• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ చరిత్ర

సుల్తాన్‌గా కుతుబుద్దీన్‌ ఐబక్‌


హసన్‌ నిజామీ తన ‘తజుల్‌ మాసిర్‌’ గ్రంథంలో మహమ్మద్‌ ఘోరీ భారతదేశంలో జయించిన ప్రాంతాలకు కుతుబుద్దీన్‌ ఐబక్‌ను రాజప్రతినిధిగా నియమించాడని తెలిపాడు. ఫఖిర్‌-ఐ-ముదబ్బిర్‌ అనే చరిత్రకారుడు కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నాడు. 

కేఏ నిజామీ అనే చరిత్రకారుడు ‘‘కుతుబుద్దీన్‌ ఘోరీ వారసుడు కాదు. కేవలం రాజప్రతినిధి మాత్రమే. ఘోరీ మరణించాక కుతుబుద్దీన్‌ ఐబక్, తాజ్‌-అల్‌-దిన్‌-యాల్దజ్, నసీరుద్దీన్‌ కబచా మధ్య అధికారం కోసం ప్రయత్నాలు జరిగాయి.’’ అని పేర్కొన్నాడు.

ఘోరీ మరణించే సమయానికి కుతుబుద్దీన్‌ ఢిల్లీలో ఉన్నాడు. అక్కడి నుంచే అధికార కార్యక్రమాలు, పాలన జరిగేది. ఘోరీ చనిపోయాక లాహోర్‌ ప్రజలు కుతుబుద్దీన్‌ను తమ పాలకుడిగా ఉండమని అభ్యర్థించారు. దీంతో అతడు తన పాలనను లాహోర్‌కు మార్చాడు. 

కుతుబుద్దీన్‌ క్రీ.శ. 1206 జూన్‌ 25న అనధికారికంగా సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడికి క్రీ.శ. 1208-09లో సార్వభౌమాధికారం లభించింది.

దశలు: కుతుబుద్దీన్‌ ఐబక్‌ రాజ్యాధికారాన్ని పొందడాన్ని చరిత్రకారులు మూడు దశలుగా విభజించారు. అవి:

1. క్రీ.శ 1192-1206 వరకు ఉత్తర భారతదేశంలో ఘోరీ మహమ్మద్‌ గెలుపొందిన భూభాగాలకు రాజప్రతినిధిగా వ్యవహరించడం.

2. క్రీ.శ 1206- 1208 మధ్య ఢిల్లీ, లాహోర్, ఇతర భూభాగాలకు అనధికార సార్వభౌమాధికారిగా ఉండటం.

3. క్రీ.శ 1208-1210 వరకు ఢిల్లీని రాజధానిగా చేసుకుని భారతదేశాన్ని పాలించడం. 

క్రీ.శ 1206లోనే కుతుబుద్దీన్‌ తనను తాను సుల్తాన్‌గా ప్రకటించుకున్నాడని కొంతమంది చరిత్రకారుల వాదన.


కుతుబుద్దీన్‌ మరణం

కుతుబుద్దీన్‌ భారతదేశ సుల్తాన్‌గా గుర్తింపు పొందాక కొత్తగా దండయాత్రలు చేయలేదు. తాను జయించిన భూభాగాల పటిష్టం చేయడానికి ప్రయత్నించాడు.

ఇతడు క్రీ.శ. 1210లో లాహోర్‌లో చౌగాన్‌ (పోలో) ఆడుతూ గుర్రంపై నుంచి పడి మరణించాడు. 

కట్టడాలు - నిర్మాణాలు 

భారతదేశంలోని ముస్లిం పాలనకు గుర్తుగా కుతుబుద్దీన్‌ ఢిల్లీలో కుతుబ్‌ మినార్‌ నిర్మాణాన్ని ప్రారంభించాడు. దీన్ని అతడి అల్లుడైన ఇల్‌టుట్‌మిష్‌ పూర్తిచేశాడు. 

ఢిల్లీలో కువ్వత్‌-ఉల్‌-ఇస్లాం మసీదును, అజ్మీర్‌లో అర్హదిన్‌ కాం జొంష్టా మసీదును నిర్మించాడు. 

కుతుబుద్దీన్‌ సమాధి లాహోర్‌లోని ‘అనార్కలి’ బజార్‌లో ఉంది. దీన్ని 1970లో పునరుద్ధరించారు. 

ప్రముఖులు ఇచ్చిన బిరుదు లు

 ‘‘కుతుబుద్దీన్‌ ఐబక్‌కు దాతృత్వం ఎక్కువ. అందుకే అతడు ‘లాక్‌బక్ష్’ (లక్షలు ఇచ్చేవాడు) అనే బిరుదు పొందాడు.’’  - మిన్హాస్‌ సిరాజ్‌.

