• facebook
  • whatsapp
  • telegram

భారత వ్యవసాయం

వ్యవసాయ విధానాలు 

ప్రస్తుతం మనదేశంలో జీవనాధార, వాణిజ్య వ్యవసాయాలు చేస్తున్నారు.


జీవనధార వ్యవసాయం: ఇందులో రెండు రకాల వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి. 

అవి: 1. సాధారణ జీవనాధార వ్యవసాయం 

         2. సాంద్ర జీవనాధార వ్యవసాయం


సాధారణ జీవనాధార వ్యవసాయం: 

* ఇది చిన్న కమతాల్లో, పురాతన పనిముట్లతో కుటుంబానికి మాత్రమే పరిమితమైన పద్ధతి. దీన్నే ‘నరుకు - కాల్చు’, ‘పోడు వ్యవసాయం’ అని కూడా అంటారు.

 ఈ రకమైన వ్యవసాయ విధానంతో పంటల పెరుగుదల రుతుపవనాలు, భూమిలోని పోషక పదార్థాలు, అనుకూలమైన పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

సాధారణ జీవనాధార వ్యవసాయాన్ని ‘రుతుపవన వ్యవసాయం’ అని కూడా అంటారు.


సాంద్ర జీవనాధార వ్యవసాయం: 

 అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో ఈ రకమైన  వ్యవసాయం అమల్లో ఉంది. ఈ విధానానికి అధిక మొత్తంలో శ్రామికులు అవసరం.

 ఇది అత్యధిక జీవ రసాయన ఎరువులు, నీటి పారుదలను ఉపయోగించుకుని అధిక దిగుబడిని సాధించే వ్యవసాయ విధానం.

    వాణిజ్య వ్యవసాయం 

 అధిక దిగుబడి కోసం ఆధునిక ఉత్పాదకాలను విరివిగా ఉపయోగించడం దీని ప్రధాన లక్షణం. 

 దీని విస్తృతి ప్రాంతాన్ని బట్టి మారుతుంది.

ఉదా: పంజాబ్, హరియాణాలో వరి వాణిజ్య పంట కాగా, ఒడిశాలో జీవనాధార పంట.

తోటపంటల సాగు కూడా ఒక రకమైన వాణిజ్య వ్యవసాయం. ఈ విధానంలో ఒకే పంటను ఎక్కవ విస్తీర్ణంలో పండిస్తారు.


కమతం 

ఒక పంట కాలంలో ఒక రైతు సాగుచేసే భూ విస్తీర్ణాన్ని కమతం అంటారు.

 చిన్న కమతాలను కలిగి ఉండటం భారతీయ వ్యవసాయ రంగం ప్రధాన లక్షణం.


రైతులు - రకాలు

ఉపాంత రైతులు: 2.5 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన వారు.

చిన్నకారు రైతులు: 2.6 నుంచి 5 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన వారు.

సన్నకారు రైతులు: 5.1 నుంచి 10 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన వారు.

మధ్య తరహా రైతులు: 10.1 నుంచి 25 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన వారు.

పెద్ద రైతులు: 25 ఎకరాల కంటే ఎక్కువ సాగుభూమి కలిగిన వారు.

భూమిని కొలవడానికి హెక్టారును ప్రామాణిక కొలమానంగా ఉపయోగిస్తారు.

ఒక హెక్టారు అంటే రెండున్నర ఎకరాలు ్బ10,000 చదరపు మీటర్ల భూమి).

భారతదేశంలో 9.24 కోట్ల ఉపాంత రైతులు, 2.47 కోట్ల చిన్న రైతులు, 1.38 కోట్ల సన్నకారు రైతులు, 10 లక్షల మంది పెద్ద రైతులు ఉన్నారు.


అంతర పంటలు 

ఏదైనా ప్రాంతంలో ఏక కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని అంతర పంటలు అంటారు.

కందులు, మినుములు, పెసలు, పప్పు ధాన్యాలను ప్రధానంగా మనదేశంలో అంతర పంటలుగా పండిస్తారు.

తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో సైతం పప్పుధాన్యాలను పండిస్తారు.

ఈ మొక్కలన్నీ లెగ్యుమినేసీ కుటుంబానికి చెందినవి. ఇవి వాతావరణం నుంచి నత్రజనిని గ్రహించి, నేలలో ప్రతిస్థాపన చేసి, భూసారాన్ని పెంచుతాయి.

