• facebook
  • whatsapp
  • telegram

భూకంపాలు

భూకంపనాభి (Focus or Hypocentre)

* భూ అంతర్భాగంలో భూకంపం ప్రారంభమయ్యే ప్రదేశాన్ని భూకంపనాభి అంటారు.

* p తరంగాలు, l తరంగాల వేగంలోని తేడా ఆధారంగా భూకంపనాభి లోతును నిర్ధారిస్తారు.

భూకంప అభికేంద్రం (Epicentre)

* భూకంపనాభికి 90o కోణంలో భూ ఉపరితలంపై ఉండే ప్రదేశాన్ని భూకంప అభికేంద్రం అంటారు.

* భూకంపాల వల్ల తీవ్రంగా నష్టం వాటిల్లే ప్రాంతం భూ అభికేంద్రం.

* భూకంపనాభి లోతు పెరిగే కొద్దీ భూకంప ప్రభావానికి గురయ్యే ప్రాంత వైశాల్యం పెరుగుతుంది. భూకంప తీవ్రత తగ్గుతుంది.

* భూకంపనాభి లోతు తగ్గే కొద్దీ భూకంప తీవ్రత పెరుగుతుంది.

* భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని భూకంపశాస్త్రం (Seismology) అంటారు. వీటి తీవ్రతను తెలుసుకునేందుకు ‘భూకంపలేఖిని’ (Seismograph) అనే పరికరాన్ని ఉపయోగిస్తారు.

సెస్మోగ్రాఫ్‌ని తయారు చేసిన దేశం చైనా.

భూకంప తరంగాలను గుర్తించి, ఒక గ్రాఫ్‌లా తయారు చేయడాన్ని భూకంప తరంగ చిత్రం అంటారు.


రకాలు

* భూకంప నాభి లోతు ఆధారంగా భూకంపాలను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి:

1. లోతు నాభి భూకంపాలు/ అగాధ భూకంపాలు: భూ అంతర్భాగంలో 300 కి.మీ. కంటే ఎక్కువ లోతులో ఏర్పడే భూకంపాలు.

2. మాధ్యమిక నాభి భూకంపాలు: భూ అంతర్భాగంలో 55 కి.మీ. నుంచి 300 కి.మీ. లోతులో ఏర్పడే భూకంపాలు.

3. తక్కువ లోతు నాభి భూకంపాలు/ గాధ భూకంపాలు: 55 కి.మీ. కంటే తక్కువ లోతులో ఏర్పడే భూకంపాలు.

భూ ఉపరితలంపై తీవ్ర నష్టానికి కారణమయ్యే భూకంపాలు - తక్కువ లోతు నాభి భూకంపాలు.

ట్రెమర్స్‌ (Tremors): ట్రెమర్స్‌ అనేవి చిన్న సైజు భూకంపాలు. వీటిని గుర్తించడం సాధ్యం కాదు. ఇవి అపాయకరమైనవి కాదు.


భూకంప తీవ్రత 

* భూకంపం సంభవించడం వల్ల భూమి ఉపరితలంపై జరిగే ప్రాణ - ఆస్తి నష్టం, కూలిపోయిన భవనాలు, భూమిపై సంభవించిన పగుళ్లు మొదలైన వాటిని భూకంప తీవ్రత అంటారు. ఇది అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదు. ఈ నష్టం వివిధ రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి:

1. ఎపిసెంటర్‌ నుంచి దూరం: భూ అంతర్భాగంలో ఉన్న భూకంపనాభి (ఫోకస్‌)లో భూకంపం ఆవిర్భవించగానే అందులో నుంచి విడుదలయ్యే శక్తి తరంగాల రూపంలో అన్ని దిక్కులకూ వ్యాపిస్తుంది.

* ఫోకస్‌కి లంబంగా భూ ఉపరితలం మీదకు గీసిన బిందువును భూకంప అభికేంద్రం (Epicentre) అంటారు. 

* ఎపిసెంటర్‌ వద్ద జననష్టం, ఆస్తినష్టం ఎక్కువగా ఉంటాయి. దీని నుంచి దూరం పెరిగే కొద్దీ భూకంప తీవ్రత తగ్గుతుంది.

2. భూమి లోపలి పొరల ఒత్తిడి: భూకంప తీవ్రత భూమి లోపలి పొరల స్థితి ఆధారంగా కూడా మారుతూ ఉంటుంది. 

ఉదా: భూమి లోపలి పొరల్లో భ్రంశాలు, సందులు, పగుళ్లు మొదలైనవి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కట్టిన భవనాలపై భూకంప తీవ్రత ప్రభావం ఎక్కువగా ఉండదు. కాబట్టి వాటి నిర్మాణం దెబ్బతినదు. భూకంప తరంగాలు ఆ పగుళ్ల మీదుగా పయనిస్తాయి. దీంతో నష్టం వాటిల్లదు. భూమిలోపల ఇవన్నీ లేకుండా భూమి గట్టిగా, దట్టంగా, సంఘటితంగా ఉన్న చోట కట్టిన భవనాలు భూకంప తాకిడికి దెబ్బతింటాయి. 

