• facebook
  • whatsapp
  • telegram

మతతత్వం-ఆవిర్భవం-వికాసం

       భారతదేశంలో హిందూ-ముస్లిములుభిన్న సంస్కృతులతో శాంతియుత సహజీవనం కొనసాగించేవారు. ఆంగ్లేయులు తమ స్వీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం వారిమధ్య విభేదాలు సృష్టించి, 'విభజించు - పాలించు' విధానాన్ని అనుసరించారు. ఈ విధానమే ఆధునిక భారతదేశ చరిత్రలో మతతత్వానికి మూలకారణం.
* ప్రస్తుతం మతతత్వ ఆవిర్భవం - వికాసాలకు దోహదం చేసిన అంశాలు, వాటి మూలంగా ఏర్పడిన ఫలితాలు మొదలైన విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం.

మతతత్వం
 

        ఒక మతానికి చెందినవారు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అవసరాల దృష్ట్యా మతాన్ని ప్రాతిపదికగా చేసుకుని తమ మతస్థులను సంఘటితం చేసి, ఉద్యమించడాన్ని మతతత్వంగా నిర్వచించవచ్చు. 

ఆవిర్భవానికి కారణాలు
 

* 'విభజించు - పాలించు' విధానం: సిపాయిల తిరుగుబాటు (1857) వరకు ముస్లిం పాలక వర్గం, ప్రభువర్గాల నుంచి ప్రతిఘటనను ఎదుర్కొన్న బ్రిటిష్ ప్రభుత్వం, ముస్లింలను ప్రధాన శత్రువులుగా పరిగణించింది. 1857 సిపాయిల తిరుగుబాటు విఫలం కావడంతో ముస్లిముల ప్రతిఘటనలు బలహీనపడిపోయాయి. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం తన ధృక్పథాన్ని మార్చుకొని ముస్లింలను, హిందువులకు వ్యతిరేకంగా చేరదీయడం ప్రారంభించింది.
* హిందూ మేధావి వర్గం ఆవిర్భవించింది. వారు ఆధునిక భావాలను పుణికి పుచ్చుకున్నారు. క్రమంగా బలపడుతున్న హిందూ మేధోవర్గాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ముప్పుగా భావించింది. వారిని బలహీన పరిచేందుకు, ముస్లిములను ఆదరించాల్సిన అవసరాన్ని గుర్తించింది. బ్రిటిష్ వలస ప్రభుత్వం, హిందువులకు వ్యతిరేకంగా ముస్లిములను చేరదీసే ప్రయత్నం చేసింది.
* 19వ శతాబ్ద సాంస్కృతిక పునరుజ్జీవనం: సాంస్కృతిక పునరుజ్జీవనానికి కృషి చేసిన సంస్కరణవాదులు 'ఘనమైన భారతీయ సంస్కృతి అంటే హిందూ సంస్కృతే' అనే భావనను కల్పించారు. ఫలితంగా ముస్లింలలో తాము, తమ సంస్కృతి వేరు అనే భావన ఏర్పడింది. ఆర్యసమాజం చేపట్టిన గోసంరక్షణ ఉద్యమం, శుద్ధి ఉద్యమం, వివేకానందుని బోధనలను, ముస్లింలు తమ మతభద్రతకు ఏర్పడిన ప్రమాదంగా భావించారు. దీంతో వారిలో అభద్రత ఏర్పడింది.
* బ్రిటిషర్ల రెవెన్యూ విధానాలు: జమీందారీ విధానం అమల్లోకి వచ్చేటప్పటికి బెంగాల్‌లో పాలకవర్గంలోని అత్యధికులు ముస్లింలే. జమీందారీ విధానం వల్ల ముస్లిములు తమ జమీన్లను హిందూ వడ్డీ వ్యాపారులకు కోల్పోవలసి వచ్చింది. ఇందుకు భిన్నంగా ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువమంది హిందూ జమీందార్లు తమ భూములను ముస్లిం వ్యాపారులకు కోల్పోవలసి వచ్చింది. అంటే ఒక మతానికి చెందినవారు నష్టపోవడం మరో మతంవారికి లాభదాయకమైంది. ఇలాంటి వర్గాల సమీకరణ మార్పు ఇరు మతస్థుల మధ్య విద్వేషాలకు దారితీసింది.
* బ్రిటిష్ విద్యావిధానం: ముస్లింలు తమ సాంప్రదాయిక పర్షియన్ విద్యావిధానానికే కట్టుబడి ఉండేవారు. హిందువులు ఇందుకు భిన్నంగా మార్పుకు సిద్ధపడి, ఇంగ్లిష్ విద్యను అభ్యసించి ఆధునిక భావాలకు అలవాటు పడ్డారు. ఇంగ్లిష్ విద్య ద్వారా కంపెనీ ఉద్యోగాల్లో ఎక్కువ శాతం ఉద్యోగాలు పొందగలిగారు.
