• facebook
  • whatsapp
  • telegram

లోహ సంగ్రహణం 

సమ్మేళనాల రూపంలో లభించే లోహాలను ఖనిజాలు అంటారు.

పారిశ్రామికంగా ఏ ఖనిజం నుంచి లోహాన్ని లాభదాయకంగా సంగ్రహిస్తారో ఆ ఖనిజాన్ని ధాతువు అంటారు.

* అధిక క్రియాశీలత గల లోహాలను (సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం) సంగ్రహించడానికి వాటి ద్రవ ధాతువులను విద్యుద్విశ్లేషణ చేస్తారు.

* మధ్యస్థ క్రియాశీలతగల లోహాలను, (ఇనుము, జింక్, రాగి, సీసం) వాటి ధాతువులను భర్జనం లేదా భస్మీకరణం ద్వారా లోహ ఆక్సైడ్‌లుగా మార్చిన తరువాత క్షయకరణం చేసి శుద్ధ లోహాలను సంగ్రహిస్తారు.

* అల్ప క్రియాశీలతగల లోహాలను, (వెండి, పాదరసం) వాటి ధాతువులను భర్జనం చేసి, క్షయకరణం చెందించడం ద్వారా సంగ్రహించవచ్చు.

లోహ ధాతువును గాలి లేదా ఆక్సిజన్‌వాయువు సమక్షంలో అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసే ప్రక్రియను భర్జనం (Roasting)అంటారు.

* లోహ ధాతువును గాలి లేదా ఆక్సిజన్‌ అందుబాటులో లేకుండా వేడిచేసే ప్రక్రియను భస్మీకరణం అంటారు.

* అపరిశుద్ధ లోహం నుంచి శుద్ధ లోహాన్ని కింది పద్ధతుల ద్వారా పొందవచ్చు:

* స్వేదనం (Distillation)

* పోలింగ్‌ (Poling)

* గలనం చేయడం (Liquation)

* విద్యుత్‌ శోధనం (Electrolytic refining)

ఒక లోహం తన రూపంలో నుంచి ప్రకృతిలో సహజంగా లభించే వేరొక రూపంలోకి స్వచ్ఛందంగా మారే ప్రక్రియను లోహక్షయం అంటారు.

ఉదాహరణలు:

* ఇనుము తుప్పు పట్టడం

* రాగి వస్తువులపై పచ్చని పొర ఏర్పడటం

* వెండి వస్తువులు కాంతి విహీనమవడం


ఇనుము ముఖ్యమైన ఖనిజాలు:

* మాగ్నటైట్‌     * సిడరైట్‌    

* హెమటైట్‌      ఐరన్‌ పైరటీస్‌


కాల్షియం ముఖ్యమైన ఖనిజాలు:

* సున్నపు రాయి    జిప్సం     

చాక్‌     డోలమైట్‌


మెగ్నీషియం ముఖ్యమైన ఖనిజాలు:

* మాగ్నసైట్‌     * ఎప్సం లవణం   

* కార్నలైట్‌    * డోలమైట్‌


అల్యూమినియం ముఖ్యమైన ఖనిజాలు:

* బాక్సైట్‌      * కోరండం    

క్రయోలైట్‌   * ఫెల్డ్‌స్పార్‌

* ఇనుము రూపాలన్నింటిలో చేత ఇనుము శుద్ధమైంది, పోత ఇనుము అపరిశుద్ధమైంది.

* పాదరసం ప్రధానంగా ఉండే మిశ్రమ లోహాలను ‘అమాల్గమ్‌’లు అంటారు. ఇనుము, ప్లాటినం లోహాలు అమాల్గమ్‌లను ఏర్పరచవు. పాదరసం ఇనుముతో చర్యలో పాల్గొనకపోవడంతో దీన్ని ఇనుప పాత్రలో నిల్వ చేస్తారు.


ముఖ్యమైన ఫెర్రస్‌ మిశ్రమ లోహాలు:

* స్టీల్‌ లేదా ఉక్కు  * టంగ్‌స్టన్‌ స్టీల్‌

* స్టెయిన్‌లెస్‌ స్టీల్‌  * నిక్రోమ్‌

* మాంగనీస్‌ స్టీల్‌    * ఇన్వార్‌


ముఖ్యమైన నాన్‌ - ఫెర్రస్‌ మిశ్రమ లోహాలు:

* కంచు       * గన్‌ మెటల్‌   

* ఆల్నికో      * ఇత్తడి        

* జర్మన్‌ సిల్వర్‌   * డూరాల్యూమిన్‌

బెల్‌మెటల్‌      * మాగ్నాలియం  

* సోల్డర్‌

* హీటర్‌ ఫిలమెంట్‌ తయారీలో నిక్రోమ్‌ అనే మిశ్రమ లోహాన్ని ఉపయోగిస్తారు.

