• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక భారతదేశ చరిత్ర - ఐరోపా వారి రాక

      క్రీ.శ.18వ శతాబ్దం ద్వితీయార్ధంలో ఆంగ్ల సామ్రాజ్య స్థాపనతో భారతదేశంలో ఆధునిక యుగం ప్రారంభమైనట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. క్రీ.శ.1453లో తురుష్కులు కాన్‌స్టాంట్‌నోపుల్‌ను ఆక్రమించుకున్నారు. ఫలితంగా తూర్పు, పశ్చిమ దేశాల మధ్య ఉన్న ఏకైక భూమార్గం మూసుకుపోయింది. నూతన మార్గాలను అన్వేషించడానికి ప్రయత్నించిన తొలి ఐరోపా దేశం పోర్చుగల్.
* పోర్చుగల్ రాజు హెన్రీ స్వయంగా సముద్రంపై ప్రయాణించి, సముద్ర మార్గాన్ని భౌగోళిక పటంగా (పోర్టోలనీ) రూపొందించాడు. స్వయంగా నావికా శిక్షణ కేంద్రాన్ని స్థాపించాడు. కాబట్టి హెన్రీని 'ది నావిగేటర్' బిరుదుతో పిలుస్తారు.
* హెన్రీ ఆర్థిక సహాయంతో బార్తోలోమ్యూ డియాస్ (Bartolomeu Dias) తుపానుల అగ్రం/ కేప్ ఆఫ్ స్ట్రామ్స్‌ను కనుక్కున్నాడు.
* తర్వాత హెన్రీ కుమారుడు రెండో జాన్ కేప్ ఆఫ్ స్ట్రామ్స్ వరకూ వెళ్లి, దానికి కేప్ ఆఫ్ గుడ్‌హోప్ అనే పేరు పెట్టాడు.

