• facebook
  • whatsapp
  • telegram

లేఖారచన

      లేఖలో విషయం స్పష్టంగా, సంక్షిప్తంగా, సూటిగా ఉండాలి. లేఖన చిహ్నాలు, సంబోధన, ముగింపు, చిరునామాలకు ప్రాధాన్యం ఉంటుంది. వాడుక భాషలో, సహజత్వం ఉట్టి పడేలా రాయాలి. ఊరూ పేరూ రాయకుండా గుర్తులతో సూచించడం మేలు.
 

1. మీ ప్రాంతంలోని రోడ్ల దుస్థితిని వివరిస్తూ ఏదైనా ఒక పత్రికా సంపాదకుడికి ఒక లేఖ రాయండి. 

స్థలం: XXXXX,
తేది: 12.10.2012.

*** దినపత్రిక  
సంపాదకులకు

ఆర్యా!
   నమస్కారం. మా ఊరు ఆదిలాబాద్ జిల్లాలోని ఓ కుగ్రామం. మా ఊరికి సరైన రోడ్లు లేవు. ఉన్న రోడ్లు కాస్తా మట్టివి. చిన్న వాన కురిసినా బురదమయమవుతాయి. వానాకాలంలో మా పాట్లు చెప్పలేం. మురుగునీరంతా రోడ్లపైనే ప్రవహిస్తుంది. దానివల్ల దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఫలితంగా అనేక రోగాలు ప్రబలుతున్నాయి. దీని గురించి ఊరిపెద్దలకు ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. మా దుస్థితిపై మీ పత్రికలో ఓ కథనాన్ని ప్రచురించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లగలరని మనవి.

 

ఇట్లు
మీ విధేయుడు, 
XXXXX

చిరునామా: 
సంపాదకులు,
**** దినపత్రిక,
సోమాజీగూడ, హైదరాబాద్.

2. తీవ్రవాదం గురించి మీ మిత్రుడికి ఒక లేఖ రాయండి.

స్థలం: XXXX, 
తేది: 12.10.12.

ప్రియమైన శ్రీనుకు ... 
     బాగున్నావు కదా! నేను క్షేమం. నా మనసులోని వేదనను చెప్పాలనిపించి ఈ లేఖ రాస్తున్నాను.
          ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదం పేట్రేగిపోతోంది. మనిషే సాటి మనిషిని చంపడమనేది దారుణమైన విషయం. అందులోనూ అమాయకులే అధికంగా బలవుతున్నారు. ఏ మతమైనా హింసను బోధించదు. జాతీయ సమైక్యత, దేశ అభివృద్ధికి ఉగ్రవాదం గొడ్డలిపెట్టులాంటిది. ప్రభుత్వపరంగానూ దీన్ని ఎదుర్కోవడానికి చాలా ధనాన్ని కేటాయించాల్సి వస్తోంది. ఉగ్రవాదం ఒక పాశవిక చర్య. ఇది అత్యంత రాక్షసమైంది. ఎందరో తల్లులకు గర్భశోకాన్ని మిగులుస్తోంది. ప్రభుత్వం ఎన్ని చట్టాలను చేసినా, ప్రజల సహకారం లేనిదే దీన్ని పూర్తిగా అరికట్టలేం. దేశ శ్రేయస్సు కోసం ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడానికి ప్రతి ఒక్కరూ పూనుకోవాలి. పత్రికల్లో ఉగ్రవాదం వల్ల ప్రాణాలు కోల్పోయారన్న వార్త చదివి, బాధతో ఈ లేఖ రాస్తున్నాను. ఈ ఉత్తరం అందిన వెంటనే నీ క్షేమ సమాచారాన్ని తెలుపుతూ లేఖ రాయగలవు.   ఉంటాను, 

ఇట్లు
నీ రవి

చిరునామా
టి.శ్రీనివాస్, తెలుగు లెక్చరర్,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అమలాపురం - 513 201.

3. ద్విచక్ర వాహనం దొంగతనం గురించి సంబంధిత అధికారికి లేఖ రాయండి. 

స్థలం: XXXX, 
తేది: 12-10-12.

ఎస్.ఐ.గారికి,
వన్ టౌన్ పోలీస్ స్టేషన్,
వరంగల్.
విషయం: ద్విచక్ర వాహన దొంగతనం గురించి.
ఆర్యా!
     నిన్న రాత్రి నేను ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత నా ద్విచక్ర వాహనాన్ని రోజూలానే నా ఇంటి ముందు పార్క్ చేసి తాళం వేశాను. పొద్దున లేచి చూసేసరికి అది కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా లాభం లేకుండా పోయింది. ఎవరో దాన్ని పక్కా ప్రణాళికతోనే దొంగతనం చేశారని భావిస్తున్నాను. నా వాహనానికి సంబంధించిన వివరాలు కింద పేర్కొన్నాను.
వాహనం పేరు: ప్యాషన్ ప్లస్
కంపెనీ: హీరో
రంగు: నలుపు
నంబరు: ఏపీజెడ్ 1862,

           దయచేసి సరైన దర్యాప్తు జరిపించి నేను నా వాహనాన్ని తిరిగి పొందడానికి చర్యలు తీసుకోగలరని మనవి.
నా చిరునామా:
పేరు: XXXXX,
1-1-428, గణేశ్ టవర్స్, వరంగల్.
ఫోన్: XXXXXXXXXX.

