• facebook
  • whatsapp
  • telegram

ఢిల్లీ సుల్తానులు

 చారిత్రక నేపథ్యం


* ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యం ఆధునిక భారతదేశం, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో పాటు దక్షిణ నేపాల్‌లోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించింది. 


* మొదట ఘురిడ్‌ సామ్రాజ్య పాలకులు భారత్‌పై దండెత్తి కొన్ని ప్రాంతాలను ఆక్రమించారు. తర్వాతి కాలంలో మహమ్మద్‌ గజనీ, ఘోరీలు తమ సామ్రాజ్యాన్ని భారతదేశంలో విస్తరింపజేశారు.


* మహమ్మద్‌ ఘోరీ భారతదేశంలో ఆక్రమించిన భూభాగాలకు కుతుబుద్దీన్‌ ఐబక్‌ను ప్రతినిధిగా నియమించాడు. ఘోరీ మరణించాక కుతుబుద్దీన్‌ స్వాతంత్య్రం ప్రకటించుకుని ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. అప్పటి నుంచి క్రీ.శ.1526 వరకు అనేకమంది ముస్లిం పాలకులు భారతదేశాన్ని పాలించారు.

రాజవంశాలు


ఢిల్లీని అయిదు రాజవంశాలు పాలించాయి. మొదట బానిస వంశం తర్వాత ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశాలు రాజ్యపాలన చేశాయి. వీరు భారతదేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక, మత, సాంస్కృతిక రంగాల్లో తమదైన ముద్ర వేశారు. 


 మధ్యయుగ ప్రారంభంలో అరబ్బులు, తురుష్కులు భారతదేశంపై చేసిన దండయాత్రలు సఫలం కావడం; మహమ్మద్‌ ఘోరీ తన సామ్రాజ్యాన్ని భారతదేశంలోనూ విస్తరింపజేయడం ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్య స్థాపనకు పునాదిగా నిలిచాయి.

పురావస్తు ఆధారాలు


ఢిల్లీ సుల్తానుల చరిత్రను ఆ కాలం నాటి శాసనాలు, నాణేలు, చారిత్రక కట్టడాలు, కమానులు, ఇతర నిర్మాణాల ద్వారా తెలుసుకోవచ్చు. 


 ఢిల్లీలోని కుతుబ్‌ మినార్, కొవతల్‌ ఇస్లాం, ఇల్‌టుట్‌మిష్‌ సమాధి, బాల్బన్‌ సమాధి, హౌజ్‌ ఖాస్‌ కాంప్లెక్స్, నిజాముద్దీన్‌ ఔలియా మసీదు, జహన్‌ పణా; అజ్మీర్‌లోని అధై దిన్‌ కా జోప్రా మసీదు (కుతుబుద్దీన్‌ ఐబక్‌ నిర్మించాడు); అల్లాఉద్దీన్‌ ఖిల్జీ కట్టిన సిరినగరం, అలయ్‌ దర్వాజా; ఫిరోజ్‌ తుగ్లక్‌ నిర్మించిన ఫిరోజాబాద్, తుగ్లకాబాద్‌; నాసీముద్దీన్‌ నిర్మించిన లాల్‌ గుంబద్‌ భవనం; అజ్మీర్, ఆగ్రా, ఫిరోజ్‌బాద్, హిస్సార్, జాన్‌పూర్‌లోని అనేక కట్టడాలు ఢిల్లీ సుల్తానుల చరిత్రను, వాస్తు శిల్పకళను వివరిస్తున్నాయి. 


 ఢిల్లీలో మోతీ మసీదును సికిందర్‌ లోడీ వజీర్‌ అయిన ముబారక్‌ షా నిర్మించాడు. ఇది ఢిల్లీ సుల్తానుల కాలం నాటి ఇండో-ఇస్లామిక్‌ శైలికి ఉదాహరణ. 


 ఢిల్లీ సుల్తానులు టంకా (వెండి), జిటాల్‌ (రాగి) నాణేలు ముద్రించారు. ఇవి ఆ కాలం నాటి ఆర్థిక, సాంకేతిక, వాణిజ్య విషయాలను తెలుపుతున్నాయి. 


 ఈ నాణేలపై అనేక రకాల ముద్రలు, భాష, సుల్తాన్‌ బిరుదులు, చిత్రాలను చెక్కారు. మహ్మద్‌-బిన్‌-తుగ్లక్‌ రాగి నాణేలు వేయించాడు. ఢిల్లీ సుల్తానులు జారీ చేసిన ఫర్మానాలు, ఫత్వాలు వారి చరిత్రకు ఆధారాలు.


