• facebook
  • whatsapp
  • telegram

సంక్షిప్తీకరణ 


             ఇచ్చిన పేరాగ్రాఫును ప్రధాన భావం చెడిపోకుండా మూడోవంతుకు కుదించడాన్ని 'సంక్షిప్తీకరణ' లేదా 'సంగ్రహించడం' అంటారు. దీంట్లో రెండు, మూడు వాక్యాలు ఎక్కువైనా ఫర్వాలేదుగానీ విషయ గ్రహణమే ప్రధానం. దీని ఆధారంగానే మార్కులు కేటాయిస్తారు.
1. హరికథ అంటే విష్ణుకథ. హరికథలు భక్తికి సంబంధించినవి. ఆదిభట్ల నారాయణదాసు 'హరికథా పితామహుడి'గా పేరుగాంచాడు. ఈ కథ చెప్పేవారిని 'భాగవతార్', 'హరిదాసు' అని పిలుస్తారు. ఇతడు మెడలో పూలదండ వేసుకొంటాడు. చేతిలో చిరతలుంటాయి. కాళ్లకి గజ్జెలు కట్టుకొంటాడు. నడుముకు ఉత్తరీయం బిగించుకుంటాడు. 'శ్రీమద్రమారమణ గోవిందో హరి' అని చెప్పి ప్రేక్షకులతో 'గోవిందా' అనిపిస్తాడు. అనేక గంటలపాటు ఒక వ్యక్తి విభిన్న పాత్రలను పోషిస్తూ, అభినయిస్తూ, చిందులేస్తూ పాడుతూ హరికథ చెప్పడం అంటే మాటలు కాదు. ప్రేక్షకులు విసుగు చెందకుండా చమత్కారంగా, హాస్యయుతంగా మధ్య మధ్యలో పిట్ట కథలు చెబుతాడు. కోట సచ్చిదానందశాస్త్రి, ములుకుట్ల సదాశివశాస్త్రి, అమ్ముల విశ్వనాథం లాంటి వారు హరికథకుల్లో సుప్రసిద్ధులు. ఇటీవల స్త్రీలు కూడా హరికథా గానం చేస్తున్నారు. తూమాటి దొణప్ప తెలుగులో 'హరికథా సర్వస్వం' అనే గొప్ప పుస్తకం రాశారు. సంస్కృతంలో కూడా హరికథా గానం ఉంది. సలాది భాస్కరరావు అనే హరికథకుడు దీన్ని సామాజికపరంగా చెబుతూ ప్రజలకు మరింత చేరువ చేశారు.

సంక్షిప్తీకరణ:


సమాహార కళ 

              విష్ణు కథలు, భక్తి కథలకు ప్రాధాన్యమున్న హరికథలకు ఆదిభట్ల నారాయణదాసు మూలపురుషుడు. ఆయణ్ని 'హరికథా పితామహుడు' అంటారు. హరికథకుడు మెడలో పూలదండ, చేతిలో చిరతలు, కాళ్లకి గజ్జెలు, నడుముకి ఉత్తరీయం ధరించి భిన్న పాత్రలను అభినయిస్తూ సంగీతంతో ప్రేక్షకులను అలరిస్తాడు. వీక్షకులతో ముందుగా 'గోవిందా' అనిపిస్తాడు. మధ్యలో వినోదం కోసం పిట్టకథలు చెబుతాడు. వీరిని 'భాగవతార్‌'గా పిలుస్తారు. ప్రస్తుతం పురుషులతోపాటు స్త్రీలు కూడా హరికథలు చెబుతున్నారు. ఈ ప్రక్రియ సంస్కృతంలోనూ ఉంది. దొణప్ప హరికథపై పుస్తకం రాయగా, సలాది భాస్కరరావు హరికథను సామాజికపరం చేశారు.
 

