• facebook
  • whatsapp
  • telegram

సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు

సాంఘిక పరిస్థితులు: అర్థశాస్త్రం ప్రకారం మౌర్యుల కాలంనాటి సమాజంలో వర్ణ వ్యవస్థ ఉంది. కానీ వేదకాలం నాటి పరిస్థితులకు భిన్నంగా ఉండేది. మెగస్తనీస్‌ ‘ఇండికా’లో మౌర్య సమాజంలో ఏడు కులాలున్నట్లు పేర్కొన్నాడు. వారు బ్రాహ్మణులు, వ్యవసాయదారులు, పశుపాలకులు, వృత్తిపనివారు, వ్యాపారులు, వేటగాళ్లు, సైనికులు మొదలైనవారు. వృత్తులు క్రమంగా కులాలుగా రూపాంతరం చెందాయి. వర్ణాశ్రమ ధర్మాలను అగ్రవర్ణాల వారే పాటించారు. జైన, బౌద్ధ, అజీవక మతాల ప్రభావం సమాజంపై ఉండేది. అర్థశాస్త్రంలో నాలుగు ప్రధాన వర్ణాలను పేర్కొనగా బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యం ఉండేది. లోహకారులకు సమాజంలో మంచి స్థానం ఉండేది. కులాల మధ్య అంతరాలు పెరిగాయి. వివాహాలు తమ కులం లేదా వృత్తివారినే చేసుకున్నా, అక్కడక్కడ వర్ణాంతర వివాహాలూ జరిగాయి. చంద్రగుప్త మౌర్యుడు సెల్యుకస్‌ నికేటర్‌ కుమార్తెను, అశోకుడు వైశ్య విదిశ రాకుమారిని పెళ్లి చేసుకున్నారు. వీరి కాలంలో బౌద్ధ సంఘాలు ఎక్కువగా ఉండేవి. సమాజంలో బహుభార్యత్వం ఉండేది. స్త్రీ స్వాతంత్య్రం తగ్గింది. కన్యల క్రయవిక్రయాలు, సతీసహగమనం ఉండేది. వేశ్యా వృత్తిని ప్రభుత్వం ఆమోదించింది. వైశ్యులు వ్యాపారం, శూద్రులు వ్యవసాయం ఇతర సేవా పనులు చేసేవారు. ఆస్తి హక్కు ఉండేది.

తత్వవేత్తలకు రాజు ఆస్థానంలో ప్రముఖ స్థానం కల్పించారు. విద్యావంతులైన వీరు సాంస్కృతిక కార్యకలాపాల్లో పాలుపంచుకునేవారు. సైనికులు యుద్ధ విద్యల్లో నిమగ్నమై ప్రజలను కాపాడేవారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రజలను వారి సామర్థ్యం ఆధారంగా నియమించేవారు. అశోకుడి శాసనాలు కేవలం బ్రాహ్మణులు, శ్రమణులు అనే రెండు వర్గాలున్నాయని పేర్కొన్నాయి. సమష్టి కుటుంబ వ్యవస్థ ఉండేది. స్త్రీలకు 12, పురుషులకు 16 ఏళ్లు వచ్చేసరికి వివాహం చేసేవారు. ఎనిమిది రకాల వివాహాలు అమలులో ఉండేవి. స్త్రీలు ‘స్త్రీ ధనం’ కలిగి ఉండేవారు. అంతేకాకుండా రక్షకభటులుగా, గూఢచారులుగా, నృత్య కళాకారిణులుగా పనిచేసేవారు. ‘గణికులు’ అనే వేశ్యలు ఉండేవారు. బౌద్ధ జాతక కథల్లో ‘దండదాసులు’ అనే మరో బానిస వ్యవస్థ ఉండేదని తెలుస్తుంది.

* సమాజంలో బానిసత్వం లేదని మెగస్తనీస్, ఎరియన్‌ పేర్కొన్నారు. పట్టణవాసులు చట్టాలకు లోబడి జీవించేవారు. ప్రజలు నిజాయతీగా, నిరాడంబరమైన, సుఖప్రదమైన జీవితాన్ని గడిపేవారు. చదరంగం, పాచికలు, ముష్టియుద్ధాలు, రథపందాలు, కత్తియుద్ధాలు ప్రధాన వినోదాలు. బుట్టలు అల్లేవారు, వేటగాళ్లు, చేపలు పట్టేవారు, చర్మకారులు, రథకారులను ‘అంటరానివారిగా’ పరిగణించేవారు. వీరు తలారులు, కాటికాపరులు, వేటగాళ్లుగా ప్రభుత్వంలో పనిచేసేవారు. దీన్ని బట్టి మౌర్య సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలు ఉండేవని అర్థమవుతుంది.


