• facebook
  • whatsapp
  • telegram

2022లో ఇస్రో (ISRO) ప్రయోగాలు

భారత అంతరిక్షరంగ పరిశోధన సంస్థ (ఇస్రో) 2022లో అద్భుత విజయాలను సాధించింది. ఫిబ్రవరి, నవంబరు నెలల మధ్య చేపట్టిన అయిదు మిషన్లలో నాలుగింట్లో సఫలీకృతమైంది. దీంతోపాటు హైదరాబాద్‌కు చెందిన స్పేస్‌ స్టార్టప్‌ ‘స్కైరూట్‌ ఏరోస్పేస్‌’కి చెందిన తొలి ప్రైవేట్‌ రాకెట్‌ ‘విక్రమ్‌ -S' ని విజయవంతంగా ప్రయోగించింది.


పీఎస్‌ఎల్‌వీ - C52/ EOS -4 మిషన్‌ 

* 2022, ఫిబ్రవరి 14న ఇస్రోకి చెందిన పీఎస్‌ఎల్‌వీ-‘52 రాకెట్‌ EOS-4 ఉపగ్రహంతోపాటు మరొక రెండు చిన్న ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దిష్ట కక్ష్యలో ప్రవేశపెట్టింది. 

* ప్రాథమిక పేలోడ్‌ EOS-04 (ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌) ఒక రాడార్‌ ఇమేజింగ్‌ శాటిలైట్‌ (RISAT).

* 529 కి.మీ ఎత్తులోని పోలార్‌ (సన్‌సింక్రోనస్‌) ఆర్బిట్‌లో తిరిగే 1,710 కిలోల ద్రవ్యరాశితో ఉండే EOS-4 (అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ) అధిక రిజల్యూషన్‌ చిత్రాలను రికార్డు చేస్తుంది. వ్యవసాయం, అటవీ, మృత్తికలు, వరదలు తదితరాలను విశ్లేషించడానికి ఈ చిత్రాలు ఉపయోగపడతాయి. 

* మరో రెండు ఉపగ్రహాల్లో మొదటిది INSPIREsat-1. ఇది ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ) విద్యార్థులు, విదేశీ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో రూపొందింది. దీని ద్రవ్యరాశి 8.1 కేజీలు, జీవితకాలం 1 సంవత్సరం. సూర్యుడి కరోనా వేడి ప్రక్రియ, ఐనోస్పియర్‌ గతుల (డైనమిక్స్‌)ను అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. 

* రెండో చిన్న ఉపగ్రహం INS-2D. ఇది భారత్‌-భూటాన్‌ సంయుక్తంగా నిర్మించే INS- 2B కి ఒక టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్‌.

ఎస్‌ఎస్‌ఎల్‌వీ-D1/ EOS - 2 మిషన్‌  

ఎస్‌ఎస్‌ఎల్‌వీ-D1 (స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌)ని 2022, ఆగస్టు 7న ఎస్‌డీఎస్‌సీ - షార్‌ నుంచి ప్రయోగించారు. 

దిగువ భూకక్ష్య ( LEO ) లోకి 500 కేజీల ద్రవ్యరాశి వరకు ఉండే చిన్న ఉపగ్రహాలను ప్రవేశ పెట్టేందుకు ఇస్రో నిర్దేశించిన తొలి, కొత్త తరహా రాకెట్‌ ఇది. 

కానీ ఇది పేలోడ్లను కక్ష్యలో ప్రవేశపెట్టడంలో విఫలమైంది. 

ఎస్‌ఎస్‌ఎల్‌వీ ఒక మూడంచెల ఘన ఇంధన రాకెట్‌. దీంతో తక్కువ తయారీ సమయంలో, ఎక్కువ ఉపగ్రహాలను, తక్కువ వ్యయంతో స్పేస్‌ ఆన్‌ డిమాండ్‌ ఆధారంగా ప్రయోగించొచ్చు. 

దీని పేలోడ్‌లోని ఉపగ్రహాలు రెండు. అవి:

1) EOS - 02 

2) ఆజాదీ శాట్‌

* 135 కేజీల భూపరిశీలక ఉపగ్రహం EOS-02 ని 350 కి.మీల ఎత్తులోని LEO లో ప్రవేశపెట్టాలని ప్రణాళిక వేశారు.