2. సి.వి. రామన్ పూర్తి పేరు చంద్రశేఖర వెంకట రామన్. తిరుచునాపల్లిలో కావేరీ నదీ తీరాన ఒక పండిత కుటుంబంలో 1888 నవంబరు 7న రామన్ జన్మించారు. ఇతడి తల్లి పార్వతీ అమ్మాళ్, తండ్రి చంద్రశేఖర అయ్యర్. బ్రిటిష్ ప్రభుత్వం 'సర్' అనే బిరుదునిచ్చింది. అప్పటి నుంచి 'సర్' సి.వి. రామన్‌గా పేరు పొందాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు రామన్ బాల్యం నుంచే జిజ్ఞాసకుడు, పరిశోధకుడు. ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు రామన్‌ను 'బాల మేధావి' అని పిలిచేవారంటే, అతడి ప్రతిభ ఏమిటో అంచనా వేసుకోవచ్చు. తండ్రి గణిత, భౌతిక శాస్త్రాల్లో పండితుడు కావడం వల్ల ఆయన వద్దే ప్రత్యేక శిక్షణ పొందాడు. సంస్కృతం, సంగీతం నేర్చుకున్నాడు. ఏ విషయాన్నయినా ప్రత్యేక దృష్టితో అధ్యయనం చేసేవాడు. 14వ ఏటే మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో బీఏ-స్నాతకవిద్యలో చేరాడు. అక్కడ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై, బంగారుపతకాన్ని సాధించాడు. మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ. పట్టా పుచ్చుకున్నాడు.

ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి, భార్య లోకసుందరి సలహాతో కలకత్తా విశ్వవిద్యాలయం - సైన్స్ కళాశాలలో భౌతికశాస్త్ర ఆచార్య పదవిని స్వీకరించాడు. రామన్ రోజుల తరబడి నిద్ర, ఆహారాన్ని సైతం మరిచి ప్రయోగాలు చేయడంలో మునిగిపోయేవాడు. అలిసిపోయి ప్రయోగశాలలోని ఏదో ఒక బల్లపై నిద్రపోయేవాడు. విదేశీయులు రామన్‌ను 'భారతదేశ మేధావంతుడైన శాస్త్రవేత్త' అని ప్రశంసించారు. ఆయనకు విజ్ఞానశాస్త్రమే దైవం. పనే ఆయన మతం. 'కాంతి కిరణం ఒకే రంగును కలిగి ఉంటుంది కానీ, దాని నుంచి ఏర్పడే కాంతిరేఖలు ఒకే వర్ణంలో ఉండవు' అనే విషయాన్ని గుర్తించి, దానిపై పరిశోధనలు చేశాడు. శాస్త్రవేత్తలు దీన్నే 'రామన్ ఫలితం' (రామన్ ఎఫెక్ట్) అని కీర్తించారు. రామన్ కృషిని గుర్తించి 'స్పీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్' 1930లో ఆయనకు భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించింది.
 

సంక్షిప్తీకరణ:


సృజనాత్మక శాస్త్రవేత్త 

                    సి.వి. రామన్‌గా పేరు పొందిన చంద్రశేఖర వెంకట రామన్ తిరుచునాపల్లిలో 1888 నవంబరు 7న జన్మించారు. పార్వతీ అమ్మాళ్, చంద్రశేఖర అయ్యర్ తల్లిదండ్రులు. 'బాల మేధావి'గా గుర్తింపు పొందిన రామన్ తన తండ్రి వద్ద శాస్త్రవిద్యలు నేర్చుకున్నాడు. సంగీతం, సంస్కృతాన్ని కూడా అభ్యసించాడు. 14వ ఏటే బీఏ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై, బంగారు పతకం పొందాడు. భార్య లోకసుందరి సలహాతో కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా చేరాడు. నిద్రాహారాల కంటే పరిశోధనే ముఖ్యమని భావించాడు. 'భారతదేశ మేధావంతుడైన శాస్త్రవేత్త'గా విదేశీయుల ప్రశంసలు పొందిన రామన్‌కు బ్రిటిష్ ప్రభుత్వం 'సర్' బిరుదునిచ్చింది. ఇతడు కాంతి గురించి పరిశోధనలు చేశాడు. 'రామన్ ఎఫెక్ట్‌'గా పేరుపొందిన ఇతడి పరిశోధనలకు 1930లో నోబెల్ బహుమతి లభించింది.

