• facebook
  • whatsapp
  • telegram

వాతావరణ మార్పు


 ఈ సదస్సును 2021లో స్కాట్లాండ్‌లోని గ్లాస్‌ (Glasgow) నగరంలో నిర్వహించారు. 


 వాతావరణ మార్పుల కారణంగా నష్టపోయిన భూగ్రహాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో దీన్ని నిర్వహించారు. దీనికోసం చేపట్టాల్సిన చర్యలను మరింత ఉద్ధృతం చేయాలని ఈ సదస్సులో తీర్మానించారు. 


 2030 నాటికి నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం  అనుసరించాల్సిన కార్యాచరణను కాప్‌ 26లో మరోసారి చర్చించారు.


 పారిస్‌ ఒప్పందానికి అనుగుణంగా నెట్‌ జీరో ఎమిషన్స్‌ను తీసుకురావాలని, ప్రస్తుత ఉష్ణోగ్రతలను పారిశ్రామిక పూర్వ యుగానికి స్థిరీకరించాలని (ఉష్ణోగ్రతను 1.5°C తగ్గించాలని) సదస్సులో సూచించారు.


 ప్రపంచ దేశాలన్నీ సున్నా ఉద్గారాలను అత్యంత వేగంగా చేరుకోవడానికి అవసరమైన చర్యలను ఇందులో పేర్కొన్నారు. 


 2050 నాటికి ప్రపంచంలోని అత్యధిక దేశాలు నెట్‌ జీరో ఎమిషన్స్‌ను చేరుకోవాలని తీర్మానించారు. దీనికోసం బొగ్గు వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, దాని స్థానంలో రెన్యువబుల్‌ శక్తి వనరులను వినియోగించాలని ప్రతిపాదించారు.


 ప్రపంచ దేశాలన్నీ రవాణా కోసం ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించాలని, వీటిపై ప్రజల్లో  అవగాహన పెంచాలని సూచించారు. 


 ప్రపంచవ్యాప్తంగా మీథేన్‌ వాయువుల నియంత్రణ కోసం మీథేన్‌ ఉద్గారాల స్థాయులను నియంత్రించాలని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో మీథేన్‌ ప్రతిజ్ఞ చేయించారు. సహజ ఆవాసాలను వాతావరణ మార్పుల ప్రభావం నుంచి అత్యంత భద్రంగా కాపాడుకోవాలని సూచించారు. 


 ప్రపంచ దేశాలన్నీ 2030 నాటికి అటవీ నిర్మూలనను పూర్తిగా నిషేధించాలని పేర్కొంటూ, అటవీ పరిరక్షణ కోసం కార్యాచరణను రూపొందించారు.  


 వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందిన దేశాలన్నీ సంవత్సరానికి వంద బిలియన్‌ డాలర్ల చొప్పున చెల్లించాలని సదన్సులో పేర్కొన్నారు. 


 ఈ సదస్సులో నెట్‌ జీరో ఎమిషన్స్‌ను 2050 నాటికి చేరుకుంటామని అమెరికా, చైనా ప్రతిపాదించగా, భారత ప్రభుత్వం 2070 నాటికి సాధిస్తామని పేర్కొంది. 


 పరస్పర భాగస్వామ్యంతో శుద్ధ సాంకేతికత (క్లీన్‌ టెక్నాలజీస్‌)ను వినియోగించి రహదారి వ్యవస్థను, వివిధ కర్మాగారాలను ఆధునికీకరించి కాలుష్యాన్ని తగ్గించాలని సూచించారు. 


 వాతావరణ మార్పులను ముందుగా అంచనా వేసే క్లైమేట్‌ యాక్షన్‌ ట్రాకర్‌ (CAT) అనే స్వతంత్ర సంస్థలను ఏర్పాటు చేసి, గ్లోబల్‌ వార్మింగ్‌ను −1.8°C వరకు నియంత్రించాలని సూచించారు.


 ప్రపంచ జనాభాలో 30% మంది అత్యంత అభివృద్ధి చెందిన దేశాలైన చైనా, అమెరికా, యూరప్‌లో నివసిస్తున్నారు. వీటి నుంచే ఏటా 78% కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నట్లు సదస్సులో చర్చించారు. వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టం అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందని దేశాలపై ఏ విధంగా ఉందనే దాన్ని పరిగణనలోకి తీసుకుని క్లైమేట్‌ ఫైనాన్స్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.


కాప్‌ 27


కాప్‌ సదస్సును యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ (UNFCCC)  ఏటా నిర్వహిస్తుంది. 2022 ఏడాదికి ఈ సదస్సును ఈజిప్ట్‌లోని షర్మ్‌ ఎల్‌-షేక్‌ నగరంలో జరిపారు. 


సదస్సులో చర్చించిన ముఖ్యాంశాలు: 


* పారిస్‌ ఒప్పందానికి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉష్ణోగ్రతలను  1.5°C  నుంచి 2°C వరకు తగ్గించడానికి కావాల్సిన అనుకూల వాతావరణాన్ని కల్పించకపోవడంపై సదస్సులో చర్చించారు.