పోర్చుగీసువారు
 * 1498, మే 17న వాస్కోడిగామా భారతదేశానికి వచ్చి, కాలికట్ పాలకుడు జామెరిన్‌ను కలిసి వ్యాపార ఒప్పందం చేసుకున్నాడు.
* వాస్కోడిగామాకు అబ్దుల్ వాజిద్ (అబ్దుల్ అజీజ్) అనే గుజరాత్ నావికుడు సహాయపడ్డాడు.
* ఆధునిక యుగంలో భారతదేశానికి వచ్చిన తొలి ఐరోపా దేశంగా పోర్చుగల్‌ను పేర్కొంటారు.
* కాలికట్‌లో పోర్చుగీసువారు తమ తొలి వర్తక స్థావరాన్ని స్థాపించారు.
* వాస్కోడిగామా రెండోసారి 1502లో భారతదేశానికి వచ్చాడు.
* పోర్చుగల్ దేశ ప్రతినిధిగా/అధికారిగా వచ్చిన కాబ్రల్ కొచ్చిన్, క్రాంగనూర్ ప్రాంతాల్లో వర్తక స్థావరాలను స్థాపించాడు.
* 1505 - 09 మధ్య గవర్నర్‌గా పనిచేసిన డీ ఆల్మడా నౌకా వ్యాపార అభివృద్ధి కోసం నీలి నీటి విధానాన్ని (Blue water policy) ప్రవేశ పెట్టాడు. కన్ననూర్ వద్ద ఒక కోటను నిర్మించాడు.
* ఆల్బూకర్క్ అనే పోర్చుగీసు గవర్నర్ సొకొట్ర, ఆర్ముజ్, డయ్యూ, మలక్కా, గోవా, మాకోలు రేవులను ఆక్రమించి ''భారతదేశంలో పోర్చుగీసు వలస సామ్రాజ్య నిర్మాత''గా పేరుగాంచాడు.
* 1510లో ఆల్బూకర్క్ శ్రీకృష్ణదేవరాయలతో సంధి చేసుకుని బీజపూర్ పాలకుడిని ఓడించి, గోవాను ఆక్రమించాడు.
* భారతదేశంలో పోర్చుగీసువారి ప్రధాన వర్తక స్థావరం గోవా.
పోర్చుగీసువారు ఆక్రమించిన వివిధ ప్రాంతాలు
                 సంవత్సరం       ప్రాంతం పేరు
                1511                   మలక్కా
                1515                   ఆర్ముజ్
                1518                   కొలంబో
                1534                   డయ్యూ
                1538                   డామన్, నాగపట్నం
* చిట్టగాంగ్, హుగ్లీ, శాంథోమ్ లాంటి ప్రాంతాల్లో కూడా వర్తక స్థావరాలను స్థాపించారు.
* గోవాకు వెళ్లిన మొదటి క్రైస్తవ మతాచార్యుడు సర్ ఫ్రాన్సిస్ జేవియర్ పోర్చుగీసు వాడే.
* భారతదేశంలో 1556లో తొలి అచ్చు యంత్రాన్ని ప్రవేశ పెట్టింది కూడా పోర్చుగీసువారే.
* పొగాకు, మిరప, మొక్కజొన్న లాంటి పంటలను భారతీయులకు పరిచయం చేసింది పోర్చుగీసువారే.
* 1534లో గుజరాత్ పాలకుడు బహదూర్‌షా నుంచి బొంబాయిని పొందిన పోర్చుగీసువారు 1661లో దాన్ని ఆంగ్లేయులకు అద్దెకు ఇచ్చారు. (ఏడాదికి 10 పౌండ్లు).
* పోర్చుగీసు వారి సహాయంతోనే విజయనగర రాజులు అశ్విక దళాన్ని, గుజరాత్ పాలకులు ఫిరంగి దళాన్ని సమకూర్చుకున్నారు.
16వ శతాబ్దంలో హిందూ మహాసముద్రంపై వాణిజ్య ఆధిపత్యాన్ని పొందిన పోర్చుగీసువారు ఆంగ్లేయుల చేతిలో ఓడిపోయి, క్రమంగా తమ ఆధిపత్యాన్ని కోల్పోయారు.
* షాజహాన్ 'హుగ్లీ' స్థావరాన్ని, ఔరంగజేబ్ 'చిట్టగాంగ్' స్థావరాన్ని పోర్చుగీసు వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
* 1961లో భారత ప్రభుత్వం 'ఆపరేషన్ విజయ్' పేరుతో సైనిక చర్య జరిపి, పోర్చుగీసు వారి నుంచి గోవాను ఆక్రమించుకుంది.
* భారతదేశానికి వచ్చిన తొలి ఐరోపా దేశీయులుగా, భారతదేశం నుంచి వెళ్లిన చివరి ఐరోపా దేశీయులుగా పోర్చుగీసువారు గుర్తింపు పొందారు.

 

డచ్‌వారు (నెదర్లాండ్స్/ హాలెండ్)
* డచ్‌వారు 1602లో 'యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్‌'ను స్థాపించారు.
* 1605లో డచ్‌వారు మచిలీపట్నం వచ్చి, నాటి గోల్కొండ పాలకుడు మహ్మద్ కులీకుతుబ్‌షా సహాయంతో భారతదేశంలో తొలి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
* వీరు పులికాట్ (1610), సూరత్ (1616), భీమునిపట్నం (1641), చిన్సురా (1653); కాశింబజార్, నాగపట్నం, కొచ్చిన్‌ల‌లో వర్తక స్థావరాలను స్థాపించారు.
* భారతదేశంలో డచ్‌వారి తొలి ప్రధాన వర్తక కేంద్రం పులికాట్. కానీ 1690లో వారు తమ ప్రధాన వర్తక కేంద్రాన్ని నాగపట్నానికి మార్చుకున్నారు. (నోట్: భారతదేశంలో డచ్‌వారి ప్రధాన వర్తక కేంద్రం నాగపట్నం అని గుర్తించాలి.)
* 1658లో డచ్‌వారు పోర్చుగీసు వారిని ఓడించి, సింహళాన్ని (శ్రీలంక) ఆక్రమించారు.
* 1623 నాటి అంబోయినా వధ ఆంగ్లేయులకు, డచ్చివారికి మధ్య వైరాన్ని పెంచింది.
* అంబోయినా వధ కాలంలో డచ్ గవర్నర్ హెర్మన్ వాన్‌స్పెల్ట్ (Herman van Speult).
* డచ్‌వారు వాన్‌లిచ్చ్‌టన్ అనే అన్వేషకుడి రాతలు/రచనల వల్ల ప్రభావితమై భారతదేశానికి వచ్చారు.
* చివరికి డచ్‌వారు ఇండోనేషియాను తమ వలస రాజ్యంగా మార్చుకున్నారు.
* సుగంధ ద్రవ్యాల వ్యాపారం నుంచి వస్త్ర వ్యాపారం దిశగా దృష్టి మరల్చిన తొలి ఐరోపా దేశం డచ్ నెదర్లాండ్స్.

