• facebook
  • whatsapp
  • telegram

తెలుగు భాషా ప్రావీణ్యం

 కింది గద్యభాగాలను చదివి ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించండి.
       వలసలు రెండు రకాలు - అంతర్గత వలస, అంతర్జాతీయ వలస. ఒక దేశం లోపల ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారడం అంతర్గత వలస. దేశ హద్దులు దాటి మరో దేశానికి వెళితే అది అంతర్జాతీయ వలస. దేశం విడిచి వెళ్లడాన్ని 'ఎమిగ్రేషన్' అంటారు. 'ఇమిగ్రేషన్' అంటే దేశం విడిచి రావడం. గ్రామం నుంచి గ్రామానికి, నగరం నుంచి గ్రామానికి, నగరం నుంచి నగరానికి, గ్రామం నుంచి నగరానికి వలస వెళ్లడం; నివాసం ప్రాతిపదికగా లేదా కూలీ పనులు, ఉద్యోగాల లాంటి వాటికోసం వెళ్లే వలసలను సామూహిక వలసలు అంటారు. ఆర్థిక కారణాల వల్ల అంటే నివాస స్థలంపై అయిష్టత, బంధుమిత్రుల సహచర్యం లాంటి ఆర్థికేతర కారణాల వల్ల కూడా వలస వెళ్తారు. కొలంబియా, మెక్సికో నికరాగ్వా ప్రాంతాల నుంచి అమెరికాకు; బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వలసలు జరిగాయి. శ్రీలంక నుంచి తమిళులు మన దేశానికి వలస వచ్చారు. కొందరు శరణార్థులుగా వస్తారు. కొన్నిసార్లు ఈ వలసలు ఆఫ్గనిస్థాన్‌లో మాదిరిగా అంతర్యుద్ధాలకు దారి తీస్తాయి. ఇటీవల ఈశాన్య ప్రాంతాల్లో జరిగిన దాడులు, ఆందోళనలకు ఈ వలసలే కారణం.
 

1. దేశం విడిచి వెళ్లడం అనేది -
జ: ఎమిగ్రేషన్
 

2. వలసలు వేటి మధ్య జరగవచ్చు? 
జ: గ్రామం నుంచి గ్రామానికి; గ్రామం నుంచి నగరానికి;  నగరం నుంచి మరో నగరానికి

3. వలస వెళ్లడానికి ఆర్థికేతర కారణం -
జ: స్థలంపై ఆసక్తి 
 

4. మన దేశానికి ఎక్కడ నుంచి వలస వచ్చారు? 
జ: బంగ్లాదేశ్
 

5. వలసల వల్ల ఇటీవల మన దేశంలో ఎక్కడ గొడవలు జరిగాయి?
జ: ఈశాన్య ప్రాంతంలో 
         ఉద్యమం అంటే గొప్ప ప్రయత్నం. అనేక మంది ఒక లక్ష్యం కోసం ఏకతాటిపై చేసే తీవ్ర ప్రయత్నాన్ని ఉద్యమం అంటారు. ప్రతి ఉద్యమానికి ఒక తాత్త్విక దృక్పథం ఉంటుంది. ఏ ఉద్యమమైనా ప్రగతిని, కొత్తదనాన్ని, మార్పును కోరుకుంటుంది. ప్రగతి నిరోధకమైంది ఉద్యమం కానేరదు. ఉద్యమాలు వివిధ రకాలుగా ఉంటాయి. అవి: సామాజిక, సాహిత్య, రాజకీయ, సాంస్కృతిక ఉద్యమాలు. ఇటీవల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు బలోపేతమవుతున్నాయి. వీటిని వేర్పాటు ఉద్యమాలని అంటారు. జాతీయోద్యమం దేశ స్వాతంత్య్రం కోసం వెలువడింది. కందుకూరి లాంటివారు సంఘసంస్కరణోద్యమాలు చేశారు. తెలుగు కవిత్వంలో పాల్కురికి సోమన శైవ కవిత్వోద్యమాన్ని ప్రారంభించారు. రాయప్రోలు, దేవులపల్లి, వేదుల సత్యనారాయణ లాంటి కవులు భావకవిత్వోద్యమాన్ని ప్రారంభించారు. దీనికి ఆంగ్ల కవిత్వం ప్రేరణ. కమ్యూనిజం ప్రభావంతో వచ్చిన అభ్యుదయ ఉద్యమానికి శ్రీశ్రీ నాయకులయ్యారు. దాశరథి 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని చాటాడు. సాయుధ పోరాటంతో నూతన వ్యవస్థ రావాలంటూ విప్లవ ఉద్యమం వచ్చింది.