ఆర్థిక పరిస్థితులు: మౌర్య సామ్రాజ్యం గంగా-సింధూ మైదానంలో ఉండటంతో సారవంతమైన భూములను కలిగి వ్యవసాయానికి అనువుగా ఉండేది. అధిక ఉత్పత్తులు పొంది ఆర్థికాభివృద్ధి సాధించింది. నదీపరీవాహక ప్రాంతాలుండటంతో నీటిపారుదల సౌకర్యాలు ఉండేవి. వరి, బార్లీ, గోధుమలు అధికంగా పండించేవారు. శ్రావస్తి, వారణాసి, చంపా, రాజగృహం, ఉజ్జయిని, కౌశాంబి, కుశి, సాకేత లాంటి నగరాలు ప్రధాన వర్తక కేంద్రాలయ్యాయి. వస్త్ర పరిశ్రమకు ప్రాధాన్యం ఉండేది. మధుర, అపరాంతం, కాశీ, వంగ, వత్స, విదిశ లాంటి ప్రాంతాలు వస్త్ర పరిశ్రమ కేంద్రాలుగా ఉండేవి. మౌర్యులు మధ్య ఆసియా, మగధ, కాశీతో జనపనార పరిశ్రమ, పశ్చిమాసియాతో వర్తక, వాణిజ్యాలు కొనసాగించేవారు. సిరియా, ఈజిప్ట్, గ్రీకు దేశాలతో వాణిజ్యంతో పాటు, దౌత్య సంబంధాలుండేవి. వజ్రాలు, చందనం, దంత వస్తువులు, నూలు, సిల్క్‌ వస్త్రాలు ప్రధాన ఎగుమతులు కాగా వెండి, బంగారం, ఖర్జూరం, ద్రాక్షను దిగుమతి చేసుకునేవారు. కొన్ని విదేశీ దిగుమతుల వస్తువులపై పన్ను మినహాయింపు ఉండగా, స్థానిక వస్తువులపై 5%, విదేశీ వస్తువులపై 10% మించి లాభం తీసుకునేవారుకాదు. ఆయా వస్తువులను బట్టి 6వ భాగం నుంచి 25వ భాగం వరకు సాధారణ పన్ను వసూలు చేశారు. ‘పణా, మసికా, కాకిని’ అనే నాణేలు చలామణిలో ఉండేవి.

* వర్తకులు శ్రేణులుగా ఏర్పడి వ్యాపారం చేసేవారు. వీరు బ్యాంకులుగా పనిచేసి డిపాజిట్లపై 15% వరకు వడ్డీ ఇచ్చేవారు. ప్రతి శ్రేణిలో ‘ప్రముఖ’ అనే అధ్యక్ష, ‘జెట్టిక’ అనే కార్యదర్శి ఉండేవాడు. పట్టణాధ్యక్షుడు సరుకుల ధరలను నిర్ణయిస్తాడు. తూనికలు, కొలతల్లో మోసాలు జరగకుండా పర్యవేక్షించేందుకు ‘‘పౌత్యాధ్యక్షుడు’’ అనే అధికారి ఉండేవాడు. పన్నుల వసూలు అధికారి (సన్నిదాత), ఖజానాను భద్రపరచే అధికారి (సమాహార్త) ఆదాయ, వ్యయాలను చూసేవారు. వెండితో చేసిన విద్దాంక నాణెలు మారకపు ద్రవ్యంగా ఉండేవి. వీటి మీద నెమలి, కొండ, నెలవంక చిత్రాలుండేవి.

* భూ, నదీ, సముద్ర మార్గాల ద్వారా వ్యాపారం జరిగేది. పశ్చిమ తీరంలో ప్రధాన రేవు పట్టణం బరుకచ్చా. రోడ్డుమార్గాల్లో ప్రతి 9 మైళ్ల దూరానికి ఒక మంచి నీటి బావి, విశ్రాంతి గదులు ఉండేవి. ఉత్తర భారత్‌లో పాటలీపుత్రం నుంచి తక్షశిల వరకు గ్రాండ్‌ ట్రంక్‌ రోడ్డు ఉండేది. తూర్పు, పశ్చిమ తీరం ద్వారా సముద్ర వ్యాపారం జరిగేది. పంజాబ్‌లోని ‘కధిమోయి’ తెగవారు ఓడల నిర్మాణం చేసేవారు. ఓడల నిర్మాణం, సముద్ర వ్యాపారం ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండేదని ‘స్ట్రాబో’ పేర్కొన్నాడు. నూలు వస్త్రాలు, వజ్రాలు, కెంపులు, రత్నాలు, బంగారం ఉత్తరానికి ఎగుమతి అయ్యేవి.


