• facebook
  • whatsapp
  • telegram

భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం

        భారతీయుల్లో రాజకీయ చైతన్యం కలిగించడానికి 19వ శతాబ్దంలో భారతదేశంలో రాజకీయ సంస్థలను స్థాపించారు. ఆంగ్ల విద్యను అభ్యసించిన భారతీయ మేధావులకు పాశ్చాత్య సంస్కృతితో సంబంధం ఏర్పడింది. పాశ్చాత్య ప్రపంచంలో ప్రాధాన్యం వహించిన ప్రజాస్వామిక భావాలతో చైతన్యవంతులయ్యారు. దీని ప్రభావం వల్ల రాజకీయ సంఘాలు, సంస్థల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించాలని భారతీయులు భావించారు. రాజకీయ సంఘాల స్థాపన ద్వారా ప్రజల్లో రాజకీయ చైతన్యం తేవాలని ఆశించారు. రిప్పన్ ప్రభువు కలకత్తా విశ్వవిద్యాలయ స్నాతకోపన్యాసం చేస్తూ భారత ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం ప్రభుత్వానికి ఎంతో అవసరమనీ, అందుకోసం దేశానికంతటికీ ఒక రాజకీయ సంఘం ఉంటే బాగుంటుందని పేర్కొన్నాడు. ఇదే సమయంలో సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనందమోహన్, మహదేవ గోవింద రనడే, బి. సుబ్రమణ్య అయ్యర్, పి.ఆనందాచార్యులు మొదలైనవారు దేశ స్థాయిలో రాజకీయ సభ ఏర్పాటు కోసం కృషిచేశారు. అయితే 1885 డిసెంబర్ 28న ఎ.ఒ.హ్యూమ్ అనే ఆంగ్లేయ అధికారి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు ముందు వివిధ రాష్ట్ర స్థాయి రాజకీయ సంఘాలు విశేషమైన కృషిచేశాయి. అవి...
 

విజ్ఞాన సభ: దీని స్థాపకుడు డిరోజియా. ఇతడు కలకత్తాలో ఆచార్యుడుగా పనిచేశాడు. ఇతడితోనే చర్చా యుగం ప్రారంభమైంది. ఇతడి ప్రభావంతో 1823లో గౌడీయ సమాజాన్ని, 1839లో భూస్వాముల సంఘాన్ని స్థాపించారు.
 

 భూకామందుల సొసైటీఇది 1839లో భార‌త‌దేశంలో ప్రథ‌మంగా ఏర్పడిన రాజ‌కీయ సంస్థ. ఈ సొసైటీ బెంగాల్‌, బీహార్‌, ఒరిస్సా జ‌మీందారుల ప్రయోజ‌నాల ప‌రిర‌క్షణ కోసం క‌ల‌క‌త్తాలో ప్రారంభ‌మైంది. ఈ సంఘం త‌మ ప్రతినిధిగా లండన్‌లో జాన్‌క్రాఫర్డును నియమించింది. 'ఇది భారతదేశంలో స్వాతంత్య్రానికి మార్గం చూపిన సంస్థ' అని రాజేంద్రలాల్‌మిత్రా అభిప్రాయపడ్డాడు. ఈ సంస్థ 1851లో బ్రిటిష్ ఇండియా సొసైటీలో విలీనమైంది.
 

బ్రిటిష్ ఇండియా సొసైటీ: బ్రిటిష్ ఇండియాలోని భారతీయుల స్థితిగతులను మెరుగుపరచాలనే లక్ష్యంతో కొందరు బ్రిటిష్‌వారు 1839లో లండన్‌లో 'బ్రిటిష్ ఇండియా సొసైటీ'ని స్థాపించారు. దీంట్లో సభ్యులైన లార్డ్ బ్రౌగాయ్ డేనియల్ఓకొనెల్, జార్జి థామ్సన్, సర్ చార్లెస్ ఫోర్‌బెస్ ఇంగ్లండులో విస్తృతంగా పర్యటించి భారతీయుల కష్టాలను తీర్చాలని పేర్కొన్నారు. ఈ సంఘం ఇంగ్లండ్‌లోని భారతీయుల శ్రేయస్సును కాంక్షించే వారందరికీ ఒక వేదిక కల్పించింది.
 

బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ: దీన్ని 1843లో థామ్సన్ ద్వారకానాథ్ టాగూర్ మొదలైనవారు బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీని స్థాపించారు. భారతీయుల కష్టాలను ఆంగ్లేయుల దృష్టికి తీసుకురావడమే దీని లక్ష్యం. 1851లో బ్రిటిష్ ఇండియా సొసైటీలో ఈ సంస్థ కలిసిపోయింది.
 

