• facebook
  • whatsapp
  • telegram

పోషణ - విటమిన్లు

* విటమిన్‌ అనే పదం లాటిన్‌ పదాలైన ‘విటా’ (జీవితం), అమైన్‌ కలయిక వల్ల ఉద్భవించింది.

పోలెండ్‌కి చెందిన జీవరసాయన శాస్త్రవేత్త కాసిమిర్‌ ఫంక్‌ శరీర పెరుగుదల, నిర్వహణలో సహాయపడే పదార్థాన్ని కనుక్కుని, 1884లో దానికి విటమిన్‌ అని పేరు పెట్టారు.

కార్బోహైడ్రేట్లు, కొవ్వులను సరిగ్గా ఉపయోగించడం ద్వారా శక్తిని ఉత్పత్తి చేయడంలో విటమిన్లు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి.

మానవులు విటమిన్లు లేకుండా జీవించలేరు. మానవ శరీరం వీటిని స్వయంగా ఉత్పత్తి చేసుకోలేదు (విటమిన్‌  - D, విటమిన్‌  - B3 మినహా). మాంసం, ఆకుకూరలు, పండ్లు మొదలైన ప్రధాన ఆహారాల్లో విటమిన్లు లభిస్తాయి.

విటమిన్‌ లోపం కారణంగా కొన్ని వ్యాధులు కలుగుతాయి. విటమిన్లు ఎక్కువైనా రోగాలు సంభవిస్తాయి.


విటమిన్లు రెండు రకాలు అవి

1. కొవ్వుల్లో కరిగేవి  

ఉదా: విటమిన్‌ - A, D, E, K

2. నీటిలో కరిగేవి

ఉదా: విటమిన్లు - C, B - కాంప్లెక్స్‌ (B1, B2, B6 మొదలైనవి.) 

విటమిన్‌ A

వైద్య పరిభాషలో విటమిన్‌ A ని ఆక్సెరోప్థాల్, యాంటీగ్జిరోప్తాల్మిక్‌ లేదా యాంటీనిక్టాలోపిక్‌ విటమిన్‌ అని పిలుస్తారు.

ఇది రెటినోల్‌గా పిలిచే అసంతృప్త ఆల్కహాల్‌. రసాయన ఫార్ములా: C20H29OH. 

* విటమిన్‌ తి రెండు ఐసోమెరిక్‌ (అను సాదృశ్య) రూపాల్లో ఉంటుంది. అవి:

i) విటమిన్‌ A (రెటినోల్‌). ఇది ఒక ట్రాన్స్‌-ఐసోమర్‌. సహజంగా సంభవిస్తుంది.

ii) విటమిన్‌ A2 డీహైడ్రోరెటినల్‌ లేదా రెటినల్‌  2). ఇది ఒక సిస్‌ ఐసోమర్‌.

* ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు లాంటి శాకాహారంలో ప్రోవిటమిన్‌ A (β కెరోటిన్‌) లభిస్తుంది.

జంతువుల కాలేయం, పాలు, వెన్న, గుడ్డు పచ్చసొన మొదలైన వాటిలో విటమిన్‌ A ఉంటుంది. 

మంచినీటి చేపల కాలేయంలో A2 ఉంటుంది.

విధులు

1. రెటినాల్‌ (విటమిన్‌ A ఆల్డిహైడ్‌) ఆప్సిన్‌ ప్రోటీన్‌ లైసిన్‌ అవశేషాలతో కలిసి రెటీనాలోని రాడ్‌ కణాల రోడాప్సిన్‌ పిగ్మెంట్‌లను ఏర్పరుస్తుంది. ఇది రాత్రి దృష్టికి అవసరం.

2. రెటినోయిక్‌ యాసిడ్‌ (విటమిన్‌ A యాసిడ్‌) కొన్ని రకాల క్యాన్సర్‌ కణాలను నాశనం చేయగలదు.