ఇట్లు, 
మీ విధేయుడు, 
XXXXX

చిరునామా:
ఎస్.ఐ.ఆఫ్ పోలీస్,
వన్ టౌన్ పోలీస్ స్టేషన్,
వరంగల్.

4. మీకు కావాల్సిన పుస్తకాల గురించి పుస్తక విక్రేతకు ఒక లేఖ రాయండి. 

స్థలం: XXXX, 
తేది: 12.10.12.

మేనేజరు గారికి,
నవోదయ బుక్ హౌస్.
ఆర్యా!
        నాకు తెలుగు కవిత్వం అంటే చాలా ఇష్టం. నేను మీ బుక్‌హౌస్‌లో తెలుగు సాహిత్యానికి చెందిన అనేక పుస్తకాలను కొన్నాను. ఇటీవల వెలువడిన కొన్ని పుస్తకాలను కొనాలనుకుంటున్నాను. పని ఒత్తిడి వల్ల నేను స్వయంగా రాలేకపోతున్నాను. అందువల్ల నాకు వి.పి.పి. ద్వారా కింద పేర్కొన్న పుస్తకాలను పంపించగలరని కోరుతున్నాను.  తగ్గింపు ధరలకే ఇవ్వాల్సిందిగా అభ్యర్థన.
కావాల్సిన పుస్తకాలు:
 కె. శివారెడ్డి కవిత్వం
 కొండేపూడి నిర్మల కవిత్వం
 'ఒంటరి పూలబుట్ట' - రాళ్ళబండి కవితాప్రసాద్
 'అవధాన కవిత్వం' - గరికిపాటి నరసింహారావు

                            ఈ పుస్తకాలను నా చిరునామాకు పంపగలరు.
నా చిరునామా:
పేరు: XXXX,
ఆంధ్రాబ్యాంకు మేనేజర్ (రిటైర్డ్),
పెద్దవీధి, XXXX - 533 202.

ఇట్లు, 
మీ  విధేయుడు,
XXXX

 

చిరునామా: మేనేజరు,
నవోదయ బుక్‌హౌస్,
కాచీగూడ చౌరస్తా,
హైదరాబాద్-20.

5. ఇటీవల మీరు సందర్శించిన ప్రదేశం గురించి వివరిస్తూ, మీ తండ్రికి ఒక లేఖ రాయండి. 

స్థలం: XXXX, 
తేది: 12.10.12.

పూజ్యులైన
నాన్నకు నమస్కరిస్తూ..
     ఇక్కడ నేను క్షేమంగానే ఉన్నాను. మీరందరూ క్షేమమని తలుస్తున్నాను. నేను ఇటీవల మా తరగతి విద్యార్థులతో కలిసి విహార యాత్రకు వెళ్లాను. దీంట్లో భాగంగా ఆగ్రా వెళ్లి వచ్చాం. తాజ్‌మహల్ గురించి పుస్తకాల్లో చదవడమే గానీ, ఇప్పటివరకూ ప్రత్యక్షంగా చూడలేదు. ఆ కోరిక ఇప్పటికి తీరింది. తాజ్‌మహల్ నిజంగా ఓ గొప్ప కళాఖండం. చలువరాతితో, అపూర్వమైన నిర్మాణ కౌశల్యంతో, యమునానదీ తీరంలో ఉన్న తాజ్‌మహల్‌ను ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. ప్రపంచంలో దీన్ని ఏడో వింతగా గుర్తించారు. దీన్ని షాజహాన్ అనే చక్రవర్తి తన భార్య ముంతాజ్‌పై ఉన్న ప్రేమకు చిహ్నంగా నిర్మించారని తెలిసింది. మన దేశ శిల్ప వైభవానికి తాజ్‌మహల్ ఓ నిలువెత్తు నిదర్శనం. జాషువా లాంటి ఎందరో కవులకు ఇది వస్తువైంది. మా తెలుగు అధ్యాపకులు పేర్కొన్నవిధంగా 'తాజ్‌మహల్ భరతమాత జడలో ఓ పుష్పం' అనడం సముచితమే.
అమ్మకు నా నమస్కారం తెలియజేయండి. చెల్లెలు బాగా చదువుతోందని భావిస్తున్నాను. 

ఇట్లు, 
మీ కుమారుడు,
XXXXXX

చిరునామా:
డి. రామారావు,
ఆయుర్వేద వైద్యులు,
చల్లావారి వీధి,
అమలాపురం - 533 201.

Posted Date : 11-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