భారతదేశంలో మధ్యప్రదేశ్, ఉత్తర్‌ ప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటకలో పప్పుధాన్యాలను ప్రధానంగా పండిస్తారు.


     మిశ్రమ వ్యవసాయం 

వ్యవసాయం, పశుగణాభివృద్ధి రెండూ సమాన స్థాయిలో అభివృద్ధి చెందడాన్ని మిశ్రమ వ్యవసాయం అంటారు.

శ్వేత విప్లవం కారణంగా పశుగణాభివృద్ధి రంగంలో అనేక మార్పులు జరిగాయి. 

పాల ఉత్పత్తి పెరిగి, రైతుల ఆదాయం కూడా అధికమైంది.

మేలి రకపు సంకరజాతి వృద్ధి, మేలైన మేత సరఫరా, పశువ్యాధుల నివారణ, డెయిరీ - కోళ్ల ఫారాలు, మాంసం - ఉన్ని - తోళ్ల పరిశ్రమ అభివృద్ధి లాంటి నవీన పద్ధతుల ద్వారా పశుగణ నిర్వహణాభివృద్ధి  సాధ్యమవుతుంది.


      ఎరువులు

సేంద్రియ ఎరువులు: 

సేంద్రియ ఎరువు, పెంటకుప్పలో హ్యూమస్, సూక్ష్మ జీవులు ఉంటాయి.

 హ్యూమస్‌ ఏర్పడే ప్రక్రియతో ఖనిజాలు మెల్లగా అందుబాటులోకి వస్తాయి.


   రసాయనిక ఎరువులు:

నత్రజని, భాస్వరం, పొటాషియం లాంటి ఖనిజాలు నీటిలో కరుగుతాయి. వీటిని మొక్కలు త్వరగా గ్రహిస్తాయి. కానీ ఇవి నేలలో ఎక్కువ కాలం అందుబాటులో ఉండవు.

ఇవి మట్టిలో నుంచి నీటి ద్వారా లోపలి పొరకు ఇంకి, భూగర్భ జలాలు, నదులు, చెరువులను కలుషితం చేస్తాయి.

రసాయన ఎరువులు నేలలోని బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను చంపేస్తాయి.

ఇవి వాడటం మొదలు పెట్టినప్పటి నుంచి కొంతకాలానికి నెమ్మదిగా నేల తన సారాన్ని కోల్పోతుంది.

హరిత విప్లవం వల్ల అనేక ప్రాంతాల్లో భూముల సారం తగ్గి, రైతుల ఖర్చు పెరిగింది.


   పంచగవ్య (సేంద్రియ ఎరువు): 

ఇది ద్రవ రూపంలో ఉంటుంది.

ఆవు మూత్రం, పేడ, పాలు, నెయి; అరటి పండ్లు; కొబ్బరి నీళ్లు; బెల్లం; నీరు కలిపి పంచగవ్యను తయారు చేస్తారు.


శ్వేత విప్లవం

వివిధ అభివృద్ధి పథకాల ద్వారా దేశంలో పాల ఉత్పత్తిని పెంచడమే శ్వేత విప్లవం ప్రధాన లక్ష్యం.

1970లో జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డు Operation Flood Project ని ప్రారంభించింది. ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పాడి పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమం. దీని ద్వారా దేశంలో పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 

ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం పాల ఉత్పతిదారులను నగర వినియోగదారులతో కలపడం.

కోళ్ల ఫారాల్లో గుడ్ల కోసం లేయర్లను, మాంసం కోసం బ్రాయిలర్‌లను పెంచుతారు.


హరిత విప్లవం

ఆధునిక వైజ్ఞానిక విధానం ద్వారా వ్యవసాయ పద్ధతులు, ఉత్పత్తి  వ్యవస్థలో నూతన నిర్దేశాలను తీసుకొచ్చి, వ్యవసాయ సౌకర్యాన్ని సాధించడమే హరిత విప్లవం ప్రధాన లక్ష్యం. 

పంటల ఉత్పత్తి పెంచేందుకు అధిక దిగుబడి ఇచ్చే రకాలను అభివృద్ధి చేయాలి. దీని కోసం నిర్దిష్టమైన పంట మొక్కలను పెంచడం, అభివృద్ధి చేయడమే హరిత విప్లవం.

