• facebook
  • whatsapp
  • telegram

పరిశ్రమలు

పరిశ్రమ అనేది ఖనిజాల వెలికితీత, వస్తువుల ఉత్పత్తి లేదా సేవలను అందించే కార్యకలాపాలను సూచిస్తుంది.

*పూర్తిగా తయారైన వస్తువు దాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన ముడిపదార్థం కంటే అధిక విలువను, ప్రయోజనాన్ని పొందుతుంది.


ఉత్పాదక ప్రక్రియ(Manufacturing): ఒక ముడిపదార్థం పలు రూపాల్లోకి మారి చివరికి వస్తువుగా మారే ప్రక్రియే ఉత్పాదక ప్రక్రియ.

* ముడిపదార్థాలను ద్వితీయ కార్యకలాపాలు లేదా తయారీ ప్రక్రియ ద్వారా ప్రజలకు అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మారుస్తారు.

ఉదా: ముడి పత్తిని దారంగా మార్చి, దారానికి రంగులద్ది వస్త్రంగా మార్చడం.


పరిశ్రమల వర్గీకరణ

పరిశ్రమలను ముడిపదార్థాలు, పరిమాణం, వాటి యాజమాన్యం ఆధారంగా వర్గీకరిస్తారు.


ముడిపదార్థాల ఆధారంగా పరిశ్రమల వర్గీకరణ 

పరిశ్రమల్లో ఉపయోగించే ముడిపదార్థాలను బట్టి పరిశ్రమలను 4 రకాలుగా వర్గీకరించవచ్చు.


* వ్యవసాయాధారిత పరిశ్రమలు(Agro Based Industries) : మొక్కలు, జంతు ఉత్పత్తులను ముడిపదార్థాలుగా ఉపయోగించే పరిశ్రమ. ఉదా: ఆహారోత్పత్తులు, కూరగాయలు, వంట నూనె, పత్తి వస్త్రాలు, పాల ఉత్పత్తులు, తోళ్ల పరిశ్రమలు.


* ఖనిజాధార పరిశ్రమ(Mineral BasedIndustries):  ఖనిజ ధాతువును ముడిపదార్థంగా ఉపయోగించే ప్రాథమిక పరిశ్రమలు. ఈ పరిశ్రమ ఉత్పత్తులను ఇతర పరిశ్రమలు ముడిపదార్థాలుగా ఉపయోగిస్తాయి.


* అటవీ ఆధారిత పరిశ్రమలు(Forest Based Industries) : అటవీ ఉత్పత్తులను ముడిసరకుగా ఉపయోగించే పరిశ్రమలను అటవీ ఆధార పరిశ్రమలు అంటారు.


* సముద్ర ఆధారిత పరిశ్రమలు (Ocean Based Industries):  మహాసముద్రాలు, సముద్రాల నుంచి లభించే ఉత్పత్తులను ముడిపదార్థాలుగా ఉపయోగించే పరిశ్రమలు.

ఉదా: సముద్ర ఆహార శుద్ధి పరిశ్రమలు, చేపనూనె తయారీ పరిశ్రమ. 


పరిమాణం ఆధారంగా పరిశ్రమల వర్గీకరణ

పరిశ్రమ పరిమాణం పెట్టుబడి మూలధనం, ఉపాధి పొందిన వ్యక్తుల సంఖ్య, ఉత్పత్తి పరిమాణాన్ని సూచిస్తుంది. పరిమాణం ఆధారంగా పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలుగా విభజించారు.

*చిన్న తరహా పరిశ్రమలు: ఈ పరిశ్రమల్లో ఉత్పత్తులను చేతివృత్తులవారు స్వయంగా తయారు చేస్తారు. ఇందులో తక్కువ మూలధనం, సాంకేతికతను ఉపయోగిస్తారు.

ఉదా: బుట్టలు అల్లడం, కుండలు చేయడం, హస్తకళలు, పట్టు వస్త్రపరిశ్రమ, ఆహార శుద్ధి పరిశ్రమ.


* భారీ పరిశ్రమలు: ఈ తరహా పరిశ్రమల్లో ఎక్కువ  మూలధనం, సాంకేతికతను ఉపయోగిస్తారు. 

ఉదా: ఆటోమొబైల్స్, భారీ యంత్ర పరికరాల ఉత్పత్తులు.


యాజమాన్యం ఆధారంగా పరిశ్రమల వర్గీకరణ

* ప్రైవేట్‌రంగ పరిశ్రమలు(Private Sector Industries): ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహంగల  యాజమాన్యంలో నిర్వహించే పరిశ్రమలు.

* ప్రభుత్వరంగ పరిశ్రమలు(Public Sector Industries ): ఈ పరిశ్రమలు ప్రభుత్వ ఆధీనంలో కార్యకలాపాలు చేపడతాయి.