 

డేన్‌లు (డెన్మార్క్)

*  డెన్మార్క్‌వారు 1616లో తమ తొలి వర్తక స్థావరాన్ని తమిళనాడులోని ట్రాంక్వీబార్‌లో ఏర్పాటు చేసుకున్నారు.
*  భారతదేశంలో డేన్‌ల ప్రధాన వర్తక స్థావరం బెంగాల్‌లోని సేరాంపూర్.
*  క్రైస్తవ మిషనరీల ద్వారా విద్యా వ్యాప్తికి కృషి చేసిన ప్రధాన ఐరోపా దేశం డెన్మార్క్ (డేన్స్).
*  డేన్‌లు 1845లో భారతదేశంలోని తమ వర్తక స్థావరాలన్నింటినీ ఆంగ్లేయులకు అమ్మేసి తమ దేశం వెళ్లిపోయారు.

 

ఆంగ్లేయులు (ఇంగ్లండ్)
* ఫాదర్ స్టీఫెన్స్ అనే క్రైస్తవ మతాచార్యుడు ఎలిజబెత్ రాణి కాలంలో తొలిసారిగా భారతదేశానికి వచ్చాడు (1579).
* ఆంగ్లేయులు 1600లో 'ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ ఇంగ్లండ్‌'ను స్థాపించుకున్నారు.
* ఎలిజబెత్ రాణి రాయల్ చార్టర్ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతిని మంజూరు చేసింది.
* అక్బర్ కాలంలో జాన్‌న్యూబెరి, విలియం రీడ్స్ అనే నగల వ్యాపారులు; జేమ్స్‌స్టోరీ అనే చిత్రకారుడు, రాల్ఫ్‌పిఛ్ అనే రాయబారి భారతదేశాన్ని సందర్శించారు.
* 1599 - 1605 మధ్య జాన్‌మిండెన్ హాల్ అనే ఆంగ్లేయుడు భారతదేశంలో ఉన్నాడు.
* 1608లో విలియం హాకిన్స్ అనే ఆంగ్లేయుడు జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించాడు.
* 1611లో 'గ్లోబ్' నౌకలో కెప్టెన్ హిప్పన్ నాయకత్వంలో ఆంగ్లేయులు మచిలీపట్నం వచ్చి మహ్మద్ కులీకుతుబ్‌షా అనుమతి పొందారు (స్థావరం ఏర్పాటు చేయలేదు).
* 1615 - 16 మధ్య సర్ థామస్ రో అనే ఆంగ్లేయుడు జహంగీర్ ఆస్థానానికి వచ్చి, వ్యాపార అనుమతి పొందాడు. ఫలితంగా ఆంగ్లేయులు 1616లో తమ తొలి వర్తక స్థావరాన్ని సూరత్‌లో ప్రారంభించారు.
* ఆంగ్లేయులు 1626లో గోవాలో తమ వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు.
* 1639లో ఫ్రాన్సిస్ డే అనే ఆంగ్ల ప్రతినిధి 2 గ్రామాలను దామెర్ల సోదరుల నుంచి కొనుగోలు చేసి, సెయింట్ జార్జ్ కోటను నిర్మించాడు. ఆ ప్రాంతమే చెన్నపట్నంగా ప్రసిద్ధి చెందింది.
* 1633లో ఆంగ్లేయులు రాల్ఫాకార్ట్‌రైట్ కృషి వల్ల ఒరిస్సాలోని హరిహరపురంలో వర్తక స్థావరాన్ని ఏర్పాటుచేశారు.
* బ్రాడ్‌మన్ అనే ఆంగ్లేయుడి కృషి ఫలితంగా 1651లో హుగ్లీలో ఆంగ్లేయుల వర్తక స్థావరం ఏర్పాటైంది.
* గాబ్రియల్ బౌటన్ అనే ఆంగ్ల వైద్యుడు షాజహాన్ నుంచి పొందిన ప్రాంతంలో జాబ్ చార్నక్ 'పోర్టు విలియం కోట'ను నిర్మించాడు (1699).
* ఆంగ్లేయులు మొగలుల నుంచి సుతనుతి, కాశీఘట్టం, గోవింద్‌పూర్ గ్రామాలను పొంది, వాటిని కలకత్తా నగరంగా అభివృద్ధి చేశారు.
* కడలూరు (తమిళనాడు)లో సెయింట్ డేవిడ్ కోటను నిర్మించారు.
* ఆంగ్లేయులు 1682లో విశాఖపట్నంలో తమ వర్తక స్థావరాన్ని స్థాపించారు.
* 1717లో విలియం హామిల్టన్ అనే ఆంగ్ల వైద్యుడు మొగల్ చక్రవర్తి అయిన ఫరూక్ షియర్ వ్యాధిని నయంచేసి, గోల్డెన్ ఫర్మానా ద్వారా అనేక రాయితీలు పొందాడు.
* జెరాల్డ్ ఆంగియర్ అనే ఆంగ్లేయుడు బొంబాయిని గొప్ప వాణిజ్య కేంద్రంగా మార్చాడు.
* భారతదేశంలో ఆంగ్లేయులు మద్రాస్‌లోని సెయింట్ జార్జికోటను తమ ప్రధాన వర్తక కేంద్రంగా చేసుకున్నారు.

