క్రీ.శ. 1206లో కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని స్థాపించాక బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశాలు దాదాపు మూడు శతాబ్దాల పాటు భారతదేశాన్ని పరిపాలించాయి. బానిస వంశం క్రీ.శ. 1290 వరకు పాలించింది. తర్వాత ఖీల్జీ వంశ పాలనను జలాలుద్దీన్ ఖీల్జీ ప్రారంభించాడు. ఖిల్జీ వంశ పాలకుల్లోనే కాకుండా ఢిల్లీ సుల్తానుల్లో గొప్పవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ.
జలాలుద్దీన్ ఖిల్జీ
ఈయన క్రీ.శ.1290లో చివరి బానిస వంశ పాలకుడైన కైకూబాద్‌ను తొలగించి ఖిల్జీ వంశ పాలనను ప్రారంభించాడు. అత్యంత వృద్ధుడైన దిల్లీ సుల్తాన్‌గా పేరుగాంచాడు. మాలిక్‌చజ్జూ లాంటి తిరుగుబాటుదారులను అణచి శాంతిభద్రతలను నెలకొల్పాడు. కానీ అనంతరకాలంలో తిరుగుబాట్లు చెలరేగాయి. జలాలుద్దీన్ ఖిల్జీ మంగోలు రాజు ఉలూగ్‌ఖాన్‌కు తన కుమార్తెనిచ్చి వివాహం జరిపించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీని కారా, మాణిక్‌పూర్ ప్రాంతాలకు గవర్నర్‌గా నియమించాడు. లొంగిపోయిన మంగోలులు ఇతడి కాలంలోనే ‘నయా ముస్లింలు’గా అవతరించారు. అల్లావుద్దీన్ ఖిల్జీ యాదవ రాజ్యంపై విజయం సాధించినందుకు అభినందించడానికి వెళుతుండగా జలాలుద్దీన్ ఖిల్జీ హత్యకు గురయ్యాడు.
అల్లావుద్దీన్ ఖిల్జీ (క్రీ.శ.1296 - 1316)
ఇతడి అసలు పేరు అలీ గుర్ష్షాస్ప్. జలాలుద్దీన్ కాలంలో ఇతడు ‘కారా’ ప్రాంత గవర్నర్‌గా పనిచేశాడు. 1293లో యాదవ రాజ్యంపై దాడిచేసి దాని పాలకుడైన రామచంద్ర దేవుడిని ఓడించి అపార ధనరాశులను కొల్లగొట్టాడు. తనను అభినందించడానికి వచ్చిన జలాలుద్దీన్ ఖిల్జీని హత్య చేయించి 1296లో ఢిల్లీ సుల్తానత్ పదవిని చేపట్టాడు. అనేక విజయాలు సాధించి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించడమే కాకుండా తన మార్కెట్, సైనిక, రెవెన్యూ సంస్కరణల ద్వారా ప్రసిద్ధి పొందాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ విజయాలను ఉత్తర భారతదేశ, దక్షిణ భారతదేశ దండయాత్రలుగా వివరించవచ్చు.
ఉత్తర భారతదేశ దండయాత్రలు
మొదట ఉత్తర భారతదేశంపై దండెత్తి గుజరాత్, రణతంభోర్, చిత్తోడ్, మాల్వా లాంటి అనేక రాజ్యాలను జయించాడు. 1297లో నస్రత్‌ఖాన్, ఉలూగ్‌ఖాన్ సేనానుల నాయకత్వంలో సైన్యాన్ని పంపి గుజరాత్ పాలకుడైన కర్ణదేవుడిని ఓడించాడు. కర్ణదేవుడు తన కుమార్తె దేవలదేవితో యాదవ రాజ్యానికి పారిపోగా, అతడి భార్య కమలాదేవిని అల్లావుద్దీన్ ఖిల్జీ తన భార్యగా చేసుకున్నాడు. ఈ గుజరాత్ దండయాత్ర నుంచే మాలిక్ కపూర్ అనే వ్యక్తిని తీసుకువచ్చాడు. క్రీ.శ.1298 - 1301 మధ్య రణతంభోర్ రాజ్యంపై దండెత్తి పాలకుడైన హంవీందేవుడిని ఓడించాడు. క్రీ.శ.1302 - 1303 మధ్య చిత్తోడ్ రాజ్యంపై దాడి చేశాడు. చిత్తోడ్ రాజు రాణా రతన్‌సింగ్ భార్య పద్మావతిని పొందాలనే ఉద్దేశంతో ఈ దండయాత్ర చేసినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. రతన్‌సింగ్ మరణించడంతో రాణి పద్మిని అంతఃపుర స్త్రీలతో కలిసి అగ్నిలోకి దూకి ఆత్మహత్య (జౌహార్) చేసుకుంది. ఈ మొత్తం కథను మాలిక్ మహమ్మద్ జయసి అనే కవి పద్మావత్ (పద్మదత్) అనే గ్రంథంగా రాశాడు. చిత్తోడ్‌ను ఆక్రమించిన అల్లావుద్దీన్ ఖిల్జీ దానికి ఖజీరాబాద్ అనే పేరు పెట్టాడు. 1305 నాటికి మాల్వా, ఉజ్జయిని, మాండు, ఛందేరి లాంటి రాజ్యాలను ఆక్రమించాడు.