* 75 వసంతాల స్వాతంత్య్ర భారతాన్ని దృష్టిలో ఉంచుకుని ‘స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా’ అనే అంతరిక్ష సంస్థ దేశంలోని 75 ప్రభుత్వ బాలికల పాఠశాలల నుంచి 750 బాలికలతో కలిసి ఆజాదీశాట్‌ ఉపగ్రహాన్ని రూపొందించింది. 

* ఆజాదీశాట్‌ 8 కిలోల ద్రవ్యరాశితో ఉండే 8U క్యూబ్‌శాట్‌. ఇందులో ఒక్కొక్కటి 50 గ్రాముల ద్రవ్యరాశి ఉండే 75 పేలోడ్లు ఫెమిటో - ప్రయోగాల కోసం నిర్దేశించినవి.

ఏకకాలంలో 36 శాటిలైట్లు (వన్‌వెబ్‌ ఇండియా - 1 మిషన్‌)

ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా రష్యా ప్రయోగించాల్సిన ఉపగ్రహ ప్రయోగాలను వన్‌వెబ్‌ సంస్థ ఇస్రో ద్వారా చేపట్టింది.

* లండన్‌కి చెందిన 36 వన్‌వెబ్‌ ఉపగ్రహాలను మన దేశం LVM3-M2 రాకెట్‌ ద్వారా 2022, అక్టోబరు 23న శ్రీహరికోట నుంచి విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది.

* విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడానికి, భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని పెంచడానికి నిర్దేశించిన 'NSIL'కి ఇది తొలి GSLV ఆధారిత వాణిజ్య ప్రయోగం.

* ఒక్కొక్కటి సుమారు 150 కేజీల ద్రవ్యరాశి ఉండే 36 ఉపగ్రహాలను (మొత్తం ద్రవ్యరాశి 5,796 కేజీలు) 601 కి.మీ ఎత్తులోని LEO లో ప్రవేశపెట్టడానికి క్రయోజెనిక్‌ అంచె తీసుకున్న సమయం కేవలం 75 నిమిషాలు మాత్రమే. 

GSLV MK - III రాకెట్లనే LVM3 పేరుతో పిలుస్తున్నారు. 

ఇందులోని మూడంచెల్లో వరుసగా ఘన, ద్రవ, క్రయోజెనిక్‌ ఇంధనాలను ఉపయోగిస్తారు. 

వన్‌వెబ్‌ జనరేషన్‌ - 1 శాటిలైట్లు

* లండన్‌కి చెందిన వన్‌వెబ్‌ అనేది ‘అంతరిక్ష సేవలతో గ్లోబల్‌ కమ్యూనికేషన్‌ లేదా కనెక్టివిటీ’ని కల్పించడానికి ఉద్దేశించిన సంస్థ.

* ఇది అంతరిక్షంలో LEO లో 648 శాటిలైట్లను ప్రవేశపెడుతోంది. 

* ఇందులో భాగంగా LVM3 ప్రయోగించిన 36 శాటిలైట్ల మిషన్‌ వన్‌వెబ్‌కి 14వ ప్రయోగం. 

* 1200 కి.మీల ఎత్తులో, ఒక్కొక్క కక్ష్యలో 49 ఉపగ్రహాల చొప్పున మొత్తం 12 కక్ష్యల్లో వీటిని ప్రయోగించనున్నారు. 

* ఇస్రో వాణిజ్య విభాగం NSIL, వన్‌వెబ్‌తో 72 ఉపగ్రహాలను రెండు విడతల్లో ప్రయోగించడానికి సుమారు రూ.1000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. 

* ఇందులో భాగంగా రెండో విడత 36 ఉపగ్రహాలను మరికొద్ది రోజుల్లో ఇస్రో ప్రయోగించనుంది.

పీఎస్‌ఎల్‌వీ C- 54/EOS- 06 మిషన్‌

* ఇస్రో గెలుపుగుర్రం పీఎస్‌ఎల్‌వీ ద్వారా చేసిన 56వ ప్రయోగం ఇది.

* ఇందులో పీఎస్‌ఎల్‌వీ ‘  54 రాకెట్‌ ద్వారా  2022, నవంబరు 26న EOS - 06 ఉపగ్రహంతో పాటు మరో ఎనిమిది నానో శాటిలైట్లను విజయవంతంగా ప్రయోగించారు. 

* ఓషన్‌శాట్‌ ఉపగ్రహాల శ్రేణిలో మూడో తరానికి చెందిన ఉపగ్రహం 'EOS' - 06'.  