* హార్డింజ్ గవర్నర్ జనరల్ కంపెనీ ఉద్యోగాలకు ఇంగ్లిష్ భాషను తప్పనిసరి చేయడంతో ముస్లింలు, హిందువులతో పోటీపడలేకపోయారు. న్యూనతాభావాన్ని, హిందువులపై వ్యతిరేకతనూ పెంచుకున్నారు. దీనికి తోడు వ్యవసాయరంగంలో సంక్షోభం, చేతివృత్తులు దెబ్బతినడంతో ముస్లింల వెనుకబాటుతనానికి హిందూ సమాజమే కారణమనే అపోహలు మతతత్వాన్ని బలపరచాయి.
* మతతత్వవాదుల కృషి: 'భారతదేశ వధువుకు హిందువులు, ముస్లింలు రెండుకళ్లు' అని చెప్పిన సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్, ఆలీఘర్ ఉద్యమం ద్వారా ముస్లింల అభ్యున్నతికి మాత్రమే కృషిచేశాడు. తన తొలి భావాలను విస్మరించి, హిందూ-ముస్లింల ప్రయోజనాలు భిన్నమైనవని, పరస్పర విరుద్ధమైనవని ప్రకటించాడు. ముస్లింలు బ్రిటిషర్లకు విధేయులుగా ఉంటే, వారి ప్రయోజనాలు నెరవేరతాయని ప్రకటించాడు. ముస్లింలు జాతీయ కాంగ్రెస్‌లో చేరడాన్ని వ్యతిరేకించాడు. వి.డి. సావర్కర్ 'హిందువులను వారి దేశంలోనే దాసుల స్థాయికి దిగజార్చాలని ముస్లింలు ఆశిస్తున్నారు' అని చెప్పాడు. ఎం.ఎస్.గోల్వాల్కర్ 'హిందూ-ముస్లిం ఐక్యతలేని స్వరాజ్యం వద్దని ప్రకటించేవాడు. ఇలా మతతత్వ వాదుల భావాలు, దృక్పథం మతతత్వానికి ఆజ్యం పోశాయి.
* చరిత్రకారుల రచనా ప్రభావం: బ్రిటిష్ చరిత్రకారులైన జేమ్స్ స్టూవర్ట్‌మిల్ భారతదేశ చరిత్రను మత ప్రాతిపదికపై విభజిస్తూ, ప్రాచీన హిందూ చరిత్ర, మధ్యయుగాల ముస్లిం చరిత్ర, ఆధునిక యుగ ఇంగ్లిష్ చరిత్రగా చిత్రీకరించాడు. ఇది మత ధోరణులను బలపరిచింది. వలసవాద చరిత్రకారులందరూ చరిత్రను హిందూ-ముస్లింల మధ్య జరిగిన సంఘర్షణగా అభివర్ణించారు.
* సమరశీల జాతీయవాదం: అతివాదుల కాలంలో వందేమాతర ఉద్యమ నేపథ్యంలో మతపరమైన పోకడలు తలెత్తాయి.
బిపిన్ చంద్రపాల్ దుర్గాపూజలు; బాలగంగాధర్ తిలక్, శివాజీ, గణపతి ఉత్సవాలు నిర్వహించడం కొంతవరకు లౌకికవాదాన్ని దెబ్బతీశాయి.
* బెంగాల్ విభజన-మింటోమార్లే సంస్కరణలు: బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ ఐక్యతను దెబ్బతీసేందుకు, 1905లో మత ప్రాతిపదికన బెంగాల్ విభజనను చేపట్టింది. 1909లో ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు కల్పిస్తూ మింటో-మార్లే సంస్కరణలు వచ్చాయి. వీటిని భారత జాతీయ కాంగ్రెస్ వ్యతిరేకించడం వల్ల ముస్లింలలో మతతత్వ ధోరణి పెరిగింది.
* భారత జాతీయ కాంగ్రెస్ తప్పిదాలు: మింటోమార్లే సంస్కరణల్లో (1909) ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాల ఏర్పాటును మొదట వ్యతిరేకించిన భారత జాతీయ కాంగ్రెస్, 1916 లక్నో ఒప్పందంలో సమర్థించింది. మళ్లీ 1928 మోతీలాల్ నెహ్రూ కమిటీ నివేదికలో ప్రత్యేక నియోజకవర్గాలను వ్యతిరేకించింది. దీంతో కాంగ్రెస్‌పై ముస్లిములకు అపనమ్మకం ఏర్పడింది.
* సహాయ నిరాకరణోద్యమంలో అంతర్భాగంగా ఖిలాఫత్ ఉద్యమం ఉత్సాహంగా జరుగుతున్న సమయంలో, ఖిలాఫత్ ఉద్యమకారులైన ఆలీ సోదరులను (షౌకత్ఆలీ, మహ్మద్ఆలీలను) సంప్రదించకుండా, సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేశారు. దీన్ని ముస్లిములు అవమానంగా భావించారు. ఈ ఘటనలన్నీ కాంగ్రెస్‌ను ముస్లింలు విశ్వసించలేని పరిస్థితిని కల్పించాయి.
 

వికాసం
 

          స్వాతంత్య్ర పోరాటంలో మతతత్వం మూడు దశల్లో అభివృద్ధి చెందినట్లు పేర్కొనవచ్చు.
 

మితవాద మతతత్వ దశ (1885-1914) 
 

             మితవాద మతతత్వం ఈ దశలో ఆయా మతస్థుల అభివృద్ధికి కృషి చేసింది. ఈ దశలో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడిన మతం ఆయా రంగాల్లో పురోభివృద్ధి సాధించడానికి ప్రయత్నించింది. అంటే ఘర్షణకు తావులేని అభివృద్ధిని మితవాద మతతత్వం కోరుకుంది.
1906లో ముస్లిములకు ప్రాతినిధ్యం వహించే మొట్టమొదటి రాజకీయ పార్టీ అయిన 'ఆల్ ఇండియా ముస్లింలీగ్' ఏర్పడినప్పటికీ, హిందువులకు వ్యతిరేకంగా పోరాడటం తమ ఉద్దేశం కాదని ప్రకటించింది. మైనారిటీ వర్గాల అభ్యున్నతిని సాధించడమే తమ లక్ష్యమని ప్రకటించింది. దీన్ని అపార్థాలకు తావివ్వని మతతత్వంగా భావించవచ్చు. అదే రీతిలో బాలగంగాధర్ తిలక్, శివాజీ, గణపతి ఉత్సవాలు జరిపినప్పటికీ వాటి ఉద్దేశం, ప్రజా ఉద్యమాన్ని బలపరచడమేగాని, ముస్లిముల మనోభావాలను దెబ్బతీయడం కాదు.
 

అతివాద మతతత్వం (1915-1939)
 

              ఈ దశలో ఇరువర్గాల మధ్య ఉన్న స్పర్థలు, అభిప్రాయ భేదాలు బహిర్గతమై, తారాస్థాయికి చేరుకోవడం ప్రత్యక్షంగా కనిపిస్తుంది.
* ఆల్ఇండియా హిందూమహాసభ 1915లో హిందూ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ఏర్పడింది. 1925లో అతివాద హిందూతత్వాన్ని ప్రతిబింబించే విధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడింది.
* సహాయ నిరాకరణ్యోద్యమాన్ని గాంధీ అర్థంతరంగా రద్దు చేయడంతో హిందూ-ముస్లిముల మధ్య అభిప్రాయ భేదాలు ప్రారంభమయ్యాయి. ఆలీ సోదరులతో సంప్రదింపుల ద్వారా ఖిలాపత్ ఉద్యమాన్ని, సహాయనిరాకరణోద్యమంలో అంతర్భాగంగా చేసిన గాంధీ, వారిని సంప్రదించకుండా ఏకపక్షంగా సహాయ నిరాకరణోద్యమాన్ని ఆపివేశారు. ఇది హిందూ, ముస్లిముల మధ్య అభిప్రాయ భేదాలకు తావిచ్చింది.
* మోతీలాల్ నెహ్రూ కమిటీ (1928) నివేదిక ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలను వ్యతిరేకించింది. 1929లో మహ్మద్ ఆలీజిన్నా ప్రతిపాదించిన '14 సూత్రాల పథకాన్ని' కాంగ్రెస్ వ్యతిరేకించింది. దీంతో అప్పటివరకు లౌకికవాదిగా ఉన్న జిన్నా మతతత్వవాదిగా మారాడు.
* 1930 నుంచి 1934 మధ్య జరిగిన శాసనోల్లంఘన ఉద్యమం (ఉప్పు సత్యాగ్రహం)లో ముస్లింలు తగిన రీతిలో పాల్గొనలేదు. ఉద్యమం మధ్యలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో కమ్యూనల్ అవార్డ్‌పై కాంగ్రెస్, ముస్లింలీగ్ మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. ఇవి అతివాద మతతత్వానికి నిదర్శనాలు.
* శాసనోల్లంఘన ఉద్యమం జరుగుతున్న సమయంలోనే రహమత్ ఆలీ అనే ప్రవాస భారతీయుడు భారతదేశంలో ముస్లిం మెజారిటీ ప్రాంతాలైన పంజాబ్, సింధ్, వాయువ్య సరిహద్దు ప్రాంతాలు మొదలైనవి కలుపుతూ, పాకిస్థాన్‌ను ఏర్పరచాలని చెప్పాడు. ముస్లింలీగ్ దీన్ని సమర్థించడం అతివాద మతతత్వానికి పరాకాష్ట అయ్యింది.
* 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937లో రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అనంతరం కాంగ్రెస్, ముస్లింలీగ్‌ల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. కాంగ్రెస్ పాలనలో ఉన్న ప్రాంతాల్లో మైనారిటీ హక్కుల ఉల్లంఘన జరిగిందని ముస్లింలీగ్ పదేపదే ఆరోపణలు చేసింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వం తరపున యుద్ధంలో పోరాడుతుందని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంశంలో కాంగ్రెస్‌ను సంప్రదించలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వాల్లోని పాలకులు మనస్తాపం చెందారు. సామూహికంగా రాజీనామాలు చేశారు. దీన్ని అరాచక కాంగ్రెస్ పాలక ప్రభుత్వం నుంచి విముక్తి దినంగా ముస్లింలీగ్ పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చింది. ముస్లిముల అతివాదతత్వానికి ఇది ఒక నిదర్శనం.
 

హింసాయుత మతతత్వం (1940-1947)
 

మతవాదంలో మూడో దశ అయిన హింసాయుత మతతత్వం 1940 నుంచి భారత రాజకీయల్లో ప్రవేశించింది.
* ఈ దశలో ఇరువర్గాలు సహజీవనం చేయడం సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చాయి. హిందూ-ముస్లిములు వేర్వేరు జాతులనే భావన పెరిగింది. ముస్లింలకు ప్రత్యేక రాజ్యంగా పాకిస్థాన్ ఇవ్వాలనే విభజన ధోరణి బలపడింది.
1940 లాహోర్ ముస్లింలీగ్ సమావేశంలో మహ్మద్ ఆలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతం ఆధారంగా పాకిస్థాన్ ఏర్పాటుకు ముస్లింలీగ్ తీర్మానం చేసింది.
* ఈ దశలో ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం ఏ సందర్భంలోనూ కుదరలేదు. కాంగ్రెస్, ముస్లింలీగ్ మధ్య సఖ్యత కోసం 1944 రాజాజీ ఫార్ములాను జిన్నా తిరస్కరించాడు.
* 1946 ఆగస్టు 16న పాకిస్థాన్ సాధన కోసం ప్రత్యక్ష చర్య దినానికి ముస్లింలీగ్ పిలుపునిచ్చింది. మతకలహాలు తీవ్రస్థాయిలో జరిగాయి.
* జవహర్‌లాల్‌నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో చేరిన ముస్లింలీగ్ అవరోధాలను సృష్టించి, ప్రభుత్వ ప్రతిష్టంభనకు తీవ్రస్థాయిలో కృషి చేసింది.
* ఇలా హింసాత్మక స్థాయికి చేరుకున్న మతతత్వం చివరికి 1947లో దేశ విభజనకు దారితీసింది.
 

ఫలితాలు
 

ముస్లింలకు ప్రత్యేక రాజ్యమనే డిమాండ్ కారణంగా అఖండ భారతదేశాన్ని మత ప్రాతిపదికన విభజించారు.
దేశ విభజన ఫలితంగా కాందీశీకుల సమస్య, సరిహద్దు సమస్య మొదలైనవి ఏర్పడ్డాయి.
* మతతత్వం మతపరమైన సంస్థల ఆవిర్భవానికి, వాటి వికాసానికి దారితీసింది.
* స్వాతంత్య్ర సముపార్జన కొన్ని సంవత్సరాల పాటు ఆలస్యం కావడానికి కారణమైంది.
* మతతత్వం కారణంగా మతపరమైన దాడుల సమస్య ఏర్పడింది. ఈ దాడుల్లో అసంఖ్యాక అమాయక ప్రజలు విచక్షణా రహితంగా హత్యాకాండకు లోనయ్యారు.
* భారత్-పాకిస్థాన్ మధ్య మనస్పర్థలు, అపోహలు, అభిప్రాయ భేదాలకు కారణమైంది.
* పేదరికం, నిరుద్యోగంలో మగ్గుతున్న అమాయక జనాన్ని మతతత్వం అనే ముసుగులో పలు బాంబుదాడులకు పురిగొల్పారు.
సర్ సయ్యద్ అహ్మాద్ ఖాన్: ముస్లింలలో ఐక్యత సాధించి, వారికి పాశ్చాత్య విద్య, సంస్కృతిపట్ల అభిలాష కలిగించిన మొదటి ముస్లిం నాయకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్.
* 'ది లాయల్ మహమ్మదీయన్స్ ఆఫ్ ఇండియా' అనే గ్రంథంలో ముస్లింలు బ్రిటిష్ ప్రభుత్వం పట్ల విశ్వాసపాత్రులని, వారు పాశ్చాత్వ అభ్యుదయ సంస్కృతిని జీర్ణం చేసుకోవాలని ఆయన రాశాడు.
* ముస్లిం మతస్థులు పాశ్చాత్వ అభ్యుదయ జీవన విధానం పట్ల ఆసక్తి వ్యక్తపరిచేలా, ముస్లిములను తయారు చేయాలనే దృఢ నిశ్చయంతో 1875లో ఆలీఘర్‌లో 'ఆంగ్లో-ఓరియంటల్‌కళాశాల' స్థాపించాడు. ఈ కళాశాల తర్వాత రోజుల్లో ఆలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందింది.
*భారత జాతీయ కాంగ్రెస్‌కు పోటీగా, 1888లో 'రాజా శివరామ ప్రసాద్'తో కలిసి 'ఐక్య భారతదేశాభిమాన సంఘం' స్థాపించాడు. ముస్లిం నవాబులు, హిందూ రాజులు మాత్రమే ఆ సంస్థలో సభ్యత్వానికి అర్హులు.
ఆలీ సోదరులు: షౌకత్ ఆలీ, మహ్మద్ ఆలీ అనే ఇరువురూ ముస్లిం సోదరులు. ఖలీఫా పదవిని పునురుద్ధరింపజేసేందుకు ఖిలాపత్ ఉద్యమాన్ని ప్రారంభించారు.
 

ద్విజాతి సిద్ధాంతం: హిందూ, ముస్లిం మత సంస్కృతులు వేరు. ఈ రెండింటికి సమన్వయం కుదరదు. సహజీవనం కొనసాగించడం కష్టం. అందుకే దేశ విభజనే ద్విజాతి సిద్ధాంత లక్ష్యమని 'మహ్మద్ ఆలీ జిన్నా' చెప్పాడు.
 

ఆల్ ఇండియా ముస్లింలీగ్ (1906)
 

               ముస్లిం వర్గ ప్రయోజనాలు పరిరక్షించేందుకు కేంద్ర మహమ్మదీయ సంస్థను స్థాపించాలనే ఆలోచనతో, ఢాకాకు చెందిన 'నవాబ్ సలీమ్ ఉల్లా' 1906 డిసెంబరులో ఆల్ ఇండియా ముస్లింలీగ్ ఏర్పాటును ప్రతిపాదించగా, హకీం అజ్మల్‌ఖాన్, జాఫర్ ఆలీఖాన్, మహ్మద్ఆలీ బలపరిచారు.
ముస్లింలీగ్ ఆశయాలు: భారతీయ ముస్లిములలో బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయతా భావాన్ని పెంపొందించడం.
* భారత ముస్లిముల రాజకీయ హక్కుల రక్షణ, వారి అవసరాలు, ఆశయాలను ప్రభుత్వానికి విన్నవించడం.
* తన లక్ష్యాలకు భంగం లేకుండా దేశంలోని ఇతర మతస్థుల పట్ల ముస్లింలలో ద్వేషభావం పెరగకుండా నిరోధించడం.
* ముస్లింలీగ్ బెంగాల్ విభజనను సమర్థించింది. ముస్లిములు రాజకీయ ప్రయోజనాలు, ఉద్యోగాల కోసం సాగించిన పోరాటంలో అండగా నిలిచింది.
* దేశంలో మతతత్వం వ్యాపించడంలో ముస్లింలీగ్ కీలకపాత్ర వహించింది. దాని రాజకీయ కార్యక్రమాలు హిందువులకు, జాతీయ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సాగాయి.
* ప్రజల్లో కాంగ్రెసు పట్ల పెరుగుతున్న సానుభూతిని నిరోధించడానికి ప్రయత్నించింది.
* లౌకిక విధానాన్ని వ్యతిరేకించింది.

Posted Date : 09-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