3. విటమిన్‌ A ఎపిథీలియల్‌ కణాల సమగ్రతను నిర్వహిస్తుంది. కణ త్వచాల పారగమ్యతను ప్రేరేపిస్తుంది.

4. చిన్న జంతువుల్లో శరీర పెరుగుదల, ఎముకలు, దంతాలు ఏర్పడటానికి విటమిన్‌ A అవసరం.


లోపిస్తే కలిగే నష్టాలు..

  రేచీకటి (నిక్టలోపియా లేదా హెనెరోలోపియా) కలుగుతుంది.

  పిల్లల్లో విటమిన్‌  A2 లోపం వల్ల గ్జీరోప్తాల్మియా (కండ్లకలక, కళ్లు పొడిబారడం), కెరటోమలాసియా వ్రణోత్పత్తి, కార్నియా మృదువుగా మారడానికి కారణమవుతుంది. దీని వల్ల పూర్తి అంధత్వం రావొచ్చు.

  దీని లోపం వల్ల చర్మం పొడిబారినట్లు, గరుకుగా అవుతుంది.

హైపర్‌ విటమినోసిస్‌ A: హైపర్‌ విటమినోసిస్‌ అంటే విటమిన్‌ అధిక లభ్యత. శరీరంలో విటమిన్‌ A ఎక్కువైతే తలనొప్పి, వికారం, వాంతులు, మగత లాంటివి సంభవిస్తాయి.

* ఇది ఎక్కువ కాలం కొనసాగితే అనోరెక్సియా (ఆకలి లేకపోవడం), అలోపేసియా (జుట్టు రాలడం), పెదవుల పగుళ్లు, చర్మంపై దురద, ఎముకలు - కీళ్లలో నొప్పి లాంటివి కలుగుతాయి.


విటమిన్‌ D

* వైద్య పరిభాషలో విటమిన్‌ దీ ని యాంటీరాచిటిక్‌ విటమిన్‌ అంటారు. దీనికి రికెట్స్‌ను నయం చేసే లేదా నిరోధించే లక్షణం ఉంటుంది. అందుకే దీన్ని ఈ పేరుతో పిలుస్తారు.

* రసాయనికంగా విటమిన్‌ దీ కాల్షియం జీవక్రియకు సంబంధించిన ఒక స్టెరాయిడ్‌. అందుకే దీన్ని కాల్సిఫెరాల్‌ అంటారు.

* ఇది రెండు రూపాల్లో ఉంటుంది. అవి: 

1. విటమిన్‌  D2 (ఎర్గో కాల్సిఫెరాల్‌), విటమిన్‌  D3  (కోలె కాల్సిఫెరాల్‌).

* సూర్య కాంతిలో ఉండే అతినీలలోహిత కిరణాల (యూవీ) చర్య ద్వారా ప్రోవిటమిన్ల నుంచి ఇవి సంశ్లేషణం అవుతాయి. అందుకే విటమిన్‌ దీ ని సన్‌షైన్‌ విటమిన్‌ అంటారు. 

* ఎర్గోస్టెరాల్‌ మొక్కల్లో లభిస్తే, కోలె కాల్సిఫెరాల్‌ (7-డీహైడ్రోకొలెస్ట్రాల్‌) జంతువుల్లో ఉంటుంది.

* చేపల కాలేయం - నూనె, గుడ్లు, పాలు, వెన్న, నెయ్యి మొదలైన వాటి నుంచి విటమిన్‌ D3 లభిస్తుంది.

విధులు:

* వివిధ జీవక్రియ మార్పుల ద్వారా విటమిన్‌ దీ3 హార్మోన్‌ కాల్సిట్రియోల్‌ (1, 2, 5 డైహైడ్రాక్సీ కోలె కాల్సిఫెరాల్‌)ను ఉత్పత్తి చేసే ప్రోహార్మోన్‌గా పనిచేస్తుంది. కాల్షియం, ఫాస్ఫేట్‌ జీవక్రియలో కాల్సిట్రియోల్‌ పాత్ర ఉంటుంది.