ఆ తర్వాత స్త్రీవాద, దళితవాద ఉద్యమాలు వచ్చాయి. ప్రస్తుతం ప్రాంతీయవాద ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. సంఘ సంస్కరణకోసమే గురజాడ రచనలు చేశారు. అందువల్ల ఆయనను ఆధునిక కవిత్వానికి యుగకర్త అంటారు.
 

1. ఉద్యమం అంటే - 
జ:  ఒక లక్ష్యం ఉండటం,  ఒక తాత్త్విక దృక్పథం ఉండటం,  తీవ్రమైన ప్రయత్నం
 

2. ఏది ఉద్యమం కాదు? 
జ:  ప్రగతి నిరోధకమైంది
 

3. భావకవులు ఎవరు? 
జ: రాయప్రోలు, దేవులపల్లి, వేదుల సత్యనారాయణ 
 

4. ఆంగ్ల కవిత్వ ప్రభావంతో వచ్చిన ఉద్యమం ఏది?
జ: భావకవిత్వం
 

5. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అన్నదెవరు? 
జ:  దాశరథి 
         మానవ హక్కులను పరిరక్షించడం ప్రపంచదేశాల చట్టబద్ధ బాధ్యత. 1948 డిసెంబరు 10న ఐక్యరాజ్య సమితి మానవహక్కుల ప్రకటన చేసింది. 1966లో దీనిపై అంతర్జాతీయ ఒడంబడిక జరిగింది. క్రీ.శ. 1215లో ఇంగ్లండ్ రాజు జాన్ సంతకం చేసిన 'మాగ్నాకార్టా'లోనే మొదటిసారిగా మానవహక్కులకు బీజం పడింది. రాజారామ్మోహన్‌రాయ్ నుంచి అంబేద్కర్, పెరియార్ వరకు సంఘ సంస్కరణ ఉద్యమాలను నడపడానికి మూలం పౌరహక్కులను కాపాడటమే.

1972 జూన్ 25న కలకత్తాలో ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ సంఘం ఆవిర్భవించింది. ఆంధ్రప్రదేశ్‌లో చెరబండరాజు, వరవరరావు లాంటివారు ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘాన్ని స్థాపించారు. కన్నాభిరన్ చాలాకాలం దీనికి అధ్యక్షులుగా పనిచేశారు. ఎస్. సత్యమూర్తి 1919లో 'ది రైట్స్ ఆఫ్ సిటిజన్' పుస్తకం ద్వారా అవగాహన కల్పించారు. జలియన్‌వాలా బాగ్ మారణకాండ ప్రజల జీవించే హక్కుకు భంగం కలిగించిందని నిరసన తెలియజేస్తూ, రవీంద్రనాథ్ ఠాగూర్ 'నైట్‌హుడ్ బిరుదును తిరిగి ఇచ్చేశారు. ఆ తర్వాత ఠాగూర్ భారతీయ పౌరహక్కుల సంఘానికి అధ్యక్షులయ్యారు.
 

1. మానవహక్కులపై అంతర్జాతీయ ఒడంబడిక ఎప్పుడు జరిగింది? 
జ:  1966లో
 

2. మానవ హక్కులకు ఎక్కడ బీజం పడింది?
జ: ఇంగ్లండ్ రాజు జాన్ సంతకం చేసిన 'మాగ్నాకార్టా'లో
 

3. పౌరహక్కుల పరిరక్షణ పునాదిగా ఏర్పడిన ఉద్యమమేది?
జ: సంఘ సంస్కరణ ఉద్యమం
 

4. 'ది రైట్స్ ఆఫ్ సిటిజన్స్' పుస్తక రచయిత ఎవరు? 
జ:  ఎస్. సత్యమూర్తి
 

5. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ బిరుదును తిరిగి ఇచ్చేశారు? 
జ: నైట్‌హుడ్ బిరుదు