 

ఫ్రెంచివారు (ఫ్రాన్స్)
* 1656లో బెర్నియార్ అనే ఫ్రెంచి యాత్రికుడు ఔరంగజేబ్ రాజ్యాన్ని, ట్రావెర్నియర్ అనే ఫ్రెంచి యాత్రికుడు గోల్కొండ రాజ్యాన్ని సందర్శించారు.
* ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి కోల్బర్ట్ 1664లో 14వ లూయీ అనుమతితో ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించాడు.
* 1668లో ఫ్రాంకోయిస్ కరోన్ అనే వ్యక్తి ఔరంగజేబ్ అనుమతితో సూరత్‌లో తొలి వర్తక స్థావరాన్ని స్థాపించాడు.
* 1669లో ఫ్రెంచివారు మచిలీపట్నంలో తమ వర్తక స్థావరాన్ని స్థాపించారు.
* ఫ్రాంకోయిస్ మార్టిన్ అనే అధికారి వాలి కొండాపురం ప్రాంతాన్ని పొంది అక్కడ పుదుచ్చేరి/పాండిచ్చేరి నగరాన్ని నిర్మించాడు.
* భారతదేశంలో ఫ్రెంచివారి ప్రధాన వర్తక స్థావరం పుదుచ్చేరి/పాండిచ్చేరి.
* ఫ్రెంచివారు షయిస్తాఖాన్ నుంచి పొందిన బాలాసోర్, కాశింబజార్, చంద్రనగర్ ప్రాంతాల్లో ఫ్యాక్టరీలను నిర్మించారు.
* భారతదేశంలో ఫ్రెంచి ప్రతినిధులుగా లె నోయిర్, డ్యూమాస్, డూప్లే లాంటి వ్యక్తులు పనిచేశారు.
* లె నోయిర్ మాహె, యానాం (1729) ప్రాంతాల్లో వర్తక స్థావరాలను స్థాపించాడు.
* డ్యూమాస్ మొగల్ చక్రవర్తి నుంచి 'నవాబ్' అనే బిరుదును పొందాడు.
* డూప్లే భారతదేశంలో ఫ్రెంచి వలస రాజ్య నిర్మాతగా పేరుపొందాడు.
* కానీ ఆంగ్లేయులు కర్ణాటక యుద్ధాల్లో ఫ్రెంచివారిని ఓడించి భారతదేశాన్ని ఆక్రమించారు.
* ఫ్రెంచివారి అధీనంలో ఉన్న యానాం, పాండిచ్చేరి ప్రాంతాలను భారత ప్రభుత్వం 1956లో ఆక్రమించుకుంది.

Posted Date : 14-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