* భూకంపాలు పెద్ద ఎత్తున సంభవించినప్పుడు దాని నుంచి విడుదలయ్యే శక్తి, సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎర్గ్‌ (Erge) లేదా జౌల్స్‌ (Joules) తో కొలుస్తారు. 

1 Erge = 1 Dyne/-cm(లేదా) 

1 Joule = 107 Ergs.

* భూకంపం సంభవించినప్పుడు దాని నుంచి వెలువడే శక్తి సామర్థ్యాలు 1010 Ergs నుంచి 1024 Ergs వరకు ఉంటాయి. ఇది కొన్ని వందల మిలియన్‌ ఆటంబాంబులతో సమానం.

* భూకంప శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకునేందుకు నాలుగు రకాల స్కేళ్లు అందుబాటులో ఉన్నాయి. అవి:

1. మెర్కలీ స్కేలు     2. రోస్సీ - ఫోరెల్‌ స్కేలు  

3. ఓమరీ స్కేలు        4. రిక్టర్‌ స్కేలు 

మెర్కలీ స్కేలు: ఇటలీకి చెందిన గ్యుసెప్పే మెర్కలీ భూకంప తీవ్రతను గుర్తించేందుకు 1931లో ఒక స్కేలును కనుక్కున్నారు. దీనికి మెర్కలీ స్కేల్‌ అనే పేరు పెట్టారు. దీనిలో 12 పాయింట్లు ఉంటాయి.

రోస్సీ - ఫోరెల్‌ స్కేలు: ఇటలీకి చెందిన మిచెల్‌ స్టెఫానో కాంటె డి రోస్సీ, స్విట్జర్లాండ్‌ శాస్త్రవేత్త ఫ్రాంకోయిస్‌ ఫోరెల్‌ దీన్ని అభివృద్ధి చేశారు. ఇందులో 10 పాయింట్లు ఉంటాయి.

రిక్టర్‌ స్కేలు (Richter scale): కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ప్రొఫెసర్‌ ‘చార్లెస్‌ రిక్టర్‌’ 1935లో దీన్ని రూపొందించారు. ప్రస్తుతం ఈ స్కేలు ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉంది. ఇందులో 9 నెంబర్లు ఉంటాయి.

* రిక్టర్‌ స్కేలుపై నమోదు తీవ్రత 2గా సూచిస్తే, మనం భౌతికంగా గుర్తించలేని భూ ప్రకంపనలు సంభవించినట్లు అర్థం. అందులోని ఏడో అంకె విశాలమైన ప్రాంతాన్ని నాశనం చేయగల తీవ్రతను గుర్తిస్తుంది/ సూచిస్తుంది. 

భారతదేశంలో సంభవించిన భూకంపాలు 

* భారతదేశంలో భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతం హిమాలయ పర్వత ప్రాంతం.

* భారతదేశంలో అధికంగా భూకంపాలు సంభవించే రాష్ట్రం అస్సాం.

* 1819: గుజరాత్‌ - కచ్‌ భూకంపం.

* 1897, 1950: అస్సాం భూకంపం.  

* 1934: బిహార్‌ - నేపాల్‌ సరిహద్దు భూకంపం

* 1967: మహారాష్ట్ర - కొయనా భూకంపం. 

* 1992: ఉత్తర కాశీ (యూపీ) భూకంపం 

* 1993: మహారాష్ట్ర లాతూర్‌ భూకంపం.

* 1997: మధ్యప్రదేశ్‌ భూకంపం.

* 2001: భుజ్‌ భూకంపం.

ప్రపంచంలో భూకంపాలు సంభవించేందుకు అవకాశంలేని దేశం ఆస్ట్రేలియా.


భూకంప తీవ్రత - శక్తి సామర్థ్యాలు 

భూకంపం సంభవించినప్పుడు దాని తీవ్రత (intensity), శక్తి సామర్థ్యాలు (magnitude) మొదలైనవి ఎంత ఉంటాయి అనే అంశంపై శాస్త్రవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 

భూకంపానికి ముందు లేదా తర్వాత ‘ట్రెమర్స్‌’ అనేవి వస్తాయి. ఇవి ప్రమాదకరం కాదు.


టర్కీ భూకంపం

* సిరియా సరిహద్దు సమీపంలో టర్కీ (తుర్కియే) ఆగ్నేయ ప్రాంతంలో 2023, ఫిబ్రవరి 6న భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.8గా నమోదైంది. 

* ఈ భూకంపం కారణంగా వేలాది మంది మరణించారు. 

