• facebook
  • whatsapp
  • telegram

నివేదికా రచన 

లేఖా రచనకు బదులుగా కొన్నిసార్లు నివేదికారచన ఇవ్వవచ్చు. లేదా రెండూ ఇవ్వవచ్చు. లేఖలో వ్యక్తిగత సమాచారం ఉంటుంది. నివేదిక అనేది ఒక అంశానికి సంబంధించిన వివరణ. దీంట్లో 'సంఖ్యాత్మక సమాచారానికి' ప్రాధాన్యం ఉంటుంది. రాజకీయ, సాంఘిక, వాణిజ్యాది రంగాల్లో సమాచారంపై నివేదికలు అడుగుతారు. గణాంకాలు పేర్కొనేటప్పుడు పాతవైనా వీలైనంత వరకు సరైన వివరాలు ఇస్తే మంచి మార్కులు పొందవచ్చు. ఇచ్చినంత వరకు సమగ్రంగా ఉండేలా చూసుకోవాలి.

1. బాలకార్మికులపై నివేదిక రూపొందించండి. 
        నేటి బాలలే రేపటి పౌరులు. బాలల్లో ఎంతమంది మేధావులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, ప్రతిభావంతులు ఉన్నారో చెప్పలేం. అలాంటివారితో పనులు చేయించి, ఎదుగుదలకు వీలు లేకుండా వాళ్ల జీవితాలను ఛిద్రం చేయడం అమానుషం. అందుకే ఐక్యరాజ్యసమితి పిల్లల హక్కుల ప్రకటన వెలువరించింది. 1989లో ఐరాస బాలల హక్కులకు సంబంధించి ఒక ఒప్పందాన్ని రూపొందించి, ప్రపంచ దేశాలతో ఆమోదింపజేసింది. ఏ పిల్లలకైనా చదువుకోవడం, ఇష్టంగా పనిచేయడం లాంటి హక్కులు, స్వేచ్ఛ ఉంటాయి. బాలలతో పనులు చేయించి వారి భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. ప్రభుత్వం పౌరహక్కుల చట్టం, బాలకార్మిక నిషేధ చట్టం, వెట్టిచాకిరి నిషేధ చట్టం లాంటివి తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ చిల్డ్రన్స్ బోర్డ్‌ను ఏర్పాటు చేసింది. ఇళ్లు, చిన్న చిన్న పరిశ్రమలు, హోటళ్లు లాంటివాటిలో బాలకార్మికులతో పని చేయించడం నిషిద్ధం. దేశంలో సుమారు 1.12 కోట్ల మంది, మనరాష్ట్రంలో సుమారు 21 లక్షల మంది బాలకార్మికులున్నట్లు అంచనా. ఉన్న చట్టాలను పటిష్టంగా అమలుపరచి బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాల్సి ఉంది.


2. ఇటీవల రైళ్లలో జరుగుతున్న దొంగతనాల గురించి నివేదిక రూపొందించండి. 
        విజయవాడ-చెన్నై, విజయవాడ-హైదరాబాద్ మధ్య నడిచే రైళ్లలో తరచూ దోపిడీలు జరుగుతున్నాయి. దొంగల భయంతో ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో 5, 6 నంబర్ల బోగీల్లో అయిదుగురు సభ్యుల ముఠా ప్రయాణికుల్లా ప్రవేశించింది. అందులోని ప్రయాణికులను చావబాది ఆరుతులాల బంగారం, లక్ష వరకూ నగదు దోచుకువెళ్లారు. మరుసటి రోజే గౌతమీ ఎక్స్‌ప్రెస్‌లో దొంగతనం జరిగింది. ఈసారి ఆయుధాలతో బెదిరించి, ఘట్‌కేసర్ దాటగానే గొలుసులాగి దోపిడీ చేశారు. పెళ్లి కోసం దాచుకున్న నగలను దోచుకొని వెళ్లారు. దొంగలతో పెనుగులాడటం వల్ల ప్రయాణికులకు దెబ్బలు కూడా తగిలాయి. సామాన్యంగా దొంగతనాలు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల మధ్య జరుగుతున్నాయి. అప్పుడు అందరు నిద్రపోయే సమయం కదా మరి! బంగారం ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల దొంగల కళ్లు నగలూ, ఆభరణాలపై పడ్డాయి. రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటంలేదు. రైల్లో పది పదిహేనుమంది పోలీసులు సాయుధులై పహారా కాస్తూ ఉండాలి. ప్రతి బోగీలోనూ అత్యవసర 'కాలింగ్ బెల్' ఉంటే అందరూ అప్రమత్తమవుతారు. రైళ్లలో దొంగతనం చేసేవారు ఎక్కువగా ఇతర రాష్ట్రాలవారే. అందులోనూ యువకులే ఎక్కువగా ఉంటున్నారు. వీళ్లతో ఎవరైనా తెగించి పోరాడితే, అతడి ప్రాణానికి ముప్పే. పోలీసు గస్తీ ముమ్మరం చేయాలి. దొంగలను పట్టుకొని శిక్షించాలి. దీని గురించి ప్రముఖ ప్రచార, ప్రసార సాధనాల్లో వెల్లడించాలి.


