• facebook
  • whatsapp
  • telegram

శాతవాహనులు

శాతవాహనుల చరిత్ర - ఆధారాలు 

* నాసిక్, నానాఘాట్, కన్హేరి, కార్లే, భాజాల్లో లభించిన శాసనాలు, కళింగ ఖారవేలుడి హాథిగుంఫా శాసనం, రుద్రదాముడి జునాఘడ్‌ శాసనం శాతవాహనుల కాలంనాటి ఆర్థిక, సామాజిక, మత, సాంస్కృతిక పరిస్థితులు తెలుసుకోవడానికి ఉపయోగపడ్డాయి. 

* సాహిత్య ఆధారాలైన మత్య్స, వాయు, విష్ణు, బ్రహ్మాండ పురాణాలు, గుణాఢ్యుని బృహత్కథ, హాలుడి గాథసప్తశతి, వాత్సాయనుడి కామసూత్రాలు, మెగస్తనీస్‌ ఇండికా, పెరిప్లస్‌-ఆఫ్‌-ది-ఎరిత్రియన్‌-సి, ప్లినీ, టాలమీ రచనలు, శాతవాహన రాజులు ముద్రించిన నాణేలు వీరి చరిత్రను తెలుపుతున్నాయి.


పుట్టుక - వాదనలు

* శాతవాహనుల పుట్టుక, ఎక్కడి నుంచి వచ్చారనే విషయంలో చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. 

ఆంధ్ర అనే శబ్దం గురించి మొదట ఐతరేయ బ్రాహ్మణంలో పేర్కొన్నారు. 

* గ్రీకు రచయిత మెగస్తనీస్‌ ఆంధ్రులు బలవంతులని, వీరికి సురక్షితమైన 30 పట్టణాలు ఉన్నాయని ‘ఇండికా’లో పేర్కొన్నాడు. అశోకుడి శాసనాల ప్రకారం వీరు సామంత తెగలవారని తెలుస్తుంది.

* సాతవాహన పదం శాతవాహనకు ప్రాకృత రూపం. శాసనాల్లో శాతవాహన కులానికి చెందినవారుగా పేర్కొనడంతో సాతవాహన వీరి వంశనామంగా పరిగణించవచ్చు. 

* అభిదాన చింతామణిలో ఈ పదానికి సుఖప్రదమైన వాహనం కలవాడని అర్థం. కథాసరిత్సాగరంలో సాత అనే యక్షుడి వాహనం కలవాడే ‘సాతవాహనుడు’ అని ఉంది. 

* సిముక శాతవాహనుడు, శిశుక, సిప్రక ఈ వంశస్థాపకుడని పురాణాలు పేర్కొన్నాయి. 

* ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్‌ జిల్లా కోటిలింగాల (నేటి తెలంగాణ రాష్ట్రం) వద్ద దొరికిన నాణేలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి.

* పురాణాలు 30 మంది ఆంధ్రులు 450 ఏళ్లు పరిపాలించినట్లు, వీరే ‘ఆంధ్రభృత్యులు’ అని పేర్కొన్నాయి. 

* భాగవత పురాణం ప్రకారం శాతవాహన వంశస్థాపకుడు ఆంధ్రజాతీయుడని, మొదట్లో భృత్యునిగా ఉండేవాడని పేర్కొంది. 

* కె.ఎ. నీలకంఠశాస్త్రి ప్రకారం ఆంధ్ర అనే శబ్దం జాతి నామంగా, శాతవాహన శబ్దం రాజవంశంగా, ‘శాతకర్ణి’ అనే శబ్దం ఇంటి పేరుగా పేర్కొంటున్నారు.

* వీరి జన్మస్థలం కర్ణాటక అని సుక్తాంకర్, విదర్భ అని వి.వి.మిరాషీ, మహారాష్ట్ర అని జోగేల్కర్‌ శ్రీనివాస అయ్యంగార్‌  పేర్కొన్నారు. 

శాతవాహనులు ఆంధ్రులేనని రాప్సన్, భండార్కర్, స్మిత్, బర్జెస్‌లు వాదించారు. 

* వీరి ప్రాచీన రాజధాని శ్రీకాకుళం. తర్వాత ధాన్యకటకానికి మార్చారు. క్రీ.శ. మొదటి శతాబ్దంలో బాగా విస్తరించిన శాతవాహన సామ్రాజ్యానికి ‘ప్రతిష్ఠానపురం’ రాజధాని అని బార్నెట్‌ అభిప్రాయపడ్డారు. 

* జైన ఇతిహాసాలు, టాలమీ గ్రంథం శాతవాహనుల రాజధాని ప్రతిష్ఠానపురం అని పేర్కొన్నాయి. ఇది ఔరంగాబాద్‌ జిల్లాలో ఉండటంతో వీరు మహారాష్ట్రులని డీసీ. సర్కార్‌ వాదన. 

