• facebook
  • whatsapp
  • telegram

నూతన సాంకేతిక పరిజ్ఞానం

క్వాంటం కంప్యూటింగ్‌

* ఇది అత్యంత అధునాతన సాంకేతికత. క్వాంటం కంప్యూటింగ్‌ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, అణువులు, అణు అంతర్భాగాల (Sub atomic particles) ప్రవర్తనను తెలుపుతుంది. ఇది పరమాణు (Atomic scale) ప్రమాణస్థాయిలో పనిచేస్తుంది. 

* ప్రస్తుత డిజిటల్‌ కంప్యూటర్‌ వ్యవస్థకు, క్వాంటం కంప్యూటింగ్‌కు చాలా తేడాలు ఉన్నాయి. 

* ముఖ్యంగా కంప్యూటర్లలో బైనరీ వ్యవస్థ (0/1) ఉంటే, క్వాంటం కంప్యూటింగ్‌లో క్వాంటం యూనిట్స్‌ - క్యూబిట్స్‌ (0, 1 మిశ్రమ స్థితిలో పనిచేస్తుంది.)

* అత్యంత అధునాతన సంప్రదాయ కంప్యూటర్లు చేయలేని లేదా పరిష్కరించలేని సంక్లిష్ట సమస్యలను కృత్రిమ మేథ సాయంతో క్వాంటం కంప్యూటింగ్‌ చేయగలదు.

* భారత ప్రభుత్వం 202021 బడ్జెట్‌లో ‘నేషనల్‌ మిషన్‌ ఆన్‌ క్వాంటం టెక్నాలజీస్‌ అండ్‌ అప్లికేషన్స్‌’కి రూ.8000 కోట్లు కేటాయించింది. దీన్నే QUEST ప్రోగ్రాం అని కూడా అంటారు. 

* భారత ఆర్మీ 2021, డిసెంబరులో క్వాంటం కంప్యూటింగ్‌ ల్యాబొరేటరీ, కృత్రిమ మేథ సంస్థను మౌ (మధ్యప్రదేశ్‌)లోని మిలటరీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రారంభించింది. దీనికి అవసరమైన సాంకేతిక సహకారాలను నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సెక్రటేరియట్‌(NSCS) అందిస్తుంది. 

* The Centre For Development Of Telematics (C-DOT) సంస్థ క్వాంటం కమ్యూనికేషన్‌ ల్యాబ్‌ని 2021, అక్టోబరులో ప్రారంభించింది. ఇది ఆప్టికల్‌ ఫైబర్‌ సహాయంతో 100 కి.మీ. పరిధి వరకు తన సేవలను అందిస్తుంది.

* ఇవే కాకుండా I-HUB Quantum Technology Foundation, IISER, Pune తో పాటు అనేక ప్రైవేట్‌ స్టార్టప్‌ సంస్థలు కూడా ఈ రంగంలో పరిశోధనలు చేస్తున్నాయి.


అనువర్తనాలు:

i) జీవితకాలాన్ని పెంచే మందుల రూపకల్పన.

ii) సప్లై, లాజిస్టిక్స్‌లో పురోగతి

iii) ఆర్థికాభివృద్ధి

తాజా అంశాలు: ఇటీవలి కాలంలో క్వాంటం కంప్యూటింగ్‌లో చేస్తున్న పరిశోధనల ఫలితంగా దీని సేవలు మరింత విస్తృతమయ్యాయి.

అవి: * క్వాంటం క్రిప్టోగ్రఫీ  

* మందుల తయారీ, రూపకల్పన

* ఆర్థిక నమూనాల తయారీ

* వాతావరణ హెచ్చరికలు   

* ప్రకటనలు  * సైబర్‌ సెక్యూరిటీ

* అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నియంత్రణ.

* మెరుగైన మొబైల్‌ నెట్‌వర్క్‌ కవరేజ్‌ 

* 202324 కేంద్ర బడ్జెట్లో నేషనల్‌ మిషన్‌ ఆన్‌ క్వాంటం కంప్యూటింగ్‌ టెక్నాలజీస్‌కి రూ.2,500 కోట్లు కేటాయించారు.

Radio Frequency Identification (RFID)

* ఇది ఒక వైర్‌లెస్‌ వ్యవస్థ. ట్యాగ్స్, రీడర్ల సహాయంతో పనిచేస్తుంది. రేడియో తరంగాలను గుర్తించడానికి, ట్రాకింగ్‌కి దీన్ని ఉపయోగిస్తారు. ఆర్‌ఐఎఫ్‌డీ ట్యాగ్స్‌లో ఎన్‌క్రిప్టెడ్‌ సమాచారం, సీరియల్‌ నంబర్లు, సంక్షిప్త వివరణ(Short description) ఉంటాయి.

రకాలు: ఇది రెండు రకాలు. అవి: 

1. క్రియాత్మక Active) ఆర్‌ఎఫ్‌ఐడీ: ఇది పనిచేయడానికి శక్తి అవసరం. దీన్ని బ్యాటరీలు లేదా ఇతర శక్తి వనరుల ద్వారా స్వీకరిస్తుంది.