విటమిన్‌ D కాల్షియం బైండింగ్‌ ప్రోటీన్‌ కోసం mRNA లిప్యంతరీకరణను సక్రియం చేస్తుంది.

* ఇది ఎముకలు, దంతాల పెరుగుదలకు, అభివృద్ధికి సహాయపడుతుంది.

* శరీరం నుంచి ఫాస్ఫేట్‌ బయటకు వెళ్లేలా చేస్తుంది.

లోపం వల్ల కలిగే ప్రభావాలు

* విటమిన్‌ D లోపం కారణంగా పిల్లల్లో రికెట్స్, పెద్దలలో ఆస్టియోమలాసియా కలుగుతాయి. 

* రికెట్స్‌ లక్షణాలు - బౌ లెగ్స్‌ (కాళ్ల వంకర్లు); పక్కటెముకలు వంగడం; చీలమండలు, మోకాలు, మణికట్టు, మోచేయి పెద్దవిగా మారడం మొదలైనవి. ఆస్టియోమలాసియాలో ఎముకలు బలహీనంగా, పెళుసుగా మారతాయి.


హైపర్‌ విటమినోసిస్‌ D 

విటమిన్‌ D ఎక్కువైతే శరీరంలో కాల్షియం, ఫాస్ఫరస్‌ స్థాయులు పెరుగుతాయి. ఫలితంగా మూత్రపిండాలు, ధమనులు, కండరాలు మొదలైనవి ప్రభావితం అవుతాయి.

ఆకలి లేకపోవడం, మలబద్ధకం, పాలీయూరియా, వికారం, వాంతులు, విరేచనాలు మొదలైనవి సంభవిస్తాయి.


 

విటమిన్‌ K

రక్తస్రావం జరిగినప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టేలా ఇది సహాయపడుతుంది. దీన్ని రక్తస్రావ నివారిణి విటమిన్‌ లేదా రక్తం గడ్డకట్టే విటమిన్‌ అని పిలుస్తారు.

రసాయనికంగా విటమిన్‌ K నాప్తోక్వినోన్‌ ఉత్పన్నం. సహజంగా ఇది రెండు రూపాల్లో సంభవిస్తుంది. అవి:

1. విటమిన్‌ K1 (ఫైలోక్వినోన్‌) 

2. విటమిన్‌ K2 (మెనాక్వినోన్‌ లేదా ఫార్నోక్వినోన్‌).

* విటమిన్‌ K3 ఒక సింథటిక్‌ ఉత్పత్తి.

* ఇది ఆకుకూరలు, సోయాబీన్, క్యారెట్, బంగాళదుంపలు, పాలు, చేపలు, మాంసం మొదలైనవాటిలో లభిస్తుంది.

విధులు

*  కార్బాక్సిలేజ్‌ సహ కారకంగా పనిచేస్తుంది.

కొవ్వు శోషణకు అవసరం.


లోపం వల్ల కలిగే లక్షణాలు

 రక్తం గడ్డకట్టడం ఆలస్యం అవుతుంది.

నవజాత శిశువుల్లో సంభవించే హెమరేజిక్‌ వ్యాధికి కారణమవుతుంది.

కాలేయం పనితీరు మందగిస్తుంది.


హైపర్‌ విటమినోసిస్‌

ఇది ఎక్కువైతే హైపర్‌బైలిరుబినిమియా కలుగుతుంది.


విటమిన్‌E 

* పునరుత్పత్తి వ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే ఇది అవసరం. అందుకే దీన్ని యాంటీ స్టెరిలిటీ విటమిన్‌ లేదా ఫెర్టిలిటీ విటమిన్‌ అని పిలుస్తారు.

దీని రసాయన నామం టోకోఫెరాల్‌ (టోక్స్‌ = పిల్లల పుట్టుక; ఫెరా = భరించడం; ఓల్‌ = ఆల్కహాల్‌).

