• facebook
  • whatsapp
  • telegram

ఇండియన్ బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టం

 భారతదేశం శత్రుదేశాలు ప్రయోగించే క్షిపణులను మార్గమధ్యంలోనే అడ్డుకొని వాటిని నాశనం చేయగల 'బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టం'ను అభివృద్ధి చేసింది. దీన్నే గగనతల రక్షణ ఛత్రంగా పిలుస్తున్నారు.
   ఈ వ్యవస్థలో భాగంగా భారతదేశం రెండంచెల వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందులో మొదటిది పృథ్వి ఎయిర్ డిఫెన్స్ (PAD), రెండోది అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ (AAD). PAD ను ఎక్సో అట్మాస్ఫియరిక్ రక్షణ వ్యవస్థగా, AAD ను ఎండో అట్మాస్ఫియరిక్ రక్షణ వ్యవస్థగా ఏర్పాటుచేశారు. భారతదేశం బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టంను ఇప్పటికే దిల్లీలో ఏర్పాటుచేసింది. తర్వాత దశలో ముంబయిలో నెలకొల్పాలని భావిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా గగనతల రక్షణ ఛత్రం దిల్లీతోసహా ఏడు నగరాలకు మాత్రమే ఉంది. ఈ వ్యవస్థను కలిగిన ఇతర నగరాలు వాషింగ్టన్, మాస్కో, బీజింగ్, పారిస్, లండన్, టెల్ అవీవ్.

బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టం అవసరం

    భారతదేశం, పాకిస్థాన్ మధ్య 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్థాన్ అణ్వస్త్రాలను ప్రయోగించాలనుకుంది. దీన్ని గుర్తించిన భారతదేశం పాకిస్థాన్, చైనా క్షిపణి దాడుల నుంచి రక్షించుకోవడానికి బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టంను అభివృద్ధి పరిచింది.

పృథ్వి ఎయిర్ డిఫెన్స్ (PAD)

   దీన్ని ప్రద్యుమ్న అని కూడా పిలుస్తారు. పృథ్వి క్షిపణి పరిజ్ఞానం ఆధారంగా అభివృద్ధి చేశారు. దీనిలో రెండు దశల్లో ఇంధనం ఉంటుంది. మొదటి దశలో ద్రవ ఇంధనం, రెండో దశలో ఘన ఇంధనం ఉంటాయి. ఇది 300 - 2000 కి.మీ. దూరంలో ఉండే శత్రుదేశాల క్షిపణులను గాలిలో 80 కి.మీ. ఎత్తులో పేల్చేస్తుంది. దీని వేగం 5 మాక్. అంటే ఇది సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ క్షిపణికి లాంగ్‌రేంజ్ ట్రాకింగ్ రాడార్‌ను అమర్చారు. ఈ వ్యవస్థను మొదట 2006 నవంబరులో 50 కి.మీ. ఎత్తులో పరీక్షించారు. రెండోసారి 2009, మార్చి 6న నౌక నుంచి ప్రయోగించిన ధనుష్ క్షిపణిని లక్ష్య క్షిపణిగా నిర్ణయించి 1500 కి.మీ. దూరంలో పరీక్షించారు. PAD వంటి క్షిపణి వ్యవస్థను సొంతంగా ఏర్పాటుచేసుకున్న 4వ దేశం భారత్. ఈ వ్యవస్థను అభివృద్ధి చేసుకున్న ఇతర దేశాలు అమెరికా, రష్యా, ఇజ్రాయెల్.

అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ (AAD)

    దీన్ని అశ్విన్ అనే పేరుతో పిలుస్తున్నారు. ఇది 20 కి.మీ. ఎత్తులో ఉన్న శత్రుదేశాల క్షిపణులను కూల్చివేయగలదు. దీనిలో ఇనర్షియల్ నావిగేషన్ సిస్టం ఉంటుంది. ఈ క్షిపణి
7.5 మీటర్ల పొడవు, 1.2 టన్నుల బరువును కలిగి ఉంటుంది. దీనిలో ఒకే దశలో ఉండే ద్రవ ఇంధనం ఉంటుంది. వీటిని టెట్రా రవాణా వాహనం ద్వారా ప్రయోగించవచ్చు. దీన్ని మొదటగా
2007, డిసెంబరు 6న 15 కి.మీ. ఎత్తులో, రెండోసారి 2016, మార్చి 1న పరీక్షించారు.