* టర్కీలో చారిత్రక గాజియన్‌టెప్‌ సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

అనటోలియన్, అరేబియన్‌ భూఫలకాల మధ్య 100 కిలోమీటర్ల దూరం పైగా పగులు, ఒరిపిడితో ఈ భారీ స్థాయి భూకంపం తుర్కియే, సిరియాలను తాకింది.

ఈ భూకంపం 1939లో ఈశాన్య టర్కీలో సంభవించిన అతిపెద్ద భూకంప పరిమాణాన్ని కలిగి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

భూకంప తరంగాలు (Seismic waves) 

* భూకంపనాభి నుంచి విడుదలైన శక్తి విభిన్న దిశలు, వేగాలు, తీవ్రతతో కంపన తరంగాల రూపంలో భూ ఉపరితలాన్ని చేరుతుంది. వీటినే భూకంప తరంగాలు అంటారు. ఇవి ప్రయాణించే దిశ, వేగం, తీవ్రత ఆధారంగా వీటిని మూడు రకాలుగా విభజించారు. అవి:

1. ప్రాథమిక తరంగాలు - Primary waves/ P తరంగాలు

2. ద్వితీయ తరంగాలు - Secondary waves/ Distortional waves/ S waves

3. ఉపరితల తరంగాలు Surface waves/ Rayleigh waves/ L waves

ప్రాథమిక తరంగాలు 

* వీటిని ఒత్తిడి కలిగించే తరంగాలు (condensation waves), తోపుడు తరంగాలు అని కూడా అంటారు.

* P తరంగాలు తరంగమార్గం మీదుగా అణువులను ముందుకు, వెనక్కు కదుపుతూ ప్రయాణిస్తాయి.

ఈ తరంగాలు ఎలాంటి మార్గం నుంచైనా ప్రయాణించగలవు.

* ఇవి మిగిలిన తరంగాల కంటే వేగంగా పనిచేస్తాయి. వీటి వేగం సెకన్‌కి 8 నుంచి 10 కి.మీ. వరకు ఉంటుంది.

* ఇవి ధ్వని తరంగాలను పోలి ఉంటాయి.

P తరంగాల వేగం S తరంగాల వేగం కంటే 1.7 రెట్లు ఎక్కువ.

* P తరంగాలు ప్రయాణించే మార్గం పుటాకారంగా (concave) ఉంటుంది.

* భూకంపం సంభవించినప్పుడు ఈ తరంగాలు సిస్మోగ్రాఫ్‌లో త్వరగా రికార్డు అవుతాయి.

* రాతిపొరల సాంద్రత పెరిగితే ఈ తరంగాల వేగం కూడా పెరుగుతుంది.

ద్వితీయ తరంగాలు

* వీటిని గౌణ తరంగాలు, తిర్యక్‌ తరంగాలు అని కూడా అంటారు.

* ఈ తరంగాలు ప్రయాణించే దిశకు లంబంగా రాతి రేణువులు పైకీ కిందికీ కదులుతూ ఉంటాయి.

* ఇవి ద్రవ మార్గాల్లో (నీటిలో) ప్రయాణించలేవు.

* ఈ తరంగాల వేగం సెకనుకు 5 - 7 కి.మీ. వరకు ఉంటుంది. సిస్మోగ్రాఫ్‌లో P తరంగాల తర్వాత ఇవి నమోదు అవుతాయి.

* P, S తరంగాలు రెండూ భూమి లోపలికి చొచ్చుకుపోతాయి కానీ భూ ఉపరితలంపై ప్రయాణించలేవు. అందుకే వీటిని అంతర్‌ తరంగాలు (Body waves) అని పిలుస్తారు.

L తరంగాలు 

* ఇవి చాలా జఠిలమైనవి. ఇవి ధ్వని తరంగాలను పోలి ఉండవు.

* ఈ తరంగ కదలికలు చాలా ప్రస్ఫుటంగా ఉంటాయి. ఇవి ప్రయాణించే దిశలో కోడిగుడ్డు ఆకారంలో రాతిరేణువులు కదులుతూ ఉంటాయి.

* అన్ని తరంగాల కంటే ఇవి చాలా నెమ్మదిగా పయనిస్తాయి. వీటి వేగం సెకనుకు 3 - 4 కి.మీ. వరకు ఉంటుంది.

* L తరంగాలను ర్యాలీ తరంగాలు, దీర్ఘ తరంగాలు అని కూడా అంటారు.

* ఇవి తరంగ మార్గంలో సముద్ర కెరటాల్లా ప్రయాణిస్తాయి.

* భూ ఉపరితలంపై సంభవించే నష్టానికి ఇవే కారణం.

* ఈ తరంగాలన్నీ వివిధ మాధ్యమాల ద్వారా ప్రయాణిస్తాయి.

* P, S తరంగాల అధ్యయనం ద్వారా శాస్త్రవేత్తలు భూ అంతర్నిర్మాణం గురించి తెలుసుకుంటారు.

Posted Date : 02-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