ఆహార కొరత, ఆకలి, పౌష్టికాహార లోపాలు లాంటి సమస్యలను అధిగమించడం ద్వారా దేశంలో వ్యవసాయ రంగంలో స్థూలంగా మార్పు తీసుకురావడం దీన్ని ఉద్దేశం. 

భారతదేశంలో హరిత విప్లవాన్ని మొదట 1960లో చిరుధాన్యాలపై 196364లో గోధుమ పంట; 1965లో వరి పంటపై ప్రయోగించారు.

హరిత విప్లవం వల్ల ఎక్కువ ప్రయోజనం (ఎక్కువ దిగుబడి) పొందిన పంట గోధుమ.

196566లో ఖరీప్‌ పంటకాలంలో సంకర వ్యవసాయాన్ని పూర్తిగా అమలు చేశారు.

భారతదేశంలో హరితవిప్లవ పితామహుడిగా ఎం.ఎస్‌.స్వామినాథన్‌ను పేర్కొంటారు.

మనదేశంలో హరిత విప్లవాన్ని మొదటగా పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తర్‌ ప్రదేశ్‌లో ప్రవేశపెట్టారు.

హరితవిప్లవం వల్ల అధిక దిగుబడి సాధించిన రాష్ట్రం పంజాబ్‌.


హరితవిప్లవ ప్రభావం

 ఆహార ధాన్యాల విషయంలో దేశం స్వయం సమృద్ధిని సాధించింది. దీంతో  ఇతర దేశాల నుంచి ఆహర ధాన్యాల దిగుమతి తగ్గింది.

ప్రస్తుతం భారతదేశ దిగుమతుల్లో ఆహార ధాన్యాల వాటా 3%.

 మొత్తం ప్రపంచ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 1/10వంతు మనదేశంలో ఉత్పత్తి అవుతున్నాయి.

 హరిత విప్లవం కారణంగా పర్యావరణం తీవ్రంగా ప్రభావిమైంది.

 ఇందులో క్రిమిసంహార మందులను విరివిగా ఉపయోగించడం వల్ల భూగర్భ జలాలు కలుషితం అయ్యాయి.

 పంజాబ్‌లోని 12 జిల్లాల్లో 9 భూగర్భ జల సమస్యలను ఎదుర్కొంటున్నాయి.


 పంట కాలాలు 


భారతదేశంలో మూడు పంట కాలాలు ఉన్నాయి. అవి:

1) ఖరీఫ్‌   2) రబీ  3) జయాద్‌


ఖరీఫ్‌ పంట కాలం: నైరుతి రుతుపవనాల రాకతో దాదాపు దేశమంతా ఖరీఫ్‌ కాలం ప్రారంభమవుతుంది.

సెప్టెంబరు నుంచి అక్టోబరు మధ్య కాలంలో పంట కోతలు ప్రారంభమవుతాయి.

ఈ కాలంలో ప్రధాన పంటగా వరి సాగు చేస్తారు.


రబీ కాలం: దీన్ని శీతాకాల పంట కాలం అని కూడా అంటారు.

మధ్యధరా సముద్రం నుంచి వీచే పశ్చిమ విక్షోభాల వల్ల శీతాకాలంలో వర్షం కురుస్తుంది. ఇది రబీ పంటలకు అత్యంత ఉపయోగకరం.

ఈ పంటను అక్టోబరు నుంచి డిసెంబరు మధ్యలో సాగుచేస్తారు. ఏప్రిల్‌ - జూన్‌ మధ్యలో పంట కోతలు ప్రారంభమవుతాయి.

హరిత విప్లవం రబీ పంటల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడింది.

రబీ కాలంలో గోధుమ పంటను ఎక్కువగా సాగుచేస్తారు. గోధుమను శీతాకాల పంట అని కూడా అంటారు.


జయాద్‌ కాలం : ఖరీఫ్, రబీ పంట కాలాల మధ్య స్వల్ప వ్యవధి గల పంట రుతువును జయాద్‌ అంటారు.

దీన్నే వేసవి పంట కాలం అని కూడా అంటారు.

పుచ్చకాయలు, కర్బూజ, దోసకాయ, కూరగాయలు, పశువుల మేత మొదలైన వాటిని జయాద్‌ కాలంలో పండిస్తారు.

Posted Date : 04-03-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు