మరుసటి సంవత్సరం ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. క్రీ.శ. 1942లో క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపు ఇచ్చినప్పటికీ, ఉద్యమాన్ని ప్రారంభించేలోపు బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని జైల్లో పెట్టింది.
           గాంధీజీ గుజరాత్‌లోని కథియవార్ సంస్థానంలో పోర్‌బందర్ అనే గ్రామంలో అక్టోబరు 2, 1869లో జన్మించారు. గాంధీజీ తండ్రి కరమ్‌చంద్ దివాన్ (మంత్రి)గా పనిచేసేవారు. గాంధీజీ ఇంగ్లండ్‌లో బారిస్టరు చదువు పూర్తిచేసుకుని భారతదేశానికి తిరిగి వచ్చారు. 1893లో దాదా అబ్దుల్లా అనే వ్యక్తి తరఫున న్యాయవాదిగా దక్షిణాఫ్రికాకు వెళ్లారు. అక్కడ శ్వేత జాతీయుల దురహంకారం వల్ల భారతీయులు ఎదుర్కొంటున్న అవమానాలను చూసి చలించిపోయారు. గాంధీజీ శ్వేతజాతి ప్రభుత్వంపై పోరాడటానికి సత్యాగ్రహమనే కొత్త ఆయుధాన్ని ఉపయోగించారు. గాంధీజీపై ప్రభావం చూపిన వ్యక్తుల్లో ప్రముఖులు- థోరూ, లియో టాల్‌స్టాయ్, జాన్ రస్కిన్. గాంధీజీ డర్బన్‌లో ఫీనిక్స్ ఫామ్‌ను ఏర్పాటుచేశారు. క్రీ.శ. 1903లో ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను ప్రారంభించారు. 1910లో సత్యాగ్రహంలో పాల్గొనే కుటుంబాలకు అండగా ఉండటానికి టాల్‌స్టాయ్ ఫామ్‌ను ప్రారంభించారు.
1914 వరకు దక్షిణాఫ్రికాలో ఉండి, 1915 జనవరిలో ఇండియాకు తిరుగు ప్రయాణమయ్యారు. మొదటి ప్రపంచయుద్ధంలో గాయపడిన వారికి సేవ చేయడానికి ఇంగ్లండ్‌లో అంబులెన్స్ యూనిట్‌ను ఏర్పాటు చేసినందుకు బ్రిటిష్ ప్రభుత్వం కైజర్-ఇ-హింద్ అనే బంగారు పతకంతో సత్కరించింది.
 

ఉద్యమాల పరంపర
      దక్షిణాఫ్రికాలో గాంధీ ప్రయత్నాల గురించి విద్యావంతులకేగాక, సామాన్య ప్రజలకు కూడా తెలిసింది. దేశంలో సామాన్య ప్రజల పరిస్థితిని తెలుసుకోవడానికి భారతదేశమంతటా పర్యటించాలని గాంధీజీ నిర్ణయించుకున్నారు. బ్రిటన్ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొంటున్న సమయంలో హోమ్ రూల్ ఉద్యమం చేయడం మంచిది కాదని భావించారు. జాతీయవాదుల లక్ష్యాలను సాధించడానికి అహింసాయుత సత్యాగ్రహమే సరైన విధానమని పేర్కొన్నారు. 1917-18 మధ్య కాలంలో మూడు పోరాటాల్లో పాల్గొన్నారు.
చంపారన్ సత్యాగ్రహం: బీహార్‌లోని చంపారన్‌లో నీలి మందు రైతులను కష్టాల నుంచి గట్టెక్కించడానికి 1917లో సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న బ్రిటిష్ ప్రభుత్వ విధానాన్ని మార్చి విజయం సాధించారు.
అహ్మదాబాద్ మిల్లు సమ్మె: ప్లేగు బోనస్ నిలుపుదలకు సంబంధించి మిల్లు యజమానులకు, కార్మికులకు మధ్య గొడవ జరిగింది. దీంతో గాంధీజీ అహ్మదాబాద్ వస్త్ర కార్మికుల సంఘాన్ని స్థాపించి, 1918లో నిరాహారదీక్ష చేపట్టారు. చివరకు మిల్లు యాజమాన్యం కార్మికుల వేతనం 35 శాతం పెంచడానికి అంగీకరించింది.
ఖేదా సత్యాగ్రహం: గుజరాత్‌లోని ఖేదాలో 1918లో కరవు సంభవించింది. రెవెన్యూ కోడ్ ప్రకారం సాధారణ ఉత్పత్తిలో 1/4వ వంతు కంటే తక్కువైతే రైతులు భూమి శిస్తు నుంచి మినహాయింపునకు అర్హులు.
అయితే అధికారులు పన్ను చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు. గాంధీజీ సత్యాగ్రహం చేపట్టడంతో రైతులను భూమి శిస్తు చెల్లింపు నుంచి మినహాయించారు. ఈ సత్యాగ్రహం సందర్భంగా సర్దార్ పటేల్, ఇందులాల్ యాజ్ఞిక్ లాంటి యువనాయకులు గాంధీజీకి అనుచరులుగా మారారు.
       పై మూడు పోరాటాల ద్వారా గాంధీజీ సామాన్య ప్రజల నమ్మకాన్ని, గౌరవాన్ని పొందగలిగారు. అలాగే వారి బలాలు, బలహీనతలను అర్థం చేసుకోగలిగారు.
రౌలత్ చట్టం 1919: మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జాతీయవాదులు రాజ్యాంగపరమైన సంస్కరణల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ప్రభుత్వం రౌలత్ చట్టాన్ని రూపొందించింది. దీన్ని వారు అవమానకరంగా భావించారు. అరాచకత్వం, విప్లవాత్మక నేరాల చట్టాన్ని ప్రభుత్వం 1919 ఫిబ్రవరిలో రూపొందించింది. ఈ చట్టాన్ని రూపొందించడానికి ఏర్పాటు చేసిన కమిటీకి సర్ సిడ్నీ రౌలత్ నాయకత్వం వహించడం వల్ల ఈ చట్టం రౌలత్ చట్టంగా ప్రసిద్ధి చెందింది. దీన్ని భారతీయులు నల్లచట్టంగా పరిగణించి 1919 ఏప్రిల్ 6న దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు.
 