ఉదా: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా

* ఉమ్మడిరంగ పరిశ్రమలు(Joint Sector Industries): ప్రభుత్వంతో పాటు, ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహంతో కూడిన యాజమాన్యంలోని పరిశ్రమలను ‘ఉమ్మడిరంగ పరిశ్రమలు’ అంటారు.

ఉదా:  మారుతీ ఉద్యోగ్‌ లిమిటెడ్‌

* సహకారరంగ పరిశ్రమలు(Co-operative sector industries): ముడిసరకు ఉత్పత్తిదారులు లేదా సరఫరాదారులు, కార్మికులు లేదా ఇరువురి యాజమాన్యంలో నడిచే పరిశ్రమలను సహకారరంగ పరిశ్రమలు అంటారు.

ఉదా: ఆనంద్‌ మిల్క్‌ యూనియన్‌ లిమిటెడ్‌(AMUL) డెయిరీ


అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు: "Sunrise Industries"  అని కూడా అంటారు. ఏ పరిశ్రమలైతే బాగా అభివృద్ధి చెందుతున్నాయో అవి ఈ వ్యవస్థ కిందికి వస్తాయి.

ఉదా: సమాచార సాంకేతిక రంగం, ఆరోగ్య రంగం, ఆతిథ్య రంగం, వైజ్ఞానిక రంగం.

* ముడిపదార్థాలు ప్రాథమికంగా వస్తువుల ఉత్పత్తి లేదా తయారీలో ఉపయోగించే పదార్థాలు.

ఉదా: పత్తి, సహజ వాయువు, ఉక్కు, చమురు, కలప మొదలైనవి.

* ఉత్పాదకతలో ముడి పదార్థాలు, కార్మికులు, భూమి వెల, రవాణా, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలు ఉంటాయి.

* ముడిపదార్థాలను ఉత్పత్తులుగా మార్చే విస్తృత కార్యకలాపాలు ఉత్పాదకత అనే ప్రక్రియలో జరుగుతాయి. అంతిమంగా తయారైన తుది ఉత్పత్తి నుంచి ఆదాయం లభిస్తుంది.

* పత్తి నుంచి గింజలు వేరుచేయడం, నూలు వడకడం, నేయడం, రంగువేయడం, అద్దకాలు ఉత్పాదకత ప్రక్రియలో భాగాలు.


భారతదేశంలో ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు

1) గుర్గావ్‌ - దిల్లీ - మీరట్‌ ప్రాంతం    2) అహ్మదాబాద్‌ - బరోడా ప్రాంతం

3) ముంబయి - పుణె క్లస్టర్‌     4) బెంగళూరు - తమిళనాడు ప్రాంతం

5) కొల్లం - తిరువనంతపురం  6) చోటానాగ్‌పుర్‌        

7) హుగ్లీ ప్రాంతం


   ప్రధాన పరిశ్రమల పంపిణీ

* వస్త్రపరిశ్రమ, ఇనుము-ఉక్కు పరిశ్రమ, సమాచార సాంకేతిక పరిశ్రమలను ప్రపంచంలో ప్రధాన పరిశ్రమలుగా పేర్కొంటారు.

*సమాచార సాంకేతిక పరిశ్రమ నూతనంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ కాగా వస్త్రపరిశ్రమ, ఇనుము-ఉక్కు పరిశ్రమ పురాతన పరిశ్రమలు.

పరిశ్రమ పేరు కేంద్రీకృతం/పంపిణీ
 ఇనుము-ఉక్కు  పరిశ్రమ జర్మనీ, USA,, చైనా,  జపాన్, రష్యా
  వస్త్ర పరిశ్రమ  భారత్, హాంగ్‌కాంగ్, దక్షిణ కొరియా,   జపాన్, తైవాన్‌
 సమాచార  సాంకేతిక పరిశ్రమ   సిలికాన్‌ వ్యాలీ   (కాలిఫోర్నియా), బెంగళూరు.


ఇనుము-ఉక్కు పరిశ్రమ: ఇనుము ఉక్కు పరిశ్రమ వివిధ ఉత్పాదకాలు, ఉత్పత్తి ప్రక్రియలు, ఉత్పత్తులను కలిగి ఉంది.

* ఈ పరిశ్రమ ఇతర పరిశ్రమలకు అవసరమైన ముడిపదార్థాలను సరఫరా చేస్తుంది.

* ఈ పరిశ్రమ ఉత్పాదకతలో భాగంగా ముడిపదార్థాలుగా ముడి ఇనుము, బొగ్గు, సున్నపురాయి, శ్రమ, మూలధనం, భూమి, ఇతర మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తారు.