సాంస్కృతిక పరిస్థితులు: మౌర్యుల కాలంలో సాహిత్యం, కళారంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించారు. ప్రాకృతం, సంస్కృత భాషలు అభివృద్ధి చెందగా, బ్రాహ్మి, కరోష్ఠి లిపుల్లో అశోకుడు తన శాసనాలను వేయించాడు. తక్షశిల, వారణాసి లాంటి విద్యా కేంద్రాల్లో తర్కం, వ్యాకరణం, రాజనీతి, ఇతిహాసం, వైద్య విద్యలు బోధించేవారు. వీరి రాజభాష ‘ప్రాకృతం’. ఈ భాషలోనే భద్రబాహు జైన కల్పసూత్రాలు, అభిదమ్మ పీఠిక, కథావత్తు ఉన్నాయి. వీరి కాలంలో సంస్కృతానికీ ప్రాధాన్యం ఉండేది. అర్థశాస్త్రం, పింగళ, గౌతమ, బాదరాయణ, అపస్తంభ, వశిష్టుల పేరుతో ఉన్న ధర్మసూత్రాలు, గృహ్యసూత్రాలు ఈ యుగం నాటివే. కంసవధ, బలిబంద అనే నాటకాలు ప్రదర్శించేవారు. యయాతి, వాసవదత్త కథలు ప్రచారంలో ఉండేవి. వాస్తు విషయంలో గ్రీకు శిల్పకళ ప్రభావం ఉంది. నిర్మాణంలో కలపకు బదులు శిలను ఉపయోగించడం ప్రారంభమైంది. బౌద్ధస్తూపాల నిర్మాణానికి బయట గోడలకు కాల్చిన ఇటుకలు, లోపలి గోడలకు పచ్చి ఇటుకలను వాడారు. పాట్నాలో రాతి స్తంభాలతో కట్టిన రాజ భవనాన్ని కనుక్కున్నారు. బెనారస్‌ దగ్గరలోని ‘చునార్‌’ క్వారీల నుంచి రాయిని సేకరించారు. బౌద్ధ గ్రంథాల ప్రకారం అశోకుడి కాలంలో 84,000 స్తూపాలు నిర్మించారు. వీటిలో సాంచీ, సారనాథ్, బర్హూత్‌ స్తూపాలు ముఖ్యమైనవి. కొండలను తొలిచి ఆలయాలు నిర్మించే పద్ధతి వీరికాలంలోనే మొదలైంది. అశోకుడు, దశరథుడు తొలిపించిన గుహాలయాలు నేటికీ బిహార్‌ (గయ)లోని బారాబర్‌ కొండల్లో నాలుగు, నాగార్జున కొండల్లో మూడు, సీతామర్హి కొండల్లో ఒకటి ఉన్నాయి. వీటిని అజీవకులకు దానం చేశారు. బారాబర్‌ కొండల్లోని గుహాల్లో లోమన్‌రుషి, సుధామ గుహలు ముఖ్యమైనవి. అశోకుడి ఏకశిలా స్తంభాలు 30 నుంచి 40 అడుగుల ఎత్తు ఉంటాయి. ఈయన స్తంభాల్లో రాంపూర్వ, బఖీరా, లౌర్యా నందనగర్, రుమ్మిందై, సాంచీ, సారనాథ్‌ ప్రధానమైనవి. రాంపూర్వ శిల్పంపై వృషభం, లౌర్యా నందనగర్‌పై సింహం శిల్పాలున్నాయి. సారనాథ్‌ స్తంభంపై అశోకచక్రం, నాలుగు సింహాలు చెక్కబడి ఉన్నాయి. భారత ప్రభుత్వం వీటిని అధికారిక చిహ్నాలుగా ప్రకటించింది. వి.ఎ.స్మిత్‌ అనే చరిత్రకారుడు ‘సారనాథ్‌ శిల్పం పరిపూర్ణమైన, వాస్తవిక, మనోహర కళాఖండం’ అని వ్యాఖ్యానించాడు.


మత పరిస్థితులు

మౌర్య సామ్రాజ్యంలో జైన, బౌద్ధ, వైదిక మతాలు ఉండేవి. వీరితో పాటు అక్కడక్కడ అజీవకులు, చార్వాకులు ఉండేవారు. చంద్రగుప్త మౌర్యుడు  జైనమతం, అశోకుడు బౌద్ధమతం స్వీకరించి వాటి వ్యాప్తికి కృషి చేశారు. ఇండికా, అర్థశాస్త్రం ప్రకారం అధిక సంఖ్యలో వైదికమతాన్ని అనుసరించేవారు. అశోకుడు జంతువధ, క్రతు, యజ్ఞాలు నిషేధించినా అవి కొనసాగుతూనే ఉండేవి. అతడి మరణానంతరం వైదికమతం విజృంభించింది. మోక్షసాధనకు ‘భక్తి’ మార్గమనే సూత్రం ప్రతిపాదించారు, విగ్రహారాధన పెరిగింది. శైవ, వైష్ణవ మతశాఖలు పెరిగాయి. శివుడు, విష్ణువు, ఇంద్రుడు తదితరులను ఆరాధించడం ప్రారంభమైంది. కొందరు గ్రీకులు వైదికమతాన్ని స్వీకరించారు. చివరి మౌర్యుల కాలంలో పుష్యమిత్ర శుంగుడు అనే బ్రాహ్మణుడు చివరి మౌర్యరాజు బృహద్రధుడిని వధించి శుంగ వంశ స్థాపన చేశాడు.


