• facebook
  • whatsapp
  • telegram

సముద్రయాన్‌

సముద్రయాన్‌


రోదసి, రక్షణ ఆధారిత ఎకానమీలో ముందడుగు వేస్తున్న భారత్‌ సముద్ర గర్భంలో ఖనిజాలు, మూలకాలు, ఔషధ మొక్కలు తదితర వనరుల వెలికితీతకు 2026 నాటికి  ‘సముద్రయాన్‌’ అనే ప్రాజెక్ట్‌ని చేపట్టనుంది.

సముద్ర ఆధారిత ఎకానమీ (Blue Economy) అభివృద్ధే ధ్యేయంగా భారత్‌ చేపడుతున్న తొలి మానవ సహిత, ‘డీప్‌ ఓషన్‌ మిషన్‌’- సముద్రయాన్‌.

దీనిలో భాగంగా ముగ్గురు పరిశోధకులు (ఆక్వానాట్‌లు/ ఓషన్‌నాట్‌లు) సముద్ర ఉపరితలం నుంచి 6000 మీటర్ల లోతు వరకు వెళ్లి పరిశోధనలు చేపట్టనున్నారు. సముద్రం అడుగున ఉండే మాంగనీస్, కోబాల్ట్‌ లాంటి ఖనిజాలను గుర్తించి వాటిని వెలికితీసే అవకాశాలను అధ్యయనం చేయనున్నారు. 

సముద్రాల్లో మునిగిన నౌకలు, సబ్‌మెరైన్లు, వస్తువులు, జీవజాలాన్ని గుర్తించడం, సముద్ర భాగంలో ఇంటర్నెట్‌ ప్రసారాలకు వాడే ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్లను వేసే సాధ్యాసాధ్యాలను తెలుసుకోవచ్చు.

సముద్ర శక్తితో వచ్చే సంప్రదాయేతర విద్యుత్‌ దేశ సాంఘిక, ఆర్థిక అభివృద్ధిలో కీలకపాత్ర పోషించేందుకు ఇది తోడ్పడనుంది. 

సముద్రయాన్‌ సఫలమైతే అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా లాంటి దేశాల సరసన భారత్‌ చేరనుంది.

సముద్రయాన్‌ మిషన్‌లో భాగంగా ఇస్రో, ఐఐటీ మద్రాస్‌ల సహకారంతో మత్స్య 6000 పేరుతో ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ’ జలాంతర్గామిని రూపొందిస్తోంది. ఈ మిషన్‌ అంచనా వ్యయం రూ.6,000 కోట్లు.


సముద్ర మిషన్‌ లక్ష్యాలు

సముద్ర అంతర్భాగంలో మైనింగ్‌ చేయడానికి, మానవ సహిత జలాంతర్గామిని తయారు చేయడానికి అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేయడం

సముద్ర వాతావరణ మార్పులపై సలహా సేవల అభివృద్ధి సముద్ర గర్భ బయోడైవర్సిటీని అన్వేషించి సంరక్షించడం ఓషియన్‌ బయాలజీకి అడ్వాన్స్‌డ్‌ మెరైన్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయడం సముద్రాల సర్వే, అన్వేషణ స్వచ్ఛమైన నీటిని, శక్తిని సముద్రాల నుంచి పొందడం 

మత్స్య 6000 


ఇది సముద్రాల అడుగు భాగాన అధిక సాంద్రతతో ఉండే ఒత్తిడిని తట్టుకుని 6000 మీ.ల లోతు వరకు ముగ్గురు శాస్త్రవేత్తలను 12 గంటలు, అత్యవసర సమయాల్లో 96 గంటల సమయం వరకు తీసుకువెళ్లే గోళాకార శోధక జలాంతర్గామి. 

ఇది సముద్రాంతర అన్వేషణకు అవసరమయ్యే అన్ని పరికరాలు, సెన్సార్లు, ఆక్సిజన్, అత్యవసర రక్షణ వ్యవస్థలను కలిగిన ఒక ప్రయోగశాల. 

2.1 మీ. వ్యాసంతో ఉండే మత్స్య నీట మునిగేందుకు, తేలేందుకు అనువైన బల్లాస్ట్‌ బ్యాటరీలను, ప్రొపల్షన్, లాంచింగ్, రికవరీ, నియంత్రణ, కమ్యూనికేషన్స్‌ వ్యవస్థలను కలిగి ఉంటుంది.