* రాగి, తగరం లోహాలను మిశ్రమం చెందించి కంచును తయారు చేస్తారు. విగ్రహాలు, వంటపాత్రల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. 


లోహక్షయ నివారణకు ఉపయోగించే పద్ధతులు

లోహ ఉపరితలంపై గ్రీజు, పెయింట్‌ పూయడం 

గాల్వనైజేషన్‌    

* ఎలక్ట్రో ప్లేటింగ్‌

* మిశ్రమ లోహాలను ఏర్పరచడం

ఇనుముపై జింక్‌ లోహాన్ని పలుచగా పూత పూయడాన్ని గాల్వనైజేషన్‌ అంటారు.

 ఇనుముపై టిన్‌ (తగరం) లోహాన్ని పూతగా పూయడాన్ని టిన్నింగ్‌ అంటారు.

 ఎలక్ట్రో ప్లేటింగ్‌ పద్ధతిలో ఇనుముపై అవసరమైన లోహాన్ని పూతగా విద్యుద్విశ్లేషణ ద్వారా వేస్తారు.

 కారు విడి భాగాలు, కుళాయిలు, చక్రాల రిమ్ములపై క్రోమియంతో ఎలక్ట్రో ప్లేటింగ్‌ చేస్తారు.

 రెండు లేదా అంతకంటే ఎక్కువ లోహాల సజాతీయ మిశ్రమాన్ని ‘మిశ్రమ లోహం’ అంటారు.

ఉదా: ఇత్తడి, కంచు, స్టెయిన్‌లెస్‌ స్టీల్, జర్మన్‌ సిల్వర్, నిక్రోమ్, బెల్‌మెటల్, సోల్డర్, డూరాల్యూమిన్‌ మొదలైనవి.

* మిశ్రమ లోహాలు ఏర్పడటంతో గట్టిదనం, లోహద్యుతి, రంగు మెరుగుపడుతుంది. సాగే గుణం, ద్రవీభవన స్థానం, తుప్పు పట్టే గుణం తగ్గుతుంది.


మాదిరి ప్రశ్నలు


1. సాల్ట్‌పీటర్‌ ఏ లోహపు ఖనిజం?

1) బేరియం   2) పొటాషియం    3) కాల్షియం    4) అల్యూమినియం


2. అర్జంటైట్‌ ఏ లోహపు ఖనిజం?

1) సీసం   2) పాదరసం    3) థోరియం    4) వెండి (సిల్వర్‌)


3. కింది వాటిని జతపరచండి.

లోహం           ఖనిజం

a. థోరియం       i)  గెలీనా

b. సీసం         ii) సిన్నబార్‌

c. పాదరసం      iii) మోనోజైట్‌

1) a-i, b-iii, c-ii    2) a-iii, b-ii, c-i    3) a-ii, b-i, c-iii     4) a-iii, b-i, c-ii


4. కింది వాటిలో కార్బొనేట్‌ ఖనిజ రూపం కానిదేది?

1) సున్నపురాయి    2) బాక్సైట్‌    3) సిన్నబార్‌     4) 2, 3


5. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌లో అనుఘటక లోహాలు ఏవి?

1) ఇనుము, క్రోమియం మాత్రమే    2) ఇనుము, క్రోమియం, నికెల్‌ మాత్రమే

3) ఇనుము, క్రోమియం, నికెల్, కార్బన్‌    4) ఇనుము, కార్బన్‌ మాత్రమే


6. కింది వాటిలో సల్ఫేట్‌ ఖనిజ రూపం ఏది?

1) జిప్సం   2) గెలీనా   3) బారైట్‌    4) 1, 3


7. కింది వాటిని జతపరచండి.

ఖనిజం        రసాయన ఫార్ములా

a. రాతి ఉప్పు      i) CaSO4 .2H2O

b. జిప్సం      ii) BaSO4

c. బారైట్‌    iii) NaCl

1) a-ii, b-i, c-iii    2) a-iii, b-i, c-ii    3) a-i, b-iii, c-ii    4) a-iii, b-ii, c-i


8. కింది వాటిలో సరైంది?

ఎ) ఇన్వార్‌ అనే మిశ్రమ లోహాన్ని లోలకాల తయారీలో వాడతారు.