సంగ్రహంగా....

* భారతదేశంలో విశాల సామ్రాజ్యం స్థాపించి, సుస్థిరపాలన అందించినవారు మౌర్యులు. వీరి చరిత్రను తెలుసుకోవడానికి కౌటిల్యుడి అర్థశాస్త్రం, మెగస్తనీస్‌ ఇండికా, అశోకుడి శిలాశాసనాలు, జైన, బౌద్ధ సాహిత్య గ్రంథాలు, పురావస్తు ఆధారాలు ప్రధానమైనవి.

* మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. ఇతడి కాలంలోనే గ్రీకుల నుంచి భారతీయులు విముక్తులయ్యారు. చివరి మగధ రాజు ధననందుడిని ఓడించి రాజయ్యాడు. క్రీ.పూ. 305లో గ్రీకు రాజు సెల్యుకస్‌ నికేటర్‌ను ఓడించి అతని కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఇతడి ఆస్థానాన్ని ‘మెగస్తనీస్‌’ దర్శించి ‘ఇండికా’ గ్రంథం రాశాడు. జైనమతం స్వీకరించి, సల్లేఖన వ్రతం పాటించి మరణించాడు.

* బిందుసారుడు రాజ్యానికి వచ్చిన పిమ్మట ‘అమిత్రగాత్ర, సింహసేనుడు’ అనే బిరుదులు పొందాడు. గ్రీకు, ఈజిప్ట్‌లతో దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్నాడు.

* అశోకుడు క్రీ.పూ. 273232లో మౌర్య సామ్రాజ్యాన్ని పాలించాడు. క్రీ.పూ. 216లో ‘కళింగ యుద్ధం’ చేశాడు. ధన, ప్రాణ నష్టం ఎక్కువగా జరగడంతో మనసు మార్చుకొని యుద్ధాలు చేయనని ప్రతిజ్ఞ చేశాడు. ఉపగుప్తుడి బోధనలతో బౌద్ధమతం స్వీకరించాడు. ఈయన కాలంలోనే మూడో బౌద్ధసంగీతి జరిగింది. పరమత సహనం పాటించి ‘దేవానాంప్రియ, ప్రియదర్శిక’ అనే బిరుదులు పొందాడు. ఈయన ‘అశోక ది గ్రేట్‌’గా పేరు పొందాడు.

* చివరి మౌర్య రాజులు ఎవరన్న విషయంలో చరిత్రకారులకు భిన్నాభిప్రాయాలున్నాయి. చివరి మౌర్యరాజు బృహద్రధుడు. ఇతడిని పుష్యమిత్ర శుంగుడు వధించి శుంగ వంశాన్ని స్థాపించాడు.

* చివరి మౌర్యుల కాలంలో పరిపాలన బలహీనపడి సామ్రాజ్యం పతనమైంది. అశోకుడి పాలనా విధానాలు, విదేశీ దండయాత్రలు, వారసత్వ తగాదాలు, నిరకుంశపాలనతో మౌర్య సామ్రాజ్యం అంతర్థానమైంది. 

* రాజే సర్వాధికారి అయినప్పటికీ అతడికి తోడ్పడటానికి మంత్రి పరిక్షత్‌ ఉండేది. కేంద్ర, రాష్ట్ర, నగర, గ్రామాల్లో అధికారులను నియమించి పాలన సాగించేవారు. ‘భూమి శిస్తు’ ప్రధాన ఆదాయ మార్గం.

సమాజంలో వివిధ రకాల వృత్తులుండేవి. ఏడు కులాలున్నట్లు మెగస్తనీస్‌ పేర్కొన్నాడు. వర్థవ్యవస్థ ఉండగా, స్త్రీలకూ ప్రాధాన్యం ఉండేది. వర్తకులు స్వదేశీ, విదేశీ వ్యాపారం చేసేవారు. భూ, సముద్రమార్గాలు అభివృద్ధి చెందాయి.

* జైన, బౌద్ధ, వైదికమతాలకు ప్రాధాన్యం ఉండేది. రాజభాష ‘ప్రాకృతం’, సాహిత్యం, కళలు బాగా అభివృద్ధి చెందాయి. శిల్పాలతో కూడిన స్తంభాలు ఉండేవి.

Posted Date : 05-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