దక్షిణ భారతదేశ దండయాత్రలు
అల్లావుద్దీన్ ఖిల్జీ తన సేనాని మాలిక్ కపూర్ (మాలిక్ కాఫర్) నాయకత్వంలో దక్షిణ భారతదేశంపై దండెత్తి యాదవ, కాకతీయ, హోయసాల, పాండ్య రాజ్యాలను ఓడించి కప్పం వసూలు చేశాడు. దేవగిరిని రాజధానిగా చేసుకుని పాలిస్తున్న యాదవరాజు రామచంద్ర దేవుడిని, అతడి కుమారుడు శంకర దేవుడిని ఓడించి కప్పం వసూలు చేశాడు. ఓరుగల్లును రాజధానిగా చేసుకుని పాలిస్తున్న కాకతీయ చక్రవర్తి రెండో ప్రతాపరుద్రుడిని ఓడించాడు. నాటి హోయసాల రాజు మూడో భల్లాలుడిని కూడా ఓడించాడు. మాలిక్ కపూర్ నాటి పాండ్యరాజు వీర పాండ్యుడిని ఓడించి, అతడి సోదరుడు సుందర పాండ్యుడిని రాజును చేసి అపార ధనరాశులను పొందాడు. ఈ విధంగా మాలిక్ కపూర్ నాయకత్వంలోని ఖిల్జీ సేనలు దక్షిణ భారత రాజ్యాలన్నింటినీ ఓడించి కప్పం వసూలు చేశాయి. నాడు హోయసాలులు ద్వారసముద్రం, పాండ్యులు మధురైలను రాజధానులుగా చేసుకుని పరిపాలించేవారు.
పాలనా సంస్కరణలు
అల్లావుద్దీన్ ఖిల్జీకి తాను సాధించిన విజయాల కంటే అమలు చేసిన పరిపాలన, సైనిక, మార్కెట్ సంస్కరణలే అత్యంత కీర్తి ప్రతిష్ఠలను తెచ్చాయి. రాజును (సుల్తాన్‌ను) భూమి మీద ఉన్న దేవుడి ప్రతినిధిగా పేర్కొన్నాడు. రాజు సంకల్పమే శాసనంగా ఉండాలని, రాచరికంలో బంధుత్వానికి ప్రాధాన్యం ఉండదని భావించాడు. ముఖ్యంగా పాలనా వ్యవహారాల్లో ఉలేమాల (మతపెద్దల) జోక్యాన్ని తగ్గించి మతం నుంచి రాజకీయాలను వేరుచేసిన తొలి ఢిల్లీ సుల్తాన్‌గా పేరొందాడు. పరిపాలనలో తాను అనుసరించే విధివిధానాలను గురించి పేర్కొంటూ ‘ఇది చట్టబద్దమో కాదో నాకు తెలియదు. రాజ్య శ్రేయస్సుకు మంచిదని, అత్యవసరమని నేను భావించిన ఆదేశాలను జారీ చేస్తాను. తీర్పు ఇచ్చిన రోజున ఏం జరుగుతుందో నాకు తెలియదు’ అని ప్రకటించాడు. ఖలీఫా నుంచి అధికారపత్రం కోసం విజ్ఞప్తి చేయకుండా తన నాణేలపై రెండో అలెగ్జాండర్ అనే బిరుదును ముద్రించుకున్నాడు. జలాలుద్దీన్ ఖిల్జీ కాలంలో లొంగిపోయిన మంగోలులు నయా ముస్లింలుగా భారతదేశంలో స్థిరపడి సుల్తాన్ పాలనా విధానాలను ప్రభావితం చేసేవారు. కానీ అల్లావుద్దీన్ ఖిల్జీ వారిని అణచివేసి పాలనలో జోక్యాన్ని తగ్గించాడు. ఈ విధంగా తన పాలనలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు.