3. ఆస్తికులు, నాస్తికులు అని మానవులు రెండు రకాలు. దేవుడున్నాడు అని చెప్పేవారు ఆస్తికులు. దేవుడు లేడు అని చెప్పేవారు నాస్తికులు. లోకంలో నాస్తికులు చాలా తక్కువ. ఆస్తికులే ఎక్కువ. ఏ మతంలోనైనా దేవుడున్నాడని నమ్మేవారే ఎక్కువ ఉంటారు. భక్తితో ఆ దేవుడిని నమ్మి, ధ్యానిస్తూ, పూజిస్తూ, అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఉంటారు. భక్తి అంటే ఏమిటి? భగవంతుడిపై అపారమైన ప్రేమ, అనురాగం, మక్కువ కలిగి ఉండటం. ఆయనే సర్వస్వం అని నమ్మడం. అంటే హృదయాన్ని అర్పించడం భక్తి. అంతేగానీ పరీక్షలో పాస్ చేయిస్తే కొబ్బరికాయలు కొడతాను, ఉద్యోగం వస్తే బలి ఇస్తాను, పెళ్లి అయితే వందసార్లు ప్రదక్షిణలు చేస్తాననడం భక్తికాదు. కోరికలు తీర్చేవాడిగా భగవంతుడిని సేవించాలిగానీ, ఎలాంటి కోరికలు అన్నదే ప్రశ్న? నిస్వార్థం, నిష్క‌ల్మ‌‌షంగా సేవించడమే అసలైన భక్తి. భగవంతుడి అనుగ్రహం పొందడం సులువైన మార్గం కాదు. అది కష్టసాధ్యమైన పని. గొప్పవారు, విశిష్టులు, నాయకుల దర్శనాలే కష్టమవుతుంటే భగవంతుడి దర్శనం ఎలా సులభమవుతుంది? ప్రహ్లాదుడిదే అసలైన భక్తి. 'నన్ను మానవుడిగా సృష్టించి ఈ ప్రపంచాన్ని అనుభవించేలా జన్మనిచ్చిన నీకు సర్వదా కృతజ్ఞుడిని' అనే భావనతో భగవంతుడిని ఆరాధించాలి. కల్మష, కళంకిత హృదయంతో భగవంతుడిని ఆరాధించడం వల్ల ఫలితం ఉండదు. పవిత్ర హృదయాలు మాత్రమే భగవంతుడికి ఇష్టం. మానవ సేవే మాధవ సేవ అన్నది పరమ సత్యం.

సంక్షిప్తీకరణ:


భక్తి తత్త్వం 

                లోకంలో దేవుడున్నాడని చెప్పే ఆస్తికులూ, లేడని చెప్పే నాస్తికులూ ఉన్నారు. వీరిలో ఆస్తికులే ఎక్కువ. ఏ మతం వారైనా దేవుడిని నమ్మి, భక్తితో అతడి అనుగ్రహాన్ని పొందాలనుకుంటారు. భగవంతుడిపై ప్రేమ, మక్కువ, అనురాగాన్ని కలిగి ఉండి, ఆయన్నే సర్వస్వంగా సేవించడమే భక్తి. హృదయాన్ని అర్పించాలి. పరీక్షలో ఉత్తీర్ణులవాలనో, పెళ్లి కావాలనో, ఉద్యోగం రావాలనో పూజిస్తే అది అసలైన భక్తికాదు. నిస్వార్థంగా, నిష్కామంగా సేవించాలి. మనుషుల్లో గొప్పవారి దర్శనమే కష్టతరమవుతుంటే, మరి దేవుడి దర్శనం సులభమా? ప్రహ్లాదుడిలా ఈ జన్మనిచ్చినందుకే భగవంతుడిని కృతజ్ఞతా పూర్వకంగా ఆరాధించాలి. పవిత్ర హృదయంతో ఆరాధించాలి గానీ కల్మష, కళంకిత హృదయంతో కాదు.
 