జలియన్ వాలాబాగ్ దురంతం:
                నిషేధ ఆజ్ఞల గురించి తెలియని సమీప గ్రామాల్లోని ప్రజలు 1919 ఏప్రిల్ 13 బైశాఖి పండగ రోజున సైఫుద్దీన్ కిచ్లూ, డాక్టర్ సత్యపాల్‌ల అరెస్ట్‌కు నిరసనగా అమృత్‌సర్‌లోని జలియన్ వాలాబాగ్‌లో సమావేశమయ్యారు. జనరల్ డయ్యర్ పైశాచిక ప్రవర్తన వల్ల జరిగిన పోలీసు కాల్పుల్లో సుమారు 400 మంది మృతి చెందారు. దీనికి నిరసనగా రవీంద్రనాథ్ టాగూర్ నైట్‌హుడ్ బిరుదును త్యజించారు. హింసాత్మక పరిస్థితుల పట్ల అప్రమత్తమైన గాంధీజీ 1919 ఏప్రిల్ 18న ఉద్యమాన్ని ఉపసంహరించారు.
సహాయ నిరాకరణ ఉద్యమం: 
                                       గాంధీజీ 1919-22 మధ్య ఖిలాఫత్, సహాయ నిరాకరణ ఉద్యమాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. ఈ రెండు ఉద్యమాలు ప్రారంభించడానికి కారణాలు వేరైనా, అహింసాయుత సహాయ నిరాకరణ అనే ఉమ్మడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఖిలాఫత్ ఉద్యమానికి, భారత రాజకీయాలకు ప్రత్యక్షంగా సంబంధం లేదు. అయితే సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించడానికి ఇదే తక్షణ కారణమైంది.
                                 1919 నవంబరులో ఢిల్లీలో జరిగిన అఖిల భారత ఖిలాఫత్ సమావేశంలో బ్రిటిష్ వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చారు. గాంధీజీ ఖిలాఫత్ సమస్యపై సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ప్రారంభించాలని భావించినా, మతపరమైన సమస్యపై ముస్లిం నాయకులతో పొత్తు కలిగి ఉండటాన్ని తిలక్ వ్యతిరేకించారు. చివరకు గాంధీజీ ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆమోదాన్ని పొందడంలో సఫలీకృతులయ్యారు. ఖిలాఫత్ ఉద్యమాన్ని బలపరుస్తూ గాంధీజీ 1920 ఆగస్టు 1న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1920 డిసెంబరులో జరిగిన నాగపూర్ సమావేశంలో కాంగ్రెస్ ఈ ఉద్యమానికి ఆమోదముద్ర వేసింది. ఇదే సమావేశంలో కాంగ్రెస్ కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించింది. స్వరాజ్య సాధనే తన లక్ష్యమని పునరుద్ఘాటించింది.
చౌరీ చౌరా సంఘటన: ఉద్యమం తారస్థాయికి చేరుకున్న సమయంలో, 1922 ఫిబ్రవరి 5న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా చౌరీ చౌరా గ్రామంలో ఒక సంఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామంలో ఊరేగింపుగా వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు పోలీసులను స్టేషన్‌లో బంధించి నిప్పుపెట్టారు. ఈ సంఘటనలో 22 మంది పోలీసులు సజీవ దహనమయ్యారు. ఉద్యమం హింసాత్మకంగా మారడంతో గాంధీజీ ఉద్యమాన్ని నిలిపేశారు.
1922 ఫిబ్రవరిలో బార్డోలిలో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్మాణాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించాలని తీర్మానించింది. దీనిలో ప్రధానమైనవి- ఖాదీకి ప్రచారం కల్పించడం, జాతీయ పాఠశాలలు ఏర్పాటుచేయడం, మద్యపాన నిషేధం, హిందూ-ముస్లింల ఐక్యత, అంటరానితనాన్ని వ్యతిరేకించడం.
 