* ఈ ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి అవసరమైన చర్యలను పరిశీలించేందుకు గ్లోబల్‌ గోల్‌ ఆన్‌ అడాప్టేషన్‌ (GGA) అనే సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.


* కాప్‌-26 సదస్సు సమయంలో ఏర్పాటుచేసిన 100 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల నిధిని 2023లో విడుదల చేస్తారు.


* అభివృద్ధి చెందిన దేశాలు విడుదల చేసే ఉద్గారాల వల్ల ప్రభావానికి గురయ్యే చిన్న దేశాలను ఆదుకోవడానికి ‘లాస్‌ అండ్‌ డామేజ్‌ ఫండ్‌’ను ఏర్పాటు చేశారు. 


* అంతర్జాతీయ భాగస్వామ్యంతో యాక్షన్‌ ఆన్‌ వాటర్‌ అడాప్టేషన్‌ అండ్‌ రెసిలియన్స్‌ (ఏడబ్ల్యూఏఆర్‌ఈ), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రెసిలియన్స్‌ ఎక్సలరేటర్‌ ఫండ్‌ (ఐఆర్‌ఏఎఫ్‌) అనే సంస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి సంబంధ సమస్యలు, వాతావరణ మార్పుల వల్ల సంభవించిన విపత్తులను ఎదుర్కొనే ప్రణాళికలు రచించడం వీటి ముఖ్య ఉద్దేశం.


* వాతావరణ మార్పుల ప్రభావాన్ని తరచూ ఎదుర్కొనే దేశాలను పరిరక్షించడానికి గ్లోబల్‌ షీల్డ్‌ ప్లాన్‌ను తయారు చేశారు. 2022 నాటికి ఎక్కువ వాతావరణ మార్పుల ప్రభావానికి గురైన పాకిస్థాన్‌కు ఈ నిధి నుంచి మొదటి మొత్తాన్ని కేటాయించారు.


* మడ అడవుల పరిరక్షణ కోసం మాంగ్రూవ్‌ ఎలైన్స్‌ ఫర్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ (ఎంఏసీ) పథకాన్ని ప్రారంభించాలని సూచించారు.


భారత్‌ ప్రతిపాదనలు:


 2070 నాటికి నెట్‌ జీరో ఉద్గారాలను సాధిస్తామని భారత్‌ పేర్కొంది. సంప్రదాయేతర వనరుల నుంచి శక్తిని వినియోగించుకునేందుకు క్లీన్‌ హైడ్రోజన్‌ మిషన్, 20 శాతం ఇథనాల్‌ బ్లెండింగ్‌ చేస్తామని ప్రతిపాదించింది.


లైఫ్‌ స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ (లైఫ్‌)


 దీన్ని కాప్‌ 26 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. మన జీవనశైలి మార్పులతో సుస్థిరాభివృద్ధిని సాధించవచ్చని, ప్రతి ఒక్కరూ దీన్ని ఉద్యమంలా చేయాలని మోదీ పిలుపునిచ్చారు.


 ఈ సదస్సులోనే మోదీ పంచామృత్‌ అనే 5 పర్యావరణహిత లక్ష్యాలను కూడా ప్రతిపాదించారు. ప్రపంచ దేశాలు ‘యూజ్‌ అండ్‌ డిస్పోజ్‌’ ఆర్థిక వ్యవస్థ నుంచి ‘సర్క్యులర్‌ ఎకానమీ’ ఆర్థిక వ్యవస్థకు మారాలని సూచించారు.


వాతావరణ మార్పులు - భారత ప్రభుత్వ చర్యలు


 భారత ప్రభుత్వం అత్యంత మెరుగైన విధివిధానాలతో వాతావరణ మార్పులను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంటోందని భారత పర్యావరణ అటవీ, వాతావరణ మారు శాఖ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే రాజ్యసభలో ప్రకటించారు. ప్రపంచంలో భారత్‌ 17 శాతం జనాభా కలిగి ఉండగా, 1850  2019 మధ్యకాలంలో కేవలం నాలుగు శాతం మాత్రమే గ్రీన్‌ హౌస్‌ వాయువులు విడుదల చేసినట్లు చౌబే పేర్కొన్నారు. 


దేశంలో అమలవుతున్న వివిధ యాక్షన్‌ ప్లాన్స్‌


నేషనల్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ (ఎన్‌ఏపీసీసీ): గ్రీన్‌ హౌస్‌ వాయువుల ప్రభావాన్ని తగ్గించడం దీని ఉద్దేశం. ఇందుకోసం 8 నేషనల్‌ మిషన్స్‌ను రూపొందించారు. దేశంలోని వాతావరణ మార్పు ప్రభావాన్ని తగ్గించి సుస్థిరాభివృద్ధి, 


ఆరోగ్యవంతమైన జీవావరణ వ్యవస్థ, జీవ వైవిధ్య వ్యవస్థల పరిరక్షణ దీని లక్ష్యాలు. దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్‌ఏపీసీసీ మార్గదర్శకాలతో స్టేట్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ను అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్నాయి.