3. మీ పోలీస్ స్టేషన్‌లో గత నెలలో జరిగిన కార్యక్రమాలపై నివేదిక తయారు చేయండి. 
        మా పోలీస్ స్టేషన్ జిల్లాలో ముఖ్యమైనదే కాకుండా, అనేకసార్లు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బహుమతులను కూడా పొందింది. దీనికి మా ఎస్.ఐ., వారి సిబ్బంది పనితీరే కారణం. ఎల్లవేళలా ప్రజల పక్షమే వహిస్తూ మెప్పుపొందాం. గతనెలలో పోలీసు అమరుల దినోత్సవం నిర్వహించాం. సమాజం కోసం, దేశం కోసం అసువులు బాసినవారిని స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించాం. మా పక్క ఊర్లోని అమరుడైన పోలీసు కుటుంబాన్ని పరామర్శించి వచ్చాం. గత నెలలో పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన నేరాల వివరాలు:
         హత్యలు - జరగలేదు
         నేరాలు - ఎనిమిది
         వీటిలో నాలుగు గొలుసులు లాక్కున్నవి, మూడు ఇంటి దొంగతనాలు, ఒకటి స్త్రీని హింసించిన నేరం.
         పట్టుకున్న కేసులు - ఇద్దరు గొలుసు దొంగలు; ఒక ఇంటి దొంగ
         కేసు - మహిళను హింసించిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి, పదిరోజుల రిమాండ్‌కు తరలించాం. 
        మా పోలీస్ స్టేషన్‌లో 'ఫిర్యాదుల పెట్టె'ను ఏర్పాటు చేశాం. గాంధీ సెంటర్లో పోలీసులు డ్యూటీ చేయకుండా హోటల్‌లో కూర్చుంటున్నారన్న ఫిర్యాదు రావడంతో - మా ఎస్.ఐ. విచారణ జరిపించి, అక్కడి పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు.


4. తరచూ జరుగుతున్న సమ్మెలపై ఒక నివేదిక రూపొందించండి. 
        సమ్మె చేయడం ప్రజాస్వామ్య హక్కుగా పేర్కొంటారు. ఇటీవల సమ్మెలు మరీ ఎక్కువయ్యాయని గత ఆరు నెలల సర్వే తెలియజేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు: 
        రాజకీయ పార్టీలు చేసిన సమ్మెలు, ధర్నాలు - 20 
        వివిధ ఉద్యోగ సంఘాల సమ్మెలు - 15 
        పెన్‌డౌన్ సమ్మెలు - 2 
        కార్యాలయాల ముట్టడులు - 4 
       ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టడంలో తప్పులేదు. కానీ ఈ క్రమంలో ప్రజాజీవనాన్ని అస్తవ్యస్తం చేయడం సమంజసం కాదు. ఒకసారి సమ్మె సందర్భంగా రాస్తారోకో చేసినప్పుడు ఒక గర్భిణి ఆసుపత్రికి వెళ్లలేక నానా బాధలు పడింది. మరోసారి అత్యవసర చికిత్సకు అంబులెన్స్‌లో వెళుతున్న రోగికి సరైన సమయంలో చికిత్స అందకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. ఈవిధంగా సమ్మెలు, రాస్తారోకోలు కొందరిపాలిట శాపాలవుతున్నాయి. మూడు నెలల క్రితం ప్రభుత్వ వైద్యులు మెరుపు సమ్మె చేసినప్పుడు ఆసుపత్రికి వెళ్లినవారి అవస్థలు వర్ణనాతీతం. ఒక్కోరోజు ఒక్కో రాజకీయ పార్టీ ఆందోళన చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య మరీ తీవ్రమైనప్పుడు అందరూ కలిసి ఒక రోజే ఆందోళన చేయాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


5. ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామీణ అభివృద్ధి పథకాలపై నివేదిక రూపొందించండి. 
        దేశాభివృద్ధికి గ్రామాలే మూలం. గ్రామాభివృద్ధి దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది. గ్రామీణ ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. పేదల కోసం వాళ్లను ఆర్థికంగా మరింత మెరుగుపరచడానికి, స్వయంసమృద్ధితో ఆత్మవిశ్వాసాన్ని కల్పించడానికి ఈ పథకాలు తోడ్పడుతున్నాయి. 
        'డ్వాక్రా' గ్రూపు పథకం ద్వారా మహిళలు అభివృద్ధి సాధిస్తున్నారు. ఈ స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు రుణసదుపాయాన్ని కల్పిస్తున్నాయి. 2010-11 సంవత్సరానికి రూ.200 కోట్లు సబ్సిడీగా కేటాయించారు. జాతీయ వృద్ధాప్య పింఛను పథకం ద్వారా నెలకు రూ.200 చెల్లిస్తున్నారు. ఇది జీవనాధారం లేని 65 ఏళ్లు పైబడినవారికి వర్తిస్తుంది. గీత కార్మికులు, ఎయిడ్స్ రోగులకు కూడా పింఛన్ పథకం ఉంది. ఇందిరమ్మ పథకం కింద పేద వితంతువులకు కూడా నెలకు రూ.200 చొప్పున అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
        కేంద్ర ప్రభుత్వం 'స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజన' (ఎస్.జి.ఎస్.వై.) అనే పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75 : 25 నిష్పత్తిలో నిధులు సమకూర్చాలి. రాజీవ్ యువ కిరణాలు పథకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. 'అపార్డు' అనే సంస్థ ద్వారా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి లాంటివాటిని చేపడుతున్నారు.


6. పోలీసుల పరిస్థితిపై నివేదిక తయారుచేయండి. 
        సమాజానికి 'వాచ్‌డాగ్‌'లా పనిచేసి వ్యవస్థను సక్రమమార్గంలో పెట్టేవాళ్లే పోలీసులు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులదే ప్రత్యేక పాత్ర. కానీ, పోలీసుల స్థితి 'నానాటికీ తీసికట్టు నాగం బొట్టు'లా మారుతోంది. జనాభా పెరుగుతోంది. పట్టణాలు, నగరాల విస్తీర్ణం పెరుగుతోంది. దీనికి అనుగుణంగా పోలీసు ఉద్యోగాల నియామకాలు చేపట్టడం లేదు. దీంతో ఉన్న పోలీసులకు అదనపు భారం తప్పడం లేదు. పనిభారం వల్ల ఆరోగ్యం చెడిపోవడం, కేసులు త్వరగా పరిష్కారం కాకపోవడం, అశ్రద్ధ లాంటివాటిని గమనిస్తున్నాం. ఇటీవల పోలీసుల భార్యలు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. 
        నేరాలు 'హైటెక్' పద్ధతిలో జరుగుతున్నాయి. దానికి అనుగుణంగా పోలీసులకు శిక్షణ ఉండటం లేదు. నూతన ఆయుధాలు, పరికరాలు లేవు. పోలీసుల జీతాలు కూడా పెద్దగా పెరగడం లేదనే అభిప్రాయం ఉంది. వీరిపై వివిధ రాజకీయ నాయకులు, సంపన్నుల ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. అందువల్ల పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరముంది. ఈ రంగంలోకి యువతను ఎక్కువగా తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి.

Posted Date : 11-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