* ముడి ఇనుమును ఇనుప కొలిమిలో కరిగిస్తారు. ఆ తరువాత దీన్ని శుద్ధి చేస్తారు. ఇలా పొందిన ఉక్కును ఇతర పరిశ్రమల్లో ముడి పదార్ధంగా ఉపయోగిస్తారు.


ఉక్కు[Steel]: ఉక్కును ఆధునిక పరిశ్రమకు వెన్నెముకగా పిలుస్తారు.

* ఉక్కు కఠినమైనదే, అయినా దీన్ని సులభంగా కావాల్సిన ఆకృతిలో తయారు చేయవచ్చు, కత్తిరించవచ్చు, తీగలుగా మార్చవచ్చు.

* అల్యూమినియం, నికెల్, రాగి లాంటి లోహాలను కొంత మొత్తంలో జోడించి ఉక్కుకు సంబంధించిన ప్రత్యేక మిశ్రమ లోహాలను తయారు చేస్తారు. ఈ మిశ్రమ లోహాలు ఉక్కుకు గట్టిదనం, కాఠిన్యం, తుప్పును నిరోధించే సామర్థ్యాన్ని అందిస్తాయి.


   ఉక్కు - ఉపయోగాలు

* మనం ఉపయోగించే వస్తువులన్నీ దాదాపు ఇనుము లేదా ఉక్కు లేదా వాటి లోహాలతో తయారైన సాధనాలు, యంత్రాలతో రూపొందిస్తున్నవే.

* పడవలు, ట్రైన్లు, ట్రక్కులు, ఆటోలు లాంటివన్నీ అధికంగా ఉక్కుతోనే తయారు చేస్తారు.

* చమురు బావులను ఉక్కు యంత్రాలతో తవ్వుతారు. ఉక్కు పైపుల ద్వారా చమురును రవాణా చేస్తారు.

* వ్యవసాయ యంత్రాల తయారీలో, భారీ భవనాల నిర్మాణంలోనూ ఉక్కును ఉపయోగిస్తారు.

* క్రీ.శ. 1800లకు ముందు ముడిపదార్ధాలు, విద్యుత్‌ సరఫరా, జలరవాణా అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఇనుము ఉక్కు పరిశ్రమలు స్థాపించారు.

క్రీ.శ. 1800 నుంచి 1950 వరకు బొగ్గు క్షేత్రాలు, కాలువలు, రైల్వేకూడళ్లకు సమీపంలోని ప్రాంతాలు వీటి స్థాపనకు అనుకూలంగా మారాయి.

1950 తర్వాత పెద్ద ఎత్తున ఉక్కు ఉత్పత్తులు జరగడం, విదేశాల నుంచి ముడి ఇనుము దిగుమతికి అనుకులంగా ఉండటంతో నౌకాశ్రయాలకు దగ్గరగా ఉన్న చదునైన విశాల భూభాగాల్లో ఈ పరిశ్రమలు నెలకొల్పారు.


భారతదేశంలో ఇనుము-ఉక్కు పరిశ్రమలు

ముడిపదార్ధాలు, చౌకగా లభించే కార్మికులు, రవాణా, మార్కెట్‌ లాంటి అనుకూలతలను ఉపయోగించుకుంటూ భారత్‌లో ఇనుము-ఉక్కు పరిశ్రమ అభివృద్ధి చెందింది.

పరిశ్రమ పేరు స్థాపించిన సంవత్సరం రాష్ట్రం
టాటా ఇనుము-ఉక్కు కర్మాగారం   1907  ఝార్ఖండ్‌
బెర్హంపూర్‌ ఇనుము-ఉక్కుకర్మాగారం (IISCO)  1918 పశ్చిమ్‌బంగా
విశ్వేశ్వరయ్య ఇనుము-ఉక్కుకర్మాగారం(UISCO)  1923  కర్ణాటక
దుర్గాపూర్‌ ఇనుము-ఉక్కుకర్మాగారం     1959   పశ్చిమ్‌బంగా
రూర్కెలా ఇనుము-ఉక్కు కర్మాగారం 1959  ఒడిశా
భిలాయ్‌ ఇనుము-ఉక్కు కర్మాగారం 1959  చత్తీస్‌గఢ్‌
బొకారో ఇనుము- ఉక్కు కర్మాగారం 1964  ఝార్ఖండ్‌
విజయనగర్‌ ఉక్కు కర్మాగారం    1994   కర్ణాటక
విశాఖ ఉక్కు కర్మాగారం 1992 ఆంధ్రప్రదేశ్‌
సేలం ఇనుము-ఉక్కు కర్మాగారం    1981 తమిళనాడు

Posted Date : 17-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