స్వోర్డ్ ఫిష్ రాడార్

   ఇది లాంగ్ రేంజ్ ట్రాకింగ్ రాడార్. దీన్ని భారతదేశం ప్రత్యేకంగా బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ కోసం అభివృద్ధి చేసింది. ఈ రాడార్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన గ్రీన్‌పైన్ లాంగ్ రేంజ్ రాడార్ ఆధారంగా తయారుచేశారు. దీన్ని 2009 మార్చిలో పూర్తిగా పరీక్షించారు. ఇది పృథ్వి ఎయిర్ డిఫెన్స్‌లో భాగంగా ఉంటుంది. ఈ రాడార్ 600  - 800 కి.మీ. దూరంలో, 80 కి.మీ. ఎత్తులో ఉన్న క్షిపణులను, ఒకేసారి 200 లక్ష్యాలను గుర్తించగలదు.

టెక్నాలజీని అభివృద్ధి చేసిన సంస్థలు

    భారతదేశ గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి DRDO కు చెందిన వివిధ సంస్థలు తోడ్పడ్డాయి. వీటిలో డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ సంస్థ (DRDL - హైదరాబాద్)  మిషన్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్‌ను, రిసెర్చ్ సెంటర్ ఇమరత్ సంస్థ (హైదరాబాద్)  నావిగేషన్, ఎలక్ట్రోమెకానికల్ సిస్టంను; అడ్వాన్స్‌డ్ సిస్టం ల్యాబొరేటరీ సంస్థ (హైదరాబాద్) మోటార్స్‌ను, హై ఎనర్జీ మెటీరియల్స్ రిసెర్చ్ ల్యాబొరేటరీ సంస్థ (పుణె)  క్షిపణుల్లో వాడే ఇంధనాలను అభివృద్ధి చేస్తున్నాయి.

ఇతర దేశాల గగనతల రక్షణ వ్యవస్థల కొనుగోలు

    ప్రస్తుతం భారతదేశం వద్దనున్న గగనతల రక్షణ వ్యవస్థకు తోడుగా మరింత అభివృద్ధి పరిచిన గగనతల రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయాలని భావిస్తోంది. దీనికోసం అమెరికా రష్యాతో ఒప్పందాలను కుదుర్చుకోనుంది. రష్యాకు చెందిన ఎస్ - 400 ట్రయాంఫ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అయిదింటిని రూ.39 వేల కోట్లు వెచ్చించి కొనుగోలు చేయనుంది. వీటిని రష్యాకు చెందిన రూసోబోర్న్ ఎక్స్‌పోర్ట్ సంస్థ తయారుచేస్తుంది. ఈ వ్యవస్థ 600 కి.మీ. దూరంలోని శత్రువుపై నిఘా పెట్టగలదు. 400 కి.మీ. దూరంలోని శత్రువుల ఆయుధాలను ధ్వంసం చేసి, 90 డిగ్రీల కోణంలో దాడి చేస్తుంది. దీని ద్వారా మనం మధ్య శ్రేణి ఖండాతర క్షిపణులను (IRBM) సమర్థంగా ఎదుర్కోవచ్చు.
   భారతదేశం దిల్లీలోని వీఐపీ - 89 ప్రాంతంలో మోహరించడానికి భూమి నుంచి గాలిలోకి ప్రయోగించగల క్షిపణి వ్యవస్థను అమెరికా నుంచి కొనుగోలు చేయాలని భావిస్తోంది. దీన్ని నేషనల్ అడ్వాన్స్‌డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టం - 2(NASAMS - 2)గా పిలుస్తున్నారు. అమెరికా ప్రస్తుతం వీటిని వాషింగ్టన్ నగర రక్షణ కోసం ఉపయోగిస్తుంది.

2వ దశ అభివృద్ధికి ప్రయత్నాలు

   భారతదేశం మొదటి వ్యవస్థ తర్వాత రెండో గగనతల రక్షణ ఛత్రాన్ని అభివృద్ధి చేయనుంది. వీటిని AD - 1, AD - 2 వ్యవస్థలుగా పేర్కొంటారు. వీటిలో క్షిపణుల వేగం 8 మాక్ (హైపర్‌సోనిక్) ఉంటుంది. దీనివల్ల భారతదేశానికి ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్ (IRBM), ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్స్ (ICBM) నుంచి రక్షణ ఉంటుంది.

Posted Date : 13-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