లేఖా రచన  

సమాజంలో శాంతి భద్రతల గురించి మిత్రుడికి ఒక లేఖ రాయండి. 
                                                                                                                                              హైదరాబాద్, 
                                                                                                                                              8-9-2012.
ఆత్మీయ మిత్రుడు వేణుకు 
              కులాసా గదా! తరచూ ఉత్తరాలు రాసుకోవడం వల్ల మనసు కుదుటపడి ఆలోచనలు పుడతాయని నీకు తెలుసు. ఇవాళ సమాజంలో శాంతి భద్రతలు కరవయ్యాయని చెబుతున్నారు. చెప్పడం తప్ప ఆచరించేవారు కరవవ్వడమే  శోచనీయం. కుల, మత విద్వేషాల వల్ల సంఘజీవనానికి విఘాతం కలుగుతోంది. 'అంతా ఒక్కటే', 'అందరూ దేవుడి బిడ్డలే' లాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే మార్గదర్శకులు తక్కువగా ఉన్నారు. పాతతరం నాయకులకు ఉన్న స్వచ్ఛత, నిర్మలత్వం ఇప్పటివారిలో కనిపించడం లేదు. రాజకీయ నాయకులు కూడా తమ స్వార్థం కోసమో, ఆధిపత్యం కోసమో కుల, మత అంశాలను రెచ్చగొడుతున్నారు. పోలీసులు మాత్రం ప్రజల సహకారం లేకపోతే ఎంతవరకు పనిచేయగలరు? ప్రజలు ఎవరి ఉచ్చులోనూ పడకుండా అందరూ కలిసి పరస్పర ప్రేమతో జీవించడానికి కంకణం కట్టుకున్నప్పుడే సమాజంలో శాంతిభద్రతలు సజావుగా సాగుతాయి. నీ అభిప్రాయాలు తెలుపుతూ ఉత్తరం పంపించు. 
                                                                                                                                          నీ 
                                                                                                                                      స్నేహితుడు 
                                                                                                                                         వెంకట్
చిరునామా:
ఎన్. వేణు
1-1-428, గాంధీనగర్,
హైదరాబాద్ - 500 080.

పోలీసుగా మీరు చేసిన ఒక మంచిపని గురించి సంబంధిత అధికారికి ఒక లేఖ రాయండి. 
                                                                                                                                          ఖమ్మం, 
                                                                                                                                          8-9-2012.
ఎస్.ఐ. ఆఫ్ పోలీస్,
టూ టౌన్ పోలీస్ స్టేషన్,
వరంగల్.
వారి దివ్య సముఖానికి-
ఆర్యా!
నమస్కారం. మీరిచ్చిన ప్రోత్సాహంతో నిన్న నేనొక మంచిపని చేశాను. అది మీకు తెలిపి ఆనందించాలని ఈ లేఖ రాస్తున్నాను.
             నేను డ్యూటీ (పోలీస్‌స్టేషన్)కి వస్తుండగా ఆటోలో నుంచి ఒక స్త్రీ 'కాపాడండీ' అంటూ కేకలువేయడాన్ని గమనించాను. అది విని నేను వెంటనే ఆటోను వెంబడించాను. ఆటోవ్యక్తి చాలా వేగంగా రోడ్లన్నీ తిప్పుతూ ముప్పుతిప్పలు పెట్టాడు. అయినా పట్టు విడవకుండా వెంబడించి పట్టుకున్నాను. ఆ ఆటోలో ఉన్న మరో వ్యక్తి మహిళ ఆభరణాలను లాక్కోవడానికి ప్రయత్నిస్తుండగా, ఆమె ప్రతిఘటిస్తోంది. వెంటనే ఆ దొంగను, ఆటోవాలాను పట్టుకొని మన హెడ్ కానిస్టేబుల్‌కు ఫోన్ చేశాను. ఆమె నగలు ఆమెకు ఇచ్చి, వాళ్లిద్దరినీ జైల్లో పెట్టాను. నాకు ఇవాళ ఎంతో ఆనందంగా ఉంది. 
                                                నమస్కారాలతో, 
                                                                                                                                     మీ 
                                                                                                                                 విధేయుడు 
                                                                                                                                     సుభాష్.
చిరునామా:
ఎస్.ఐ. ఆఫ్ పోలీస్,
టూ టౌన్ పోలీస్ స్టేషన్,
వరంగల్ - 506 002.

Posted Date : 11-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