కూరగాయలు, నూనె, ఆకుకూరలు, పాలు, వెన్న, గుడ్లు, మాంసం మొదలైనవాటిలో ఇది ఉంటుంది.


విధులు:

* ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. విటమిన్‌  A, K, ముఖ్యమైన కొవ్వు ఆమ్లాల ఆక్సీకరణను నిరోధిస్తుంది.

ఇది కెరాటినైజేషన్‌ను తగ్గిస్తుంది. దీని ద్వారా చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. అందుకే దీన్ని బ్యూటీ విటమిన్‌ అని కూడా అంటారు.

* ఇది అస్థిపంజర కండరాలు, గోనాడ్స్, మూత్రపిండ గొట్టాల సాధరణ పనితీరులో సహాయపడుతుంది.


లోపం వల్ల కలిగేవి:

* వంధ్యత్వానికి, గర్భస్రావానికి కారణమవుతుంది.

* కండరాల బలహీనత, డిస్ట్రోఫీకి (క్షీణత) కారణమవుతుంది.


మాదిరి ప్రశ్నలు

1. పెద్దల్లో విటమిన్‌ D లోపిస్తే ఎముకలు క్షీణించి, బలహీన పడతాయి. దీన్ని ఏమంటారు?

1) ఆస్టియోపోరోసిస్‌     2) ఆస్టియోమలాసియా 

3) ఆస్టియోఆర్థ్రైటిస్‌  4) ఆస్టిటీస్‌ ఫైబ్రోజా

జ: ఆస్టియోమలాసియా


2. విటమిన్‌ తి లోపం ద్వారా కంటి కార్నియా పొడిబారడాన్ని ఏమంటారు?

1) నిక్టలోపియా        2) గ్జీరోప్తాల్మియా 

3) కెరటోమలాసియా       4) ఏదీకాదు

జ:  గ్జీరోప్తాల్మియా


3. కిందివాటిలో విటమిన్‌ తి ప్రధానంగా దేనిలో లభిస్తుంది?

1) చేప నూనె    2) చక్కెర      3) అరటి పండ్లు   4) కొబ్బరి నూనె 

జ: చేప నూనె


4. విటమిన్‌ తి రసాయన నామం ఏమిటి?

1) కోలె కాల్సిఫెరాల్‌      2) ఆస్కార్బిక్‌ ఆమ్లం      3) రైబోఫ్లావిన్‌    4) రెటినాల్‌

జ: కోలె కాల్సిఫెరాల్‌


5. ఏ విటమిన్‌ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, విటమిన్‌ తి, రీ, ముఖ్యమైన కొవ్వు ఆమ్లాల ఆక్సీకరణను నిరోధిస్తుంది?

1) కోలె కాల్సిఫెరాల్‌    2) ఆస్కార్బిక్‌ ఆమ్లం   3) రైబోఫ్లావిన్‌    4) టోకోఫెరాల్‌

జ: టోకోఫెరాల్‌ 


6. కిందివాటిలో ఏ విటమిన్‌ రకం ఒక సింథటిక్‌ ఉత్పత్తి?

1) K1     2) K2     3) K3     4) K4

జ: K3


7. నిక్టలోపియా లేదా హెనెరోలోపియా దేని లోపం వల్ల కలుగుతుంది?

1) A     2) B    3) K3     4) D

 జ: 


8. శరీరంలో విటమిన్‌ రీ లోపిస్తే ఏం జరుగుతుంది?

i) రక్తం గడ్డకట్టడం ఆలస్యం అవుతుంది.

ii) నవజాత శిశువులో హెమరేజిక్‌ వ్యాధి సంభవిస్తుంది.

iii) కాలేయం పనితీరు మందగిస్తుంది.

1) i, ii      2) i, iii     3) ii, iii     4) పైవన్నీ

జ: పైవన్నీ

Posted Date : 06-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