* సముద్రాల వాతావరణ అధ్యయనంతోపాటు చేపల నివాస జోన్లను గుర్తించడానికి EOS -06 ఉపయోగపడుతుంది.

పీఎస్‌ఎల్‌వీ - C53/DS-EO మిషన్‌

2022, జూన్‌ 30న శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (ఎస్‌డీఎస్‌సీ - షార్‌) నుంచి ఇస్రో విజయవంతంగా పూర్తిచేసిన మిషన్‌ పీఎస్‌ఎల్‌వీ-C53. ఈ రాకెట్‌తో సింగపూర్‌కి చెందిన మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపారు. వీటితో పాటు పీఎస్‌ఎల్‌వీకి చెందిన నాలుగో అంచె కొన్నిరోజుల పాటు ప్రయోగాల వేదికగా కక్ష్యలో కొనసాగింది. పీఎస్‌ఎల్‌వీ - C53 ప్రయోగం న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌)కి చెందిన రెండో పరిపూర్ణ వాణిజ్య ప్రయోగం. దీనితో ప్రయోగించిన ఉపగ్రహాలు వరుసగా DS-EO, Neusar,SCOOB-1.ఎలక్ట్రో - ఆప్టిక్, మల్టీస్పెక్ట్రల్‌ పేలోడ్‌ని కలిగిన DS-EO తీసే రంగుల చిత్రాలు విపత్తు సహాయానికి తోడ్పడతాయి.  Neusar సింగపూర్‌కి చెందిన తొలి చిన్న వాణిజ్య ఉపగ్రహం కాగా, SCOOB-1 సింగపూర్‌ విద్యార్థులు తయారు చేసిన తొలి స్టూడెంట్‌ శాటిలైట్‌. మిగిలిపోయిన నాలుగో అంచె PS4 ని పీఎస్‌ఎల్‌వీ ఆర్బిటాల్‌ ఎక్స్‌పెరిమెంటల్‌  మాడ్యూల్‌ (POEM) గా తొలిసారి వినియోగించారు. 

POEMలో ఉన్న ఆరు పేలోడ్లలో రెండు భారత్‌కి చెందిన అంతరిక్ష అంకుర సంస్థలు M/s దిగంతర,M/s ధృవ స్పేస్‌లు రూపొందించాయి. కక్ష్యలో తిరుగుతున్న POEM కి అవసరమయ్యే విద్యుత్‌ను సౌర పలకలు, లిథియం అయాన్‌ బ్యాటరీలు సమకూరుస్తాయి. ప్రయోగ వేదిక POEM గైడెన్స్,  నావిగేషన్, నియంత్రణ వ్యవస్థలను కలిగి ఉంది.

పీఎస్‌ఎల్‌వీ C - 54తో ప్రయోగించిన నానో ఉపగ్రహాలు

1) ఇండియా - భూటాన్‌ శాట్‌ (INS - 2B)

2) ఆనంద్‌ - 3 

3) ఆస్రోకాస్ట్‌ (నాలుగు ఉపగ్రహాలు)

4) థైబోల్ట్‌ (THYBOLT) (రెండు ఉపగ్రహలు)

* ఇండియా భూటాన్‌ సంయుక్తంగా రూపొందించిన శాటిలైట్‌ INS - 2B.

ఆనంద్‌ - 3 ఒక నానోశాటిలైట్‌. ఇదొక టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్‌. ఎలక్ట్రో ఆప్టికల్‌ పేలోడ్, ఇతర శాటిలైట్‌ విభాగాలను సూక్ష్మరూపంలో తయారు చేయడానికి ఇదొక ముందస్తు ప్రయోగం. దీన్ని పిక్సెల్‌ (Pixxel)ఇండియా సంస్థ రూపొందించింది.

ఆస్ట్రోకార్ట్‌ (Astrocart) నాలుగు ఉపగ్రహాలు ఉన్న 3U స్పేస్‌క్రాఫ్ట్‌. దీన్ని అమెరికాకి చెందిన ‘స్పేస్‌ఫ్లైట్‌’ అనే సంస్థ రూపొందించింది.

థైబోల్ట్‌ (THYBOLT) 0.5U స్పేస్‌ క్రాఫ్ట్‌. దీన్ని హైదరాబాద్‌కి చెందిన ధృవ స్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అభివృద్ధి చేసింది.

Posted Date : 22-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