బ్రిటిష్ ఇండియా సంఘం: 1851లో బెంగాల్‌లోని ప్రముఖులు బ్రిటిష్ ఇండియా సంఘాన్ని స్థాపించారు. భారతీయులకు శాసనసభలో ప్రాతినిథ్యం కల్పించాలని, సివిల్ సర్వీస్ పరీక్షలు ఇండియాలోనే జరపాలని ప్రభుత్వానికి ఇది విన్నవించింది. భారతీయుల్లో రాజకీయ చైతన్యం తేవడానికి ఈ సంఘం గొప్ప కృషి చేసింది.
 

మద్రాస్ దేశీయ సంఘం: 1852లో మద్రాస్ నేటివ్ సంఘాన్ని స్థాపించారు. దీనిలో ప్రముఖ పాత్ర వహించింది గాజుల లక్ష్మీనరసుసెట్టి.
 

బొంబాయి సంఘం: దీన్ని 1852లో బొంబాయిలో స్థాపించారు.
 

పూనా సార్వజనిక సభ: 1870లో రనడే నాయకత్వంలో పూనాలో సార్వజనిక సభను స్థాపించారు. సామాన్య ప్రజలకు రాజకీయాలు పరిచయం చేసి, వారి భాధ్యతలను గుర్తుచేయడం ఈ సభ ముఖ్యోద్దేశం.
 

ఇండియా లీగ్: 1875లో అమృత బజార్ పత్రికా సంపాదకుడైన శశికుమార్ ఘోష్ బెంగాల్‌లో ఇండియా లీగ్‌ను స్థాపించాడు. భారతీయుల్లో జాతీయ భావాన్ని పెంపొందించడమే దీని లక్ష్యం.

మద్రాస్ మహాజన సభ: 1884లో విద్యావంతులైన యువకులు ఈ సభను స్థాపించారు. దీంట్లో ప్రధాన పాత్రవహించిన నాయకుడు ఆనందాచార్యులు.
 

లండన్ ఈస్టిండియా సంఘం: 1865లో అన్ని రాష్ట్రాలకూ చెందిన భారతీయులు కలిసి ఇంగ్లండులో దీన్ని స్థాపించారు. ఈ సంఘం ఆంగ్ల పరిపాలనలోని లోపాలను వివరించింది.
 

తూర్పు ఇండియా సంఘం: 1866లో ఈ సంఘాన్నిస్థాపించారు. దీంట్లో భారతీయులే కాకుండా ఆంగ్లేయులు కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘంలో ముఖ్య పాత్ర వహించిన నాయకుడు దాదాభాయ్ నౌరోజీ.
 

బొంబాయి ప్రెసిడెన్సీ సంఘం: 1885లో తెలాంగు త్యాబ్జి, ఫిరోజ్‌షా మోహతాలు కలిసి బొంబాయి ప్రెసిడెన్సీ సంఘాన్ని స్థాపించారు. తొలి జాతీయ కాంగ్రెస్ మహాసభను జరపడానికి ఇది ఆతిథ్యమిచ్చింది.
 

ఇండియన్ అసోసియేషన్: 1876లో సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనందమోహన్ బోస్ నాయకత్వలో ఉన్న యువ బెంగాల్ జాతీయవాదులు దీన్ని స్థాపించారు. ఈ సంస్థ ముఖ్య ఆశయాలు:
1. ఉమ్మడి రాజకీయ కార్యక్రమాలతో భారత ప్రజలను సమైక్యపరచడం.
2. హిందూ ముస్లిం సఖ్యతను పెంపొందించడం.
3. దేశంలో బలమైన ప్రజాభిప్రాయాన్ని సృష్టించడం మొదలైనవి. ఇండియన్ అసోసియేషన్ రాజకీయ సమైక్యతా సాధన దిశగా నడిచింది.
          ఈ అసోసియేషన్ 1883లో కలకత్తాలో మొదటి జాతీయ సమావేశాన్ని నిర్వహించింది. 1885 డిసెంబర్ 25, 26, 27 తేదీల్లో బొంబాయిలో జరిగిన రెండో సమావేశంలో అనేక అంశాలు చర్చించారు. అయితే 1885 డిసెంబరు 28న ఏఓ హ్యూమ్ భారత జాతీయ కాంగ్రెస్‌ను స్థాపించాడు. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడైన ఉమేష్‌చంద్ర బెనర్జీ ఆహ్వానం మేరకు సురేంద్రనాథ్ బెనర్జీ 1886లో తాను నెలకొల్పిన నేషనల్ కాన్ఫరెన్స్‌ను జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేశాడు.
 