టైటానియం మిశ్రమంతో తయారైన లోహ శోధకం తొలి దశలో 500 మీ.ల లోతుకు వెళ్లి, క్రమక్రమంగా 6 కి.మీ. లోతు వరకు వెళ్లే విధంగా రూపొందిస్తున్నారు.


అగ్నిబాణ్‌ 


చెన్నైకి చెందిన భారతీయ అంతరిక్ష అంకుర సంస్థ అగ్నికుల్‌ కాస్మోస్‌ ప్రపంచంలోనే తొలి 3D ముద్రిత  (Printed) రాకెట్‌ అగ్నిబాణ్‌ సబ్‌ ఆర్బిటాల్‌ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్‌ (SOrTeD)ని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (SDSC), శ్రీహరికోటలో ఏర్పాటు చేసుకున్న సొంత లాంచ్‌ప్యాడ్‌ నుంచి త్వరలో ప్రయోగించనుంది.

100 కిలోల ద్రవ్యరాశితో ఉండే ఉపగ్రహాన్ని 700 కి.మీ. ఎత్తులో ఉండే కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి అగ్నిబాణ్‌ ఉపయోగపడుతుంది. దీన్ని నేరుగా మొబైల్‌లాంచ్‌ వ్యవస్థ నుంచి నిటారుగా ప్రయోగించవచ్చు. 

18 మీ. పొడవు, 1.3 మీ. వ్యాసంతో ఉండే అగ్నిబాణ్‌ ఒకటి లేదా రెండంచెలను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ప్రయోగించే టెక్నాలజీ డెమాన్‌స్టేట్రర్‌లో ఒక అంచెను మాత్రమే అమర్చారు.

పేలోడ్‌ బరువు ఆధారంగా అగ్నిబాణ్‌లో 3D ముద్రిత ఏడు అగ్నిలెట్‌ సెమీ క్రయోజెనిక్‌ ఇంజిన్లను వాడే అవకాశం ఉంది. అగ్నిబాణ్‌ రాకెట్లలో మొత్తం 5 రకాలను తయారు చేసుకోవచ్చు.

అగ్నిలెట్‌ ఇంజిన్‌లో ద్రవ ఆక్సిజన్‌ (LOX), కిరోసిన్లను ఇంధనాలుగా ఉపయోగిస్తారు. ఆరు కిలో న్యూటన్ల ఒత్తిడిని ((Propulsion) కలిగించే సామర్థ్యం దీని సొంతం. 

అగ్నిలెట్‌ ప్రపంచంలోనే తొలి 3D ముద్రిత, అఖండిత (Single Piece) ఇంజిన్‌. 

అగ్నిబాణ్‌ను సులభంగా కదిలించేందుకు అగ్నికుల్‌ కాస్మోస్‌ ధనుష్‌ పేరుతో ఒక మొబైల్‌ పీఠాన్ని తయారు చేసింది. ఈ రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో, ఇన్‌స్పేస్‌ (IN-SPACe)లు అగ్నికుల్‌ కాస్మోస్‌కి సహాయ సహకారాలను అందిస్తున్నాయి.

భారత తొలి ప్రైవేట్‌ రాకెట్‌ Vikram-S.. హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష అంకుర సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ఈ రాకెట్‌ను రూపొందించింది. 

దీన్ని 18 నవంబరు 22న శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించారు. 

6 మీ. పొడవైన ఘన ఇంధన ఒక అంచె రాకెట్‌ Vikram-S.  89.5 కి.మీ ఎత్తును చేరి ప్రయోగించిన అయిదు నిమిషాల తరువాత బంగాళాఖాతంలో పడిపోయింది. 

ప్రారంభ్‌ పేరుతో చేపట్టిన తొలి మిషన్లో, తొలి రాకెట్‌కి భారత అంతరిక్ష రంగ పితామహుడు విక్రమ్‌ సారాభాయ్‌ పేరు (విక్రం-S)ను నామకరణం చేశారు.