2. నిష్క్రియాత్మక (Passive) ఆర్‌ఎఫ్‌ఐడీ: 

* రీడర్ల నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నటిక్‌ శక్తి ఆధారంగా పనిచేస్తుంది.

అనువర్తనాలు:

*  ఈ సాంకేతికత ఆధారంగా నిర్దేశిత వస్తువు లేదా వ్యక్తి రియల్‌ టైం లొకేషన్‌ను అత్యంత కచ్చితంగా తెలుసుకోవచ్చు. 

*  భారీ సంఖ్యలో హాజరయ్యే సమావేశాల్లో అసాంఘిక వ్యక్తుల కదలికలను లేదా ప్రవేశాన్ని గుర్తించవచ్చు.

* ఆర్‌ఎఫ్‌ఐడీ అనుసంధానంతో వన్య ప్రాణులు/ జీవులు, వాహనాల కదలికలను ట్రాక్‌ చేయొచ్చు. 

*  నేషనల్‌ హైవేలో ఉండే టోల్‌ ప్లాజాలు వీటి ఆధారంగానే పనిచేస్తున్నాయి. 

*  దీని అనుసంధానం ద్వారా వస్తువులు, మందుల నిల్వలను గణించవచ్చు.

సైబర్‌ నేరాలు

*  కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ ఆధారంగా చేసే నేరాలను సైబర్‌ నేరాలు అంటారు. 

*  ఇందులో ఒక వ్యక్తి లేదా సంస్థకి సంబంధించిన రహస్య లేదా ఆర్థిక సమాచారాన్ని; జాతీయ భద్రతాపరమైన విషయాల చోరీ లేదా నాశనానికి పాల్పడవచ్చు.

*  భారతదేశ ఐటీ యాక్ట్‌ 2000 కింది నేరాలను సైబర్‌ నేరాలుగా పరిగణిస్తోంది.

అవి:

ఐడెంటిటీ థెఫ్ట్‌: 

* ఒక వ్యక్తి లేదా సంస్థ గుర్తింపు ఆధారంగా చేసే నేరాలు దీని కిందకి వస్తాయి. 

* ఇది ముఖ్యంగా సదరు వ్యక్తి నుంచి లేదా ఆ వ్యక్తి గుర్తింపు ఆధారంగా ఆర్థికపరమైన లాభం కోసం నేరాలకు పాల్పడటం.

సైబర్‌ ఉగ్రవాదం(Cyber terrorism): ఇంటర్నెట్‌ ఆధారంగా ఒక వ్యక్తి లేదా సమూహం జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే చర్యలకు పాల్పడటం.

సైబర్‌ బెదిరింపు(Cyber bullying): ఒక వ్యక్తిని సోషల్‌ మీడియా ద్వారా భయపెట్టడం లేదా బాధించడం లేదా మానసిక వ్యధకు గురిచేయటం లాంటి నేరాలకు పాల్పడితే అవి దీని కిందకి వస్తాయి.

అనైతిక హాకింగ్‌: అనైతికంగా పాల్పడే చర్యల ద్వారా వ్యక్తి లేదా సంస్థ సమాచారాన్ని స్వార్థపూరిత అవసరాల కోసం ఉపయోగించుకోవటాన్ని హాకింగ్‌గా పేర్కొంటారు.

పరువునష్టం(Defamation): ఇంటర్నెట్‌ ఆధారంగా ఒక వ్యక్తి లేదా సంస్థను అపకీర్తికి గురిచేయడం దీని కిందకి వస్తుంది.

వ్యాపార రహస్యాలు(Trade Secrets): సంస్థ తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌ లేదా అప్లికేషన్‌ లేదా  ఏదైనా వస్తువు డిజైన్‌ను ఇంటర్నెట్‌ సాయంతో దొంగలిస్తే, సైబర్‌ చట్టం ప్రకారం వారు శిక్షార్హులు.

సైబర్‌ స్టాకింగ్‌(Cyber stalking): ఇంటర్నెట్‌ ఆధారంగా వివిధ రకాలుగా వ్యక్తులను భయభ్రాంతులకు గురిచేయడాన్ని సైబర్‌ స్టాకింగ్‌ అంటారు.


సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు

* భారత ప్రభుత్వం సైబర్‌ నేరాల నివారణకు 2000లో భారత సమాచార చట్టాన్ని రూపొందించింది. ఇది మనదేశంలో సైబర్‌ నేరాలకు సంబంధించిన మౌలిక చట్టం.