బి) ఇన్వార్‌ను మీటర్‌ స్కేలు తయారీలో ఉపయోగిస్తారు

1) ఎ మాత్రమే    2) బి మాత్రమే      3) ఎ, బి     4) పైవేవీకావు


9. హీటర్‌ ఫిలమెంట్‌ తయారీలో ఉపయోగించే మిశ్రమ లోహం?

1) స్టీల్‌     2) నిక్రోమ్‌     3)  ఇత్తడి    4) ఆల్నికో


10. బ్లేడ్లు, శస్త్ర చికిత్స పరికరాల తయారీలో ఉపయోగించేది?

1) స్టెయిన్‌లెస్‌ స్టీల్‌     2) మాగ్నాలియం    3) డూరాల్యూమిన్‌   4) ఆల్నికో


11. కింది వాటిలో సరైంది?

ఎ) విగ్రహాలు, వంటపాత్రల తయారీలో కంచును ఉపయోగిస్తారు

బి) రాగి, తగరం లోహాలను మిశ్రమం చెందించి కంచును తయారు చేస్తారు

1) ఎ మాత్రమే    2) బి మాత్రమే     3) ఎ, బి    4) పైవేవీకావు


12. కింది వాటిలో మిశ్రమ లోహం కానిదేది?

1) సోల్డర్‌     2) సోడియం      3) మాగ్నాలియం    4) ఇత్తడి


13. కింది వాటిలో రాగి లేని మిశ్రమ లోహం ఏది?

1) కంచు   2) ఇత్తడి    3) సోల్డర్‌    4) జర్మన్‌ సిల్వర్‌


14. జింక్‌ అమాల్గమ్‌లోని లోహాలు ఏవి?

1) జింక్‌ + పాదరసం    2) జింక్‌ + వెండి   3) జింక్‌ + రాగి    4) జింక్‌ + నికెల్‌


15. అయస్కాంతాల తయారీలో ఉపయోగించే మిశ్రమ లోహం ఏది?

1) అల్యూమినియం     2) ఆల్నికో     3) అమాల్గమ్‌    4) పైవన్నీ


16. కింది వాటిలో సోల్డర్‌ మిశ్రమ లోహానికి సంబంధించి సరైంది?

ఎ) సోల్డర్‌ను తగరం, సీసం లోహాల నుంచి తయారు చేస్తారు.

బి) తీగలను సోల్డరింగ్‌ చేయడానికి సోల్డర్‌ను ఉపయోగిస్తారు.

1) ఎ మాత్రమే   2) బి మాత్రమే      3) ఎ, బి    4) పైవేవీకావు


17. లోహాన్ని సంబంధిత ధాతువుల నుంచి సంగ్రహించే విధానంలో సరైన క్రమం?

ఎ) ధాతువును గాఢత చెందించడం

బి) లోహాన్ని శుద్ధి చేయడం

సి) ముడి లోహాన్ని సంగ్రహించడం

1) ఎ, సి, బి    2) ఎ, బి, సి     3) బి, సి, ఎ    4) సి, ఎ, బి


18. ఇత్తడి (Brass) ఏ లోహాల మిశ్రమం?

1) రాగి, జింక్‌    2) రాగి, నికెల్‌    3) రాగి, వెండి   4) తగరం, సీసం


19. లోహాన్ని ధాతువుల నుంచి సంగ్రహించేందుకు ఉపయోగించే ప్రక్రియ?

1) భస్మీకరణం   2) ప్రగలనం      3) భర్జనం          4) పైవన్నీ


20. కింది వాటిలో సరైంది?

ఎ) పిచ్‌బ్లెండ్‌ అనేది యురేనియం ఖనిజం

బి) బారైట్‌ అనేది బేరియం ఖనిజం

1) ఎ మాత్రమే    2) బి మాత్రమే     3) ఎ, బి     4) పైవేవీకావు


21. జర్మన్‌ సిల్వర్‌లో లేని లోహం ఏది?

1) రాగి    2) జింక్‌      3) నికెల్‌    4) వెండి


22. కింది వాటిలో బాక్సైట్‌ ఏ లోహపు ముఖ్యమైన ధాతువు?

1) ఇనుము   2) వెండి     3) పాదరసం   4) అల్యూమినియం


సమాధానాలు

1-2  2-4   3-4  4-4  5-3  6-4   7-2   8-3   9-2   10-1  11-3  12-2   13-3   14-1  15-2   16-3   17-1   18-1   19-4   20-3   21-4  22-4.

Posted Date : 17-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