విదేశీ రచనలు 


 ఢిల్లీ సుల్తానుల చరిత్రను తెలుసుకోవడానికి విదేశీ రచనలు కూడా ముఖ్య ఆధారాలుగా ఉన్నాయి. ఎంతోమంది విదేశీ యాత్రికులు వివిధ ఢిల్లీ సుల్తానుల ఆస్థానాలను సందర్శించి, నాటి పరిస్థితులను గ్రంథ రూపంలో రాశారు.


 శిహబుద్దీన్‌ అబ్బాస్‌ (డమస్కస్‌) రచించిన మసాలిక్‌-ఉల్‌-అబ్‌సర్‌ గ్రంథంలో మహ్మద్‌-బిన్‌-తుగ్లక్‌ పరిపాలన, నాటి పరిస్థితుల గురించి ఉంది. 


 ఇబన్‌బటుటా (అరబ్బు యాత్రికుడు) రాసిన కితాబ్‌-ఉల్‌-రెహ్లా గ్రంథంలో తుగ్లక్‌ వంశం గురించి ఉంది.


  అబ్దుల్‌ రజాక్‌ (పర్షియా), నికొలోకాంటె (ఇటలీ), బార్బోసా (పోర్చుగల్‌), డోమింగో పేజ్‌ (పోర్చుగల్‌) రచనలు మధ్యయుగ భారతదేశ పరిస్థితులను తెలుపుతున్నాయి.


ఢిల్లీ సామ్రాజ్య స్థాపన 


మహమ్మద్‌ ఘోరీ మరణించాక క్రీ.శ. 1206లో కుతుబుద్దీన్‌ ఐబక్‌ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించడంతో భారతదేశంలో ముస్లిం పాలన ప్రారంభమైంది. 


 ఢిల్లీ సుల్తానులు క్రీ.శ.1206 నుంచి క్రీ.శ.1526 వరకు పాలించగా, క్రీ.శ.1526 నుంచి క్రీ.శ.1857 వరకు మొగల్‌ చక్రవర్తులు పరిపాలించారు. 


 ఢిల్లీని కేంద్రంగా చేసుకుని అయిదు రాజవంశాలు పాలించాయి. అవి:


1. బానిస వంశం లేదా మామ్లుక్‌ వంశం (క్రీ.శ.1206 - క్రీ.శ.1290)


2. ఖిల్జీ వంశం (క్రీ.శ.1290 - క్రీ.శ.1320)


3. తుగ్లక్‌ వంశం (క్రీ.శ.1320 - క్రీ.శ.1414)


4. సయ్యద్‌ వంశం (క్రీ.శ.1414 - క్రీ.శ.1451)


5. లోడీ వంశం (క్రీ.శ.1451 - క్రీ.శ.1526)


 ఈ అయిదు రాజవంశాలు దాదాపు 320 ఏళ్లు ఢిల్లీని కేంద్రంగా చేసుకుని పాలించాయి. 


 ఈ కాలంలో సామాజిక, ఆర్థిక, మత, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధితో పాటు, ఇస్లాం మత వ్యాప్తి జరిగింది.కుతుబుద్దీన్‌ ఐబక్, ఇల్‌టుట్‌మిష్, అల్లాఉద్దీన్‌ ఖిల్జీ మొదలైన వారు అనేక దండయాత్రలు చేసి సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు. 


 అరబ్బులు, గజినీ, ఘోరీ కాలంలో ముస్లింల అధికారం కేవలం ఉత్తర భారతదేశానికే పరిమితమైంది. అల్లాఉద్దీన్‌ ఖిల్జీ పాలనాకాలంలో దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాలు/ రాజ్యాలు ఢిల్లీ సుల్తానుల అధీనంలోకి వచ్చాయి.

 ఢిల్లీ సుల్తానుల కాలంలో రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. దక్షిణ భారతదేశంలోని కొన్ని రాజవంశాలు పతనమయ్యాయి. పరిపాలనా వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయి. 


 వీరు ఇతర మతాల పట్ల పరమత సహనం పాటించారు.  ఢిల్లీ సుల్తానులు ఖలీఫాకు (ఇస్లాం మత పెద్ద) ప్రాధాన్యం ఇచ్చారు. 


 ఢిల్లీ సుల్తానులు పరిపాలించే నాటికి దక్షిణ భారతదేశాన్ని కాకతీయులు, హొయసలులు, యాదవులు, పాండ్యులు, ముసునూరి నాయకులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, బహమనీ పాలకులు పాలించారు. 