ఏఓ హ్యూమ్: ఇతడి అసలు పేరు అలెన్ అక్టేవియన్ హ్యూమ్. స్కాటిష్ కుటుంబంలో జన్మించాడు. 1849లో ఐపీఎస్ హోదాలో భారతదేశానికి వచ్చాడు. విద్యావంతులైన భారతీయులంటే ఇతడికి సానుభూతి ఉండేది. విద్యావిధానంలో అనేక మార్పులు చేశాడు. సంఘ సంస్కరణ, మద్యపాన నిషేధం మొదలైన అంశాలపట్ల ఆసక్తి చూపాడు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి నానాటికీ పెరుగుతోందని, ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా వ్యవహరించాలనీ ప్రభుత్వానికి సలహా ఇచ్చాడు.
 

భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన: 1885 డిసెంబర్ 28 మధ్యాహ్నం 12 గంటలకు బొంబాయిలోని తేజ్‌పాల్ సంస్కృత కళాశాల గోకుల్‌దాస్ భవనంలో మొదటి జాతీయ కాంగ్రెస్ సభ డబ్ల్యు.సి. బెనర్జీ అధ్యక్షతన జరిగింది. ఏఓ హ్యూమ్, కె.టి.తెలాంగ్ కార్యదర్శులుగా ఎన్నికయ్యారు.
ప్రథమ సమావేశానికి బొంబాయి నగరం నుంచి 38 మంది, మద్రాస్ నుంచి 21 మంది, బెంగాల్ నుంచి ముగ్గురు, అయోధ్య నుంచి ఏడుగురు, పంజాబ్ నుంచి ముగ్గురు మొత్తం 72మంది ప్రతినిథులు హాజరయ్యారు.
కాంగ్రెస్ స్థాపన ముఖ్య ఉద్దేశం: హ్యూమ్ కాంగ్రెస్‌ను స్థాపించడంలోని ముఖ్య ఉద్దేశం బ్రిటిష్ పరిపాలన భారతదేశంలో శాశ్వతంగా ఉండేటట్లు చేయడమే. సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించిన జాతీయ సంఘం విప్లవాత్మకమైందని, అది ఏనాటికైనా ఆంగ్లేయులపై తిరుగుబాటు చేస్తుందని దాన్ని అణచివేసి, జాతీయ స్థాయిలో ఒక రాజకీయ సంఘాన్ని స్థాపించాడు హ్యూమ్. భారతీయులు రష్యావైపు మొగ్గుచూపుతారు అనే అనుమానం కూడా హ్యూమ్‌కు ఉండేది. ఆంగ్లవిద్యను అభ్యసించినవారిని తమ వైపు తిప్పుకోవాలనే ఆలోచన హ్యూమ్‌కు ఉండేది.
* 1886లో భారత జాతీయ కాంగ్రెస్ రెండో సమావేశం కలకత్తాలో దాదాభాయ్ నౌరోజీ అధ్యక్షతన జరిగింది. దీనికి 436 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
* 1887లో మూడో సమావేశం మద్రాస్‌లో బద్రుద్దీన్ త్యాబ్జీ అధ్యక్షతన జరిగింది. ఇతడు కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించిన తొలి ముస్లిం. దీనికి 607 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
* భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు హాజరైన ప్రతినిధుల్లో చాలామంది ఆంగ్లవిద్యను అభ్యసించిన లాయర్లు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, పత్రికా సంపాదకులు ఉన్నారు.
 

భార‌త జాతీయ కాంగ్రెస్‌కు మొద‌టిసారిగా అధ్యక్షత వ‌హించిన ప్రముఖులు
 


 

జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వ‌హించిన ఆంగ్లేయులు

భార‌త జాతీయ కాంగ్రెస్ స‌మావేశాల ప్రాధాన్యాలు

ప్రారంభం నుంచే అనేక వర్గాలు, ప్రాంతాలకు చెందిన ప్రతినిధులతో జాతీయ లక్షణాన్ని సంతరించుకున్న జాతీయ కాంగ్రెస్ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తన లక్ష్యాలను పునర్నిర్దేశించుకుంటూ భారత స్వాతంత్య్ర సాధనలో తిరుగులేని పాత్రను పోషించింది. జాతీయ కాంగ్రెస్ పోరాట మార్గంలో సంతరించుకున్న ప్రజాస్వామ్య, లౌకిక లక్షణాలే స్వతంత్ర భారత రాజ్యాంగంలోనూ ప్రతిబింబించాయి.a

Posted Date : 09-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