4. ధర్మం, కార్యం సాధించాలంటే ముందుగా శరీరాన్ని సంరక్షించుకోవాలి. ప్రతి మనిషి సుఖంగా బతకాలన్నా, అనుకున్నవి సాధించాలన్నా శరీర రక్షణ అవసరం. శరీర రక్షణ అంటే ఆరోగ్యంగా ఉండటం. శరీరం ఆరోగ్యంగా ఎలా ఉంటుంది? వ్యాయామం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాయామం వల్ల శరీరం బలిష్ఠం అవుతుంది. రోగ నిరోధక శక్తి ఎక్కువవుతుంది. అవయవాల అమరిక చక్కగా, కుదురుగా ఉంటుంది. దీనివల్ల కార్యసాధన సులువవుతుంది. వ్యాయామం అనేక విధాలుగా ఉంటుంది. నడక, పరుగు, ఆసనాలు వేయడం, బస్కీలు తీయడం, ఆటలాడటం, యోగా మొదలైనవన్నీ వ్యాయామాలే. దీని వల్ల రక్తం శుభ్రపడుతుంది. మాలిన్యం తొలగిపోతుంది. అనవసరమైన కొవ్వు కరిగిపోతుంది. రోగాలు దూరమవుతాయి. తిన్నది జీర్ణమవుతుంది. అయితే అన్ని వ్యాయామాలు అందరికీ సరిపోవు.

కొన్ని చేటు తెస్తాయి కూడా. దేహ పటుత్వం, వయసును బట్టి వ్యాయామం చేయాలి. బాల్యం నుంచే వ్యాయామం అలవాటైతే అంతకంటే కావాల్సింది ఏముంటుంది! 'ఆరోగ్యమే మహాభాగ్యం' అన్నారు పెద్దలు. ఆరోగ్యవంతుడు దేన్నయినా సాధించగలడు. వ్యాయామం వల్ల అబలలు సబలలవుతారు. పూర్వం ఎంతోమంది స్త్రీలు వీరనారీమణులు కావడానికి వారు తీసుకున్న జాగ్రత్తలే ముఖ్యకారణం. ఇటీవల వ్యాయామశాలలు ఎక్కువయ్యాయి. ప్రత్యేకంగా 'జిమ్‌'లు ఏర్పాటవుతున్నాయి. కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో వ్యాయామ విద్యకు సంబంధించిన కోర్సులను ప్రవేశ పెట్టారు.
 

సంక్షిప్తీకరణ:


ఆరోగ్యంతో కార్యసాధన సులువు!  

                   మానవుడు ధర్మ కార్యం చేయాలన్నా, ఏదైనా సాధించాలన్నా ముందు శరీరాన్ని కాపాడుకోవాలి. వ్యాయామం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి అలవడుతుంది. శరీరంలోని మాలిన్యాలు నశించిపోయి, అవయవాలు బలిష్ఠమవుతాయి. దీనివల్ల కార్యసాధన సులువవుతుంది. నడక, పరుగు, ఆసనాలు వేయడం, ఆటలాడటం లాంటి అనేక రకాల వ్యాయామాలున్నాయి. దేహ పటుత్వం, వయసును బట్టి వ్యాయామాన్ని ఎంచుకోవాలి. బాల్యం నుంచే వ్యాయామం చేయడం మరీ మంచిది. స్త్రీలకు కూడా వ్యాయామం అవసరమే. అనేక మంది వీర నారీమణులు, సబలలు వ్యాయామం వల్ల పటుత్వాన్ని సాధించినవారే. ప్రస్తుతం వ్యాయామ శాలలు, వ్యాయామ విద్యకు ప్రాధాన్యం పెరిగింది.

Posted Date : 11-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