 ‘‘కుతుబుద్దీన్‌ గొప్ప విజయాలు సాధించిన మంచి మనిషి’’ - అబుల్‌ ఫజల్‌ 

‘‘ఉదారమైన వ్యక్తులను వర్ణించడానికి ఐబక్‌ పదం ఉపయోగపడుతుంది.’’ - పెరిష్టా 

తూర్పు భారతదేశంలో ఘోరీ సామ్రాజ్యం

మహమ్మద్‌ ఘోరీ సైనిక జనరల్‌ భక్తియార్‌ ఖిల్జీ తూర్పు భారతదేశంలోని ప్రధాన ప్రాంతాలైన బిహార్, బెంగాల్‌ను ఆక్రమించాడు. ఇతడికి అలీ మర్దాన్‌ ఖిల్జీ, మహమ్మద్‌ షిరాన్‌ ఖిల్జీలు సహాయకులుగా ఉండేవారు. 

 భక్తియార్‌ ఖిల్జీని క్రీ.శ.1206లో దేవ్‌కోట్‌లో మర్దాన్‌ ఖిల్జీ హత్య చేశాడు. అదే సమయంలో మహమ్మద్‌ ఘోరీ కూడా మరణించాడు. 

తర్వాతి కాలంలో అలీ మర్దాన్‌ ఖిల్జీ, మహమ్మద్‌ షిరాన్‌ ఖిల్జీ మధ్య రాజ్యపాలన విషయంలో వారసత్వ వివాదం చెలరేగింది. అలీ మర్దాన్‌ను బంధించిన మహమ్మద్‌ షిరాన్‌ ఖిల్జీ తూర్పు భారతదేశంలోని ఘోరీ ప్రాంతాలకు తనను తాను నాయకుడిగా ప్రకటించుకున్నాడు.

అలీ మర్దాన్‌ అక్కడి నుంచి ఢిల్లీ పారిపోయి, కుతుబుద్దీన్‌ ఐబక్‌ను కలిసి భక్తియార్‌ ఖిల్జీ సహాయకులందరికీ న్యాయం చేయాలని కోరాడు.

కుతుబుద్దీన్‌ ఐబక్‌ అవధ్‌ గవర్నర్‌గా కైమాజ్‌ రుమీని నియమించి, దేవ్‌కోట్‌ (బెంగాల్‌) ఇక్తాను హసాముద్దీన్‌ ఇవాజ్‌ ఖిల్జీకి అప్పగించాడు. దీన్ని మహమ్మద్‌ షిరాన్, ఇతర అమీర్‌లు వ్యతిరేకించి, అతడితో యుద్ధం చేశారు. ఇందులో కుతుబుద్దీన్‌ విజయం సాధించాడు. 

తర్వాత కుతుబుద్దీన్‌ లఖ్‌నౌతిని అలీ మర్దాన్‌కి అప్పగించాడు.


రాజ్యపాలన


ఘోరీ బానిసలు అతడు ఆక్రమించిన భూభాగాలపై నియంత్రణ కోసం కుతుబుద్దీన్‌తో పోరాడారు. ఆ యుద్ధాల్లో కుతుబుద్దీన్‌ మేనల్లుడు ఘియాజుద్దీన్‌ మహమ్మద్‌ అతడికి సాయం చేశాడు. 

కుతుబుద్దీన్‌కు అమీర్‌లు, తురుష్క అధికారులు - సేనాధిపతులు మద్దతు తెలిపారు. ఇతడు తన అధికారాన్ని స్థిరం చేసుకోవడానికి వివాహ సంబంధాలను ఆశ్రయించాడు. సింధ్‌ పాలకుడు నసీరుద్దీన్‌ కబచా (ముల్తాన్‌ గవర్నర్‌)కు తన కూతుర్ని ఇచ్చి వివాహం చేశాడు. మరో కూతుర్ని తన వద్ద పనిచేసే ఇల్‌టుట్‌మిష్‌కి ఇచ్చి పెళ్లి జరిపించాడు. కుతుబుద్దీన్‌ గజనీ పాలకుడైన తాజుద్దీన్‌ యాల్దజ్‌ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. 