ఆపిల్‌ ఫోన్‌లో నావిక్‌ 


2025 నాటికి భారత్‌లో అమ్మే ప్రతి 5G స్మార్ట్‌ ఫోన్‌లో సద్వేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నావిక్‌ (NavIC  - నావిగేషన్‌ విత్‌ ఇండియన్‌ కన్సల్టేషన్‌) ఉండాలని, దీన్ని సపోర్ట్‌ చేసే విధంగా సాఫ్ట్‌వేర్‌ ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఇందులో భాగంగా ఆపిల్‌ విడుదల చేసిన ఐఫోన్‌ 15లో నావిక్‌ను ఇన్‌స్టాల్‌ చేశారు. 2018 నాటికి ప్రయోగించిన IRNSS (భారత ప్రాదేశిక నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థ) పరిధిని మరింత పెంచేందుకు ఇస్రో రెండోతరం నావిగేషన్‌ ఉపగ్రహాలను ఇప్పటికే ప్రయోగించడం ప్రారంభించింది. దీనిలో భాగంగా GSLV-F12 రాకెట్‌తో NVS-01 ఉపగ్రహాన్ని మే 29, 2023న SDSC-SHAR నుంచి ప్రయోగించారు. కొత్తరకం నావిగేషన్‌ ఉపగ్రహాల్లో దేశీయ అటామిక్‌ గడియారాలు, అదనపు ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ L1లు ఉన్నాయి.


ప్రాజెక్ట్‌ - 17ఆల్ఫా(A) 


భారత నేవీ P-17Aపేరుతో ఏడు చిన్న తరహా నౌకల (Frigates) నిర్మాణాన్ని 2019లో ప్రారంభించింది. 

 దీనిలో భాగంగా నాలుగు నౌకలను MDL నిర్మిస్తే మరో మూడింటిని కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ (GRSE) నిర్మించింది. P17A నౌకలను ఇండియన్‌ నేవీ వార్‌షిప్‌ డిజైన్‌ బ్యూరో డిజైన్‌ చేసింది. 

 ఈ నౌకలన్నీ రాడార్‌ అబ్జార్బెంట్‌ కోటింగ్‌ని కలిగి ఉండటంతో శత్రు రాడార్లకు చిక్కకుండా, ముందుకు దూసుకువెళ్తాయి. 

 201922 మధ్య కాలంలో జలప్రవేశం చేయించిన ఆరు నౌకలు వరుసగా   INS Nilgiri, Himgiri, Udaygiri, Dunagiri, Vindyagiri. Taragiri.  ఈ మొత్తం నౌకలకు భారత పర్వత శ్రేణుల పేర్లు పెట్టారు.


మహేంద్రగిరి 


భారత నావికాదళంలోకి ‘మహేంద్రగిరి’ ఫ్రిగేట్‌  (Frigate)  అనే మరొక అధునాతన యుద్ధనౌక చేరింది. 

 ప్రాజెక్ట్‌ 17Aలో భాగంగా నిర్మించిన ఏడు నౌకల్లో ఇది చివరిది. దీన్ని ముంబయిలోని మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌  (MDL) కేవలం 14 నెలల్లోనే నిర్మించింది. 

 ప్రాజెక్ట్‌ 17 (శివాలిక్‌ తరహా)కి కొనసాగింపుగా చేపట్టిన  P-17A  ఫ్రిగేట్లు రహస్య ఆపరేషన్లను నిర్వర్తించడమే కాకుండా అధునాతన ఆయుధాలు, క్షిపణులు, సెన్సార్లను కలిగి ఉంటాయి. 

P-17A నౌకల్లో ఆత్మనిర్భర్‌ భారత్‌కు అనుగుణంగా 75% దేశీయ సాంకేతికతను, పరికరాలను ఉపయోగించారు.


ఫ్రిగేట్స్‌ (Frigates


యుద్ధ నౌకలు ప్రధానంగా మూడు రకాలు. అవి డిస్ట్రాయర్స్, కార్వెట్స్, ఫ్రిగేట్స్‌. వీటిలో అన్నింటి కంటే చిన్నవి ఫ్రిగేట్‌లు కాగా పెద్దవి డిస్ట్రాయర్‌లు. 

భారత నేవీలోని చిన్న నౌకలైన ఫ్రిగేట్స్‌ వేగంగా కదులుతూ ఇతర నౌకలకు రక్షణ కవచంగా నిలుస్తాయి. 

 ఫ్రిగేట్స్‌ ద్రవ్యరాశి 3 నుంచి 5 వేల టన్నుల మధ్య ఉంటుంది. నావికాదళంలోని నౌకలను, జలాంతర్గాములను రక్షించడంతో పాటు శత్రువులపై దాడి చేస్తాయి. 

 వీటిల్లో వివిధ ఆయుధాలు, టార్పెడోలు, క్షిపణులు, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ వ్యవస్థలు ఉంటాయి.

రచయిత

దురిశెట్టి అనంత రామకృష్ణ

విషయ నిపుణులు 

Posted Date : 18-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