సైనిక సంస్కరణలు
ఇల్‌టుట్‌మిష్ కాలంలో ప్రవేశపెట్టిన ‘ఇక్తా’ పద్ధతిని రద్దు చేశాడు. సుల్తాన్ సొంత సైన్యాన్ని (సిద్ధ సైన్యం) రూపొందించాడు. సైనికులకు నగదు రూపంలో జీతాలిచ్చే పద్ధతిని ప్రవేశపెట్టిన తొలి ఢిల్లీ సుల్తాన్‌గా పేరొందాడు. అతడి సైనిక సంస్కరణల్లో ప్రధానమైనవి దాగ్, చెహ్రా పద్ధతులు. ముక్తీదారులు చక్రవర్తి ఇచ్చిన మేలు జాతి గుర్రాలను విక్రయించి వాటి స్థానంలో ముసలి గుర్రాలను ఉంచేవారు. ఇలా గుర్రాల సంఖ్య సరిపోయేలా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడేవారు. ఈ మోసాలను అరికట్టేందుకు సుల్తాన్ గుర్రాలపై రాజముద్రలు వేసే దాగ్ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ రాజముద్రలు వేసిన గుర్రాలను అమ్మడం, కొనడం నేరంగా పరిగణించాలని ప్రకటించాడు. ప్రస్తుత ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీపై పశువులను ఇస్తూ వాటి చెవులకు ప్రభుత్వ ముద్రలు వేయడమనేది అల్లావుద్దీన్ ఖిల్జీ దాగ్ విధాన ప్రభావమనే చెప్పవచ్చు. సైనికులకు నిరంతరం హాజరు వేసే ‘చెహ్రా’ విధానాన్ని ప్రవేశపెట్టాడు. చెహ్రాను సైనికులకు సంబంధించిన వివరణాత్మక పట్టికగా పేర్కొనవచ్చు. అల్లావుద్దీన్ ఖిల్జీ సైనికులు సంతృప్తిగా జీవించడానికి వీలుగా మార్కెట్ సంస్కరణలు అమలు చేశాడు.
మార్కెట్ సంస్కరణలు
అల్లావుద్దీన్ ఖిల్జీ తాను ప్రవేశ పెట్టిన మార్కెట్ సంస్కరణల వల్ల ప్రఖ్యాతిగాంచాడు. నేటి ఆధునిక రైతుబజార్‌లను పోలిన విధానాన్ని ప్రవేశపెట్టాడు. మార్కెట్‌లో ఎవరెవరు ఏ వస్తువులను అమ్మాలో ముందుగా ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలి. వస్తువుల ధరల పట్టికను ప్రదర్శించాలి. తూనికలు, కొలతల్లో మోసానికి పాల్పడరాదు. వీటిని అతిక్రమించిన వారికి కఠిన శిక్షలు విధిస్తామని ఆజ్ఞలు జారీ చేశాడు. ప్రత్యేక మార్కెట్ శాఖ దివాన్-ఇ-రియాసత్‌ను ఏర్పాటు చేసి దీనికి అధిపతిగా మాలిక్-యాకూబ్‌ను నియమించాడు. ప్రతి మార్కెట్‌పై షహనా-ఇ-మండీ అనే అధికారిని నియమించి మార్కెట్లను క్రమబద్ధం చేశాడు. ఢిల్లీలో పెద్ద ధాన్యాగారాన్ని నిర్మించాడు. ఈ విధానాల వల్ల నాడు ఢిల్లీలో కరవు కాటకాలు రాలేదని ‘బరానీ’ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. ఈ మార్కెట్ సంస్కరణల అమలుపై చరిత్రకారులు భిన్నాభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ సంస్కరణలు సైనిక సంక్షేమానికి, సైనిక పటాలాలు ఉన్న ప్రాంతంలోనే అమలు చేశారని కొంతమంది వ్యాఖ్యానించగా, ప్రజాసంక్షేమం కోసం రాజ్యమంతటా అమలు చేశారని మరికొంతమంది పేర్కొన్నారు.
రెవెన్యూ సంస్కరణలు

‘అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణలు మధ్యయుగ చరిత్రలో ఒక అద్భుత ప్రయోగం’ - ఆధునిక చరిత్రకారుడు డి.ఎన్.డే