ఇతడు సుల్తాన్‌ అయినప్పటి నుంచి రాజపుత్రులు, తన బంధువులతోనే అనేక యుద్ధాలు చేయాల్సి వచ్చింది. రాజపుత్రులు కలంజర్‌ కోటను ఆక్రమించుకున్నారు. గహద్వాల నాయకుడు హరిశ్చంద్రుడు లూథెన్, ఫరూకాబాద్‌ను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. పార్థియన్లు గ్వాలియర్‌ను ఆక్రమించగా, అలీ మర్దాన్‌ బెంగాల్‌లో స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు. 

కుతుబుద్దీన్‌ బంధువులైన తాజుద్దీన్‌ యాల్దజ్, నసీరుద్దీన్‌ కబచా కూడా ఢిల్లీ ఆక్రమణకు ప్రయత్నించారు. కుతుబుద్దీన్‌ బెంగాల్‌పై దాడిచేసి దాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. వాయవ్య భారతదేశంపై దాడిచేసి చిన్న చిన్న తిరుగుబాట్లను అణచివేశాడు. యాల్దజ్‌ను ఓడించి గజనీని ఆక్రమించాడు. తర్వాతి కాలంలో యాల్దజ్‌ మళ్లీ గజినీని తన అధీనంలోకి తీసుకున్నాడు.

కుతుబుద్దీన్‌కి క్రీ.శ. 1208-09లో భారతదేశ సుల్తాన్‌గా గుర్తింపు లభించినట్లు చరిత్రకారుల భావన.

ఇతర విషయాలు

కుతుబుద్దీన్‌ సాహిత్య పోషకుడు. ఇతడి ఆస్థానంలో హసన్‌ నిజామీ, ఫక్రుద్దీన్‌ అనే పండితులు ఉండేవారు.  ఇతడు విగ్రహారాధనను వ్యతిరేకించి, అనేక కట్టడాలను మసీదులుగా మార్చాడు. 

అతడి సైన్యంలో హిందువులు కూడా ఉండేవారు. ముఖ్యంగా ‘రాణాలు’, ‘ఠాకూర్లు’. 

ఫక్రి ముదాబ్బిర్‌ తాను రాసిన ‘అదాబ్‌-అల్‌-హర్బ్‌’ అనే వంశావళి పుస్తకాన్ని కుతుబుద్దీన్‌కు అంకితం చేశాడు. 

హసన్‌ నిజామీ ‘తాజుల్‌-మాసిర్‌’ అనే గ్రంథాన్ని కుతుబుద్దీన్‌ ఐబక్‌ పాలనలో ప్రారంభించగా, ఇల్‌టుట్‌మిష్‌ కాలంలో పూర్తైంది. 

ఇతడి తర్వాత ఆరాంషా ఢిల్లీ సుల్తాన్‌ అయ్యాడు. 


  ఆరాంషా

కుతుబుద్దీన్‌ మరణించాక లాహోర్‌లోని టర్కీ అధికారులైన మాలిక్‌లు, అమీర్‌లు ఆరాంషాను అతడి వారసుడిగా నియమించారు. ఇతడు కేవలం 8 నెలలు రాజ్యపాలన చేశాడు. ఇతడి కాలంలో వివిధ రాష్ట్రాల గవర్నర్లు స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. 

కుతుబుద్దీన్‌ తన అల్లుడైన ఇల్‌టుట్‌మిష్‌కి బదౌన్‌ ఇక్తాను కానుకగా ఇచ్చాడు. ఇతడి తర్వాత రాజ్యాధికారం వారసుడైన ఇల్‌టుట్‌మిష్‌కి దక్కాలని కొంతమంది టర్కీ అధికారులు భావించారు. ఇదే విషయాన్ని వారు ఇల్‌టుట్‌మిష్‌కి తెలిపారు.

దీంతో వారిద్దరి మధ్య వారసత్వ తగాదా ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఇల్‌టుట్‌మిష్‌ ఆరాంషాను ఓడించి, చంపాడు. అదే సమయంలో కొంతమంది ఇల్‌టుట్‌మిష్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయగా, వారిని అతడు అణచివేశాడు. 


ముఖ్యాంశాలు


సుల్తాన్‌          రాజు లేదా చక్రవర్తి

ఇక్తాలు          సైనిక రాష్ట్రాలు

టంకా         వెండి నాణెం

జిటాల్‌          రాగి నాణెం

అమిర్‌-ఎ-అఖార్‌      అశ్వదళాధిపతి

ఐబక్‌          చంద్రుడికి ప్రభువు

ఖలీఫా        ఇస్లాం మత పెద్ద

దివాన్‌-ఐ-విజారట్‌      సైనిక విభాగం


రచయిత

డాక్టర్‌ వి. రాజ్‌మహ్మద్‌

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 

Posted Date : 23-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