ఉద్యమ ప్రాధాన్యం:
1. మొదటిసారిగా భారతదేశంలోని అన్ని వర్గాలవారు, ముఖ్యంగా రైతులు, కార్మికులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్త్రీలు, వ్యాపారులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే పెద్ద పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, జమీందారులు ఉద్యమంలో పాల్గొనలేదు.
2. జాతీయతా భావాలు దేశంలోని మారుమూల ప్రాంతాలకు వ్యాప్తి చెందడానికి ఈ ఉద్యమం దోహదపడింది.
3. హిందూ, ముస్లింల మధ్య ఐక్యత తారస్థాయికి చేరింది.
4. స్వాతంత్య్రం కోసం సామాన్య ప్రజలు ఎలాంటి త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారనే విషయం స్పష్టమైంది.
ఈ ఉద్యమాన్ని మూడు ప్రధాన డిమాండ్ల సాధన కోసం ప్రారంభించినా, ఏ ఒక్క డిమాండూ నెరవేరలేదు. అయినా భారత జాతీయోద్యమ చరిత్రలో సహాయ నిరాకరణ ఉద్యమం గొప్ప ముందడుగుగా పేర్కొనవచ్చు.
 

ఉద్యమ లక్ష్యాలు:
1. రౌలత్ చట్టాన్ని రద్దుచేసి, జలియన్ వాలాబాగ్ దురంతంపై బ్రిటిష్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేయాలి.
2. బ్రిటిష్ ప్రభుత్వం టర్కీ పట్ల ఉదార వైఖరిని అవలంబించాలి. టర్కీ సుల్తానుకు ఖలీఫా పదవిని తిరిగి కట్టబెట్టాలి.  3. స్వరాజ్య డిమాండ్‌ను అంగీకరించాలి.                      
 

ఉద్యమ కార్యక్రమాలు
నకారాత్మక కార్యక్రమాలు:
1. బిరుదులు, గౌరవ పదవులను వెనక్కి ఇచ్చివేయాలి.
2. ప్రభుత్వ దర్బారుకు, అధికార ఉత్సవాలకు ఆహ్వానాలను తిరస్కరించాలి.
3. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను బహిష్కరించాలి.
4. బ్రిటిష్ న్యాయస్థానాలను బహిష్కరించాలి.
5. మెసపటోమియాలో పని చేయడానికి అన్ని వర్గాల వారు తిరస్కరించాలి.
6. రాష్ట్ర, కేంద్ర శాసనసభలకు జరిగే ఎన్నికలను బహిష్కరించాలి.
7. విదేశీ వస్తువులను బహిష్కరించాలి.
 

సకారాత్మక కార్యక్రమాలు:
1. ఆచార్య నరేంద్రదేవ్, చిత్తరంజన్ దాస్, లాలా లజపతిరాయ్, జాకీర్ హుస్సేన్, సుభాష్ చంద్రబోస్ లాంటి జాతీయ నాయకుల ఆధ్వర్యంలో విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి.
2. తిలక్ స్వరాజ్య నిధికి కోటి రూపాయలు విరాళంగా సేకరించారు.
3. స్వదేశీ పరిశ్రమల అభివృద్ధికి ప్రయత్నాలు జరిగాయి. 1921 జులైలో అలీ సోదరులు బ్రిటిష్ సైన్యం నుంచి ముస్లింలు వైదొలగాలని పిలుపునిచ్చారు. 1921 మేలో గాంధీ, వైస్రాయి లార్డ్ రీడింగ్ చర్చలు విఫలమయ్యాయి. 1922 ఫిబ్రవరి 1న గాంధీజీ బార్డోలి నుంచి శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభిస్తానని బ్రిటిష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Posted Date : 14-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