* కృష్ణా- గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని పాలించే వీరు అశోకుడి మరణానంతరం స్వతంత్రం ప్రకటించుకుని పశ్చిమోత్తరానికి విస్తరించారని విన్సెంట్‌ స్మిత్, రాయ్‌చౌదరి తెలిపారు. ఈ సిద్దాంతాన్నే ఎక్కువ మందిచరిత్రకారులు సమర్థించారు. 

*శాతవాహనుల కాల నిర్ణయ విషయంలోనూ భిన్నాభిప్రాయాలున్నాయి.

* కణ్వుల అనంతరం ఆంధ్రులు పాలకులయ్యారని పురాణాలు పేర్కొనగా, మరోవర్గం క్రీ.పూ. 28 నుంచి పాలన ప్రారంభించినట్లు వాదించారు. 

*అశోకుడి మరణానంతరం  క్రీ.పూ. 225 - క్రీ.శ. 225 వరకు పాలించారని మరో వాదన ఉంది.

*క్రీ.పూ.271 - క్రీ.శ.174 వరకు శాతవాహనులు పాలించారని గుర్తి వెంకటరావు అభిప్రాయం. మరికొందరు క్రీ.పూ.235 - క్రీ.శ.218 వరకు పాలించారని పేర్కొన్నారు.

శాతవాహన రాజులు - రాజకీయ చరిత్ర

* 30 మంది ఆంధ్రశాతవాహన పాలకులు సుమారు నాలుగున్నర శతాబ్దాల పాటు రాజ్యాన్ని పరిపాలించారని పురాణాలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. 

* మత్స్యపురాణం ప్రకారం ఆంధ్రులను ‘పాలోములు’ అని అంటారు. 

* మొదటి పులోమావి 15వ రాజు అని మత్స్యపురాణం తెలపగా, వాయు పురాణం 5వ రాజుగా పేర్కొంది.

* వీరి రాజకీయ చరిత్రకు సంబంధించి కూడా చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఎక్కువ మంది చరిత్రకారుల ప్రకారం కింది శాతవాహన రాజులు రాజ్యాన్ని పాలించారు.


మొదటి శాతకర్ణి (క్రీ.పూ. 194 - 185)

* ఇతడిని ‘శ్రీశాతకర్ణి’ అని కూడా అంటారు. 

* తన పేరుకు ‘శాతవాహన’ అనే వంశనామాన్ని జోడించిన తొలిరాజు. 

* ఇతడు రఠికుల ఆడపడుచు నాగానికను వివాహం చేసుకున్నాడు. ఈమె ‘నానాఘాట్‌’ శాసనం వేయించింది.

* ఈ శాసనంలో రాతి మీద శ్రీముఖుడు, మొదటి శాతకర్ణి, ఇతర రాజకుమారుల బొమ్మలను నాగానిక చెక్కించింది. ఇందులో మొదటి శాతకర్ణి ‘ఏకవీరుడని, శూరుడని, దక్షిణాధిపతి’ అని వర్ణించింది.

* ఇతడు మాళ్వా, నర్మదా నదీలోయ, విదర్భను ఆక్రమించుకుని ‘సామ్రాజ్యాధిపతి’ అనే బిరుదు పొందాడు. 

* రాజ్యాన్ని ఉజ్జయిని, విదిశ వరకు విస్తరించాడు. దీనికి సూచికగా రెండు అశ్వమేథయాగాలు, ఒక రాజసూయ యాగం జరిపించి సామ్రాట్‌ అనే బిరుదు పొందాడు. 

* వైదిక మతం పట్ల ఎక్కువ ఆసక్తి కనబరచి వైదిక క్రతువులు, యజ్ఞకర్మలను విరివిగా చేశాడు.


 రెండో శాతకర్ణి: (క్రీ.పూ.166 - 111) 

* ఇతడి కాలంలో సామ్రాజ్యం విస్తరించింది. 

* ఇతడు ఖారవేలుని చేతిలో ఓడిపోయాడు. 

* హాథిగుంఫా శాసనంలో రెండో శాతకర్ణి గురించి ఉంది. 

ఖారవేలుడి సైన్యాలు శాతవాహన రాజ్యంపై దండెత్తి ముసిక, పితుండ నగరాలను ధ్వంసం చేశాయి.

* ఖారవేలుడి మరణానంతరం రెండో శాతకర్ణి కళింగను జయించాడు. పశ్చిమ మాళ్వా రాజ్యాలు అవంతి, ఆకరాను గెలిచాడు.

* పుష్యమిత్ర శుంగుడు, డెమిట్రియస్, శకరాజులు ఆంధ్రపై దండెత్తినప్పుడు రాజ్యాన్ని రక్షించాడు. 

* శాతకర్ణి నాణేలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో దొరికాయి. 

* తన విజయాలకు గుర్తుగా అశ్వమేథ, రాజసూయ, అగ్నధేయ, గార్గాత్రిరాత్ర తదితర యజ్ఞాలు నిర్వహించాడు. 

* యజ్ఞ నిర్వాహకులకు దానధర్మాలు చేశాడు. 

* ఇతడి తర్వాత అపీలకుడు, కుంతల శాతకర్ణి పాలించారు. 