 అల్ల్లాఉద్దీన్‌ ఖిల్జీ కాలంలో కాకతీయ, హొయసల, యాదవ రాజ్యాలు ఢిల్లీ సుల్తానుల అధీనంలోకి వచ్చాయి. 


 మహ్మద్‌-బిన్‌-తుగ్లక్‌ తర్వాత ఢిల్లీని పాలించిన వారంతా బలహీనులు కావడం వల్ల వీరి సామ్రాజ్యం పతనమైంది. 


 క్రీ.శ.1526, ఏప్రిల్‌ 21న జరిగిన మొదటి పానిపట్‌ యుద్ధంలో బాబర్‌ చేతిలో ఇబ్రహీంలోడీ ఓడిపోయాడు. దీంతో భారతదేశంలో ఢిల్లీ సుల్తానుల పాలన అంతమై, మొగల్‌ సామ్రాజ్య పాలన ప్రారంభమైంది.

చారిత్రక ఆధారాలు


ఢిల్లీ సుల్తానుల కాలం నాటి దండయాత్రలు; సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత, సాంస్కృతిక పరిస్థితులు; పరిపాలనా విధానం, వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధి మొదలైన విషయాలను తెలుసుకునేందుకు పురావస్తు ఆధారాలు; సాహిత్య, విదేశీ రచనలు తోడ్పడుతున్నాయి.


సాహిత్య ఆధారాలు 

ఢిల్లీ సుల్తానుల చరిత్రను తెలుసుకోవడానికి అనేక సాహిత్య ఆధారాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి:


 ఫక్రుద్దీన్‌ ముబారక్‌షా రచించిన వంశావళి(Genealogies)


 నూరుద్దీన్‌ మహమ్మద్‌ ఔఫీ రచించిన జవామీ ఉల్‌ హికాయత్‌


 మహమ్మద్‌ అలీ బిన్‌ అబూ బకర్‌ కుఫీ అరబిక్‌ గ్రంథమైన చచ్‌ నమాను పర్షియన్‌ భాషలోకి అనువదించాడు. 


 తబాకత్‌-ఐ-నాసిరి గ్రంథాన్ని మిన్‌హజ్‌-ఉజ్‌-సిరాజ్‌ రాశాడు.


 తారిఖ్‌-ఐ-ఫిరోజ్‌షాహీ గ్రంథాన్ని జియాఉద్దీన్‌ బర్మానీ రాశాడు.


 తారిఖ్‌-ఉల్‌-మస్సిర్‌ గ్రంథాన్ని హసన్‌ నిజామి రచించాడు.


 తారిఖ్‌-ఉల్‌-సింధ్‌ గ్రంథాన్ని మీర్‌ మహమ్మద్‌ మాసుమ్‌ రాశాడు.


 తారిఖ్‌-ఐ-హింద్‌ గ్రంథాన్ని అల్‌బెరునీ రచించాడు.


 తారిఖ్‌-ఇ-యమినీ గ్రంథాన్ని ఉద్బీ రాశాడు.


 ఖాజా-ఇన్‌-ఉల్‌-ఫుటుహ్‌ గ్రంథాన్ని అమీర్‌ ఖుస్రూ రాశాడు.


 తారిఖ్‌-ఐ-ముబారక్‌ గ్రంథాన్ని యాహ్యా బిన్‌ అహ్మద్‌ సర్హిందీ రచించాడు.


 ఫత్వాహ్‌-ఐ-జహందరీ గ్రంథాన్ని జియాఉద్దీన్‌ బరానీ రాశాడు.


 ఫుటుహ్‌ - అల్‌ - సలాటిన్‌ గ్రంథాన్ని అబూ మాలిక్‌ ఇసామీ రచించాడు.


 తారిఖ్‌-ఐ-సలాటిన్‌ గ్రంథాన్ని అహ్మద్‌ యాడ్గర్‌ రాశాడు.


 ఈ సాహిత్య రచనలు ఢిల్లీ సుల్తానుల అయిదు రాజవంశాలు, పాలకులు, విజయాలు, ఖలీఫాల వివరాలు, పరిపాలనా సంస్కరణలు, సమకాలీన రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక పరిస్థితులను తెలుపుతున్నాయి.


రచయిత

డాక్టర్‌ వి. రాజ్‌మహ్మద్‌

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 

Posted Date : 13-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