నేషనల్‌ క్లీన్‌ ఎనర్జీ ఫండ్‌ (ఎన్‌సీఈఎఫ్‌): దీన్ని భారత ప్రభుత్వం 2010లో ప్రారంభించింది. శుద్ధ శక్తి వనరులను ప్రోత్సహించడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు.


పారిస్‌ ఒప్పందం: భారత ప్రభుత్వం పారిస్‌ ఒప్పందానికి అనుగుణంగా తన మద్దతు తెలిపింది. దీనికోసం 2005 నాటికి దేశ జీడీపీలో గ్రీన్‌ హౌస్‌ వాయువులను 33  35 శాతానికి తగ్గించాలి. శిలాజేతర ఇంధన వనరుల వినియోగాన్ని 40 శాతానికి పెంచాలి. 2030 నాటికి 2.5 నుంచి 3 బిలియన్‌ టన్నుల అదనపు కార్బన్‌ సింక్‌లను  ఏర్పాటు చేయాలి. పారిస్‌ ఒప్పందంలో భారత్‌ 2030 నాటికి సాధించాల్సిన కొన్ని లక్ష్యాలను సూచించగా, వాటిని 2021 నాటికే చేరుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.


ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయన్స్‌: ఇది అంతర్జాతీయ సంస్థ. దీని ముఖ్య కేంద్రం హరియాణాలోని గురుగ్రామ్‌లో ఉంది. భారత్‌ లాంటి ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే దేశాల్లో శాస్త్ర సాంకేతిక పద్ధతులను అనుసరించి సౌరశక్తిని తయారు చేయడం దీని లక్ష్యం. దీన్ని భారత్, ఫ్రాన్స్‌ దేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. 


భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌) నిబంధనలు: వాహనాల నుంచి వెలువడే కాలుష్య కారకాలను నియంత్రించడం దీని ఉద్దేశం. ప్రస్తుతం మన దేశంలో బీఎస్‌ - 6 నిబంధనలు అమలవుతున్నాయి. 2000లో బీఎస్‌ - 1, 2005లో బీఎస్‌-2, 2010 లో బీఎస్‌-3, 2016లో బీఎస్‌ - 4 వాహన నిబంధనలు అమలయ్యాయి. వాహన కాలుష్యాన్ని తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. 


నేషనల్‌ అడాప్షన్‌ ఫండ్‌ ఫర్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ (ఎన్‌ఏఎఫ్‌సీసీ): భారతదేశంలో వాతావరణ మార్పులకు గురవుతున్న వివిధ ప్రాంతాలకు ఈ నిధిని కేటాయిస్తారు. దీనిద్వారా ఆయా ప్రాంతాల్లో క్లైమేట్‌ ఛేంజ్‌ ప్రభావాన్ని తగ్గిస్తున్నారు. ఈ చర్యల ద్వారా 2005  16 మధ్య కాలంలో భారతదేశ ఉద్గార ప్రభావాన్ని దేశ జీడీపీలో 24 శాతం మేర  తగ్గించినట్లు ప్రభుత్వం పేర్కొంది.


కొయలేషన్‌ ఫర్‌ డిజాస్టర్‌ రెసిలియంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (సీడీఆర్‌ఐ): వాతావరణ మార్పులను తట్టుకుని దానివల్ల కలిగే విపత్తుల నుంచి రక్షించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం దీని లక్ష్యం. 


వన్‌ సన్‌ వన్‌ వరల్డ్‌ వన్‌ గ్రిడ్‌ (ఓఎస్‌ఓడబ్ల్యూఓజీ): శిలాజేతర ఇంధనాల నుంచి శక్తి వనరుల వినియోగం, సౌర శక్తిని అత్యంత మెరుగ్గా వినియోగించుకోవడం మొదలైనవి దీని లక్ష్యాలు. దీని విజన్‌ ‘ది సన్‌ నెవర్‌ సెట్స్‌’ 


ఇంటిగ్రేటెడ్‌ కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ (ఐసీజడ్‌ఎంపీ): తీర ప్రాంతాలను వాతావరణ మార్పుల నుంచి రక్షించడం దీని ముఖ్య ఉద్దేశం. పెరుగుతున్న కాలుష్య కారకాలు, తద్వారా సముద్ర నీటిమట్టం పెరుగుదల మొదలైన వాటిని ముందుగానే అంచనా వేసి సరైన విధివిధానాలతో గ్రీన్‌ హౌస్‌ వాయువుల ప్రభావాన్ని నియంత్రిస్తారు.


రచయిత

రేమల్లి సౌజన్య

విషయ నిపుణులు 

Posted Date : 16-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