* దీన్ని 2008లో ఒకసారి, 2021లో మరొకసారి సవరించారు. ఈ సవరణను డిజిటల్‌ మీడియా ఎథిక్స్‌ కోడ్‌గా పిలుస్తారు. ఇందులో అనేక మార్గదర్శకాలను, ముఖ్యాంశాలను చేర్చారు. వాటిలో ప్రధానమైనవి:

* సామాజిక మాధ్యమ అప్లికేషన్ల నిర్వాహకులు తగినంత శ్రద్ధతో వ్యవహరించాలి. వ్యక్తిగత గోప్యత విషయంలో అత్యంత శ్రద్ధ కనబరచాలి. 

* సైబర్‌ నేరాలు లేదా ఆన్‌లైన్‌ మోసాల పరిష్కారానికి గ్రీవెన్స్‌ అప్పిలేట్‌ కమిటీని ఏర్పాటు చేయాలి. ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు గ్రీవెన్స్‌ ఆఫీసర్ల సంఖ్యను పెంచాలి.


డేటా గవర్నెన్స్‌

* సమాచారం లేదా డేటాపై ప్రభుత్వ నియంత్రణను డేటా గవర్నెన్స్‌ అంటారు. 

* ప్రభుత్వం —> సమాచారం. అంటే నిర్ధారిత సమాచార సేకరణ, నిర్వహణ, ఉపయోగంపై ప్రభుత్వ నియంత్రణను డేటా గవర్నెన్స్‌గా పేర్కొంటారు.

* సమాచార వ్యవస్థను నియంత్రించడం వల్ల వ్యక్తి హక్కుకు (వ్యక్తిగత గోప్యత హక్కు) రక్షణ కలుగుతుంది.

* వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన అంశాల గోప్యతపై తీసుకోవాల్సిన చర్యల గురించి కేంద్ర  ప్రభుత్వం 2017లో జస్టిస్‌ బి.ఎన్‌.శ్రీకృష్ణ అధ్యక్షతన 10 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. 

* ఈ కమిటీ 2018లో తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.


నివేదికలోని ముఖ్యాంశాలు:

* వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్‌ చేసే సమయంలో పరిధులు పాటించాలి. ప్రాసెస్‌ అంటే డేటా సేకరణ, రికార్డింగ్, విశ్లేషణ, వెల్లడించడం.

* డేటాను ఉపయోగించడానికి బలమైన కారణం ఉండాలి. అది పారదర్శకంగా, నిర్దిష్టంగా, న్యాయబద్ధంగా ఉండాలి. ఏ కారణం వల్ల సమాచారాన్ని సేకరించామో దాని కోసమే డేటాను ఉపయోగించాలి.

* వ్యక్తిగత డేటాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి పాలనలో భాగంగా ఉపయోగించుకోవచ్చు. 

* నేర నియంత్రణ, చట్ట ఉల్లంఘన సమయాల్లో వ్యక్తుల సమాచారాన్ని ప్రభుత్వాలు వినియోగించుకోవచ్చు.

* ఏ వ్యక్తి నుంచి సమాచారాన్ని సేకరిస్తారో, వారిని ‘డేటా ప్రిన్సిపల్స్‌’ అంటారు. డేటాను  సేకరించేవారిని ‘డేటా ఫిడుషియరీస్‌ (data fiduciaries)’గా పిలుస్తారు. వీరు సమాచార నిర్వహణలో అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నివేదికలో పేర్కొన్నారు.

* ‘డేటా ప్రిన్సిపల్స్‌’కి ఎక్కువ ప్రాముఖ్యతతోపాటు కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించారు.

అవి:

i) Right To Be Forgotten (RTBF)

ii) Right to confirmation

iii) Right to access

iv) Right to correction

v) Right to protectability

* భారత పౌరుల సమాచారం మొత్తాన్ని ప్రభుత్వం దాచి ఉంచాలి.

* సున్నిత సమాచారాన్ని లేదా గోప్యంగా ఉంచాల్సిన డేటాను అత్యంత జాగ్రత్తగా భద్రపరచాలి. దీనికోసం డేటా ప్రొటెక్షన్‌ అథారిటీని ఏర్పాటు చేయాలి.

* 2022, ఫిబ్రవరి 21న భారత ప్రభుత్వం ‘డ్రాఫ్ట్‌ ఇండియా డేటా యాక్సెసబిలిటీ అండ్‌ యూజ్‌ పాలసీ’ని విడుదల చేసింది. 

* దీన్ని  ప్రభుత్వం మరొకసారి సవరించి 2022, మే 26న ‘డ్రాఫ్ట్‌ నేషనల్‌ డేటా గవర్నెన్స్‌ ఫ్రేమ్‌ వర్క్‌ పాలసీ’ గా విడుదల చేసింది.

* దీని ప్రకారం పరిశోధన, నవకల్పన వ్యవస్థల కోసం వ్యక్తిగత లేదా అజ్ఞాత సమాచారాన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు అత్యంత భద్రంగా ఉపయోగించుకోవాలి.

* ప్రజా సంబంధిత డేటా నిర్వహణలో అత్యంత పారదర్శకతను పాటించటం దీని ముఖ్య లక్ష్యం.

Posted Date : 07-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