* కుంతల శాతకర్ణి కాలంలో సామ్రాజ్యం పాటలీపుత్రం వరకు విస్తరించింది. 

* ఇతడి మంత్రులు శర్వవర్మ ‘కాతంత్య్ర వ్యాకరణం’, గుణాఢ్యుడు బృహత్కథను రచించారు. 

*  శర్వవర్మను ‘బరుకచ్చా’ నగరానికి అధిపతిగా నియమించి గౌరవించాడు.


 హాలుడు: (క్రీ.శ 20 - 24)

* ఇతడు గొప్పరాజు, స్వయంగా కవి. 

* హాలుడు లీలావతి, అభిదాన చింతామణి’ అనే గ్రంథాలు రచించాడని పురాణాలు పేర్కొంటున్నాయి.

* ఈయన గాథసప్తశతి గ్రంథాన్ని సంకలనం చేశాడు. ఇది ప్రాకృత భాషలో ఉంది. 

* సింహళ రాజపుత్రికను వివాహమాడినట్లు ‘లీలావతి కావ్యం’ తెలుపుతుంది. 

లీలావతిని తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో వివాహం చేసుకున్నాడు.

* హాలుడి సేనాని విజయానంద శ్రీలంక దండయాత్రలో తోడ్పడ్డాడు. 

హాలుడికి కవివత్సలుడు అనే బిరుదు ఉంది. ఇతడు అతి తక్కువ కాలం పరిపాలన చేసినప్పటికీ ఈయన కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు.

* ఈయన తర్వాత క్షహరాటులు, క్షత్రపులు విజృంభించి రాజ్యపు పశ్చిమ భాగాన్ని ఆక్రమించారు. 


   శ్రీముఖుడు (క్రీ.పూ 235 - 213)

* ఆంధ్ర శాతవాహన సామ్రాజ్యానికి పునాది వేసినవాడు శ్రీముఖుడు. 

* మౌర్యచక్రవర్తి అశోకుడి మరణానంతరం ఇతడు స్వతంత్రత ప్రకటించుకున్నాడు. 

* వాయు పురాణం ప్రకారం కణ్వవంశరాజు సుశర్మను వధించి సిముకుడు మగధను ఆక్రమించాడు. 

* శ్రీముఖుడే సిముకుడు. కొండాపూర్, కోటిలింగాల వద్ద లభించిన నాణేల్లో ఇదే విషయాన్ని పేర్కొన్నారు. 

* పురాణాలను బట్టి ఇతడు 23 ఏళ్లు పరిపాలించాడు. ఇతడి రాజధాని ప్రతిష్ఠానపురం. ప్రస్తుతం ఔరంగాబాద్‌ జిల్లాగా పేర్కొంటున్నారు. 

* రఠికుల రాకుమారి నాగానికకు తన కుమారుడు మొదటి శాతకర్ణితో వివాహం జరిపించాడు. వీరి సహాయంతో భోజక, పీఠినిక, పుళిందులని ఓడించాడు. 

* శ్రీముఖుడు రాయ, మహారథి అనే బిరుదులు పొందాడు. 

* ఇతడి కాలంలో జైన, బౌద్ధమతాలు ఉన్నత స్థానంలో ఉండేవి. చివరి దశలో జైనుల కంటే బౌద్దుల వైపు మొగ్గు చూపాడు. 

* శ్రీముఖుడి గురించి ప్రస్తావన మొదటి శాతకర్ణి భార్య దేవినాగానిక వేయించిన నానాఘాట్‌ శాసనంలో ఉంది. 

* ఇతడి అనంతరం ఈయన తమ్ముడు కృష్ణుడు రాజయ్యాడు. ఇతడు శాసనాలు జారీ చేయడంలో ప్రథముడు. నాసిక్‌లో బౌద్ధబిక్షువుల కోసం గుహను తొలిపించాడు.


మాదిరి ప్రశ్నలు


1. ఆంధ్ర శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు ఎవరు?

1) మొదటి శాతకర్ణి    2) రెండో శాతకర్ణి    3) శ్రీముఖుడు     4) శర్వవర్మ


2. గాథసప్తశతిని ఏ భాషలో రచించారు?

1) ప్రాకృతం     2) సంస్కృతం    3)  హిందీ    4) తెలుగు


3. శాతవాహన అనే వంశనామాన్ని జోడించిన మొదటి రాజు?

1) శ్రీముఖుడు      2)  మొదటి శాతకర్ణి   3) రెండో శాతకర్ణి    4) హాలుడు


4. నానాఘాట్‌ శాసనాన్ని వేయించిన వారు?

1) దేవినాగానిక     2) బాలశ్రీ    3) హాలుడు      4) శ్రీముఖుడు


5. కింది వాటిలో హాలుడి బిరుదు?

1)  సామ్రాట్‌    2) మహారథి    3) రాయ   4) కవివత్సలుడు


సమాధానాలు

1-3  2-1   3-2    4-1  5-4 

Posted Date : 01-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